24 - రుద్రగీతము - రుద్రుడు ప్రచేతసులకు చేసిన ఉపదేశము

మైత్రేయ ఉవాచ

విజితాశ్వో స్ధిరాజాసీతృథుపుత్రః పృథుశ్రవాః

యవీయేభ్యోదదాత్కాష్ణా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పృథువు తరువాత ఆయన పుత్రుడు, గొప్ప కీర్తి గలవాడు అగు విజితాశ్వుడు చక్రవర్తి ఆయెను. సోద రులయందు ప్రేమ గల ఆయన తన నలుగురు తమ్ముళ్లకు నాలుగు దిక్కు లయందు అధికారమును అప్పజెప్పెను.

హర్యక్షాయాదిశత్ప్రాచీం ధూమకేశాయ దక్షిణామ్

ప్రతీచీం వృకసంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభుః

సర్వసమర్థుడగు విజితాశ్వుడు తూర్పు దిక్కును హర్యక్షునకు, దక్షిణమును ధూమ్రకేశునకు, పడమరను వృకునకు, ఉత్తరమును ద్రవీణునకు ఇచ్చెను.

అంతర్దానగతిం శక్రాల్లబ్ద్వాంతర్ధానసంజ్జితః

అపత్యత్రయమాధత్త శిఖండిన్యాం సుసంమతమ్

విజితాశ్వునకు ఇంద్రుడు అంతర్ధానమయ్యే శక్తిని ఇచ్చేను. దానిని బట్టి ఆయనకు అంతర్ధానుడు అని పేరు కలిగెను. ఆయనకు భార్యయగు శిఖండినియందు ముగ్గురు కొడుకులు కలిగిరి. వారందరు జనులచే బాగా ఆదరించబడిరి.

పావకః పవమానశ్చ శుచిరిత్యగ్నయః పురా

వశిష్ఠశాపాదుత్పన్నాః పునర్యోగగతం గతాః

పావకుడు, పవమానుడు మరియు శుచి అనే మూడు అగ్నులు పూర్వములో వశిష్ట మహర్షి ఇచ్చిన శాపము కారణముగా విజితాశ్వుని పుత్రులై జన్మించిరి. వారు యోగమార్గముననుష్ఠించి మరల తమ లోకమును చేరిరి.

అంతర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవిందత

 య ఇంద్రమశ్వహర్తారం విద్వానపి న జఘ్నివాన్

ఇంద్రుడు గుర్రమునపహరించుచుండగా చూచియు విజితాశ్వుడు ఆతనిని సంహరించ లేదు. అంతర్ధానుడనబడే అట్టి విజితాశ్వునకు నభస్వ తియందు హవిర్ధానుడనే కొడుకు కలిగెను.

రాజ్ఞాం వృత్తిం కరాదానదండశుల్కాదిదారుణామ్

మన్యమానో దీర్ఘసత్రవ్యాజేన విససర్జ హ

రాజులు పన్నులను, అపరాధ రుసుములను వసూలు చేయుచూ అపరాధులను శిక్షించుట మొదలగు కార్యములను చేయుదురు. కావున, అంతర్ధానుడు వారి జీవన శైలి క్రూరమైనదని తలపోసి, చిరకాలము జరిగే సత్రయాగముననుష్ఠించే సాకుతో రాజ్యాధికారమును విడిచి పెట్టెను.

తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్

యజంస్తల్లోకతామాప కుశలేన సమాధినా

ఆ సత్రయాగములో కూడ అంతర్ముఖుడగు ఆ అంతర్ధానుడు దృఢమగు చిత్తేకాగ్రతతో అజ్ఞానమును పోగొట్టే పూర్ణ పరమాత్మను ఆరా ధించి, ఆ పరమాత్మ సాక్షాత్కారమును (దివ్యలోకమును) పొందెను.

హవిర్ధానాద్దవిర్దానీ విదురాసూత షట్ సుతాన్

 బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతమ్

విదురా! హవిర్డానునకు హవిర్హానియందు బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితప్రతుడు అనే ఆర్గురు పుత్రులు కలిగిరి.

బరిషత్సుమహాభాగో హావీర్ధానిః ప్రజాపతిః

క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురూద్వహ

కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! హవీర్ధానుని పుత్రుడగు బర్షి షత్ మహారాజు గొప్ప మహానుభావుడు. ఆయన వేదోక్తమగు కర్మలను చేయుటయందు మాత్రమే గాక, ఎనిమిది యోగాంగములయందు కూడ నిష్ణాతుడు.

య స్యేదం దేవయజనమను యజ్ఞం వితన్వతః

ప్రాచీనాగ్రైః కుశైరాసీదాస్తృతం వసుధాతలమ్

బర్హిషత్ ఒక యజ్ఞమును చేసి, ఆ యజ్ఞవాటమునకు ప్రక్కనే మరి యొక యజ్ఞమును చేయుచూ, ఈ విధముగా యజ్ఞములను విస్తరింప జేసుకుంటూ పోవుటచే, ఈ భూతలమంతయు తూర్పు వైపు కొనలు గల దర్భలచే కప్పబడి పోయెను.

సాముద్రిం దేవదేవోక్తాముపయేమే శతద్రుతిమ్

యాం వీక్ష్య చారుసర్వాంగీం కిశోరీం సుడ్జ్వలంకృతామ్

పరిక్రమంతీముద్వా హే చకమేగ్నిశ్శుకీమివ

బర్హిషత్ దేవదేవుడగు బ్రహ్మగారి సలహా ప్రకారముగా సముద్రక న్యకయగు శతద్రుతిని వివాహమాడెను. యౌవనవతియగు ఆ శతద్రుతి సక లావయవములు సుందరముగా నుండెను. వివాహములో ఆమె చక్కగా అలంకరించుకొని అగ్నిని ప్రదక్షిణము చేయుచుండెను. అపుడామెను చూచి అగ్ని, పూర్వము శుకీని వలె, కామించెను.

విబుధాసురగంధర్వమునిసిద్ధనరోరగాః

విజితాస్సూర్యయా దిక్షు క్వణయంత్యైవ నూపురైః

కొత్త పెళ్లి కూతురగు ఆ శతద్రుతి నడచుచుండగా కాలి అందేల ధ్వని దిక్కులయందు ప్రసరించేను. ఆ ధ్వనిమాత్రముచే ఆమె దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మహర్షులు, సిద్ధులు, మానవులు మరియు నాగుల మనస్సులను దోచివేసెను.

ప్రాచీనబర్హిషః పుత్రశ్శతద్రుత్యాం దశాభవన్

తుల్యనామవ్రతాస్సర్వే ధర్మస్నాతాః ప్రచేతసః

ప్రాచీనబర్హి అని పేరు గాంచిన బర్హిషత్ నకు శతద్రుతియందు ప్రచేతసులు అనే పదిమంది కొడుకులు కలిగిరి. ధర్మములో నిష్ణాతులగు వారందరు సమానమగు పేరును మరియు ఆచరణమును కలిగియుండిరి.

పిత్రాదిష్టాః ప్రజాసరే తప సేకర్ణవమావిశన్

దశ వర్షసహస్రాణి తపసా55ర్చంస్తపస్పతిమ్

వివాహము చేసుకొని వంశమును వృద్ధి చేయుడని తండ్రి వారిని ఆదేశించగా, వారు దాని కొరకు ఈశ్వరానుగ్రహమును పొందుటకై తప స్సును చేయగోరి, సముద్రములో ప్రవేశించిరి. వారు పది వేల సంవత్సర ములు తపస్సును చేసి, తపస్సునకు ప్రభువు (తపస్సుచే ఆరాధించబడు వాడు, తపస్సునకు ఫలమునొసంగువాడు) అగు శ్రీహరిని ఆరాధించిరి.

యదుక్తం పథి దృష్టేన గిరిశేన ప్రసీదతా

తద్ధ్యాయంతో జపంతశ్చ పూజయంతశ్చ సంయతాః

మార్గములో వారికి కైలాసవాసియగు రుద్రుడు కనబడెను. ఆయన ప్రసన్నుడై వారికి తత్త్వమునుపదేశించెను. వారు జితేంద్రియులై ఆ తత్త్వమునే ధ్యానిస్తూ, జపిస్తూ, ఆ ప్రకారముగనే పూజించుచుండిరి.

విదుర ఉవాచ

ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్పథి సంగమః

యదుతాహ హరః ప్రీతస్తన్నో బ్రహ్మన్ పదార్థవత్

విదురుడిట్లు పలికెను --- ఓ మహర్షీ! తపస్సునకు వెళ్లుచున్న ప్రచేతసులకు మార్గములో కైలాసపతియగు రుద్రునితో సమాగమము ఏ విధముగా కలిగెను? మరియు ప్రసన్నుడైన ఆ రుద్రుడు వారికి చెప్పిన ప్రయోజనకారియగు ఉపదేశము ఎట్టిది? మాకీ విషయమును చెప్పుము.

సంగమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణామ్

దుర్లభో మునయో దధ్యురసంగాద్యమభీప్సితమ్

ఓ బ్రహ్మర్షీ! ఈ లోకములో ప్రాణులకు శివునితోడి సమాగమము పొంద శక్యము కానిది గదా! మహర్షులు సైతము శివుని పొంద గోరి సంసారమునందలి ఆసక్తిని విడనాడి ఆయనను ధ్యానించుచున్నారు (కాని, పొందుట లేదు).

ఆత్మారామోపి యస్త్వస్య లోకకల్సస్య రాధ సే

శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః

శివ భగవానుడు ఆత్మయందే ఆనందము గలవాడు. అయిననూ, ఆయన ఈ లోకముల రచనను పాలించుట కొరకై భయంకరమగు శక్తితో గూడి సంచరించును.

మైత్రేయ ఉవాచ

ప్రచేతసః పితుర్వాక్యం శిరసావదాయ సాధవః

 దిశం ప్రతీచీం ప్రయయుస్తపస్యాదృతచేతసః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- సత్పురుషులగు ప్రచేతసు లకు మనస్సులో తపస్సునందు ఆదరము మెండు. వారు తండ్రి ఆదేశ మును శిరసా వహించి పడమర దిక్కునకు బయలు దేరిరి.

సముద్రముపవిస్తీర్ణమపశ్యన్ సుమహత్సరః

మహన్మన ఇవ స్వచ్చం ప్రసన్నసలిలాశయమ్

వారు సముద్రమా అనదగ్గంత పెద్ద విశాలమగు సరస్సును చూచి రి. అది మహాత్ముల మనస్సు వలె స్వచ్చమైన నీటితో నిండి యుండెను. దానియందలి జలజంతువులు కూడ ప్రసన్నముగా కనబడెను.

నీలరకోత్పలాంభోజకహ్లరేందీవరాకరమ్

హంససారసచక్రాహ్వకారండవనికూజితమ్

ఆ సరస్సులో నల్ల కలువలు ఎక్కువగా నుండెను. ఎర్ర నల్ల రంగులు కలిసియున్న కలువలు, పద్మములు, అధిక పరిమళము గల ఎర్ర కలువలు మరియు నల్ల కలువలు ఉండెను. హంసలు బెగ్గురు పక్షులు జక్కవ పిట్టలు మరియు కన్నెలేడు పక్షుల కూతలతో ఆ సరస్సు ప్రతిధ్వ నించుచుండెను.

మత్తభ్రమరసౌస్వర్యహృష్టరోమలతాంఘిపమ్

పద్మకోశరజో దీక్షు విక్షిపత్పవనోత్సవమ్

మత్తెక్కిన తుమ్మెదల చక్కని అఖండఝంకారముచే తీగలతో కూడిన చెట్లు హర్షమును పొంది పులకాంకురములను పొందినవా యన్నట్లు వాటి చిగుళ్లు ప్రకాశించెను. ఆ సరస్సు తనయందలి పద్మముల గర్భములోని పుప్పొడిని దిక్కులలో వాయువు ద్వారా వెదజల్లుతూ ఉత్సవమును చేయుచున్నదా యన్నట్లు ఉండెను.

తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గమనోహరమ్

విసిస్మ్యు రాజపుత్రాస్తే మృదంగపణవాద్యను

ఆ రాజపుత్రులకు అచట దివ్యమగు స్వరభేదములతో మనోహర మైన గానము వినబడెను. ఆ గానమును మద్దెల, భేరీ మొదలగు విద్య ముల ధ్వని అనుసరించి యుండెను. వారా గానమును విని విస్మితులైరి.

తర్హ్యేవ సరసస్తస్మాన్నిషామంతం సహానుగమ్

ఉపగీయమానమమరప్రవరం విబుధానుగైః

తప్త హేమనికాయాభం శితికంఠం త్రిలోచనమ్

ప్రసాదసుముఖం వీక్ష్య ప్రణేముర్జాతకౌతుకాః

అదే సమయములో ఆ సరస్సునుండి అనుచరులతో గూడి ముక్కంటి దేవుడు బయటకు వచ్చుచుండెను. దేవతలలో శ్రేష్ఠుడగు ఆయ నను దేవతల అనుయాయులగు గంధర్వులు కీర్తించుచుండిరి. పుటము పెట్టిన బంగారపు ముద్దవలె ప్రకాశించుచున్న ఆ నీలకంఠుడు భక్తులననుగ్ర హించుటకు సుముఖముగా నుండెను. ఆయనను చూచుట తోడనే ప్రచేత సులు ఉత్సాహముతో ఆయనకు నమస్కరించిరి.

స తాన్ ప్రపన్నార్తిహరో భగవాన్ ధర్మవత్సలః

ధర్మజ్ఞాన్ శీలసంపన్నాన్ ప్రీతః ప్రీతానువాచ హ

శరణు పొందినవారి కష్టములనీడేర్చే శివభగవానుడు ధర్మము నందు ప్రేమ గలవాడు. ధర్మము తెలిసినవారు, శీలము నిండా కలవారు అగు ప్రచేతసులు శివుని దర్శనముచే ప్రీతులైరి. వారి విషయములో ప్రసన్నుడైన ఆ శివుడు వారితోనిట్లనెను.

శ్రీరుద్ర ఉవాచ

యూయం వేదవిదః పుత్రా విదితం వశ్చికీర్తితమ్

అనుగ్రహాయ భద్రం వ ఏవం మే దర్శనం కృతమ్

శ్రీరుద్రుడు ఇట్లు పలికెను --- వేదవేత్తలగు మీరు వేదవేత్తయగు బరిషత్ మహారాజుయొక్క పుత్రులని నాకు తెలియును. మీరు ఏమి చేయ గోరుచున్నారో కూడ నాకు తెలియును. మీకు మంగళమగు గాక! మిమ్ము లను అనుగ్రహించుట కొరకై నేను మీకు ఈ తీరున దర్శనమునిచ్చినాను.

యః పరం రంహసస్సాక్షాత్తిగుణాజీవసంజ్ఞితాత్

భగవంతం వాసుదేవం ప్రపన్నస్స ప్రియో హి మే

వాసుదేవ భగవానుడు సూక్ష్మము, త్రిగుణాత్మకము అగు ప్రకృతి కంటే, మరియు జీవతత్త్వము కంటే అతీతుడు. ఆయనను సాక్షాత్తుగా శరణు పొందిన వ్యక్తి నాకు నిశ్చితముగా ప్రియుడు.

స్వధర్మనిష్ఠశ్శతజన్మభిః పుమాన్

విరించతామేతి తతః పరం హి మామ్

అవ్యాకృతం భాగవతోకథ వైష్ణవం

పదం యథాహం విబుధాః కలాత్యయే

వంద జన్మలు తన ధర్మమునందు నిష్ఠ గల వ్యక్తి బ్రహ్మ పదవిని, అంతకంటే ఎక్కువ పుణ్యమున్నచో నన్ను పొందును. కాని, భగవద్భక్తుడు వైష్ణవ ధామమును పొందును. దేవతలు మరియు నేను కూడ మా మా అధికారములు సమాప్తమైనప్పుడు లింగ శరీర భంగముచే పొందేది. జగ త్తునకు అతీతమైన ఆ ధామమే.

అథ భాగవతా యూయం ప్రియాః స్థ భగవాన్ యథా

న మద్బాగవతానాం చ ప్రేయానన్యోస్తి కరిచిత్

మీరు భగవద్భక్తులు గనుక, నాకు భగవంతుడు ఎంతటి ప్రియు డో, మీరు కూడా అంతే ప్రియులు. భగవద్బక్తులకు కూడ ఏ కాలమునందై ననూ నాకంటె ప్రియమైనవాడు మరియొకడు లేడు.

ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగలం పరమ్

నిశ్శ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి వః

నేను మీకు పావనము, గొప్ప కల్యాణకారి, మోక్షమును సైతము ఇచ్చేది అగు ఈ గీతమును చెప్పెదను. వినుడు. దీనిని కలగాపులగము చేయకుండా జపించుడు.

మైత్రేయ ఉవాచ

ఇత్యానుక్రోశాహృదయో భగవానాహ తాన్ శివః

బద్దాంజలీన్ రాజపుత్రాన్నారాయణపరో వచః

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఆ రాజపుత్రులు చేతులను జోడించి యుండిరి. దయాహృదయుడు, నారాయణుడే పరాయణముగా గలవాడు అగు శివ భగవానుడు వారినుద్దేశించి ఇట్లు పలికెను.

శ్రీరుద్ర ఉవాచ

జీతం త ఆత్మవిద్దుర్యస్వస్తయే స్వస్తిరస్తు మే

భవతా రాధసా రాద్ధం సర్వస్మా ఆత్మనే నమః

ఆత్మవేత్తలలో అగ్రేసరులగువారి కల్యాణము (ఆత్మానందము) కొరకై నీవు నీ ఉత్కర్షను ఆవిష్కరించినావు. నాకు కూడ మంగళమగు గాక! పరమానందరూపుడవగు నీవు ఆత్మరూపముగా నిత్యసిద్దుడవై యున్నావు. సర్వము రూపములో ఉన్న నీవు ఆత్మరూపుడవై యున్నావు. నీకు నమస్కారము.

నమః పంకజనాభాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే

వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే

పద్మనాభుడు (లోకమనే పద్మము తనయందు ప్రకటమైన ఆకాశ మునందు గలవాడు), ప్రాణులలో సూక్ష్మభూతముల కార్యములగు ఇంద్రి యములలో ఆయా శక్తుల రూపముగా ప్రకటమై ఆ ఇంద్రియములకు తానే ఆత్మ (నియంత) అయి ఉన్నవాడు, ప్రకృతిలోని చలనము తన స్వరూప మునందు లేనివాడు, ప్రకృతి వికారములకు అతీతుడు, స్వయంప్రకాశచైత న్యస్వరూపుడు, వాసుదేవుడు (సకలప్రాణులలో అంతర్యామియగు ఆత్మరూపముగా నున్నవాడు, మరియు చిత్తమునకు అధిష్ఠాత) అగు శ్రీహరికి నమస్కారము.

సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ

నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మనే

అవ్యక్త స్వరూపుడు, అంతము లేనివాడు, లోకములను అంతము చేయువాడు అగు సంకర్షణ దేవునకు (అహంకారమునకు అధిష్టాత, జగ త్తును తన లోనికి ఉపసంహరించువాడు) నమస్కారము. చైతన్యాధిష్ఠాన రూపములో సకలప్రాణులకు వివిధరూపముల జ్ఞానమును కలిగించువాడు, సకలప్రాణుల అంతర్యామి అగు . ప్రద్యుమ్నునకు (ప్రకృష్టమగు ద్యుమ్నము, అనగా శక్తి లేక చైతన్యప్రకాశము గలవాడు, బుద్ధికి అధిష్ఠాత) నమస్కారము.

నమో నమోనిరుద్దాయ హృషీ కేశేంద్రియాత్మనే

నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే

కన్ను మొదలగు ఇంద్రియములకు ప్రభువైన మనస్సునకు అధి ష్ఠాన దేవతయగు అనిరుద్ధునకు (ఆటంకములు, లేక ఆవరణము లేనివాడు) అనేక నమస్కారములు. జగత్తులోని చీకట్లను పోగొట్టే గొప్ప తేజోమం డలమైన సూర్యుని (ఆత్మజ్ఞాని) రూపములోనున్న శ్రీహరికి నమస్కార ము. శ్రీహరి పూర్ణుడగుటచే ఆయన స్వరూపమునందు వృద్ధిక్షయములు ఉండవు. అట్టి శ్రీహరికి నమస్కారము.

స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః

నమో హిరణ్యవీర్యాయ చాతుర్హో త్రాయ తంతవే

నిత్యము మంచివారిచే తమ హృదయములో ఆరాధించబడే శ్రీహరికి నమస్కారము. అగ్నిదేవుడు కామనతో ఆరాధించువారికి స్వర్గాది పుణ్యలోకములను, నిష్కామముగా ఆరాధించువారికి అంతఃకరణశుద్ధి ద్వారా మోక్షమును ఇచ్చును. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులచే సంపాదించబడే అగ్నిహోత్రకర్మకు సాధనము అగ్నిదేవుడే. ఆ విధముగా శ్రీహరియొక్క తేజోమయమగు శక్తియే అగ్నిదే వుడు. అగ్నిదేవుని రూపములో వైదికకర్మను విస్తరింపజేసే శ్రీహరికి నమస్కారము.

నమ ఊర్జ ఇషే త్రయ్యాః పతయే యజ్ఞరేతసే

తృప్తిదాయ చ జీవానాం నమస్సర్వరసాత్మనే

పితృదేవతలకు మరియు దేవతలకు ఆహారము, యజ్ఞము చేసిన మానవులకు ఫలము చంద్రుడే. ఆ చంద్రుని రూపములోనున్నది, కర్మకు మూలమైన ఋగ్యజుస్సామవేదములకు ప్రభువు అగు శ్రీహరియే. సకలర సముల రూపములోనుండి ప్రాణులకు దాహశాంతిని కలిగించే నీరు రూప ములోనున్న శ్రీహరికి నమస్కారము.

సర్వసత్త్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే

నమస్రైలోక్యపాలాయ సహఓజోబలాయ చ

సకలప్రాణుల వ్యష్టి దేహము, ఈ పృథివి మరియు సమష్టిస్థూల బ్రహ్మాండము (విరాట్) కూడ శ్రీహరియే. ముల్లోకములలోని ప్రాణులకు ఇంద్రియమనోదేహముల శక్తిని ఒనగే వాయువు రూపములో శ్రీహరియే ఉన్నాడు. అట్టి శ్రీహరికి నమస్కారము.

అర్థలింగాయ నభసే నమోకాంతర్బహిరాత్మనే

నమః పుణ్యాయ లోకాయ ఆముష్మై భూరీవర్చసే

పదార్థముల పరస్పరభేదమునకు సూచకము, లోపల బయట అనే వ్యవహారమునకు మూలము అగు ఆకాశము శ్రీహరి రూపమే. పుణ్య ముచే లభించే గొప్ప ప్రకాశము గల స్వర్గము మొదలగు ఊర్ధ్వలోకములు కూడ శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరి కొరకు నమస్కారము.

ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే

నమోకధర్మవిపాకాయ మృత్యవే దుఃఖదాయ చ

ప్రవృత్తి (యజ్ఞాది), నివృత్తి (శమదమాది) అని కర్మ రెండు రూప ములలో నున్నది. ఈ కర్మయు, దాని ప్రభావము వలన లభించే పితృలోక ము, స్వర్గలోకము కూడ శ్రీహరి రూపములే. పితృదేవతలు, దేవతలు కూడ శ్రీహరి రూపములే. అధర్మమునాచరించువారు మరణించి దుఃఖభా జనులగుదురు. ఆ మృత్యువు, దుఃఖమునిచ్చే నరకలోకము కూడ శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరికి నమస్కారము.

నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే

నమో ధర్మాయ బృహతే కృష్ణాయాకుంఠమేధసే

పురుషాయ పురాణాయ సాంఖ్యయోగేశ్వరాయ చ

ఓ ప్రభూ! కర్మఫలరూపముగా కామనలనీడేర్చువాడవు నీవే. నీవు సర్వజ్ఞుడవు. మంత్రము నీ స్వరూపమే. స్వాయంభువ మనువు నీ రూపమే. గొప్ప ధర్మము నీ రూపమే. పరబ్రహ్మ నీ స్వరూపమే. మొక్కవోని మేధాశక్తి గలవాడై లోకములో సాంఖ్యయోగ కర్మయోగములను ప్రవర్తిల్ల జేసిన గీతాచార్యుడగు శ్రీకృష్ణుడు నీ అవతారమే. అనాదియగు నీవు సకల . ప్రాణులలో అంతర్యామిగా నుండే పూర్ణుడవు. నీకు నమస్కారము.

శక్తిత్రయసమేతాయ మీడు షేహంకృతాత్మనే

 చేతఆకూతిరూపాయ నమో వాచోవిభూతయే

కర్త (చేయువాడు), కరణము (చేసే సాధనము), క్రియ అనే మూడు శక్తులను కలిగి అహంకారరూపుడై భక్తులకు కామనలను వర్షించే రుద్రుని రూపములోనుండే శ్రీహరికి నమస్కారము. సృష్టిజ్ఞానమును కలిగి వివిధసృష్టులను చేస్తూ, వేదరూపమగు వైవిధ్యము గల వాక్కును వెలయించే బ్రహ్మదేవుని రూపములోనుండే శ్రీహరికి నమస్కారము. ప్రాణుల దేహములోనుండి పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలు రకముల వాక్కును ప్రకటించే ప్రాణశక్తిరూపముగా నీవే ఉన్నావు.

దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితమ్

రూపం ప్రియతమంస్వానాం సర్వేంద్రియగుణాంజనమ్

భక్తులకు నీ రూపము మిక్కిలి ప్రియమైనది. నీ రూపము తన గరి మచే మా ఇంద్రియములను రంజింప జేయగలదు. భక్తులచే ఆదరించబడే అట్టి నీ రూపమును మేము చూడగోరుచున్నాము. మాకు దర్శనమిమ్ము.

స్నిగ్ధప్రావృద్దనశ్యామం సర్వసౌందర్యసంగ్రహమ్

చార్వాయతచతుర్బాహుం సుజాతరుచిరాననమ్

దట్టని వర్షాకాలమేఘము వలె నల్లని శ్రీహరి రూపము సకలసౌం దర్యములు ఒకచో గ్రుమ్మరించినట్లు ఉండును. ఆయన పొడవాటి నాలుగు చేతులతో, కోమలమగు ముఖముతో అందముగా నుండును.

పద్మకోశపలాశాక్షం సుందరభ్రు సునాసికమ్

సుద్విజం సుకపోలాస్యం సమకర్ణవిభూషణమ్

అందమైన కనుబొమలు, ముక్కు, దంతములు మరియు చెక్కి ళ్లతో శ్రీహరి ముఖము అందముగా నుండును. పద్మగర్భమునందలి రేకల. వంటి కళ్లు, సమమైన చెవులు ఆ ముఖమునకు శోభను చేకూర్చుచున్నవి.

ప్రీతిప్రహసితాపాంగమలకైరుపశోభితమ్

లసత్పంకజకింజల్కదుకూలం మృష్టకుండలమ్

ఆయన ముఖము ప్రేమపూర్వకమగు చిరునవ్వుతో కూడిన కడ గంటి చూపులతో, ముంగురులతో మరియు ఉజ్జ్వలమగు కుండలములతో , ప్రకాశించును. ఆయన పద్మపరాగమువలె ప్రకాశించే నాజూకైన వస్త్రములను దోల్చును.

స్పురత్కిరీటవలయహారనూపురమేఖలమ్

 శంఖచక్రగదాపద్మమాలామణ్యుత్తమర్ద్ధిమత్

కిరీటము, కంకణములు, హారములు, నూపురములు, మొలనూ లులతో ప్రకాశించే శ్రీహరి రూపము, శంఖము చక్రము గద పద్మము వనమాల మరియు కౌస్తుభమణులతో ఉత్తమమగు శోభను కలిగియుండును.

సింహస్కంధత్విషో బీభత్సాభగగ్రీవకౌస్తుభమ్

శ్రియానపాయిన్యా క్షిప్తనికషాన్మోరసోల్లసత్

బంగరు ఆభరణముల కాంతులతో విలసిల్లే శ్రీహరి భుజస్కంధ ములు జూలుతో ప్రకాశించే సింహపు మూపును పోలియున్నవి. కౌస్తుభ మాణిక్యముతో ఆయన మెడకు శోభ ఇనుమడించెను. లక్ష్మీదేవి బంగరు రేఖ రూపములో నిత్యనివాసముండే ఆయన వక్షఃస్థలము బంగరు గీత గల గీటురాయి శోభను తల దన్నుచున్నది.

పూరరేచకసంవిగ్నవలివల్గుదలోదరమ్

ప్రతిసంక్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయా

రావియాకును పోలియున్న శ్రీహరియొక్క ఉదరము ఉచ్ఛ్వాసని శ్వాసలతో బాటు కదలాడే .మూడు ముడుతలతో అందముగా నుండెను. సుడిగుండమువలె లోతైన నాభి తనగుండా బయటకు వచ్చిన జగత్తును తిరిగి తనలోనికి ఉపసంహరించుటకు సంసిద్ధముగా యున్నదా యన్నట్లు ప్రకాశించును.

శ్యామశ్రోణ్యధిరోచిష్ణుధుకూలస్వర్ణమేఖలమ్

సమచార్వంఘిజం ఘోరు నిమ్నజాను సుదర్శనమ్

శ్యామవర్ణము గల కటిభాగమునందు పీతాంబరము మరియు బంగరు మొలనూలు ప్రకాశించుచుండును. పాదములు, పిక్కలు, తోడలు సమముగను, మోకాళ్లు ఎత్తు లేకుండగను ఉండుటచే శ్రీహరి రూపము చూడ చక్కగా నుండును.

పదా శరత్పద్మపలాశరోచిషా

నఖద్యుభిర్నోనంతరఘం విధున్వతా

ప్రదర్శయ స్వీయమపాస్తసాధ్వసం

పదం గురో మార్గగురుస్తమోజుషామ్

ఓ తండ్రీ! అజ్ఞానాంధకారములో వడి కొట్టుకుపోవువారలకు నీవు మార్గమును చూపే గురుడవు. శరత్కాలపద్మదళమువంటి కాంతి గలదై, నఖకాంతులచే మా అంతఃకరణమునందలి మాలిన్యమును పోనాడే నీ పాదము మాకు గల సంసారభయమును చెదరగొట్టును. అట్టి నీ స్వరూప మును మాకు దర్శనమిమ్ము.

ఏతద్రూపమనుధ్యేయమాత్మశుద్దిమభీప్సతా

 యద్భక్తియోగోకభయదస్స్వధర్మమనుతిష్టతామ్

అంతఃకరణశుద్దిని గోరు భక్తులు. ఈ రూపమును నిరంతరముగా ధ్యానించవలెను. ఏలయనగా, స్వధర్మానుష్ఠానపరులగు భక్తులకు భక్తియో గమే అభయమునిచ్చును.

భవాన్ భక్తిమతా లభ్యో దుర్లభస్సర్వదేహినామ్

స్వారాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్గతిః

నిన్ను పొందుట సకలప్రాణులకు సంభవము కాదు. స్వర్గలోకాధిప తియగు ఇంద్రుడు కూడ విన్ను పొంద గోరుచుండును. ఆత్మవేత్తలు ఏకాం తమునందు ఆత్మనిష్ఠచే పొందేది నిన్ను మాత్రమే. అట్టి నీవు భక్తులకు లభించెదవు.

తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా

ఏకాంతభ్య కో వాంఛత్పాదమూలం వినా బహిః

సంసారాసక్తులకు శ్రీహరిని ఆరాధించుట శక్యము కాదు. సత్పురు షులకైననూ ఏకాంతమగు (అన్యము లేని) భక్తి దుర్లభమే. అట్టి భక్తితో నిన్ను ఆరాధించువాడు ఎవ్వాడు, నీ పాదమూలమును గాక బాహ్యవిష యములను కోరును?

యత్ర నిర్విష్టమరణం కృతాంతో నాభీమన్యతే

విశ్వం విధ్వంసయన్ వీర్యశౌర్యవీస్ఫూర్జీతభ్రువా

యముడు వీర్యోత్సాహములతో కనుబొమలను ముడివేసి జగ త్తును నశింపజేయ సమర్థుడు. కానీ, అట్టి కాలుడు కూడ నీ పాదమూల మును శరణు జొచ్చినవాని పట్ల తన ప్రతాపమును చూప పూనుకోనడు.

క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నాపునర్భవమ్

భగవత్సంగిసంగస్య మర్త్యానాం కీముతాశిష

భగవద్భక్తులతోడి అర్ధక్షణకాలము సత్సంగముతో స్వర్గము గాని, పునర్జన్మ లేని మోక్షము గాని సమానము కాదన్నచో, ఇక మర్త్యులు కోరే కామనలు దానికి సాటి కావని వేరుగా చెప్ప వలయునా?

అథానఘాంఘైస్తవ కీర్తితీర్థయోః

అంతర్బహిస్నానవిధూతపాప్మనామ్

భూతేష్వనుక్రోశసుసత్త్వశీలినాం

స్యాత్సంగమోకనుగ్రహ ఏష వస్తవ

కావున, పాపములను పోగొట్టే పాదములు గల నీ కీర్తియందు అంతస్నానము (అంతఃకరణములో కీర్తిని స్మరించుట) ను, నీ పాదముల - నుండి పుట్టి తీర్థ మైన గంగయందు బాహ్య (శారీరక) స్నానమును సాధు పురుషులు ఆచరించి, తమ మాలిన్యములను పోగొట్టుకొనెదరు. వారు సక లప్రాణులయందు దయ గలవారై, పవిత్రమగు అంతఃకరణమును మరియు సచ్చీలమును కలిగియుందురు. అట్టి సాధు పురుషులతో మాకు సమాగ మము కలుగు గాక! ఇదియే నీవు మాయందు చూపదగిన అనుగ్రహము.

న యస్య చిత్తం బహిరర్థవిభ్రమం

తమోగుహాయాం చ విశుద్దమవిశత్

యద్భక్తియోగానుగృహీతమంజసా

మునిర్విచష్ట నను తత్ర తే గతిమ్

సాధకుడు మననశీలుడై తన పవిత్రమగు అంతఃకరణము భక్తి యొక్క అభ్యాసముచే అనుగ్రహించబడునట్లు చూసుకొనవలెను. సాధకునిమనస్సు బాహ్యవిషయములయందలి ఆసక్తిచే వ్యామోహితమై యుండ రాదు (రజోగుణప్రధానము కారాదు). మరియు సాధకుడు తన చిత్తము అజ్ఞానమనే గుయ్యారములో విలీనము (తమోగుణ ప్రధానము) కాకుండ చూచుకొనవలెను. సాధకుడు ఏ కాలములో అట్టి చిత్తమును తయారు చేసుకొనునో, అదే కాలములో నిశ్చయముగా అనాయాసముగా నీ తత్త్వ మును సాక్షాత్కరించుకొనును.

యత్రదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతి యత్

తత్త్వం బ్రహ్మ పరం జ్యోతిరాకాశమివ విస్తృతమ్

ఆత్మ చైతన్యమునందే ఈ జగత్తు ప్రకటమగుచున్నది. ఈ జగత్తు నందు ఆత్మచైతన్యము ఆకాశము వలె వ్యాప్తమై సచ్చిద్రూపముగా ప్రకా శించుచున్నది. అట్టి ఆత్మజ్యోతి పరబ్రహ్మస్వరూపుడవగు నీవే.

యో మాయయేదం పురురూపయాకసృజత్

బిభర్తి భూయః క్షపయత్యక్రియః

యద్భేదబుద్ధిస్సదివాత్మదుఃస్థయా

తమాత్మతంత్రం భగవన్ ప్రతీమహి

ఓ భగవానుడా! అనేకరూపములు గల ఈ మాయాశక్తి నిన్ను మోహింప జేయలేదు. నీవు వికారములు లేకుండగనే ఈ మాయాశక్తిచే యథార్థము వలె కానవచ్చే ఈ జగత్తును సృష్టించి, పాలించి, మరల ఉప సంహరించుచున్నావు. జీవులకు ఈ మాయయొక్క ప్రభావము వలననే జగత్తు రూపముగా కనబడే భేదము యథార్థమనే ధారణ కలుగుచున్నది. కాని, నీవు ఆ మాయాశక్తికి అతీతముగా స్వతంత్రుడవై యున్నావని మేము తెలియుచున్నాము.

క్రియాకలా పైరిదమేవ యోగినః

శ్రద్దాన్వితాస్సాధు యజంతి సిద్దయే

భూతేంద్రియాంతఃకరణోపలక్షితం

వేదే చ తంత్రే చ త ఏవ కోవిదాః

పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణము. అనునవి సృష్టిస్థితిసంహారకారణమగు నీ సగుణరూపమును లక్షితము చేయుచున్న వి (అనగా, వీటిచే వీటి ప్రేరకుడవగు నీవు నిర్దేశించబడుచున్నావు). అట్టి నీ సగుణరూపమును ఎవరైతే కర్మపరాయణులు (నిష్కామభావనతో కర్మను ఆచరించు భక్తులు) శ్రద్దతో గూడి అనేకములగు పూజాపద్దతులతో చక్కగా ఆరాధించెదరో, వారే వేదశాస్త్రముల సారమునెరింగినవారు.

త్వమేక ఆద్యః పురుషసుప్తశక్తిః

తయా రజస్సత్త్వతమో విభిద్యతే

మహానహం ఖం మరుదగ్నివార్ధరాః

సురర్షయో భూతగణా ఇదం యతః

నీవు అద్వితీయ పూర్ణ పరబ్రహ్మవు. మాయాశక్తిచే నీవు ఈ జగతునకు కారణమగుచున్నావు. ప్రళయములో మాయాశక్తి నీలో విలీనమై యుండును. సృష్టి కాలములో దానియందలి సత్త్వరజస్తమోగుణములలో సంక్షోభము కలిగి మహత్తత్త్వము, అహంకారము, ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనే పంచభూతములు, దేవతలు, మహర్షులు, సకల ప్రాణుల సమూహములతో కూడిన ఈ జగత్తు ప్రకటమగుచున్నవి.

సృష్టం స్వశక్ష్యేదమనుప్రవిష్టః

చతుర్విధం పురమాత్మాంశ కేన

అథో విదుస్తం పురుషం సంతమంతః

భుంక్తే హృషీ కైర్మధు సారఘం యః

పరబ్రహ్మ తన మాయాశక్తిచే జరాయుజములు (మానవులు మొదలగు ప్రాణులు జరాయువు అనగా గర్భవేష్టన-చర్మమునుండి పుట్టున వి), అండజము (పక్షులు మొదలగు ప్రాణులు, గ్రుడ్డునుండి పుట్టునవి), స్వేదజములు (క్రిమి కీటకములు, మాలిన్యమునందు పుట్టునవి) మరియు ఉద్భిజ్జములు (చెట్టు చేమలు, నేలను పగుల్చుకొని పుట్టునవి) అనే నాలుగు రకముల ప్రాణులను సృష్టించెను. అట్లు సృష్టించిన తరువాత చైతన్యఘనమగు ఆ పరబ్రహ్మ తనచే సృష్టించబడిన పురములవంటి ఈ నాలుగు రకముల దేహములలో ప్రవేశించినాడు. దేహముల అల్పత్వము చైతన్యమునందారోపించబడుటచే ఈ దేహములలో ప్రకటమగుచున్న చైతన్యము పరబ్రహ్మచైతన్యముయొక్క అంశ వలె భాసించును. ఈ విధ ముగా సకలప్రాణులలో చైతన్యరూపముగా ప్రకటమగుచుండుట చేతనే పరబ్రహ్మ పురుషుడు (పురమునందుండువాడు) అని జ్ఞానులు చెప్పుచు న్నారు. తేనెటీగలు ప్రోగుచేసుకునే తేనెవలె అల్పమగు విషయముల సుఖ మును ఆ పురుషుడు ఈ ఉపాధియందు అజ్ఞానముచే ఇంద్రియముల ద్వారా భోగించుచున్నాడు.

స ఏష లోకానతిచండవేగో

వికర్షసి త్వం ఖలు కాలయానః

భూతాని భూతైరనుమేయతత్త్వో

ఘనావలీర్వాయులివ్వావిషహ్యః

ఈ విధముగా జగత్తును సృష్టించి దానిలో చైతన్యము రూపముగా ప్రకటమైన నీ స్వరూపము అనాత్మని షేధరూపముగా మాత్రమే లక్షితమగు చున్నది. మాయాశక్తియొక్క ప్రచండమగు వేగము గల నీవు ప్రళయకాల ములో, సహించ శక్యము కాని వేగము గల వాయువు మేఘపంక్తులను వలె, ఆకాశము మొదలగు భూతములచే పృథివీ మొదలగు భూతములను ఇటునటు కదల్చుచూ (అనగా విలోమక్రమములో ఉపసంహరిస్తూ), ఈ లోకములను ఉపసంహరించెదవు.

ప్రమత్తముచ్చైరితికృత్యచింతయా

ప్రవృద్దలోభం విషయేషు లాలసమ్

త్వమప్రమత్తస్సహసానభిపద్య సే

క్షుల్లేలిపోనోకహిరీవాఖుమంతకః

మానవుడు వేర్వేరు పనులను చేసుకొనే హడావుడిలోనున్నవాడై, భోగ్యవస్తువులయందు ధనమునందు లంపటమును పెంచుకొని, తన స్వరూపము విషయములో అసావధానుడుగ నుండును. కానీ, కాలరూపుడవగు నీవు అసావధానుడుగ నుండవు. వానిని కాలరూపుడవగు నీవు, ఆక లీగొన్న పాము ఎలుకను వలే, అకస్మాత్తుగా ఆక్రమించి, మ్రింగి వేసెదవు.

కస్త్వత్పదాబ్దం విజహాతీ పండితో

యస్తేవమానవ్యయమాన కేతనః

పండితో  విశంకయ్యాస్మద్దురురర్చతి స్మ యత్

 వినోపపత్తిం మనవశ్చతుర్దశ

ఈశ్వరుడవగు నిన్ను ఉపేక్షించిన, కొలములో ఈ శరీరము వృథాగా ఖర్చు అయిపోవుచుండును. ఈ పత్యమును గుర్తించిన వివేకి యగు ఏ వ్యక్తి నీ పాదపద్మమును విడిచి పెట్టును? మాకు తండ్రియగు బ్రహ్మగారు కూడ ఆయుర్దాయము వృథయగుననే ఆశంకతో నీ పాదపద్మ మునారాధించుచున్నాడు.. పదునల్గురు మనువులు కూడ నిష్కామముగా నీ పాదపద్మమునారాధించెదరు

అథ త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితామ్

విశ్వం రుద్రాభయద్వస్తమకుతశ్చిద్భయా గతిః

ఓ పరబ్రహ్మా! (సర్వజగత్కారణుడు) పరమాత్మా! (ప్రాణియొక్క అంతరతమమగు ప్వరూపము) కాలరూపుడగు రుద్రుని (సంహారకుని) భయముచే ఈ జగత్తు ధ్వస్తమైనది. కావున, వివేకవంతులగు మావంటివా రలకు దేనివలనైననూ భయము లేని శరణము నీవే అగుచున్నాను.

ఇదం జపత భద్రం వో విశుద్దా నృసనందనాః

స్వధర్మమనుతిష్టంతో భగవత్యర్పితాశయాః

రాజకుమారులారా! మీరు పరిశుద్దహృదయులై స్వధర్మమును అనుష్ఠించుచుండుడు. భగవంతునియండు మనస్సును నిలిపి ఈ స్తోత్ర . మును జపించుడు. మీకు మంగళమగు గాక!

తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వవస్థితమ్

పూజడధ్వం శృణాంతశ్చ ధ్యాయంతశ్చాసకృద్దరిమ్

శ్రీహరి సకలప్రాణుల బుద్ధియందు ఆత్మరూపుడై ఉన్నాడు. మీరు ఆయనను తప్పని సరిగా నీరంతరముగా కీర్తిస్తూ ధ్యానిస్తూ పూజించుడు.

యోగాదేశముపాసాద్య ధారయంతో మునిప్రతాః

సమాహితధియస్సర్వ ఏతదభ్యసతాదృతాః

ఈ స్తోత్రమునకు యోగాదేశము (భగవత్ప్రాప్తికి ఉపాయముగా శివునిచే బోధించబడినది) అని పేరు. దీనిని మీరందరు నానుండి పొంది, గుర్తులోనుంచుకొని, నిష్టతో మననము చేయుడు. మీరు ఏకాగ్రచిత్తులై ఆదరముతో ఈ స్తోత్రమునభ్యసించుడు.

ఇదమాహ పురాకస్మాకం భగవాన్ విశ్వసృక్పతిః

భృగ్వాదీనామాత్మజానాం సిసృక్షుస్సంసిసృక్షతామ్

ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మదేవుడు పూర్వము సృష్టిని చేయ గోరెను. అపుడాయన సృష్టిని చక్కగా చేయగోరుచున్న తన పుత్రులగు భృగువు మొదలైన మాకు ఈ స్తోత్రమునుపదేశించెను.

తే వయం నోదితాస్సర్వే ప్రజాసరే ప్రజేశ్వరాః

అనేన ధ్వస్తతమసస్సిసృక్ష్మ వివిధాః ప్రజాః

ప్రాణులను సృష్టించుడని ప్రజాపతులమగు మమ్ములనందరిని బ్రహ్మదేవుడు ప్రేరేపించెను. మేమీ స్తోత్రమును పఠించగా మా అజ్ఞానము నశించెను. అపుడు మేము అనేకరకముల ప్రాణులను సృష్టించితిమి.

అభేదం నిత్యదా యుక్తో జపన్నవహితః పుమాన్

అచిరాచ్ఛ్రేయ ఆప్నోతి వాసుదేవపరాయణః

కావున, వాసుదేవుడే పరమలక్ష్యముగా గల వ్యక్తి ఏకాగ్రమగు చిత్తముతో ఈ స్తోత్రమును సావధానముగా జపించవలెను. అట్లు చేయు వ్యక్తి తొందరలోనే శ్రేయస్సును పొందుచున్నాడు.

శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిఃశ్రేయసం పరమ్

సుఖం తరతి దుష్పారం జ్ఞానసౌర్వ్యసనార్ణవమ్

ఈ లోకములో హితములన్నింటిలో ఆత్మజ్ఞానము సర్వోత్కృష్ట మైన హితము. జీవన్ముక్తి రూపమగు ఆత్మజ్ఞానము కంటే గొప్పది అగు శ్రేయస్సు మరియొకటి లేదు. అట్టి ఆత్మజ్ఞానమనే నావ గల వ్యక్తి దుఃఖస ముద్రమును తేలికగా తరించును. ఈ సంసారసముద్రమును మరియొక విధముగా తరించుట శక్యము కాదు.

య ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవమ్

అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ

శ్రీహరిని ఆరాధించుట అంత తేలిక కాదు. కాని, ఎవడైతే నాచే కీర్తించబడిన ఈ శ్రీహరి స్తోత్రమును శ్రద్ధతో అధ్యయనము చేయునో, అట్టి వాడు తద్ద్వారా శ్రీహరిని సునాయాసముగా ఆరాధించుచునే యున్నాడు.

విందతే పురుషోకముష్మాద్యద్యదిచ్చత్యసత్వరమ్

మద్గీతగీతాత్సుప్రీతాచేయసామేకవల్లభాత్

నేను తొట్రుపాటు లేకుండగా ఈ గీతముతో శ్రీహరిని స్తుతించితి ని. శ్రీహరి పకలకల్యాణములకు ఏకైకమగు ప్రియనిధానము. ఆయనను ఈ గీతముతో స్తుతించినచో ఆయన ప్రసన్నుడగును. అట్లు స్తుతించు వ్యక్తికి కోరికలన్నియు ఈడేరును.

ఇదం యః కల్య ఉత్థాయ ప్రాంజలిశద్ధయాన్వితః

శృణుయాచావన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః

ఏ వ్యక్తియైతే తెల్లవారు జామున నిద్ర లేచి చేతులను జోడించి . ఈ గీతమును శ్రద్ధతో వినునో, లేక ఇతరులకు వినిపించునో, అట్టి వ్యక్తి కర్మబంధములనుండి విముక్తిని పొందుచున్నాడు.

గీతం మయేదం నరదేవనందనాః

పరస్య పుంసః పరమాత్మనః స్తవమ్

జపంత ఏకాగ్రధియస్తపో మహత్

చరధ్వమంతే తత ఆప్స్యథేప్సితమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే

రుద్రగీతం నామ చతుర్వింశోఽధ్యాయః

రాజకుమారులారా! పరమపురుషుడగు శ్రీహరి సకలప్రాణులలో అంతరతమమగు ఆత్మరూపుడై యున్నాడు. నేనాయనను స్తుతించిన ఈ గీతమును ఏకాగ్రచిత్తముతో జపిస్తూ మీరు గొప్ప తపస్సును ఆచరించుడు. తపస్సునకు అంతమునందు ఆ శ్రీహరి మీ కోరికలీడేర్చును.

శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు రుద్రగీత మనే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.