శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

26 - ఐల గీతము

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- మానవుని హృదయములో ఆత్మ రూపుడైన పరమాత్మను నేనే. నన్ను తెలియుటకు యోగ్యమైనది మానవ దేహము. దానిని పొంది వ్యక్తి నన్ను నిశ్చలముగా ఆరాధించి పొందును.

గుణకార్యములగు శబ్దాదులు కనబడుచున్ననూ అవి కేవలము మాయ మాత్రమే. మాయాశక్తియొక్క కార్యమగు దృశ్యప్రపంచము మిథ్య. వ్యక్తి ఆత్మజ్ఞాననిష్ఠచే జీవుని ఉపాధినుండి విముక్తుడగును. అట్టి జ్ఞాని దృశ్యప్రపంచమునందే ఉన్ననూ, దానియందు ఆసక్తిని పొందడు. ఎందుకంటే, దృశ్యప్రపంచము యథార్థము కాదు.

దుష్టులు కేవలము ఉదరమును సంతృప్తి పరుస్తూ భోగపరాయణులై ఉందురు. సాధకుడు ఎక్కడైనా ఎప్పుడైనా అట్టివారితో సంగమును చేయరాదు. వారి సంగమును చేయువాడు, గ్రుడ్డివాని వెనుక నడిచే గ్రుడ్డివాడు వలె, వివేకమునపహరించే అజ్ఞానాంధకారములో పడిపోవును.

పురూరవ చక్రవర్తి గొప్ప కీర్తి గలవాడు. ఆయన ఊర్వశియొక్క విరహముచే వ్యామోహితుడై, పిదప వైరాగ్యముచే శోకమునుండి విముక్తుడాయెను. అపుడాయన విరక్తుడై ఈ గాథను గానము చేసెను.

తనను విడిచి పెట్టి ఊర్వశి వెళ్లిపోవుచుండగా వ్యాకులుడైన ఆ పురూరవ చక్రవర్తి దిగంబరముగా, భయంకరివగు ఓ భార్యా! నిలుము అని ఏడుస్తూ, పిచ్చివాడు వలె ఆమె వెంట వెళ్లాను.

తుచ్చములైన భోగములను నిరంతరముగా సేవిస్తున్నా ఆ చక్రవర్తికి తృప్తి కలుగలేదు. ఆయన మనస్సు ఊర్వశిచే ఆకర్షించబడెను. ఆయనకు సంవత్సరముల కాలము రాత్రులు వచ్చుట గాని, పోవుట గాని తెలియదు.

పురూరవ చక్రవర్తి పలికెను -- ఊర్వశీదేవి సో కంఠమును కౌగిలించగా కామనలచే నా మనస్సు కలుషితమై పోయెను. నా వ్యామోహముయొక్క విస్తృతి వర్ణనాతీతము. అది యెంతటిదంటే, ఆయుష్టుయొక్క అంశలైన ఈ సంవత్సరములు నాకు తెలియకుండా వెళ్లిపోయెను.

అయ్యో! నేనీ ఊర్వశి వ్యామోహములో పడిపోతిని. నేను నిద్రిస్తూండగానే సూర్యుని ఉదయాస్తమయములు కూడా తెలియకుండా దీనముపై దినము చొప్పున అనేకదశాబ్దములు గడిచిపోయినవి.

అయ్యో! నాకెంతటి ఆత్మవిస్మృతి కలిగినదియో! ఆ కారణముగా, చక్రవర్తిని, మహారాజులలో అగ్రగణ్యుడను అగు నేను యువతులు ఆడుకొనే బొమ్మ (కోతి) ను అయితిని.

నేను రాజ్యాదులతో కూడిన చక్రవర్తిని. నన్ను గడ్డిపోచను వలె విడిచి పెట్టి ఆ యువతి వెళ్లిపోవుచుండెను. నేను దిగంబరుడనై పిచ్చివాడు వలె ఏడుస్తూ ఆమె వెంట బడితిని. .

నేను కాలిచే తన్నబడిన గాడిద వలె, వెళ్లిపోవుచున్న యువతి వెంట పడితిని. అట్టి నాయందు ప్రభావము గాని, తేజస్సు గాని, చక్రవర్తిత్వమే గాని ఏల ఉండును?

ఎవని మనస్పైతే యువతులచే అపహరించబడినదో, పొనికి ఉపాసనచే గాని, తపస్సుచే గాని, సన్న్యాసముచే గాని, అధ్యయనముచే గాని, ఏకాంతవాసముచే గాని, మౌనముచే గాని ఏమి ప్రయోజనము?

నేను పురుషార్థము (ఆత్మతత్త్వము) తెలియని మూర్ఖుడను. కాని, పండితుడననే అభిమానము గల నా గురించి నింద యగుగాక! చక్రవర్తినైన అట్టి నన్ను స్త్రీలు ఎద్దును వలె, గాడిదను వలే వశము చేసుకున్నారు.

నేను అనేకదశాబ్దముల కాలము నిరంతరముగా ఊర్వశియొక్క మత్తెక్కించే అధరామృతమును పానము చేసితిని. అయినా, నా మదిలోని కామనకు తృప్తి కలుగలేదు. నెయ్యి వేస్తూంటే అగ్ని చల్లారదు గదా!

ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాని శ్రీహరి భగవానుడు ఆత్మారాములకు ప్రభుడు. ఊర్వశిచే అపహరించబడిన చిత్తమును విడి పించుటకు ఆయన తప్ప మరియొక సమర్థుడు ఎవడు గలడు?(లేడు).

దుర్బుద్దినగు నేను మనస్సును జయించకపోతిని. నాకు ఊర్వశీదేవి యథార్థవచనములతో బోధించినది. అయినా, నా మనస్సులో తిష్ట వేసిన మహావ్యామోహము తొలగిపోవుట లేదు.

ఈ  త్రాడుయొక్క స్వరూపము తెలియక పామని భ్రమించుపొనికి త్రాడు ఏమి అపకారమును చేసినది? అదే విధముగా, నేను ఇంద్రియజయము లేనివాడను. నాకు ఊర్వశి ఏమి అపకారము చేసినది?(ఏమీ చేయలేదు).

అధికమగు దుర్గంధముతో, రోగాది దోషములతో నిండిన ఈ దేహము మిక్కిలి మలినము, అపవిత్రము. ఈ దేహమెక్కడ? పుష్పములవంటి సౌకుమార్యము, సుగంధము మొదలైన గుణములెక్కడ? ఇది నిశ్చయముగా అజ్ఞానముచే చేయబడే అధ్యారోపమే.

ఈ దేహము కన్న తల్లిదండ్రులదా? కట్టుకున్న భార్యదా? ఉద్యోగమిచ్చి పాలించే ప్రభువుదా? మరణించిన తరువాత తగులబెట్టే అగ్నిదా? తగులబెట్టకుండా వదిలి వేసినచో భక్షించే కుక్కలకు, గ్రద్దలకు చెందినదా? సుఖదుఃఖములననుభవించే తనదేనో? ఉపకారము చేసిన బంధువులదా? దేహము విషయములో నిశ్చయము చేయలేము.

అపవిత్రమైన ఆ దేహము తుచ్చమైన అంతమును పొందును. ఆహా! యువతియొక్క ముఖము చాల మంగళకరము. ముక్కు, చిరునగవు చాల అందమైనవి అంటూ వ్యక్తి దానియందు అధికమగు ఆసక్తిని పొందును.

చర్మము, మాంసము, రక్తము, నాడులు, క్రొవ్వు, మూలుగు, ఎముకలు, మలము, మూత్రము, చీముల సముదాయమే దేహము. అట్టి దేహమునందు రమించే మానవులకు, క్రిములకు తేడా యెంతటిది?

ఇంద్రియముల ద్వారా భోగ్యవిషయములతో సంయోగము కలిగి నప్పుడు మాత్రమే మనస్సు అలజడి జెందును. అట్టి సంయోగము లేనిచో మనస్సు శాంతముగనే యుండును. కావున, పురుషార్థము దెలిసిన వివేకి యువతులతో, యువతులకు వశమై ఉండేవారితో సంగమును చేయరాదు.

ఎన్నడూ కనని వినని పదార్థము వలన మనస్సునకు అలజడి కలుగదు. కావున, ఇంద్రియములను విషయములతో ఉపసంహరించిన మనస్సు నిశ్చలమై స్వరూపమునందు విలీనమగును.

కావున, ఇంద్రియముల ద్వారా యువతులతో మరియు స్త్రీలంపటులతో సంగము చేయరాదు. ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు వెరసి ఈ ఆరు విద్వాంసులకు కూడ నమ్మదగ్గవి కావు. మావంటి వారల విషయములో చెప్పునదేమున్నది?

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఆ చక్రవర్తి ఈ విధముగా తన భావావేశమును ప్రకటించి, తరువాత ఊర్వశియొక్క లోకమును విడిచి పెట్టెను. ఆయన తనయందు నన్ను ఆత్మరూపునిగా సాక్షాత్కరించుకొనెను. ఆ జ్ఞానముచే వ్యామోహమంతయు పటాపంచలు కాగా, ఆయన సంసారబంధమునుండి విముక్తుడాయెను.

కాబట్టి వివేకవంతుడగు సాధకుడు దుష్టులతోడి సంగమును విడిచి పెట్టి సజ్జనసంగమును చేయవలెను. సత్పురుషులు వీని మనస్సునందలి విషయాసక్తిని హితవాక్యములతో తెగగొట్టెదరు.

సత్పురుషులకు దేనియందైననూ అపేక్ష ఉండదు. వారు చిత్తమును సాయందు నిలిపీ శాంతముగా నుండెదరు. పోరు సర్వమునందు సముడైన ఈశ్వరుని దర్శించుటచే అహంకారమమకారములు లేనిపోరు. వారు సుఖదుఃఖాదిద్వంద్వములకు అతీతులు గనుక పరీగ్రహము (భోగసామగ్రిని ప్రోగు చేయుట) చేయరు.

మహాభాగ్యవంతుడవగు ఓ ఉద్దవా! గొప్ప భాగ్యము (భక్తి) గల ఆ సత్పురుషులు ఎల్లవేళలా సో గాథలను కీర్తించెదరు. ఆ నో గాథలను సేవించే మానవుల సకలపాపములు నిశ్చితముగా నశించును.

ఎవరైతే సాదరముగా ఆ గాథలను వినెదరో, గానము చేయుదురో, వాటి గానమును ప్రోత్సహించెదరో వారు కూడ నిశ్చయముగా నా పై భక్తిని పొంది, నన్ను శ్రద్ధతో ఆరాధించుటయందు నిష్ఠ గలవారు అగుదురు.

 

అనంతగుణసంపన్నుడనగు నా స్వరూపము ఆనందానుభవమే. పరబ్రహ్మనగు నాయందు భక్తిని పొందిన సజ్జనునకు మరియొకటి ఏమి మిగిలియుండును?(కర్తవ్యమేదీ మిగిలి ఉండదు).

 అగ్నిదేవుని సేవించువానికి చలి, భయము, చీకటి నశించును. అదే విధముగా, సత్పురుషులను బాగుగా సేవించువానికి జాడ్యము, సంసారభయము, అజ్ఞానాంధకారము నశించును.

భయంకరమగు సంసారసముద్రములో మునిగి పైకి తేలుతూ (ఉత్కృష్ట నికృష్ణజన్మలు పొందుతూ) ఉండేవారికి -- సముద్రములో మునిగిపోవుచున్నవారికి గట్టి నావ వలె - బ్రహ్మవేత్త లై శాంతులైన సత్పురుషులు సర్వోత్తమమైన ఆశ్రయము.

ప్రాణులకు అన్నమే జీవనము. ఆపదలోనున్నవారికి నేనే రక్షకుడను. మానవులకు మరణించిన తరువాత పుణ్యమే సంపద. సంసార సముద్రములో పడిపోయెదమని భయపడువారలకు సత్పురుషులే రక్షణ.

సూర్యుడు ఉదయించి బయట చూపును ఇస్తే, సత్పురుషులు ఆత్మ విషయకమైన పూర్ణ మైన చూపు (జ్ఞానము) ను ఇచ్చేదరు. సత్పురుషులే దేవతలు మరియు బంధువులు. ఆత్మ మరియు నేను కూడ సత్పురుషులే.

ఉమాదేవి శాపముచే సుద్యుమ్నుడు స్త్రీభావమును పొంది ఇల ఆయెను. ఆయన కొడుకే పురూరవసుడు (పురూరవుడు). ఆయన ఈ విధముగా అట్టి సత్సంగము వలన ఊర్వశియొక్క లోకమునందలి కామనను, సంగమును విడిచి పెట్టెను. ఆయన ఆత్మనిష్ఠ గలవాడై ఈ భూలోకములో సంచరించెను.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ఐల గీతమును నిరూపించే

ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).