భాగవత మహా పురాణము
26 - పురంజనోపాఖ్యానము - పురంజనుడు పురంజనిని అనునయించుట
నారద ఉవాచ ।
స ఏకదా మహేష్వాసో రథం పంచాశ్వమాశుగమ్ ।
ద్వీషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురమ్ ॥
ఏకర శ్యేకదమనమేకనీడం ద్వికూబరమ్ ।
పంచప్రహరణం సప్తవరూథం పంచవిక్రమమ్ ॥
హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః ।
ఏకాదశచమూనాథః పంచప్రస్థమగాద్వనమ్ ॥
నారదుడిట్లు పలికెను - పురంజనుడు ఒకనాడు గోప్ప ధన స్సును, అక్షయములగు అంబుల పొదులను తీసుకొని, బంగరు కవచ మును దాల్చి, పదకొండుగురు సేనానాయకులు వెంట రాగా, రథమునెక్కి పంచప్రస్థమనే అడవికి వెళ్లాను. అయిదు గుర్రములను పూన్చిన ఆ రథము వేగముగా పరుగెత్తును. దానికి రెండు అడ్డకర్రలు, రెండు చక్రములు, ఒక ఇరుసు, మూడు జెండాలు, అయిదు కమ్మీలు, ఒక పగ్గము, ఒక ఆసనము, రెండు కాడిని గట్టే మ్రానులు, అయిదు అరలు (ఆయుధములు), ఏడు రక్ష ణకవచములు గలవు. ఒక సారథచే నడుపబడే ఆ రథము బంగరు అలంకా రములను కలిగియుండెను. దానికి అయిదు రకముల నడక గలదు.
చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషుకార్ముకః ।
విహాయ జాయామతదర్హాం మృగవ్యసనలాలసః ॥
దర్పముతోనున్న పురంజనునకు వేట అనే వ్యసనమునందు తీవ్ర మగు ఆసక్తి ఉండెను. ఆతడు విడిచి పెట్టకూడని భార్యను విడిచి పెట్టి ధన స్సును బాణములను తీసుకొని ఆ అడవిలో వేటాడెను.
ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః ।
న్యహనన్నిశితైర్బా గైర్వనేషు వనగోచరాన్ ॥
దయ లేని ఆ పురంజనుడు భయంకరాకారుడై క్రూరమగు రాక్షస ప్రవృత్తితో అడవిలో చెట్ల గుంపులలో తిరిగే జంతువులను వాడి బాణ ములతో కొట్టి చం పెను.
తీర్దేషు ప్రతిదృష్టషు రాజా మేధ్యాన్ పశూన్ వనే ।
యావదగ్ధమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే ॥
రాజు మాంసమునందు అధికమగు ఆసక్తి గలవాడైనచో, శాస్త్రవి హితములైన యజ్ఞము మొదలగు సందర్భములలో మాత్రమే అడవి యందు మాత్రమే పవిత్రములగు (నిషిద్ధములు కాని) పశువులను మాత్రమే వినియోగమున్నంత వరకు మాత్రమే సంహరించవలెనని నియమించబడినది. అనగా, విశృంఖలముగా పశువులను చంపరాదు.
య ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః ।
కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న స లిప్యతే ॥
ఓ మహారాజా! వివేకియగు మానవుడు నిత్యకర్మలను చేయుచు న్నచో, ఆతని అంతఃకరణము పరిశుద్ధమై ఆత్మజ్ఞానము ఉదయించును. దాని ప్రభావముచే ఆతనికి కర్మఫలముల లేపము (బంధము) ఉండదు.
అన్యథా కర్మ కుర్వాణో మానారూఢ నిబధ్యతే ।
గుణప్రవా హే పతితో నష్టప్రజ్ఞో ప్రజత్యధః ॥
అట్లు రాకుండా, నేను కర్తను అనే అభిమానావేశము గలవాడై కామ్యాది కర్మలను కూడ చేయు మానవుడు సంసారములో గట్టిగా బంధిం చబడును. అట్టి వాడు వివేకశక్తిని కోల్పోయి సత్త్వరజస్తమోగుణముల ప్రవాహరూపమగు సంసారములో పడి, అధోగతిని (పశుపక్ష్యాది జన్మను) పొందును.
తత్ర నిర్బిన్నగాత్రాణాం చిత్రవాజైశ్శిలీముఖైః ।
విప్లవో దుఃఖితానాం హి దుస్సహః కరుణాత్మనామ్ ॥
ఆ అడవిలో ఆ రాజు రంగురంగుల రెక్కలు గల వాడి బాణము లతో పశువుల అవయవములను తెగగొట్టుచుండగా, అవి గొప్ప దుఃఖమును పొందినవి. ఆ సమయములో దయాహృదయులు చూచి సహించ లేని ప్రాణినాశము కలిగెను.
శశాన్ వరాహాన్మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ ।
మేధ్యానన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమమధ్యగాత్ ॥
పురంజనుడు కుందేళ్లను, అడవి పందులను, అడవి దున్నలను, గురుపోతులను, నల్లచారల దుప్పులను, ముళ్ల పందులను మరియు ఇత రములగు పవిత్రములైన పశువులను వేటాడుతూ అలసిపోయెను.
తతః క్షుత్తృటరిశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ ।
కృతస్నానోచితాహారస్సంవివేశ గతక్లమః ॥
తరువాత ఆ పురంజనుడు ఆకలి దప్పికలచే చాల అలిసిపోవు టచే వేటను విరమించి ఇంటికి చేరుకొని, స్నానమును చేసి, తగిన ఆహార మును తీసుకొని కూర్చుండగా, ఆతని శ్రమ తొలగిపోయెను.
ఆత్మానమర్హయాంచక్రే ధూపాలేపస్రగాదిభిః ।
సాధ్వలంకృతసర్వాంగో మహిష్యామాదధే మనః ॥
ఆతడు ధూపము, గంధపు పూత, పుష్పమాల మొదలగువాటిచే తనను తాను ముస్తాబు జేసుకొని, అవయవములన్నింటియందు చక్కటి ఆభరణములను ధరించెను. అపుడాతని మనస్సు భార్య పైకి పోయేను.
తృప్తా హృష్టస్సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః ।
న వ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధినీమ్ ॥
మిక్కిలి గర్వించియున్న పురంజనుడు ఆకలి తీరి హర్షమును పొందెను. అపుడాతని మనస్సు మన్మథునిచే ఆకర్షితమయ్యేను. ఇంటిని చక్కదిద్దే గొప్ప సుందరియగు ఆతని భార్య అపుడాతనికి కానరాలేదు.
అంతఃపురస్త్రీయోకపృచ్చద్విమనా ఇవ వేదిషత్ ।
అపి వః కుశలం రామా స్సేశ్వరీణాం యథా పురా ।
న తథైతరి రోచంతే గృహేషు గృహసంపదః ॥
ఓ బర్హిషత్ మహారాజా! భార్య కనబడక పోవుటచే పురంజనుని మనస్సు చెడినట్లాయెను. ఆతడు అంతఃపురమునందలి పరిచారికలనిట్లు ప్రశ్నించెను: ఓ యువతులారా! మీరు, మీ అమ్మగారు కులాసాయేనా? నేను వేటకు వెళ్లుటకు ముందు ఇంటిలోని సంపదలు ప్రకాశించిన విధముగా, ఇప్పుడు ప్రకాశించుట లేదు.
యది న స్యొద్గృహే మాతా పత్నీ వా పతిదేవతా ।
వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః కో నామాసీత దీనవత్ ॥
ఇంటిలో తల్లి గాని, భర్తయే దైవముగా గల భార్య గాని లేనిచో ఆ ఇల్లు విరిగిన అవయవములు గల రథము వంటిది. వివేకియగు వ్యక్తి ఎవ్వాడు అట్టి ఇంటిలో దీనుడు వలె ఉండును?
క్వ వర్తతే సా లలనా మజ్జంతం వ్యసనార్ణవే ।
యా మాముద్దరతే ప్రజ్ఞాం దీపయంతీ పదే పదే ॥
నేను కష్టముల సముద్రములో మునిగిపోవుచున్న సమయములో, ఆమె నాలో వివేకశక్తిని ఉద్బుద్ధము చేసి నన్ను ఉద్దరించును. అట్టి ఆ సుందరి ఎక్కడ నున్నది? -
రామా ఊచుః ।
నరనాథ న జానీమస్త్వతియా యద్వ్యవస్యతి ।
భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్ ॥
పరిచారికలు ఇట్లు పలికిరి --- ఓ మహారాజా! నీవు శత్రువులను సంహరించినవాడవు. నీ ప్రియురాలి నిశ్చయమేమో మాకు తెలియదు. ఆమె చాప లేని కటిక నేలపై పరుండియున్నది. చూడుము
నారద ఉవాచ ।
పురంజనస్స్వమహిషీం నిరీక్ష్యావధుతాం భువి ।
తత్సంగోన్మథితజ్ఞానో వైక్లబ్యం పరమం యయౌ ॥
నారదుడిట్లు పలికెను --- నేలపై పడియున్న తన భార్యను పురం జనుడు చూచెను. ఆమెతోడి సమాగమముచే ఆతని జ్ఞానము శిథిలమయ్యె ను. ఆతడామెను చూచి చాల ఆందోళనను చెందెను.
సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా హృదయేన విదూయతా । ప్రేయస్యాస్నేహసంరంభలింగమాత్మని నాభ్యగాత్ ॥
దుఃఖితమైన హృదయము గల పురంజనుడు మధురమగు వచన ములతో ఆమెను ఓదార్చుచుండెను. ఆమెకు కలిగిన ప్రణయకోపమునకు కారణమైన తన అపరాధమేమియో ఆతనికి తెలియరాలేదు.
అనునిన్యేకథ శన కైర్వీరోకానునయకోవిదః ।
పస్పర్శ పాదయుగలమాహ చోత్సంగలాలితామ్ ॥
వీరుడగు పురంజనుడు అనునయించుటలో నిపుణుడు. ఆతడా మెను పాదములను స్పృశిస్తూ మెల్లగా అనునయించెను. తరువాత ఆతడు ఆమెను తొడపై కూర్చుండబెట్టుకొని లాలిస్తూ ఇట్లు పలికెను.
పురంజన ఉవాచ ।
నూనం త్వకృతపుణ్యాస్తే భృత్యా యేష్వీశ్వరాశ్శుభే ।
కృతాగస్వాత్మసాతృత్వా శిక్షాదండం న యుంజతే ॥
పురంజనుడిట్లు పలికెను --- ఓ శుభకరమైన దానా! సేవకులు అపరాధము చేసినప్పుడు ప్రభువులు వారిని తమ వశములో నుంచుకొని, వారికి నేర్పుట కొరకై తగిన దండము (శిక్ష) ను వేసెదరు. అట్లు ఏ సేవ కుల విషయములో జరుగలేదో, వారు పూర్వములో పుణ్యము చేసుకున్న వారు కాదు. ఇది నిశ్చయము.
పరమోనుగ్రహో దండో భృత్యేషు ప్రభుణాకర్పితః ।
బాలో న వేద తత్తని బంధుకృత్యమమర్షణః ॥
ఓ సుందరీ! ప్రభువు తప్పు చేసిన సేవకునకు శిక్షను విధించుట వానికి గొప్ప అనుగ్రహము. కాని, సహనము వివేకము లేని కోపిష్టియగు మూర్ఖుడు, ప్రభువు తనకు శిక్షను వేసి హితమునే చేసినాడనే సత్యమును గుర్తించడు.
సా త్వం ముఖం సుదతి సుభ్వనురాగభార-
వ్రీడావిలంబవిలసద్దసీతావలోకమ్ ।
నీలాలకాలిభిరుపస్కృతమున్నసం నః
స్వానాం ప్రదర్శయ మనస్విని వల్లువాక్యమ్ ॥
ఓ అభిమానవతీ! నీ పలువరుసలు, కనుబొమలు చాల అంద ముగా నున్నవి. నీ ముఖమునందు చిరునవ్వుతో కూడిన చూపులు అధిక మగు అనురాగము మరియు సిగ్గుచే మెల్లమెల్లగా అంకురించుచున్నవి. తుమ్మెదలవంటి నల్లని ముంగురులు నీ ముఖమునకు అలంకారములైనవి. ఎత్తైన ముక్కు కలిగి, మధురమగు పలుకులను పలికే నీ ముఖమును నీవా డనగు నాకు చూపుము.
తస్మిన్లధే దమమహం తవ వీరపత్ని
యోకన్యత్ర భూసురకులాత్కృతకిల్బిషస్తమ్ ।
పశ్యే న వీతభయమున్ముదితం త్రిలోక్యా-
మన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్ ॥
వీరుడనైన నా భార్యవగు ఓ పురంజనీ! నీయెడల అపరాధమును చేసినవాడు బ్రాహ్మణుడు గానిచో, నేను వానికి శిక్షను వేసెదను. కాని, మురారి (మురుడనే రాక్షసుని సంహరించిన శ్రీహరి) భక్తుని మినహాయించి నచో, నీయెడల అపరాధమును చేసి నిర్భయముగా ఆనందముగా ఉండగ లిగే వ్యక్తి ముల్లోకములలో గాని, ముల్లోకములకు బయట గాని నాకు ఎవ్వరైననూ కానవచ్చుట లేదు. ఇది నిశ్చయము.
వక్త్రం న తే వితిలకం మలినం విహర్షం
సంరంభభీమమవిమృష్టమ పేతరాగమ్ ।
పశ్యే స్తనామపి శుచోపహతో సుజాతో
బింబాధరం విగతకుంకుమపంకరాగమ్ ॥
నీ ముఖము బొట్టు లేకుండా మలినముగానున్నది. నీ ముఖము హర్షముతో ప్రకాశించుటకు బదులుగా, కోపముతో భయమును గొల్పుచు న్నది. నీ ముఖములో నాకు అనురాగము కానవచ్చుటలేదు. నీ సుందర మగు స్తనములు శోకాశ్రువులతో తడిసియున్నవి. కుంకుమ ముద్దవలే ఎర్రనైన దొండపండువంటి నీ క్రింది పెదవి రంగును కోల్పోయినది. ఈ స్థితిలో నిన్ను నేను ఇదివరలో ఏనాడైననూ చూడలేదు.
తన్మే ప్రసీద సుహృదః కృతకిల్బిషస్య
స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య ।
కా దేవరం వశగతం కుసుమాస్త్రవేగ-
విగ్రస్తపౌంస్నముశతీ న భజేత కృత్యే ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పురంజనోపాఖ్యానే షడ్వింశోఽధ్యాయః ॥
కావున, నీవు నా యెడల ప్రసన్నురాలవు కమ్ము. వేట అనే చెడు అలవాటు గల నేను నిన్ను విడిచి స్వేచ్చగా వేటకు వెళ్లి నీ యెడల అపరాధమును చేసితిని. కాని, ఇప్పుడు నేను మన్మథుని బాణముల వేగముచే జారిపోయిన ధైర్యము గలవాడనై నీకు వశుడనై యున్నాను. భర్తను ప్రేమించే ఏ యువతి యోగ్యమగు దేశకాలములలో అట్టి భర్తను సేవించ కుండును?
శ్రీమద్భాగవత మహాపురాణమునందు నాల్గవ స్కంధములో పురంజనోపాఖ్యానములో పురంజనుడు పురంజనిని అనునయించుటను వర్ణించే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 26 of the Bhāgavata Mahā Purana is as follows:
The allegorical narrative continues as King Purañjana leaves his city and queen to go hunting in the forest, engaging in cruel acts against innocent wild animals. Upon returning home exhausted, dirty, and bloodstained, Purañjana finds his beloved queen neglected and angry. He spends immense effort flattering her and surrendering to her every whim, illustrating how the conditioned soul becomes enslaved by the demands of the mind and unruly senses.