3 - సతీ పరమేశ్వరుల సంవాదము

మైత్రేయ ఉవాచ

 సదా విద్వేషతో రేవం కొలో వైద్రియమాణయోః

జామాతుశ్శ్వశురస్యాపి సుమహానతిచక్రమే

మైత్రేయ మహర్షి ఇట్లు పలికేను --- దక్షుడు మామగారు. శివుడు అల్లుడు. వారిద్దరి మధ్యలో విద్వేషము అదే విధముగా కొనసాగుతుండగా, చాల కాలము గడిచేను.

యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా

ప్రజాపతీనాం సర్వేషామాధిపత్యే స్మయోభవత్

దేవాధిదేవుడగు బ్రహ్మగారు దక్షుని ప్రజాపతులందరిపై అధిప తిగా అభిషేకించెను. అప్పుడు దక్షునకు గర్వము కలిగెను.

 ఇష్ట్వా స వాజపేయేన బ్రహ్మిష్ఠానభిభూయ చ

బృహస్పతిసవం నామ సమారభే క్రతూత్తమమ్

ఆ దక్షుడు వాజపేయయాగమును చేసెను. గర్వించియున్న కార ణముగా ఆతడు బ్రహ్మనిష్ఠులను అవమానించెడివాడు. ఆతడు వాజపే యము తరువాత బృహస్పతిసవము అనే యజ్ఞమును చేయుటకు ఉపక్రమించెను.

తస్మిన్ బ్రహ్మర్షయస్సర్వే దేవర్షిపితృదేవతాః

ఆసన్ కృతస్వస్త్యయనాస్తత్పత్న్యశ్చ సభర్తృకాః

బ్రహ్మర్షులు, దేవర్షులు, మరియు తమ తమ భార్యలతో కూడియున్న అందరు పితృదేవతలు ఆ యజ్ఞమునకు విచ్చేసిరి. ఆ దంప తులందరు మంగళకార్యములను పూర్తి చేసుకుని సత్కారమును స్వీకరించి యుండిరి.

తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతామ్

సతీ దాక్షాయణీ దేవీ పితుర్యజ్ఞమహోత్సవమ్

ప్రజతీస్సర్వతో దిగ్భ్య ఉపదేవవరస్త్రియః

 విమానయానాస్సప్రేష్టా నిష్కకంఠీస్సువాససః

దృష్ట్వా స్వనిలయాభ్యాశే లోలాక్షీరృష్టకుండలాః

పతిం భూతపతిం దేవమౌత్సుక్యాదభ్యభాషత

గంధర్వులు మొదలగు ఉపదేవతలు ఆకాశమార్గములో వెళ్లుచు న్నవారై ఆ దక్షుని యజ్ఞము అనే మహోత్సవమును గురించి కబుర్లు చెప్పుకొనుచుండగా, దక్షపుత్రికయగు సతీదేవి వినెను, ఆకాశములో అన్ని దిక్కులనుండి అందగత్తెలగు ఆ ఉపదేవతల భార్యలు, మెడలో పచ్చలను పెట్టుకొని, కొత్త చీరలను కట్టుకొని, గొప్పగా ప్రకాశించే కుండలములను ధరించి, విమానములపై నెక్కి, చంచలమగు నేత్రములతో అన్ని వైపులకు చూస్తూ, తమ భర్తలతో కలిసి యజ్ఞమునకు వెళ్లుచుండిరి. సతీదేవి తన మకామునకు సమీపములో ఆకాశములో వారినందరినీ చూచెను. అపుడామె ఉత్కంఠతో, భూతపతి మరియు తనకు భర్త అగు శివదేవునితో నిట్లు పలికెను.

సత్యువాచ

ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం

నిర్యాపితో యజ్ఞమహోత్సవః కిల

వయం చ తత్రాభిసరామ వామ తే

యద్యర్థిత్వామీ విబుధా ప్రజంతి హి

సతీదేవి ఇట్లు పలికెను --- ఓయీ చతురా! వామదేవా! నీ మామ గారగు దక్ష ప్రజాపతి యజ్ఞమును గొప్ప ఉత్సవముగా చేయుచున్నాడు. నీకు ఇష్టమైనచో, నీకు నా కోరిక అంగీకారమైనచో, మనము కూడ అచ్చ టకు వెళ్లేదము. ఏలయనగా, దేవతలింకనూ యజ్ఞమునకు వెళ్లుచునే యున్నారు సుమా! (ఇంకను సమయము మించిపోలేదు).

తస్మిన్ భగిన్యో మమ భర్తృభిస్సకై-

 ర్ద్రువం గమిష్యంతి సుహృద్గదృక్షవః

 అహం చ తస్మిన్ భవతాభికామయే

సహోపవీతం పరిబర్హమర్షితుమ్

నా అక్కలు చెల్లెళ్లు బంధుమిత్రులను చూడగోరువారై, తమ తమ భర్తలతో గూడి ఆ యజ్ఞమునకు తప్పక వెళ్లెదరు. నేను కూడ నీతో కలిసి వెళ్లి, యజ్ఞములో మా తల్లిదండ్రులు ఇచ్చే కానుకలను స్వీకరించగోరుచున్నాను.

తత్ర స్వసౄర్మే నను భర్తృసంమితా  

మాతృష్వసః క్లిన్నధియం చ మాతరమ్

 ద్రక్ష్యే చిర్త్కంఠమనా మహర్షిభి

రున్నీయమానం చ మృడాధ్వరధ్వజమ్

సుఖప్రదుడవగు ఓ శీవా! బంధువులను చూడాలనే తహతహ నాకు చాల కాలమునుండియు ఉన్నది. నేను అక్కడ నా అక్కచెల్లెళ్లను, మా అమ్మగారి అక్కచెల్లెళ్లను, ప్రేమార్ద్రహృదయురాలగు మా అమ్మగారి ని, మహర్షులచే నిర్వర్తించబడే ఉత్కృష్టమగు యజ్ఞమును, దానిలో నిల బెట్టబడే యూపమును, ఎగురవేయబడే ధ్వజమును కూడ చూచెదను సుమా!

త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా

వినిర్మితం భాతి గుణత్రయాత్మకమ్

తథాప్యహం యోషీదతత్త్వవిచ్చ తే

 దీనా దిదృక్షే భవ మే భవక్షితిమ్

పుట్టుక లేని ఓ భవా (అఖండసత్తా స్వరూపా)! సత్త్వరజస్తమోగు ణాత్మకము, అద్భుతము అగు ఈ జగత్తు నీచే నీ మాయాశక్తిచే నీయందు నిర్మించబడి నీయందే ప్రకాశించుచున్నది. కాని, నేను నీ తత్త్వమునెరుం గని దీనురాలనగు యువతిని. నేను పుట్టి పెరిగిన స్థానమును చూడగోరు చున్నాను.

పశ్య ప్రయాంతీరభవాన్యయోషితో-

త్యలంకృతాః కాంతసఖా వరూథశః

యాసాం వ్రజస్బిశితికంఠ మండితం

నభో విమానైః కలహంసపాండుభిః

ఓ శివా! నీకు పుట్టుక లేదు. కావున, బంధువియోగము నీకు తెలి యదు. ఇతరుల కొరకై విషమునైననూ భక్షించుటకు సిద్దపడే నీ దయాహృ దయమును నీ నల్లని కంఠము సూచించుచున్నది. ఆకాశము కేసి చూడుము. దేవతాస్త్రీలు దక్షునకు బంధువులు కాకున్ననూ, గొప్పగా అలంకరించుకుని భర్తలతో గూడి గుంపులుగా యజ్ఞమునకు వెళ్లుచున్నారు. వారు వెళ్లుచుండగా, రాజహంసలవలె తెల్లనైన వారి విమానములచే ఆకాశము. అలంకరించబడియున్నది.

కథం సుతాయాః పితృగేహకౌతుకం

నిశమ్య దేహస్సురవర్య నేంగతే

 అనాహుతా అప్యభియాంతి సౌహృదం

భర్తుర్గురోర్దేహకృతశ్చ కేతనమ్

దేవతోత్తముడవగు ఓ శివా! తండ్రిగారి ఇంటిలోని ఉత్సవమును గురించి విన్న తరువాత కూడ నా ఈ దేహము కదలకుండా ఇక్కడనే ఉండుట యెట్లు కుదురును? మిత్రుడు, భర్త, గురువు మరియు తల్లిదం డ్రులు అనువారల ఇళ్లకు జనులు ఆహ్వానము లేకున్ననూ వెళ్లేదరు.

తన్మే ప్రసీదేదమమర్త్య వాంఛితం

కర్తుం భవాన్ కారుణికో బతార్హతి

 త్వయాత్మనోధేహమదభ్రచక్షుషా

నిరూపితా మాకనుగృహాణ యాచితః

ఓ దేవా! నాపై ప్రసన్నుడవు కమ్ము. నీవు దయాళుడవు. నా కోర్కెను నిశ్చయముగా నేరవేర్చుము. నీవు సర్వజ్ఞుడవు. నన్ను నీ అర్ధభా గములో స్థాపించియున్నావు. నేను నిన్ను కోరుచున్నాను. కావున, నన్ను అనుగ్రహించుము.

ఋషిరువాచ

 ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః

ప్రత్యభ్యధత్త ప్రహసన్ సుహృతియః

సంస్మారితో నుర్మభిదః కువాగిషూన్

యానాహ కో విశ్వసృజాం సమక్షతః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ప్రియురాలగు పార్వతి యొక్క ఈ ప్రార్థనను విన్న శివునకు దక్ష ప్రజాపతి ఇతరప్రజాపతుల సమక్ష ములో పలికిన హృదయవిదారకములగు బాణములవంటి చెడు పలుకులు గుర్తుకు వచ్చేను. మంచి హృదయము గలవారలకు మేలు చేసే కైలాసాధి పతియగు ఆ శివుడు నవ్వి, ఆమెకు ఇట్లు సమాధానమునిచ్చెను.

శ్రీభగవానువాచ

 త్వయోధితం శోభనమే శోభనే

అనాహుతా అప్యభియంతి బంధుషు

తే యద్యనుత్పాదితదోషదృష్టమో

బలీయసావనాత్మ్యమదేన మన్యునా

ఓ సుందరీ! నీవు చెప్పిన మాట బాగుగనే యున్నది. బంధువుల ఇంటికి ఆహ్వానము లేకున్ననూ వెళ్లవచ్చును. కొందరు అనాత్మయగ దేహాదులయందు అభిమానము గలవారై, దర్పముచే మరియు క్రోధముచే దోషదృష్టిని కలిగి యుందురు. మన బంధువులు అట్టివారు కానప్పుడు మాత్రమే నీ అభిప్రాయము సరియగును. బంధువులు అట్టివారై యుండ గా, మనము ఆహ్వానము లేకుండగా వెళ్లరాదు.

విద్యాతపోవిత్తవపుర్వయఃకులై-

స్సతాం గుణేషడ్భిరసత్తమేతరైః

 స్మృతా హతాయాం భృతమానదుర్దృశః

స్తబ్ధా న పశ్యంతి హి ధామ భూయసామ్

చదువు, తపస్సు, సంపద, అందము, యౌవనము, కులము అను ఆరు గుణములు సత్పురుషులకు శోభనిచ్చును. కాని, ఇవే గుణములు పరమదుష్టులయందు ఉన్నచో, అవి వారి అహంకారమునే బలోపేతముగా చేసి, వారి వివేకజ్ఞానమును నశింపజేయును. అప్పుడు వారి ఆలోచించే విధానము దుష్టముగా తయారగును. అట్టి గర్విష్ఠులు మహాత్ముల గొప్పద నమును కనజాలరు.

నైతాదృశానాం స్వజనవ్య పేక్షయా

గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనామ్

 యేకభ్యాగతాన్ వక్రధియాకభిచక్షతే

ఆరోపితభూభిరమర్షణాక్షిభిః

అస్థిరమగు చిత్తము గల ఈ దక్షుడు మొదలగువారి ఇంటి దరిదా పులకైననూ, వీరు నా బంధువులు అనే భావముతో వెళ్లరాదు. ఏలయనగా, వీరు ఇంటికి వచ్చినవారిని వక్రబుద్దీతో కనుబొమలను పైకెత్తి కోపముతో నిండిన కన్నులతో కన్నులలోనికి చూచెదరు (అవమానించెదరు).

తథాకరిభిర్న వ్యథతే శిలీముఖై-

శ్శేతేకఠితాంగో హృదయేన దూయతా

స్వానాం యథా వక్రధియా దురుక్తిభి-

ర్దివానిశం తప్యతి మర్మతాడితః

వక్రమగు బుద్ధిగల తన బంధువులే చెడ్డ మాటలు అనే బాణ ములతో హృదయమునందు కొట్టినప్పుడు, ఆ వ్యక్తి బాధాతప్తహృద యుడై రాత్రింబగళ్లు చాల దుఃఖముననుభవించును. శత్రువులచే బాణము లతో శిథిలము చేయబడిన అవయవములు గలవాడై మంచము మీద పడి యున్న వ్యక్తియైననూ మనస్సులో అంతటి దుఃఖముననుభవించడు.

 వ్యక్తం త్వముత్కృష్టగతేః ప్రజాపతేః

ప్రియాత్మజానామపి సుభ్రు సంవతా

 అథాపి మానం న పితుః ప్రపత్స్యసే

మదాశ్రయాత్క పరితప్యతే యతః

ఓ సుందరీ పార్వతీ! దక్ష ప్రజాపతి ఉన్నతమైన స్థితి గలవాడు. ఆయనకు కుమార్తెలందరియందు ప్రీతి గలదు. నీయందు అధికమగు ప్రీతి గలదు. ఇది నిశ్చయము. ఈ విషయము నాకు కూడ తెలియును. కాని, నీకు తండ్రి ఈయదగిన మర్యాద (గౌరవము) లభించదు. ఏలయనగా, నీకు నేను భర్తనై యుండుట కారణముగా, దక్ష ప్రజాపతి చాల తాపమును అనుభవించుచున్నాడు.

పాప్యమానేన హృదాతురేంద్రియ-

 స్సమృద్ధిభిః పూరుషబుద్ధిసాక్షిణామ్

అకల్ప ఏషామధిరోడుమంజసా

పదం పరం ద్వేష్టి యథాసురా హరిమ్

దక్షుడు ద్వేషముతో నిండిన హృదయములో మిక్కిలి తాపమును పొందుచున్నాడు. ఆతని ఇంద్రియములు దుఃఖముచే కల్లోలితములగుచు న్నవి. సకలజీవుల బుద్దులకు సాక్షిగా ఉండే ఆత్మచైతన్యమునందు నిష్ఠ గల మహాత్ములు పొందే పరమపదము (మోక్షము) ను, ఆతడు తన వద్ద ఉండే లౌకికసంపదలతో తేలికగా పొందలేడు. ఈ అసమర్థత ఆతని ద్వేష మును, ఇనుమడింపజేసినది. కావున, ఆతడు అసురులు శ్రీహరిని ద్వేషించే విధముగా, కేవలము ద్వేషభావమును మాత్రమే మనస్సులో నింపుకొని యున్నాడు.

ప్రత్యుద్ధమప్రశ్రయణాభివాదనం

విధీయతే సాధు మిథస్సుమధ్యమే

 ప్రాజైః పరస్మై పురుషాయ చేతసా

గుహాశయాయైవ న దేహమానివే

ఓ సుందరీ పార్వతీ! సమాజములోని జనులు ఒకరినొకరు కలిసిన ప్పుడు ఎదురేగి ప్రేమతో మాటలాడి నమస్కరించెదరు. మహాత్ములు ఈ క్రియలనన్నింటినీ మానసికముగా, సర్వాంతర్యామి పరమపురుషుడు అగు పరమేశ్వరుని విషయములో చక్కగా చేయుచునే యుందురు. కొని, మహా త్ములు దేహాభిమానులగు అజ్ఞానుల యెడల ఈ క్రియలను చేయరు.

సత్త్వం విశుద్ధం వసుదేవశబ్దితం

యదీయతే తత్ర పుమానపావృతః

సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో

హ్యధోక్షజో మే నమసా విధీయతే

రజస్తమోగుణముల సంపర్కము లేక కేవలసత్త్వగుణప్రధాన ముగా నుండుట వలన అంతఃకరణము శుద్దమగును. అట్టి పరిశుద్దమగు అంతఃకరణమునందు అవిద్యయొక్క ఆవరణము తొలగిపోయి, పరమేశ్వరుడు ఆత్మరూపముగా ప్రకాశించును. కావుననే, అట్టి అంతఃకరణమునకు వసుదేవ అని వ్యవహారము కలిగినది. అట్టి అంతఃకరణములో ప్రకాశించే భగవానుడు వాసుదేవుడైనాడు. ఆయన ఇంద్రియములకు గోచరము కాడు. ఇంద్రియములు ఉపసంహరించబడి (ఇంద్రియజ్ఞానము మిథ్యయని నిరాక రించబడి), మనస్సు తన స్వరూపమునందు విలీనము. కాగా ఆ ఈశ్వ రుడు ఆత్మరూపుడై గోచరించును. కావుననే, ఆయన అధోక్షజుడైనాడు. అట్టి పరమేశ్వరుని నేను నా అంతఃకరణమునందు నమస్కారాదులచే సేవించుచునే యుందును.

తత్తే నిరీక్ష్యో న పీతాపి దేహకృద్దక్షో

మమ ద్విట్ తదనువ్రతాశ్చ యే

యో విశ్వసృగ్యజ్ఞగతం వరోరు మా-

మనాగసం దుర్వచసాకకరోత్తిరః

ఓ సుందరీ! కావున, దక్షుడు. నీకు దేహమునిచ్చిన తండ్రియే అయిననూ, ఆతడు నన్ను ద్వేషించుచున్నవాడు గనుక, నీవు వెళ్లి ఆతనిని గాని, ఆతని అనుయాయులను గాని చూడదగదు. నేను ప్రజాపతుల యజ్ఞ మునకు వెళ్లితిని. అక్కడ నేను ఆచరించిన దోషమేమియు లేదు. అయిన నూ, ఆతడు నన్ను చెడు మాటలతో అవమానించినాడు.

యది ప్రజిష్యస్యతిహాయ మద్వచో

భద్రం భవత్యా న తతో భవిష్యతి

సంభావితస్య స్వజనాత్పరాభవో

యదా స సద్యో మరణాయ కల్పతే

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ఉమారుద్రసంవాదో నామ తృతీయోఽధ్యాయః

నీవు నా మాటను ఉల్లంఘించి వెళ్లినచో, నీకు అట్టి యాత్ర వలన కల్యాణము కలుగదు. సత్కారమును పొందే వ్యక్తికి తన వారి వలన పరాభ వము ఎదురైనచో, అది వెంటనే ఆ వ్యక్తియొక్క మరణమునకు హేతువు అగును.

శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో ఉమారుద్రసంవాదము అనే మూడవ అధ్యాయము ముగిసినది.