12 - ధ్రువోపాఖ్యానము - ధ్రువుడు పరమ పదమును పొందుట

Iమైత్రేయ ఉవాచ

ధ్రువం నివృత్తం ప్రతిబుధ్య వైశసాత్

అపేతమన్యుం భగవాన్ ధనేశ్వరః

 తత్రాగతశ్చారణయక్షకిన్న రైః

సంస్తూయమానోభ్యవదత్కృతాంజలిమ్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువునకు కోపము పోయిన దనియు, ఆతడు యక్షుల హింసను ఆపివేసినాడనియు తెలుసుకున్న పూజ్యుడగు కుబేరుడు అచటకు వచ్చెను. ఆయన వచ్చుచుండగా, చారణులు యక్షులు కిన్నరులు ఆయనను చక్కగా స్తుతించుచుండిరి. ఆయ నకు ధ్రువుడు చేతులు జోడించి నమస్కరించెను. అప్పుడాయన ధ్రువుని ఉద్దేశించి ఇట్లు పలికెను.

ధనద ఉవాచ

భోభోః క్షత్రియదాయాద పరితున్జకస్మి తేనఘ

యస్త్వం పితామహాదేశాద్వైరం దుస్త్యజమత్యజః

ఓయీ రాజకుమారా! నీవు పుణ్యాత్ముడవు. నేను నీ విషయ ములో చాల సంతోషించితిని. వైరభావమును విడిచి పెట్టుట చాల కష్టము. కానీ, నీవు తాతగారి ఆదేశముననుసరించి యక్షులయందలి వైరబుద్దిని విడిచిపెట్టితివి.

న భవానవధీద్యక్షాన్న యక్షా భ్రాతరం తవ

 కాల ఏవ హి భూతానాం ప్రభురవ్యయభావయోః

వాస్తవములో యక్షులను సంహరించినది నీవు కాదు. నీ తమ్ముని సంహరించినది యక్షులు కాదు. ఏలయనగా, సకలప్రాణుల జన్మమరణము లకు సమర్థమైనది కాలము మాత్రమే.

అహం త్వమీత్యపార్థా ధీరజ్ఞానాత్పురుషస్య హి

 స్వాప్నీవాభాత్యతధ్యానాద్యయా బంధవిపర్యమౌ

వ్యక్తి స్వప్నములో కానవచ్చే సర్వము తానే అయి ఉన్ననూ, ఒక దేహమునందు నేను అనే బుద్ది ఉండుటచే, ఇతరము అంతా తనకంటే భిన్నము అనే భావన కలుగును. కాని, ఈ భావన తప్పు స్వప్నములోని సర్వము స్వప్నద్రష్ట తానే అయి ఉన్నాడు. జాగ్రదవస్థలో కూడ వ్యక్తికి దేహమునందు నేను అనే భ్రాంతి ఉండుటచేతనే, నేను నీవు అనే భేదబుద్ధి కలుగుచున్నది. ఈ భేదబుద్ధి అజ్ఞానకృతము, అయథార్థము మాత్రమే. ఈ భేదబుద్ధి వలననే వ్యక్తికి కర్మబంధము మరియు సంసారదుఃఖము కలుగు చున్నవి,

తధ్గచ్ఛ ధ్రువ భద్రం తే భగవంతమధోక్షజమ్

 సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మవిగ్రహమ్

 భజస్వ భజనీయాంఘిమభవాయ భవచ్ఛిదమ్

 యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యాత్మమాయయా

ఓ ధ్రువా! వెళ్లుము. నీకు మంగళమగు గాక శ్రీహరి భగవానుడు ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాడు. కాని, ఆయనయే. మన ముందు సకలప్రాణుల రూపములోనున్నాడు. ఆయన పాదములను సేవిం చువారలకు సంసారము తొలగిపోవును. ఆయన సత్త్వరజస్తమోగుణాత్మక మగు మాయాశక్తి అనే ఉపాధిని స్వీకరించి జగత్తుయొక్క సృష్టిస్థితిలయ ములను చేయువాడే అయిననూ, ఆయన స్వరూపమునందు మాయాశ క్తితో సహా రెండవది ఏదీ లేదు. అట్టి శ్రీహరిని నీవు సంసారనివృత్తి కొరకైసేవించుము. సకలప్రాణులను ఆత్మరూపముగా దర్శించుము.

వృణీహి కామం నృప యన్మనోగతం

మత్తస్త్వమౌత్తానపదేవిశంకితః

వరం వరార్హంబుజనాభపాదయోః

అనంతరం త్వాం వయమంగ శుశ్రుమ

ఉత్తానపాదుని కుమారుడవగు ఓ రాజా! నీవు వరమునకు అర్హుడ వు. ఏలయన, నీవు పద్మనాభుని పాదపద్మములకు చాల దగ్గర భక్తుడవని మేము వినియుంటిమీ, కావున, నీవు శంకను పెట్టుకొనకుండగా యథే చ్ఛగా నీ మనస్సులోని వరమును నానుండి కోరుకొనుము.

మైత్రేయ ఉవాచ

 స రాజరాజేన వరాయ చోదితో

 ధ్రువో మహాభాగవతో మహామతిః

హరౌ స వమ్రచలితాం స్మృతిం యయా

తరత్యయత్నేన దురత్యయం తమః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువుడు గొప్ప భగవద్భ క్తుడు మరియు పెద్ద మనసు గలవాడు. ఆయనను రాజరాజగు కుబేరుడు వరమును కోరుకొమ్మని ప్రేరేపించెను. అపుడాయన తనకు విచలితము కాని శ్రీహరియొక్క స్మరణము ఉండవలెనని కోరెను. అట్లు శ్రీహరిని స్మరించువాడు, తరింప శక్యము కాని అజ్ఞానమును, తత్కృతమగు సంసా ర సముద్రమును తేలికగా తరించివేయును.

తస్య ప్రీతేన మనస్తా తాం దత్త్వెడవిడస్తతః

పశ్యతోంతర్దధే సోకపీ స్వపురం ప్రత్యపద్యత

ఇడవిడాపుత్రుడగు కుబేరుడు తన మనస్సులో చాల సంతోషించి, ధ్రువునకు అఖండమగు హరీస్మరణము కలుగునట్లుగా వరమునిచ్చి, ఆతడు చూచుచుండగనే అంతర్ధానమయ్యెను. అపుడు ధ్రువుడు కూడ తన నగరమును చేరుకొనెను.

అథాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరదక్షిణైః

 ద్రవ్యక్రియాదేవతానాం కర్మ కర్మఫలప్రదమ్

తరువాత ధ్రువుడు అధికమగు దక్షిణలు గల క్రతువులచే యజ్ఞేశ్వ రుడగు శ్రీహరిని ఆరాధించెను. పురోడాశాది ద్రవ్యము, ప్రయాజ మొద లగు కర్మాంగములు మరియు దేవతలతో కూడియున్న కర్మ శ్రీహరి రూపమే. అట్టి కర్మకు ఫలమునిచ్చువాడు కూడ శ్రీహరియే.

సర్వాత్మన్యచ్యుతేసర్వే తీవ్రాఘాం భక్తిముద్వహన్

దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుమ్

ఈ సర్వముయొక్క మౌలికస్వరూపమగు సత్త శ్రీహరియే. కాని, ఈ అన్ని ఉపాధులు ఆయనయందే ప్రకాశించుచున్ననూ, వాస్తవముగా ఈ ఉపాధులు ఆయనయందు లేవు. అట్టి అవినాశియగు శ్రీహరియందు ధ్రువుడు అఖండ చిత్తవృత్తి ప్రవాహమును నిలిపి భక్తిని చేసెను. ఆతడు తనయందు, సకలప్రాణులయందు అంతర్యామియై సర్వవ్యాపకుడగు శ్రీహరిని ఆత్మరూపముగా దర్శించెను.

తమేవం శీలసంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలమ్

 గోప్తారం ధర్మ సేతూనాం మేనిదే పితరం ప్రజాః

ఈ విధముగా భక్తి ధ్రువుని స్వభావములో భాగమై పోయెను. ఆత నికి వేదవేత్తలయెడల ఆదరము, దీనుల యెడల ప్రేమ ఉండెడివి. ఆతడు ధర్మముయొక్క మర్యాదలను రక్షించెడివాడు. అట్టి ధ్రువుని ప్రజలు తమ తండ్రిగనే భావించిరి.

షట్త్రింశద్వర్షసాహస్రం శశాస క్షితిమండలమ్

 భోగైః పుణ్యక్షయం కుర్వన్నభోగైరశుభక్షయమ్

ధ్రువుడు రాజోచితములగు భోగములననుభవించుటచే ఆతని పుణ్యము ఖర్చు అయ్యెను. భోగములను విడిచి యజ్ఞాదులను చేయుటచే పాపము క్షయమయ్యెను. ఈ విధముగా ఆతడు భూమండలమును ముప్పది ఆరు వేల సంవత్సరములు శాసించెను.

ఏవం బహుసవం కాలం మహాత్మా విచలేంద్రీయః

 త్రివర్గాపయికం నీత్వా పుత్రాయాదాన్నృపాసనమ్

ధ్రువుడు విచలితము కాని ఇంద్రియములు గల మహాత్ముడు. ఆయన ఈ విధముగా అనేకసంవత్సరముల కాలమును ధర్మార్థకామము లనే పురుషార్థముల సేవనములో గడిపి, రాజ్యాధికారమును పుత్రుడగు ఉత్కలునకు ఇచ్చెను.

మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని

 అవిద్యారచితస్వప్నగంధర్వనగరోపమమ్

మనకు కల వచ్చినప్పుడు దానిలోని పదార్థములన్నియు యథార్థ ములే యనిపించును. కాని, ఆ కల కేవలము మనస్సుచే కల్పితమై ఆత్మ చైతన్యముచే ప్రకాశించుచున్నది. మేఘముల గుంపులో ఏవేవో రూప ములు కానవచ్చును. ఆ రూపములు కేవలము మనస్సుయొక్క కల్పనలు మాత్రమే. కాని, ఆ కల్పిత రూపములను ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యమే. అదే విధముగా ఈ జగత్తు కూడ వాస్తవముగా ఆత్మచైతన్యమునందు లేకు న్ననూ, అజ్ఞానముచే ఉన్నట్లు కానవచ్చుచున్నది. ఈ సత్యమును ధ్రువుడు తెలుసుకున్నాడు.

ఆత్మస్త్ర్యపత్యసుహృదో బలమృద్ధకోశ-

 మంతఃపురం పరి విహారభువశ్చ రమ్యాః

 భూమండలం జలధిమేఖలమాకలయ్య

కాలోపసృష్టమితి స ప్రయణా విశాలామ్

దేహము, భార్య, సంతానము, మిత్రులు, సైన్యము, సంపదలతో నిండియున్న ఖజానా, అంతఃపురము, చుట్టూ సుందరమైన విహారోద్యాన ములు, సముద్రతీరము వరకు వ్యాపించిన సామ్రాజ్యము అనే ఈ సర్వము కాలముచే కబళించివేయబడును అని ఆ ధ్రువుడు దర్శించి, బదరికాశ్రమ మును చేరుకోనెను.

తస్యాం విశుద్ధకరణశ్శివవార్విగాహ్య

బద్ధ్వాసనం జితమరున్మనసా హృతాక్షః

 స్థూలే దధార భగవతతిరూప ఏతత్

 ధ్యాయంసదవ్యవహితో వ్యసృజత్సమాధౌ

ఆ ధ్రువుడు బదరియందు పవిత్రజలములలో స్నానమును చేసి పరిశుద్దమగు ఇంద్రియములు, మనస్సు గలవాడై (యమ నియమములు), ఆసనమును బిగించి కూర్చుండెను. అపుడాయన. ప్రాణాయామమును చేసి, మనస్సుచే ఇంద్రియములను ప్రత్యాహారము చేసి, భగవంతుని స్థూలమగు విరాడ్రూపమునందు మనస్సును ధారణ చేసెను. ఆ రూప మునే ఏకాగ్రముగా ధ్యానిస్తూ, ధ్యాత-ధ్యేయము అనే భేదమునకు అతీత మైన నిర్వికల్ప సమాధిని పొంది, ఆ రూపమును కూడ విడిచి పెట్టెను.

భక్తిం హరో భగవతి ప్రవహన్నజస్ర-

 మానందబాష్పకలయా ముహురర్ద్యమానః

విక్లిద్యమానహృదయః పులకాచితాంగో

నాత్మానమస్మరదసావితి ముక్తలింగః

ధ్రువుడు శ్రీహరి భగవానునియందు అఖండమగు భక్తి గలవాడై కనుల వెంబడి ఆనందబాష్పముల ప్రవాహము స్రవించుచుండగా పలు మార్లు పరవశుడగుచుండెను. భక్తిభావముచే విశేషముగా ద్రవించుచున్న హృదయము గల ఆతని అవయవములన్నియు రోమాంచముచే వ్యాప్తమ గుచుండెను. శరీరాభిమానమును విడిచి పెట్టిన ఆ ధ్రువునకు తాను ధ్రువుడ ననే స్మరణము కూడ లేకుండెను.

స దదర్శ విమానాగ్యం నభసోకవతరత్ ధ్రువః

విభ్రాజయన్ దశ దిశో రాకాపతిమివోదితమ్

ఆ ధ్రువునకు ఆకాశమునుండి దిగుతున్న ఒక గొప్ప విమానము కనబడెను. అది ఉదయించిన పూర్ణచంద్రుని వలె పది దిక్కులను విశేష ముగా ప్రకాశింపజేయుచుండెను.

తత్రాను దేవప్రవరౌ చతుర్బుజౌ

శ్యామౌ కిశోరావరుణాంబుజేక్షణా

 స్థితావవష్టభ్య గదాం సువాససౌ

కిరీటహారాంగదచారుకుండలౌ

విమానమును చూచిన ధ్రువునకు వెంటనే ఇద్దరు గొప్ప దేవతా మూర్తులు కనబడిరి. నాలుగు చేతులు గల వారిద్దరు నీలవర్ణముతో శోభిల్లి రి. గదను పట్టుకొని నిలబడియున్న వారిద్దరి కన్నులు పద్మములవలె ఎర్రగా ప్రకాశించెను. వారిద్దరు మంచి వస్త్రములను, కిరీటమును, హారమును, భుజకీర్తులను, అందమగు కుండలములను ధరించి యుండిరి.

విజ్ఞాయ తావుత్తమగాయకింకరా-

 వభ్యుత్థితస్సాధ్వసవిస్మృతక్రమః

ననామ నామాని గృణన్మధుద్విషః

 పార్షత్ప్రధానావితి సంహతాంజలిః

వారిద్దరు పవిత్రమగు కీర్తిగల శ్రీహరి అనుచరులని ధ్రువుడు గుర్తు పట్టెను. వెంటనే ఆయన లేచి నిలబడి, వారు శ్రీహరి అనుచరులలో ముఖ్యులైన కారణముగా చాల కంగారు పడినవాడై, అతిథులను పూజించే పద్ధతిని విస్మరించినాడు. ఆయన కేవలము మధువైరియగు శ్రీహరి నామ ములను కీర్తిస్తూ, దోసిలి ఒగ్గి వారికి నమస్కారమును మాత్రమే చేసెను.

తం కృష్ణపాదాభినివిష్ట చేతనం

 బద్దాంజలిం ప్రశ్రయనమకంధరమ్

సునందనందావుపసృత్య సస్మితం

 ప్రత్యూచతుః పుష్కరనాభసమ్మతో

ధ్రువుని మనస్సు శ్రీకృష్ణుని పాదములయందు దృఢముగా నిలిచి యుండెను. ఆతడు చేతులను జోడించి వినయముతో తలను వంచి నిలబడెను. సునందనందులనే వారిద్దరు పద్మనాభుని అనుచరులలో శ్రేష్ఠులుగా ప్రసిద్ధిని గాంచినవారు. వారు చిరునవ్వుతో ఆతనిని ఉద్దేశించి ఇట్లు పలికిరి.

సునందనందావూచతుః

భో భో రాజన్ సుభద్రం తే వాచం నోకవహితశ్శృణు

యః పంచవర్షస్తపసా భవాన్ దేవమతీతృపత్

సునంద నందులిట్లు పలికిరి --- ఓ రాజా! మా మాటను సావధా నముగా వినుము. నీవు అయిదు సంవత్సరముల వయస్సులోనున్నప్పుడే తపస్సును చేసి శ్రీహరి దేవుని సంతోష పెట్టితివి.

తస్యాఖిలజగద్ధాతురావాం దేవస్య శార్జిణః

పార్షదావిహ సంప్రాప్తా నేతుం త్వాం భగవత్పదమ్

  మేమిద్దరము సకలజగత్తునకు తండ్రి, శార్ జ్ఞము అనే ధనస్సును ధరించువాడు అగు శ్రీహరిదేవుని అనుచరులము. మేము నిన్ను శ్రీహరి భగవానుని ధామమునకు గొనిపోవుటకై ఇచటకు వచ్చియుంటిమి.

సుదుర్జయం విష్ణుపదం జీతం త్వయా

యత్సూరయోకప్రాప్య విచక్షతే పరమ్

ఆతిష్ట తచ్చంద్రదివాకరాదయో

గ్రహర్క్షతారాః పరయంతి దక్షిణమ్

విష్ణుధామమును జయించుట చాల కఠినము. కాని, నీవు దానిని జయించితివి (పుణ్యముచే సంపాదించితివి). దానిని సప్తర్షులు సైతము చేరుకొనలేక, కేవలము దూరమునుండి చూచుచుందురు. దాని చుట్టూ సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, నక్షత్రములు, తారకలు మొదలగునవి ప్రదక్షిణముగా తిరుగుచుండును. దానిని నీవు ఇప్పుడు అధిష్ఠించుము.

అనాస్థితం తే పితృభిరన్యైరప్యంగ కర్హిచిత్

 ఆతిష్ఠ జగతాం వంద్యం తద్విష్ణోః పరమం పదమ్

ఓ ధ్రువా! లోకములకు నమస్కరించదగిన శ్రీహరియొక్క ధామ మును ఇదివరలో నీ తండ్రితాతలు గాని, ఇతరులు గాని ఎవరైననూ పొంది యుండలేదు. వేదములలో ప్రసిద్ధమైన సర్వోత్కృష్టమైన అట్టి శ్రీహరి ధామమును నీవు అధిష్టించుము.

ఏతద్విమానప్రవరముత్తమశ్లోకమౌలినా

ఉపస్థాపితమాయుష్మన్నధిరోడుం త్వమర్హసి

ఓ ఆయుష్మంతుడా! పవిత్రమగు కీర్తి గలవారిలో అగ్రేసరుడగు శ్రీహరి ఈ గొప్ప విమానమును పంపినాడు. నీవు దీనిని అధిరోహించుటకు అర్హుడవు.

మైత్రేయ ఉవాచ

నిశమ్య వైకుంఠనియోజ్యముఖ్యయోః 

మధుచ్యుతం వాచమురుక్రమప్రియః

కృతాభిషేకః కృతనిత్యమంగలో

 మునీన్ ప్రణమ్యాశిషమభ్యవాదయత్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువునకు శ్రీహరి ప్రియు డు, శ్రీహరికి ధ్రువుడు ప్రియుడు. వైకుంఠవాసియగు శ్రీహరియొక్క అను చరులు ఇద్దరు పలికిన ఆ తేనెలొలికే పలుకులను విన్న ధ్రువుడు స్నాన మునాచరించి, సంధ్యావందనాది నిత్యకర్మలను పూర్తి చేసుకొని, మంగళాలంకారములను ధరించి, అక్కడి మహర్షులకు నమస్కరించి, వారి ఆశీర్వ చనములను తీసుకొనెను.

పరీత్యాభ్యర్చ ధిష్ట్యాగ్యం పార్షదావభివంద్య చ

 ఇయేష తదధిష్ణాతుం బిభ్రద్రూపం హిరణ్మయమ్

ధ్రువుడు ఆ గొప్ప విమానమును చక్కగా పూజించి ప్రదక్షిణ మును చేసెను. తరువాత ఆ శ్రీహరి అనుచరులకు నమస్కరించెను. అపు డాయన తేజోమయమగు రూపమును దాల్చినవాడై విమానమును అధి ష్ఠించుటకు సంసిద్ధుడాయెను. .

తదోత్తానపదః పుత్రో దదర్శాంతకమాగతమ్

మృత్యోర్మూర్ధ్నిం పదం దత్త్వా ఆరురోహాద్భుతం గృహమ్

అప్పుడు అచటకు కాలము (మృత్యువు) రూపమును దాల్చి విచ్చే సెను. ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు ఆ మృత్యువును చూచి, దాని తలపై కాలిని పెట్టి, ఆ అద్భుతమగు విమానమునెక్కెను.

తదా దుందుభయో నేదుర్మృదంగపణవాదయః

గంధర్వముఖ్యాః ప్రజగుః పేతుః కుసుమవృష్టయః

అప్పుడు భేరీలు, మద్దెళ్లు, తప్పెట్లు మొదలగునవి మ్రోగినవి. గంధర్వులలో ముఖ్యులగు తుంబురుడు మొదలగువారు గొప్పగా పాడిరి. పూల వానలు కురిసినవి.

స చ స్వర్లోకమారోక్ష్యన్ సునీతిం జననీం ధ్రువః

అన్వస్మరదగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపమ్

స్వర్గలోకమును అధిరోహించబోయే ముందు ధ్రువునకు తల్లి సునీతి గుర్తుకు వచ్చెను. దీనురాలగు తల్లిని విడిచి పెట్టి పొంద శక్యము కాని స్వర్గలోకమునకు వెళ్లిపోవుచున్నానే అని ఆయన తలపోసెను.

ఇతి వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ

దర్శయామాసతుర్దేవీం దేవయానేన గచ్ఛతీమ్

ధ్రువుని ఈ మనోభావము దేవతోత్తములగు నందసునందులకు తెలిసిపోయేను. వారాయనకు దేవమార్గములో దేవవిమానముపై వెళ్లు చున్న సునీతీదేవిని చూపించిరి.

తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైన్సు రైః

 అవకీర్యమాణో దదృశే కుసుమైః క్రమశో గ్రహాన్

మార్గములో అక్కడక్కడ విమానములలోని దేవతలు ధ్రువునిపై పువ్వులను చల్లుతూ కొనియాడు చుండిరి. ఆయన వరుసగా గ్రహములను చూచెను.

త్రిలోకీం దేవయానేన సోకతివ్రజ్య మునీనపి

 పరస్తాద్యద్ధ్రువగతిర్విష్ణోః పదమథాభ్యగాత్

తరువాత ధ్రువుడు ఆ దేవవిమానముపై దేవలోకమార్గములో నిశ్చలముగా పయనించి, ముల్లోకములను సప్తర్షిమండలమును కూడ దాటి, ఆ పైన ఉండే శ్రీహరి ధామమును సుఖముగా చేరుకొనెను. ఈ విధ ముగా ధ్రువుడు శాశ్వతమగు స్థానమును పొందెను.

యద్భాజమానం స్వరుచైవ సర్వతో

 లోకాస్త్రమో హ్యనువిభ్రాజంత ఏతే

 యన్నా ప్రజన్ జంతుషు యేననుగ్రహా

ప్రజంతి భద్రాణి చరంతి యేననిశమ్

ఆ శ్రీహరి ధామము స్వయంప్రకాశము. అది అంతటా తనంత తానుగా ప్రకాశించుచుండగా, ఈ ముల్లోకములు దాని ప్రకాశములో మాత్రమే ప్రకాశించుచున్నవి. ప్రాణులయందు దయను చూపి మంగళకార్యములను చేసే పుణ్యాత్ములు మాత్రమే ఆ లోకమును పొందగల్గుదురు. ప్రాణులయందు దయ లేని క్రూరచిత్తులు అచటకు చేరలేరు.

శాంతాస్సమదృశశ్శుద్దాస్సర్వభూతానురంజనాః

యాంత్యంజసాకచ్యుతపదమచ్యుతప్రియబాంధవాః

ప్రసన్నమగు చిత్తము గలవారై సర్వమునందు పరబ్రహ్మను దర్శించే పరిశుద్దాంతఃకరణులగు జనులు సకలప్రాణులను సంతోష పెట్టెద రు. వీరికి శ్రీహరి మరియు శ్రీహరి భక్తులు మాత్రమే ప్రియబంధువులు. ఇట్టివారు శ్రీహరికి ప్రియబంధువులగుదురు. వీరు శాశ్వతమగు ఆ శ్రీహరి ధామమును తేలికగా పొందేదరు.

ఇత్యుత్తానపదః పుత్రో ధ్రువః కృష్ణపరాయణః

 అభూత్త్రయాణాం లోకానాం చూడామణిరివామలః

ఈ విధముగా ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు పవిత్రమగు అంతఃకరణము గలవాడై శ్రీకృష్ణునియందు అనన్యమగు భక్తిని చేసి, ముల్లోకములకు తలమానికము వంటివాడయ్యెను.

గంభీరవేగోకనిమిషం జ్యోతిషాం చక్రమాహితమ్

 యస్మిన్ భ్రమతి కౌరవ్య మేఢ్యమివ గవాం గణః

కురువంశీయుడవగు ఓ విదురా! ధాన్యపు కుప్పలను నూర్చున ప్పుడు మైదానమునకు మధ్యలో పాతబడిన రాటకు కట్టబడి దాని చుట్టూ ఎద్దుల గుంపు గంభీరమగు వేగముతో తిరుగుచుండును. అదే విధముగా జ్యోతిర్మండల చక్రము అలుపునేరుగని గంభీరమగు వేగముతో ధ్రువలోకమునకు కట్టుబడియున్నదై, దాని చుట్టూ తిరుగుచుండును.

మహిమానం విలోక్యాస్య నారదో భగవానృషిః

తోద్యం విశుదన్ శ్లోకాన్ సత్రేక గాయత్ప్రచేతసామ్

పూజ్యుడగు నారద మహర్షి ధ్రువునియొక్క ఈ గొప్పదనమును చూచి, ప్రచేతసరాజుల సత్రయాగములో వీణను వాయిస్తూ, కొన్ని శ్లోకము లను పాడెను.

నారద ఉవాచ

 కూనం సునీతే పతిదేవతాయాః

 తపఃప్రభావవ్య సుతస్య తాం గతిమ్

 దృష్ట్వాభ్యుయానపి వేదవాదినో

  వైవాదిగంతుం ప్రభవంతి కిం నృపాః

నారదుడిట్లు పలికెను --- భర్తయే దైవముగా గల సునీతియొక్క పుత్రుడగు ధ్రువుడు తపస్సుయొక్క మహిమచే ఇట్టి ఫలమును పొందెను. వేదవేత్తలగు మహర్షులు కూడ ఈ విషయమును చూచి, ధ్రువుడు అను ష్ఠించిన అంతరంగ సాధనములను అనుష్ఠించుటలో సమర్థులు కాకుండిరి. కావుననే, వారు అట్టి మహాఫలమును పొందకుండిరి. ఇక రాజులు ట్టి ఫలమును పొందలేకున్నారని వేరుగా చెప్పవలయునా?

యః పంచవర్ష గురుదారవాక్చరైః

భిన్నేన యాతో హృదయేన దూయతా

 వనం మదాదేశకరోజితం ప్రభుం

 జిగాయ తద్బక్తగుణైః పరాజితమ్

ధ్రువుడు అయిదు సంవత్సరముల వయస్సులో ఉండగా సవతి తల్లి పలికిన ఈటెలవంటి మాటలచే హృదయమునకు చాల పీడ కలిగి డ వికి వెళ్లిపోయెను. అచట ఆతడు నా ఆదేశమును పోలించి తపస్సును - చేసెను. శ్రీహరిని ఆరాధించి వశపరచుకొనుట చాల కష్టము. అయిననూ, ఆయన తన భక్తుల సద్గుణములకు లొంగిపోవును. అట్టి శ్రీహరిని ధ్రువుడు తన వశము చేసుకొనెను.

యః క్షత్రబంధుర్బువి తస్యాధిరూఢ-

 మన్వారురుక్షేదపి వర్షపూగైః

 షట్పంచవరో యదహోభిరల్పై

 ప్రసాద్య వైకుంఠమవాప తత్పదమ్

ఈ లోకములో క్షత్రియులు ఎంతటి గొప్పవారైనా ధ్రువునికంటే తక్కువయే. వారెవరైనా ధ్రువుడు అధిష్ఠించిన ధామమును అనేక సంవత్స రములు తపస్సు చేసియైననూ అధిష్టించ గల్గుదురా? అట్లు కోరుటకై ననూ వారికి తాహతు చాలదు. ధ్రువుడు అయిదారేళ్ల వయస్సులోనే కొద్ది రోజులలో బుద్దిగుహయందు నివసించే శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొని ఆ ధామమును చేరుకొనినాడు.

మైత్రేయ ఉవాచ

ఏతత్తేభిహితం సర్వం యత్పృష్ట్వాహమిహ త్వయా

 ధ్రువస్యోద్దామయశసశ్చరితం సంమతం సతామ్

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- నీవు నన్ను ఇప్పుడు ఇక్కడ గొప్ప కీర్తి గల ధ్రువుని వృత్తాంతమునంతను చెప్పమని కోరితివి. సత్పురు షులకు మిక్కిలి ప్రియమగు ఈ చరితమును నేను నీకు చెప్పితిని. దీనిని సత్పురుషులు చాల ప్రశంసించెదరు.

ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్

 స్వర్గం ద్రౌవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్షణమ్

ఈ గొప్ప చరితము సంపదను, కీర్తిని, ఆయుర్దాయమును ఇచ్చు. ను. పవిత్రమైన ఈ చరితము మంగళములకు నిధానము. కొనియాడదగిన ఈ చరితము భక్తులకు స్వర్గమును, ధ్రువపదమును, దేవత్వమును ఇచ్చు ను. ఇది పాపములను కడిగివేసి మనస్సునకు ప్రసన్నతను కలిగించును.

శ్రుత్వైతచ్ఛ్రద్ధయాకభీక్ష్ణమచ్యుతప్రియచేష్టితమ్

భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశసంక్షయః

ధ్రువుడు శ్రీహరికి చాల ప్రీతిపాత్రుడు. ధ్రువునకు శ్రీహరియందు ప్రీతి మెండు. ఆయన వృత్తాంతమును పలుమార్లు శ్రద్ధతో విన్నవారికి ఆ శ్రీహరి భగవానునియందు భక్తి కుదురును. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే అయిదు చిత్త క్లేశములు అట్టి భక్తి వలన తొలగిపోవును.

మహత్త్వమిచ్ఛతాం తీర్థం శ్రోతుశ్శీలాదయో గుణాః

యత్ర తేజస్తదిచ్చూనాం మానో యత్ర మనస్వినామ్

ఈ వృత్తాంతమును శ్రవణము చేయువారలకు గొప్పదనము గాని, బ్రహ్మవర్చస్సు గాని, దేనిని కోరితే అది లభించును. సచ్చీలము మొదలగు గుణములు కలుగును. మరియు మానమర్యాదలు గలవారికి సమ్మానము లభించును.

ప్రయతః కీర్తయేతాతస్సమవాయే ద్విజన్మనామ్

సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్

పవిత్రమగు కీర్తి గల ధ్రువుని గొప్ప వృత్తాంతమును వైదికసంస్కా రవంతుల సభలో వక్త ఏకాగ్రచిత్తము గలవాడై ఉదయ సాయంకాలముల యందు కీర్తించవలెను.

పూర్ణమాస్యాం సినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణ్వేథ వా

దినక్షయే వ్యతీపాతే సంక్రమేర్కదినేపి వా

పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, శ్రవణ నక్షత్రము ఉన్న దినము, తిధి ఆరంభమై పూర్తి అయ్యే దినము, సంక్రాంతి, ఆదివారము, రథసప్తమి అనే దినములలో వీలును బట్టి ఈ గాథను కీర్తించవలెను.

శ్రావయేచ్ఛ్రద్దధానానాం తీర్థపాదపదాశ్రయః

 నేచ్ఛంస్తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిధ్యతి

శ్రీహరి పాదములనుండి గంగ పుట్టినది. అట్టి పాదములను శరణు జొచ్చిన భక్తుడు ప్రతిఫలాపేక్ష లేనివాడై ఈ వృత్తాంతమును శ్రద్ధాళువు లకు వినిపించవలెను. అట్లు చేయుట వలన వానికి తనలో తనకు సంతో షము లభించును. దాని వలన ఆతడు ఆత్మనిష్ఠను పొంది కృతార్థుడగును.

జ్ఞానమజ్ఞాతతత్త్వాయ యో దద్యాత్సత్పథేమృతమ్

 కృపాలోఠీననాథస్య దేవాస్తస్యానుగృహతే

సత్యమార్గములో యథార్థ జ్ఞానము లేని వ్యక్తికి ఎపడైతే ఈ జ్ఞానము అనే అమృతమును ఇచ్చునో, వాడే దీనులనుద్ధరించే దయామ యుడు. అట్టివానిని దేవతలు అనుగ్రహించెదరు.

 ఇదం మయా తేకభిహితం కురూద్వహ

 ధ్రువస్య విఖ్యాతవిశుద్ధకర్మణః

హీత్వారకః క్రీడనకాని మాతుః

గృహం చ విష్ణుం శరణం యో జగామ

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ధ్రువోపాఖ్యానేధ్రువస్య పరమపదప్రాప్తిర్నామ ద్వాదశోఽధ్యాయః

 కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! ధ్రువుని పరమపవిత్రమగు చరితము లోకములో ప్రసిద్దీని గాంచినది. ధ్రువుడు పిల్లవాడుగా నుండగనే ఆటవస్తువులను, తల్లి గృహమును కూడ విడిచి పెట్టి, శ్రీహరిని శరణు జొచ్చినాడు. ఆ వృత్తాంతమును నేను నీకు చెప్పితిని.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో ధ్రువోపాఖ్యానములో ధ్రువుడు పరమపదమును పొందుటఅనే పన్నెండవ అధ్యాయము ముగిసినది.