భాగవత మహా పురాణము
16 - పృథూపాఖ్యానము - పృథువుయొక్క కీర్తిప్రతిష్ఠలు
మైత్రేయ ఉవాచ ।
ఇతి బ్రువాణం నృపతీం గాయకా మునిచోదితాః ।
తుష్టువుస్తుష్టమనసస్తద్వాగమృత సేవయా ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథు మహారాజుయొక్క అమృతమువంటి ఈ మాటలను విన్న గాయకుల మనసులు సంతోష ముతో నిండిపోయెను. మహర్షులచే ప్రేరేపించబడినవారై ఆ గాయకులు ఇట్లు స్తుతించిరి.
నాలం వయం తే మహిమానువర్ణనే
యో దేవవర్యోవతతార మాయయా ।
వేనాంగజాతస్య చ పౌరుషాణి తే
వాచస్పతీనామపి బభ్రముర్ధియః ॥
నీవు దేవతోత్తముడవగు శ్రీహరివి. నీవు - మాయాశక్తిచే (మా యాశక్తియగు అర్చిస్సుతో గూడి) అవతరించితివి. నీ ప్రభావముల విషయ ములో గొప్ప జ్ఞానులగు బ్రహ్మాదుల బుద్ధులు కూడ భ్రమలో పడుచుండు ను. అట్టి నీ మహిమలను వర్ణించుటకు మేము సమర్థులము కాము.
అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః
కలావతారస్య కథామృతాదృతాః ।
యథోపదేశం మునిభిః ప్రచోదితాః
శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి ॥
అయినప్పటికీ మీ గాథ అనే అమృతమునందు మాకు ఆదరము గలదు. కావున, మేము మహర్షుల ఉపదేశమును అతిక్రమించకుండగా వారిచే ప్రేరితులమై పృథు మహారాజు (మీ) యొక్క కొనియాడదగిన కర్మ లను విస్తారముగా వర్ణించెదము. శ్రీహరియొక్క అంశావతారమగు మీ కీర్తి చాల గొప్పది.
ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేనువర్తయన్ ।
గోప్తా చ ధర్మ సేతూనాం శాస్తా తత్పరిపంథినామ్ ॥
ధర్మమును పాలించువారిలో ఉత్తముడగు ఈ పృథు మహారాజు జనులను ధర్మమునందు ప్రవర్తిల్ల జేయును. ఈయన ధర్మమర్యాదలను రక్షించి, ధర్మమునకు విఘాతమును కలిగించు వారలను శిక్షించగలడు.
ఏష వై లోకపాలానాం బిభర్త్యెకస్తనౌ తనూః ।
కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్షితమ్ ॥
ఈతడు ఒక్కడే తన శరీరమునందు ఆయా కాలములలో ఆయా రాజకార్యములకు అనురూపముగా లోకపాలకుల మూర్తులను నిశ్చయ ముగా ధరించును. ఈతడు అట్లు చేయుట వలన ఇహలోక (వర్షము వలన) పరలోకము (యజ్ఞము ద్వారా) లకు రెండింటికీ హితమును చేగూర్చును.
వసు కాల ఉపాదత్తే కాలే ఊయం ఏముంచతి ।
సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభుః ॥
సూర్యుడు సర్వమును ప్రకాశింప జేయుచూ, సకలప్రాణులకు ప్రకాశమును శక్తిని సమానముగా ఇచ్చును. ఒక కాలములో నీటిని పైకి లాగివేసి, మరియొక కాలములో వర్షము రూపములో జనులకు ఇచ్చును. సర్వసమర్థుడగు ఈతడు కూడ సూర్యుని వలె ప్రకాశిస్తూ, ఒక కాలములో పన్నును వసూలు చేసి, మరియొక కాలములో ఆ ధనమును. ప్రజల క్షేమ మునకే వినియోగించును. ఈతడు కూడ సకలజనుల యెడల పక్షపాతము లేని విధముగా వ్యవహరించును.
తితిక్షత్యక్రమం వైన్య ఉపర్యాక్రమవామపి ।
భూతానాం కరుణశ్శశ్వదార్తానాం క్షితవృత్తిమాన్ ॥
భూమి తనను తొక్కే జనుల యోగ్యప్రవృత్తిని నిరంతరముగా పహించుచుండును. అదే విధముగా దయాళువగు ఈ వేనపుత్రుడు, దీనులు తన మీద పడిపోతున్నా, వారి అపరాధములను కూడ అన్ని కాల ములలో ఓపికతో సహించును.
దేవేవర్షత్యసౌ దేవో నరదేవవపుర్హరిః ।
కృచ్ఛ్రప్రాణాః ప్రజా హ్యేష రక్షిష్యత్యంజ సేంద్రవత్ ॥
వర్షములు కురవక ప్రాణసంకటమును పొందియున్న ప్రజలను ఈతడు ఇంద్రుని వలె తేలికగా రక్షించగలడు. ఏలయనగా, ఈతడు మహా రాజు రూపములోనున్న శ్రీహరియే.
ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తినా ।
సానురాగావలోకేన విశదస్మితచారుణా ॥
వెన్నెలవంటి స్వచ్చమగు నవ్వుతో, వెన్నెలవలె చల్లనైన ప్రేమను ఒలకబోసే ఈతని సుందరమగు ముఖము అమృతనిధానమగు చంద్రుని పోలియున్నది. ఈతని ముఖమును దర్శించుటచే జనులకు ఆహ్లాదము కలుగును.
అవ్యక్తవ్మిష నిగూఢకార్యో
గంభీరవేధా ఉపగుప్తవిత్తః ।
అనంతమాహాత్మ్యగుణెకధామా
పృథుః ప్రచేతా ఇవ సంవృతాత్మా ॥
వరుణుని (సముద్రుని) మార్గము జనులకు తెలియదు. సము ద్రము చాల గంభీరముగా నుండును. దాని లోతులలో రత్నములు దాగియుండును. అనంతునకు నివాసమగు సముద్రము అనంతమగు మహి మలు గలది. ఈ పృథు చక్రవర్తి కూడ ఆ వరుణుని (సముద్రుని) వంటివాడే. ఏలయనగా, ఈతని ప్రవృత్తి జనులకు తెలిసిపోయేది కాదు. ఈయన ప్రజాకార్యములను నిశ్శబ్దముగా చేయుచుండును. వాటి ఫలము కనబడ నంతవరకు ఆయన ఆ కార్యములను చేయుచున్నాడని ఊహించుటయై ననూ జనులకు సంభవము కానంత రహస్యముగా ఈయన కార్యములను నిర్వర్తించును. ఈయన రాజ్యసంపదను భద్రముగా కాపాడును. అనంతుని అంశయగు ఈతని ప్రభావము కూడ అనంతమే. సకలసద్గుణములకు ఏకైక నిధానమగు ఈ పృథువు చేసే ఆలోచనను ముఖకవళికలను బట్టి ఊహించుట అసంభవము,
దురాసదో దుర్విషహ ఆసన్నోపి విదూరవత్ ।
నైవాభిభవితుం శక్యో వేసారణ్యుత్తితోకనలః ॥
ఈ పృథువు వేనుడు అనే అరణి (నిప్పును మథించే కట్టె) నుండి పుట్టిన అగ్ని, శత్రువులకు ఈతనిని సమీపించుట గాని, ఈతని ప్రతాప మును సహించుట గాని సంభవము కాదు. ఈతడు గొప్ప పరాక్రమశాలి యగుటచే శత్రువులకు దగ్గరగా ఉన్నా, చాల దూరములోనున్న వానితో సమానము. కావున, శత్రువులీతనిని పరాభవించుటకు అవకాశము లేనే లేదు.
అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ।
ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినామ్ ॥
ఈతడు వాయువు వంటివాడు. అంతటా సంచరించే వాయువు సకలప్రాణుల లోపల అంతర్యామియై తన సన్నిధిలో ఘటిల్లే సకలచేష్ఠ లను నిర్వికారముగా కేవలసాక్షియై దర్శించుచుండును. అదే విధముగా, ఈతడు జనులు బహిరంగముగా చేసే పనులను, రహస్యముగా చేసే పనులను కూడ చారుల ద్వారా కని పెట్టియుండును. ఉన్నతమగు సింహాస నము (రాజ్యాధికారము) ను అధిష్ఠించి ఉండే ఈ పృథువు జనుల నిందా స్తుతులలో నిర్వికారుడై కేవలసాక్షిగా రాజకార్యములను చక్కబెట్టును.
నాదండ్యం దండయత్యేష సుతమాత్మద్విషామపి ।
దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థితః ॥
ఈతడు యమధర్మరాజు వలె ధర్మమును ఖచ్చితముగా పాలిం చును. యమునకు ప్రాణుల యెడల పక్షపాత బుద్ధి లేదు. ఈతడు కూడ అదే విధముగా, శిక్ష పడకూడని వ్యక్తి తన శత్రువుల పుత్రుడే అయినా, శిక్ష వేయకుండగా విడిచి పెట్టును. శిక్ష పడదగిన వ్యక్తి తన కొడుకే అయినా, శిక్షించి తీరును.
అస్యాప్రతిహతం చక్రం పృథీరామానసాచలాత్ ।
వర్తతే భగవానరో యావత్తపతి గోగణైః ॥
ఈ పృథువుయొక్క విరాటంకమగు శాపనము (సైన్యము, లేక రథగమనము) మానస పర్వతము వరకు వ్యాపించును. సూర్యుడు తన కిరణముల సమూహములతో ప్రకాశించేది కూడ అంతవరకు మాత్రమే.
రంజయిష్యతి యల్లోకమయమాత్మవిచేష్టితైః ।
అథాముమాహూ రాజానం మనోరంజనకైః ప్రజాః ॥
ఈతడు ప్రజల మనస్సునకు ఆహ్లాదమును కలిగించే తన కార్య ముల ద్వారా జనులను రంజింపజేయును. ఆ కారణముచే ఈతనిని జనులు రాజు (రంజింప జేయువాడు) అని సార్థక నామముతో పిలిచెదరు.
దృఢవ్రతస్సత్యసంధో బ్రహ్మణ్యే వృద్ధ సేవకః ।
శరణ్యస్సర్వభూతానాం మానదో దీనవత్సలః ॥
సత్యమునకు కట్టుబడి ఉండే ఈతడు దృఢమగు నిష్ఠను, వేదవే త్తల యెడల భక్తిని కలిగియుండును. ఈతడు పెద్దలను సేవిస్తూ, సకలప్రా ణులకు శరణు కాగలడు. ఇతరులకు మర్యాదనిచ్చే ఈ పృథువు దీనుల యెడల ప్రేమను కలిగియుండును.
మాతృభక్తిః పరస్త్రీము పత్యామర్ధ ఇవాత్మనః ।
ప్రజాసు పితృవత్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవిదినామ్ ॥
ఈతడు పరభార్యలయందు-తల్లియందు వలే భక్తిని కలిగియుండు ను తన భార్యను తన శరీరములో సగభాగమును వలే ప్రేమించును. ప్రజ లను తండ్రివలే ప్రేమించును. వేదవేత్తలకు సేవకునివలె సేవను చేయును.
దేహినామాత్మవత్సేషన్సుహృదాం నందివర్ధనః ।
ముక్తసంగప్రసంగోరియం దండపాణిరసాధుపు ॥
ప్రాణులకు ఆత్మవలె మిక్కిలి ప్రియమైన ఈతడు మిత్రుల ఆనం దమును వర్ధిల్ల జేయును. సర్వసంగపరిత్యాగులతో సత్సంగము చేసే ఈతనికి ముక్తసంగుడగం శ్రీహరియందు భక్తి మెండు. ఈతడు దుష్టుల యెడల దండపాణియగు యమునివంటి వాడు.
అయం తు సాక్షాద్భగవాంస్త్ర్యధీశః
కూటస్థ ఆత్మా కలయావతీర్ణః ।
యస్మిన్నవిద్యారచితం నిరర్థకం
పశ్యంతి నానాత్వమపి ప్రతీతమ్ ॥
నిర్వికారుడు, సకలప్రాణుల ఆత్మరూపుడు, ముల్లోకములకు నాథుడు అగు శ్రీహరి భగవానుడే సాక్షాత్తుగా ఈతని రూపములో అంశచే అవతరించినాడు. శక్తిరూపిణియగు లక్ష్మీదేవి కూడ అర్చిస్సు రూపములో అవతరించినది. ప్రపంచము రూపములో కానవచ్చే ఈ భేదజాతము సత్త్వ రజస్తమోగుణాత్మకమగు ప్రకృతికి అధీశ్వరుడగు ఆయనయందే లేకు, న్ననూ ప్రకాశించుచున్నది. ఇట్టి నానాత్వము అజ్ఞానముచే కల్పించబడిన దనియు, అవాస్తవమనియు మహాత్ములు దర్శించుచున్నారు.
అయం భువో మండలమోదయాద్రేః
గో పైకవీరో నరదేవనాథః ।
ఆస్థాయ జైత్రం రథమాత్తచాపః
పర్యస్యతే దక్షిణతో యథార్కః ॥
రాజాధిరాజగు ఈ పృథువు సాటిలేని వీరుడు. ఈతడు భూమండలమును ఉదయపర్వతము వరకు రక్షించును. ఈతడు జయప్రదమగు రథ మునెక్కి ఉద్యతమగు ధనస్సు గలవాడై, సూర్యుడు వలే భూమండ లమును ప్రదక్షిణము చేయును.
అస్మై నృపాలాః కిల తత్ర తత్ర
బలిం హరిష్యంతి సలోకపాలాః ।
మంస్యంత ఏషాం స్త్రీయ ఆదిరాజం
చక్రాయుధం తద్యశ ఉద్ధరంత్యః ॥
ఈయన సామ్రాజ్యములో సంచరించుచుండగా అక్కడక్కడ లోక పాలకులు ఈయనకు పూజోపహారములను, రాజులు కప్పములను సమర్పించెదరు. ఆదిరాజగు ఈతడు సాక్షాత్తుగా చక్రాయుధుడగు శ్రీహరియే నని వారి పత్నులు ఈయన కీర్తిని గానము చేయుదురు.
అయం మహీం గాం దుదు హేధిరాజః
ప్రజాపతిర్వృత్తికరః ప్రజానామ్ ।
యో లీలయ్యాద్రీన్ స్వశరాసకోట్యా
భిందన్ సమాం గామకరోద్యథేంద్రః ॥
రాజాధిరాజగు ఈయన ప్రజలను పాలిస్తూ వారికి జీవికను కల్పిం చును. ఈయన ఆవు రూపములోనున్న భూమినుండి సకలసంపదలను పితుకును. ఈయన ఇంద్రుడు వలె తన ధనస్సు కొనతో అవలీలగా పర్వత ములను పగులగొట్టి భూమిని సమతలముగా చేయును.
విస్పూర్ణయన్నాజగవం ధనుస్స్వయం
యదాచరత్క్ష్మ మవిషహ్యమాజా ।
తదా నిలిల్యుర్దిశి దిశ్యసంతో
లాంగూలముద్యమ్య యథా మృగేంద్రః ॥
సింహము తోకను పైకి ఎత్తి అడవిలో సంచరించే సమయములో క్షుద్రమృగములు నలు దిక్కులకు పారిపోయి దాగుకొనును. అదే విధ ముగా పృథువు మేక కొమ్ము ఆవు కొమ్ములతో చేసిన ధనస్సును పట్టుకొని యుద్ధరంగములో అడుగు పెట్టినప్పుడు ఆయన ఎదుట నిలబడుట శత్రు వులకు సంభవము కాదు. ఆయన అట్టి ధనస్సును టంకారము చేయుచూ భూమండలమును సంచరించునప్పుడు, దుష్టులు నలు దిక్కులలో చెల్లా చెదరై దాగుకొనేదరు.
ఏషోశ్వమేధాన్ శతమాజహార
సరస్వతీ ప్రాదురభావి యత్ర ।
అహారషీద్యస్య హయం పురందరః
శతక్రతుశ్చరమే వర్తమానే ॥
ఈతడు సరస్వతీ నది పుట్టిన చోట వంద అశ్వమేధ యాగము లను చేయును. వంద యజ్ఞములను చేసి శత్రువుల నగరములను పగుల గొట్టిన ఇంద్రుడు, వందవ యాగము జరుగుచుండగా, ఈతని గుర్రమును అపహరించును.
ఏష స్వసద్మోపవనే సమేత్య
సనత్కుమారం భగవంతమేకమ్ ।
ఆరాధ్య భక్త్యాలభతామలం తజ్-
జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి ॥
ఈతడు తన ప్రాసాదమునకు ఆనుకొనియున్న ఉద్యాన వనములో పూజ్యుడు, సాటి లేనివాడు అగు సనత్కుమారుని ఒంటరిగా కలుసుకొని, ఆయనను భక్తితో ఆరాధించి శుద్ధమగు ఆత్మజ్ఞానమును పొందును. ఈ జ్ఞానమును పొందినవారు బ్రహ్మీభూతులగుదురు.
తత్ర తత్ర గిరస్తాస్తా ఇతి విశ్రుతవిక్రమః ।
శ్రోష్యత్యాత్మాశ్రితా గాథాః పృథుః పృథుపరాక్రమః ॥
ఈతడు లోకప్రఖ్యాతి గాంచిన గొప్ప ధైర్యసాహసములు గలవా డు. ఈయనకు అక్కడక్కడ ఈ తీరున వర్ణించబడే తనకు సంబంధించిన ఆయా గాథలు వినబడుచునే యుండును.
దిశో విజిత్యాకప్రతిరుద్ధచక్రః
స్వతేజసోడ్పాటితలోకశల్యః ।
సురాసురేందైరుపగీయమాన-
మహానుభావో భవితా పతిర్భువః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే
పృథుకీర్తివర్ణనం నామ షోడశోఽధ్యాయః॥
ఈ పృథువుయొక్క శాసనమునకు (సైన్యమునకు, రథచక్రముల గమనమునకు) అడ్డు లేదు. ఈతడు జనకంటకులగు దుష్టులను సంహరించి జనుల కష్టములను తొలగించును. ఈతని కీర్తిని దేవనాయకులే గాక, అసురనాయకులు కూడ కీర్తించెదరు. ఈతడు దిక్కులను జయించి భూమికి ప్రభువు కాగలడు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి నాల్గవ స్కంధములో పృథూపాఖ్యానములో పృథువుయొక్క కీర్తిప్రతిష్ఠలను వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
The professional reciters in the royal court delivered prophetic praises glorifying the upcoming achievements of King Pṛthu. They predicted his absolute protection of citizens, his boundless generosity toward the needy, his subdual of all evil elements, and his establishment of universal agricultural and spiritual prosperity. Pleased with their divinely inspired words, King Pṛthu rewarded the reciters and commenced his noble reign with complete dedication to the welfare of all living beings.