9 - ధ్రువోపాఖ్యానము - ధ్రువునకు శ్రీహరి సాక్షాత్కరించుట,ధ్రువస్తుతి, ధ్రువుని రాజ్యాభిషేకము

మైత్రేయ ఉవాచ

త ఏవముత్పన్నభయా ఉరుక్రమే

కృతావనామాః ప్రయయుస్త్రీవిష్టపమ్

 సహస్రశీర్షాపి తతో గరుత్మతా

మధోర్వనం భృత్యదిదృక్షయా గతః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా భగవానుడు చెప్పుటచే దేవతల భయము తొలగిపోయినది. ఆయన వామనుడై పెద్ద పెద్ద అడుగులతో ముల్లోకములను కొలిచి దేవతల భయమును పోగొట్టినా డు. ఆ దేవతలు అట్టి తమ రక్షకునకు నమస్కరించి స్వర్గమునకు వెళ్లిరి. తరువాత శ్రీహరి తన భక్తుడగు ధ్రువుని చూచే కోరికతో గరుత్మంతుని అధిష్టించి మధువనమునకు వెళ్లాను. సకలప్రాణుల రూపములో శ్రీహరియే ఉన్నాడు గనుక, ప్రాణుల తలలన్నియు ఆయన తలలే గనుక, ఆయన అనంతములగు శిరస్సులు గలవాడైనాడు.

స వై ధియా యోగవిపాకతీవ్రయా

 హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభమ్

 తిరోహితం సహసైవోపలక్ష్య

 బహిఃస్థితం తదవస్థం దదర్శ

ఆ ధ్రువుని బుద్ది, సమాధియొక్క అభ్యాసము పరిపక్వమగుటచే, స్థిరముగా భగవానునియందు నిలిచియుండెను. ఆతడు హృదయపద్మము లోపల మెరుపు వలె ప్రకాశించే భగవానుని రూపముపై మనస్సును నిలిపి. యుంచెను. కావుననే, బయటనున్న శ్రీహరిని గాంచలేదు. కాని, ఆ రూపము హఠాత్తుగా చెదరిపోగా, ఆతడు కనులను తెరిచి, అదే రూప మును తన యెదుట బయట గాంచెను.

తద్దర్శనేనాగతసాధ్వసః క్షితా-

వవందతాంగం వినమయ్య దండవత్

 దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివార్భకః

చుంబన్నివా స్యేన భుజైరీవాశ్లిషన్

భగవానుని ఆ రూపమును చూడగానే పిల్లవాడగు ధ్రువుడు కంగారు పడిపోయెను. ఆతడు వెంటనే నేలపై బడి సాష్టాంగప్రణామమునా చరించెను. ఆతడు కన్నులతో భగవానుని రూపమును పానము చేయుచు న్నాడా యన్నట్లుగా, ఆయన ముఖమును ముద్దాడుచున్నాడా యన్నట్లుగా, ఆయన నాలుగు చేతులతో తనను కౌగిలింప జేసుకోనుచున్నాడా యన్నట్లుగా, రెప్పపాటు లేకుండగా చూచుచుండెను.

 స తం వివక్షంతమతద్విదం హరి

 జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః

కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా

పస్పర్శ బాలం కృపయా కపోల

శ్రీహరి ధ్రువుని హృదయములో మాత్రమే గాక, సకలప్రాణుల బుద్ధిగుహయందు ఆత్మ చైతన్యరూపుడై విరాజిల్లుచున్నాడు. ఆ ధ్రువుడు ఏదో మాటలాడగోరుచున్నాడనియు, కాని పిల్లవాడగుటచే మాటలాడుటఎరుగకున్నాడనియు. ఆయనకు తెలిసిపోయేను. ఆయన దయతో వాని చెక్కిలిపై వేదరూపమగు శంఖముతో స్పృశించెను.

స వై తదైవ ప్రతిపద్య తాం గిరం

 దైవీం పరిజ్ఞాతపరాత్మనిర్ణయః

తం భక్తిభావోకభ్యగృణాదసత్వరం

పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితిః

అదే క్షణములో ధ్రువునకు శ్రీహరిని ప్రతిపాదించే వేదవాణి శ్రీహరి అనుగ్రహము చేతనే ఆవిష్కృతమయ్యేను. ఆతనికి పరమాత్మ యొక్క స్వరూపము పూర్ణముగా తెలి సేను. ఆతడు ధ్రువమగు స్థానమును పొందబోవుచున్నాడు. అట్టి ధ్రువుడు తొందరపాటు లేనివాడై భక్తితో నిండిన హృదయముతో భగవానుని స్తుతించెను. శ్రీహరి భగవానుని గొప్ప కీర్తి సర్వత్రా (వేదములలో, లోకములలో) వ్యాపించియుండును గదా!

ధ్రువ ఉవాచ

 యోకంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం

 సంజీవయత్యఖిలశక్తిధరస్స్వధామ్నా

 అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్

ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్

       ధ్రువుడు ఇట్లు పలికేను --- ఓ భగవానుడా! నీవు సకలశక్తులను ధరించియున్న పూర్ణ పురుషుడవు. నీవే నా హృదయములో ప్రవేశించి అంతర్యామివై, గట్టిగా నిద్రించియున్న నా ఈ వాక్కును, మరియు చేతులు కాళ్లు చెవులు చర్మము మొదలగు ఇతర-ఇంద్రియములను నీ చైతన్యజ్యోతిచే పునరుజ్జీవింప జేయుచున్నావు. నీకు నమస్కారము.

ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా

మాయాఖ్యయోరుగుణయా మహదాద్య శేషమ్

సృష్ట్వానువైశ్య పురుషస్తదసద్గుణేషు

నానేవ దొరుషు విభావసువద్విభాసి

     ఓ భగవానుడా! అద్వితీయుడవగు నీ శక్తికి మాయ అని పేరు. అది సత్త్వము, రజస్సు, తమస్పు అనే మూడు గుణములను కలిగియున్నది. మహత్తత్త్వము (సమష్టిబుద్ధిశక్తి) తో మొదలిడి స్థూలభూతముల వరకు గల తత్త్వములనన్నింటినీ నీవు ఆ మాయాశక్తి చేతనే సృజించుచున్నావు. ఆ తత్త్వముల పరిణామమే ఈ జగత్తు. మాయాశక్తియొక్క గుణముల పరి ణామము చేతనే ఈ జగత్తులోని పదార్ధములన్నియు ఆవిర్భవించినవి. కాని, ఈ జగత్తునకు సత్తాస్ఫూర్తిరూపముగా అంతర్యామివై నీవే ఉనికిని కలిగించుచున్నావు. స్వతంత్రమగు సత్తాస్పూర్తులు లేని ఈ జగత్తు మిథ్య. అట్టి ఈ నానారూపమగు జగత్తులో అద్వితీయుడవైన నీవే, కట్టెలలో నిప్పు వలే, అనేకరూపములలో ప్రకాశించుచున్నావు.

త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం

సుప్తః ప్రబుద్ద ఇవ నాథ భవతపన్నః

 తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం

విస్మర్యతే కృతవిదా కథమార్తబంధో

ఆపదలలోనున్నవారిని రక్షించే ఓ జగన్నాథా! నిద్రించిన వ్యక్తి మేల్కాంచిన వెంటనే ఈ జగత్తును కనుచున్నాడు. అదే విధముగా, సర్వజనులు ఈ జగత్తును చూడగల్గుచున్నారు. అట్లు చూడగల్గుటకు కారణము నీవు ఆత్మ చైతన్యరూపుడవై ఇంద్రియములను, బుద్ధిని ప్రకాశింపజేయుటయే. (బ్రహ్మగారు నీవు ఇచ్చిన జ్ఞానము చేతనే ఈ విశ్వమును చూచినాడు). ఇట్లు మానవుడు ఆత్మరూపుడవగు నిన్ను ఆశ్రయించియే జగత్తును చూడగల్గుచున్నాడు. చేసిన ఉపకారమును గుర్తించే స్వభావము గల వివేకి, అంతర్యామివై - తనకు సత్తాస్ఫూర్తులను కలుగచేయుచున్న నీయొక్క పాదమూలమును ఎట్లు విస్మరించ గల్గును? మోక్షమును కోరు భక్తులు నీ పాదమూలమును శరణు పొందెదరు.

నూనం విమృష్ణమతస్తవ మాయయా తే

యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః

అర్చంతి కల్పకతరుం కుణపోపభోగ్య-

మిచ్ఛంతి యత్ స్పర్శజం నిరయేపి నృణామ్

నీవు కల్పవృక్షమువంటి వాడవు. నీవు భక్తులకు జన్మమరణముల నుండి మోక్షమును అనుగ్రహించెదవు. కాని, కొందరు నీ మాయచే మోహింపజేయబడిన చిత్తములు గలవారై ఇతరములగు ప్రయోజనముల కొరకు నిన్ను పూజించుచున్నారు. వారు ఈ శవము వంటి శరీరముచే అను భవించబడే ఇంద్రియవిషయసంయోగజన్యమగు సుఖములను కోరుచు న్నారు. ఇట్టి సుఖములు మానవులకు నరకమునందు కూడ కొద్దో గొప్పో లభించును.

యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ-

ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్

సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్

కిం త్వంతకాసిలులితాత్పతతాం విమానాత్

ఓ ప్రభూ! మానవులకు నీ పాదపద్మములను ధ్యానించుట వలన, నీ భక్తులతో గూడి నీ గాథలను శ్రవణము చేయుట వలన కలిగే ఆనందము స్వయంప్రకాశస్వరూపమగు పరబ్రహ్మయందైననూ లేదు. అనగా, ఈ ఆనందము బ్రహ్మానందము కంటే గొప్పది. అట్లేనచో, స్వర్గములో విమాన ములో సంచరించే పుణ్యాత్ముల పుణ్యమును కాలము అనే కత్తి ఛేదించివే యగా, అక్కడనుండి వారు భూలోకమునకు పడిపోవుదురు (భూలోక ములో జన్మించెదరు). అట్టివారికి ఈ ఆనందము కలుగదని వేరుగా చెప్ప వలయునా?

భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసంగో  

భూయాదనంత మహతామమలాశయానామ్

 యేనాంజసోల్బణమురువ్యసనం భవాబ్ధం

 నేష్యే భవద్గుణకథామృతపానమత్తః

ఓ అనంతా! పరిశుద్దమగు అంతఃకరణము గల మహాత్ములు నిరం తరము తమ మనోవృత్తుల ప్రవాహమును నీయందు లగ్నము చేసి భక్తిని చేయుదురు. అట్టి మహాత్ముల గొప్ప సంగము నాకు లభించుగాక! అట్టి మహాత్ములు నీ గుణములను వర్ణించుచుండగా, ఆ అమృతమును పానము చేసి, నేను మహానందమును పొందుచున్నవాడనై, పెద్ద ఆపద లతో కూడియున్న భయంకరమగు ఈ సంసార సముద్రమును తేలికగా దాటివేయగలను.

తే న స్మరంత్యత్తరాం ప్రియమీశ మర్త్యం

 యే చాన్వదస్సుతసుహృధృహవిత్తదారాః

యే త్వట్జనాభ భవదీయపదారవింద-

 సౌగంధ్యలుబ్దహృదయేషు కృతప్రసంగాః

ఓ పద్మనాభా! నీవే నా ప్రభుడవు. పద్మములవంటి నీ పాదముల పరిమళముచే ఆకర్షితమైన హృదయము గల నీ భక్తులతోడి సంగము చాల గొప్పది. అట్టి సంగమును చేయువారు, మిక్కిలి ప్రియమైననూ నశించే స్వభావము గల ఈ దేహమును గాని, దానిని బట్టి వచ్చే సంతానము మిత్రులు ఇల్లు ధనము భార్య (లేక భర్త) అనువాటిని గాని స్మరించరు.

తిర్యజ్నగద్విజసరీసృపదేవదైత్య-

మర్త్యాదిభిః పరిచితం సదసద్విషమ్

 రూపం స్థవిష్ణమజ తే మహదాద్యనేకం

 నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః

ఓ పరమేశ్వరా! నీకు పుట్టుక లేదు. నీ ఈ స్థూలమగు విరాడ్రూ పము పశువులు, చెట్లు, పక్షులు, పాములు, దేవతలు, రాక్షసులు, మాన వులు మొదలగు ప్రాణులతో నిండియున్నది. దీనియందు స్థూలపంచభూత ములు (పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము), సూక్ష్మభూతములు (గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము) అనే తేడాలు కనబడును. మరియు, మహత్తత్త్వము మొదలగు కారణతత్త్వములన్నియు ఈ విరా డ్రూపములో అంతర్గతమగుచున్నవి. నేను ఈ విరాడ్రూపమును గురించి మాత్రమే తెలుసుకున్నాను. దీనికి అతీతమైన నిర్గుణ పరబ్రహ్మ తత్త్వమును నేను యెరుగను. ఆ తత్త్వము వాక్కులకు గాని, ఊహకు గాని అందదు గదా!

 కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్

శేతే పుమాన్ స్వదృగనంతసఖస్తదంకే

 యన్నాభిసింధురుహకాంచనలోకపద్మ-

 గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై

కల్పము అంతమైనప్పుడు, ఆదిపురుషుడు, స్వయంప్రకాశ స్వరూపుడు అగు శ్రీహరి ఈ సకలజగత్తును తన ఉదరములోనిడుకొని, ఆదిశేషుడే తోడు కాగా, ఆయన ఒడిలో యోగనిద్రను పొందును, సముద్ర మువంటి ఆయన నాభినుండి ముల్లోకములు బంగరు పద్మము రూప ములో ఉదయించును. ఆ పద్మము మధ్యలో గొప్ప కాంతి గల బ్రహ్మ ప్రకటమగును. అట్టి శ్రీహరి భగవానుని నేను నమస్కరించుచున్నాను.

త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా

 కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః

యద్బుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా

 ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే

నిత్యముక్తము, నిత్యశుద్దము, నిత్యబుద్దము మరియు నిర్వికా రము అగు ఆత్మ నీవే. నీవు సర్వజగత్కారణుడవు, పూర్ణుడవు, షడ్గుణేశ్వ ర్యసంపన్నుడవు, త్రిగుణాత్మికయగు ప్రకృతికి అధిష్ఠానమవు, ముల్లోకము లకు నాథుడవు. నీవు జీవుని బుద్ధియొక్క వేర్వేరు అవస్థలకు సాక్షిగా ఉండే చైతన్యమవు. నీ స్వయంప్రకాశ చైతన్యము ఏకరసము (ఖండములు లేనిది). స్థితి కాలములో నీవు యజ్ఞమునకు అధిష్టాన దైవమవు. నీవు నీయందు ప్రకాశించే వినాశియగు జగత్తుకంటే విలక్షణుడవు.

యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశంపతంతి

విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్

తదహ్మ విశ్వభవమేకమనంతమాద్య-

 మానందమాత్రమవికారమహం ప్రపద్యే

పరస్పర విరుద్ధములగు విద్య-అవిద్య, సృష్టి-ప్రళయము మొద లగు వివిధశక్తులు నిరంతరముగా ఒకదాని తరువాత మరియొకటిగా ఆ అద్వయ పరబ్రహ్మయందు అకస్మాత్తుగా ఉద్భవించుచుండును. కాలపరి చ్ఛేదము లేని పరబ్రహ్మనుండీయే ఈ జగత్తు పుట్టినది. ఆనందఘనమగు ఆ పరబ్రహ్మ వికారములేమియు లేకుండగనే సర్వకారణమగుచున్నది. అట్టి పరబ్రహ్మను నేను శరణు పొందుచున్నాను.

సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మ-

మాశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః

అ ప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్

వాశైవ వత్సకమనుగ్రహకాతరోకస్మాన్

ఓ భగవానుడా! సర్వమానవులచే కోరబడే ఆనందమునకు నీ పద్మమువంటి పాదమే నిధానము. నిన్ను నిష్కామభావనతో సేవించు వ్యక్తికి, పదోన్నతి మొదలగు ఇతరఫలములకంటే, నీ పద్మమువంటి పాదమును సేవించుటయే యథార్థమగు ఫలము అగుచున్నది. (భగవద్భక్తికి ఫలము భగవానుడే). అయిననూ, ఓ మహానుభావా! భగవానుడవగు నీవు భక్తులననుగ్రహించుటకు తహతహలాడుచుందువు. కొత్తగా ఈనిన ఆవు దూడను కాపాడు విధముగా, నీవు దీనులమగు మమ్ములను అన్ని విధములుగా కాపాడుచున్నావు.

మైత్రేయ ఉవాచ

అథాభిష్ణుత ఏవం వై సత్సంకల్సేన ధీమతా

 భృత్యానురక్తి భగవాన్ ప్రతినంద్యేదమబ్రవీత్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను -- ధ్రువుడు శుభకరమైన సంకల్పశక్తి గల బుద్దిమంతుడు. ఆతడు ఈ విధముగా స్తుతించిన తరువాత, భక్తవత్సలుడగు శ్రీహరి భగవానుడు ఆతనిని అభినందిస్తూ ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ

వేదాహం తే వ్యవసితం హృది రాజన్యబాలక

 తతయచ్చామి భద్రం తే దురాపమపి సువ్రత

శ్రీహరి భగవానుడు ఇట్లు పలికెను --- ఓ రాజకుమారా! నీవు ఉత్తమమగు ప్రతనిష్ఠ గలవాడవు. నీ హృదయములోనున్న నిశ్చయము నాకు తెలియును. నీవు కోరేది పొంద శక్యము కానిదే అయినా, నీకు ఇచ్చే దను. నీకు మంగళమగు గాక!

నాన్యైరధిష్ఠితం భద్ర యదాజిష్ణు ధ్రువక్షితి

యత్ర గ్రహరీక్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితమ్

మేడ్యాం గోచక్రవత్ స్థాస్ను పరస్తాత్కల్పవాసినామ్

కల్యాణగుణములు గల ఓ ధ్రువా! నీవు పొందబోయే లోకము ఉజ్జ్వలముగా ప్రకాశించును. దానిని ఇతరులు అధిరోహించలేరు. నీవు అచట శాశ్వతముగా నివసించగలవు. గ్రహములు, నక్షత్రములు, తారాగణములు, గడ్డినూర్చేటప్పుడు కర్ర చుట్టూ తిరిగే ఎద్దులవలె, ఆ లోకమునకు నిబద్దములై యుండును. కల్పములోపల తిరిగి భూలోకములో జన్మించే పుణ్యాత్ములు ఊర్ధ్వలోకములనుండి మరలి వచ్చుచుందురు. కాని, నీకు ఈ లోకము కల్పాంతము వరకు నిలిచియుండును.

ధర్మోగ్నిః కశ్యపశ్శుక్రో మునయో యే వనౌకసః

 చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్సతారకాః

ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, వానప్రస్థ ధర్మముచే గొప్ప పుణ్యమును సంపాదించిన సప్తర్షులు నక్షత్రరూపములో ఇతరతారాగణము లతో కలిసి, ఆ లోకము చుట్టూ నిరంతరముగా ప్రదక్షిణము చేయుదురు.

ప్రస్థితే తు వనం పిత్రా దత్త్వా గాం ధర్మసంశ్రయః

షట్తోంశద్వర్షసాహస్రం రక్షితావ్యాహతేంద్రియః

తండ్రి నీకు రాజ్యమునప్పజెప్పి వానప్రస్థమునకు వెళ్లిన తరువా త, నీవు ఆ రాజ్యమును ముప్పది ఆరు వేల సంవత్సరములు రక్షించెదవు. నీవు ధర్మమును ఖచ్చితముగా పాలిస్తూ, ధర్మార్థకామములు అనే పురుషార్థములలో పరస్పరవిరోధము లేని విధముగా ఇంద్రియభోగములను అను భవించెదవు. నీకు ఇంద్రియముల పాటవము కోరవడదు.

త్వద్బోతర్యుత్తమే నష్టే మృగయాయాం తు తన్మనాః

అన్వేషంతీ వనం మాతా దావాగ్నిం సా ప్రవేక్ష్యతి

నీ తమ్ముడగు ఉత్తముడు వేటలో మరణించగలడు. ఆతనిని మరచిపోలేని ఆతని తల్లియగు సురుచి అడవిలో ఆతనినే వెదుకుతూ, కార్చిచ్చులో ప్రవేశించి మరణించగలదు.

ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞః పుష్కలదక్షిణైః

భుక్త్వా చేహాశిషస్సత్యా అంతే మాం సంస్మరిష్యసి

యజ్ఞమే నా హృదయము. అట్టి నన్ను నీవు పుష్కలమగు దక్షి ణలు గల యజ్ఞములతో ఆరాధించెదవు. ఈ లోకములో ఉత్తమమగు భోగ ములననుభవించి, నీవు అవసానకాలములో నన్ను చక్కగా స్మరించెదవు.

తతో గంతాగి మత్స్థానం సర్వలోకనమస్కృతమ్

ఉపరిష్టాదృషిభ్యస్త్వం యతో నావర్తతే యతిః

తరువాత నీవు సర్వలోకములచే నమస్కరించబడే నా లోకమును చేరెదవు. అది సప్తర్షిమండలమునకు పైన గలదు. అక్కడకు యతీశ్వరులు మాత్రమే చేరెదరు. ఒకసారి అక్కడకు చేరిన పిదప, తిరిగి జన్మించుట ఉండదు.

మైత్రేయ ఉవాచ

 ఇత్యర్చితస్స భగవానతిదిశ్యాత్మనః పదమ్

బొలస్య పశ్యతో ధామ స్వమగాధరుడధ్వజః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- గరుడధ్వజుడగు ఆ శ్రీహరి భగవానుడు ఈ విధముగా బాలకుడగు ధ్రువునిచే ఆరాధించబడి, ఆతనికి తన ధామముననుగ్రహించి, ఆతడు చూచుచుండగనే, తన ధామమునకు వెళ్లెను.

సోపి సంకల్పజం విష్ణోః పాద సేవోపసాదితమ్

ప్రాప్య సంకల్పనీర్వాణం నాతిప్రీతోకభ్యగాత్పురమ్

శ్రీహరియొక్క పాదములను సేవించుటచే ధ్రువుని సంకల్పము పూర్ణమయ్యెను. ఆతని మనోరథము నెరవేరెను. కానీ, ఆతనికి పూర్ణమగు ప్రీతి కలుగలేదు. అప్పుడు ధ్రువుడు కూడ తన నగరమునకు వెళ్లెను.

విదుర ఉవాచ

సుదుర్లభం యత్పరమం పదం హరేః

మాయావినస్తచ్చరణార్చనార్చితమ్

 లబ్ధాప్యసిద్ధార్థమివైకజన్మనా

కథం స్వమాత్మానమమన్యతార్థవిత్

విదురుడు ఇట్లు పలికెను --- మాయాధీశుడగు శ్రీహరియొక్క సర్వోత్కృష్టమగు ధామము మోసగాళ్లకు మిక్కిలి దుర్లభము. ఆయన పాదములను అర్చించు భక్తులకు మాత్రమే అది లభించును. సారతత్త్వము నెరింగిన ధ్రువుడు ఒకే జన్మలో ఆ ధామమును పొందినప్పటికీ, తన మనో రథము సిద్ధించలేదా యన్నట్లు తలపోయుటకు కారణమేమి? మైత్రేయ ఉవాచ

మాతుస్సపత్న్యా వాగ్బా గైర్హృది విద్దస్తు తాన్ స్మరన్

నైచ్ఛన్ముక్తిపతేర్ముక్తిం తస్మాత్తాపము పేయివాన్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- సవతి తల్లి ఈటెల వంటి పలుకులతో ధ్రువుని హృదయమును గాయపరచెను. ఆతడు ఆ పలుకు లనే స్మరిస్తూ, ముక్తిని ఇచ్చే ప్రభుడగు శ్రీహరినుండి ముక్తిని కోరలేదు. ఆ కారణముచే, ఆతడు దుఃఖించేను.

ధ్రువ ఉవాచ

 సమాధినా నైకభవేన యత్పదం

విదుస్సనందాదయ ఊర్ధ్వరేతసః

మా సైరహం షడ్బిరముష్య పాదయోః

ఛాయాము పేత్యాపగతః పృథజ్మతిః

ధ్రువుడు ఇట్లు పలికెను --- సనక సనందనాది నైష్ఠిక బ్రహ్మచా రులు అనేకజన్మలలో ఏకాగ్రమగు ధ్యానమునభ్యసించి, ఆ శ్రీహరి స్వరూ పమును జ్ఞానముచే పొందిరి. నేను అట్టి శ్రీహరి పాదముల నీడను ఆరు నెలల తపస్సుచే చేరుకొంటిని. కాని, భేదదృష్టి (సవతి తల్లి వేరు అనే దృష్టి) గలవాడనగుటచే, దానికి మరల దూరమైతిని.

అహో బత మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత

భవచ్ఛిదః పాదమూలం గత్వా యాచే యదంతవత్

ఆశ్చర్యము! దురదృష్టవంతుడనగు నా మూర్ఖత్వమును కనుడు. అయ్యో! నేను సంసారమును తొలగించే శ్రీహరి పాదమూలమును చేరు కొంటిని. కాని, వినష్టమయ్యే పదవిని మాత్రమే కోరుకుంటిని.

మతిర్విదూషితా దేవైః పతద్భిరసహిష్ణుభిః

యో నారదవచస్తథ్యం నాగ్రాహిషమసత్తమః

దేవతలు. నేను పొందబోయే లోకముకంటే తక్కువ స్థానమునం దుండెదరు, పైగా, పుణ్యము ఖర్చు కాగానే వారి స్వర్గలోకనివాపము అంత మగును. కావుననే, నా అభివృద్ధిని చూచి ఓర్వలేక, వారు నా బుద్దిని కలు షితము చేసినారు. అందువలననే, మిక్కిలి ఆయోగ్యుడనగు నేను నారద మహర్షియొక్క యథార్థవచనమును చెవిని పెట్టనైతిని.

దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్

 తప్యే ద్వితీయేప్యసతి భ్రాతృభాతృవ్యహృద్రుజా

నేను శ్రీహరి మాయచే మోహితుడనైతిని. నిద్రించుచున్న వ్యక్తి స్వప్నములో రెండవది లేకున్ననూ తనకంటే ఇతరము ఉన్నదని దర్శించు ను. అదే విధముగా వాస్తవముగా ఆత్మకంటే భిన్నముగా ఏదియు లేకున్న నూ, నేను తమ్ముడే శత్రువు అనే హృదయపీడతో తాపమును పొందుచు న్నాను.

మయైతత్ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి

 ప్రసాద్య జగదాత్మానం తపసా దుషసాదనమ్

 భవచ్ఛిదమయాచేకహం భవం భాగ్యవివర్జితః

  నేను కోరిన ఈ కోరిక మరణించినవానికి చికిత్స వలె వ్యర్థము. జగత్తునకు ఆత్మయగు శ్రీహరిని ప్రసన్నుని చేసుకొనుట చాల కఠినము. పంసారమును తొలగించే అట్టి శ్రీహరిని నేను తపస్సుచే ప్రసన్నునిగా చేసుకొంటిని. కాని, భాగ్యము నాకు దూరమగుటచే, నేను ఆయననుండి సంసారమునే కోరితిని.

స్వారాజ్యం యచ్ఛతో మౌఢ్యన్మానో మే భిక్షతో బత

ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారానివాధనః

 అయ్యో! ఈశ్వరుడు మోక్షసామ్రాజ్యమును ఇచ్చును. కాని, మూర్ఖుడనగు నేను పుణ్యము క్షీణించుటచే, ధనము లేనివాడు బియ్యపు గింజలను బిచ్చమెత్తు విధముగా, ఆయననుండి అభిమానమును పెంచే ఉన్నతపదమును కోరితిని.

మైత్రేయ ఉవాచ

న వై ముకుందస్య పదారవిందయో

 రజోజుషస్తాత భవాదృశా జనాః

వాంఛంతి తద్దాస్యమృతేకార్థమాత్మనో

 యదృచ్చయా లబ్దమనస్సమృద్ధయః

వత్సా విదురా! నీవంటి నిష్కామభక్తుల మనోరథములు ఈశ్వరే చ్చచే లభించిన దానితోడనే తీరిపోవును. మోక్షదాతయగు శ్రీహరియొక్క పాదపద్మముల ధూళిని సేవించే నీవంటివారలు ఆయన సేవను మినహాయించి, తమకొరకై దేనినైననూ కోరుకొనరు.

ఆకర్ణ్యాత్మజమాయాంతం సంపరేత్య యథాగతమ్

రాజా న శ్రద్ధధే భద్రమభద్రస్య కుతో మమ

మరణించినవాడు తిరిగి వచ్చినాడన్నచో, నమ్మకము కుదరదు. అదే విధముగా, తన కుమారుడు తిరిగి వచ్చుచున్నాడన్న వార్తను విన్న ఉత్తానపాద మహారాజునకు నమ్మకము కలుగలేదు. అభాగ్యుడనగు నాకు అంతటి భాగ్యమెక్కడిది? అని ఆయన భావించెను.

శ్రద్ధాయ వాక్యం దేవర్షేర్హర్షవేగేన ధర్షితః

 వార్తాహర్తురతిక్రీతో హారం ప్రాదాన్మహాధనమ్

కాని, ఉత్తానపాద మహారాజునకు దేవర్షియగు నారదుని మాట గుర్తు వచ్చి ఆ వార్తను విశ్వసించెను. అప్పుడాయన హర్షముయొక్క వేగ ముచే కదలాడిపోయెను. ఆయన చాల సంతోషించి వార్తను తెచ్చిన వ్యక్తికి మిక్కిలి విలువైన హారమును బహుమతిగా ఇచ్చెను,

సదశ్వం రథమారుహ్య కార్తస్వరపరిష్కృతమ్

బ్రాహ్మణైః కులవృధైశ్చ పర్యస్తోమాత్యబంధుభిః

 శంఖదుందుభినాదేన బ్రహ్మ ఘోషేణ వేణుభిః

నిశ్చక్రామ పురాతూత్మజాభీక్షణోత్సుకః

ఉత్తానపాద మహారాజు పుత్రుని ముఖమును చూడాలనే ఉత్సాహ ముతో, బంగారముతో అలంకరించబడి మంచి గుర్రములను పూన్చిన రథ మునెక్కి వెంటనే నగరమునుండి బయలు దేరెను. బ్రాహ్మణులు, కుల పెద్ద లు, మంత్రులు, బంధువులు ఆయనను చుట్టువారియుండిరి. జనులు శంఖములను, దుందుభులను, పిల్లనగ్రోవులను వ్రాయించుచుండిరి. వేద పండితులు వేదమంత్రములను బిగ్గరగా పఠించుచుండిరి.

సునీతిస్సురుచిశ్చాస్య మహిష్యా రుక్మభూషితే

 ఆరుహ్య శిబికాం సార్ధముత్తమేనాభిజగ్మతు

ఉత్తానపాదుని పట్టమహిషులు అగు సునీతి, సురుచి కూడ - బంగరు ఆభరణములతో అలంకరించు కొనిరి. వారు ఉత్తమునితో గూడి పల్లకీనెక్కి ధ్రువునకు ఎదురేగిరి.

తం దృష్ట్వాపవనాభ్యాశ ఆయాంతం తరసా రథాత్

 అవరుహ్య నృపస్తూర్ణమాసాద్య ప్రేమవిహ్వలః

 పరిరేభేకంగజం దోర్భ్యాం దీర్ఘత్కంఠమనాశ్శ్వసన్

 విష్వక్సేనాంఘిసంస్పర్శహతా శేషాఘబంధనమ్

సర్వవ్యాపకుడగు శ్రీహరి పాదములను చక్కగా స్పృశించుటచే ధ్రువుని. పాపబంధములన్నియు తొలగిపోయెను. అట్టి తన పుత్రుడు వచ్చు చుండగా ఉత్తానపాద మహారాజు ఉద్యానవనసమీపములో చూచేను. ఆయన మనస్సులో చిరకాలమునుండి పుత్రుని చూడవలేననే వేగిరపాటు ఉండేను. ఆయన వెంటనే వేగముగా రథము దిగి, శీఘ్రముగా ఆతని వద్దకు వెళ్లి, నిట్టూర్పులను విడుచుచున్నవాడై, భుజములతో ఆతనిని కౌగిలించుకొనెను.

అథాజిఘ్రన్ముహుర్మూర్డ్ని శీతైర్నయనవారిభిః

స్నాపయామాస తనయమాషోద్దామమనోరథః

అప్పుడు మహారాజునకు గల పెద్ద కోరిక సిద్దించెను. ఆయన పుత్రుని పలుమార్లు శిరస్సుపై ఆఘ్రాణించి, చల్లని ఆనందబాష్పములతో ఆతనిని తడిపివేసెను.

అభివంద్య పితుః పొదావాశీర్బిశ్చాలిమంత్రితః

ననామ మాతరౌ శీర్ష్ణా సత్కృతస్సజ్జనాగ్రణీః

ధ్రువుడు సత్పురుషులలో మొట్టమొదటివాడు. ఆతడు తండ్రి పాదములకు నమస్కరించగా, ఆయన ఆశీర్వదించి కుశలప్రశ్నాదికమును వేసెను. ఈ విధముగా సత్కరించబడిన ధ్రువుడు తల్లులిద్దరికీ కూడ తలవంచి నమస్కరించెను.

సురుచిస్తం సముత్తాప్య పోదావనతమర్భకమ్

పరిష్వజ్యాహ జీవేతి బాష్పగద్గదయా గిరా

తన పాదములకు వంగి నమస్కరించిన ఆ బాలకుని సురుచి ప్రేమతో పైకి లేవదీసి కౌగిలించుకొని, కన్నీటిని కారుస్తూ, బొంగురువో యిన కంఠముతో, చిరంజీవ అని ఆశీర్వదించెను.

యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్యాదిభిరరి

తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయమ్

నీరు పల్లమునకు తనంత తానుగా ప్రవహించును. అదే విధ ముగా, ఎవనిపై మైత్రి కరుణ మొదలగు సద్గుణముల కారణముగా శ్రీహరి భగవానునకు అనుగ్రహము కలిగినదో, వానికి జనులందరు తమంత తాముగా నమస్కరించేదరు.

ఉత్తమశ్చ ధ్రువశ్చోభావన్యోన్యం ప్రేమవిహ్వలౌ

 అంగసంగాదుత్పులకావసౌఘం ముహురూహతుః

ధ్రువుడు, ఉత్తముడు పరస్పరము ప్రేమచే పరవశులైరి. వారు కౌగిలించుకొని పలుమార్లు గగుర్పాటును చేందిరి. వారిద్దరికి కన్నీరు ప్రవహించెను.

సునీతిరస్య జననీ ప్రాణేభ్యోకపి ప్రియం సుతమ్

ఉపగుహ్య జహావాధిం తదంగస్పర్శనిర్వృతా

ధ్రువుని తల్లియగు సునీతి తన ప్రాణములకంటే కూడ ప్రియమైన పుత్రుని కౌగిలించుకొనెను. పుత్రుని స్పృశించి మహానందమును పొందిన ఆ తల్లికి మనస్సులోని శోకము దూరమయ్యేను.

పయః స్తనాభ్యాం సుస్రావ నేత్రజైసలిలైశ్శివైః

 తద్వాభిషిచ్యమానాభ్యాం వీర వీరసువో ముహుః

ధీరుడవగు ఓ విదురా! అప్పుడు వీరమాతయగు సునీతికి, కన్ను లనుండి స్రవించిన మంగళకరములగు ఆనందబాష్పములచే తడిసిన స్తన ములనుండి క్షీరము స్రవించెను.

తాం శశంసుర్నరా రాజ్ఞీం దిష్ట్యా తే పుత్ర ఆర్తిహా

 ప్రతిలబ్దశ్చిరం నష్ణో రక్షిత మండలం భువః

జనులు మహారాణియగు సునీతిని ఇట్లు ప్రశంసించిరి : నీ కొడుకు చాల కాలము కనబడకుండా పోయి, తిరిగి దైవానుగ్రహముచే దొరికినాడు. ఆతడు మనందరి దుఃఖమును పోగొట్టి, భూమండలమును రక్షించగలడు.

అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిహా

 యదనుధ్యాయినో వీరా మృత్యుం జిగుస్సుదుర్జయమ్

నమస్కరించే భక్తుల దుఃఖములను దూరము చేసే భగవానుని నీవు బాగా పూజించినావు. ఇది నిశ్చయము. భగవానుని ధ్యానమునందు పరాయణులైన ధీరపురుషులు ఇతరులకు సుతరాము జయించ శక్యము కాని మృత్యువునైననూ జయించేదరు.

లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః

ఆరోపకరిణీం హృష్టః స్తూయమానోవిశత్పురమ్

ధ్రువుని జనులందరు ఈ విధముగా లాలించుచుండగా, మహా రాజు మహానందమును పొందెను. ఆయన ధ్రువుని తమ్మునితో బాటు ఏనుగుపై నెక్కించి నగరములోనికి ప్రవేశించెను. జనులు ఆయనను కూడప్రశంసించిరి.

తత్ర తత్రోపసంక్లుప్తైల్లసన్మకరతోరడైః

 సవృందైః కదలీప్తం ఖైః ఫూగపోతైశ్చ తద్విడ్రేః

చూతపల్లవవాపసబ్ము కౌదామవిలంబిభిః

 ఉపస్కృతం ప్రతిద్వారముపాం కుంభైస్పదీపకైః

ఆ నగరములో అక్కడక్కడ ప్రకాశించే మకరతోరణములు (మొసలి ఆకారములోని ద్వారములు) దగ్గర దగ్గరగా ఏర్పాటు చేయబడెను. పళ్లగెలలతోనున్న అరటి బోదెలు, పోకచెక్కల గుత్తులతో నున్న లేత పోక చెట్లు ఆ ద్వారముల వద్ద అలంకరించబడెను. ప్రతి ద్వారము వద్ద దీపము లతో కూడిన నీటి కడవలు అలంకరించబడెను. ఆ కడవలకు మామిడి చిగు ళ్లు, వస్త్రములు, పుష్పమాలలు, ముత్యాల దండలు వ్రేలాడుచుండెను.

ప్రాకారైర్గోపురాగారైశ్శాతకుంభపరిచ్చ దైః

సర్వతోలంకృతం శ్రీమద్విమానశిఖరద్యుభిః

ఆ నగరము అంతటా ప్రాకారములతో, గోపురములతో, భవనము లతో ప్రకాశించుచుండెను. వాటియందు బంగరు పరికరములు ఉండెను. వాటి శిఖరములు గొప్ప విమానముల శిఖరములవలె భాసిల్లెను.

మృష్టచత్వరరథ్యాకట్టమార్గం చందనచర్చితమ్

లాజాక్షతైః పుష్పఫలైస్తండులైర్బలిభిర్యుతమ్

ఆ నగరములోని కూడళ్లను, రాజమార్గములను, వీధులను, మిద్దె లను తుడిచి శుభ్రము చేసి గంధపు నీళ్లను చల్లిరి. పేలాలు, అక్షతలు (ప సుపు కలిపిన బియ్యము, లేక యవలు), పువ్వులు, పళ్లు, బియ్యము, మృష్టాన్నములు ఆ నగరములో సంసిద్ధము చేయబడి యుండెను.

 ధ్రువాయ పథ దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియః

సిద్ధార్థాక్షతదధ్యంబుదూర్వాపుష్పఫలాని చ

 ఉపాజహ్రుః ప్రయుంజానా వాత్సల్యాదాశిషస్సతీః

 శృణ్వస్తద్వల్లుగీతాని ప్రొవిశద్భవనం పితుః

అక్కడక్కడ రాజమార్గమునందు ధ్రువుడు కానరాగానే పురస్త్రీలు వాత్సల్యముతో ఆయనకు శ్రేష్టములగు ఆశీర్వచనములను అందజేయు చుండిరి. వారాయనపై తెల్ల నువ్వులు, అక్షతలు, పెరుగు, నీరు, లేత గడ్డి పరకలు, పువ్వులు, పండ్లు మొదలగు మంగళద్రవ్యములను చల్లుచుండిరి. ధ్రువుడు వారి మనోహరములగు పాటలను వింటూ, తండ్రిగారి ప్రాసాద ములోనికి ప్రవేశించేను.

మహామణివ్రాతమయే స తస్మిన్ భవనోత్తమే

 లాలితో నితరాం పిత్రా వ్యవసద్దివి దేవవత్

ఆ గొప్ప ప్రాసాదము విలువైన అనేకములగు మణులచే నిర్మించ బడినది. తండ్రి తనను అధికముగా లాలించుచుండగా, ధ్రువుడు దానిలో స్వర్గమునందు దేవతలవలె నివసించెను.

పయః ఫేననిభాశ్శయ్యా దాంతా రుక్మపరిచ్చదాః

ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మా ఉపస్కరాః

ఆ భవనములోని శయ్యలు దంతముతో నిర్మించబడి, పాల నురు గును పోలియుండెను. అక్కడి సామగ్రి, పాత్రలు అన్నీ బంగారముతో చేసి నవే. దానియందలి ఆసనములు గొప్ప విలువ గలవి.

యత్ర స్పటికకుడ్యేషు మహామారకతేషు చ

 మణిప్రదీపా ఆధాంతి లలనా రత్నసంయుతాః

ఆ భవనములో గోడలు స్పటికముతో చేసి, గొప్ప పచ్చలు పొదగ బడియుండెను. ఆ గోడలకు మణిదీపములు వెలుగుచుండెను. ఆ భవన ములోని యువతులు రత్నాభరణములను పెట్టుకొని ప్రకాశించుచుండిరి.

ఉద్యానాని చ రమ్యాణి విచితైరమరద్రుమైః

కూజద్విహంగమిథునైర్గాయన్మత్తమధువ్రతైః

అక్కడి ఉద్యానవనములు దివ్యములగు వృక్షములతో మనోహర ముగా నుండెను. ఆ చెట్లపై పక్షుల జంటలు కూతలు కూయుచుండగా, తుమ్మెదలు మత్తెక్కి గానము చేయుచుండెను.

వాప్యో వైడూర్యసోపానాః పద్మోత్పలకుముద్వతీః

 హంసకారండవకులైర్జుష్టాశ్చక్రాహ్వసార సైః

ఆ ఉద్యానములలో దిగుడు బావుల మెట్లకు వైడూర్య రత్నములు పొదగబడెను. అవి పద్మములు, నల్ల కలువలు మరియు తెల్ల కలువలతో అందముగా నుండెను. వాటిని హంసలు, కారండవ పక్షులు, జక్కవ. పక్షు లు, బెగ్గురు పక్షులు గుంపులు గుంపులుగా సేవించుచుండెను.

ఉత్తానపాదో రాజర్షిః ప్రభావం తనయస్య తమ్

 శ్రుత్వా దృష్ట్వాహాద్భుతతమం ప్రపేదే విస్మయం పరమ్

రాజర్షియగు ఉత్తానపాదుడు తన పుత్రుని అత్యద్బుతమగు మహి మను గురించి నారదుని వలన వినియుండెను. ఇప్పుడా మహిమను కను లారా గాంచి, గొప్ప విస్మయమును పొందెను.

వీక్ష్యఢవయసం తం చ ప్రకృతీనాం చ సంమతమ్

 అనురక్తప్రజం రాజా ధ్రువం చక్రే భువః పతిమ్

ధ్రువునకు యౌవనము వచ్చెను. మంత్రి మొదలగు రాజ్యములోని ఉన్నతాధికారులకు ఆతడు రాజు అగుట సమ్మతమాయెను. మరియు ప్రజ లకు ఆతనిపై అనురాగము ఉండెను. ఈ విషయములను గమనించిన ఉత్తానపాద మహారాజు ఆతనిని సామ్రాజ్యమునకు అధిపతిగా చేసెను.

ఆత్మానం చ ప్రవయసమాకలయ్య విశాం పతిః

వనం విరక్తః ప్రాతిష్ఠద్విమృశనాత్మనో గతిమ్

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ధ్రువోపాఖ్యానేధ్రువరాజ్యాభిషేకవర్ణనం నామ నవమోఽధ్యాయః

ఉత్తానపాద మహారాజు తనకు వయసు మీద పడిన సంగతిని గమ నించి వైరాగ్యము గలవాడై, ఆత్మతత్త్వమును విచారిస్తూ గడుపుటకై అడ . వికి బయలుదేరెను (వానప్రస్థ-జీవనమును స్వీకరించెను).

శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో ధ్రువోపాఖ్యానములో ధ్రువుడు రాజ్యాభిషిక్తుడగుటను  వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.