భాగవత మహా పురాణము
22 - పృథూపాఖ్యానము - పృథు సనత్కుమార సంవాదము
మైత్రేయ ఉవాచ ।
జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథులవిక్రమ్ ।
తత్రోపజగ్ముర్మునయశ్చత్వారస్సూర్యవర్చసః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- జనులు గొప్ప పరాక్రమము గల పృథువును ఈ విధముగా స్తుతించుచుండగా, సూర్యుని వలె వెలిగిపోతున్న నలుగురు మహర్షులు అచటకు విచ్చేసిరి.
తాంస్తు సిద్దేశ్వరాన్ రాజా వ్యోమ్నోఽవతరతోఽర్చిషా ।
లోకానపాపాన్ కుర్వత్యా సానుగోఽచష్ట లక్షితాన్ ॥
ఆ మునీశ్వరులను పృథు మహారాజు వారి కొంతిని బట్టియే గుర్తించెను. వారు తమ కాంతిచే లోకులను పాపనిర్ముక్తులను చేయుచూ ఆకాశ మునుండి దిగుతుండగా, ఆ మహారాజు మరియు ఆయన అనుచరులు వారిని చూచిరి.
తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సురివోత్థితః ।
ససదస్యానుగో వైన్య ఇంద్రియేనో గుణానివ ॥
వారిని చూచిన తోడనే పైకి పోయిన ప్రాణములను, ఇంద్రియములకు ప్రభువగు మనస్సు శబ్దాది విషయములను వలె, తిరిగి లోపలికి తెచ్చుకొనే కోరిక గలవాడా యన్నట్లు, వేనపుత్రుడగు పృథువు లేచి నిలబ డెను. ఆయనను అనుసరించి సభాసదులు, ఆయన అనుచరులు కూడ లేచి నిలబడిరి.
గౌరవాద్యంత్రితస్సభ్యః ప్రశ్రయానతకంధరః ।
విధివత్పూజయాంచక్రే గృహీతాధ్యర్హణాసనాన్ ॥
వారియందలి గౌరవముచే సత్పురుషుడగు పృథువు వారికి వశుడై పోయెను. ఆయన వినయముతో వంగిన మెడ గలవాడై, వారికి అర్ఘ్యమును ఆసనమును సమర్పించేను. వారు వాటిని స్వీకరించి ఉపవిష్ణు లైన పిదప ఆయన వారిని యథావిధిగా పూజించెను.
తత్పాదశౌచసలిలైర్మార్జితాలకబంధనః ।
తత్ర శీలవతాం వృత్తమాచరన్మానయన్నివ ॥
ఆయన వారి పాదములను కడిగి ఆ జలమును తన తలపై చల్లు కొనెను. ఆ నీటితో ఆయన జుట్టు ముడి తడిసెను. ఈ విధముగా సచ్చీలము గలవారి నడవడిని ఆయన ఆ సభలో సమగ్రముగా ఆచరించెను.
హాటకాసన ఆసీనాన్ స్వధిష్ణ్యేష్వివ పావకాన్ ।
శ్రద్ధాసంయమసంయుక్తః ప్రీతః ప్రాహ భవాగ్రజాన్ ॥
సనకాది మహర్షులు రుద్రునకు కూడ అన్నలు. వారు బంగరు ఆసనములయందు, వేదులయందు అగ్నులవలె, కూర్చుండిరి. వారి యెడల శ్రద్ద మరియు చిత్త సమాధానము కలిగియున్న పృథువు వారి రాకచే సంతసిల్లి, వారితో నిట్లనెను,
పృథురువాచ ।
అహో ఆచరితం కిం మే మంగలం మంగలాయనాః ।
యస్య వో దర్శనం హ్యాసీద్దుర్దర్శనాం చ యోగిభిః ॥
పృథు మహారాజు ఇట్లు పలికెను --- ఏమి భాగ్యము! ఓ మహర్షు లారా! మీ రాక మంగళకరమైనది. నేను ఏమి పుణ్యమును చేసితినో! యోగులకైనమా దుర్లభమగు మీ దర్శనము నాకు కలిగినది.
కిం తస్య దుర్లభతరమిహ లోకే పరత్ర చ ।
యస్య విప్రాః ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః ॥
ఎవనికైతే వేదవేత్తలు మరియు అనుచరులతో కూడిన శివవిష్ణు వులు ప్రసన్నులగుదురో, వానికి ఇహ పరలోకములలో మిక్కిలి లభించ శక్యము కానిది ఏమి ఉండును?
నైవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతోఽపి యాన్ ।
యథా సర్వదృశం సర్వ ఆత్మానం యేఽస్య హేతవః ॥
సర్వసాక్షియగు ఆత్మస్వరూపమును మానవులు గుర్తించ లేకు న్నారు. దృశ్యమగు ఈ జగత్తునకు కారణమగు మహత్తత్త్వము మొదలగు తత్త్వములను జనులు గుర్తించ లేకున్నారు. అదే విధముగా, మీరు లోక ములను పర్యటించుచున్ననూ, సామాన్య జనులు మిమ్ములను గుర్తు పట్ట లేరు.
అధనా అపి తే ధన్యాస్సాధవో గృహమేధినః ।
యద్గృహా హ్యర్హవర్యాంబుతృణభూమీశ్వరావరాః ॥
ఏ గృహస్థుల గృహములకు మహాత్ములు విచ్చేసి, వారి ఇంట్లో కూర్చుండి, వారిచ్చిన నీటిని త్రాగెదరో, ఏ గృహస్థులు మరియు వారి సేవకులు కూడ మహాత్ములకు సేవ చేసెదరో, అట్టి సాధుపురుషులగు గృహస్థులు నిర్ధనులే అయిననూ, ధన్యులు అగుదురు.
వ్యాలాలయద్రుమా వై తేఽప్యరిక్తాఖిలసంపదః ।
యద్గృహాస్తీర్థపాదీయపాదతీర్థవివర్జితాః ॥
శ్రీహరి పాదములనుండి గంగ పుట్టినది. అట్టి శ్రీహరియొక్క భక్తుల పాదములను కడిగి ఏ గృహములలో సత్కరించరో, అట్టి గృహములు, సకలసంపదలు పూర్ణముగా కలిగియున్ననూ, పాములకు నెలవైన చెట్ల వంటివి.
స్వాగతం వో ద్విజశ్రేష్ఠా యద్వ్రతాని ముముక్షవః ।
చరంతి శ్రద్దయా ధీరా బాలా ఏవ బృహంతి చ ॥
ఓ మహర్షులారా! మీకు స్వాగతము. వివేకవంతులగు మీరు బాల్యములోనే మోక్షకాములై శ్రద్ధతో గొప్ప వ్రతములనాచరించుచున్నారు.
కచ్చిన్నః కుశలం నాథా ఇంద్రియార్థార్థవేదినామ్ ।
వ్యసనావాప ఏతస్మిన్ పతితానాం స్వకర్మభిః ॥
ఓ ప్రభువులారా! ఇంద్రియములకు విషయములగు శబ్దాదులే (భోగ్యములే) పురుషార్థములని భావించి మేము మా కర్మల చేతనే సంసా రములో బద్ధులమై పడి యున్నాము. ఈ సంసారము దుఃఖములకు క్షేత్ర ము. అట్టి మాకు క్షేమము గలదా?
భవతు కుశలప్రశ్న ఆత్మారామేషు నేష్యతే ।
కుశలాకుశలా యత్ర న సంతి మతివృత్తయః ॥
ఆత్మనిష్ఠులై ఆత్మానందముననుభవించే మిమ్ములను కుశల ముగా నున్నారా యని ప్రశ్నించుట యుక్తియుక్తము కాదు. మీ మనస్సు లలో ఇది కుశలము, ఇది కుశలము కాదు అనే ఆలోచనలకే తావు లేదు.
తదహం కృతవిశ్రంభస్సుహృదో వస్తపస్వినామ్ ।
సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షేమః కేనాంజసా భవేత్ ॥
శోకతాపమును పొందియున్నవారికి మీరు హితమును చేయుదురు. కావున, మీయందు విశ్వాసము ఏర్పడియున్న నేను మిమ్ములను ఒక ప్రశ్నను వేసెదను. ఈ సంసారములో మానవునకు తేలికగా క్షేమము కలిగే ఉపాయమేది?
వ్యక్తమాత్మవతామాత్మా భగవానాత్మభావనః ।
స్వానామనుగ్రహాయేమాం సిద్దరూపీ చరత్యజః ॥
పుట్టుక లేని శ్రీహరి భగవానుడు సకలప్రాణులలో ఆత్మరూపుడై యున్ననూ, ఆత్మానాత్మవివేకము గల ధీరులకు మాత్రమే ఆ రూపముగా ప్రకాశించుచున్నాడు. అట్టి శ్రీహరి తన భక్తుల ననుగ్రహించుటకై మీవంటి సిద్ధపురుషుల రూపములో సంచరించుచున్నాడు. ఇది నిశ్చయము.
మైత్రేయ ఉవాచ ।
పృథోస్తత్సూక్తమాకర్ణ్య సారం సుష్ఠు మితం మధు ।
స్మయమాన ఇవ ప్రీత్యా కుమారః ప్రత్యువాచ హ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథువు సారవంతములైన గంభీరమగు మధురవాక్యములను మితముగా చక్కగా చెప్పెను. ఆ మాటలను విని సనత్కుమారుడు ప్రేమతో చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఈ విధముగా బదులు చెప్పెను.
సనత్కుమార ఉవాచ ।
సాధు పృష్టం మహారాజ సర్వభూతహితాత్మనా।
భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ ॥
సనత్కుమారుడు ఇట్లు పలికెను --- ఓ మహారాజా! నీవు స్వయముగా విద్వాంసుడవు. అయిననూ, సకలప్రాణుల హితమును గోరి నీవు చక్కగా.. ప్రశ్నించితివి. సాధు పురుషులు ఆలోచించే తీరు ఇటులనే యుండును.
సంగమః ఖలు సాధూనాముభయేషాం చ సంమతః ।
యత్సంభాషణసంప్రశ్నస్సర్వేషాం వితనోతి శమ్ ॥
సాధు పురుషులతోడి సమాగమము శ్రోత మరియు వక్త అనే ఇద్దరికీ కూడ అభిమతమే యగును. ఏలయనగా, మహాత్ములను కలిసి వారిని యోగ్యమగు రీతిలో ప్రశ్నించుట వలన అందరికీ సుఖము విస్తరిల్లును.
అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః
పాదారవిందస్య గుణానువాదయే ।
రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ
కామం కషాయం మలమంతరాత్మనః ॥
ఓ రాజా! నీకు మధుసూదనుని పాదపద్మముల గుణములయొక్క వర్ణనయందు నిశ్చలమగు ప్రీతి నిశ్చయముగా గలదు. ఇట్టి ప్రీతిని కలిగి యుండుట దుష్కరము. ఈ ప్రీతి వ్యక్తియొక్క కామనలను, రాగద్వేషాది వాసనలను పోగొట్టి అంతఃకరణమును పరిశుద్దము చేయును.
శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం ।
క్షేమస్య సద్ర్యగ్విమృశేషు హేతుః ।
అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని
దృథా రతిర్ర్భహ్మ ణి నిర్గుణే చ యా ॥
అనాత్మయగు ఈ ప్రపంచమునందు వైరాగ్యమును కలిగి, నిర్గుణ పరబ్రహ్మయందు ఆత్మరూపముగా దృఢమగు నిష్ఠను కలిగియుండుట మాత్రమే మానవుల క్షేమమునకు ఏకైక సాధనము. ఇది శాస్త్రము (వేదము) లను బాగుగా విచారించి తేల్చి చెప్పిన సంగతి.
సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా
జిజ్ఞాసయాఽఽధ్యాత్మికయోగనిష్ఠయా ।
యోగేశ్వరోపాసనయా చ నిత్యం
పుణ్యశ్రవఃకథయా పుణ్యయా చ ॥
సాధకుడు నిత్యము శ్రద్ధతో భగవానునకు ప్రీతిని కలిగించే ధర్మ ములనాచరించవలెను. ఆత్మజ్ఞానమునందాకాంక్ష గలవాడై సర్వకాలము 'లలో ఆత్మనిష్ఠను అభ్యసించవలెను. మరియు, యోగులకు ప్రభువగు శ్రీహరిని నిత్యము ఉపాసించవలెను. శ్రీహరియొక్క కీర్తి జనులను పావ నము చేయును. కావున, సాధకుడు అట్టి శ్రీహరియొక్క గాథలను నిత్యము వినవలెను. ఇట్లు చేయుచున్నచో, సాధకునకు ప్రత్యగభిన్నబ్రహ్మ నిష్ఠ కుదురును.
అర్ధేంద్రియారామసగోష్ఠ్యతృష్ణయా తత్సంమతానామపరిగ్రహేణ।
వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్వినా హరేర్గుణపీయూషపానాత్॥
సంసారమునందలి జనులు ధనమునందు, ఇంద్రియభోగము నందు ఆసక్తి గలవారై ధనము వెనుక, భోగ్యవస్తువుల వెనుక పరుగులెత్తు . దురు. సాధకుడు వారితోడి సంగమునందు తృష్ణను కలిగియుండరాదు. వారికి అభీష్టమైన ధనభోగాదులకు దూరముగా నుండవలెను. సాధకుడు శ్రీహరియొక్క గుణానువాదము అనే అమృతపానము వలన తృప్తిని చెందవలెను. లేదా, ఏకాంతమునందు ప్రీతి గలవాడై ఆత్మస్వరూపము నందే సంతోషమును పొందవలెను. ఇట్లు చేయు సాధకునకు దృఢమగు, ఆత్మనిష్ఠ కుదురును.
అహింసయా పారమహంస్యచర్యయా
స్మృత్యా ముకుందాచరితాగ్ర్యసీధునా ।
యమైరకామైర్నియమైశ్చాప్యనిందయా
నిరీహయా ద్వంద్వతితిక్షయా చ ॥
సాధకుడు అహింసను, శమము దమము మొదలగు పరమహంసల ధర్మములను పాటిస్తూ, జీవన్ముక్తి అనే తన లక్ష్యమును గుర్తులో నుంచుకొని మెలగవలేను. ఆతడు మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క లీలలు అనే శ్రేష్టమగు అమృతమును సేవించవలెను (లీలలను స్మరించి ఆనందించవలెను). అహింస, సత్యము, అస్తేయము (పరధనమును ఆశిం, చకుండుట), బ్రహ్మచర్యము, అపరిగ్రహము (భోగవస్తువులను ప్రోగుచేయ కుండుట) అను ఐదు యమములు. శౌచము (బాహ్యమునందు, అంతఃకర ణమునందు శుచిగా నుండుట), సంతోషము, తపస్సు, స్వాధ్యాయము (మోక్షశాస్త్రమును అధ్యయనము చేయుట), ఈశ్వర ప్రణిధానము (శరణా గతి) అను ఐదు నియమములు. సాధకుడు ఈ యమ నియమములను నిష్కామముగా ఆచరించవలెను. సాధకుడు ఇతరులను నిందించరాదు. ఆతడు స్వార్థము కొరకై ప్రయత్నమును చేయరాదు. ఇంతేగాక, ఆతడు శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమచిత్త ముతో సహించవలెను. ఇట్లు చేయు సాధకునకు ఆత్మసాక్షాత్కారము కలిగి జీవన్ముక్తుడగును.
హరేర్ముహుస్తత్పరకర్ణపూర
గుణాభిధానేన విజృంభమాణయా ।
భక్త్యా హ్యసంగస్సదసత్యనాత్మని
స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసా రతిః ॥
సాధకుడు దినదినప్రవర్ధమానమగు హరిభక్తి గలవాడై శ్రీహరి గుణములను పలుమార్లు కీర్తించవలెను. ఈ గుణములు హరిభక్తుల చెవులకు అలంకారములు. ఇట్లు చేయు భక్తునకు కార్య (భౌతికపదార్థములు) కారణ (పంచభూతములు) రూపమగు ఈ అనాత్మప్రపంచమునందు వైరాగ్యము కలిగి, నిర్గుణ పరబ్రహ్మయందు తేలికగా నిష్ఠ కుదురును,
యదా రతిర్ర్భహ్మణి నైష్ఠికీ పుమా
నాచార్యవాన్ జ్ఞానవిరాగరంహసా ।
దహత్యవీర్యం హృదయం జీవకోశం
పంచాత్మకం యోనిమివోత్థితోఽగ్నిః ॥
ఆచార్యుడు గల సాధకునకు పరబ్రహ్మయందు నిశ్చలమగు ప్రీతి కలిగిన వెంటనే జ్ఞానవైరాగ్యముల తీవ్రతచే లింగశరీరము (నేను పరిచ్ఛిన్న వ్యక్తిననే తప్పుడు ధారణ), కట్టెయందు పుట్టిన అగ్నిచే కట్టె వలె, దహించ బడును. జ్ఞానముచే దగ్ధమైన లింగశరీరము తిరిగి పుట్టే ప్రసక్తి లేదు. అవి ద్య, అస్మిత (అహంకారము), రాగము, ద్వేషము మరియు అభినివేశము (మరణభయము) అనే అయిదు లక్షణములతో కూడిన ఈ లింగ శరీరమే జీవునకు బంధ హేతువు అగుచున్నది.
దగ్ధాశయో ముక్తసమస్తతద్గుణో
నైవాత్మనో బహిరంతర్విచష్టే ।
పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్
స్వప్నే యథా పురుషస్తద్వినాశే ॥
జీవునకు జ్ఞానము కలుగుటకు ముందు తనకు పరబ్రహ్మకు భేదము గలదనే ధారణ ఉండును. కాని, జ్ఞానముచే ఆ ధారణ నశించగానే, ఆత్మకు (అజ్ఞానకల్పితమైన) లింగశరీరోపాధి (జ్ఞానముచే) దహించబడు ను. దానితో బాటు దాని గుణములగు కర్తృత్వ భోక్తృత్వములు కూడ దూర ముగా విడువబడును. వ్యక్తి స్వప్నములో తనను, తనకంటే భిన్నమగు జగ త్తును చూచును. కాని, స్వప్నమునుండి తెలివి రాగానే ఆ సర్వము తన యందే విలీనమగును. అదే విధముగా, అప్పుడా జ్ఞాని తనకంటే భిన్న ముగా బయట ప్రపంచమును దర్శించడు. ప్రపంచముకంటే వ్యతిరిక్తముగా తాను దేహీననే భావన కూడ ఆతనికి ఉండదు.
ఆత్మానమింద్రియార్థం చ పరం యదుభయోరపి ।
సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యదా ॥
అంతఃకరణము అనే ఉపాధి (పరికరము) క్రియాశీలముగా నున్నప్పుడు మాత్రమే వ్యక్తికి ద్రష్టనను తాను, ఇంద్రియములకు గోచరమయ్యే దృశ్యజగత్తు మరియు ఈ రెండింటికీ సాక్షియగు చైతన్యము అను భేదము అనుభవమునకు వచ్చును. లేదా, దృశ్యజగత్తు, అజ్ఞానముచే దానికంటే భిన్నముగా స్వీకరించబడే దేహము, మరియు అహంకారము అనే భేదము అనుభవమునకు వచ్చును. గాఢనిద్ర మొదలగు అవస్థలయందు అంతఃకరణము విలీనము కాగా, ఈ భేదములేమియు దర్శించబడుట లేదు.
నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుషః ।
ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి నాన్యదా ॥
నీరు, అద్దము మొదలగు కాంతిని పరావర్తనము చేసే నిమిత్తము ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి తనకు, తన ప్రతిబింబమునకు భేదమును చూచుచున్నాడు. అట్టి నిమిత్తము లేనప్పుడు ఆ ప్రతిబింబము తనలో విలీ నమై యుండునే గాని, భిన్నముగా కనబడదు. ఈ స్థితి లోకములో ఎట్లో, తన విషయములో కూడ అంతే.
ఇంద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః ।
చేతనాం హరతే బుద్ధేః స్తంబస్తోయమివ ప్రదాత్ ॥
సరస్సు ఒడ్డున మొలిచే చిన్న గడ్డి మొక్క ఆ సరస్సులోని నీటిని వేళ్ల ద్వారా లాగివేయును. అదే విధముగా, వ్యక్తి విషయభోగములను గురించి ఆలోచించుచున్నచో, ఆ భోగముల ఆకర్షణకు లోనైన ఇంద్రియములు మనస్సు ద్వారా వాని బుద్ధినుండి వివేకశక్తిని అపహరించును.
భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశస్స్మృతిక్షయే ।
తద్రోధం కవయః ప్రాహురాత్మాపహ్నవమాత్మనః ॥
వివేకజ్ఞానము నశించుట తోడనే పూర్వాపరముల స్మరణము లేకుండ పోవును. అట్టి స్మరణము లేనివాడు స్వరూపజ్ఞానమును కోల్పో వును (ఆత్మజ్ఞానమును పొందే అవకాశమును జారవిడుచుకోనును). అట్లు వ్యక్తి ఆత్మజ్ఞానమునకు దూరమగుట ఆత్మహత్యయే అగునని విద్వాం సులు చెప్పుచున్నారు.
నాతః పరతరో లోకే పుంసస్స్వార్థవ్యతిక్రమః ।
యదధ్యన్యస్య ప్రేయస్త్వమాత్మనస్స్వవ్యతిక్రమాత్ ॥
వ్యక్తికి ఆత్మ అత్యంతము ప్రియము. ఆత్మసంబంధమును బట్టియే వ్యక్తికి అనాత్మలగు దేహాదులయందు ప్రీతి కలుగుచున్నది. మానవుడు ఈ జన్మలో అట్టి ఆత్మస్వరూపజ్ఞానమునకు తనకు తానే భంగము కలిగించుకున్నచో, అంతకంటే పెద్ద స్వార్థవినాశము మరియొకటి ఉండదు.
అర్ధేంద్రియార్థాభిధ్యానం సర్వార్థాపహ్నవో నృణామ్ ।
భ్రంశితో జ్ఞానవిజ్ఞానాద్యేనావిశతి ముఖ్యతామ్ ॥
వ్యక్తి ధనమును గురించి, ఇంద్రియభోగములను గురించి అదే పనిగా ఆలోచించరాదు. అట్లు చేసినచో, వ్యక్తి నాలుగు పురుషార్థములను చెడగొట్టుకొనును. అట్టి ఆలోచన వలన వ్యక్తికి శాస్త్రముచే బోధించబడే ఆత్మజ్ఞానము గాని, ఆత్మసాక్షాత్కారము గాని కలిగే అవకాశము జారిపోయి, ఆతడు మరుజన్మలో చెట్టుచేమల రూపములో జన్మించును.
న కుర్యాత్కర్హిచిత్సంగం తమస్తీవ్రం తితీరిషుః ।
ధర్మార్థకామమోక్షాణాం యదత్యంతవిఘాతకమ్ ॥
భయంకరమగు అజ్ఞానమనే సముద్రమును దాటగోరు వ్యక్తి ఏ కాలమునందైననూ సంసారమునందు ఆసక్తిని పెంచుకొనరాదు. ఇట్టి ఆసక్తి వలన మానవుడు ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములను పూర్తిగా పోగొట్టుకొనును.
తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యంతికతయేష్యతే ।
శ్రావర్గ్యోఽర్థో యతో నిత్యం కృతాంతభయసంయుతః ॥
ధర్మార్థకామములనే త్రివర్గమునకు చెందిన పురుషార్థములు సర్వదా కాలపురుషుని భయమునకు లోబడి యున్నవి. అనగా, ఈ పురుషార్థములు అనిత్యము. కాని, మోక్షము అనే పురుషార్థము నిత్యము గనుక అదియే నాలుగు పురుషార్థములలో సర్వోత్కృష్టమైనదిగా స్వీకరించబడుచున్నది.
పరేఽవరే చ యే భావా గుణవ్యతికరాదను ।
న తేషాం విద్యతే క్షేమమీశవిధ్వంసితాశిషామ్ ॥
దేవతలు మొదలగు గొప్ప ప్రాణులు, పశువులు మొదలగు నికృష్టప్రాణులు అన్నీ సత్త్వరజస్తమోగుణముల పరిణామముచే మాత్రమే పుట్టినవి. ఇట్టి ప్రాణుల మనోరథములను కాలపురుషుడు వినష్టము చేయుచుం డును. కావున, ఈ ప్రాణులకు ఆత్యంతికమగు క్షేమము లేదు.
తత్త్వం నరేంద్ర జగతామథ తస్థుషాం చ
దేహేంద్రియాఽసుధిషణాత్మభిరావృతానామ్ ।
యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః
ప్రత్యక్ చకాస్తి భగవాంస్తమవేహి సోఽస్మి ॥
ఓ మహారాజా! చరాచరములగు సకలప్రాణులు దేహము, ఇంద్రియములు, ప్రాణములు, బుద్ది మరియు అహంకారములయందు ఆత్మభావము గలవారై వాటిచే కప్పివేయబడిన స్వరూపమును కలిగియున్నారు. అట్టి సకలప్రాణుల హృదయములో భగవానుడు దేహేంద్రియమనస్సులకు (క్షేత్రము) సాక్షియై, సర్వమును నియంత్రించే అంతర్యామియై, ప్రత్య గాత్మ (అంతరతమమగు స్వరూపము) రూపముగా స్వానుభూతి రూపములో ప్రకాశించుచునే యున్నాడు. అట్టి పరమాత్మను నేనే అనే విధముగా అభేదజ్ఞానముతో తెలియుము.
యస్మిన్నదం సదసదాత్మతయా విభాతి
మాయా వివేకవిధుతీ స్రజి వాఽహీబుద్దిః ।
తం నిత్యముక్తపరిశుద్ధవీబుద్ధతత్త్వం
ప్రత్యూఢకర్మకలిలప్రకృతిం ప్రపద్యే ॥
మాలయందు వాస్తవముగా పాము లేకున్ననూ అజ్ఞానముచే ఉన్నట్లుగా భాసించును. విషయము తెలియగానే ఆ పాము కనబడుట మానివేయును. అదే విధముగా ఆ పరమాత్మయందు కార్య (భౌతికములు) కారణ (పంచభూతములు) రూపమగు జగత్తు వాస్తవముగా లేకున్ననూ ఉన్నట్లుగా భాసించును. వివేకజ్ఞానము కలుగగానే జగత్తు మిథ్య యని తేలిపోవును. ఆ పరమాత్మ సర్వకాలములలో ముక్తుడు, పుణ్యపాపముల సంసర్గము లేనివాడు, అఖండజ్ఞానస్వరూపుడు. కర్మఫలములగు సుఖదుఃఖములతోడి సంసర్గము అనే మాలిన్యము ప్రకృతికార్యములగు దేహేంద్రియాదులలో ఉండునే గాని, ఆ పరమాత్మకు ఈ మాలిన్యము అంటదు. అట్టి ఆ పరమాత్మను నేను శరణు పొందుచున్నాను.
యత్పాదపంకజపలాశవిలాసభక్త్యా
కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః ।
తద్వన్న రిక్తమతయో యతయోఽపి రుద్ద
స్రోతోగణాస్తమరణం భజ వాసుదేవమ్ ॥
పూర్వకర్మల వాసనలన్నియు కలిసి జీవునకు అహంకారగ్రంథి రూపములో మండును. సత్పురుషులు వాసుదేవుని పాదపద్మముల వ్రేళ్ల కాంతియందు భక్తిని చేసి, దాని ప్రభావముచే ఆ అహంకారగ్రంథివి తేలికగా విప్పుకొని కృతార్థులగుచున్నారు. కాని, యోగాభ్యాసపరులు ఇంద్రియముల సమూహమును నిరోధించి (ప్రత్యాహారము) అంతఃకరణవృత్తు లను ఆపివేపి (సమాధి) కూడ అంత తేలికగా గ్రంథిభేదనమును చేయలేకున్నారు. అట్టి వాయుదేవుని నీవు శరణు పొంది సేవించుము.
కృచ్చ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం
షడ్వర్గవక్రమసుఖేన తితీరషంతి ।
తత్త్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం
కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరార్ణమ్ ॥
సంసారమనే సముద్రము అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు అనే ఆరు మొసళ్లతో కూడియున్నది. దీనిని కొందరు కఠినమైన యోగసాధనలచే తరించ గోరెదరు. వారు ఈశ్వరుడు అనే పడవవానిని ఆశ్రయించరు. వారికి దీనిని తరించుట చాల కఠినము. కావున, నీవు శ్రీహరి భగవానుని పాదమును పడవగా చేసుకొని, తరింప శక్యము కాని సము ద్రమువంటి ఈ సంసారదుఃఖమును తేలికగా తరించి వేయుము.
మైత్రేయ ఉవాచ ।
స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా ।
దర్శితాత్మగతిస్సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మపుత్రుడు, ఆత్మజ్ఞాని లగు సనత్కుమారుడు ఈ విధముగా ఆత్మతత్త్వమును వివరించి చెప్పగా, ఆ పృథు మహారాజు ఆయనను బాగా కొనియాడి, ఇట్లు పలికెను.
రాజోవాచ ।
కృతో మేఽనుగ్రహః పూర్వం హరిణాఽఽర్తానుకంపీనా ।
తమాపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః ॥
పృథు మహారాజు ఇట్లు పలికెను --- పూజ్యుడవగు ఓ మహాత్మా! దీనులపై దయ చూపే శ్రీహరి ఇంతకుముందే నన్ను అనుగ్రహించినాడు. ఆ అనుగ్రహమును పూర్ణము చేయుటకై తాము విచ్చేసినారు.
నిష్పాదితశ్చ కార్త్స్న్యే న భగవద్భిర్ఘృణాలుభిః ।
సాధూచ్ఛిష్టం హి సర్వం మ ఆత్మనా సహ కిం దదే ॥
దయామయులు, పూజ్యులు అగు మీరు సర్వమును సంపన్నము చేసినారు. ఈ దేహముతో సహా నా సర్వము సత్పురుషులు నాకు ప్రసాదము రూపముగా అనుగ్రహించినదియే. నేను మీకేమి ఈయగలను?
ప్రాణో దారాస్సుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్చదాః ।
రాజ్యం బలం మహీ కోశ ఇతి సర్వం నివేదితమ్ ॥
ఓ మహాత్మా! నా ప్రాణములు, భార్య, పుత్రులు, సామగ్రితో కూడిన భవనము, రాజ్యము, సైన్యము, భూమి, ఖజానా అనే సర్వమును మీకు సమర్పించుచున్నాను.
సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ ।
సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్రవిదర్షతి ॥
వేదశాస్త్రములను తెలిసిన విద్వాంసుడు సేనాపతి పదవికి, రాజ్యాధికారమునకు, దుష్టులను శిక్షించే అధికారమునకు మాత్రమే గాక ముల్లోకముల ఆధిపత్యమునకు కూడ అర్హుడే.
స్వమేవ బ్రాహ్మణో భుంకే స్వం వస్తే స్వం దదాతి చ ।
తస్యైవానుగ్ర హేణాన్నం భుంజతే క్షత్రియాదయః ॥
వేదవేత్త తన స్వంత ఆహారమును మాత్రమే భుజించి, స్వంత వస్త్రమును మాత్రమే దాల్చి, స్వంత ధనమును మాత్రమే దానము చేయు చున్నాడు. క్షత్రియులు మొదలగువారు వేదవేత్తయొక్క అనుగ్రహముచే మాత్రమే భోగముల ననుభవించుచున్నారు.
యైరీదృశీ భగవతో గతిరాత్మవాద
ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితా నః
తుష్యంత్వదభ్రకరుణాస్స్వకృతేన నిత్యం
కో నామ తతతికరోతి వినోదపాత్రమ్ ॥
మీరు పర్వకాలములలో అతిశయించిన కరుణగలవారు. గొప్ప వేదవేత్తలగు మీరు నాకు అధ్యాత్మవిచారములో భాగముగా - ఇట్టి అపూర్వ మగు భగవత్తత్త్వము నుపదేశించితిరి. ఈ విధముగా నాకు. గొప్ప ఉపకార మును చేసిన మీరు మీ ఉపకారముతోనే సంతోషించేదరు గాక! ఏలయన, మీకు దోసిలి యొగ్గుటను మినహాయించి ఎవ్వరైననూ మీ ఉపకారమునకు ప్రత్యుపకారమును చేయగల్గుదురా? అట్లు చేయ బూనుకున్నవాడు ఎవడై ననూ పరిహాస భాజనుడగును.
మైత్రేయ ఉవాచ ।
త ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితాః ।
శీలం తదీయం శంసంతః ఖ్వేభూవన్మిషతాం నృణామ్ ॥
ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠులగు ఆ మహర్షులను ఆదిరాజగు పృథువు సత్కరించెను. వారప్పుడు ఆతని సచ్చీలమును కొనియాడుతూ, జనులు - చూచుచుండగనే, ఆకాశమార్గముగుండా వెళ్లిరి.
వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా ।
ఆప్తకామమివాత్మానం మేన ఆత్మవ్యవస్థితః ॥
వేనపుత్రుడగు పృథువు గొప్పవారిలో ముఖ్యుడు. ఆయన సన త్కుమారుని ఆత్మతత్త్వోపదేశముచే తన స్వరూపమునందు. నిశ్చలమగు మనస్సుతో నిలిచియుండెను. ఆయన తాను పూర్ణకాముడైన జీవన్ముక్తుడనై తినని భావించెను.
కర్మాణి చ యథాకాలం యథాదేశం యథాబలమ్ ।
యథోచితం యథావిత్తమకరోద్బ్రహ్మసాత్కృతమ్ ॥
పృథువు దేశకాలములకు తగ్గట్లుగా తన శక్తిని సంపదను మించ కుండగా యథోచితమగు కర్మలను ఈశ్వరార్పణబుద్దితో చేసెను.
ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగస్సమాహితః ।
కర్మాధ్యక్షం చ మన్వాన ఆత్మానం ప్రకృతేః పరమ్ ॥
ఆయన కర్మఫలమును ఈశ్వరునకు సమర్పించి, కర్తృత్వాసక్తి లేనివాడై, ఏకాగ్రచిత్తముతో కర్మలను చేసెను. ఆయన ప్రకృతి (దేహేంద్రి యమనస్సంఘాతము) కంటె అతీతమైన సాక్షిభావములో నిలిచి యుండెను.
గృహేషు వర్తమానోకపి స సామ్రాజ్యశ్రీయాకన్వితః ।
నాసజ్జతేంద్రియార్ధేషు నిరహంమతిరర్కవత్ ॥
సామ్రాజ్యలక్ష్మితో కూడియున్న ఆ పృథువు అహంభావము లేని వాడు. ఆయన ఇంటిలో ఉంటున్నా, సూర్యుడు తాను ప్రకాశింపజేసే దేశ ముతో సంపర్కమును పొందని విధముగా, ఇంద్రియభోగ్యములగు శబ్దాది , విషయములయందు ఆసక్తి లేకుండ నుండెను.
ఏవమధ్యాత్మయోగేన కర్మాణ్యనుసమాచరన్
పుత్రానుత్పాదయామాస పంచాక్షర్చిష్యాత్మసంతాన్ ।
విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకమ్ ॥
ఈ విధముగా పృథువు ఆత్మనిష్ఠయందుంటూనే శాస్త్రవిహితము లగు కర్మలను చక్కగా ఆచరించెను. ఆయనకు భార్యయగు అర్చిస్సు నందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యక్షుడు, ద్రవిణుడు, వృకుడు . అనే అయిదుగురు తనకు తగ్గ కొడుకులు కలిగిరి.
సర్వేషాం లోకపాలానాం దధారైకః పృథుర్గుణాన్ ।
గోపీథాయ జగత్సృష్టః కాలే స్వే స్వేచ్యుతాత్మకః ॥
అచ్యుతుడగు శ్రీహరియొక్క అవతారమైన పృథువు ఒక్కడే లోక పాలకులందరి గుణములను ధరించి, వారి వారి కాలములలో జగత్తులోని ప్రాణులను రక్షించెను. "
మనోవాగ్వృత్తిభిస్సౌమ్యైర్ధుడైస్సంరంజయన్ ప్రజాః ।
రాజేత్యధాన్నామధేయం సోమరాజ ఇవాపరః ॥
ఓషధులకు హితమును చేకూర్చే చంద్రుడు సోమరాజు అనే సార్థ కనామమున కలిగియున్నాడు. అదే విధముగా పృథువు ప్రజల హిత మును గురించి తన మనస్సులో చింతిస్తూ, వారి హితమునే పలుకుతూ, తన మనోహరమగు గుణములచే వారిని రంజింపజేసి, చంద్రుని తరువాత రాజు అనే సార్థకనామధేయము గల రెండవ రాజు ఆయెను.
సూర్యవద్విసృజన్ గృహ్ణన్ ప్రతవంశ్చ భువో వసు ।
దుర్ధర్ష స్తేజ పేవాగ్నిర్మ హేంద్ర ఇవ దుర్జయః ॥
సూర్యుడు బాగా ఎండలు కాసి భూమిపై ఉండే నీటిని ఆవిరిగా తీసుకొని మరల వర్షము రూపములో విడిచి పెట్టును. అదే విధముగా ప్రతా పశాలియగు పృథువు భూమీయొక్క సంపదను పన్నుల రూపములో వసూలు చేసి, ప్రజాహితకార్యముల రూపములో ఖర్చు పెట్టెడివాడు. అగ్నివలె తేజశ్శాలియగు ఆయనకు శత్రువుల భయము లేకుండెను. ఆయన మహేంద్రుని వలె అజేయుడుగ నుండెను.
తితిక్షయా ధరిత్రీవ ద్యౌరివాభీష్టదో నృణామ్ ।
వర్షతి స్మ యథాకామం పర్జన్య ఇవ తర్పయన్ ॥
ఆయన సహనములో భూదేవితో సమానమైనవాడు. ఆయన స్వర్గము వలె మానవుల అభీష్టములను నెరవేర్చెడివాడు. మేఘము మావ వులకు చాలినంతగా వర్షించి తృప్తిని కలిగించును. అదే విధముగా ఆయన జనుల కోరికలకు తగ్గట్లు సంపదలను వర్షించి, వారికి తృప్తిని కలిగించెను.
సముద్ర ఇవ దుర్బోధస్సత్వేనాచలరాడివ ।
ధర్మరాడివ శిక్షాయామాశ్చర్యే హిమవానివ ॥
సముద్రపు లోతును తెలియుట కష్టము. అదే విధముగా ఆయన మనస్సు లోతు ఇతరులకు అంతు పట్టెడిది కాదు. ఆయన పర్వతమువలె చలనము లేని ధైర్యము గలవాడు. తప్పు చేసినవారిని యమధర్మరాజు వలే ఆయన నిష్పక్షపాతముగా శిక్షించెడివాడు. ఆయనను చూచినప్పుడు హిమవత్పర్వతమును చూచినంత ఆశ్చర్యము కలిగెడిది.
కుబేర ఇవ కోశాడ్యో గుప్తార్థో వరుణో యథా ।
మాతరి శ్వేవ సర్వాత్మా బలేన సహసౌజసా ॥
పృథువు కుబేరుడు వలె సమృద్ధమగు ధనమునకు స్వామి. ఆయన తాను చేపట్టే ప్రణాళికలు కార్యరూపమును దాల్చునంతవరకు రహస్యముగా నుండెడివాడు. ఇట్టి రహస్యగోపనములో ఆయన వరుణుడు వంటివాడు. వాయువు సకలప్రాణులను ప్రాణశక్తిరూపముగా నియంత్రిస్తూ వాటి దేహములకు ఇంద్రియములకు మనస్సునకు శక్తిని కలిగించుచుండు ను. అదే విధముగా, పృథువు తన దేహబలముచే ఇంద్రియముల పటుత్వ ముచే మనోబలముచే సకలజనులను నియంత్రించెడి వాడు.
అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ ।
కందర్ప ఇవ సౌందర్య మనస్వీ మృగరాడివ ॥
ఆ పృథువు సహింప శక్యము కాని తేజస్సులో స్వయంప్రకాశ స్వరూపుడగు రుద్రభగవానుని పోలియుండెను. అందములో మన్మథుని పోలియున్న ఆ రాజు రీవిలో సింహమును పోలియుండెను.
వాత్సల్యే మనువన్నృణాం ప్రభుత్వే భగవానజః ।
బృహస్పతిర్బ్రహ్మవాద ఆత్మవత్త్వే స్వయం హరిః ॥
స్వాయంభువ మనువు వలె ప్రేమపూర్ణుడగు ఆ పృథువు జను లను పాలించుటలో బ్రహ్మదేవుని వంటివాడు. బ్రహ్మవిచారములో ఆయన బృహస్పతియే. జితేంద్రియత్వములో ఆయన సాక్షాత్తుగా శ్రీహరియే.
భక్త్యా గోగురువిప్రేషు విష్వక్సేనానువర్తిషు ।
ప్రియా ప్రశ్రయశీలాభ్యామాత్మతుల్యః పరోద్యమే ॥
గోవులు, గురుజనులు, వేదవేత్తలు, శ్రీహరి భక్తులు అనువారి యెడల భక్తి, బిడియము, వినయము, మంచి స్వభావములను కలిగియుం. డుటలో, మరియు పరోపకారము కొరకు నడుము బిగించుటలో ఆ పృథు మహారాజు తనకు తానే సాటి.
కీర్త్యోర్ధ్వగీతయా పుంభిస్త్రైలోక్యే తత్ర తత్ర హ ।
ప్రవిష్టః కర్ణరంధేషు స్త్రీణాం రామస్సతామివ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పృథూపాఖ్యానే
పృథు సనత్కుమార సంవాదో నామ ద్వావింశోఽధ్యాయః ॥
ముల్లోకములలో ఆయా స్థానములలో పురుషులు బిగ్గరగా పృథువు త్రివి గానము చేయగా ఆ కీర్తి, శ్రీరాముడు సత్పురుషుల హృద యములలో ప్రవేశించిన విధముగా, గృహకార్యములలో వ్యగ్రముగానుండే స్త్రీల చెవులకు కూడ వినవచ్చేను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పృథూపాఖ్యానములో పృథుసనత్కుమారసంవాదమనే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
During the grand royal assembly, the Four Kumāras descended from the sky like glowing suns. King Pṛthu along with his court received them with deep reverence and worship. Sanat-kumāra imparted profound spiritual instructions to King Pṛthu on the nature of self-realization, detachment from the physical body, and the supreme necessity of absorbing one’s heart in unalloyed devotional service to Svayam Bhagavān.