శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము

Table of Contents

19 - భక్తి, జ్ఞానము, యమనియమముల నిరూపణ

జ్ఞానికైతే నేనే ప్రియుడను. జ్ఞాని నన్నే తానే కోరే ఫలముగా, దానిని పొందే సాధనముగా కూడ స్వీకరించును. నేను తప్ప మరియొక ఫలము - స్వర్గము గాని, మోక్షము గాని - జ్ఞానికి ప్రియము కాదు.

శాస్త్రజ్ఞానము, ఆత్మానుభవములచే జీవన్ముక్తిని పొందిన మహాత్ములు నా సర్వాతిశాయియగు స్వరూపమును యెరుగుదురు. కావుననే, నాకు జ్ఞాని అతిశయించి ప్రియుడు. ఈతడు జ్ఞానము (ఆత్మనిష్ణు) చే నన్ను హృదయములో ధరించును.

జ్ఞానముయొక్క లేశమైననూ గొప్ప శ్రేయస్సును కలిగించును. జ్ఞానముచే కలిగే శ్రేయస్సును తపస్సు, తీర్థస్నానము, జపము, దానము, వైదికకర్మలు మొదలైనవి ఏవీ వర్ధిల్లజేయలేవు (అది నిశేయసము).

ఓ ఉద్ధవా! దేహము-ఇంద్రియములు-మనస్సు అనే మూడు ప్రకారములు గల ఈ ప్రకృతివికారము నిన్ను ఆశ్రయించి భాసిల్లుచున్నది. ఇది అజ్ఞానకల్పితము. ఎందుకంటే, ఇది ఆది-అంతములలో లేకుండా మధ్యలో మాత్రమే ప్రతీతమగుచున్నది. దీనికి ఉండే పుట్టుక- పెరుగుట మొదలగు ఈ వికారములు అధిష్టానమగు నీయందు ఉండునా? (ఉండవు). ఆది-అంతములలో లేనిది మధ్యలో కూడ ఉండదు. ఆది-అంతములలో ఉన్నది మాత్రమే మధ్యలో కూడ ఉండును.

ఉద్ధవుడిట్లు పలికెను --- ఓ జగన్నాథా! జగద్రూపముగా నీవే ప్రకటమై ఉన్నావు. ఆత్మజ్ఞానము విస్తృతమైనది. వైరాగ్యము, ఆత్మానుభవములతో కూడిన ఆ జ్ఞానము మిక్కిలి శుద్దికరము. సనాతనమైన ఆ జ్ఞానమును, మహాత్ములచే అన్వేషించబడే నీ భక్తియోగమును కూడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- పూర్వము మేమందరము వెనుకనుండి వినుచుండగా యుధిష్ఠిర మహారాజు ధర్మపరాయణులలో శ్రేష్ఠుడగు భీష్ముని ఇదే ప్రశ్నను ఇదే విధముగా అడిగెను.

మహాభారతయుద్దము ముగిసెను. ధర్మరాజు అనేకములగు (రాజ) ధర్మములను విని, భీష్ముని మోక్షధర్మములను గురించి ప్రశ్నించెను.

భీష్ముని నోటినుండి మేము విన్న ఆ ధర్మములు శాస్త్రజ్ఞానము, వైరాగ్యము, ఆత్మానుభవము, శ్రద్ధ, భక్తులతో నిండి యున్నవి. వాటిని నేను నీకు చెప్పెదను.

సృష్టికి పూర్వము ఉన్న కారణతత్త్వమే ప్రళయము తర్వాత కూడ మిగిలియుండును. మధ్యలో కూడ అదియే ఉండును. అదియే ఒక కార్యరూపమునుండి మరియొక కార్యరూపములోనికి అనువర్తించు చుండును. కార్యములన్నీ నశించిన పిదప అదియే మిగిలియుండును. అట్టి కారణతత్త్వమే సత్ (యథార్థము) అని తెలియవలెను.

శ్రుతి, ప్రత్యక్షము, ఐతిహ్యము, అనుమానము అని ప్రమాణములు నాలుగు. నేహ నానాస్తి కించన ఇత్యాది శ్రుతులు, చైతన్యముకంటె భిన్నముగా ఏదీ అనుభవమునకు వచ్చుట లేదు అనే ప్రత్యక్షము, జగత్తు మిథ్య అనే మహాపురుషప్రసిద్ధి, దృశ్యమగుట వలన జగత్తు మిథ్య అనే అనుమానము, అనే ప్రమాణములు ద్వైతప్రపంచము మిథ్యయని నిర్ధా రించును. కావున, ఆ వివేకి ద్వైతప్రపంచమునుండి విరక్తుడు కావలెను.

నా పరిచర్యయందు ఆదరము, సాష్టాంగనమస్కారము, నా పూజకంటే ఎక్కువగా నా భక్తుని పూజించుట, సకలప్రాణులలో నన్నే దర్శించుట అనువాటి వలన భక్తి కలుగును.

శరీరవ్యాపారమును నా కొరకై పూజాదికర్మలయందు (నాకు సమర్పితులైన భక్తుల సేవయందు) నియోగించుట, వాక్కుచే నా గుణములను కీర్తించుట, సకలకామనలను విడిచి పెట్టి మనస్సును నాకు సమర్పించుట అనేవి భక్తిసాధనములు.

నా ఆరాధన విషయమై భోగమును, సుఖమును విడిచి పెట్టి డబ్బును ఖర్చు చేయవలెను. యాగము, దానము, హోమము, జపము, వ్రతము, చిత్తము

రజోగుణముచే వ్యాప్త మై మిథ్యాజగత్తునందు నిష్ణ గల ఆ చిత్తము ఎప్పుడైతే ఇంద్రియములతో గూడి ద్వైతజగత్తునందు ఇటునటు పరుగులు తీయునో, అప్పుడు విపరీతము (అధర్మము, అజ్ఞానము, సంసారాసక్తి, బంధము) కలుగును.

నాయందు భక్తిని కలిగించే సాధనమే ధర్మమని మహాత్ములు చేప్పెదరు. అంతటా ఒకే ఆత్మను దర్శించుట జ్ఞానము. గుణకార్యములగు శబ్దాది విషయములయందు ఆసక్తి లేకుండుటయే వైరాగ్యము. అణిమ (చిన్నగా అగుట), లఘిమ (తేలికగా అగుట) మొదలైన సిద్ధులే ఈశ్వరభావము.

పండితుడెవరు? మూర్ఖుడెవరు? మంచి దారి యేది? చెడు దారి యేది? స్వర్గమేది? నరకమేది? బంధువు యెవరు? ఇల్లు ఏది?

సత్పురుషులను పాలించే ఓ శ్రీకృష్ణా! ధనవంతుడు యెవరు? దరిద్రుడు ఎవరు? దీనుడెవరు? ఈశ్వరుడెవరు? ఈ ప్రశ్నలను, వీటికి విరుద్ధములైన అశమ-అదమాదులను కూడ నాకు చెప్పుము.

బుద్ది నాయందు నిష్ఠను కలిగియుండుట శమము. ఇంద్రియముల సంయమము దమము. దుఃఖమును సహించుట తితిక్ష. జిహ్వను, జననేంద్రియమును జయించుట ధృతి.

ప్రాణులకు హాని చేయకుండుటయే గొప్ప (అభయ) దానము (ధనమునిచ్చుట మాత్రమే కాదు). కోరికలను విడుచుటయే తపస్సు (ఉపవాసాదులు మాత్రమే కాదు). క్రోధము మొదలైన స్వభావము (వాసన) పై (శత్రువులపై కాదు) విజయమే శౌర్యము. అంతటా పరమాత్మను దర్శించుటయే సత్యము (సత్యభాషణము మాత్రమే కాదు).

ప్రియహితమగు పలుకే ఋతమని విద్వాంసులు బహుధా కీర్తించిరి. లౌకికవైదికకర్మలయందు కర్తృత్వాభిమానము లేకుండుటయే శౌచము.

మానసికముగా బాహ్యముపై ఆధారపడకుండుట, దైన్యము లేకుండుట మొదలైన గుణములే శ్రీ. - (ధనము మాత్రమే కాదు). సుఖదుఃఖములకతీతముగా స్వరూపనిష్ఠుడై ఉండుటయే యథార్థ మైన సుఖము (భోగానుభవము కాదు). భోగసుఖమును కోరుటయే దుఃఖము (భోగములు లేకుండుట కాదు). బంధమోక్షములు తెలిసినవాడే పండితుడు (శాస్త్రములను వల్లె వేసినవాడు కాదు).

దేహము, మనస్సు మొదలైనవాటియందు నేను-అనే అభిమానము గలవాడే మూర్ఖుడు (చదువు రానివాడు మాత్రమే కాదు). నన్ను పొందించే జ్ఞానమే మార్గము. మనస్సుయొక్క అలజడియే తప్పు దారి. సత్త్వగుణము వర్ధిల్లుటయే స్వర్గము (పరలోకము మాత్రమే కాదు).

ఉద్దవా! ఈ నీ ప్రశ్నలన్నింటికీ చక్కని సమాధానమీయబడినది. అధిక ముగా వర్ణించి లాభమేమి? గుణదోషదృష్టియే దోషము. గుణదోషముల కతీతముగనుండుటయే గుణము. ఇవియే యథార్థ మైన గుణదోషములు.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో భక్తి, జ్ఞానము, యమనియమములను నిరూపించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది .