భాగవత మహా పురాణము
30 - ప్రచేతసులు శ్రీహరిని దర్శించి స్తుతించుట
విదుర ఉవాచ ।
యే త్వయాభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీనబర్హిషః ।
తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రచోష్య కామ్ ॥
విదురుడిట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రాచీనబర్హిషుని పుత్రులు నీ సలహా ప్రకారముగా రుద్రుని ఉపదేశమును అనుష్ఠించి, శ్రీహరిని ప్రస న్నునిగా చేసుకొని సిద్ధిని బడసినారు గదా! ఆ సిద్ధి యెట్టిది ?
కిం బార్హస్పత్యహ పరత్ర వాథ
కైవల్యనాథప్రియపార్శ్వవర్తినః ।
ఆసాద్య దేవం గిరిశం యదృచ్చయా
ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః ॥
బృహస్పతి శిష్యుడవగు ఓ మైత్రేయా! ప్రచేతసులు అనుకో కుండా (ఈశ్వరేచ్చచే) కైలాసాధిపతియగు శివదేవుని దర్శనమును పొంది రి. మోక్షమునిచ్చే ప్రభుడగు శ్రీహరికి శివుడు ప్రియుడు. అట్టి శివుని అను గ్రహముచే వారు తప్పక పరమపురుషార్థమగు మోక్షమును నిశ్చయముగా పొందియే యుందురు. కాని, దానికి ముందు ఇహపరలోకములలో వారికి లభించిన సిద్ధి యెట్టిది?
మైత్రేయ ఉవాచ ।
ప్రచేతసోంతరుదధా పితురాదేశకారిణః ।
జపయజేన తపసా పురంజనమతోషయన్ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- తండ్రి ఆదేశమును పాలించే ప్రచేతసులు సముద్రము లోపల జపయజ్ఞరూపమగు తపస్సును చేసి, సృష్టికి మూలపురుషుడగు శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొనిరి.
దశవర్షసహస్రాంతే పురుషస్తు సనాతనః ।
తేషామవిరభూత్కృచ్చం శాంతేన శమయన్ రుచా ॥
వారు పదివేల సంవత్సరములు తపస్సును చేసిన పిదప శ్రీహరి వారికి శాంతమగు రూపముతో సాక్షాత్కరించెను. కాలమునకు అతీతుడు, పూర్ణుడు అగు ఆయనయొక్క కాంతి వారి తపఃక్లేశమును చల్లార్చెను.
సుపర్ణస్కంధమారూఢ మేరుశృంగమివాంబుదః ।
పీతవాసా మణిగ్రీవః కుర్వన్ వితిమీరా దిశః ॥
పచ్చని వస్త్రమును దాల్చి గరుత్మంతుని స్కంధములపై అధిష్ఠిం చిన శ్రీహరి మేరుపర్వత శిఖరము పైనుండే మేఘమువలె నున్నాడు. మేడలో కౌస్తుభమాణిక్యమును దాల్చిన ఆయన తన కాంతిచే దిక్కులలోని చీకట్లను పారద్రోలుచుండెను.
కాశిష్ణునా కనకవర్ణవిభూషణేన
భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః ।
అష్టాయుధైరనుచరైర్మునిభిసురేంద్రైః
ఆ సేవితో గరుడకిన్నరగీతకీర్తిః ॥
రంగురంగుల మణులు పొదిగిన బంగరు ఆభరణముచే ఆయన చెక్కిళ్లు మరియు ముఖము ప్రకాశించుచుండెను. ఆయన తలపై కిరీటము, చేతులయందు ఎనిమిది ఆయుధములు విరాజిల్లుచుండెను. ఆయన చుట్టూ అనుచరులు, మహర్షులు మరియు లోకపాలకులు సేవించుచుండిరి. గరుడుడే కిన్నరుడై ఆయన కీర్తిని గానము చేయుచుండెను.
పీనాయతాష్టభుజమండలమధ్యలక్ష్మ్యా
స్పర్ధచ్ఛ్రియా పరివృతో వనమాలయాద్యః ।
బర్హిష్మతః పురుష ఆహ సుతాన్ ప్రపన్నాన్
పర్జన్యనాదరుతయా సఘృణావలోకః ॥
శ్రీహరియొక్క ఎనిమిది బలిసిన పొడవాటి భుజముల మధ్యలో లక్ష్మీదేవి, వనమాల కాంతిలో ఒకదానితోనొకటి పోటీ పడుచుండెను. సర్వ జగత్కారణుడు, పూర్ణుడు అగు శ్రీహరి తనను శరణు జొచ్చిన బర్హిష్మం తుని పుత్రులగు ప్రచేతసులను కృపాదృష్టితో చూచి, మేఘగర్జనవంటి వాక్కుతో వారితోనిట్లనెను.
శ్రీభగవానువాచ ।
వరం వృణీధ్వం భద్రం వో యూయం మే నృపనందనా ।
సౌహార్ధేనాపృథగ్ధర్మాస్తుష్టాహం సౌహృదేన వః ॥
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ రాజకుమారులారా! మీరు అన్యోన్యము ప్రేమ గలవారై అందరు కలిసి ఒకే ధర్మమును పాటించుచు న్నారు. మీ ఈ పరస్పర స్నేహభావముచే నేను సంతసించితిని. మీరు నానుండి వరమును కోరుకొనుడు. మీకు మంగళమగు గాక!
యోనుస్మరతి సంధ్యాయాం యుష్మాననుదినం నరః ।
తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదమ్ ॥
ఏ మానవుడైతే ప్రతిదినము సంధ్యాకాలమునందు మిమ్ములను స్మరించునో, పోనికి తన సోదరులయందు ఆత్మసమమగు ప్రీతి కలుగును. మరియు, వానికీ సకలప్రాణులయందు ప్రేమ ఉదయించును.
యే తు మాం రుద్రగీతేన సాయం ప్రాతస్సమాహితాః ।
స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనామ్ ॥
ఎవరైతే ఉదయము సాయంకాలము నన్ను ఏకాగ్రచిత్తులై రుద్రరీ తముతో స్తుతించెదరో, వారికి నేను కోరిన వరములను మాత్రమే గాక చక్కటి బుద్ధిశక్తిని కూడ అనుగ్రహించెదను.
యద్యూయం పితురాదేశమగ్రహీష్ణ ముదాన్వితాః ।
అథో వ ఉశతీ కీర్తిర్లోకాననుభవిష్యతి ॥
మీరు తండ్రియొక్క ఆదేశమును ఆనందముగా స్వీకరించిరి. కావు న, మీయొక్క గొప్ప కీర్తి లోకములలో వ్యాపించగలదు.
భవితా విశ్రుతః పుత్రోకనవమో బ్రహ్మణో గుణైః ।
య ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూర్తయిష్యతి ॥
మీకు ఒక పుత్రుడు కలుగును. ఆతడు గుణములలో బ్రహ్మకు తక్కువ కాబోడు. గొప్ప ప్రఖ్యాతిని బడసే ఆతడు తన సంతానముతో ఈ ముల్లోకములను నింపును.
కండోః ప్రహ్లిచయా లబ్ధ కన్యా కమలలోచనా ।
తాం చాపవిద్ధాం జగృహుర్భూరుహా నృపనందనాః ॥
ఓ రాజకుమారులారా! ప్రహ్లిచ అనే అప్సరసకు కండు మహర్షి వలన కలువ కన్నుల చిన్నది జన్మించెను. కాని ఆమె ఆ పిల్లను అడవిలో విడిచి పెట్టగా, చెట్లు ఆ శిశువును స్వీకరించినవి.
క్షుత్ క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీమ్ ।
దేశినీం రోదమానాయా నిదధే స దయాన్వితః ॥
ఆ శిశువు ఆకలితో బాధపడి ఏడ్చుచుండెను. అపుడు ఓషధులకు ప్రభువగు చంద్రుడు దయ గలవాడై అమృతమును స్రవించే తన చూపుడు వ్రేలును ఆ శిశువు నోటిలోనుంచెను.
ప్రజావసర్గ ఆదిష్టాః పిత్రా మామనువర్తతా ।
తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత మా చిరమ్ ॥
మీ తండ్రియగు ప్రాచీనబర్హిషుడు నా ఆజ్ఞను పాలించే భక్తుడు. సంతానమును కనుడని మిమ్ములను ఆయన ఆదేశించినాడు. కావున, మీరు సుందరియగు ఆ కన్యను వివాహమాడుడు. విలంబము చేయకుడు.
అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వస్సుమధ్యమా ।
అపృథగ్ధర్మశీలేయం భూయాత్పత్యర్పితాశయా ॥
మీరు అందరు కలిసి ఒకే ధర్మమును పాటిస్తూ ఒకే స్వభా వమును కలిగియున్నారు. మీతో సమానమగు ధర్మము మరియు శీలము గల ఈ సుందరి కూడ మీకే తన హృదయమునర్పించగలదు. ఆమె మీకు భార్య యగుగాక!
దివ్యవర్షసహస్రాణాం సహస్రమహతేజసః ।
భౌమాన్ భోక్ష్యథ భోగాన్ వై దివ్యాంశ్చానుగ్రహాన్మమ ॥
మీరు నా అనుగ్రహము వలన పది లక్షల దేవసంవత్సరముల కాలము తగ్గని బలము గలవారై, భూలోకమునందలి భోగములను మాత్రమే గాక దేవభోగములను కూడ అనుభవించుడు.
అథ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః ।
ఉపయాస్యథ మద్దామ నిర్విద్య నిరయాదతః ॥
మీరు నాయందు నిరంతరమగు భక్తిని చేసెదరు. దాని ప్రభావ ముచే త్రిగుణాత్మకమగు మీ అంతఃకరణము పరిపక్వమై దానిలోని కామనలు మొదలగు మాలిన్యములు నశించును. అపుడు మీకు నరకతుల్య మగు ఈ భోగములయందు వైరాగ్యము కలుగును. అప్పుడు మీరు నా స్వరూపమునందు ఐక్యము కాగలరు.
గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణామ్ ।
మద్వార్తాయాతయామానాం న బంధాయ గృహా మతాః ॥
మానవుడు ధర్మాధర్మవివేకపూర్వకముగా కర్మలను చేస్తూ, భగవ చ్చింతనలో కాలమును గడుపవలేను. అట్లు చేయువారలకు గృహస్థాశ్ర మమైననూ బంధ హేతువు కాబోదు.
నవ్యవద్ధృదయే యజ్జో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః ।
న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః ॥
నిరంతరమగు భగవచ్చింతన వలన జ్ఞప్తిస్వరూపుడనగు నేను సాధకుని హృదయములో నిత్యనూతనముగా ప్రకాశించేదను. దీనినే బ్రహ్మవేత్తలు బ్రహ్మయని నిర్దేశించుచున్నారు. ఇట్టి భగవచ్చింతనము వలన సాధకుడు వ్యామోహమును గాని, శోకమును గాని, హర్షద్రేకమును గాని పొందడు.
మైత్రేయ ఉవాచ ।
ఏవం బ్రుహణం పురుషార్థభాజనం
జనార్దనం ప్రాంజలయః ప్రచేతసః ।
తద్దర్శనధ్వస్తతమోరజోమలా
గిరాగృణన్ గద్దదయా సుహృత్తమమ్ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దుష్టజనశిక్షకుడు, పరమహి తకారి అగు శ్రీహరి భక్తులకు పురుషార్థములననుగ్రహించును. ఆయన ఈ విధముగా పలుకగా, ప్రచేతసులు చేతులను జోడించి బొంగురు వోయిన కంఠముతో వారాయనను ఇట్లు స్తుతించిరి. ఆయన దర్శనముచే వారి హృదయములలోని రజస్తమోగుణముల మాలిన్యము నశించియుండెను.
ప్రచేతస ఊచుః ।
నమో నమః క్లేశవినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ ।
మనోవచోవేగపురోజవాయ సర్వాక్షమార్గైరగతిధ్వనే నమః ॥
ప్రచేతసులు ఇట్లు పలికిరి --- భక్తుల కష్టములను బాపే శ్రీహరికి ఏ గుణములను శాస్త్రములు నిరూపించుచున్నవో, అవియే ఆయన నామ ములగుచున్నవి (ఆయన గుణములు, నామములు శాస్త్రముచే నిరూపించబడుచున్నవి). ఆయన స్వరూపము మిక్కిలి వేగము గల మనస్సునకు గాని, వాక్కునకు గాని అందదు. ఆయన స్వరూపము ఇంద్రియముల వ్యాపారములకు అందదు. ఆయనకు అనేక నమస్కారములు.
శుద్దాయ శాంతాయ నమస్స్వనిష్ఠయా
మనస్యపార్థం విలసద్ద్వయాయ ।
నమో జగత్స్థానలయోదయేషు
గృహీతమాయాగుణవిగ్రహాయ ॥
శ్రీహరియే మాయాశక్తియొక్క సత్వరజస్తమోగుణములను ఉపా ధిగా స్వీకరించి, జగత్తునకు స్థితిని ప్రళయమును మరియు సృష్టిని చేయు ను. అయిననూ, అయన స్వస్వరూపనిష్ఠుడగుటచే ఆయనయందు కర్తృ త్వదికము గాని, గుణముల సంక్షోభము గానీ లేవు. వాస్తవముగా లేకు న్ననూ మనస్సునందు స్పురించే ఈ నానాత్వరూపమగు జగత్తునకు అధి స్థానము శ్రీహరియే. అట్టి శ్రీహరికి నమస్కారము.
నమో విశుద్ధసత్త్వాయ హరయే హరిమేధసే ।
వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతామ్ ॥
శ్రీహరి శుద్ధసత్త్వప్రధానమగు మూర్తి, ఆయనను తెలుసుకున్నవా నికి సంసారము తొలగిపోవును. ఆయనయే వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణుడై అవతరించి సాత్వతవంశీయులకు ప్రభుడైనాడు. సకలజగత్తులు చైతన్యస్వ రూపుడగు ఆయనయందే భాసించుచున్నవి. ఆనందరూపుడగు ఆ శ్రీహరియే సత్త్వగుణప్రధానులగు భక్తులకు ప్రభుడు. ఆయనకు నమస్కారము.
నమః కమలనాభాయ నమః కమలమాలినే ।
నమః కమలదాయ నమస్తే కమలేక్షణ ॥
ఓ కలువ కన్నుల శ్రీహరీ! బ్రహ్మాండము కమలముల మాలను ధరించే నీ నాభియందలి కమలమైనది. కమలములవంటి పాదములు గల నీకు అనేక నమస్కారములు.
నమః కమలకింజల్కపీశంగామలవాస సే ।
సర్వభూతనివాసాయ నమోయుంక్ష్మహి సాక్షిణే ॥
కమలముల పుప్పొడివలె పచ్చనైన స్వచ్ఛమగు వస్త్రములను ధరించియున్న శ్రీహరి కొరకు పలుమార్లు నమస్కరించుచున్నాము. ఆయన సకలప్రాణులలో సాక్షి చైతన్యరూపముగా నివసించి యున్నాడు.
రూపం భగవతా త్వేతదశేష క్లేశసంక్షయమ్ ।
ఆవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యదనుకంపితమ్ ॥
కష్టములనన్నింటినీ బా పే ఈ రూపము అవిద్యాది క్లేశములతో నిండియున్న మాకు శ్రీహరి భగవానునిచే ఆవిష్కరించబడినది. ఇంతకంటే గొప్ప అనుగ్రహము ఏమి గలదు?
ఏతావత్త్వం హి ప్రభుభిర్భావ్యం దీనేషు వత్సలైః ।
యదనుస్మర్యతే కాలే స్వబుద్ద్యాభద్రరంధన ॥
అమంగళములను నాశనము చేయువాడా! దీనవత్సలురగు ప్రభు వులు ఆయా కాలములయందు సేవకులను తమ బుద్ధియందు స్మరించవలెను. అంతమాత్రముచే సేవకులు కృతార్థులగుదురు.
యేనోపశాంతర్భూతానాం క్షుల్లకానామపీహతామ్ ।
అంతర్షితోనంతృదయే కస్మాన్నో వేద నాశిషః ॥
శ్రీహరిచే స్మరించబడువారల కష్టములు నివారణ అగును. ఆయన అత్యల్పములగు ప్రాణుల హృదయముల లోపల కూడ అంతర్యా మియై ఉన్నాడు. అట్టి శ్రీహరికి కోరికలతో నిండిన మా హృదయముల లోని ఆకాంక్షలు ఏల తెలియకుండును?
అసావేవ వరోస్మాకమీప్సితో జగతః పతే ।
ప్రసన్నో భగవాన్ యేషామపవర్గగురుర్గతిః ॥
ఓ జగన్నాథా! మోక్షప్రదాతవు, మోక్షమార్గమును చూపువాడవు అగు నిన్ను మేము శరణు పొందినాము. మాయందు భగవానుడవగు నీవు ప్రసన్నుడవైనావు. మేము కోరే వరము ఇదియే.
వరం వృణీమ హేథాపి నాథ త్వత్పరతః పరాత్ ।
న హ్యంతస్త్వద్విభూతీనాం సోకనంత ఇతి గీయసే ॥
ఓ ప్రభూ! అయినప్పటికీ, ప్రకృతికి అతీతుడవగు నీనుండి మేము వరమును కోరుచున్నాము. నీ మహిమలకు అంతము లేదు గనుకనే, నిన్ను అనంతుడని కీర్తించుచున్నారు.
పారిజాతేజసా లబ్ధే సారంగోకన్యం న సేవతే ।
త్వదంఘ్రమూలమాసాద్య సాక్షాత్కం కిం వృణీమహి ॥
తేలికగా కల్పవృక్షము లభించినప్పుడు తుమ్మెద మరియొక చెట్టును సేవించదు. మాకు సాక్షాత్తుగా నీ పాదమూలము లభించినది. మేము ఇతరములను వేటిని కోరవలయును?
యావత్తే మాయయా స్పృష్టా భ్రమ ఇహ కర్మభిః ।
తావద్బవతసంగానాం సంగస్యాన్నో భవే భవే ॥
నీ మాయచే కప్పివేయబడిన మేము కర్మఫలములననుభవిస్తూ ఈ సంసారములో పరిభ్రమిస్తూ ఉన్నంతవరకు, మాకు జన్మజన్మలయందు నీ గొప్ప భక్తుల సంగము కలుగు గాక!
తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్ ।
భగవత్సంగిసంగస్య మర్త్యానాం కిముతాఃషః ॥
భగవంతునియందు ప్రేమ గల భక్తులతోడి సంగముయొక్క లేశ ముతోనైననూ స్వర్గము గాని, మోక్షము గాని తులదూగవు. ఇక మానవుల భోగభాగ్యములు తులదూగవని వేరుగా చెప్పవలయునా?
యత్రేడ్యంతే కథా మృష్టాస్తృష్ణాయాః ప్రశమో యతః ।
నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన ॥
సత్సంగములో శుద్దములగు భగవద్గాథలు గానము చేయబడును. దానిలో పాల్గొన్నవారికి సంసారాసక్తి బాగుగా పలచబడును. అచట ప్రాణుల మధ్యనుండే వైరము తొలగిపోవును. సత్సంగము వలన మనస్సులోని భయాందోళనలు పూర్తిగా దూరమగును.
యత్ర నారాయణస్సాక్షాద్భగవాన్న్యాసినాం గతిః ।
సంస్తూయతే సత్కథాసు ముక్తసంగైః పునః పునః ॥
సత్సంగములో సంసారాసక్తిని విడిచి పెట్టిన మహాత్ములు భగవద్గా థలను కీర్తించెదరు. ఆ గాథలలో సాక్షాత్తు నారాయణ భగవానుడు చక్కగా పదే పదే స్తుతించబడును. సర్వసంగపరిత్యాగులకు గత ఆయనయే.
తేషాం విచరతాం పద్బ్యాం తీర్థానాం పావనేచ్చయా ।
భీతస్య కిం న చేత తావకానాం సమాగమః ॥
నీ భక్తులు తీర్థములను పవిత్రము చేసే ఆకాంక్షతో కాలి నడకన సంచరించెదరు. సంసారము వలన భయపడియున్నవానికి వారితోడి సమా గమము ఏల రుచించదు?
వయం తు సాక్షాద్భగవన్ భవస్య
ప్రియస్య సఖ్యుః క్షణసంగమేన ।
సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోః
భిషక్తమం త్వాద్య గతిం గతాస్స్మః ॥
ఓ భగవానుడా! నీకు ప్రియసఖుడగు శివునితో సాక్షాత్తుగా మాకు - క్షణకాలము సమాగమము కలిగినది. జననమరణములనే రోగమునకు చికిత్స చాల కష్టము. కాని, శివసమాగమముయొక్క ప్రభావముచే మేము సంసారరోగమునకు సర్వోత్తమవైద్యుడవగు నిన్ను శరణు పొందగల్గినాము.
యన్నస్వధీతం గురవః ప్రసాదితా
వీప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా ।
ఆర్యా నతాస్సుహృదో భ్రాతరశ్చ
సర్వాణి భూతాన్యనసూయయైవ ॥
యన్నస్సుతప్తం తప ఏతదీశ
నిరంధసాం కాలమదభ్రమపు ।
సర్వం తదేతత్పురుషస్య భూమ్నో
వృణీమహే తే పరితోషణాయ ॥
ఓ ఈశ్వరా! మేము చక్కగా వేదమును అధ్యయనము చేసితిమి. గురువులను, వేదవేత్తలను మరియు పెద్దలను అన్ని కాలములలో అనుస రించి ప్రసన్నులను చేసుకొంటిమి. గొప్పవారు, మిత్రులు, సోదరులకు మాత్రమే గాక సకలప్రాణులకు మేము దోషారోపణను చేయకుండగా నము స్కరించితిమి. మేమీ విధముగా నీటిలో నిలబడి నిరాహారులమై చాలకా లము చక్కని తపస్సును చేసితిమి. ఈ సర్వము వలన సర్వాంతర్యామివి, పరబ్రహ్మస్వరూపుడవు అగు నీవు ప్రసన్నుడవగుదువు గాక! మా కోరిక ఇదియే.
మనుస్స్వయంభూర్బగవాన్ భవశ్చ
యేన్యే తపోజ్ఞానవిశుద్ధసత్త్వాః ।
అదృష్టపారా అపి యన్మహిమ్నః
స్తువంత్యధో త్వాత్మసమం గృణీమ ॥
స్వాయంభువ మనువు, స్వయంభువుడగు బ్రహ్మగారు, శివ భగ వానుడు మాత్రమే గాక, తపస్సు మరియు ఉపాసనలచే పవిత్రమైన అంతఃకరణము గల ఇతరులు నీ మహిమయొక్క అంతమును చూచినవారు కాకున్ననూ, తమ తమ శక్తికి తగ్గట్లుగా మాత్రమే నిన్ను స్తుతించుచున్నారు. కావుననే, మేము కూడ నిన్ను స్తుతించుచున్నాము.
నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ ।
వాసుదేవాయ సత్త్వాయ తుభ్యం భగవతే నమః ॥
నీవు సర్వప్రాణులలో ఆత్మచైతన్యరూపముగా సమానముగా నున్నావు. నీయందు కర్తృత్వభోక్తృత్వాది దోషములు లేవు. సర్వజగన్నివా సుడవగు నీవు స్వయంప్రకాశస్వరూపుడవు. నీవు ప్రకృతికి అతీతుడవు. సత్త్వమూర్తివగు నీయందు ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము అనే ఆరు గుణములు పూర్ణముగా నున్నవి. నీకు నమస్కారము.
మైత్రేయ ఉవాచ ।
ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః
ప్రీతస్తథోత్యాహ శరణ్యవత్సలః ।
అనిచ్ఛతాం యానమతృప్తచక్షుషాం
యయా స్వధామానపవర్గవీర్యః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- అమోఘమగు శక్తి గల శ్రీహరికి శరణాగతులయందు వాత్సల్యము మెండు. ప్రచేతసులు ఈ విధ ముగా స్తుతించగా, ఆయన సరేయని వారి కోరికను అనుమోదించెను. ఆయన దర్శనముచే వారి కన్నులకు ఇంకనూ తృప్తి కలుగనే లేదు. కావున నే, ఆయన నిర్గమనమును వారు ఇష్టపడలేదు. అయిననూ, ఆయన తన ధామమునకు వెళ్లెను.
అథ నిర్యాయ సలిలాత్ప్రచేతస ఉదన్వతః ।
వీక్ష్యాకుప్యస్థమైశ్ఛన్నాం గాం గాం రోధుమివోచ్ఛ్రితైః ॥
తరువాత ప్రచేతసులు సముద్రజలములనుండి పైకి వచ్చి చూడగా భూమి అంతయు చెట్లతో ఆవరించబడి యుండెను. ఆ చెట్లు స్వర్గమును అడ్డుకొనుటకా యన్నట్లు ఎత్తుగా పెరిగినవి. వాటిని చూచి వారు కోపించిరి.
తతోగ్నిమారుతో రాజన్నముంచన్ముఖతో రుషా ।
మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే ॥
ఓ రాజా! తరువాత వారు, ప్రళయకాలరుద్రుని వలె కోపించి, భూమిపై చెట్లు లేకుండా చేయుటకై నోటినుండి మంటలను గాలిని విడిచిపెట్టిరి.
భస్మసాత్క్రియమాణాంస్తాన్ ద్రుమాన్ వీక్ష్య పితామహః ।
ఆగతశ్శమయామాస పుత్రాన్ బర్హిష్మతో నయైః ॥
చెట్లు కాలి బూడిద అగుచుండగా చూచిన బ్రహ్మగారు అచటకు వచ్చి, ప్రాచీనబర్హిషుని పుత్రులగు ఆ ప్రచేతసులకు మంచి మాటలను చెప్పి, వారి కోపమును తగ్గించెను.
తత్రావశిష్టా యే వృక్షా భీతా దుహితరం తదా ।
ఉజ్జహ్రు స్తే ప్రచేతోభ్య ఉపదిష్టాస్స్వయంభువా ॥
కాలిపోగా మిగిలియున్న చెట్లు భయపడినవి. స్వయంభువుడగు బ్రహ్మగారి ఉపదేశానుసారముగా అవి అప్పుడు తమ కుమార్తెను ప్రచేత సులకు సమర్పించినవి.
తే చ బ్రహ్మణ ఆదేశాన్మారిషాముపయేమిరే ।
యస్యాం మహదవజ్ఞానాదజన్యజనయోనిజః ॥
ఆ ప్రచేతసులు కూడ బ్రహ్మగారి ఆదేశము వలన మారిష అనే ఆ కన్యను వివాహమాడిరి. పూర్వము నారాయణునినుండి ఉద్భవించిన బ్రహ్మగారికి పుత్రుడైన దక్షుడు మహాదేవుని నిందించుటచే, గర్భవాసదుఃఖ ముననుభవించుటకై మరల ఆమెయందు జన్మించెను.
చాక్షుషే త్వంతరే ప్రాప్తి ప్రాక్సర్గే కాలవిద్రుతే ।
యస్ససర్ట ప్రజా ఇష్టాస్స దక్ష దైవచోదితః ॥
చాక్షుష మన్వంతరము వచ్చు కాలమునకు అంతకు ముందటి సృష్టి కాలప్రభావముచే నశించెను. అప్పుడు దైవముచే ప్రేరితుడైన దక్షుడు తనకు అభీష్టమగు సంతానమును కనెను. ఆ దక్షుడు ఇప్పుడు మారిషయందు జన్మించెను.
యో జాయమానస్సర్వేషాం తేజస్తేజస్వినాం రుచా ।
స్వయోపాదత్త దాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్ ॥
ఆ దక్షుడు పుట్టుచుండగనే తన తేజస్సుచే తేజశ్శాలురందరి తేజ స్సును తిరస్కరించెను. కర్మలయందు చాతుర్యము గలవాడగుటచే ఆత నిని దక్షుడని వ్యవహరించిరి.
తం ప్రజాసర్గరక్షాయామదిరభిషిద్య చ ।
యుయోజ యుయుజ్వేన్యాంశ్చ స వై సర్వప్రజాపతీన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ప్రచేతోభ్యః శ్రీహరిదర్శనం నామ త్రింశోఽధ్యాయః ॥
స్వయంభువుడగు బ్రహ్మగారు ఆ దక్షుని అభిషేకించి ప్రజాసృ షిని రక్షించుమని నియోగించెను. ప్రజాపతులకు నాయకుడగు ఆ దక్షుడే ఇతరప్రజాపతులను కూడ నియోగించేను.
శ్రీమద్భాగవతమునందలి నాల్గవ స్కంధములో ప్రచేతసులకు శ్రీహరి దర్శనమిచ్చుటను, ఆయనను వారు స్తుతించుటను వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 30 of the Bhāgavata Mahā Purana is as follows:
The narrative returns to the ten Pracetās, who complete ten thousand years of severe underwater austerities while chanting the Rudra-gīta taught to them by Mahādeva Śiva. Bhagavān Vishṇu appears before them in His glorious eight-armed form on Garuḍa, blessing them with royal authority over the earth and ultimate spiritual liberation, while directing them to marry Mārishā, the daughter of the trees, to propagate life.