4 - సతీదేవి ప్రాణములను విడిచి పెట్టుట

మైత్రేయ ఉవాచ

ఏతావదుక్త్వా వీరరామ శంకరః

పత్యంగనాశం హ్యుభయత్ర చింతయన్

 సుహృద్దిదృక్షుః పరిశంకితా భవా-

న్నిషామతీ నిర్విశతీ, ద్విధావస సా

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- శంకరుడు ఇంత మాత్రము పలికీ మిన్నకుండెను. సతీదేవిని వెళ్లకుండగా వారించుట, వెళ్లుటకు అను మతించుట అనే రెండు పక్షములలో ఆమె దేహత్యాగము ఘటిల్లవచ్చుననే ఆశంక ఆయనకు కలిగెను. ఆమెకు ఒక వైపు తన బంధువులను చూడవలె ననే కోరిక ఉండెను. మరియొక వైపు తాను వెళ్లినచో, శంకరుని ఆజ్ఞను. ఉల్లంఘించిన దోషము కలుగునేమో యను ఆశంక గలదు. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లి, మరల వెనుకకు మరలి వస్తూ, ఇటునటు తేల్చుకొన లేక సతమతమయ్యేమ.

సుహృద్దిదృక్షాప్రతిఘాతదుర్మనాః

స్నేహాద్రుదంత్యశ్రుకల్యాతివిహ్వలా

 భవం భవాన్యప్రతిపూరుషం రుషా

ప్రధక్ష్యతీవేక్షత జాతవేపథుః

సతీదేవికి బంధువులను చూడవలెననే కోరిక గట్టిగా ఉండెను. ఆ కోరికకు విఘాతము కలుగగానే ఆమె మనస్సు. చెడిపోయెను. ఆమె దుఃఖ ముతో కన్నులనుండి వీటిని విడుచుచుండెను. బంధువులయందలి ప్రీతి వలన మనస్సు మిక్కిలి కల్లోలితమగుటచే రోదించుచున్న ఆమెకు శరీర ములో వణుకు పుట్టెను. తనతో సాటియైనవారు ఎవ్వరూ లేని శివుని, అట్టి సతీదేవి రోషముతో దహించివేయునా యన్నట్లు చూచెను.

తతో వినిఃశ్వస్య సతీ విహాయ తం

శోకేన రోషేణ చ దూయతా హృదా

 పిత్తోరగాత్ స్త్రీణవిమూఢధీర్గృహాన్

ప్రేమ్లాత్మనో యోవర్ధమదాత్సతాం ప్రియః

 అప్పుడు సతీదేవి తన హృదయములో, శివుడు తనను వెళ్లవద్ద న్నందులకు కోపముతో, శివుని మాటను ఉల్లంఘించుచున్నందులకు దుఃఖ ముతో, చాల తాపమును కలిగియుండెను. అపుడామె దీర్ఘముగా నిట్టూర్చి, ఆ శివుని విడిచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాను. సత్పురుషులకు ప్రియుడగు శివుడు ఆమెకు ప్రేమతో తన అర్ధభాగమును ఇచ్చెను. కాని, ఆమె బుద్ధి యందు స్త్రీసహజమగు ప్రేమ వలన వ్యామోహము నెలకొనెను. కావున నే, అట్టి శివుని ఆమె విడిచి వెళ్లాను.

తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీ-

మేకాం త్రినేత్రానుచరాస్సహస్రశః

సపార్షదయక్షో మణిమన్మదాదయః

పురోవృషేంద్రాస్తరసా గతవ్యథాః

ఆ సతీ దేవి ఒంటరియై వేగముగా నడిచి వెళ్లుచుండగా, మణిమం తుడు, మదుడు మొదలగు శివుని కింకరులు ఇతరులగు పార్షదులతో మరియు యక్షులతో గూడినవారై, వేల సంఖ్యలో నందీశ్వరుని ముందడు కొని, వేగముగా ఆమెను అనుసరించి వెళ్లిరి. శివుని అనుచరులగుటచే వారు నిర్భయులే అయిననూ, సతీదేవిని చూచి వారికి దుఃఖము ముంచుకు వచ్చెను.

తాం సారికాకందుకదర్పణాంబుజ-

శ్వేతాతపత్రవ్యజనప్రగాదిభిః

గీతాయనైర్దుందుభిశంఖవేణుభి-

ర్వృషేంద్రమారోప్య విటంకితా యయుః

వారు ఆ సతీదేవిని నందీశ్వరునిపై అధిష్ఠింపజేసిరి. వారు మైనా పక్షి (ముద్దుగా కబుర్లు చెప్పే పక్షి), బంతి మొదలగు వినోదసాధనముల ను, అద్దము పద్మము పుష్పమాల మొదలగు అలంకరణసామగ్రిని, తెల్లని గొడుగు వింజామరలు మొదలగు మహారాజచిహ్నములను దోడ్కొని వెళ్లిరి. వారి యాత్రకు భేరీలు, శంఖములు, పిల్లన గ్రోవులు మొదలగు సంగీత సాధనములు శోభను చేగూర్చినవి.

ఆబ్రహ్మ ఘోషోర్జితయజ్ఞ వైశసం

విప్రర్షిజుష్టం విబుధైశ్చ సర్వశః

మృద్దార్వయఃకాంచనదర్భచర్మభి-

ర్నిసృష్టభాండం యజనం సమావిశత్

దక్షుని యజ్ఞశాలలో వేదధ్వనులు మిన్ను ముట్టుచుండెను. వివిధ హోమముల మధ్యకాలములో పండితులు స్పర్ధతో శాస్త్రచర్చలను చేయు చుండిరి. ఆ యజ్ఞవాటికను అన్ని రకముల దేవతలు, వేదవేత్తలు మరియు మహర్షులు సేవించుచుండిరి. ఆ స్థానము మట్టి, చెక్క, ఇనుము, బంగార ము, దర్భలు మరియు తోలు అనువాటితో నిర్మించబడిన వివిధపాత్రలతో నిండియున్నది. అట్టి యజ్ఞస్థానములో సతీదేవి ప్రవేశించెను.

తామాగతాం తత్ర న కశ్చనాద్రియ-

ద్విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః

 ఋతే స్వసర్వై జననీం చ సాదరాః

ప్రేమాశ్రుకంత్యః పరిషస్వజుర్ముదా

అక్కడకు చేరుకున్న సతీదేవిని దక్షుడు అవమానించెను. ఆమె తల్లి, అక్కచెల్లెళ్లను మినహాయించి, యజ్ఞమును చేయుచున్న దక్షుని భయము వలన, ఏ ఒక్క రైననూ ఆమెను ఆదరించలేదు. అక్కచెల్లెళ్లు, తల్లి మాత్రము ఆమె రాకకు చాల సంతోషించిరి. ప్రేమతో వారి కన్నులలో నీరు నిండెను. వారి కంఠములు బొంగురువోయెను. వారామెను కౌగిలించు కొనిరి.

సౌదర్యసంప్రశ్నసమర్థవార్తయా

మాత్రా చ మాతృష్వసృభిశ్చ సాదరమ్

దత్తాం సపర్యాం వరమాసనం చ సా

నాదత్త పిత్రాఃప్రతినందితా సతీ

తండ్రియగు దక్షుడు ఆ సతీదేవిని ఆదరపూర్వకముగా ఆహ్వానిం చలేదు. కాని, ఒకే తల్లి కడుపున పుట్టినవారగుటచే అక్కచెల్లెళ్లు కుశలప్రశ్న లను వేసి యథోచితమగు పలుకులను పలికిరి. ఆమె తల్లి, తల్లి తోబుట్టు వులు ఆమెను ఆదరపూర్వకముగా లోపలికి గొనిపోయి పరిచర్యను చేసి, ఉత్తమమగు ఆసనమును సమర్పించిరి. కాని, తండ్రి అవమానించిన కారణ ముగా, సతీదేవి ఆ పరిచర్యలను గాని, ఆసనమును గాని స్వీకరించలేదు.

అరుద్రభాగం తమవేక్ష్య చాస్వరం

పిత్రా చ దేవే కృత హేలనం విభో

 అనాదృతా యజ్ఞసదస్యధీశ్వరీ

చుకోప లోకానివ ధక్ష్యతీ రుషా

ఆ యజ్ఞములో రుద్రునకు హవిర్భాగములు సమర్పింపబడలేదు. తండ్రి ఆ విధముగా సర్వసమర్థుడగు శివదేవుని అవమానించుటను సర్వ లోకములకు ఆధీశ్వరియగు సతీదేవి స్వయముగా చూచెను. పైగా, దక్షుడు యజ్ఞవాటికలో ఆమెను కూడ అవమానించి యుండెను. అపుడామె తీవ్ర మగు కోపమును పొందెను. ఆమె ఆ కోపముతో లోకములను తగులబెట్టి బోవుచున్నదా యన్నట్లు ఉండెను.

జగర్త సాకమర్షవిపన్నయా గీరా

శివద్విషం ధూమపథశ్రమస్మయమ్

స్వతేజసా భూతగణాన్ సముత్తితా-

న్నిగృహ్య దేవీ జగతోకభిశృణ్వతః

సతీదేవి కోపమును చూచి ప్రమథగణములు లేచి నిలబడినవి. ఆపుడామె వారివైపు తీక్ష్ణముగా చూడగనే, వారు ఆగిపోయిరి. పొగ (అ జ్ఞానము) తో నిండియున్న కర్మమార్గములో, శ్రమిస్తూ గర్వించి శివుని ద్వేషించే తండ్రిని చూచి, ఆమె అక్కడి జనులు అందరు వినుచుండగా, కోపముతో తడబాటు పడుతున్న పలుకులతో ఆతనిని నిందించెను.

శ్రీదేవ్యువాచ

 న యస్య లోక్వేస్త్యతిశాయనః ప్రియ-

స్తథానప్రియో దేహభృతాం ప్రియాత్మనః

తస్మిన్ సమస్తాత్మని ముక్త వైరకే

ఋతే భవంతం కతమః ప్రతీపయేత్

శ్రీసతీదేవి ఇట్లు పలికెను --- ఈ సృష్టిలోని సకలప్రాణులలో ఆ శివుడే ఆత్మరూపుడై యున్నాడు. కావున, ఈ సృష్టిలో ఆయనకంటే మొన గాడు మరియొకడు లేడు. అదే విధముగా, సకలప్రాణులకు ఆత్మయే అయి ఉన్న ఆయనకు ఒకడు ప్రియుడనియు, మరియొకడు ద్వేష్యుడ నియు భేదము లేదు. మరియు, సత్యస్వరూపుడగు ఆ శివునకు ఎవరితోనై ననూ విరోధము లేదు. అట్టి ఆ శివునకు ప్రతికూలమును నీవు తప్ప మరి యెవ్వరు ఆచరించెదరు?

దోషాన్ పరేషాం హి గుణేష్వసాధవో

గృధ్ధాంతి కేచిన్న భవాదృశా ద్విజ

గుణాంశ్చ ఫల్గూన్ బహులీకరిష్ణవో

మహత్తమా స్తేష్వవిదద్భవానఘమ్

ఓయీ! నేను బ్రాహ్మణుడను అని నీవు విర్రవీగుచున్నావు. నీవంటి దుష్టులు (అధములు) ఇతరుల గుణములయందు కూడ దోషములను దర్శించేదరే గాని, ఇతరుల గుణములను దర్శించలేరు. మధ్యరకమునకు చెందినవారు ఇతరుల గుణదోషములను యథాతథ ముగా స్వీకరించెదరు. సాధుపురుషులు ఇతరుల దోషములను విడిచి పెట్టి, గుణములను మాత్రమే చూచెదరు. కాని, మహాత్ములు ఇతరుల దోషము లను దర్శించకపోవుట మాత్రమే గాక, వారి అల్పములగు గుణములను కూడ గొప్పవిగా స్వీకరించెదరు. అట్టి మహాత్ముల విషయములో నీవు అప రాధమును చేసి పాపమును మూటగట్టుకొంటివి.

నాశ్చర్యమేతద్యదపత్సు సర్వదా

మహద్వినిందా కుణపాత్మవాదిషు

సేర్ష్యం మహాపూరుషపాదపాంసుభి-

ర్నిరస్తతేజస్సు తదేవ శోభనమ్

శవమువంటి శరీరమే ఆత్మయని స్వీకరించే స్వభావము గల దుష్టులు సర్వకాలములలో ఓర్వలేనితనమును కలిగియుందురు. వారు మహాత్ములను అధికముగా నిందించుటలో ఆశ్చర్యము లేదు. కాని, అట్టి దుష్టుల తేజస్సును తుడిచి పెట్టుటకు ఆ మహాత్ముల పాదధూళియే చాలు ను. పైగా, ఆ దుష్టులకు అట్టి మహాత్ముల నింద కాలక్రమములో కలిగే శిక్ష ద్వారా శోభను కూడ చేకూర్చును. మరియు, దుష్టుల నింద వలన మహా త్ముల శోభ ఇనుమడించునే గాని, వారికి అపకీర్తి లేదు.

యద్ద్వ్యక్షరం నామ గిరేరితం నృణాం

సకృతసంగాదఘమాశు హంతీ తత్

పవిత్రకీర్తిం తమలంఘ్యశాసవం

భవానహో ద్వేష్టి శివం శివేతరః

శివ అనే రెండు అక్షరముల నామము వేదశాస్త్రములలో ప్రసిద్ధమై యున్నది. దానిని మానవులు బుద్ధిపూర్వకముగా కాకున్ననూ, ప్రసం గవశముచేనైననూ ఒక్కసారి నోటితో ఉచ్చరించినచో, వారి పాపములు వెంటనే నశించును. శివుని కీర్తిని గానము చేయుటచే మానవుడు పావనుడగును. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించగలవారు సృష్టిలో లేరు. అట్టి మంగళక రుడగు శివుని కూడ. నీవు ద్వేషించుచున్నావు. ఇది ఆశ్చర్యము! వీవు పాప రూపుడవు, అమంగళకరుడవు.

యత్పాదపద్మం మహతాం మనోలిబి-

ర్నిషేవితం బ్రహ్మరసాసవార్థిభిః

 లోకస్య యద్వర్షతి చాశిషోకర్థిన-

స్తస్మై భవాన్ ద్రుహ్యతి విశ్వబంధవే

తుమ్మెదలు తేనెకొరకై పద్మము చుట్టూ తిరుగును. అదే విధము గా, బ్రహ్మానందమును ఆస్వాదించగోరే మహాత్ముల మనస్సులు పద్మము ను బోలియుండు శివుని పాదములను నిరంతరముగా ధ్యానించుచుండు ను. ఆ శివుని పాదములు భక్తజనులకు కోరికలను వర్షించుచుండును. జగ త్తునకు తండ్రియగు అట్టి శివుని నీవు ద్వేషించుచున్నావు.

కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే

బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే

తన్మాల్యభస్మనృకపాల్యవసత్పిశాచై-

ర్యే మూర్ధభిర్దధతి తచ్చరణావసృష్టమ్

శంకరుడు పేరుకి శివుడు (మంగళకరుడు) అయినా, వాస్తవ ములో అశివుడు (అమంగళరూపుడు) అని నీవు చెప్పితివి. ఈ సంగతి నీకే గాని, బ్రహ్మగారు మొదలగు వారికి తెలియదా యేమి? ఏలయనగా, ఆ శివుడు జటలను విరబోసుకోని పిశాచములతో బాటు శ్మశానములో మకాము చేసియున్నాడు. పైగా, శ్మశానములోని మాలలను, భస్మను, మనుజుల పుర్రెను ధరించినాడు. కాని, ఆ బ్రహ్మాదులు ఆయన పాదముల నిర్మాల్యమును తమ శిరస్సులపై ధరించుచున్నారు. నీకు తెలిసిన సత్యము వారికి తెలియదా యేమి?

కర్ణా పిధాయ నిరయాద్యదకల్ప ఈశే

ధర్మావితర్యసృణిభిర్నృభిరస్యమానే

 ఛింద్యాతసహ్య రుశతీమసతీం ప్రభుశ్చే-

జిహ్వామసూనపి తతో విసృజేత్స ధర్మః

ధర్మరక్షకుడు, జగన్నాథుడు అగు శివుని సభలోని జనులు నిందిం చినప్పుడు, ఆ నిందలను విన్న భక్తుడు సమర్థుడు కానిచో, అక్కడనుండి నిషమించవలెను. లేదా, ఆ వ్యక్తి సమర్థుడైనచో, చెడుకూతలను కూసే ఆ నాలుకను కోసివేయవలెను. అట్లు చేయక, నిందలను విన్నచో, ప్రాణ ములను విడిచి పెట్టవలెను. ధర్మము ఈ మూడు విధములుగా నున్నది.

అతస్తవోత్పన్నమిదం కలేవరం

న ధారయి ష్యే శితికంఠగర్షిణః

జగ్ధస్య మోహాద్ధి విశుద్ధిమంధసో

జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే

దేవతలకు ఉపకారమును చేయుటకొరకై విషమును త్రాగి. నీలకం తుడైన శివుని నిందించుటయే నీవు పనిగా పెట్టుకున్నావు. కావున, నేను నీనుండి పుట్టిన ఈ దేహమును ధరించియుండను. ఏలయనగా, భ్రమ వలన ఒకడు తినకూడని ఆహారమును తిన్నచో, వమనము చేయుటయే దానికి విరుగుడు అని పెద్దలు చెప్పెదరు.

 న వేదవాదాననువర్తతే మతి

స్స్వ ఏవ లోకే రమతో మహామునేః

 యథా గతిర్దేవమనుష్యయోః పృథక్

స్వ ఏవ ధర్మే న పరం క్షిపేత్ స్థితః

గొప్ప మననశీలుడగు జ్ఞాని ఆత్మ అనే లోకమునందు మాత్రమే నిష్ఠను పొంది ఆనందమునందు నిమగ్నుడై యుండును. అట్టి జ్ఞాని యొక్క బుద్ధి వేదోక్తములగు విధినిషేధములయందు ప్రవర్తిల్లదు. అనగా, ఆతడు వేదోక్తములగు విధిని షేధములకు అతీతుడు. దేవతలు, మను ష్యులు ఒకే మార్గములో సంచరించుట లేదు. అదే విధముగా కర్మఠులు, జ్ఞానులు ఒకే పద్దతిలో జీవించుట లేదు. మానవుడు ఈ సత్యమును గుర్తిం చి, తాను తనకు ఉద్దేశించబడిన ధర్మమును అనుష్ఠించవలెను. అంతేగాని, ఇతరులను తన ధర్మము అనుష్టించని కారణముగా గాని, లేక మరియొక ధర్మమును అనుష్ఠించుచున్న కారణముగా గాని, నిందించరాదు.

కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యృతం

వేదే వివిద్యోభయలింగమాశ్రితమ్

 విరోధి తద్యౌగపదైకకర్తరిత

ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్ఛతి

కర్మ ప్రవృత్తి, నివృత్తి అని రెండు విధములుగా నున్నది. విషయ. సుఖములయందు రాగము గల వ్యక్తికి అగ్నిహోత్రము మొదలగు స్వర్గసాధనములగు కర్మలను వేదము- విధించినది. వైరాగ్యము గలవానికి అదే వేదము శమదమాది నివృత్తిరూపమగు కర్మను విధించినది. ఈ రెండు మార్గములు పరస్పరము విరుద్ధములగుటచే, ఒకే వ్యక్తి ఒకే కాలము నందు ఈ రెండింటినీ కలిపి అనుష్ఠించుట సంభవము కాదు. అంతేగాక, పరబ్రహ్మయగు శివునియందు ఈ రెండు విధముల మార్గములు అన్వ యించవు. అనగా, శివుడు ప్రవృత్తి మార్గమును గాని, నివృత్తి మార్గమును అనుసరించ దగిన ఆవశ్యకత లేదు.

మా వః పదవ్యః పీతరస్మదాస్థితా

యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః

తదన్నతృప్తిరసుభృద్భిరీడితా

అవ్యక్తలింగా అవధూత సేవితాః

ఓ తండ్రీ! మాకు (నాకు, శివునకు) ఉండే అణిమాది సిద్దులు బయటకు ప్రకటము కావు. ఆ సిద్దులను కేవలము బ్రహ్మవేత్తలు మాత్రమే కలిగియుందురు. ఇంద్రియభోగములయందు లాలసులైన నీవంటి వారలు యజ్ఞశాలలయందు. కామ్యకర్మలను చేస్తూ, ఆ పొగలో మగ్గుతూ, ఆ యజ్ఞాన్నమును తిని తృప్తిని చెందేదరు. నీవంటి వారకు మా సిద్ధుల మహిమ అవగతము కాదు. నీవంటి వారలు దక్షిణమార్గములో స్వర్గాదిలోక ములను పొంది అచట కర్మఫలరూపములగు అల్పభోగములననుభవించి, మరల జన్మించెదరు. నీవంటి వారలకు శివుని మహిమ గోచరము కాదు.

నైతేన దేహేన హరే కృతాగసో

దేహోద్భవేనాలమలం కుజన్మనా

 క్రీడా మమాభూతుజనప్రసంగత-

సజ్జన్మ ధిగ్యో మహతామవద్యకృత్

నీవు శివుని యెడల పాపమునాచరించినావు. అట్టి నీ దేహము వలన జన్మించిన ఈ నా దేహము మిక్కిలి నింద్యమైనది. దీనితో నాకు ప్రయోజనమేమియు లేదు. దుష్టుడవగు నీతో ప్రసంగించినందులకు నాకు సిగ్గు వేయుచున్నది. శివునివంటి మహాత్ముల యెడల అపరాధమును చేసిన నీ వలన కలిగిన ఈ నా జన్మ నిందనీయము.

గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో

దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః

వ్య పేతనర్మస్మితమాశు తద్ధ్యహం

వ్యుతక్ష్య ఏతత్కుణపం త్వదంగజమ్

శివుని ధ్వజమునందు వృషభము చిహ్నముగా నుండును. ఆయన ధర్మరక్షకుడు. అప్పుడప్పుడు ఆ భగవానుడు నన్ను దాక్షాయణి (దక్షుని కుమార్తె) అని పిలిచెడివాడు. ఆ సమయములలో నాలోని పరిహా సము తొలగిపోయి, చిరునవ్వు మాయమై, నేను మనస్సులో చాల భేద మును పొందెడిదానను. కావున, నీ దేహమునుండి పుట్టిన శవప్రాయమగు ఈ శరీరమును నేను వెంటనే విడిచి పెట్ట బోవుచున్నాను.

మైత్రేయ ఉవాచ

ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్

క్షితావుదీచీం నిషపాద శాంతవాక్

స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా

నిమీల దృగ్యోగపథం సవిశత్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కామము, క్రోధము మొద లగు అంతశ్శత్రువులను జయించిన ఓ విదురా! ఈ విధముగా యజ్ఞశా లలో ఆ సతీదేవి దక్షునితో పలికి, వెంటనే పలుకులను విరమించేను. ఆమె పచ్చని వస్త్రమును కప్పుకున్నదై ఆచమనమును చేసి, ఉత్తరదిక్కు వైపు తిరిగి నేలపై కూర్చుండి, కన్నులను మూసుకొని యోగమార్గములో సమాధిస్థితిని పొందెను.

కృత్వా సమానావనితా జితాసనా

సోదానముత్తాప్య చ నాభిచక్రతః

 శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం

కంఠాదువోర్మధ్యమనిందిత్వానయాత్

దోషము లేని ఆ సతీదేవి దృఢమగు ఆసవమును బంధించి, ప్రాణాయామమును చేసి ప్రాణాపానములను సమానముగా చేసెను. అపు డామె ఉదావము (ప్రాణశక్తి శరీరమును విడుచునట్లు చేసే వాయువిశేష ము) ను నాభిస్థానము (మణిపూరకచక్రము) నుండి పైకి లేపి, మెల్లగా బుద్ధితో సహా హృదయస్థానమునందలి అనాహతచక్రములో ప్రవేశపెట్టేను. అక్కడనుండి దానిని కంఠమునందలి విశుద్ది చక్రములోనికి, కంఠమునుండి కనుబొమల మధ్యయందలి ఆజ్ఞాచక్రములోనికి ప్రవేశ పెట్టెమ.

ఏవం స్వదేహం మహతాం మహీయసా

ముహుస్సమారోపితమంకమాదరాత్

జిహాసతీ దక్షరుషా మనస్వినీ

దధార గాత్రేష్వనిలాగ్నిధారణామ్

సనకుడు మొదలగు మహాత్ములచే పూజించబడే శివుడు ప్రేమతో సతీదేవిని తన అంకముపై పలుమార్లు అధిష్టింపజేసెడివాడు. అభిమాన వతి మరియు ధైర్యవంతురాలు అగు సతీదేవి దక్షుని కోపము కారణముగా అట్టి తన దేహమును విడువగోరెను. ఆమె అప్పుడు యోగమార్గములో మనస్సునందు వాయువును, అగ్నిని ధారణ చే పెను.

తతస్వభర్తుశ్చరణాంబుజాసవం

జగద్గురోశ్చింతయతీ న చాపరమ్

దదర్శ దేహో హతకల్మషా సతీ

సద్యః ప్రజజ్వాల సమాధిజాన్నినా

తరువాత ఆ సతీదేవి జగత్తునకు తండ్రి, తనకు భర్తయగు శివుని పాదపద్మములను మనస్సులో ధ్యానించుచుండెను. అట్టి ధ్యానము వలన ఆమెకు అమృతమువంటి హృదయానందము కలిగెను. ఆమె సమాధియం దున్నదై బాహ్యస్పృహ లేకుండెను. ఆ ధ్యానముచే ఆమె దేహమునకు దక్షుని దేహమునుండి పుట్టుట అనే దోషము దూరమయ్యెను. అపుడా సమాధినుండి పుట్టిన అగ్ని ఆమె దేహమును శీఘ్రమే కాల్చివేసెను.

తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహ -

ద్ధా హేతి వాదస్సుమహానజాయత

హంత ప్రియా దైవతమస్య దేవీ

జహావసూన్ కేన సతీ ప్రకోపితా

దేవతలు మొదలగువారు ఆ గొప్ప ఆశ్చర్యమును చూచి, అయ్యో! అయ్యో! అంటూ బిగ్గరగా హాహాకారములను చేసిరి. అయ్యో! శివుడు దేవాధిదేవుడు. ఆయన ప్రియురాలగు సతీదేవికి దక్ష ప్రజాపతి తీవ్ర మగు కోపము వచ్చునట్లు చేయగా, ఆమె ప్రాణములను విడిచి పెట్టెను అని పలుకుతూ, వారు చేసిన హాహాకారములు భూమిపై మరియు ఆకాశములో మారుమ్రోగినవి.

అహో అనాత్మ్యం మహదస్య పశ్యత

ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః

జహావసూన్యద్విమతాత్మజా సతీ

మనస్వినీ మానమభీక్ష్ణమర్హతి

ఆశ్చర్యము! సకలచరాచరప్రాణులను ప్రేమగా చూడవలసిన ఈ దక్షప్రజాపతియొక్క అతిశయించిన దౌర్జన్యమును చూడుడు, తన కుమా ర్తెయగు సతీదేవిని అవమానించినాడు. గొప్ప అభిమానవతియగు ఆ సతీ దేవిని ఎన్ని మార్లు గౌరవించిననూ, ఆమె అట్టి గౌరవమునకు అర్హురాలే.. ఈతడు అవమానించిన కారణముగా పవిత్రహృదయురాలగు ఆమె ప్రాణ ములను విడిచి పెట్టినది.

సోయం దుర్మర్షహృదయో బ్రహ్మధ్రుక్చ

లోకేకపకీర్తిం మహతీమవాప్ప్యతి

యదంగజాం స్వాం పురుషద్విడుద్యతాం

న ప్రత్య షేధన్మృతయేకపరాధతః

ఈ దక్షుని హృదయము చెడు ఆలోచనలకు పుట్ట. ఈతడు శివుని ద్వేషించి ఆయన యెడల ద్రోహమునే చేసినాడు. ఈతనికి లోకములో పేద్ద అపకీర్తి కలుగును. ఏలయనగా, ఈతడు చేసిన అవమానము వలన స్వంత కుమార్తె మరణించుటకు సిద్ధపడగా, ఈతడు ఆపే ప్రయత్నమునై ననూ చేయలేదు.

వదత్యేవం జనే సత్యా దృష్ట్వాసుత్యాగమద్భుతమ్

దక్షం తత్పార్షదా హంతుముదతిష్టన్నుదాయుధాః

జనులు ఈ విధముగా చెప్పుకొనుచుండిరి. సతీదేవి చేసిన ఆ అద్బుతమగు ప్రాణత్యాగమును చూచిన రుద్రానుచరులు ఆయుధములను దాల్చినవారై, దక్షుని సంహరించుటకు సంసిద్దులైరి.

తేషామాపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః

యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావ హ

భృగు మహర్షి గొప్ప మంత్రశక్తి గలవాడు. తమ మీదకు వేగముగా దూసుకువచ్చుచున్న రుద్రానుచరులను చూచి, ఆతడు దక్షిణాగ్నియందు యజ్ఞమును చెడగొట్టువారిని నశింపజేసే యజుర్వేదమంత్రముతో హోమ మును చేసెను.

అధ్వర్యుణా హూయమానే దేవా ఉత్పేతురోజసా

 ఋభవో నామ తపసా సోమం ప్రాప్తిస్సహస్రశః

అధ్వర్యుడైన భృగుమహర్షి ఆ విధముగా అగ్నిలో హోమమును చేయుచుండగనే, ఋభువులు అని ప్రసిద్దిని గాంచిన దేవతలు గొప్ప వేగ ముతో ఆవిర్భవించిరి. ఈ దేవతలు పూర్వము తపస్సును చేసి, చంద్రలోకమును మరియు యజ్ఞములోని సోమములో భాగమును పొందియుండిరి.

తైరలాతాయుధైస్సర్వే ప్రమథాస్సహగుహ్యకాః

హన్యమానా దిశో భేజురుశద్బిర్బ్రహ్మతేజసా

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే సతీదేహోత్సర్గో నామ చతుర్థోఽధ్యాయః

 బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించే ఆ దేవతలు మండే కర్రలనే ఆయు ధములుగా పట్టుకొని, యక్షులతో కూడియున్న రుద్రానుచరులను కొట్టజో చ్చిరి. అపుడు వారందరు నలు దిక్కులకు పారిపోయిరి.

శ్రీమద్భాగవతములోని నాల్గవ స్కంధములో సతీదేవి ప్రాణములను విడుచుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది.