21 - వామనావతారము - బలి చక్రవర్తి బంధితుడగుట

శ్రీశుక ఉవాచ ।

సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేందుభిః

హతస్వధామద్యుతిరావృతోఽభ్యగాత్ ।

మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః

సనందనాద్యా నరదేవ యోగినః ॥

ఓ పరీక్షిన్మహారాజా! త్రివిక్రముని పాదములయొక్క చంద్రవంకలవంటి గోళ్ల కాంతిలో సత్యలోకము, స్వయంభువుడగు బ్రహ్మగారు వెల వెల బోయిరి. బ్రహ్మగారు ఆ కాంతిలో మునిగిపోయి, ఆ పాదమునకు ఎదురేగెను. మరీచి మొదలగు మహర్షులు, నారదుడు మొదలగు నైష్టిక బ్రహ్మచారులు, సనందనుడు మొదలగు యోగులు కూడ ఎదురేగిరి.

వేదోపవేదా నియమాన్వితా యమాః

తర్కేతిహాసాంగపురాణసంహితాః ।

యే చాపరే యోగసమీరదీపిత-

జ్ఞానాగ్నినా రంధితకర్మకల్మషాః ।

వవందిరే యత్స్మరణానుభావతః

స్వాయంభువం ధామ గతా అకర్మకమ్ ॥

వేదములు (ఋగ్వేదము మొదలైనవి), ఉపవేదములు (ఆయుర్వేదము మొదలైనవి), యమములు (అహింస మొదలగునవి), నియమములు (శౌచము మొదలైనవి), న్యాయశాస్త్రము, ఇతిహాసములు (రామాయణ భారతములు), వేదాంగములు (వ్యాకరణము మొదలైనవి), పురాణములు (భాగవతము మొదలైనవి), సంహితలు (గర్గసంహిత మొదలైనవి) సత్యలోకములో మూర్తులను దాల్చి నివసించును. ఇంతేగాక, యోగము అనే వాయువుచే ప్రజ్వరిల్ల జేయబడిన జ్ఞానము (ఉపాసన) అనే అగ్నిచే దహించబడిన కర్మల కాలుష్యము గల యోగులు కూడ అక్కడ ఉండేదరు. వీరందరు ఆ భగవానుని పాదమునకు నమస్కరించిరి. స్వయంభువుడగు బ్రహ్మగారి ధామము (సత్యలోకము) కామ్యకర్మలచే పొంద శక్యము కానిది. దానిని ఈ యోగులు శ్రీహరి పాదమును స్మరించి, ఆ మహిమచే పొందినారు.

అథాంఘ్రయే ప్రోన్నమితాయ విష్ణోః

ఉపాహరత్పద్మభవోఽర్షణోదకమ్ ।

సమర్చ్య భక్త్యాభ్యగృణాచ్చుచిశ్రవా

యన్నాభిపంకేరుహసంభవస్స్వయమ్ ॥

తరువాత, శ్రీహరియొక్క నాభియందలి పద్మమునుండి పుట్టిన బ్రహ్మగారు బాగా పైకి ఎదిగియున్న విష్ణువుయొక్క పాదమునకు స్వయముగా అర్ఘ్యమును సమర్పించెను. ఆయన ఆ పాదమును భక్తితో పూజించి స్తుతించెను.

ధాతుః కమండలుజలం తదురుక్రమస్య

పాదావనేజనపవిత్రతయా నరేంద్ర ।

 స్వర్ధున్యభూన్నభసి సా పతతీ నిమార్ష్టి

లోకత్రయం భగవతో విశదేవ కీర్తిః ॥

ఓ మహారాజా! ఆ బ్రహ్మగారి కమండలమునందలి నీరు పెద్ద అడుగులు వేసిన శ్రీహరియొక్క పాదములను కడుగుటచే పవిత్రమై స్వర్గమునందు గంగయై ప్రవహించెను. అదియే అంతరిక్షమునందు పడి, శ్రీహరి భగవానునియొక్క స్వచ్చమైన కీర్తి వలె, ముల్లోకములను పవిత్రము చేయుచున్నది.

బ్రహ్మాదయో లోకనాథాస్స్వనాథాయ సమాదృతాః ।

సానుగా బలిమజహ్రుస్సంక్షిప్తాత్మవిభూతయే ॥ 

శ్రీహరి తన మహిమను ఉపసంహరించి వామనరూపములో నుండెను. అప్పుడు బ్రహ్మగారు, లోకపాలకులు తమ అనుచరులతో గూడి తమ నాథుడగు శ్రీహరిని చక్కని ఆదరముతో పూజించిరి.

తోయైస్సమర్హణైస్స్రగ్బిర్ధివ్యగంధానులేపనైః ।

ధూపైర్ధీ పైస్సురభిభిర్లాజాక్షతఫలాంకురైః ॥

వారు వామనుని అర్ఘ్య-పాద్య-స్నాన-ఆచమనీయములనే ఉపచారములను పరిమళభరితములైన నీటితో సమర్పించిరి. వారు సుగంధద్రవ్యములను ఆయనకు అలమి ధూపదీపములతో పూజించిరి. వారాయనను పేలాలు, అక్షతలు, దూర్వాంకురములతో పూజించి పళ్లను నైవేద్యమీడిరి.

స్తవనైర్జయశబ్ధైశ్చ తద్వీర్యమహిమాంకితైః ।

నృత్యవాదిత్రగీతైశ్చ శంఖదుందుభినిస్వనైః ॥

వారు జయజయధ్వానములను చేస్తూ ఆయన పరాక్రమము యొక్క మహిమను ఉటంకించే స్తోత్రములతో ఆయనను స్తుతించిరి. నాట్యములు, వాద్యములు, గానములతో ఆయనను ఆరాధించిరి. వారు ఆయన పూజలో భాగముగా శంఖములను, దుందుభులను మ్రోగించిరి.

జాంబవానృక్షరాజస్తు భేరీశబ్ధైర్మనోజవః ।

విజయం దిక్షు సర్వాసు మహోత్సవమ ఘోషయత్ ॥

ఎలుగుబంట్లకు రాజగు జాంబవంతుడు మనోవేగముతో దిక్కులన్నింటియందు తిరిగి భేరీశబ్దముతో పెద్ద ఉత్సవము కలుగునట్లుగా శ్రీహరి యొక్క విజయమును చాటెను.

మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపదవ్యాజయాచ్ఞయా ।

ఊచుస్స్వభక్తురసురా దీక్షితస్యాత్యమర్షితాః ॥

తమ రాజు యజ్ఞదీక్షలోనుండగా మూడు అడుగుల భూమిని యాచించి మోసముతో భూమినంతనూ లాగివేసుకొనుటను గాంచిన రాక్షసులు చాల కోపమును పొంది ఇట్లు పలికిరి.

న వా అయం బ్రహ్మబంధుర్విష్ణుర్మాయవినాం వరః ।

ద్విజరూపప్రతిచ్ఛన్నో దేవకార్యం చికీర్షతి ॥

ఈ వామనుడు బ్రాహ్మణ బాలకుడు కాడు. ఈతడు మోసగాళ్లలో అగ్రేసరుడగు విష్ణువు. ఇది నిశ్చయము. విష్ణువే దేవతలకు కార్యమును చక్కబెట్ట గోరి, ఈ విధముగా కపట బ్రాహ్మణవేషముతో వచ్చినాడు.

అనేన యాచమానేన శత్రుణా వటురూపిణా ।

సర్వస్వం నో హృతం భర్తుర్వ్యస్తదండస్య బర్హిషి ॥

బ్రహ్మచారివేషములోనున్న ఈతడు మన శత్రువు. మన ప్రభువు ఇతరులను దండించే అధికారమును పరిత్యజించి యజ్ఞములో నుండగా ఈతడు వచ్చి యాచించి ఆయన సకలసంపదలను లాగివేసినాడు.

సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషతః ।

నానృతం భాషితుం శక్యం బ్రహ్మణ్యస్య దయావతః ॥

            బలి సర్వకాలములలో సత్యమునందు నిష్ట గలవాడు. ఆయన బ్రాహ్మణులయందు భక్తిగల దయామయుడు. ఆయన విశ్లేషించి యజ్ఞ దీక్షలో నుండగా, అసత్యమును పలుకుట సంభవము కాదు.

తస్మాదస్య వధో ధర్మో భర్తుశ్శుశ్రూషణం చ నః ।

ఇత్యాయుధాని జగృహుర్బలేరనుచరాసురాః ॥

అందువలన, వీనిని వధించుటయే ధర్మము; పైగా, అది మన ప్రభువునకు సేవ చేసినట్లు అగును -- అని పలుకుతూ, బలియొక్క అనుచరులగు రాక్షసులు ఆయుధములను చేబట్టిరి.

తే సర్వే వామనం హంతుం శూలపట్టిశపాణయః ।

అనిచ్ఛతో బలే రాజన్ ప్రాద్రవన్ జాతమన్యవః ॥ 

ఓ రాజా! బలి వ్యతిరేకించిననూ వారందరు కోపముతో శూలములను, అడ్డకత్తులను పట్టుకొని వామనుని చంపుటకై ముందునకురికిరి.

తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపాన్ నృప ।

ప్రహస్యానుచరా విష్ణోః ప్రత్య షేధన్నుదాయుధాః ॥ 

ఓ మహారాజా! ముందునకు ఉరుకుచున్న ఆ రాక్షస సేనానాయ కులను చూచి విష్ణువుయొక్క అనుచరులు గట్టిగా నవ్వి, ఆయుధములను పైకెత్తి వారిని అడ్డుకొనిరి.

నందస్సునందోఽథ జయో విజయః ప్రబలో బలః ।

కుముదః కుముదాక్షశ్చ విష్వక్సేనః పతత్త్రిరాట్ ॥ 

జయంతః శ్రుతదేవశ్చ పుష్పదంతోఽథ సాత్వతః ।

సర్వే నాగాయుతప్రాణాశ్చమూం తే జఘ్నురాసురీమ్ ॥ 

నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, బలుడు, ప్రబలుడు, కుముదుడు, కుముదాక్షుడు, విష్వక్సేనుడు, పక్షిరాజగు గరుత్మంతుడు, జయంతుడు, శ్రుతదేవుడు, పుష్పదంతుడు మరియు సాత్వతుడు అనే వీరందరు పదివేల ఏనుగుల బలము గలవారే. వారు ఆ రాక్షసుల సైన్యమును దునుమాడిరి.

హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్బలిః ।

వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్ ॥ 

బలికి శుక్రాచార్యుని శాపము గుర్తుకు వచ్చెను. కోపించియున్న తన వారిని పురుషోత్తముని అనుచరులు చంపుచుండుటను చూచి, ఆయన తన వారిని వారించెను.

హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః ।

మా యుధ్యత నివర్తధ్వం న నః కాలోఽయమర్థకృత్ ॥ 

ఓ విప్రచిత్తీ! ఓ రాహూ! ఓ నేమీ! నా మాటను వినుడు. యుద్ధమును మాని వెనుదిరుగుడు. ఈ కాలము మనకు అనుకూలము కాదు.

యః ప్రభుస్సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే ।

తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్ ॥

ఓ రాక్షసులారా! సకలప్రాణులకు సుఖదుఃఖములనిచ్చేది కాలమే. మానవుడు పురుషకారములచే దానిని అతిక్రమించుటకు సమర్థుడు కాడు.

యో నో భవాయ ప్రాగాసీదభవాయ దివౌకసామ్ ।

స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయమ్ ॥ 

కాలము సర్వసమర్థమైనది. అది ఇదివరలో మనకు కల్యాణమును, స్వర్గవాసులకు దుఃఖమును ఇచ్చినది. అదే కాలము ఈనాడు దానికి విరుద్ధముగా మనకు దుఃఖమును, దేవతలకు అభివృద్ధిని ఇచ్చుచున్నది.

బలేన సచివైర్భుద్ధ్యా దుర్గైర్మంత్రౌషధాదిభిః ।

సామాదిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః॥  

సైన్యము, మంత్రులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు ఔషధములు యంత్రములు మొదలైనవి, మరియు సామదానభేదదండోపాయములు అనువాటితో మానవుడు కాలమును అతిక్రమించలేడు. ఇది నిశ్చయము.

 భవద్భిర్నిర్జితా హ్యేతే బహుశోఽనుచరా హరేః ।

దైవేనర్ధైస్త ఏవాద్య యుధి జిత్వా నదంతి నః ॥ 

కాలము కలిసివచ్చి సంపదలు ఉన్నప్పుడు మీరే ఈ శ్రీహరి అనుచరులను పలుమార్లు జయించిరి గదా! కాని, ఈ నాడు కాలము కలిసి రాక, వారు మనలను జయించి సింహనాదమును చేయుచున్నారు.

ఏతాన్ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి ।

తస్మాత్కాలం ప్రతీక్షధ్వం యో నోఽర్థత్వాయ కల్పతే ॥ 

దైవము అనుకూలమైనచో మనము వీరిని జయించగలము. కావున, మనకు కార్యసిద్ధికి అనుకూలమయ్యే కాలము కొరకు వేచియుండుడు.

శ్రీశుక ఉవాచ ।

ప్రత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూథపాః ।

రసాం నివివిశూ రాజన్ విష్ణుపార్షదతాడితాః ॥

ఓ మహారాజా! దితి దనువంశములకు చెందిన రాక్షస సేనానాయకులు తమ నాయకుడగు బలియొక్క మాటను స్వీకరించిరి. విష్ణువు యొక్క అనుచరులచే నిర్జించబడిన ఆ సేనానాయకులు రసాతలమును ప్రవేశించిరి.

అథ తార్క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభుచికీర్షితమ్ ।

బబంధ వారుణైః పాశైర్బలిం సౌత్యేఽహనీ క్రతా ॥ 

తరువాత కశ్యపుని పుత్రుడు, పక్షిరాజు అగు గరుత్మంతుడు శ్రీహరి ప్రభుని అభిప్రాయమును తెలుసుకొని, ఆ బలిని అదే యజ్ఞములో సుత్యాహస్పు (సోమరసమును దంచే రోజు) నందు వరుణపాశములతో బంధించెను.

హాహాకారో మహానాసీద్రోదస్యోస్సర్వతోదిశమ్ ।

గృహ్యమాణేఽసురపతౌ విష్ణునా ప్రభవిష్ణునా ॥ 

సర్వసమర్థుడగు శ్రీహరి రాక్షసరాజగు బలిని బంధించుచుండగా, భూలోక స్వర్గలోకములయందు అన్ని దిక్కులలో  హాహాకారములు బయలు దేరెను.

తం బద్దం వారుణైః పాశైర్బగవానాహ వామనః ।

నష్టశ్రియం స్థిరప్రజ్ఞముద్రయశసం నృప ॥ 

             స్థిరమైన వివేకజ్ఞానము, గొప్ప కీర్తి గల బలి నాగపాశములచే బంధించబడి శోభను కోల్పోయి ఉండెను. అపుడు వామన భగవానుడు ఆయనతో ఇట్లు పలికెను.

పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాఽసుర ।

ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వా తృతీయముపకల్పయ ॥ 

ఓ రాక్షసా! నాకు నీవు మూడు అడుగుల భూమిని వాగ్దానము చేసితివి. నేను రెండు అడుగులతో భూమినంతనూ ఆక్రమించితిని. నాకు మూడవ అడుగు భూమిని ఇమ్ము.

యావత్తపత్యసౌ గోభిర్యావదిందుస్సహోడుభిః ।

యావద్వర్షతి పర్జన్యస్తావతీ భూరియం తవ ॥

ఈ సూర్యుడు తన కిరణములతో ఎంతవరకైతే తపింపజేయునో, ఎంతవరకైతే చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపజేయునో, ఎంతవరకైతే మేఘము వర్షించునో, అంతటి భూమి (సకల భూమండలము) నీ అధీనములో నుండెడిది.

పదైకేన మయా క్రాంతో భూర్లోకః ఖం దిశస్తనోః ।

స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా ॥ 

వ్యాపకుడనగు నేను ఒక అడుగుతో భూలోకమును, శరీరముతో ఆకాశమును దిక్కులను, రెండవ అడుగుతో స్వర్గలోకమును ఆక్రమించితిని. నీవు చూచుచుండగనే నీ సంపద నాది అయినది.

ప్రతిశ్రుతమదాతుస్తే నిరయే వాస ఇష్యతే ।

విశ త్వం నిరయం తస్మాద్గురుణా చానుమోదితః !! 

వాగ్దానము చేసినదానిని దానము చేయని నీకు నరకమునందు నివాసము శాస్త్రముచే అంగీకరించబడినది. నీ గురువగు శుక్రాచార్యుడు కూడ అదే విషయమును అనుమోదించినాడు. కావున, నీవు నరకమును ప్రవేశించుము.

 వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యధః ।

ప్రతిశ్రుతస్యాదానేన యోఽర్థినం విప్రలంభతే ॥

ఎవడైతే యాచకునకు మాట ఇచ్చి దానము చేయకుండా మోసగించునో, అట్టివానియొక్క స్వర్గసుఖములను పొందాలనే మనోరథము వ్యర్థము. అట్టివానికి స్వర్గము చాల దూరము. వాడు నరకములో పడును.

విప్రలబ్ధో దదామీతి త్వయాహం చాడ్యమానినా ।

తద్వ్యలీకఫలం భుంక్ష్వ నిరయం కతిచిత్సమాః ॥ 

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే

వామనావతారే జలినిగ్రహో నామ ఏకవింశోऽధ్యాయః ॥

నేనే సంపన్నుడననే గర్వము నీకు గలదు. నీవు ఇచ్చెదనని మాట ఇచ్చి నన్ను కూడ మోసగించినావు. ఆ మోసమునకు ఫలము నరకము. కావున, నీవు కొన్ని సంవత్సరములు నరకముననుభవించుము.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో బలి బంధించబడుటను వర్ణించే  ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినదీ (21).