భాగవత మహా పురాణము
18 -పృథూపాఖ్యానము - పృథివీ దోహనము
మైత్రేయ ఉవాచ ।
ఇత్తం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరమ్ ।
పునరాహాకవనిర్భీతా సంస్తభ్యాత్మానమాత్మనా ॥
పృథువునకు కోపము వలన క్రింది పెదవి వణుకుచుండెను. భయ పడిపోయిన భూదేవి ఆయనను ఈ విధముగా స్తుతించెను. అపుడామె తన సంకల్పశక్తిచే మనస్సును నిలదొక్కుకొని, మరల ఆయనతో నిట్లనెను.
సన్నియచ్చాభి భో మన్యుం నిబోధ శ్రావితం చ మే । సర్వతస్సారమాదత్తే యథా మధుకరో బుధః ॥
ఓ ప్రభూ! కోపమును ఉపసంహరించి అభయమునిమ్ము. నా విన్నపమును కూడ ఆలకించుము. వివేకి తుమ్మెదవలె సర్వమునుండి మంచిని స్వీకరించును.
అస్మిన్ లో కేథ వాముష్మిన్మునిభిస్తత్త్వదర్శిభిః ।
దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయఃప్రసిద్ధయే ॥
తత్త్వవేత్తలగు మహర్షులు ఇహలోక పరలోకములలో మానవునకు శ్రేయస్సును కలుగజేసే (క్రమముగా వ్యవసాయము, యజ్ఞము మొదలగు) ఉపాయములను కనుగొని ఆచరణలో పెట్టినారు.
తానాతిష్ఠతి యస్సమ్యగుపాయాన్ పూర్వదర్శితామ్ ।
అవరః శ్రద్దయో పేత ఉపేయాన్ విందతేకంజసా ॥
పూర్వీకులు కనుగొన్న ఆ ఉపాయములను వర్తమానకాలములోని మానవులు శ్రద్ధ గలవారై చక్కగా ఆచరణలో పెట్టవలెను. అట్లు చేయు వారు తమ లక్ష్యములను తేలికగా చేరెదరు.
తాననాదృత్య యోహావిద్వానర్ధానారభతే స్వయమ్ ।
తస్య వ్యభిచరంత్యర్థి ఆరఖాశ్చ పునః పునః ॥
తెలిసి గాని, తెలియక గాని ఎవడైతే పూర్వీకులు చూపిన ఉపాయ ములను ఉపేక్ష చేసి, తన స్వంత తెలివి తేటలతో కార్యములనారంభించునో, పానికి ఆ కార్యములు ఫలమునీయవు. ఒకప్పుడు ఒకే కార్యమును పలుమార్లు మొదలు పెట్టిననూ ప్రయోజనము ఉండక పోవచ్చును.
పురా సృష్టా హ్యాషధయో బ్రహ్మణా యా విశాం పతే ।
భుజ్యమానా మయా దృష్టా అసద్భిరధృతవ్రతైః ॥
ఓ మహారాజా! బ్రహ్మగారు సృష్ట్యాదియందు సృష్టించిన ఓషధు లను ఈ నాడు యోగ్యమగు ప్రవృత్తి లేని దుష్టులు మాత్రమే అనుభవిం చుచున్నారు. ఈ పరిస్థితి నా కంట బడినది.
అపాలితాననాదృతా చ భవద్బిర్లోకపాలకైః ।
చోరీభూతేకథ లోకేహం యజ్ఞార్థేగ్రసమోషధీః ॥
లోకములను పాలించ వలసిన మీరు నన్ను రక్షించుట మానివేసి, ఉపేక్ష చేసినారు. లోకులు చోరులుగా తయారైనారు. కావుననే, భవిష్య త్తులో యజ్ఞమునకు పనికి వచ్చుననే భావనతో, నేను ఓషధులను మ్రింగి కూర్చున్నాను.
నూనం తా వీరుధః క్షీణా మయి కాలేన భూయసా।
తత్ర యోగేన దృష్టిన భవానాదాతుమర్హతి ॥
చాల కాలమగుటచే ఆ ఓషధులు నాయందు క్షీణించినవి. నీవు వాటిని తిరిగి పొందుటకై, పూర్వజులు దర్శించిన ఉపాయముననుష్ఠించుము, ఆ విధముగా నీవు వాటిని తిరిగి పొందుము.
వత్సం కల్సయ మే వీర యేనాహం వత్సలా తవ ।
ధోక్ష్యే క్షీరమయాన్ కామాననురూపం చ దోహనమ్ ॥
దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావన ।
అన్నమీప్సితమూర్జస్వద్భగవాన్ వాంఛతే యది ॥
ఓ వీరా! గొప్ప పరాక్రమశాలివగు నీవు ప్రాణులకు రక్షకుడవు. ప్రాణులకు అభీష్టము మరియు పుష్టికరము అగు ఆహారము లభించాలని పూజ్యుడవగు నీవు కోరుచున్నావా? అట్లెనచో, నాకు ఒక దూడను, పాలను పితికే వానిని, పితుకుటకు తగిన ఒక పాత్రను కూడ ఏర్పాటు చేయుము. దూడయందలి ప్రేమచే, నేను పాలను ఇచ్చెదను. ఆ పాలరూపముగా నేను నీ కోరికలనన్నింటినీ పరిపూర్ణము చేసెదను.
సమాం చ కురు మాం రాజన్ దేవవృష్టం యథా పయః ।
అపర్తావపి భద్రం త ఉపావర్తేత మే విభో ॥
ఓ రాజా! నీవు సర్వసమర్థుడవు. నన్ను సమతలముగా కూడ చేయుము. అట్లు చేయుట వలన వానదేవుడు కురిపించిన నీరు వర్షకాలము తరువాత కూడ నాపై నిలిచియుండగలదు. నీకు శుభమగు గాక!
ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతిః ।
వత్సం కృత్వా మనుం పాణావదుహత్సకలౌషధీః ॥
భూదేవి ఈ విధముగా, హితకరమైన వచనములను సొంపుగా చెప్పెను. పృథు మహారాజు ఆమె మాటను స్వీకరించి, స్వాయంభువ మనువును దూడగా చేసి, తన చేతిలోనికి అన్ని ఓషధులను పాల రూప ములో పితికెను.
తథా పరే చ సర్వత్ర సారమాదదతే బుధాః ।
తతోన్యే చ యథాకామం దుదుహుః పృథుభావితామ్ ॥
పృథువు వలెనే వివేకవంతులగు జనులందరు ఎక్కడ ఉన్నా సారమును గ్రహించుచుందురు. పృథువు వశము చేసుకున్న భూమిని ఇతరజ నులు కూడ యథేచ్ఛగా పితికిరి (అనగా, సకలాభీష్టములను భూమినుండియే పొందిరి).
ఋషయో దుదుహుర్దేవీమింద్రియేష్వథ సత్తమ ।
వత్సం బృహస్పతిం కృత్వా పయశ్ఛందోమయం శుచి ॥
సత్పురుషులలో శ్రేష్ఠుడవగు ఓ విదురా! తరువాత మహర్షులు బృహస్పతిని దూడనుగా చేసిరి. వారు మనస్సు, వాక్కు, చెవి అనే ఇంద్రి యములనే పాత్రలుగా చేసి, వేదరూపములైన పవిత్రమగు పాలను భూదేవి నుండి పితికిరి.
కృత్వా వత్సం సురగణా ఇంద్రం సోమమదూదుహన్ ।
హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః ॥
దేవతాగణములు ఇంద్రుని దూడనుగా చేసి, అమృతరూపమగు పాలను బంగరు పాత్రలోనికి పితికిరి. అది వారి ఇంద్రియములకు, మునస్సునకు, దేహమునకు కూడ శక్తిని కలిగించేను.
దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభమ్ ।
విధాయాదూదుహన్ క్షీరమయఃపాత్రే సురాఽఽసవమ్ ॥
దితి వంశీయులు, దను వంశీయులు అగు రాక్షసులు రాక్షసోత్తముడగు ప్రహ్లాదుని దూడనుగా చేసి, మత్తెక్కించే సారాయివి పాల రూపములో ఇనుప పాత్రలోనికి పితికిరి.
గంధర్వాప్సరసోఽధుక్షన్ పాత్రే పద్మమయే పయః ।
వత్సం విశ్వావసుం కృత్వా గాంధర్వం మధుసౌభగమ్ ॥
గంధర్వులు, అప్సరసలు విశ్వావసువు అనే గొప్ప గంధర్వువి దూడనుగా చేసి, పద్మము అనే పాత్రలోనికి స్వరమాధురి మరియు అందము అనే పాలను పితికిరి. వాటి వలననే గంధర్వులు మహిమను గొంచిరి.
వత్సేన పితరోఽర్యమ్ణా కవ్యం క్షీరమధుక్షత ।
ఆమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః ॥
శ్రాద్దమునందు దేవతలుగా ఆరాధించబడే మహాత్ములగు. పితృదే . తలు అర్యముని దూడనుగా చేసి, కష్యము (స్వధా అని చెప్పి పమర్పించే హవిస్సు) ను పాలనుగా పితికిరి.
ప్రకల్ప్య వత్సం కపిల సిద్దాస్సంకల్పవామయీమ్ ।
సిద్ధిం నభపి విద్యాం చ యే వ విద్యాడరాదయః ॥
సిద్దులు కపిలుని దూడనుగా చేసి ఆకాశము అనే పాత్రలోనికి సంకల్పమాత్రముచే పుట్టే అణిమ (తేలికయై గాలిలో ఎగురుట) మొదలగు సిద్దులను పితికిరి. విద్యాధరులు మొదలగు వారు కూడ అటులనే అంత ర్థన శక్తి మొదలగు శక్తులను సంపాదించిరి.
అన్యే చ మాయినో మాయామంతర్ధానాద్భుతాత్మనామ్ ।
సమయం ప్రకల్ప్య వత్సం తే దుదుహుర్ధారణామయీమ్॥
మాయావులైన కింపురుషులు మొదలగు ఇతరులు కూడ మయా సురుని దూడనుగా చేసి, సంకల్పమాత్రముచే పుట్టే మాయాశక్తిని సంపా దించిరి. ఆ శక్తిచే వారు అంతర్ధానమగుట, విచిత్రమగు రూపమును దాల్చుట మొదలగు అద్భుతములను చేయగలవారైరి.
యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః ।
భూతేశవత్సా దుదుహుః కపాలే క్షతజాసవమ్ ॥
యక్షులు, రాక్షసులు, భూతములు, మాంసమును తినే పిశాచ ములు భూతములకు ప్రభువగు రుద్రుని దూడగా చేసి, పుర్రెలో రక్తమును పితికినవి. వాటికి అదియే నిషాను కలిగించును.
తథాఽహయో దందశూకాస్సర్పా నాగాశ్చ తక్షకమ్ ।
విధాయ వత్సం దుదుహుర్బిలపాతే విషం పయః ॥
అదే విధముగా పడగ లేని పాములు, పడగ ఉండే త్రాచు పాములు, ఇతర విషసర్పములు మరియు తేళ్లు మొదలగు కుట్టే విషజంతువులు తక్షకుని దూడగా చేసి, తమ నోళ్లలోనికి వీషమునే పాలుగా పితికినవి.
పశవో యవసం క్షీరం వత్సం కృత్వా తు గోవృషమ్ ।
అరణ్యపాత్రే చాధుక్షన్మృగేంద్రేణ చ దంష్ట్రిణః ॥
క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహుస్స్వే కలేవరే ।
సుపర్ణవత్సా విహగాశ్చరం వాఽచరమేవ చ ॥
పశువులు నందీశ్వరుని దూడగా చేసి అడవి అనే పాత్రలో గడ్డి అనే పాలను పితికినవి. మాంసమును తినే కోరలు గల పెద్దపులి మొదలగు జంతువులు సింహమును దూడగా చేసి తమ దేహము అనే పాత్రలో పచ్చి మాంసము అనే పాలను పితికినవి. పక్షులు గరుత్మంతుని దూడగా చేసి, తమ దేహము అనే పాత్రలోనే కదిలే క్రిమికీటకములను, కదలని పళ్లు మొదలగు వాటిని ఆహారముగా పితికినవి.
వటవత్సా వనస్పతయః పృథగ్రసమయం పయః ।
గిరయో హిమవద్వత్సా నానాధాతూన్ స్వసానుషు ॥
చెట్లు మర్రిచెట్టును దూడగా చేసి అనేకరసములనే పాలగా పితికి నవి. పర్వతములు హిమవంతుని దూడగా చేసి, గైరికము మొదలగు ధాతువులను తమ చరియలు అనే పాత్రలయందు పితికినవి.
సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్ పయః ।
సర్వకామదుఘాo పృథ్వీం దుదుహుః పృథుభావితామ్ ॥
సకలప్రాణులు తమ జాతిలోని ప్రముఖమైన ప్రాణిని దూడగా చేసుకొని, తమ తమ పాత్రలలో వేర్వేరుగా తమ తమ ఆహారములను పాలుగా పితికినవి. పృథువుచే వశము చేసుకొనబడిన పృథివి ప్రాణులన్నిటికి వాటి కోర్కెలను పాలు (సార పదార్థము) రూపములో అర్పించినది.
ఏవం పృథ్వాదయః పృథ్వీమన్నాదాస్స్వన్నమాత్మనః ।
దోహవత్సాదిభేదేన క్షీరభేదం కుదూద్వహ ॥
కురవంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! ఈ విధముగా ఆహారమును భక్షించే పృథువు మొదలగు ప్రాణులు తమ తమ చక్కని ఆహారమును భూమినుండి సంపాదించిరి. ప్రాణిజాతిని బట్టి పితికే (ఆహారమును స్వీకరించే) పాత్ర, దూడ, పితుకువాడు, పితకబడే పాలు (ఆహారము) మారెను.
తతో మహీపతిః ప్రీతస్సర్వకామదుఘాo పృథుః ।
దుహితృత్వే చకారేమాం ప్రేమ్ణా దుహితృవత్సలః ॥
అప్పుడు పృథు మహారాజు సంతోషించి కోరికలనన్నిటినీ పాల రూపములో సమర్పించిన భూదేవిని తన కూతురుగా స్వీకరించి, ఆమె యందు పుత్రికయందలి ప్రేమను చూపెను.
చూర్ణయన్ స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాట్ ।
భూమండలమిదం వైన్యః ప్రాయశ్చక్రే సమం విభుః ॥
రాజాధిరాజు, సర్వసమర్థుడు, వేనపుత్రుడు అగు పృథువు తన ధనస్సు కొనతో కొండ కొమ్ములను నుగ్గు చేయుచూ, ఈ భూమండలమును ఇంచుమించు సమతలముగా చేసెను
అథాస్మిన్ భగవాన్ వైన్యః ప్రజానాం వృత్తిదః పితా ।
నివాసాన్ కల్పయాంచక్రే తత్ర తత్ర యథార్హతః ॥
పూజ్యుడగు వేనుడు జనులకు జీవికను కల్పించి తండ్రి వలె వారిని కాపాడెను. అపుడాయన భూమండలమునందు అక్కడక్కడ ఆయా ప్రదేశములకు అనురూపముగా ఇళ్లను కట్టించెను.
గ్రామాన్ పురః పత్తనాని దుర్గాణి వివిధాని చ ।
ఘోషాన్ ప్రజాన్ సశిబిరానాకరాన్ ఖేటఖర్వటాన్ ॥
పృథువు గ్రామములను, పట్టణములను, నగరములను, రకరక ముల దుర్గములను, గొల్లపల్లెలను, పశువుల కొట్టములను, వ్యవసాయగ్రామములను, కొండలలో గ్రామములను నిర్మించెను. ఆయన గనులను అభివృద్ధి చేసి, వాటికి సమీపములో సేనానివాసములను ఏర్పాటుచేసెను.
ప్రాక్ పృథోరిహ నైవైషా పురగ్రామాధికల్పనా ।
యథాసుఖం వసంతి స్మ తత్ర తత్రాఽకుతోభయాః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే పృథూపాఖ్యానే
పృథివీదోహనవర్ణనం నామ అష్టాదశోఽధ్యాయః ॥
గ్రామములు, నగరములు మొదలగు ఇట్టి వ్యవస్థ పృథువునకు పూర్వము లేకుండెను. అప్పుడు జనులు తమకు తోచిన చోట నివసించు చుండిరి. కాని, పృథువు అట్టి వ్యవస్థను చేసిన తరువాత, జనులు ఆయా స్థానములలో ఏ విధమైన భయము లేకుండగా సుఖముగ నివసించిరి.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పృథివీదోహనము అనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 18 of the Bhāgavata Mahā Purana is as follows:
The earth planet, speaking as a humble cow, advised King Pṛthu to level the rough surface of the land and arrange for suitable calves and milkers to extract the essential treasures stored within her body. King Pṛthu transformed Svāyambhuva Manu into a calf and milked all grains and vegetables from the earth. He then inspired demigods, sages, serpents, demons, and human beings to milk the earth for their respective desired necessities, thereby restoring universal harmony and abundance.