భాగవత మహా పురాణము
27 - పురంజనోపాఖ్యానము - కాలకన్యోపాఖ్యానము
నారద ఉవాచ ।
ఇత్థం పురంజనం సధ్యగ్వశమానీయ విభ్రమైః ।
పురంజనీ మహారాజ రేమే రమయతీ పతిమ్ ॥
నారద మహర్షి ప్రాచీనబరీషునితో ఇట్లు పలికెను --- ఓ మహా రాజా! పురంజని ఈ విధముగా భర్తయగు పురంజనుని విలాసలతో పూర్తిగా తన వశము చేసుకొని, తాను రమిస్తూ ఆయనను రమింపజేసెను.
స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననామ్ ।
కృతస్వస్త్యయనాం తృప్తామభ్యనందదుపాగతామ్ ॥
ఓ రాజా! సుందరవదనయగు పురంజని చక్కగా స్నానమాడి కుంకుమ మొదలగు మంగళద్రవ్యములతో అలంకరించుకొని, ఆనంద ముతో భర్తయగు పురంజన మహారాజు వద్దకు రాగా, ఆయన ఆమెను అభినందించెను.
తయోపగూఢః పరిరబ్దకంధరో
రహోనుమంతైరపకృష్టచేతనః ।
న కాలరంహో బుబుధే దురత్యయం
దివా నిశతి ప్రమదాపరిగ్రహః ॥
ఆమె ఆతనిని కౌగిలించగా, ఆతడు ఆమె మెడను కౌగిలించెను. ఆమె ఏకాంతములో ఆతనితో గుసగుసలాడుచుండగా, మనస్సు ఆమెచే ఆకర్షించబడి, పురంజనుడు మత్తెక్కించే ఆమెయే జీవితధ్యేయముగా గల వాడు ఆయెను. ఆతనికి రాత్రింబగళ్ల రూపములో పరుగు దీ సే కాలము యొక్క వేగము తెలియలేదు. కాలమును దాటుట ఎవరికైననూ శక్యము కాదు గదా!
శయాన ఉన్నద్దమదో మహామనా
మహాకర్హతల్పే మహిషీభుజోపధిః ।
తామేవ వీరో మనుతే పరం యతః
తమోఽభిభూతో న నిజం పరం చ యత్ ॥
అధికముగా గర్వము పెరిగి వీరుడగు పురంజనుడు పెద్ద అభిమా నము గలవాడయ్యెను. మిక్కిలి విలువైన శయ్య పై భార్య భుజముపై తల పెట్టుకొని పరుండియున్న ఆ రాజునకు ఆమే మాత్రమే పరమపురుషార్థముగా గోచరించెను. అజ్ఞానముచే పరాభూతుడైయున్న ఆ రాజునకు తన స్వరూపమగు పరబ్రహ్మను తెలియుట పురుషార్థమగునని తోచనేలేదు.
తయైవం రమణస్య కామకశ్మలచేతసః ।
క్షణార్ధమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః ॥
ఓ మహారాజా! ఈ విధముగా కామముచే మలినమైన మనస్సు గల పురంజనుడు ఆమెతో గూడి రమించుచుండగా, యౌవనము అర్దక్ష ణము వలే కరిగిపోయెను.
తస్యామజనయత్సుతాన్ పురంజన్యం పురంజనః ।
శతాన్యేకాదశ విరాడాయుషోవర్ధమథోత్యగాత్ ॥
దుహితృర్దశోత్తరశతం పితృమాతృయశస్కరీః ।
శీతాదారగుణోపేతాః పౌరంజన్యః ప్రజాపతే ॥
ఓ ప్రజాపతీ! పురంజన చక్రవర్తికి ఆ పురంజనియందు నూట పద కొండుమంది కొడుకులు, నూట పదిమంది కుమార్తెలు కలిగిరి. అప్పటికి ఆతని ఆయుష్షు సగము గడిచిపోయెను. పౌరంజనీలు అని పేరు పొందిన ఆ కుమార్తెలు సచ్చీలము, పెద్ద మనస్సు అనే మంచి గుణములు గలవారై తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చి పెట్టిరి.
స పంచాలపతిః పుత్రాన్ పితృవంశవివర్దనాన్ ।
దారైస్సంయోజయామాస దుహితృస్సదృశైర్వ రైః ॥
పంచాలదేశప్రభువగు ఆ పురంజనుడు పితృవంశమును వర్ధిల్ల జేసే పుత్రులకు వివాహములను చేసెను. కుమార్తెలకు కూడ అనురూ పులగు వరులతో వివాహములను చేసెను.
పుత్రాణాం చాభవన్ పుత్రా ఏకైకస్య శతం శతమ్ ।
యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః ॥
పురంజనుని ఆ పుత్రులలో ఒక్కొక్కనికి వంద చొప్పున పుత్రులు కలిగిరి. వారు పంచాలదేశములో పురంజనుని వంశమును వర్ధిల్లజేసిరి.
తేషు తద్రిక్థహారేషు గృహకోశానుజీవిషు ।
నిరూఢన మమత్వేన విషయేష్వన్వబధ్యత ॥
ఆ పుత్రులు, వారి పుత్రులు, ఇల్లు, డబ్బు, పరిచారకులు అనువా టియందు పురంజనునకు మిక్కిలి దృఢమగు మమకారము ఏర్పడెను. దాని కారణముగా ఆతడు సంసారములోని శబ్దాదివిషయములయందు గట్టిగా తగుల్కొనేను.
ఈజే చ క్రతుభిర్ఘో రైర్ధీక్షితః పశుమారకైః ।
దేవాన్ పితృన్ భూతపతీన్నానాకామో యథా భవాన్ ॥
అనేకములగు కామనలు గల ఆ పురంజనుడు దీక్షను బూని, పశు హింసతో కూడియుండుటచే భయమును గొల్పే క్రతువులను చేసి, దేవతలు పితృదేవతలు భైరవుడు మొదలగు భూతనాయకులు అనువారిని, నీవు చేసినట్లే ఆరాధించెను.
యుక్తే ష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః ।
ఆససాద స వై కాలో యోకప్రియః ప్రియయోషితామ్ ॥
ఈ విధముగా కుటుంబమునందు తగుల్కొన్న మనస్సు గలవాడై, ఈశ్వరారాధనవంటి యోగ్యములగు ప్రవృత్తులయందు అసావధానముగా నున్న పురంజనునకు ముసలిదనము వచ్చిపడెను. ప్రియమగు భార్యతో రమించ గోరువానికి, తాను ప్రేమించే భార్యకు కూడ ఆ కాలము అనుకూ లము కాదు.
చండవేగ ఇతి ఖ్యాతో గంధర్వాధిపతిర్నృప ।
గంధర్వాస్తస్య బలినష్టష్ట్యుత్తరశతత్రయమ్ ॥
ఓ మహారాజా! చండవేగుడని ప్రసిద్దిని గాంచిన గంధర్వనాయ కుడు ఒకడు గలడు. ఆయన వద్ద బలశాలురగు గంధర్వులు మూడు వందల అరవై మంది గలరు.
గంధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః ।
పరివృత్త్యా విలుంపంతి సర్వకామవినిర్మితామ్ ॥
ఆ గంధర్వునకు అంతే సంఖ్యలో బలవతులగు గంధర్వస్త్రీలు కూడ గలరు. నలుపు, తెలుపు రంగు గల వారు గంధర్వులతో జత గట్టియుండెదరు. సకలభోగ్యవిషయములతో నిర్మించబడిన నగరమును పరిభ్రమిస్తూ, వారు దానిని ఒకరి తరువాత మరియొకరు చొప్పున దోపిడీ జేసెదరు.
తే చండవేగానుచరాః పురంజనపురం యదా ।
హర్తుమారేభిరే తత్ర ప్రత్య షేధత్ప్రజాగరః ॥
చండవేగుని అనుచరులు పురంజనుని నగరమును దోచుకొనుట కారంభించగా, ప్రజాగరుడనే అయిదు తలల పాము వారికి అడ్డుపడెను.
స సప్తభిశతైరేకో వింశత్యా చ శతం సమాః ।
పురంజనపురాధ్యక్షో గంధర్వైర్యుయుధో బలీ ॥
పురంజనుని నగరమునకు అధ్యక్షుడు, బలశాలి అగు ఆ ప్రజాగ రుడు ఒక్కడే ఏడు వందల ఇరవైమంది గంధర్వులతో వంద సంవత్సర ములు నిరంతరముగా పోరాడెను.
క్షీయమాడే స్వసంబంధ ఏకస్మిన్ బహుభిర్యుధా ।
చింతాం పరాం జగామార్తస్స రాష్ట్రపురబాంధవః ॥
అనేకులగు గంధర్వులతో యుద్ధము జరుగుచుండగా, పురంజ నుని రక్షకుడగు ప్రజాగరుడు ఒంటరిగా పోరాడుతూ క్రమముగా నీరసపడు చుండెను. దేశమునకు, నగరమునకు కూడ ప్రభువగు ఆ పురంజనుడు అప్పుడు చాల దుఃఖమును, చింతను పొందెను.
స ఏవ పుర్యాం మధుభుక్ పంచాలేషు స్వపార్షదైః ।
ఉపవీతం బలిం గృహ్ణన్ స్త్రీజితో నావిదద్భయమ్ ॥
భార్యకు వశుడైయున్న ఆ పురంజనుడు పంచాలదేశములో ఆ నగరమునందు తన అనుచరులచే తీసుకురాబడిన కప్పమును గ్రహిస్తూ సుఖములననుభవిస్తూ ఉండెను. ఆతనికి మీద పడిన ఈ భయమును గురించి తెలియకుండెను.
కాలస్య దుహితా కాచిత్తిలోకీం వరమిచ్చతీ ।
పర్యటంతీ న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన ॥
ఓ బర్హిషత్ మహారాజా! కాలునకు జర అనే ఒక కుమార్తె ఉండెను. ఆమె భర్తను గోరి ముల్లోకములను తిరిగెను. కాని, ఒక్కరికైననూ ఆమే నచ్చలేదు.
దౌర్బాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా ।
యా తుష్టా రాజర్షయే తు వృతాదాత్పూరవే వరమ్ ॥
ఆమె చాల దురదృష్టవంతురాలగుటచే లోకములో దుర్బగ అని ప్రఖ్యాతిని గాంచినది. ఆమె రాజర్షియగు పూరువు తనను స్వీకరించినందు లకు చాల సంతోషించి, ఆయనకు రాజ్యాధికారము అనే వరమునిచ్చినది.
కదాచిద్రటమానా సా బ్రహ్మలోకాన్మహీం గతమ్ ।
వవ్రే బృహదతం మాం తు జానతీ కామమోహితా ॥
ఆమె కామముచే మోహమును పొంది తిరుగాడుచుండెను. నేను ఒకప్పుడు బ్రహ్మలోకమునుండి భూలోకమునకు వెళ్లితిని. నేను నైష్ఠిక బ్రహ్మచారినని తెలిసి కూడ ఆమె నన్ను అచట వరించెను.
మయి సంరభ్య విపులమదాచ్ఛాపం సుదుస్సహమ్ ।
స్థాతుమర్హసి నైకత్ర మద్యాబ్ఖవిముఖో మునే ॥
ఆమె నాయందు కోపించి నాకు మిక్కిలి సహించ శక్యము కాని పెద్ద శాపమునిచ్చినది. ఓ మునీ! నీవు నా కోరిక విషయములో విముఖు డవై ఉన్నావు గనుక, నీవు ఒకచోట స్థిరముగా నుండజాలవు అని ఆమె శపించినది.
తతో విహతసంకల్పా కన్యకా యవనేశ్వరమ్ ।
మయోపదిష్టమాసాద్య వవ్ర నామ్నా భయం పతిమ్ ॥
ఈ విధముగా ఆ కన్యయొక్క సంకల్పము భగ్నమైన తరువాత, ఆమెకు భయుడనే పేరు గల యవనప్రభుని నేనే సూచించితిని. ఆమె నా సూచన ప్రకారముగా ఆతని వద్దకు వెళ్లి, ఆతనినే భర్తగా వరించెను.
ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిమ్ ।
సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల న రిష్యతి ॥
ఓ వీరా! యవనులలో శ్రేష్టుడవగు నిన్ను నేను నా మనస్సునకు నచ్చిన భర్తగా వరించుచున్నాను. ప్రాణులు నీ యెడల చేసిన సంకల్పము విఫలము కాదు గదా!
ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహా ।
యల్లోకశాస్తోపనతం న రాతి న తదిచ్ఛతి ॥
లోకవ్యవహారములో గాని, శాస్తోపదేశముచే గాని దానము చేయ వలసిన దానిని దానము చేయనివాడు, అదే రీతిలో సంప్రాప్తమైన దానిని స్వీకరించనివాడు అనే వీరిద్దరు మూర్ఖులు. వీరి పట్టుదల వ్యర్థ మైనది. వీరు శోకింప దగినవారు.
అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ।
ఏతావాన్ పౌరుషో ధర్మోయదార్తాననుకంపతే ॥
ఓ మంగళకరమైన వాడా! కావున నిన్ను ప్రేమించుచున్న నన్ను స్వీకరించుము. నాపై దయను చూపుము. దీనుల యెడల దయను చూపు టయే పురుషులు చేయదగిన ధర్మము.
కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వరః ।
చికీర్షుర్దేవగుహ్యం స సస్మితం తామభాషత ॥
కాలకన్యయగు జర చెప్పిన మాటలను విని, ఆ యవనప్రభుడు దేవతల రహస్యకార్యమునొకదానిని చేయగోరి, చిరునవ్వుతో ఆమెను ఉద్దే శించి ఇట్లు పలికెను.
మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా ।
నాభినందతి లోకోకయం త్వామభద్రామసంమతామ్ ॥
నేను ఏకాగ్రమగు చిత్తముతో ఆలోచించి, నీకు భర్తను కనుగొంటిని. నీవు అమంగళకరురాలవగుటచే లోకులకు నీవు నచ్చుబాటు అగుట లేదు. కావుననే, వారు నిన్ను స్వీకరించుట లేదు.
త్వమవ్యక్తగతిర్బుంక్ష్వ లోకం కర్మవినిర్మితమ్ ।
యా హి మే పృతనాయుక్తా ప్రజానాశం ప్రణీష్యసి ॥
నీ రాక ఎవ్వరికైననూ తెలియదు. నీవు కర్మలచే నిర్మితమైన ఈ ప్రాణుల శరీరములను అనుభవించుము. నా సైన్యము నీకు తోడు కాగల దు. నీవు సకలప్రాణులను నశింప జేయగలవు.
ప్రజ్వారోయం మమ భ్రాతా త్వం చ మే భగినీ భవ ।
చరామ్యుభాభ్యాం లోకేకస్మిన్నవ్యక్తో భీమ సైనికః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పురంజనోపాఖ్యానే కాలకన్యోపాఖ్యానవర్ణనం నామ సప్తవింశోఽధ్యాయః ॥
ఈ ప్రజ్వారుడు నాకు తమ్ముడు. నీవు కూడ నాకు చెల్లెలివి కమ్ము. మీ ఇద్దరు తోడు కాగా, భయంకరులగు సైనికులు గల నేను ఎవ్వ రికైననూ తెలియకుండా ఈ లోకములో సంచరించెదను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పురంజనోపాఖ్యానములో కాలకన్యోపాఖ్యానమును వర్ణించే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 27 of the Bhāgavata Mahā Purana is as follows:
Nārada describes how the city of Purañjana is eventually attacked by a powerful Gandharva king named Caṇḍavega, who represents the swift, irresistible passage of time with his three hundred and sixty male and female soldiers symbolizing days and nights. Simultaneously, the personification of old age, Kālakanyā, along with her brother Fear and an army of diseases, invades the city, rapidly deteriorating Purañjana’s physical body and sensory capacities.