6 - దేవతలు శివుని ప్రసన్నుని చేసుకొనుట

మైత్రేయ ఉవాచ

అథ దేవగణాస్సర్వే రుద్రానీకైః పరాజితాః

శూలపట్టిశనిస్త్రింశగదాపరీఘముద్గరైః

సంఛిన్నభిన్నసర్వాంగాస్సర్త్విక్సభ్యా భయాకులాః

స్వయంభువే నమస్కృత్య కార్ త్స్న్యేనైతన్న్యవేదయన్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- అప్పుడు రుద్రుని సేనలు దేవగణములను, ఋత్విక్కులను, సభాసదులను, శూలములు అడ్డకత్తులు కత్తులు గదలు ఇనుపగుదియలు మరియు సమ్మెటలు అనే ఆయుధములతో గట్టిగా కొట్టిరి. వారి అవయవములన్నియు బాగా ఛిన్నాభిన్నములా యెను. వారు భయముచే కంగారు పడిపోయి, స్వయంభువుడగు బ్రహ్మగారి వద్దకు వెళ్లిరి. వారాయనకు నమస్కరించి, జరిగిన వృత్తాంతమును విన్నవించిరి.

ఉపలభ్య పురైవైతద్భగవానబ్జసంభవః

నారాయణశ్చ విశ్వాత్మా న కస్యాధ్వరమీయతుః

పద్మసంభవుడగు బ్రహ్మ భగవానునకు, జగత్తునకు అధిష్టానమైయున్న నారాయణునకు దక్షుని యజ్ఞముయొక్క ఈ పరిస్థితి ముందే తెలియును. కావుననే, వారా యజ్ఞమునకు వెళ్లలేదు.

తదాకర్ణ్య విభుః ప్రాహ తేజీయసి కృతాగసి

క్షేమాయ తత్ర సా భూయాన్న ప్రాయేణ బుభూషతామ్

బ్రహ్మప్రభుడు ఆ మాటను విని ఇట్లు పలికెను: శివుడు గొప్ప తేజశ్శాలి. దక్షుడు కూడ స్వయముగా తేజశ్శాలియే అయిననూ, తేజశ్శాలి యగు శివుని విషయములో అపరాధము చేసినాడు. అపరాధము చేసిన మహాత్ముల యెడల కూడ అపరాధమును చేయరాదు. అపరాధమునెరుంగని శివుని యెడల ఆతడు అపరాధమును చేసినాడు. అట్టి దక్షుడు, ఆతనిఅనుయాయులు తమకు క్షేమము కలుగవలెనని కోరుకున్ననూ, క్షేమము కలుగుట సంభవము కాదు.

అథాపి యూయం కృతకిల్బిషా భవం

యే బర్హిషో భాగభాజం పరాదుః

ప్రసాదయధ్వం పరిశుద్ధచేతసా

క్షిప్రప్రసాదం ప్రగృహీతాంఘ్రిపద్మమ్

యజ్ఞములో భాగమును పొందియున్న శివుని మీరు యజ్ఞభాగము నుండి బహిష్కరించి, ఆయన విషయములో అపరాధమును చేసియున్నారు. అయినప్పటికీ, పరిశుద్దమగు అంతఃకరణముతో పద్మములవంటి ఆయన పాదములను గట్టిగా పట్టుకొనుడు. ఆయన తొందరగా ప్రసన్నుడగును. శివుని ఆ విధముగా ప్రసన్నుని చేసుకొనుడు.

ఆశాసానా జీవితమధ్వరస్య 

లోకస్సపాలః కుపితే న యస్మిన్

తమాశు దేవం ప్రియయా విహీనం

క్షమాపయధ్వం హృది విద్ధం దురుక్తైః

దక్షుని యజ్ఞము పునరుజ్జీవనమును పొందవలెనని మీరు కోరుచున్నారా? అయైనచో, వెంటనే వెళ్లి శివప్రభునకు క్షమార్పణను చెప్పుడు. ఆయనకు ప్రియురాలగు సతీదేవితో వియోగము కలిగినది. ఆయన హృదయము చేడు పలుకులతో గాయపడినది. ఆయనకు కోపము వచ్చినచో, లోకపాలకులతో సహా జగత్తు వినాశమును చెందును.

నాహం న యజ్ఞో న చ యూయమన్యే

యే దేహభాజో మునయశ్చ తత్త్వమ్

విదుః ప్రమాణం బలవీర్యయోర్వా

యస్యాత్మతంత్రస్య క ఉపాయం విధిత్సేత్

శివుడు సర్వస్వతంత్రుడు. ఆయన యథార్థస్వరూపమును గాని, ఆయన బలపరాక్రమములు ఇంతటివి అని గాని, నాకు తెలియదు; ఇంద్రు నకు, విష్ణువునకు, మీకు, మహర్షులకు కూడ తెలియదు; దేహధారులగు ప్రాణుల కేవ్వరికైననూ తెలియదు. ఆయనకే కోపము వచ్చినచో, ఆ కోప మును తగ్గించే ఉపాయమును చేయుటకు ఎవరు ముందుకు రాగలరు?

స ఇత్థమాదిశ్య సురానజస్తై

స్సమన్వితః పితృభిస్సప్రజేశైః

యయౌ స్వధిష్ణ్యాన్నిలయం పురద్విషః

కైలాసమద్రప్రవరం ప్రియం ప్రభోః

స్వయంభువుడగు ఆ బ్రహ్మగారు ఆ దేవతలనీ విధముగా ఆదేశించీ, తన రోమమునుండి కైలాసమునకు వెళ్లెను. ఆ దేవతలు, ప్రజాపతులు. మరియు పితృదేవతలు కూడ ఆయనకు తోడుగా వెళ్లిరి. త్రిపురాసురసంహారకుడగు శివప్రభునకు పర్వతములలో ఉత్తమమగు కైలాసము చాల ప్రీతికరమైన నివాసస్థానము.

జన్మౌషధితపోమంత్రయోగసిద్దైర్నరేతరైః

జుష్టం కిన్నరగంధర్వైరప్సరోభిర్వృతం సదా

సిద్దుల కులమునందు పుట్టుట, ఓషధులు, తపస్సు, మంత్రము మరియు యోగము అనే అయిదు పద్దతులలో ఏదో ఒకదానియందు సిద్దులైన దేవతలు కైలాసమును సేవించెదరు. అచట అన్ని కాలములలో గంధర్వులు, కిన్నరులు మరియు అప్సరసలు ఉండెదరు.

నానామణిమయైశ్శృంగైర్నానాధాతువిచిత్రితైః నానాద్రుమలతాగుల్మైర్నానామృగగణావృతైః

నానాఽమలప్రస్రవణైర్నానాకందరసానుభిః

రమణం విహరంతీనాం రమణైస్సిద్ధయోషితామ్

కైలాసపర్వతముయొక్క శిఖరములు అనేకవిధముల మణులతో దట్టముగా

నిండియున్నవి. గైరికము మొదలగు ధాతువుల వలన ఎన్నో రంగులతో ప్రకాశించే ఆ శిఖరములపై అనేకవిధములైన చెట్లు, తీగలు, పొదలు గలవు. ఆ శిఖరములపై అనేకవిధములైన జంతువులు గుంపులు గుంపులుగా తిరుగాడుచుండును. ఆ శిఖరములపైనుండి జారిపడే కొండ , కాలువలలోని నీరు స్వచ్చముగా నుండును. అనేకవిధములైన గుహలతో మరియు కొండచరియలతో ఒప్పారే ఆ శిఖరములయందు సిద్ధపురుషుల భార్యలు తమ భర్తలతో గూడి విహరించుచుందురు. వారికా శిఖరముల శోభ ఉల్లాసమును కలిగించును.

మయూరకేకాభిరుతం మదాంధాలివిమూర్చితమ్

ప్లావితై రక్తకంఠానాం కూజితైశ్చ పతత్త్రిణామ్

కైలాస పర్వతము అంతటా నెమళ్ల కూతలతో ప్రతిధ్వనించుచుండెను. తేనెను త్రాగి మత్తెక్కి కళ్లు మూసుకుపోయిన తుమ్మెదలు ఇటునటు వేగముగా తిరుగుతూ ఝంకారమును చేయుచుండెను. కోకిలలు కుహూ రావములను చేయుచుండెను. వివిధములగు పక్షుల కూతలతో ఆ శిఖర ములు ధ్వనించుచుండెను. అట్టి కైలాసమునకు బ్రహ్మగారు వెళ్లిరి.

ఆహ్వయంతమివోద్ధస్తైర్ద్విజాన్ కామదుఘైర్ద్రుమైః

వ్రజంతమివ మాతంగైర్గృణంతమివ నిర్ఘ రైః

పక్షులకు చిగుళ్లను, పళ్లను అందించే చెట్లతో (కల్పవృక్షములతో) ఆ పర్వతము చేతులను పైకెత్తి పక్షులనే అతిథులను ఆహ్వానించుచున్నట్లు ఉండెను. ఏనుగులు తిరుగాడుచుండగా, వాటి కదలిక పర్వతమే కదులుచు న్నదా యన్నట్లు ఉండెను. ఆ పర్వతము కొండ కాలువల కలకల ధ్వను లతో మాటలాడుచున్నదా యన్నట్లు ఉండెను.

మందారైః పారిజాతైశ్చ సరలైశ్చోపశోభితమ్

తమాలైశ్శాలతాలైశ్చ కోవిదారాసనార్జునైః

కల్పవృక్షములు, పారిజాత వృక్షములు, తెల్లతెగడ, ఉలిమిరి చెట్లు, శాలవృక్షములు, తాడి చెట్లు, రక్తకాంచన వృక్షములు, వేగిస, ఏరు మద్ది చెట్లతో ఆ కైలాసము. ప్రకాశించుచుండెను.

చూతైః కదంబైర్నీపైశ్చ నాగపున్నాగచంపకైః

పాటలాశోకబకులైః కుందైః కురవకైరపి

మామిడి, కడిమి, మంకెన, పొన్న, సురపొన్న, సంపెంగ, కలిగో ట్టు, కంకేళి, పొగడ, గన్నేరు మరియు ఎర్రగోరంట్ల చెట్లతో ఆ కైలాసము ప్రకాశించుచుండెను.

స్వర్ణార్ణశతపత్రైశ్చ వీరరేణుకజాతిభిః

కుబ్జ కైర్మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మండితమ్

కైలాసము బంగరు వన్నెల వందరేకుల పద్మములతో, గన్నేరు ఏలకులు జాజి మల్లె తీగలతో, ఉత్తరేణి మొక్కలతో, పూవుల గురివెంద చెట్లతో సుందరముగా నుండెను.

పనసోదుంబరాశ్వత్థప్లక్షన్యగ్రోధహింగుభిః

భూర్జైరోషధిభిః పూగై రాజపూగైశ్చ జంబుభిః

పనస, మేడి, రావి, జువ్వి, మర్రి, ఇంగువ, బుజపత్తిరి, పోక, నేరేడు చెట్లతో, మరియు రాజపూగ వృక్షములతో కైలాసము ప్రకాశించు చుండెను. ఒకే కాపుతో అంతమయ్యే అరటి మొదలగు చెట్లు కూడ అక్కడ గలవు.

ఖర్జూరామ్రాతకామ్రాద్యైః ప్రియాలమధు కేంగుదైః

ద్రుమజాతిభిరన్యైశ్చ రాజితం వేణుకీచకైః

ఖర్జూరము, అంబాళము, మామిడి, మోరటి, ఇప్ప, గార చెట్లతో మాత్రమే గాక, ఇతరవృక్షజాతులతో, మరియు వేదురు సన్నవెదురు పొదలతో కైలాసము ప్రకాశించెను.

కుముదోత్పలకహ్లారశతపత్రవనర్ ద్ధిభిః

నలినీషు కలం కూజత్ఖగవృందోపశోభితమ్

కైలాసమునందలి సరస్సులలో తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలువలు, తామర పువ్వులు గుంపులు గుంపులుగా ప్రకాశించుచుండె ను. ఆ సరస్సులలో పక్షులు గుంపులు చేరి మధురముగా కూయుచుండగా, అచ్చోటు చాల సుందరముగా నుండెను.

మృగైశ్శాఖామృగైః క్రోడైర్మృగేంద్రైఃఋక్షశల్య కైః

గవయైశ్శరభైర్య్వాఘ్రై రురుభిర్మాహిషాదిభిః

కర్ణాం త్రైకపదాశ్వాస్యైర్నిర్జుష్టం వృకనాభిభిః

కదలీషండసంరుద్ధనలినీపులినశ్రియమ్

కైలాసపర్వతమునందు లేళ్లు, కోతులు, అడవి పందులు, సింహములు, ఎలుగు బంట్లు, ముళ్ల పందులు, గురుపోతులు, శరభమృగములు, పెద్ద పులులు, నల్లచారల దుప్పిలు, అడవి దున్నలు, గోకర్ణ మృగములు, కర్ణాంత్ర మృగములు, గుర్రపు ముఖము గల మృగములు, తోడేళ్లు, కస్తూరి మృగములు మొదలగు జంతువులు సంచరించుచుండును. అక్కడి నదులకు, సరస్సులకు తీరములపై అరటి చెట్లు దట్టముగా ఆవరించి చాల శోభను చేగూర్చును.

పర్యస్తం నందయా సత్యాస్నానపుణ్యతరోదయా

విలోక్య భూతేశగిరిం విబుధా విస్మయం యయుః

సతీదేవి స్నానము చేయుటచే మిక్కిలి పవిత్రము చేయబడిన నీరు గల నందా నది కైలాసము చుట్టూ ప్రవహించుచుండును. సకలప్రా ణులకు నాథుడగు శివుని నివాసమగు ఆ పర్వతమును చూచి, దేవతలు ఆశ్చర్యమును పొందిరి.

దదృశుస్తత్ర తే రమ్యామలకాం నామ వై పురీమ్

వనం సౌగంధికం చాపి యత్ర తన్నామ పంకజమ్

వారు ఆ కైలాసమునందు అలకాపురము అని ప్రసిద్ధిని గాంచిన నగరమును, సౌగంధికమనే వనమును చూచిరి. ఆ అడవిలోని పద్మము లకు సౌగంధికములు అని పేరు.

నందా చాలకనందా చ సరితౌ బాహ్యతః పురమ్

తీర్థపాదపదాంభోజరజసాఽతీవ పావనే

నంద, అలకనంద అనే రెండు నదులు అలకాపురమునకు బయట ప్రవహించుచున్నవి. పావనము చేయు పాదములుగల శివుని పాదపద్మముల ధూళిచే ఆ నదులు మిక్కిలి పవిత్రములు అయినవి.

యయోస్సురస్త్రీయః క్షత్తరవరుహ్య స్వధిష్ణ్యతః

క్రీడంతి పుంసస్సించంత్యో విగాహ్య రతికర్శితాః

ఓ విదురా! దేవతాస్త్రీలు దేవభోగములచే అలసి సొలసినప్పుడు దేవలోకమునుండి క్రిందకు దిగి వచ్చి, ఆ రెండు నదులలో ఈదులాడుతూ, తమ భర్తలపై నీళ్లను చల్లుచూ, విహరించెదరు.

యయోస్తత్స్నానవిభ్రష్టనవకుంకుమపింజరమ్

వితృషోఽపి పిబంత్యంభః పాయయంతో గజా గజీః

దేవతాస్త్రీలు ఆ నదులలో జలకములాడినప్పుడు వారు కొత్తగా పెట్టుకున్న కుంకుమ కరిగిపోవుట వలన ఆ నీరు పచ్చగా నగును. అట్టి ఆ నీటిని మగ ఏనుగులు దాహము లేకున్ననూ, సుగంధముచే ఆకర్షింపబడి, ఆడ ఏనుగులకు త్రాగించి, తాము కూడ త్రాగుచుండును.

తార హేమమహారత్నవిమానశతసంకులామ్

జుష్టాం పుణ్యజనస్త్రీభిర్యథా ఖం సతడిద్వనమ్

అలకానగరముపై ఆకాశములో వందలాది విమానములు రద్దీగా తిరుగుచుండును. ఆ విమానములు ముత్యములతో, బంగారముతో మరియు గొప్ప రత్నములతో నిండియుండును. వాటిలో యక్షస్త్రీలు విహ రించుచుందురు. ఈ విధముగా, అలకాపురిలోని ఆకాశము, మెరుపులతో (యక్షస్త్రీలకు పోలిక), మేఘములతో (విమానములకు పోలిక) నిండిన ఆకాశము వలె శోభిల్లుచుండును.

హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చ తత్

ద్రుమైః కామదుఘైర్హృద్యం చిత్రమాల్యఫలచ్చదైః

దేవతలు యక్షరాజగు కుబేరుని నగరమగు అలకాపురిని దాటి సౌగంధిక వనమును చేరుకొనిరి. ఆ వనము కోరికలనీడేర్చే కల్పవృక్షము లతో మనోహరముగా నుండెను. ఆ వృక్షములు రంగు రంగుల పుష్పము లతో, పండ్లతో మరియు చిగుళ్లతో ప్రకాశించుచుండెను.

రక్తకంఠఖగానీకస్వరమండితషట్పదమ్

కలహంసకులప్రేష్ఠఖరదండజలాశయమ్

ఆ వనములో కోకిల గుంపుల కూతలు తుమ్మెదల ఝంకారము లకు తోడైనవి. రాజహంసలకు మిక్కిలి ప్రీతికరమైన పద్మములతో సర స్సులు. నిండియుండెను.

వనకుంజరసంఘృష్టహరిచందనవాయునా

అధి పుణ్యజనస్త్రీణాం ముహురున్మథయన్మనః

ఆ వనములో హరిచందన వృక్షములు గలవు. అడవి యేనుగులు దురదను తీర్చుకొనుటకై ఆ చెట్లకు తమ దేహములతో రాపిడి చేయగా, బెరడు బయట పడి, ఆ వృక్షముల మీదుగా వీచే గాలులు ఆ సుగంధ ముతో నిండియున్నవి. అట్టి పరిమళభరితములగు గాలులు యక్షస్త్రీల మనస్సులను పదే పదే అధికమగు క్షోభకు గురి చేయుచున్నవి.

వైదూర్యకృతసోపానా వాప్య ఉత్పలమాలినీః

ప్రాప్తం కింపురుషైర్దృష్ట్వా త ఆరాద్దదృశుర్వటమ్

ఆ వనములోని దిగుడు బావుల మెట్లు వైదూర్యమాణిక్యములతో పొదగబడి యున్నవి. ఆ బావులు నల్ల కలువల వరుసలతో శోభిల్లినవి.వారా బావులను, అక్కడ విహరించే కింపురుషులను చూచి, దగ్గరలో ఒక మర్రి చెట్టును చూచిరి.

స యోజనశతోత్సేధః పాదోనవిటపాయతః

పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్తాపవర్జితః

ఆ చెట్టు వంద యోజనముల యెత్తు ఉండెను. దాని కొమ్మలు డెబ్బది అయిదు యోజనముల పొడవు కలిగియుండెను. దాని క్రింద అన్ని వైపులా ఉండే నీడ ఎప్పటికీ తొలగిపోదు. దానిపై పక్షి గూళ్లు లేవు. దాని క్రింద తొషము ఉండదు.

తస్మిన్ మహాయోగమయే. ముముక్షుశరణే సురాః

దదృశుశ్శివమాసీనం త్య క్తామర్షమివాంతకమ్

ఆ చెట్టు అణిమ మొదలగు గొప్ప సిద్దులకు నిలయము. దాని వద్ద సనకాది యోగిపుంగవులు తరచు కానవచ్చెదరు. మోక్షమును కోరు సాధకులు ఆ వృక్షమును ఆశ్రయించెదరు. దాని వద్ద కూర్చుండియున్న శివుడు దేవతలకు- కానవచ్చెను. ఆయన కోపమును వీడిన యముని వలె, నుండెను.

సనందాద్యైర్మహాసిద్దైశ్శాం తైస్సంశాంతవిగ్రహమ్

ఉపాస్యమానం సఖ్యా చ భర్త్రా గుహ్యకరక్షసామ్

రాగద్వేషములు లేని సనక సనందనాది మహాసిద్దులు పరమశాం తస్వరూపుడగు ఆ శివుని ఉపాసించుచుండిరి. యక్షరాక్షసప్రభువు, శివు నకు మిత్రుడు అగు కుబేరుడు కూడ ఆయనను సేవించుచుండెను.

విద్యాతపోయోగపథమాస్థితం తమధీశ్వరమ్

చరంతం విశ్వసుహృదం వాత్సల్యాల్లోకమంగలమ్

జగన్నాథుడగు శివుడు సాధకులకు మార్గదర్శనమును చేయుటకై ఉపాసన, చిత్తేకాగ్రత మరియు అష్టాంగయోగము అనే సాధనములను అనుష్ఠించుచుండును. జగత్తునకు హితకారి, మిత్రుడు అగు ఆయన ప్రేమ స్వరూపుడగుటచే, లోకములకు కల్యాణమును చేయుచుండును.

లింగం చ తాపసాభీష్టం భస్మదండజటాజినమ్

అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖాం చ బిభ్రతమ్

శివుని శరీరము సంధ్యాకాలమునందలి మేఘము వలె ఎర్రగా ప్రకాశించుచుండెను. ఆయన భస్మను, దండమును, జటలను, మృగచర్మమును ధరించియుండెను. ఈ చిహ్నములు తపశ్శాలురకు ప్రియమైనవి ఆయన శిరస్సు పై చంద్రవంకను కూడ దాల్చియుండెను.

ఉపవిష్టం దర్భమయ్యాం బృస్యాం బ్రహ్మ సనాతనమ్

నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతామ్

శివుడు దర్భాసనముపై కూర్చుండి, తనను ప్రశ్నించిన నారదు నకు కాలాతీతమగు పరబ్రహ్మతత్త్వమును ఉపదేశించుచుండెను, సనకాది మహాత్ములు ఆ ఉపదేశమును వినుచుండిరి.

కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని

బాహుప్రకోష్ఠేఽక్షమాలామాసీనం తర్కముద్రయా

ఆయన కుడితొడపై పద్మమువంటి ఎడమపాదమును పెట్టి (వీరా సనము), ఎడమచేతిలో జపమాలను పట్టుకొని, దానిని ఎడమ మోకాలిపై ఆన్చి, కుడిచేతితో జ్ఞానముద్ర (బొటనవ్రేలితో చూపుడు వ్రేలును కలిపి, మిగిలిన మూడు వేళ్లను నిటారుగా నుంచుట) పట్టి కూర్చుండెను.

తం బ్రహ్మనిర్వాణసమాధిమాశ్రితం

వ్యుపాశ్రితం గిరిశం యోగకక్షామ్

సలోకపాలా మునయో మనూనా-

మాద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః

శివుడు యోగపట్టమును గట్టిగా దగ్గరకు లాగి కట్టుకొని మనస్సును బ్రహ్మానందమునందు స్థిరముగా లగ్నము చేసి కూర్చుండెను; ఆత్మనిష్ఠులగు వారీలో ఆయన అగ్రగణ్యుడు. ఆ కైలాసపతిని చూచి, లోకపాలకులు, మహర్షులు చేతులను జోడించి నమస్కరించిరి.

స తూపలభ్యాగతమాత్మయోనిం

సురాసురేశైరభివందితాంఘ్రిః

ఉత్థాయ చక్రే శిరసాఽభివందన

మర్హత్తమః కస్య యథైవ విష్ణుః

శివుని పాదపద్మములకు దేవప్రభువులు , మరియు రాక్షసప్రభువులు కూడ నమస్కరించుచుందురు. శ్రీమహావిష్ణువు పూజనీయులలో సర్వశ్రేష్ఠుడే అయినా, (వామనావతారములో) కశ్యప ప్రజాపతికి నమస్కరించును. అదే విధముగా శివుడు కూడ, తన వద్దకు వచ్చిన స్వయంభువుడగు బ్రహ్మగారిని చూచి, లేచి నిలబడి, తల వంచి నమస్కరించెను.

తథాఽపరే సిద్ధగణా మహర్షిభి-

ర్యే వై సమంతాదను నీలలోహితమ్

నమస్కృతః ప్రాహ శశాంకశేఖరం

కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః

అదే విధముగా, శివుని అనుయాయులు, శివునకు నలువైపులా ఉన్న సిద్ధగణములు, మహర్షులు కూడ బ్రహ్మగారికి నమస్కరించిరి.(శివుడు కంఠమునందు నీలవర్ణమును, దేహమంతటా ఎర్రని రంగును కలిగి యుండును). సర్వులు శివునకు నమస్కరించిరి. శివుడు చంద్రవంకయే శిరోభూషణముగా గలవాడై ప్రకాశించుచుండెను. . స్వయంభువుడగు బ్రహ్మగారు అప్పుడు చిరునవ్వుతో, తనకు నమస్కారమును చేసిన ఆ శివుని ఉద్దేశించి ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ

జానే త్వామీశం విశ్వస్య జగతో యోనిబీజయోః

శక్తేశ్శివస్య చ పరం యత్తద్బ్రహ్మ నిరంతరమ్

బ్రహ్మగారు ఇట్లు పలికెను --- నీవు సర్వజగన్నాథుడవు. జగత్తు పుట్టుటకు ఉపాదానము మాయాశక్తి కాగా, నిమిత్తము శివుడగుచున్నాడు. ప్రకృతి పురుషుల కలయిక చేతనే జగత్తు ఉద్భవించుచున్నది. ఈ విధ ముగా జగత్తునకు శక్తి, శివుడు తల్లిదండ్రులగుచున్నారు. అట్టి శివశక్తులకు అతీతమైనట్టియు, రెండవది లేనట్టియు, వేదాంతములలో ప్రసిద్ధమైన ఏకర సమగు పరబ్రహ్మ యేది గలదో, అది నీవేనని నాకు తెలియును.

త్వమేవ భగవన్నేతచ్ఛివశక్త్యాస్సరూపయోః

విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్నూర్ణపటో యథా

ఓ భగవానుడా ! నీవే శివశక్తుల రూపములో ప్రకటమై ఆ రూపములలో క్రీడించుచున్నావు. శివశక్తులు నీయందు అభేదమును పొందుచున్నారు. ఈ జగత్కార్యములు నీకు లీల మాత్రమే. సాలెపురుగు గూడును తన నుండియే ప్రకటము చేసి, మరల తనలోనే విలీనము చేసుకొనును. అదే విధముగా, నీవు కూడ నీనుండియే ఈ జగత్తును వెలయింపజేసి, దానికి స్థితికాలములో ఉనికిని చైతన్యప్రకాశమును అనుగ్రహించి, మరల నీ లోనికి ఉపసంహరించుకొనుచున్నావు.

త్వమేవ ధర్మార్థదుఘాభిపత్తయే

దక్షేణ సూత్రేణ ససర్జిథాధ్వరమ్

త్వయైవ లోకేఽవసితాశ్చ సేతవో

యాన్ బ్రాహ్మణాశ్శ్రద్దధతే ధృతవ్రతాః

ధర్మార్థకామములనే పురుషార్థములను వేదము జనులకు అనుగ్ర హించుచున్నది. అట్టి వేదమును రక్షించుట కొరకై నీవు దక్షుని నిమిత్త ముగా చేసి, యజ్ఞమును ప్రవర్తిల్ల జేసినావు. ఈ లోకములో ధర్మము యొక్క మర్యాదలను నిలబెట్టేది నీవే. ఆ మర్యాదలనే నియమనిష్ఠ గల వేదవేత్తలు శ్రద్ధతో అనుష్ఠించుచున్నారు.

త్వం కర్మణాం మంగల మంగలానాం

కర్తుస్స్మ లోకే తనుషే స్వః పరం వా

అమంగలానాం చ తమిస్రముల్బణం

విపర్యయః కేన తదైవ కస్యచిత్

మంగళమయుడవగు ఓ శివా! లోకములో మంగళకర్మలను సకామముగా చేయువారికి స్వర్గసుఖములను, నిష్కామముగా చేయువారలకు పరమపురుషార్థమగు మోక్షమును నీవు అనుగ్రహించుచున్నావు. తప్పు పనులను చేయువారలను నీవు భయంకరమగు నరకములోనికి నెట్టివేయు చున్నావు. కాని, ఒకప్పుడు మాకు తెలియరాని కారణములచే ఒకానొకనికి ఈ ఫలములు తల్లక్రిందులగును. అనగా, దక్షుడు వంటి వాడు మంచి పనిని మొదలిడి అమంగళమును పొందును.

న వై సతాం త్వచ్చరణార్పితాత్మనాం 

భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ

భూతాని చాత్మన్యపృథగ్దిదృక్షతాం

ప్రాయేణ రోషోఽభీభవేద్యథా పశుమ్

పశువులకు, అజ్ఞానులకు కోపము వచ్చినచో తరచుగా ఒళ్లు తేలి యదు. కాని, మహాత్ములు ఆ విధముగా కోపముచే పరాభూతులు కారు. వారు తమ మనస్సును నీ పాదములపై నిలిపి యుంచెదరు. సకలప్రాణు లలో ఆత్మరూపముగా వ్యాపించియున్న నిన్ను వారు సర్వత్రా దర్శించెదరు. మరియు, వారు బ్రహ్మాభిన్నమగు ఆత్మయందు సకలప్రాణులను (సక లజగత్తును) అభిన్నముగా దర్శించెదరు.

పృథగ్దియః కర్మదృశో దురాశయాః

పరోదయేనార్పితహృద్రుజోఽనిశమ్

పరాన్ దురుక్తైర్వితుదంత్యరుంతుదా-

స్తాన్ మాఽవధీద్దైవవధాన్ భవద్విధః

కొందరు సర్వత్ర భేదమునే గాంచెదరు. వారి దృష్టి కర్మలయందే గాని, ఈశ్వరునియందు ఉండదు. చెడు బుద్ధి గల ఇట్టి జనులు ఇతరుల ఉన్నతిని చూచి తమ హృదయములో సర్వదా మాత్సర్యదుఃఖమును పొందుచుందురు. వారు మర్మస్థానములను పొడిచే ఈటేలవంటి మాట లతో ఇతరులకు విశేషముగా దుఃఖమును కలిగించెదరు. అట్టి దుష్టులను కర్మఫలరూపమగు దైవమే వధించును. దక్షుడు అట్టివారిలో ఒకడు. వానిని నీవంటి మంగళస్వరూపుడు సంహరించ వద్దని ప్రార్థించుచున్నాము.

యస్మిన్ యదా పుష్కరనాభమాయయా

దురంతయా స్పృష్టధియః పృథగ్దృశః

కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం

న సాధవో దైవబలాత్కృతే క్రమమ్

పద్మనాభుని మాయను అధిగమించుట చాల కష్టము. దానినే మోహమును పొందిన బుద్ధి గల జనులు భేదమును మాత్రమే దర్శించు చుందురు. అట్టివారు ఏయే దేశకాలములయందు దైవబలముచే ఏయే అపరాధములను చేసిననూ, ఆయా దేశకాలములయందు ఆయా అపరాధ ములను మహాత్ములు దయతో క్షమించి, అనుగ్రహమునే చూపెదరు. అంతేగాని, వారిపై మహాత్ములు తమ పరాక్రమమును చూపించరు.

భవాంస్తు పుంసః పరమస్య మాయయా

దురంతయాఽస్పృష్టమతిస్సమస్తదృక్

తయా హతాత్మస్వనుకర్మచేత-

స్స్వనుగ్రహం కర్తుమహార్హసి ప్రభో

ఓ ప్రభూ! పరమపురుషుడగు భగవానుని మాయను అధిగమిం చుట కష్టము. కాని, సర్వజ్ఞుడవగు నీయొక్క బుద్ధివి ఆ మాయ స్పృశించలేదు. కాని, ఆ మాయచే నశింపజేయబడిన బుద్ధి గల దక్షాదులు కర్మల యందు మాత్రమే తగుల్కొన్న చిత్తమును కలిగియుందురు. వారియందు నీవు ఈ జరిగిన అపరాధము విషయములో అనుగ్రహమును చూప దగు దువు.

కుర్వధ్వరస్యోద్ధరణం హతస్య భో-

స్త్వయాఽనసమాప్తస్య మనో ప్రజాపతేః

న యత్ర భాగం తవ భాగినో దదుః

కుయజ్వినో యేన మఖో నినీయతే

ఓయీ ఆదికారణా శివా! నీవు ధ్వంసము చేయుటచే దక్ష ప్రజాపతియొక్క. యజ్ఞము సమాప్తము కాలేదు. ఆ యజ్ఞమును నీవు ఉద్దరించుము. యజ్ఞమునందు నీకు భాగము గలదు. యజ్ఞమునకు ఫలమునిచ్చువాడవు నీవే. కాని, దుష్టులగు యాజ్ఞికులు నీకా యజ్ఞమునందు భాగమునీయకుండిరి.

జీవతాద్యజమానోఽయం ప్రపద్యేతాక్షిణీ భగః

భృగోశ్శ్మశ్రూణి రోహంతు పూష్ణో దంతాశ్చ పూర్వవత్

యజమానుడగు ఈ దక్షుడు తిరిగి జీవించునట్లు, భగునకు కన్నులు వచ్చునట్లు, భృగు మహర్షికి మీసములు గౌడ్డములు తిరిగి మొలు చునట్లు, మరియు పూష దేవతకు పూర్వమునందు వలెనే దంతములు వచ్చునట్లు నీవు అనుగ్రహించుము.

దేవానాం భగ్నగాత్రాణామృత్విజాం చాయుధాశ్మభిః

భవతానుగృహీతానామాశు మన్యోఽస్త్వనాతురమ్

ఓ రుద్రదేవా! ఆయుధములచే మరియు రాళ్లచే దేవతలకు, ఋత్విక్కులకు అవయవములు విరుగగొట్టబడినవి. వారికి మరల నీ అనుగ్రహముచే వెంటనే స్వస్థత చేకూరుగాక!

ఏష తే రుద్ర భాగోఽస్తు యదుచ్ఛిష్టోఽధ్వరస్య వై

యజ్ఞస్తే రుద్ర భాగేన కల్పతామద్య యజ్ఞహన్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే రుద్రసాంత్వనం నామ షష్ఠోఽధ్యాయః

 యజ్ఞమును ధ్వంసము చేసిన ఓ రుద్రా! యజ్ఞము సమాప్తము కాగా మిగిలిన సర్వము నీ భాగమే అగుగాక! ఓ రుద్రదేవా! ఈనాడు యజ్ఞము నీ భాగముతోనే సుసంపన్నమగును గాక!

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో బ్రహ్మగారు రుద్రుని స్తుతించుట, దేవతలు రుద్రునిప్రసన్నుని చేసుకొనుట అనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).