శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

25 - మూడు గుణముల వృత్తులను నిరూపించుట

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- పురుషశ్రేష్ఠుడవగు ఓ ఉద్దవా!, ప్రాణులలో గుణములు ఒకే విధముగా ఉండవు. వాటిలో ఏ గుణము వలన వ్యక్తి ఏ విధముగా అగునో నేను చెప్పెదను. ఆ ఈ విషయమును నీవు తెలుసుకొనుము,

అంతరింద్రియనిగ్రహము, బాహ్యేంద్రియనిగ్రహము, ద్వంద్వములను సహించుట, వివేకము, తపస్సు, సత్యము, దయ, నిదిధ్యాసనము, సంతోషము, త్యాగము, కామనలు లేకుండుట, శ్రద్ధ, తప్పు పని చేయుటకు సిగ్గు పడుట, దానము, ఆత్మానందము, వినయము మొదలైనవి సత్త్వగుణలక్షణములు.

భోగములయందలి కోరిక, కర్మలయందాసక్తి, దర్పము, దురాశ, అవినయము, కోరికలు, భేదబుద్ది, ఇంద్రియభోగము, గర్వము వలన కలిగిన , ఉత్సాహము, కీర్తికాంక్ష, , పరిహాసము, తన ప్రతిభను ప్రకటించుకొనుట, హఠముతో ఉద్యమించుట అనేవి రజోగుణలక్షణములు.

కోపము, లోభము, అసత్యభాషణము, హింస, యాచన, డాంబీకము, శ్రమ, కలహము, శోకము, మోహము, దుఃఖము, దైన్యము, నిద్ర, పేరాస, భయము, సోమరిదనము అనేవి తమోగుణలక్షణములు.

ఇవి క్రమముగా సత్త్వరజస్తమోగుణముల లక్షణములు. వీటిని చాల వరకు వర్ణించడమైనది. ఇప్పుడు వాటి మిశ్రణమును గురించి వినుము.

ఓ ఉద్దవా! అహంకారమమకారములను భావించే బుద్ది గుణముల మిశ్రణము వలన కలుగును. మనస్సు, శబ్దాది విషయములు, ఇంద్రియములు, ప్రాణాపానాదులతో చేసే వ్యవహారము కూడ మిశ్రణమే.

ఎప్పుడైతే వ్యక్తి ధర్మార్థకామములయందు నిష్ఠను కలిగియుండునో, అప్పుడు సత్త్వగుణము శ్రద్ధను, రజోగుణము ఆసక్తిని, తమోగుణము ధనప్రాప్తిని కలిగించును. ఇట్టి త్రివర్గనిష్ట గుణముల మిశ్రణమే.

ఎప్పుడైతే వ్యక్తి ప్రవృత్తిరూప ధర్మమునందు నిష్ఠను కలిగి గృహస్థుడై స్వధర్మముననుష్ఠించునో, అది నిశ్చయముగా గుణముల మిశ్రణము.

శమము, దమము మొదలగు లక్షణములు గల వ్యక్తి సత్త్వగుణప్రధానుడనియు, కామన, ఆశ మొదలగు లక్షణములు గలవాడు రజోగుణప్రధానుడనియు, క్రోధము, సోమరిదనము మొదలగు లక్షణములు గలవాడు తమోగుణప్రధానుడనియు ఊహించవలెను.

స్త్రీ, లేదా పురుషుడు, స్వధర్మముననుష్ఠిస్తూ నిష్కామభక్తితో నన్ను సేవించుచున్నచో, ఆ వ్యక్తి సత్త్వగుణప్రధానుడు (ప్రధానురాలు) అని తెలియవలెను.

ఎప్పుడైతే ఒక వ్యక్తి భోగ్యములన పేక్షించి తన ధర్మముననుష్ఠిస్తూ నన్ను సేవించునో, ఆతడు రజోగుణప్రధానుడని తెలియవలెను. కాని, శత్రుసంహారము మొదలైన హింసను అపేక్షించి నన్ను సేవించువాడు తమోగుణప్రధానుడు.

సత్త్వరజస్తమోగుణములు మనస్సునందు పుట్టేవి. అవి జీవునకు మాత్రమే గలవు. నాకు కాదు. జీవుడు పాటిచే పాంచభౌతికములైన దేహాదులయందు, భార్యాపుత్రాది ఇతరప్రాణులయందు ఆసక్తిని పెంచుకొని గట్టిగా సంసారములో బంధించబడు చున్నాడు.

స్వచ్చము, శాంతము అగు సత్త్వగుణము సర్వమును ప్రకాశింపజేయును. అది యెప్పుడైతే మిగిలిన రెండు గుణములను త్రోసిపుచ్చునో అప్పుడు, వ్యక్తియందు ఆనందము, ధర్మము, జ్ఞానము, శమదమాదులు పరిఢవిల్లును.

రజోగుణము ఆసక్తి, భేదబుద్ది, ప్రవృత్తిస్వభావములను కలిగించును. అది యెప్పుడైతే సత్త్వతమోగుణములను జయించునో, అప్పుడు వ్యక్తికి కీర్తి, సంపదలతో బాటుగా దుఃఖము, కర్మాసక్తి అధికమగును

తమోగుణము వివేకమును పోగొట్టి, సత్యమునావరించి, సోమరిదనము ను కలిగించును. అది ఎప్పుడైతే సత్త్వరజోగుణములను జయించునో అప్పుడు, వ్యక్తికి శోకము, మోహము, నిద్ర, హింస, ఆశ అధికమగును.

సత్త్వగుణము నాకు నివాసస్థానమని తెలియుము. అది వర్ధిల్లినప్పుడు చిత్తము ప్రసన్నమై ఇంద్రియములు భోగములనుండి నివృత్తమగును. దేహమునందు రోగభయము, మనస్సులో ఆసక్తి దూరమగును.

రజోగుణముయొక్క ఉద్రేకము గల వ్యక్తి కర్మాసక్తుడై వికారమును పొందును. ఆతని బుద్ది నిరంతరము అంతటా విక్షిప్తమై శాంతమునేరు గదు. ఇంద్రియములకు భోగములనుండీ ఉపరతి ఉండదు. పోని దేహము అస్వస్థగా, భ్రాంతమైన మనస్సు చంచలముగా ఉండునని తెలియుము.

తమోగుణము ఉద్రిక్తమైనప్పుడు బుద్దికి వస్తుజ్ఞానమును కలిగించే శక్తి, మనస్సునకు సంకల్పించే శక్తి లుప్తమై వ్యక్తి నిద్రలోనికి జారుకొనును. అజ్ఞానము, విషాదము తమోగుణలక్షణములని నిర్ధారించుకొనుము.

ఓ ఉద్దవా! సత్త్వగుణము వర్ధిల్లినప్పుడు దేవతలకు (సాత్త్వికములైన ఇంద్రియవృత్తులకు, నివృత్తికి), రజోగుణము వర్ధిల్లినప్పుడు అసురులకు (భోగపరాయణులకు, ఆ రకమైన ఇంద్రియవృత్తులకు, ప్రవృత్తికి), తమోగుణము వర్ధిల్లినప్పుడు రాక్షసులకు (క్రూరస్వభావులకు, తామసవృత్తులకు, మోహమునకు) బలము పెరుగును.

మానవునకు సత్త్వగుణము వలన జాగ్రదవస్థ, రజోగుణము వలన స్వప్నావస్థ, తమోగుణము వలన గాఢనిద్ర కలుగునని తెలియవలెను. ఆత్మతత్త్వమైతే ఈ మూడు అవస్థలకు అతీతము, మరియు ఈ మూడింటియందు సాక్షి చైతన్యముగా వ్యాపించి యుండునది.

సత్త్వగుణప్రధానులు వేదవేత్తలై స్వర్గము, మహర్లోకము మొదలైన ఊర్ధ్వలోకములను పొందెదరు. తమోగుణముచే ప్రాణులు చెట్టుచేమలు వరకు గల నికృష్ణజన్మలను పొందును. రజోగుణముచే ప్రాణులు ఈ రెండింటికీ మధ్యలో నుండే మానవజన్మను పొందును.

సత్త్వగుణము అధికముగానుండగా మరణించినవారు స్వర్గమును, రజోగుణాధిక్యములో మరణించినవారు మానవజన్మను, తమోగుణము అధికముగానుండగా మరణించినవారు నరకమును పొందెదరు. కానీ, గుణాతీతులు నన్ను మాత్రమే పొందెదరు.

నాకు సమర్పించిన కర్మ, ఫలాసక్తి లేకుండా చేసిన కర్మ, స్వధర్మము సాత్త్వికకర్మలు. ఫలాపేక్షతో చేసే కర్మ రాజసము. హింస అధికముగా నుండునది, డాంబీకముతో చేసే కర్మ మొదలైనవి తామసకర్మలు.

అద్వయ-ఆత్మవిషయకమైన జ్ఞానము సాత్త్వికమనియు, భేదప్రధాన మైన జ్ఞానము రాజసమనియు, ఆహారము మొదలైన ప్రకృతికార్యములకు చెందిన జ్ఞానము తామసమనియు, నా (పరమాత్మ) యందు నిష్ణను కలిగియుండుట గుణాతీతత్వమనియు మహాత్ములు చెప్పెదరు.

అడవి (భోగవాసనలు లేని సరళమైన నివాసము) సాత్త్వికనివాసమనియు, గ్రామము (భోగవాసనలతో నిండిన యిల్లు) రాజసమనియు, జూదమాడే ఇల్లు తామసమనియు, దేవాలయము నిర్గుణమనియు మహాత్ములు చెప్పెదరు.

ఫలాసక్తి లేకుండా కర్తవ్యకర్మను చేయుపోడు సాత్త్వికుడు. ఆత్మానాత్మ వివేకము లేకుండా ఫలాపేక్షతో కర్మను చేయువాడు రాజసుడు. దేనిని చేయాలి? దేనిని కూడదు? అనే జ్ఞానము లేనివాడు తామసుడు. నన్ను మాత్రమే శరణు జొచ్చినవాడు గుణాతీతుడు, అని మహాత్ములు చెప్పిరి.

ఆత్మజ్ఞానమునందలి శ్రద్ధ సాత్త్వికము. కర్మలపై శ్రద్ధ రాజసము. అధ ర్మము (పరధర్మము) పై,శ్రద్ధ తామసము. నా సేవపై శ్రద్ధ గుణాతీతము.

హితకరము, శుద్ధము, తేలికగా లభించేది అగు ఆహారము సాత్త్వికమనియు, ఇంద్రియములకు ప్రీతిని కలిగించేది రాజసమనియు, శరీరమునకు పీడను కలిగించేది, అపవిత్రము అగు ఆహారము తామసమనియు మహాత్ములు చెప్పెదరు.

స్వరూపానుభవము వలన కలిగే సుఖము సాత్త్వికము. విషయభోగమునుండి కలిగే సుఖము రాజసము. మాదకద్రవ్యములను సేవించుట వలన, పుత్రాదులయందలి ఆసక్తి వలన కలిగే సుఖము తామసము. నన్ను శరణాగతి చేయుట గుణాతీతమైన ఆనందము.

పదార్థము, స్థానము, ఫలము, కాలము, జ్ఞానము, కర్మ, కర్త, శ్రద్ధ, అవస్థ, ఆకారము, నిష్ఠ అనే సర్వము నిశ్చయముగా త్రిగుణాత్మకమే.

పురుషశ్రేష్ఠుడవగు ఓ ఉద్దవా! చూడబడేవి, వినబడేవి, లేదా బుద్దిచే సంకల్పించబడేవి సకలపదార్థములు గుణముల కార్యములే. ఈ సర్వమునకు పురుషుడు మరియు మాయాశక్తి అధిష్ఠానములు.

ప్రియదర్శనుడవగు ఉద్దవా! వ్యక్తికి ఈ గుణములు మరియు కర్మలు నిమిత్తముగానే సంసారములో అనేకజన్మలు కలుగుచున్నవి. ఏ జీవుడైతే నాయందు నిష్ఠ గలవాడై భక్తియోగముతో చిత్తమునుండి. పుట్టే ఈ గుణములను జయించునో, ఆతడు నా స్వరూపము (మోక్షము) ను పొందుటకు యోగ్యుడగును.

ఈ మానవ దేహము జ్ఞాన (విషయపరిజ్ఞానము)-విజ్ఞాన (ఆ జ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకొనుట)_ములకు యోగ్యమైన ఉపాధి. వివేకవంతులు దీనిని పొంది, గుణకార్యములగు భోగములయందు ఆసక్తిని త్రోసిపుచ్చి, నన్ను సేవించెదరు గాక!

మననశీలుడగు సాధకుడు అసంగుడై సావధానుడై ఇంద్రియములను జయించి, నన్ను సేవించవలెను. ఆతడు సాత్త్వికములను మాత్రమే బాగుగా సేవిస్తూ రజస్తమోగుణములను జయించవలెను.

సాధకుడు ఏకాగ్రతతో, శాంతమగు చిత్తముతో, నిష్కామభావము ద్వారా సత్త్వగుణమును కూడ జయించవలెను. ఈ విధముగా. గుణము లను అధిగమించిన జీవుడు జీవభావమును విడిచి నాలో విలీనుడగును.

జీవుడు జీవభావమునుండి, చిత్తమునుండి పుట్టే గుణములనుండి వినిర్ముక్తుడై పరబ్రహ్మనగు సాచే వ్యాపించబడును (పూర్ఖుడగును). ఆయన విషయభోగములకై బాహ్యప్రపంచమునందు సంచరించడు. మనస్సులో నైననూ విషయభోగములను ఆ జీవన్ముక్తుడు స్మరించడు.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో మూడు గుణముల వృత్తులను

నిరూపించే ఇరువది ఐదవ అధ్యాయము ముగిసినదీ (25).