శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

2 - యోగీశ్వరులతో జనకుని సంవాదము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నారదునకు శ్రీకృష్ణుని ఉపాసించుటయందు ఉత్కంఠ మెండు. కావుననే, ఆయన శ్రీకృష్ణుని భుజములచే రక్షించబడే ద్వారకకు పలు మార్లు వస్తూ అచటనే నివసించెను.

రాజా! మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమును దేవ శ్రేష్ఠులగు బ్రహ్మాదులు కూడ ఉపాసించెదరు. ఇంద్రియములున్న సకల ప్రాణులు అంతటా అన్ని వైపులా మృత్యువుచే ఆవరించబడియున్నవి. అట్టి స్థితిలో ఆయన పాదమును ఎవ్వడు సేవించకుండును?

ఒకనాడు దేవర్షియగు నారదుడు వసుదేవుని ఇంటికి వచ్చెను. వసుదేవుడు. ఆయనను పూజించెను. ఆయన సుఖముగా కూర్చునియుండగా వసుదేవుడు నమస్కరించి ఆయనతో నిట్లనెను.

వసుదేవుడిట్లు పలి కెను -- తల్లిదండ్రుల రాక దీనులైన పుత్రాదులకు, పవిత్రకీర్తియగు భగవానుని చేరే దారిని చూపే మహాత్ముల రాక దీనులైన సంసారులకు, కల్యాణమును కలిగించును. అదే విధముగా, తమరి సంచారము సకలప్రాణులకు కల్యాణమును చేయ సమర్థమై యున్నది.

పర్జన్యుడు మొదలగు దేవతల ప్రవృత్తి ప్రాణులకు ఒకచో సుఖమును, మరియొకచో దుఃఖమును కూడ కలిగించును. కాని, శ్రీకృష్ణ భగవానునియందు లగ్న మైన మనస్సుల గల నీవంటి సత్పురుషుల ప్రవృత్తి యైతే ప్రాణులకు సుఖమును మాత్రమే కలిగించును.

మానవులు దేవతలనే విధముగా కొలిస్తే, దేవతలు వారికి దానికి తగ్గ ఫలమును మాత్రమే ఇచ్చెదరు. వ్యక్తి పొడవును బట్టి వాని నీడ కూడ ఉండును. ఎందుకంటే, దేవతలు జీవుని కర్మకు అధీనులై ప్రవర్తించెదరు. కాని, సత్పురుషులు దీనుల పై ప్రేమను వర్షించెదరు.

ఓ మహర్షీ! నీ దర్శనము చేతనే మేము కృతార్ధులమయినప్పటికీ, భగవంతునకు ప్రీతిని కలిగించే (తమరు ఆచరించిన) ధర్మములను గురించి నేను తమరిని ప్రశ్నించుచున్నాను. ఎందుకంటే, అట్టి ధర్మములను గురించి శ్రద్ధగా విని మానవుడు సకలవిధములైన భయములనుండి విముక్తుడగును.

నేనైతే పూర్వజన్మలో మోక్షమునిచ్చే అనంత భగవానుని భూలోకములో సంతానమును గోరి పూజించితిని. శ్రీహరి మాయచే మోహితుడనై నేను మోక్షము కొరకు పూజించలేదు.

గొప్ప నియమనిష్ఠలు గల ఓ మహర్షీ! సంసారములో పలు రకముల దుఃఖములు, అన్ని వైపులనుండి భయములు గలవు. మేమా సంసారమునుండి తమరి నిమిత్తముగా తేలికగా విముక్తులము కావలెను. ఆ విధముగా తమరు మాకు స్పష్టముగా ఉపదేశించుడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ధీమంతుడగు వసుదేవుడిట్లు ప్రశ్న వేయగా, శ్రీహరి గుణములు గుర్తుకు వచ్చి దేవర్షి నారదుడు ప్రీతి జెందెను. ఆయన వసుదేవునితో నిట్లనెను.

నారద మహర్షి ఇట్లు పలికెను --- యాదవశ్రేష్ఠుడవగు ఓ వసుదేవా! ఈ నీ నిశ్చయము బాగున్నది. ఏదంటే, నీవు జగత్తును పావనము చేస్తూ శ్రీహరికి ప్రీతిని కలిగించే ధర్మములను గురించి ప్రశ్నించుచున్నావు.

ఓ వసుదేవా! భాగవత ధర్మమును విని, ఆదరముతో స్వీకరించి మనననిదిధ్యాసనములను చేసినచో, లేదా అనుమోదించినచో, లోకమునకు ద్రోహము చేసినవారు కూడ నిశ్చయముగా పవిత్రులగుదురు.

నీవు నాకీ నాడు స్వయంప్రకాశస్వరూపుడగు నారాయణ భగవానుని స్మరింప జేసితివి. నారాయణుని గురించి విని కీర్తించినచో, మానవుడు పవిత్రుడై సర్వోత్కృష్టమగు మోక్షమనే కల్యాణమును కూడ బడయును.

ఈ భాగవతధర్మము విషయములో ఈ ప్రాచీన వృత్తాంతమును కూడ మహాత్ములు ఉటంకించెదరు. ఒకప్పుడు మహాత్ముడగు జనకునకు, ఋషభదేవుని పుత్రులకు సంవాదము జరిగెను.

స్వాయంభువ (బ్రహ్మపుత్రుడు) మనువునకు ప్రియవ్రతుడని ప్రసిద్ది గాంచిన పుత్రుడు ఉండెను. ఆయన పుత్రుడు ఆగ్నీధ్రుడు. ఆగ్నీధ్రుని. పుత్రుడు నాభి. నాభి పుత్రుడు ఋషభ దేవుడు.

మోక్షధర్మములను చెప్పే కోరికతో వాసుదేవ భగవానుడే ఆ ఋషభ దేవునిగా అవతరించినాడని పెద్దలు చెప్పెదరు. ఆయనకు వేదమునందు పారదర్శులైన వందమంది పుత్రులు కలిగిరి.

వారిలో పెద్దవాడగు భరతునకు జీవితలక్ష్యము నారాయణుని పొందుటయే. ఆయన పేరుతోనే అద్భుతమగు ఈ దేశము భారతదేశమని ప్రసిద్ధి గాంచినది.

ఆయన రాజ్యభోగములననుభవించి తరువాత ఈ రాజ్యమును విడిచి పెట్టి నిషమించెను. ఆయన తపస్సు చేస్తూ హరిని ఉపాసించి, మూడు జన్మలలో ఆ శ్రీహరియొక్క ధామము (మోక్షము) ను పొందెను.

ఋషభ దేవుని పుత్రులలో తొమ్మండుగురు ఈ భారతభూమికి నలువైపులా ఉన్న తొమ్మిది భూఖండములకు ప్రభువులు కాగా, ఎనభై ఒక్క మంది కర్మమార్గమును ప్రవర్తిల్లజేసే బ్రాహ్మణులైరి.

వారిలో తొమ్మండుగు రైతే పరమతత్త్వమును బోధించే మునులైరి. ఆ మహాత్ములు దిగంబర సన్న్యాసులు. వారు ఆత్మవిద్యయందు నిపుణులు.

కవి (జ్ఞాని), హరి (అజ్ఞానమును పోగొట్టువాడు), అంతరిక్షుడు (అంతఃకరణసాక్షి), ప్రబుద్దుడు (గొప్ప జ్ఞానము గలవాడు), పిప్పలాయనుడు (విష్ణువు ఆశ్రయముగా గలవాడు), ఆవిర్షా త్రుడు (జ్ఞానముచే కర్మబంధమును దహించినవాడు), ద్రుమిలుడు (వనమునందున్నవాడు), చమసుడు (వైదికోత్తముడు), కరభాజనుడు (కరతలామలకమైన జ్ఞానము గలవాడు) అనునవి వారి పేర్లు.

అట్టి ఈ జ్ఞానులు స్థూలసూక్ష్మరూపమైన జగత్తును భగవంతుని రూప ముగా ఆత్మకంటే అభిన్నముగా దర్శిస్తూ భూలోకములో సంచరించిరి.

జీవన్ముక్తులైన ఆ ఋషభపుత్రుల గమనమునకు ఆటంకము లేదు. వారు భూలోకములో తమకు నచ్చిన స్థానమునకు వెళ్లాడివారు. దేవతలు, సిద్దులు, సాధ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు, మహర్షులు (తపోలోకము), చారణులు, భూతనాయకులు (భైరవలోకము), విద్యాధరులు, గరుడాది పక్షుల లోకములను, గోలోకమును కూడ యథేచ్ఛగా సంచరించెడివారు.

భారతవర్షములో మహాత్ముడు నిమి ఋషులచే సత్రయాగము చేయిం చుచుండెను. వారు ఒకనాడు అనుకోకుండా ఈశ్వరేచ్ఛచే అచటకు వెళ్లిరి.

ఓ పరీక్షిన్మహారాజా! సూర్యుడు వలె ప్రకాశించే ఆ గొప్ప భగవద్భక్తులను చూచి యాగము చేయుచున్న నిమి మహారాజు, మూర్తి దాల్చిన అగ్నులు, మహర్షులు, అందరు కూడ నిలబడి నమస్కరించిరి.

వారు నారాయణుడే పరమలక్ష్యముగా గలవారని తెలిసి విదేహరాజగు నిమి సంతోషించెను. ఆయన వారిని ఆసనములపై కూర్చుండబెట్టి యథోచితముగా చక్కగా పూజించెను.

ఆ తొమ్మండుగురు తమ కాంతితో ప్రకాశిస్తూ బ్రహ్మపుత్రులగు సనకాదులను పోలియుండిరి. వినయముతో వంగియున్న నిమి మహారాజు చాల సంతోషించి వారిని ఇట్లు ప్రశ్నించెను.

విదేహ మహారాజు ఇట్లు పలి కెను --- మీరు సాక్షాత్తు మధు కైటభసంహారియగు శ్రీహరియొక్క పార్టదులు (ఆంతరంగిక అనుచరులు) అని తలపోయుచున్నాను. ఎందుకంటే, శ్రీహరి భక్తులు లోకములను పవిత్రము చేయుటకై సంచరించుచుందురు.

జన్మలనెత్తే జీవులకు మనుష్యజన్మ దుర్లభము. అది కూడ ఏ క్షణములోనైనా మృత్యువు వాత పడవచ్చును. అట్టి మానవజన్మలో కూడ శ్రీహరికి ప్రియులై శ్రీహరియే ప్రియుడుగా గల భక్తుల దర్శనము మరింత దుర్లభమని నేను తలచెదను.

ఓ పుణ్యాత్ములారా! ఇందువలన (మానవజీవితము క్షణభంగురమగుట వలన) మిమ్ములను కాలపరిచ్చిన్నము కాని క్షేమము (మోక్షము) ను గురించి ప్రశ్నించుచున్నాను. మానవులకీ సంసారములో సత్పురుషులతోడి సాంగత్యము అర్ధక్షణమైననూ పెన్నిధియే గదా!

మాకు వినే యోగ్యత ఉన్నచో, భగవద్బక్తికి చెందిన ధర్మములను సెలవిండు. ఆ ధర్మములనాచరించినచో జన్మరహితుడైన భగవానుడు శరణాగతుడైన భక్తుని యెడల ప్రసన్నుడై తనను కూడ ఇచ్చివేయును.

శ్రీనారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ వసుదేవా! నిమీ ఈ విధముగా ప్రశ్నించగా ఆ గొప్ప మహాత్ములాయనను ప్రేమతో అభినందించిరి. సభాసదులతో, ఋత్విక్కులతో కూడిన రాజునుద్దేశించి వారిట్లు పలికిరి.

కవి ఇట్లు పలికెను --- ఈ లోకములో మానవుడు అనిత్యములగు దేహాదులయందు ఆత్మాభిమానముచే ఎల్లవేళలా భయపడిన అంతఃకరణము కలిగియుండును. అట్టివాడు శ్రీకృష్ణుని పద్మములవంటి పాదములను ఉపాసించినచో, సకలభయములు తొలగిపోవునని నేను తలచెదను. అట్టి ఉపాసన సకలవిధములైన భయములను పోగొట్టును.

అజ్ఞానులగు జనులు తేలికగా స్వరూపమును పొందుటకై భగవానుడు ఏ - ఉపాయములను (భగవద్గీతలో) చెప్పెనో, భాగవతధర్మములనగా నిశ్చితముగా అవియేనని తెలియుము.

ఓ నిమి మహారాజా! ఈ భాగవతధర్మములననుష్ఠించువానికి విఘ్నములు పీడను కలిగించవు. ఈ ధర్మముల విషయములో రెండు కళ్లను మూసుకొని (అజ్ఞానము) పరు గెత్తినా (కంగారుగా అనుష్ఠించుట), భక్తుడు ఫలమునుండి జారిపోడు, పతితుడు కాడు.

మానవుడు తనకు జన్మజన్మాంతరములనుండి సంప్రాప్తమైన సాత్త్వికాది స్వభావమును బట్టి దేహముతో (వెళ్లుట ఇత్యాది) గాని, వాక్కుతో (భాషణము) గాని, మనస్సుతో (సంకల్పము) గాని, కన్ను మొదలైన ఇంద్రియములతో (దర్శనాదికము) గాని, బుద్ధితో (నిశ్చయము) గాని, చిత్తముతో (ధ్యానము) గాని ఏయే పనులను చేయునో, వాటినన్నింటినీ పరమేశ్వరుడగు నారాయణునకు సమర్పించవలెను.

ఈశ్వరునినుండి విముఖుడైన వానికి ఆ ఈశ్వరుని మాయచే స్వరూపజ్ఞానము లేకపోవును. దానిచే దేహాభిమానము, శత్రుమిత్రాదిభేదము సత్యమనే ఆగ్రహము, దాని వలన భయము కలుగును. కాబట్టి వివేకి గురువునందు దేవతాబుద్ధి, ఆత్మబుద్ధి గలవాడై అనన్యభక్తితో ఆ ఈశ్వరుని మోక్షపర్యంతము కొలువవలెను.

వ్యక్తి కల గనినప్పుడు, కోరబడే వస్తువులను ధ్యానించునప్పుడు, అవి అన్నీ యథార్థముగా ఉన్నవా యన్నట్లు భాసించును. అదే విధముగా, ద్వైతము (భేదము) మనస్సు ద్వారానే భాసించుచున్నది. కాబట్టి, వివేకి కర్మలను సంకల్పిస్తూ భేదభావనను కలిగించే మనస్సును నిరోధించ వలెను. అట్లు చేయుట వలన అభయపదము (పరమాత్మ) సిద్ధించును.

చక్రపాణియగు శ్రీకృష్ణుడు లోకములో అవతరించి పరమమంగళకరములగు లీలలను చేసెను. లోకములో గానము చేయబడే ఆ అవతారములను, లీలలను సాధకుడు శ్రవణము చేయవలెను. ఇంతేగాక, సాధకుడు ఆ భగవానుని స్మరణకు తెచ్చే నామములను సిగ్గు పడకుండా గానము చేస్తూ అసంగుడై లోకములో సంచరించవలెను.

ఇట్టి (భగవన్నామమును కీర్తించే) నిష్ఠ గల భక్తుడు తనకు ప్రియుడు, ఆత్మయగు భగవానుని నామమును కీర్తించుచుండును. దానిచే ఆయనకు భగవతేమ పుట్టి మనస్సు కరిగిపోవును. ఆతడు లోకమర్యాదలకు అతీతముగా పిచ్చివాడు వలె బిగ్గరగా నవ్వును, ఏడ్చును, అరుచును, పాడును, నర్తించును.

భక్తుడు తనకు, సర్వమునకు ఈశ్వరునితో అభేదమును దర్శించవలెను. పృథివ్యస్తే జోవాయ్వాకాశములనే పంచభూతములు, నక్షత్రములు, ప్రాణులు, దిక్కులు, చెట్టుచేమలు, నదులు, సముద్రములు, సకల వస్తువులతో నిండిన జగత్తు శ్రీహరియొక్క దేహమని దర్శించి ప్రణమిల్లవలెను.

ఆహారమును తినుచున్నవానికి ప్రతి ముద్దలో మనస్సునకు సంతోషము, శరీరమునకు పుష్టి, ఆకలి నివారణ కలుగుచుండును. అదే విధముగా, ఈశ్వరుని శరణాగతి చేసిన భక్తునకు ప్రతి క్షణము ఈశ్వరునియందు ప్రేమ, పరమేశ్వరుడు స్వరూపమునందు స్పురించుట, సంసారము యెడల విరక్తి అనే మూడు కలుగుచుండును.

ఓ నిమి మహారాజా! ఈ విధముగా సకలమనోవృత్తులతో శ్రీహరియొక్క పాదమును సేవించే భగవద్భక్తునకు భక్తి, విరక్తి, స్వరూపమునందు భగవానుని స్ఫురణము నిశ్చయముగా కలుగును. దాని వలన ఆతనికి సాక్షాత్తుగా పరమశాంతి (జీవన్ముక్తి) సిద్ధించును.

నిమి మహారాజు ఇట్లు పలికెను --- తరువాత భగవద్బక్తుని లక్షణమును చెప్పుడు. ఆతడు ఏ ధర్మములను కలిగియుండును? ఎట్టి స్వభావమును కలిగియుండును? మానవుల మధ్యలో ఆతడే విధముగా సంచరించును? ఆతడేమి పలుకును? ఏ చిహ్నములచే మానవుడు భగవానునకు ప్రీతిపాత్రుడగును?

హరి ఇట్లు చెప్పెను --- ఆత్మరూపుడగు భగవానుడు సకలప్రాణులయందు అంతర్యామియై వ్యాపించి ఉన్నాడనియు, ఆత్మరూపుడగు భగవానుడే అధిష్టానముగా సకలప్రాణులు ఉన్నవనియు ఎవడు దర్శించునో, అట్టి యీతడు భగవద్భక్తులలో ఉత్తముడు.

ఎవడైతే ఈశ్వరునిపై ప్రేమను, ఈశ్వరునకు వశులైయుండే భక్తుల యందు మైత్రిని, అజ్ఞానులగు జనులయందు దయను, ద్వేషించువారిపై ఉపేక్షను చేయునో, అట్టివాడు (భేదదృష్టి వలన) మధ్యమభక్తుడు.

ఎవడైతే శ్రీహరిని మూర్తియందు మాత్రమే శ్రద్దతో పూజించి, ఆ భగవానుని భక్తులను ఇతరులను సత్కరించడో, అట్టివాడు మామూలు భక్తుడని మహాత్ములు చెప్పెదరు.

ఎవడైతే చెవి మొదలగు ఇంద్రియములతో శబ్దము మొదలగు విషయములను తెలుసుకుంటూనే ఉన్నా, దేనినీ ద్వేషించడో, దేని విషయములోనైననూ హర్షమును పొందడో, కేవలము ఈ జగత్తు శ్రీహరి మాయ యని దర్శించునో, అట్టివాడు నిశ్చయముగా భగవద్భక్తులలో ఉత్తముడు.

సంసారములో దేహమునకు పుట్టుక, మరణము, ప్రాణమునకు ఆకలి దప్పికలు, మనస్సునకు భయము, బుద్ధికీ, తృష్ణ, ఇంద్రియములకు కష్టములు అనే ధర్మములు కలుగుచుండును. ఎవడైతే శ్రీహరినే స్మరిస్తూ వీటి మోహమును పొందడో, అట్టివాడు భగవద్భక్తులలో ఉత్తముడు.

ఎవని మనస్సులో కామనలు, తతయుక్తమైన కర్మప్రవృత్తి, వాటి వాసనలు పుట్టవో, ఎవడు కేవలము శ్రీకృష్ణ భగవానునియందు మాత్రమే నిష్ఠ గలవాడో, అట్టివాడు భగవద్భక్తులలో ఉత్తముడు.

ఎవనికైతే పుట్టుక, కర్మలు, వర్ణము, ఆశ్రమము, జాతి అనువాటిచే ఈ దేహమునందు అహంకారము తగుల్కొనియుండదో, అట్టివాడు నిశ్చయముగా శ్రీహరికి ప్రీతిపాత్రుడు.

ఎవనికైతే సంపదలయందు గాని, దేహమునందైననూ నాది, పరాయి అనే భేదభావము లేదో, ఎవడు రాగద్వేషములు లేకుండా సకలప్రాణులయందు సమదృష్టి కలిగియుండునో, అట్టివాడు నిశ్చయముగా భగవద్భక్తులలో ఉత్తముడు.

ముల్లోకముల సంపదల కొరకైననూ, అపరాజితుడగు శ్రీహరి భగవానుని పద్మములవంటి పాదములనుండి అర్ధక్షణమైనా అరనిమిషమైనా ఎవని స్మరణము తొలగిపోదో, అట్టివాడు విష్ణుభక్తులలో అగ్రేసరుడు. దేవతలు కూడ మనస్సును ఏకాగ్రము చేసి ఆ శ్రీహరి పాదమును అన్వేషించుచుందురు.

పెద్ద అడుగులు (వామనావతారము) వేసే శ్రీహరి భగవానుని పాదముల వ్రేళ్లయొక్క మణులవంటి గోళ్లయొక్క వెన్నెలవంటి కాంతి ఉపాసకుల హృదయములోని శోకాదుల తాపమును పోనాడును. ఆ తాపము తిరిగి మరల ఉదయించునా? (ఉదయించదు). అదెల్లాగంటే, చంద్రుడు ఉదయించేక ఎండ వేడి ఉండునా? (ఉండదు).

భక్తుడు ఒకచో దుఃఖాదులచే పరవశుడై శ్రీహరి నామమును స్మరించినా, వాని పాపముల గుట్టలు నశించును. భక్తులు పద్మములవంటి శ్రీహరి పాదములను భక్తి అనే త్రాడుతో కట్టివేసి హృదయములో నిలి పెదరు. అట్టి భక్తుని హృదయమును శ్రీహరి స్వయముగానే విడిచి పెట్టడు. అట్టి వాడు భక్తులలో ముఖ్యుడని మహాత్ములు చెప్పెదరు.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో యోగేశ్వరులతో జనకుని సంవాదమును వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).