5 - వీరభద్రుడు దక్షయజ్ఞమును విధ్వంసము చేయుట

మైత్రేయ ఉవాచ

భవో భవాన్యా నిధనం ప్రజాపతే-

రసత్కృతాయా అవగమ్య నారదాత్

స్వపార్షదసైన్యం చ తదధ్వరర్భుభి-

ర్విద్రావితం క్రోధమపారమాదధే

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దక్ష ప్రజాపతి చేసిన అవ మానము కారణముగా భవపత్నియగు సతీదేవి ప్రాణత్యాగమును చేసెను. దక్షుని యజ్ఞములో ఉద్భవించిన ఋభువులనే దేవతలు రుద్రానుచరుల సైన్యము పారిపోవునట్లు చేసిరి. ఈ వృత్తాంతమునంతనూ నారదుని వలన తెలుసుకున్న శివునకు అంతు లేని కోపము కలిగెను.

క్రుద్ధస్సుదష్టాష్ఠపుటస్స ధూర్జటి-

ర్జటాం తడిద్వహ్నిసటోగ్రరోచిషమ్

 ఉత్కృత్య రుద్రస్సహపోత్తితో హసన్

గంభీరనాదో విసర్జ తాం భువీ

కంపించుచున్న జటలు గల ఆ శివుడు కోపముతో పెదవుల అగ్ర ములను కొరుకుచుండగా భయంకరాకారుడై కన్పట్టెను. ఆయన మెరుపు వలె అగ్నికీలలవలె మెరిసిపోయే ఒక జటను తన జటాజూటమునుండి పెరికి, వెంటనే లేచి నిలబడి నవ్వుతూ గంభీరమగు. నాదమును చేస్తూ, దానిని నేలపై విడిచి పెట్టెను.

తతోతికాయస్తను  స్పృశందివం

సహస్రబాహుర్ఘనరుక్ త్రిసూర్యదృక్

 కరాలదంష్ట్రో జ్వలదగ్నిమూర్ధజః

కపాలమాలీ వివిధోద్యతాయుధః

ఆ జటనుండి పెద్ద శరీరము గల ఒక పురుషుడు ఉదయించెను. ఎత్తైన ఆ పురుషుడు తన దేహముతో ఆకాశమును స్పృశించుచున్నాడాయన్నట్లు ఉండెను. వేయి చేతులు, సూర్యునివంటి మూడు కన్నులు, ఎత్తైన భయంకరమగు కోరలు, మండే నిప్పువంటి కేశములు, పుర్రెల మాల, ఎత్తి పట్టుకున్న అనేకములగు ఆయుధములు గల ఆ పురుషుడు మేఘమువంటి కాంతిని కలిగియుండెను.

తం కిం కరోమీతి గృణంతమాహ

బద్ధాంజలిం భగవాన్ భూతనాథః

 దక్షం సయజ్ఞం జహి మద్భటానాం

త్వమగ్రణీ రుద్ర భటాంశతో మే

ఆ పురుషుడు చేతులను జోడించి, అయ్యా! నేను ఏమి చేయవ లెను? అని ప్రశ్నించగా, జగన్నాథుడగు ఆ శివభగవానుడు ఇట్లు చెప్పెను: భయంకరముగా యుద్ధమును చేయబోయే ఓ వీరుడా! దక్షుని సంహరించి వాని యజ్ఞమును నాశము జేయుము. నా అంశనుండి పుట్టిన నీవు నా అనుచరులకు నాయకుడవు కమ్ము.

 ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా

స దేవదేవం పరిచక్రమే విభుమ్

 మేనే తదాత్మానమసంగరంహసా

మహీయసాం తాత సహస్సహిష్ణుమ్

వత్సా విదురా! కోపించియున్న రుద్రుడు ఈ విధముగా ఆజ్ఞాపిం చగా, ఆ పురుషుడు దేవదేవుడగు ఆ శివప్రభునకు ప్రదక్షిణము. చేసెను. శివుని శక్తిచే సృష్టించబడిన తన వేగమును ఎవ్వరైననూ ఎదిరించలేరనియు, తాను గొప్ప బలవంతుల వేగమునైననూ సహించగలననియు ఆతడా సమయములో తలపోసెను.

అన్వీయమానస్స తు రుద్రపారదై-

ర్బృశం నదద్బిర్వ్యనదత్సు భైరవమ్

 ఉద్యమ్య శూలం జగదంతకాంతకం

స ప్రాద్రవద్ఘోషణభూషణాంఘిః

ఆ పురుషుని (వీరభద్రుని) పాదములకు అలంకరించబడిన నూపు రములు గలగల ధ్వనిని చేయుచుండెను. ఆతని అనుసరించి నడిచే రుద్ర కింకరులు నాదములను చేయుచుండిరి. ఆతడు కూడ మిక్కిలి భయమును గొల్పు విధముగా సింహనాదమును చేసెను. జగత్తులోని సకలప్రాణులను అంతము చేయు యముని కూడ సంహరించునా యన్నట్లు ఉన్న శూలమును ఆతడు ఎత్తి పట్టుకొని మహావేగముతో ముందుకు సాగెను.

అథర్త్విజో యజమానస్సదస్యాః

కకుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్య రేణుమ్

 తమః కిమేతత్కుత ఏతద్రజోకభూ-

దితి ద్విజా ద్విజపత్న్యశ్చ దధ్యుః

అప్పుడు యజ్ఞశాలలోని ఋత్విక్కులు, దక్షుడు, సభాసదులగు బ్రాహ్మణులు, వారి భార్యలు ఉత్తరదిక్కునందు పెద్ద దుమ్మును చూచిరి. ఈ చీకటి ఏమి? ఈ దుమ్ము ఎక్కడనుండి వచ్చుచున్నది? అంటూ వారు పరిపరివిధములుగా తలపోయుచుండిరి.

వాతా న వాంతి న హి సంతి దస్యవః

ప్రాచీనబరిర్జీవతి హోగ్రదండః

 గావో న కాల్యంత ఇదం కుతో రజో

లోకోధునా కిం ప్రలయాయ కల్పతే

ఇప్పుడు తుఫాను గాలులు వీచుట లేదు. నేరగాళ్లకు కఠినమగు శిక్షలను వేసే ప్రాచీనబరిష మహారాజు జీవించియే యున్నాడు గాన, దుమ్మును రేగగొట్టే చోరులు కూడ లేరు. ఇది గోవుల మంద రేగగొట్టుచున్న ధూళి కూడ కాదు. మరి ఈ ధూళి ఎక్కడనుండి వచ్చుచున్నది? జగత్తునకు ప్రళయము రాబోవుచున్నదా యేమి?

ప్రసూతిమిశ్రాః స్త్రీయ ఉద్విగ్నచిత్తా

ఊచుర్విపాకో వృజిన స్యైష తస్య

 యత్పశ్యంతీనాం దుహితృణాం ప్రజేశ-

స్సుతాం సతీమవదధ్యావనాగామ్

ప్రసూతి (దక్షపత్ని) మొదలగు స్త్రీలు కలత జెందిన మనస్సులు గలవారై ఇట్లు పలికిరి: దక్ష ప్రజాపతి ఏ పాపమునెరుంగని తన కుమార్తె యగు సతీదేవిని అవమానించినాడు. తన మిగిలిన కుమార్తెలు చూచుచున్ననూ ఆతడు లెక్క చేయలేదు. ఆ పాపమునకు ఇది ఫలము.

యస్త్వంతకాలే వ్యుప్తజటాకలాప-

స్స్వశూలసూచ్యర్పితదిగ్గజేంద్రః

 వితత్య నృత్యత్యుదితాస్త్రదోర్ధ్వజా-

నుచ్చాట్టహాసస్తనయిత్నుభిన్నదృక్

ఆ శివుడు ప్రళయకాలమునందు జటల సమూహమును విరబోసు కొని, తన శూలముయొక్క కొనలయందు గొప్ప దిగ్గజములను గ్రుచ్చి పట్టుకొనును. ఆయన బిగ్గరగా కఠోరముగా నవ్వగా, పిడుగుపాటువంటి ఆ ధ్వనికి దీక్కులు పిక్కటిల్లును. ఆయన భుజములయందు అస్త్రములను పట్టుకొని, వాటిని ధ్వజములవలే చాచి నాట్యమును చేయును.

అమర్షయిత్వా తమసహ్యతేజసం

మన్యుప్లుతం దుర్విషహం భ్రుకుట్యా

 కరాలదంష్టాభిరుదస్తభాగణం

స్యాత్స్వస్తి కిం కోపయతో విధాతుః

కోపముతో నిండియున్న శివుని తేజస్సును సహించుట శక్యము కాదు. ఆయన కనుబొమలు కోపముతో వంకర కాగా, ఆయనను చూచుట కూడ కష్టమే. భయంకరమగు ఆయన కోరలు నక్షత్రముల గుంపులను చెల్లాచెదరు చేయును. అట్టి శివుని సహనమును పరీక్షించి, ఆయనకు కోపమును తెప్పించిన ఈ దక్ష ప్రజాపతికి కల్యాణము కలుగునా యేమి?(ఆయనకు కోపమును కలిగించినవాడు సాక్షాత్తుగా బ్రహ్మయే అయినా, ఆయనకు శుభము కలుగునా?)

బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే

జనేన దక్షస్య మఖే మహాత్మనః

ఉత్పేతురుత్పాతతమాస్సహస్రశో

భయావహా దివి భూమౌ చ పర్యక్

మహాత్మునివలే డంబము చూపినా దక్షుడు దుష్టుడే. ఆతని యజ్ఞములో జనులు భయముతో చూస్తూ ఇట్లు పరిపరి విధములుగా చెప్పుకో నుచుండిరి. అప్పుడు భూమిపై మరియు అంతరిక్షములో అంతటా పెద్ద అపశకునములు వేలాదిగా బయల్వెడలి భయమును గొల్పినవి.

తావత్స రుద్రానుచరైర్మఖో మహా-

 న్నానాయుధైర్వామన కైరుధాయుధైః

పింగైః పిశంగైర్మకరోధరాననైః

పర్యాద్రవద్భిర్వదురాఽన్వరుధ్యత

ఓ విదురా! అంతలో ఆ గొప్ప యజ్ఞమును రుద్రుని అనుచరులు అడ్డుకొనిరి. వారందరు అనేకవిధముల ఆయుధములను ఎత్తి పట్టుకొని యుండిరి. వారిలో కొందరు మరుగుజ్జులు. కొందరు కపిలవర్ణము వారు కాగా, మరికొందరు పచ్చని వర్ణమును కలిగియుండిరి. కొందరి. పొట్టలు మొసలి పొట్టలను పోలియుండగా, మరికొందరు ముఖములలో మొసలి పోలికలను కలిగియుండిరి. వారు యజ్ఞశాల అంతటా ఇటునటు పరుగులెత్తుచుండిరి.

కేచిద్బభంజుః ప్రాగ్వంశం పత్నీశాలాం తథాపరే

 సద ఆగ్నీధ్రశాలాం చ తద్విహారం మహానసమ్

వారిలో కొందరు యజ్ఞశాల పైకప్పు దూలమును విరిచివేసిరి. మరికొందరు యజమాన పత్ని కూర్చుండే శాలను, కొందరు ఆగ్నీధ్రుని శాలను, కొందరు యజమానుని గృహమును, మరికొందరు ముందుండే మండపమును, ఇంకొందరు వంటశాలను కూలగొట్టిరి.

రురుజుర్యజ్ఞపాత్రాణి తథైకేఽగ్నీననాశయన్

కుండేష్వమూత్రయన్ కేచిద్భిభిదుర్వేదిమేఖలాః

వారిలో కొందరు యజ్ఞపాత్రలను పగులగొట్టగా, కొందరు అగ్నులను నాశనము చేసి, అగ్నికుండములలో మూత్రించిరి. కొందరు ఉత్తరవేదికి కట్టిన సూత్రములను ఊడబెరికిరి.

అబాధంత మునీనన్య ఏకే పత్నీరతర్జయన్

అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్

కొందరు మునులను పీడించగా, మరికొందరు వారి పత్నులను భయ పెట్టిరి. కొందరు దగ్గరగా నున్నవారిని మాత్రమే గాక, పారిపోవుచున్న దేవతలను కూడ పట్టుకొనిరి.

భృగుం బబంధ మణిమాన్ వీరభద్రః ప్రజాపతిమ్

 చండీశః పూషణం దేవం భగం నందీశ్వరోఽగ్రహీత్

మణిమంతుడు భృగు మహర్షిని, వీరభద్రుడు దక్ష ప్రజాపతివి బంధించిరి. చండీశుడు పూషదేవతను, నందీశ్వరుడు భగదేవతను పట్టుకోనిరి.

 సర్వ ఏవర్త్విజో దృష్ట్వా సదస్యాస్సదివౌకసః

తైరర్ధ్యమానాస్సుభృశం గ్రావభిర్నైకధాఽద్రవన్

ఋత్విక్కులు, సభాసదులు మరియు దేవతలు అందరు ఈ కల్లో లమును చూచి నలుదిక్కులకు పారిపోజొచ్చిరి. వారిని రుద్రానుచరులు రాళ్లతో కొట్టి పీడించిరి.

జుహ్వతస్స్రువహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవః

భృగోర్లులుంచే సదసి యోఽహసచ్ఛ్మశ్రు దర్శయన్

భృగు మహర్షి చేతిలో ప్రవమును పట్టుకొని హోమమును చేయు చుండెను. దక్షుడు శివుని నిందించే సమయములో ఆయన మీసమును గెడ్డమును సవరించుకుంటూ నవ్వెను. కావుననే, వీరభద్ర భగవానుడు ఆ భృగువుయొక్క మీసమును గెడ్డమును పెరికివేసెను.

భగస్య నేత్రే భగవాన్ పాతితస్య రుషా భువి

ఉజ్జహార సదఃస్థోఽక్ ష్ణా యశ్శపంతమపూసుచత్

ప్రజాపతులు చేసిన సత్రయాగములోని సభయందు దక్షుడు శివుని నిందించిన సమయములో భగుడు కన్నుతో సైగచేసి దక్షుని ప్రేరేపించెను. కావుననే, వీరభద్ర భగవానుడు కోపముతో ఆయనను నేలపై పడగొట్టి కళ్లను పీకివేసెను.

పూష్ణశ్చాపాతయద్ధంతాన్ కాలింగస్య యథా బలః

శప్యమానే గరిమణి యోఽహసద్దర్శయన్దతః

దక్షుడు ఆ సభలో శివుని నిందించుచున్న సమయములో పూష దేవత పళ్లను ఇకిలిస్తూ నవ్వెను. కావుననే, బలభద్రుడు కళింగదేశాధిపతి పళ్లను పెకిలించిన విధముగా, వీరభద్రుడు ఆయన పళ్లను రాలగొట్టెను.

ఆక్రమ్యోరసి దక్షస్య శితధారేణ హేతీనా

 ఛిందన్నపి తదుద్ధర్తుం నాశక్నోత్ త్ర్యంబకస్తదా

ముక్కంటియగు వీరభద్రుడు దక్షుని గుండెలపై కాళ్లతో తొక్కి పెట్టి వాడి కత్తితో తలను నరుకుటకు ప్రయత్నించాను. కాని, ఆ ప్రయత్నములో ఆతడు సఫలుడు కాలేదు.

శస్స్త్రైరస్త్రాన్వితైరేవమనిర్భిన్నత్వచం హరః

విస్మయం పరమాపన్నో దద్యౌ పశుపతిశ్చిరమ్

ఈ విధముగా మంత్రశక్తితో కూడిన ఆయుధములతో నైననూ ఆ వీరభద్రుడు దక్షుని తలను నరుకుటకు గాని, వాని చర్మమును ఒలుచుటకు గాని సమర్థుడు కాలేదు. జీవులకు నాథుడగు ఆ వీరభద్రుడు అప్పుడు చాల ఆశ్చర్యమును పొంది, దీర్ఘమగు ఆలోచనలో పడెను

దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం స పతిర్మఖే

యజమానపశోః కస్య కాయాత్తేనాహరచ్ఛిరః

అట్లు ధ్యానించినప్పుడు జీవులకు ప్రభుడగు ఆ వీరభద్రునకు ఒక ఉపాయము తోచెను. యజ్ఞములో యజమానుడే పశువు. కావున, పశువిశ సనము చేసినట్లు యజమానుడగు ఈ దక్షుని ప్రాణములనపహరించ వచ్చును. ఆతడు అట్లు తోచగానే, వెంటనే ఆ ఉపాయమును అమలు చేసి, దక్షుని తలను మొండెమునుండి వేరుజేసెను.

సాధువాదస్తదా తేషాం కర్మ తత్తస్య శంసతామ్

భూతప్రేతపిశాచానామన్యేషాం తద్విపర్యయః

అప్పుడు రుద్రుని అనుచరులగు భూతప్రేతపిశాచములు వీరభ ద్రుని ఆ పనిని స్తుతిస్తూ, బాగు బాగు అని ప్రశంసించిరి. దక్షుని పక్షము వారు అయ్యో! అయ్యో! అంటూ దుఃఖించిరి.

జుహావైతచ్ఛిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షితః

తద్దేవయజనం దగ్ద్వా ప్రాతిష్ఠద్గుహ్యకాలయమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే వీరభద్రేణ దక్షయజ్ఞవిధ్వంసనం నామ పంచమోఽధ్యాయః

శివుని నిందను సహించలేని వీరభద్రుడు మిక్కిలి కోపించి, ఆ తలను దక్షిణాగ్నియందు హోమము చేసి, యజ్ఞమండపమును తగులబెట్టి, కైలాసమునకు తిరిగి వెళ్లాను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి నాల్గవ స్కంధములో వీరభద్రుడు దక్షయజ్ఞమును విధ్వంసము చేయుటను వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది.