భాగవత మహా పురాణము
1 - దత్తాత్రేయావతారము, నరనారాయణావతారము
మైత్రేయ ఉవాచ ।
మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే ।
ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరీతి విశ్రుతాః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! స్వాయంభువ మనువునకు శతరూపాదేవికి ముగ్గురు అమ్మాయిలు కూడ జన్మించిరి. వారు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లతో లోకములో ప్రసిద్ధిని గాంచిరి.
ఆకూతిం రుచయే ప్రాదాదపి భ్రాతృమతీం నృపః ।
పుత్రికాధర్మమాశ్రిత్య శతరూపొనుమోదీతః ॥
స్వాయంభువ మనుమహారాజు శతరూపాదేవి అంగీకారముతో ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహము చేసెను. ఈ వివాహమును ఆయన ఒక షరతు పై చేసెను. ఆకూతికి కలిగిన మొదటి పుత్రుని ఆమె తన తండ్రికి అప్పజెప్పవలెను. దీనికి పుత్రికాధర్మమని పేరు. స్వాయం భువ మనువునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు గలరు. అయిననూ, ఆయన ఆ షరతుతోనే వివాహమును చేసెను.
ప్రజాపతిస భగవాన్ రుచిస్తస్యామజ్జనత్ ।
మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా ॥
పూజ్యుడగు ఆ రుచి ప్రజాపతి సర్వోత్కృష్టమగు పరమేశ్వర ధ్యానముచే బ్రహ్మవర్చస్సు కలిగియుండెను. ఆయనకు ఆ ఆకూతి యందు ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి కలిగిరి.
యస్తయోః పురుషస్సాక్షాద్విష్ణుర్యజ్ఞస్వరూపధృక్ ।
యా స్త్రీ సా దక్షిణా భూతేరంశభూతానపాయినీ ॥
వారిలో మగపిల్లవాడు స్వయముగా శ్రీమహావిష్ణువే. విష్ణువు వేదో క్తమగు యజ్ఞమునకు ప్రతీకయగు యజ్ఞుడనే ఆ పిల్లవాని రూపములో అవ తరించెను. లక్ష్మీదేవి విష్ణువును విడిచి ఉండదు. కావున, ఆమె ఒకానొక అంశచే దక్షిణ అనే ఆ అమ్మాయి రూపములో జన్మించేను. ఈ అమ్మాయి యజ్ఞములో ఋత్విక్కులకు యజమాని ఇచ్చే ధనమునకు ప్రతీక. ధన ముతో వేదోక్తకర్మలను చేసి దక్షిణలనిచ్చుట వలన ఈశ్వరానుగ్రహముచే పంపద స్థిరమగువే గాని, తరిగిపోదు.
ఆనిన్యే స్వగృహం పుత్యాః పుత్రం వితతరోచిషమ్ ।
స్వాయంభువో ముదా యుక్తో రుచిర్ణగ్రాహ దక్షిణామ్ ॥
స్వాయంభువ మనువు చాల సంతోషించి తన కుమార్తెయగు ఆకూతికి పుత్రుడగు ఆ యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకొనెను. ఆ పిల్లవాడు తన, కాంతులతో చుట్టూ ప్రకాశింపజేయుచుండెను. రుచి ప్రజాపతి అమ్మాయి దక్షిణను తన వద్ద పెంచేను.
తాం కామయానాం భగవానువాహ యజుషాం పతిః ।
తుష్టాయాం తోషమాపన్నోజనయద్ద్వాదశాత్మజాన్ ॥
మంత్రములకు, యజ్ఞములకు ప్రభువగు విష్ణుభగవానుడు యజ్ఞుని రూపములో నుండెను. ఆయనను లక్ష్మియొక్క అవతారమగు దక్షిణ ప్రేమించేను. ఆయన ఆమెను వివాహమాడెను. అపుడు వారిద్దరు సంతోషించిరి. వారికి పన్నెండుగురు పుత్రులు కలిగిరి.
తోషః ప్రతోషస్సంతోషో భద్రశ్శాంతిరిడస్పతిః ।
ఇద్మః కవిర్విభుస్స్వహ్నస్సుదేవో రోచనో ద్విషట్ ॥
తోషుడు (యజ్ఞమును చేయ సంకల్పించినప్పుడు యజమానికి కలిగే ఆనందమునకు ప్రతీక), ప్రతోషుడు (యజ్ఞము నిర్విఘ్నముగా కొన సాగుచుండగా యజమానికి కలిగే ఆనందము), సంతోషుడు (యజ్ఞమును. పూర్తి చేసి దక్షిణలనిచ్చినప్పుడు యజమానికి కలిగే పూర్ణమగు ఆనందము), భద్రుడు (వైదికకర్మల అనుష్టానము మంగళప్రదము), శాంతుడు (యజ్ఞము సక్రమముగా పూర్తి అయినప్పుడు కలిగే మనశ్శాంతి), ఇడ స్పతి (భూమిని పాలించే రాజు), ఇధ్ముడు (యజ్ఞములో ఉపయోగించే సమిధల కట్ట), కవి (యజ్ఞవిజ్ఞానము), విభుడు (యజ్ఞమును చేసే సామర్థ్యము), స్వహ్నుడు (యజ్ఞము నడిచే రోజులు మంచి రోజులు), సుదేవుడు (యజమాని ఈశ్వరరూపుడే), రోచనుడు (యజమానికి యజ్ఞము వలన గొప్ప ప్రకాశము) అనునవి వారి పేర్లు.
తుషితా నామ తే దేవా ఆసన్ స్వాయంభువాంతరే ।
మరీచిమిశ్రా ఋషయో యజ్ఞసురగణేశ్వరః ॥
స్వాయంభువ మన్వంతరమునందు ఈ పన్నెండుగురే తుషితులు (ఆనందము గలవారు) అనే పేరు గల దేవతలు కాగా, మరీచి మొదలగు ఏగ్గురు మహర్షులుగను, యజ్ఞుడే దేవతాగణములకు ప్రభువగు ఇంద్రుడు గను ఉండిరి.
ప్రియవ్రతోత్తానపాదౌ మనుపుత్రా మహౌజసౌ ।
తత్పుత్రపౌత్రనర్హణామనువృత్తం తదంతరమ్ ॥
గొప్ప ప్రభావశాలురగు ప్రియవ్రత-ఉత్తానపాదులు మనువు యొక్క పుత్రులు. ఆ మన్వంతరము వారి కొడుకులు, కూతుళ్లు, మరియు వారి సంతానములచే వ్యాపించబడి, వారిచే పాలించబడినది.
దేవహూతిమదాత్తాత కర్దయాత్మజాం మనుః ।
తత్సంబంధి శ్రుతప్రాయం భవతా గదతో మమ ॥
వత్సా! విదురా! స్వాయంభువ మనువు తన కుమార్తెయగు దేవ హూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహముమ చేసెను. ఆ వృత్తాంత మును నేను విస్తారముగా చెప్పగా, నీవు వినియే యున్నావు.
దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్మనుః ।
ప్రాయచ్ఛద్యత్కృతస్సర్గస్త్రిలోక్యాం వితతో మహాన్ ॥
పూజ్యుడగు స్వాయంభువ మనువు ప్రసూతిని బ్రహ్మగారి కుమా రుడగు దక్షునకు ఇచ్చి వివాహమును చేసెను. వారి విస్తృతమగు వంశా వళి ముల్లోకములలో వ్యాప్తిని చెందెను.
యాః కర్దమసుతాః ప్రోక్తా నవ బ్రహ్మర్షిపత్నయః ।
తాసాం ప్రసూతిప్రసవం ప్రోద్యమానం నిబోధ మే ॥
కర్దమ ప్రజాపతియొక్క తొమ్మిదిమంది కుమార్తెలు బ్రహ్మర్షుల భార్యలు. ఈ విషయము ఇదివరలో చెప్పబడినది. నేనిప్పుడు వారి సంతా, నముయొక్క వంశవిస్తారమును గురించి చెప్పుచున్నాను. గమనించుము.
పత్నీ మరీచేస్తు కలా సుషువే కర్దమాత్మజా ।
కశ్యపం పూర్ణిమానం చ యయోరాపూరితం జగత్ ॥
కర్దమ ప్రజాపతియొక్క కుమార్తెయగు కళ మరీచి మహర్షియొక్క ధర్మపత్ని. ఆమెకు కశ్యపుడు, పూర్ణిముడు అనే ఇద్దరు కొడుకులు కలిగిరి. వారిద్దరి వంశావళి విస్తరించి భూలోకమును వ్యాపించినది.
పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతప ।
దేవకుర్యాం హరేః పాదశౌచాద్యాభూత్సరిద్దివః ॥
అంతశ్శత్రువులను ఎండగట్టిన ఓ విదురా! పూర్ణిమునకు విరజు డు, విశ్వగుడు అనే ఇద్దరు కొడుకులు, దేవకుల్య అనే కుమార్తె కలిగిరి. ఈ దేవకుల్య శ్రీహరియొక్క పాదములను కడిగిన ప్రభావముచే మరుజన్మలో స్వర్గమునందలి మందాకినీ (గంగా) నదియై ప్రవహించెను.
అత్రేః పత్న్యనసూయా త్రీన్ జజై సుయశసస్సుతాన్ ।
దత్తం దుర్వాససం సోమమాత్మేశబ్రహ్మసంభవాన్ ॥
అత్రిమహర్షియొక్క భార్యయగు అనసూయ దత్తాత్రేయుడు, దుర్వాసమహర్షి, చంద్రుడు అనే ముగ్గురు కొడుకులను కనెను. క్రమముగా విష్ణువు, శివుడు, బ్రహ్మల అంశల వలన జన్మించిన ఈ ముగ్గురు గొప్ప కీర్తిని పొందిరి.
విదుర ఉవాచ ।
అతైర్గృహే సురశ్రేష్టాః స్థిత్యుత్పత్త్యంత హేతవః ।
కించిచ్చికీర్షవో జాతా ఏతదాఖ్యాహి మే గురో ॥
విదురుడిట్లు పలికెను --- ఓ గురుదేవా! బ్రహ్మవిష్ణురుద్రులు క్రమముగా జగత్తుయొక్క సృష్టిస్థితిప్రళయములకు కారణమగుచున్నారు. దేవతలలో శ్రేష్టులగు ఆ త్రిమూర్తులు ఏమి చేయగోరి అత్రి గృహములో అవతరించినారు ? నాకీ విషయమును చెప్పడు.
మైత్రేయ ఉవాచ ।
బ్రహ్మణా నోదితస్సృష్టావత్రిరహ్మవిదాం వరః ।
సహ పత్న్యా యయావృక్షం కులాద్రిం తపసి స్థితః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు అత్రి మహర్షిని బ్రహ్మగారు సృష్టిని చేయుమని ప్రేరేపించిరి. అపుడాయన తన భార్యయగు అనసూయతో గూడి ఋక్షమనే కులపర్వతమునకు వెళ్లి, తపస్సును చేసెను.
తస్మిన్ ప్రసూనస్తబకపలాశాశోకకాననే ।
వార్భిసవద్భిరుద్రుషే నిర్వింధ్యాయాస్సమంతతః ॥
ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం మునిః ।
అతిష్ఠదేకపాదేన నిర్ద్వందోనిలభోజనః ॥
ఆ పర్వతమునందలి అడవులలో మోదుగు, కంకేళి వృక్షములు పువ్వుల గుత్తులతో నిండియుండెను. నిర్వింధ్యానదియొక్క ప్రవహించే జలముల ధ్వని ఆ పర్వతమంతా వ్యాపించుచుండెను. అత్రి మహర్షి ఆ పర్వతమునందు శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వము లకు అతీతుడై, గాలిని మాత్రమే భోజనము చేయుచూ, ప్రాణాయామముతో మనస్సును వశము చేసుకొని, వంద సంవత్సరములు ఒంటి కాలిపై నిలబడి తపస్సును చేసెను.
శరణం తం ప్రపద్యేకహం య ఏవ జగదీశ్వరః ।
ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్ఛత్వితి చింతయన్ ॥
జగన్నాథుడగు పరమేశ్వరుని వేను శరణు పొందుచున్నాము, ఆయన నాకు తనతో సమానమగు సంతానమును అనుగ్రహించుగాక! అవి ధ్యానిస్తూ, ఆయన తపస్సును చేసెను.
తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నినా ।
నిర్గతేన మునేర్మూర్ధ్నస్సమీక్ష్య ప్రభవస్త్రయః ॥
అప్సరోమునిగంధర్వసిద్ధవిద్యాధరోరగైః ।
వీతాయమానయశసస్తదాశ్రమపదం యయుః ॥
ప్రాణాయామమే ఇంధనము కాగా అత్రి మహర్షియొక్క శిరస్సు నుండి అగ్ని బయల్వెడలుచుండెను. దానిచే ముల్లోకములు తాపమును చెందెను. అప్పుడు సర్వసమర్ధులగు బ్రహ్మవిష్ణురుద్రులు ఆ పరిస్థితిని చూచి అత్రి మహర్షియొక్క ఆశ్రమమునకు వెళ్లిరి. అట్లు వారు వెళ్లుచుండగా, అప్సరసలు మహర్షులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు మరియు నాగులు వారి కీర్తిని విస్తారముగా గానము చేసిరి.
తత్ప్రాదుర్భావసంయోగవిద్యోతితమనో మునిః ।
ఉత్తిష్ఠన్నేకపాదేన దదర్శ విబుధర్షభాన్ ॥
ఒకే సారి త్రిమూర్తులు ఆవిర్భవించుటచే అత్రి మహర్షియొక్క మనస్సు గొప్పగా ప్రకాశించెను; అనగా, వారి దర్శవముచే ఉల్లాసమును పొందెను, లేక జ్ఞానప్రకాశమును పొందెను, లేక అమనీభావరూపమగు సమాధి తొలగీ మనస్సు పనిచేయజొచ్చెను. ఆయన ఒంటి కాలిపై నిటా రుగా నిలబడియుండెను. దేవతలలో శ్రేష్టులగు ఆ త్రిమూర్తులను ఆయన చూచెను.
ప్రణమ్య దండవద్భూమావుపతస్థీకరణాంజలిః ।
వృషహంససుపర్ణస్థాన్ స్వైస్వైశి హ్నైశ్చ చిహ్నితాన్ ।
కృపావలోకేన హసద్వదనేనోపలంభితాన్ ॥
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు క్రమముగా హంస, గరుడుడు, వృష భము వాహనములుగా కలిగి తమ తమ చిహ్నములతో (కమండలము, చక్రము, త్రిశూలము మొదలగునవి) ప్రకాశించుచుండిరి. వారి చూపులు దయను బరపుచుండెను. వారి ముఖములలో చిరునవ్వు తొణికిసలాడు చుండెను. దానినిబట్టి వారు తనపై ప్రసన్నులైనారని మహర్షికి తెలిసెను. అపుడాయన దండము వలె నేలపై బడి వారికి నమస్కరించి, లేచి నిలబ డి, దోసిలిలో పువ్వులు మొదలగువాటిని పట్టుకొని వారిని పూజించెను.
తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణీ ।
చేతస్తతవణం యుంజన్నస్తావీత్సంహతాంజలిః ।
శ్లక్ష్ణయా సూక్తయా వాచా సర్వలోకగరీయసః ॥
ఆ త్రిమూర్తుల కాంతికి అత్రి మహర్షి కన్నులు మిరుమిట్లు గొల్పె ను. ఆయన కన్నులను మూసుకొని దోసిలి యొగ్గి మనస్సును ఆ త్రిమూర్తులపై నిలిపెను. మధురమైన, భావపూర్ణమైన (వేదసూక్తముల రూపము లోనున్న) వాక్కులతో ఆయన, ముల్లోకములలో ఉత్తములగు ఆ త్రిమూర్తు లను స్తుతించెను.
అత్రిరువాచ ।
విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానై -
ర్మాయాగుణెరనుయుగం విగృహీతదేహాః ।
తే బ్రహ్మవిష్ణుగిశాః ప్రణతోస్స్మ్యహం వ-
సేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః ॥
అత్రి మహర్షి ఇట్లు పలికెను --- ప్రతికల్పమునందు పరమేశ్వ రుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తి ఉపాధిగా గలవాడై జగ త్కార్యమును చేయును. భగవానుడు మాయాశక్తియొక్క రజోగుణము ఉపాధిగా గలవాడై బ్రహ్మరూపమును దాల్చి జగత్తును సృష్టించి, సత్త్వగు జోపాధిచే విష్ణురూపమును దాల్చి పాలనను చేసి, తమోగుణోపాధిచే రుద్రరూపమును దాల్చి జగత్తును సంహరించును. అట్టి మీ త్రిమూర్తులకు నేను నమస్కరించుచున్నాను. కాని, నేను మీలో ఒక్కరినే ధ్యానించితిని. నేను ధ్యానించిన మూర్తి మీలో ఎవరో మీరే చెప్పుడు.
ఏకో మయేహ భగవాన్ వివిధప్రధానై-
శ్చిత్తీకృతః ప్రజననాయ కథం ను యూయమ్ ।
అత్రాగతాస్తనుభృతాం మనసోకపి దూరాద్
బ్రూత ప్రసీదత మహానిహ విస్మయో మే ॥
నేను సంతానమును గోరి నా హృదయములో ఒక్క భగవానుని ఏకాగ్రచిత్తముతో నిలిపి వివిధములగు ఉపచారములతో ఆరాధించితిని. మీరు దేహధారుల మనస్పులకైననూ అందని దేవతోత్తములు. నేను ఒక్క రిని ఆరాధించగా, మీరు ముగ్గురు ఇచటకు వచ్చుటకు కారణమేమి? మీరు దయచేసి నాకీ విషయమును చెప్పడు. నాకీ విషయములో గొప్ప ఆశ్చ ర్యము కలుగుచున్నది.
మైత్రేయ ఉవాచ ।
ఇతి తస్య వచః శ్రుత్వా త్రయస్తే విబుధర్షభాః ।
ప్రత్యాహుః శ్లక్ష్ణయా వాచా ప్రహస్య తమృషిం ప్రభో ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కథాశ్రవణములో సమర్థుడ వగు ఓ విదురా! అత్రి మహర్షియొక్క ఈ మాటను విని, దేవతలలో శ్రేష్టు లగు ఆ ముగ్గురు నవ్వి, మధురమగు వాక్కుతో ఆయనకిట్లు బదులిడిరి..
దేవా ఊచుః ।
యథా కృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాన్యథా ।
సత్సంకల్పస్య తే బ్రహ్మన్యద్వై ధ్యాయతి తే-వయమ్ ॥
త్రిమూర్తులు ఇట్లు పలికిరి --- ఓ మహర్షీ! నీవు సత్యసంకల్పుడ వు. నీ సంకల్పము ఎట్లున్నదో, అటులనే ఘటిల్లును. మరియొక విధముగా. ఉండదు. నీవు ఏ ఒక్క జగదీశ్వరుని ధ్యానించితివో, మేము ముగ్గురము. అదియే. ఇది నిశ్చయము. మాలో భేదము లేదు.
అథాస్మదంశభూతాస్త ఆత్మజా లోకవిశ్రుతాః ।
భవితారోవంగ భద్రం తే విభ్రాప్స్యంతి చ తే యశః ॥
ఓ మహర్షీ! కావున, నీకు మా అంశలతో ముగ్గురు కొడుకులు కలు గగలరు. వారు లోకములో ప్రసిద్ధిని గాంచి, నీ కీర్తిని విస్తరింపజేయగలరు. నీకు మంగళమగు గాక!
ఏవం కామవరం దత్త్వా ప్రతిజగ్ముస్సురేశ్వరాః ।
సభాజితాస్తయోస్సమ్యగ్గంపత్యోర్మిషతోస్తతః ॥
దేవతోత్తములగు ఆ త్రిమూర్తులను ఆ మహర్షి బాగుగా పూజించే ను. వారాయన కోరుకున్న వరముననుగ్రహించిరి. అపుడా దంపతులు కళ్లను అప్పగించి చూచుచుండగా, వారు తిరిగి వెళ్లిరి.
సోమోభూదహ్మణోకం శేన దత్తో విష్ణోస్తు యోగవిత్ ।
దుర్వాసాశ్శంకరస్యాంశో నిబోధాంగిరసః ప్రజాః ॥
బ్రహ్మగారి అంశచే చంద్రుడు, విష్ణువు అంశచే దత్తాత్రేయ మహర్షి, శంకరుని అంశచే దుర్వాస మహర్షి జన్మించిరి. ఇప్పుడు అంగిరసుని (బ్రహ్మగారి మూడవ పుత్రుడు) సంతానమును గురించి తెలుసుకొనుము.
శ్రద్ధా త్వంగిరసః పత్నీ చతసోకసూత కన్యకాః ।
సినీవాలీ కుహూ రాకా చతుర్థ్యనుమతిస్తథా ॥
అంగిరసునకు (సాధకుని శరీరావయవములయందలి రసము లేక ఓజస్సు) శ్రద్ద అనే భార్య (సాధకునకు నిత్యము తోడుగా ఉండేది సాధన యందలి శ్రద్దయే) యందు సినీవాలి (కృష్ణ చతుర్దశి, కుహు (అమావా స్య), రాకా (పూర్ణిమ) మరియు అనుమతి (శుక్ల చతుర్దశి) అనే నలుగురు కన్యలు జన్మించిరి. ఈ కన్యలు దర్శపూర్ణమాసలు మొదలగు వైదికకర్మ లకు ప్రధానమైన కాలములకు ప్రతీకలు.
తత్పుతావపరావాస్తాం ఖ్యాతో స్వారోచిషేకంతరే ।
ఉతథ్యో భగవాన్ సాక్షాదహ్మిష్ఠశ్చ బృహస్పతిః ॥
ఈ నలుగురు కన్యకలే గాక, వారికి ఇద్దరు కొడుకులు కూడ కలిగిరి. సాక్షాత్తు భగవానుడు మరియు బ్రహ్మనిష్ఠుడు అగు ఉతథ్యుడు మొదటి కొడుకు. బృహస్పతి రెండవ కొడుకు. వీరిద్దరు స్వారోచిష మన్వంతర ములో ప్రసిద్ధిని గాంచిరి.
పులస్త్యోజనయత్పత్యమగస్త్యం చ హవిర్బువి ।
సోకన్యజన్మని దహ్రాగ్నిర్విశ్రవాశ్చ మహాతపాః ॥
పులస్త్యునకు భార్యయగు హవిర్బువయందు అగస్త్యుడు, విశ్రవ సుడు అనే ఇద్దరు కొడుకులు కలిగిరి. వీరిలో అగస్త్యుడు మరుజన్మలో జఠ రాగ్ని అయినాడు. విశ్రవసుడు గొప్ప తపశ్శాలి.
తస్య యక్షపతిర్దేవః కుబేరస్త్విడవిడాసుతః ।
రావణ కుంభకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణః ॥
ఆ విశ్రవసునకు ఇడవిడ అనే భార్యయందు సాత్త్విక స్వభావము గల కుబేరుడు జన్మించి, యక్షులకు ప్రభుడాయెను. ఆ విశ్రవసునకే మరి యొక భార్యయగు కేశినియందు రావణ కుంభకర్ణ విభీషణులనే రాక్షసులు జన్మించిరి.
పులహస్య గతిర్భార్యా త్రీనసూత సతీ సుతాన్ ।
కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుం చ మహామతే ॥
గొప్ప బుద్ధిశాలివగు ఓ విదురా! పులహునకు పతివ్రతయగు గతి (మోక్షమునకు ప్రతీక) అనే భార్యయందు కర్మశ్రేష్ఠుడు (వైదికకర్మలలో దిట్ట), వరీయాంసుడు (ఉపాసకులలో గొప్పవాడు), సహిష్టుడు (సహనశీ లము గలవాడు) అనే ముగ్గురు కొడుకులు కలిగిరి.
క్రతోరపి క్రియా భార్యా వాలఖిల్యానసూయత ।
ఋషీన్ షష్టిసహస్రాణి జ్వలతో బ్రహ్మతేజసా ॥
క్రతు (వేదోక్తమగు కర్మకు ప్రతీక) మహర్షికి క్రియ (క్రతువునకు అంగమగు వైదికక్రియ) అనే భార్యయందు గొప్ప బ్రహ్మవర్చస్సు గల అరవై వేలమంది వాలఖిల్యులనే ఋషులు జన్మించిరి.
ఊర్ఖయాం జజ్ఞిరే పుత్రా వశిష్ఠస్య పరంతప ।
చిత్రకేతుప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయోకమలాః ॥
అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ విదురా! వసిష్ట మహర్షికి, అరుంధతియందు చిత్రకేతువు మొదలగు ఏగ్గురు బ్రహ్మర్షులు పుత్రులై జన్మించిరి. చిత్రకేతువు మొదలైన పేర్లతో ప్రసిద్ధివి గాంచిన ఈ ఋషులు మహాపుణ్యాత్ములు. అరుంధతికి ఇంకో పేరు ఊర్జ.
చిత్రకేతుస్సురోచిశు విరజా మిత్ర ఏవ చ ।
ఉల్బణో వసుభృద్యానో ద్యుమాన్ శక్త్యాదయోపరే ॥
చిత్రకేతువు, సురోచి, విరజసుడు, మిత్రుడు, ఉల్భణుడు, వసుళ్ళ ద్యానుడు, ద్యుమంతుడు అనునవి ఆ ఏడురి పేర్లు. వీరే గాక, వసిష్ఠునకు మరియొక భార్యయందు శక్తి మొదలగు పుత్రులు కలిగిరి.
చిత్తిస్త్వథర్వణః పత్నీ లేభే పుత్రం ధృతవ్రతమ్ ।
దధ్యంచమశ్వశిరసం భృగోర్వంశం నిబోధ మే ॥
అథర్వణునకు భార్యయగు చిత్తియందు దధ్యజ్ (దధీచి) అనే కొడుకు కలిగెను. గొప్ప ప్రతనిష్ట గల ఆ దధీచికి అశ్వశిరసుడు అనే పేరు కూడ గలదు (ఆయన తల గుర్రపు తలను పోలియుండెడిది). నేను ఇప్పుడు భృగుమహర్షియొక్క వంశమును గురించి చెప్పెదను. గమనించుము.
భృగుః ఖ్యాత్యాం మహాభాగ పత్యాం పుత్రానజీజనత్ ।
ధాతారం చ విధాతారం శ్రియం చ భగవత్పరామ్ ॥
ఓ మహాత్ముడవగు విదురా! భృగు మహర్షికి భార్యయగు ఖ్యాతి యందు ధాత, విధాత అనే ఇద్దరు కొడుకులు, శ్రీ అనే ఒక కూతురు కలిగిరి. లక్ష్మి అంశ అయిన ఈ శ్రీదేవి భగవానునకు అంకితమైనది.
ఆయతిం నియతం చైవ సుతే మేరుస్తయోరదాత్ ।
తాభ్యాం తయోరభవం మృకండః ప్రాణ ఏవ చ ॥
ధాత, విధాత అనే వారిద్దరికి మేరువు తన కుమార్తెలగు ఆయతిని, నియతిని ఇచ్చి వివాహము చేసెను. ఆ దంపతులకు క్రమముగా మృకండుడు, బ్రౌణుడు అనే కొడుకులు కలిగిరి.
మార్కండేయో మృకండస్య ప్రాణాద్వేదశిరా మునిః ।
కవిశ్చ భార్గవో యస్య భగవానుశనా సుతః ॥
మృకండు మహర్షికి మార్కండేయ మహర్షి అనే కుమారుడు, ప్రాణునకు వేదశిరసుడు అనే కుమారుడు, భృగు మహర్షికి కవి అనే కుమా రుడు కలిగిరి. ఆ కవియొక్క పుత్రుడే పూజ్యుడగు శుక్రాచార్యుడు.
త ఏతే మునయః క్షత్తర్లోకాన్సర్గెరభావయన్ ।
ఏష కర్దమదౌహిత్రసంతానః కథితస్తవ ॥
ఓ విదురా! ప్రసిద్ధులైన ఈ మహర్షులు తమ సంతానములచే లోక ములను వర్ధిల్లజేసిరి. నీకీ విధముగా కర్దమ మహర్షియొక్క కుమార్తెల పుత్రుల సంతానమును గురించి చెప్పితిని.
శృణ్వతః శ్రద్దధానస్య సద్యః పాపహరః పరః ।
ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యజాత్మజః ॥
ఈ గొప్ప వృత్తాంతమును శ్రద్ధతో వినువారి పాపములు వెంటనే నశించును. బ్రహ్మపుత్రుడగు దక్షుడు మనుపుత్రికయగు ప్రసూతిని వివాహ మాడేను.
తస్యాం ససర్జ దుహిత్యః షోడశామలలోచనాః ।
త్రయోదశాదాద్ధర్మాయ తథైకామగ్నయే విభుః ।
పితృభ్య ఏకాం యుక్తేభ్యో భవాయైం భవచ్ఛిదే ॥
గొప్పగా ప్రకాశించే ఆ దక్షునకు ఆమెయందు పదహారు కుమా రైలు కలిగిరి. ఆయన వారిలో పదముగ్గురిని ధర్మునకు, ఒకామెను అగ్నికి, ఇంద్రియజయము గల పితృదేవతలందరికి కలిపి ఒకామెను, భక్తుల సంసా రమును నశింపజేసే శివునకు ఒకామెను ఇచ్చి వివాహము చేసెను.
శ్రద్ధా మైత్రీ దయా శాంతిస్తుష్టిః పుష్టిః క్రియోన్నతిః ।
బుద్ధి ర్మేధా తితిక్షా స్త్రీర్మూర్తిర్ధర్మస్య పత్నయః ॥
శ్రద్ద (వేదవచనములు జ్ఞానసాధనములు అనే ధారణతో వాటి యందు ఉత్సాహమును కలిగియుండుట), మైత్రి (స్నేహభావము), దయ (భూతదయ), శాంతి (మనస్సు ప్రసన్నముగా నుండుట), తుష్టి (లభించిన దానితో సంతోషమును పొందుట), పుష్టి (సంతోషము వలన మనస్సు నిండుగానుండుట), క్రియ (వేదోక్తకర్మ), ఉన్నతి (ఆధ్యాత్మికముగా ఎదుగు ట), బుద్ది (సరిగా నిర్ణయములను చేసే సామర్థ్యము), మేధ (శాస్త్రవిషయ ములను బుద్ధియందు ధరించి ఉండే శక్తి), తితిక్ష (సుఖదుఃఖములను ప్రసన్నమగు మనస్సుతో స్వీకరించే సామర్థ్యము), హీ (వినయము), మూర్తి (శుద్ధసత్త్వస్వభావము) అనునవి ధర్ముని (ధర్మముయొక్క) భార్యలు (తో డుగానుండు లక్షణములు).
శ్రద్ధాసూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా ।
శాంతిస్సుఖం ముదం తుష్టిస్మయం పుష్టిరసూయత ॥
శ్రద్దకు శుభుడు (శ్రద్ద ఉన్నచోట శుభము కలుగును), మైత్రికి ప్రసా దుడు (స్నేహభావము గల మనస్సు ప్రసన్నముగా నుండును), దయ అభ యుని (దయ ఉన్నవాడు. సకలప్రాణులకు అభయమునిచ్చి తాను భయర హీతుడై యుండును), శాంతి సుఖుని (మనశ్శాంతియే సుఖము), తుష్టి ముదుని (సంతోషము ఉన్న వ్యక్తికి సర్వకాలములలో మనస్సులో ఆనం దము ఉండును), పుష్టి స్మయుని (మనస్సు నిండుగా నున్నచో శరీరము నిండుగానుండి ధర్మకార్యములయందు సమధికమగు ఉత్సాహము ఉద యించును) పుత్రులుగా కనిరి.
యోగం క్రియోన్నతిర్దర్పమర్థం బుద్ధిరసూయత ।
మేధా స్మృతిం తితిక్షా తు క్షేమం హ్రః ప్రశ్రయం సుతమ్ ।
మూర్తిస్సర్వగుణోత్పత్తిర్నరనారాయణావృషీ ॥
క్రియ యోగుని (కర్తవ్యబుద్ధితో చేసే కర్మయే సాధకుని భగవా నుని వద్దకు చేర్చే ఉపాయము), ఉన్నతి దర్పుని (ఉన్నతమగు జీవితల క్ష్యము గల వ్యక్తి తపస్సును ఆచరించుటయందు, లేక జ్ఞానార్జనయందు పట్టుదలను కలిగియుండును), బుద్ధి అర్థుని (సరియగు నిర్ణయములను చేయు వ్యక్తి సంపదను పొందును), మేధ స్మృతిని (శాస్త్రవిషయములను గుర్తులో పెట్టుకున్నవాడు సరియగు సమయములో వాటిని గుర్తుకు తెచ్చు కొనగల్లును), తితిక్ష క్షేముని (సుఖదుఃఖములను ప్రసన్నమగు మనస్సుతో స్వీకరించువాడు ఆత్మజ్ఞానమును పొంది మోక్షము అనే సర్వోత్కృష్టమగు క్షేమమును పొందును), ప్రీ ప్రశ్రయుని (అధర్మమును చేయుటకు సిగ్గు పడువాడు వినయమును కలిగియుండును) పుత్రులుగా కనిరి. సకలకల్యా ణగుణములకు నిలయమగు భగవానుని అవతరింపజేసిన మూర్తి నర నారాయణులనే మహర్షులను కనెను (సత్త్వగుణప్రధానమగు అంతఃకరణ ములో నరునకు నారాయణునితో మైత్రి ఏర్పడును).
యయోర్జన్మన్యదో విశ్వమభ్యనందత్సునిర్వృతమ్ ।
మనాంసి కకుభో వాతాః ప్రసీదుస్సరితోకద్రయః ॥
ఆ నర నారాయణులు జన్మించిన కాలమునందు ఈ జగత్తు అంతయు ఆనందముతో నిండి పండుగను జేసుకోనెను. జనుల మన స్సులు కోపము మొదలగునవి తొలగి ప్రసన్నములయ్యెను. దిక్కులు ధూళి లేకుండుటచే ప్రసన్నములయ్యెను. గాలులు సుఖకరమగు స్పర్శను కలిగి ప్రసన్నములయ్యెను. నదులు బురద తొలగి ప్రసన్నములయ్యెను. అడవులలోని చెట్లు పుష్పించి ఫలించుటచే పర్వతములు ప్రసన్నముల
య్యెను.
దివ్యవాద్యంత తూర్యాణి పేతుః కుసుమవృష్ణయః ।
మునయస్తుష్టువుస్తుష్టా జగుర్గంధర్వకిన్నరాః ॥
ఆ సమయములో అంతరిక్షమునందు బాజాలు మ్రోగి, పువ్వుల వానలు కురిసినవి. సంతోషమును పొందిన మహర్షులు స్తోత్రములను పఠించిరి. గంధర్వులు, కిన్నరులు గానము చేసిరి.
నృత్యంతి స్మ స్త్రియో దేవ్య ఆసీత్పరమమంగలమ్ ।
దేవా బ్రహ్మాదయస్సర్వ ఉపతస్థురభిష్టవైః ॥
ఆ సమయములో అప్సరసలు నాట్యమాడిరి. అంతటి గొప్ప మంగళము కలిగెను. బ్రహ్మ మొదలగు దేవతలు అందరు స్తోత్రములను చేసిరి.
దేవా ఊచుః ।
యో మాయయా విరచితం నిజయావత్మనీదం
ఖే రూపభేదమివ తతతిచక్షణాయ ।
ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య
ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై ॥
దేవతలు ఇట్లు పలికిరి --- ఆకాశములో ఘటాకాశము, మఠాకా శము మొదలగు భేదములు లేకున్ననూ కల్పించబడుచుండును. అదే విధ ముగా అద్వయ పరబ్రహ్మయందు భేదములు లేవు. అయిననూ, ఆ పర బ్రహ్మ తన మాయాశక్తిచే తనయందే ఈ నానానామరూపాత్మకమగు జగత్తును ప్రకటింపజేసెను. అట్టి తన యథార్థస్వరూపమును భక్తులకు ప్రకాశిం పజేయుట కొరకై ఆ పరబ్రహ్మ ఈ నాడు ఈ ఋషిదేహముతో ధర్ముని గృహములో ఆవిర్భవించెను. ప్రకృతికి అతీతుడు, పూర్ణ స్వరూపుడు అగు అట్టి పరమేశ్వరునకు నమస్కారము.
సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్
సత్వేన నసురగణాననుమేయతత్త్వః ।
దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన
యచ్ఛ్రీనికేతమమలం క్షిపతారవిందమ్ ॥
పరమేశ్వరుని యథార్థస్వరూపమును మానవుడు శాస్తోపదేశము ద్వారా మాత్రమే తెలియగల్గును. ఆయన జగద్రక్షణకు విరుద్ధముగా పని చేసే దుష్టశక్తులను ఉపశమింప జేయుటకొరకై సత్త్వగుణప్రధానులగు దేవ తలను సృష్టించినాడు. ఆ దేవతలము మేమే. ఆయన చూపు అందము నకు నెలవైన పద్మమును కూడ తన సౌందర్యముచే తిరస్కరించుచున్నది. ఆయన చూపులో దయ నిండియున్నది. ఆయన అట్టి దయాదృష్టిని మాపై బరపు గాక!
ఏవం సురగణైస్తాత భగవంతావభిష్ణుతౌ ।
లబ్ధావలోకైర్యయతురర్చితా గంధమాదనమ్ ॥
వత్సా ఓ విదురా! ఈ విధముగా దేవతలు నరనారాయణ భగవా నులను స్తుతించి పూజించిరి. ఆ దేవతలకు వారి దర్శనము, కృపాదృష్టి కూడ లభించెను. అపుడా నరనారాయణులు గంధమాదన పర్వతమునకు వెళ్లిరి.
తావిమౌ వై భగవతో హర్రంశావిహాగతా ।
భారవ్యయాయ చ భువః కృష్ణా యదుకురూద్వహొ ॥
శ్రీహరి భగవానుని అంశలగు ఆ నరనారాయణులే ఈ కృష్ణార్జునులు. వీరు క్రమముగా యదు, కురు వంశములనుద్దరించినారు. వీరు భూభా రము (అధర్మమే బరువు గాని, జనసంఖ్య బరువు కాదు) ను తగ్గించుటకు ఈ భూలోకము పై అవతరించినారు.
స్వాహాభిమానినశ్చాగ్నేరాత్మజాంస్త్రీనజీజనత్ ।
పావకం పవమానం చ శుచిం చ హుతభోజనమ్ ॥
మన యెదుట మండే నిప్పుకు అభిమాని దేవత అగ్ని దేవుడు. ఆయన భార్య స్వాహా దేవి. వారికి పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వీరు కూడ నిప్పుకు అభిమాని దేవతలే. మనము హోమము చేసే ద్రవ్యములను వారు ఆరగించెదరు.
తేభ్యోనగ్నయస్సమభవంశ్చత్వారింశచ్చ పంచ చ ।
త ఏవైకోనపంచాశతాకం పితృపితామ హైః ॥
ఆ ముగ్గురికి నలభై అయిదు మంది అగ్నులు పుట్టిరి. వీరు, వీరి తండ్రులు ముగ్గురు, తాత ఒకరు కలిసి వెరసి నలభై తొమ్మిది మంది అగ్నులు అయినారు.
వైతానికే కర్మణి యన్నామభిరహ్మవాదిభిః ।
ఆగ్నేయ్య ఇష్టయో యజ్ఞే నిరూప్యంతేకన్నయస్తు తే ॥
వేదవిహితములైన యజ్ఞకర్మలయందు వేదవేత్తలు అగ్నుల నామములను ప్రస్తావించి అగ్నిదేవతాకములగు ఇష్టులను చేయుచుందురు. ఆ అగ్నులు వీరే.
అగ్నిష్వాత్తా బరిషదసౌమ్యాః పితర ఆజ్యపాః ।
స్నాయోనన్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వధా ॥
అగ్నిష్వాత్తులు (అగ్నియందు పక్వమైన పురోడాశము మొదలగు వాటిని ఆస్వాదించువారు), బర్హిషదులు (దర్బలు ఆసనముగా గలవారు), సౌమ్యులు (సోమరసమును పానము చేయువారు) మరియు ఆజ్యపులు (ఆజ్యమును పానము చేయువారు) అనువారలు పితృదేవతలు. వీరిలో కొందరికి అగ్నియందు సమర్పణము విహితమై యుండగా, మరికొందరికి అట్లు లేదు. ఇట్టి విభాగములతో కూడిన ఈ పితృదేవతలకు దక్షుని కుమార్తె యగు స్వధా దేవి భార్య యైనది.
తేభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధా ।
ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞానవిజ్ఞానపారగే ॥
ఆ పితృదేవతలకు స్వధాదేవియందు ధారిణి, వయున అనే ఇద్దరు కన్యలు కలిగిరి. వారిద్దరు ఆత్మస్వరూపమును గురించి తెలుసుకొనుటయే గాక, ఆ జ్ఞానమును అనుభవమునకు తెచ్చుకొని, దానిని జిజ్ఞాసువులకు బోధించిన మహాత్మురాండ్రు.
భవస్య పత్నీ తు సతీ భవం దేవమనుప్రతా ।
ఆత్మనస్సదృశం పుత్రం న లోభ గుణశీలతః ॥
శివదేవుని భార్యయగు సతీ గొప్ప ప్రేమతో ఆయనను సేవించే ను. అయిననూ, ఆమెకు తన గుణశీలములకు తగిన పుత్రుడు కలుగలేదు.
పితర్యప్రతిరూపే స్వే భవాయానాగసే రుషా ।
అప్రౌఢవాత్మనాత్మానమజహాద్యోగసంయుతా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే మనుకక్యాన్వయే నరనారాయణావతారవర్ణనం నామ ప్రథమోఽధ్యాయః ॥
శివునియందు దోషమేమియు లేకున్ననూ, సతీదేవి తండ్రి అయ నపై కోపముతో ఆయనయందు ప్రతికూలమగు ఆచరణను చేపెను. అప్పటికింకనూ సతీదేవి ప్రొడవయస్కురాలు కానేలేదు. అట్టి యౌవనవతియగు సతీదేవి తనంత తానే ఒక నిర్ణయమును తీసుకొని, యోగశక్తినాశ్రయించి, తన దేహమును వదిలి పెట్టెను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో మనుకన్యలవంశములను, నరనారాయణావతారమును వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది.
Summary of chapter 1 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter details the holy lineages originating from the three pious daughters of Svāyambhuva Manu: Ākūti, Devahūti, and Prasūti. Through their sacred unions with great prajāpatis, numerous divine incarnations and exalted sages descended to populate and govern the cosmos. Ākūti gave birth to Yajña-purusha and Dakshiṇā, who maintained the cosmic order, while Devahūti’s daughters married revered rishis to spread transcendental knowledge. Prasūti married Prajāpati Daksha, giving birth to sixteen virtuous daughters, including Satī-devī who wed Mahādeva Śiva, thereby laying the sacred foundation for the social and spiritual harmony of the universe.