10 - సముద్ర మథనము - దేవాసుర సంగ్రామము

శ్రీశుక ఉవాచ

 ఇతి దానవదైతేయా నావిందన్నమృతం నృప

 యుక్తాః కర్మణి యత్తాశ్చ వాసుదేవపరాజ్ముఖాః

ఓ మహారాజా! దను దీతి వంశములకు చెందిన రాక్షసులు సావ ధానులై ప్రయత్నశీలురై పనిని చేసిననూ, వాసుదేవుని యెడల విముఖు లైన కారణముగా, అమృతమును పొందలేక పోయిరి.

సాధయిత్వాఽమృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్

పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః

ఓ మహారాజా! శ్రీహరి అమృతమును సాధించి తన భక్తులైన దేవ తలచే త్రాగించి, సకలప్రాణులు చూచుచుండగా గరుడుని అధిష్టించి నిషమించెను.

సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తే దితినందనాః

 అమృష్యమాణా ఉత్పేతుర్దేవాన్ ప్రత్యుద్యతాయుధాః ।।

            దితిపుత్రులగు ఆ రాక్షసులు తమ శత్రువులైన దేవతలయొక్క గొప్ప సంపత్తిని చూచి సహించ లేకపోయిరి. వారు ఆయుధములను సంసిద్ధము చేసుకొని దేవతలపైకి ఉరికిరి.

తతస్పురగణాస్సర్వే సుధయా పీతమైధితాః

 ప్రతిసంయుయుధుశ్శస్త్రైర్నారాయణపదాశ్రయాః

అప్పుడు అమృతమును త్రాగి, బలమును పొందియున్న సకల దేవగణములు నారాయణుని పాదములను ఆశ్రయించినవారై ఆయుధము లతో యుద్ధమునకు తలపడిరి.

తత్ర దైవాసురో నామ రణః పరమదారుణః

రోధస్యుదన్వతే రాజంస్తుములో రోమహర్షణః

అపుడు అచట సముద్రతీరమునందు దైవాసుర సంగ్రామమని ప్రసిద్ధి గాంచిన మిక్కిలి దారుణమగు యుద్ధము జరిగెను. రెండు సేనలు కలిసిపోయి చేసిన ఆ యుద్ధము శరీరమునకు గగుర్పాటును కలిగించెను.

తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్ధమనసో రణే

 సమాసాద్యాసిభిర్బాణైర్నిజఘ్నుర్వివిధాయుధైః

అపుడా యుద్దమునందు కోపముతో నిండిన మనస్సులు గల ఆ రెండు ప్రతిపక్షులు ఒకరికి మరియొకరు ఎదురుగా నుండి బాణములు, కత్తులు మొదలగు వివిధములైన ఆయుధములతో కొట్టుకొనిరి.

శంఖతూర్యమృదంగానాం భేరీడమరణాం మహాన్

 హస్త్యశ్వరథపత్తీనాం నదతాం నిస్వనోఽభవత్

శంఖములు, తూర్యములు, డోళ్లు, భేరీలు, డమరువులు మ్రోగు చుండెను. ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు ధ్వనులను చేయుచుండిరి. రథముల ధ్వని కూడ తోడై (ఆ యుద్ధములో) పెద్ద ధ్వని బయలు దేరెను.

రథినో రథిభిస్తత్ర పత్తిభిస్సహ పత్తయః

 హయా హయైరిభాశ్ఛే భైస్సమసజ్జంత సంయుగే

అపుడా యుద్దమునందు రథికులు రథికులతో, కాలిబంట్లు కాలి బంట్లతో, గుర్రపు రౌతులు గుర్రపు రౌతులతో, ఏనుగులపై నున్నవారు ఏనుగులపై యుద్ధమును చేయువారితో కలిసి యుద్ధమును చేసిరి.

ఉష్ట్రైః కేచిదిభైః కేచిదపరే యుయుధుః ఖరైః

 కేచిద్గౌరమృగైరృక్షైర్ద్వీపిభిర్హరిభిర్భటాః

కొందరు యోధులు ఒంటెలను, కొందరు ఏనుగులను, మరికొం దరు గాడిదలను, కొందరు గౌరమృగములను, ఎలుగుబంట్లను, పులుల ను, సింహములను అధిష్టించి యుద్ధమును చేసిరి.

గృధ్రైః కంకైర్బ కైరన్యే శ్యేనభాసైస్తిమింగిలైః

 శరభైర్మహిషైః ఖడ్గైర్గోవృషైర్గవయారుణైః

గ్రద్దలు, రాపులుగులు, కొంగలు, డేగలు, కోళ్లు, తిమింగలములు, మీగండ్ల మెకములు, దున్నలు, ఖడ్గమృగములు, ఎద్దులు, గురుపోతులు, అరుణమృగములు అనువాటిని వాహనములుగా చేసుకొని మరికొందరు

యుద్ధమును చేసిరి.

శివాభిరాఖుభిః కేచిత్ కృకలా సైశ్శశైర్శ రైః

 బస్తైరేకే కృష్ణసారైర్హం సైరన్యే చ సూకరైః

నక్కలు, ఎలుకలు, ముంగీసలు, కుందేళ్లు, మానవులు, మేకలు, నల్లయిర్రలు, హంసలు, వరాహములు అనే వాహనములనెక్కి భటులు

యుద్ధమును చేసిరి.

అన్యే జలస్థలఖగైస్సత్వైర్వికృతవిగ్రహైః

 సేనయోరుభయో రాజన్ వివిశుస్తేఽగ్రతోఽగ్రతః

ఓ మహారాజా! ఇతరయోధులు మెట్ట పక్షులను, నీటి పక్షులను, రోతను కలిగించే రూపము గల ప్రాణులను వాహనములుగా చేసుకొని రెండు సేనలలో ముందు ముందుకు దూసుకు పోవుచుండిరి.

చిత్రధ్వజపటై రాజన్నాతపత్రైస్సితామలైః

మహాధనైర్వజ్రదండెర్వ్యజనైర్బార్హచామరైః

వాతోద్ధతోత్తరోష్ణీ షైరర్చిభిర్వర్మభూషణైః

 స్ఫురద్భిర్విశదైశ్శస్త్రైస్సుతరాం సూర్యరశ్మిభిః

దేవదానవవీరాణాం ధ్వజిన్యౌ పాండునందన

 రేజతుర్వీరమాలాభిర్యాదసామివ సాగరౌ         

పాండువంశీయులకు ఆనందమును కలిగించే ఓ మహారాజా! రంగురంగుల జెండా వస్త్రములు, తెల్లని స్వచ్చమైన గొడుగులు, మిక్కిలి విలువైన వజ్రములు పొదిగిన కర్రలు గల విసనకర్రలు, నేమలి యీకల వింజామరలు, గాలికి ఎగురుచున్న పై వస్త్రములు తలపాగలు, ప్రకాశించే కవచములు ఆభరణములు, సూర్యకిరణములు పడి మెరిసిపోయే స్వచ్చమైన ఆయుధములు మరియు వీరుల మాలలు అనువాటితో ఆ దేవవీరుల మరియు రాక్షసవీరుల సేనలు, జలచరములతో నిండియున్న రెండు సము ద్రముల వలె ప్రకాశించెను.

వైరోచనో బలిస్సంఖ్యే సోఽసురాణాం చమూపతిః

 యానం వైహాయసం నామ కామగం మయనిర్మితమ్

సర్వసాంగ్రామికో పేతం సర్వాశ్చర్యమయం ప్రభో

 అప్రతర్క్యమనిర్దేశ్యం దృశ్యమానమదర్శనమ్

ఆస్థితస్తద్విమానాగ్ర్యం సర్వానీకాధి పైర్వృతః

 వాలవ్యజనఛత్రాగ్ర్యై రేజే చంద్ర ఇవోదయే

విరోచనుని పుత్రుడగు బలి చక్రవర్తి రాక్షసుల సేనకు నాయకుడు. ఇతర సేనానాయకులు ఆయనను చుట్లువారి యుండిరి. ఆయన వింజామ రలతో మరియు శ్రేష్టమైన ఛత్రముతో కూడి ఉదయ పర్వతమునందలి చంద్రుడు వలె ప్రకాశించేను. ఆయన యుద్ధములో వైహాయసమని ప్రసిద్ధి గాంచిన యథేచ్ఛాసంచారియగు గొప్ప విమానమును అధిష్ఠించెను. మయునిచే నిర్మించబడిన ఆ విమానమునందు సమస్తమైన యుద్ధసామగ్రి గలదు. అనేకములగు అద్భుతవస్తువులతో నిండియున్న ఆ విమానమును మనస్సుతో ఊహించుట గాని, వాక్కుతో వర్ణించుట గాని శక్యము కాదు. అది ఒకప్పుడు కనబడి, మరియొకప్పుడు అదృశ్యమగును.

తస్యాసన్ సర్వతో యానైర్యూథానాం పతయోఽసురాః

 నముచిశ్శంబరో బాణో విప్రచిత్తిరయోముఖః

 ద్విమూర్ధా కాలనాభోऽథ ప్రహేతిర్హేతిరిల్వలః

శకునిర్భూతసంతాపో వజ్రదంష్ట్రో విరోచనః

హయగ్రీవశ్శంకుశిరా కపిలో మేఘదుందుభిః

 తారకశ్చక్రదృక్శుంభో నిశుంభో జంభ ఉత్కలః

అరిష్టోఽరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిపః

 అన్యే పౌలోమకాలేయా నివాతకవచాదయః

నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు, ద్విమూర్డుడు, కాలనాభుడు, ప్ర హేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసం తాపుడు, వజ్రదంష్ణుడు, విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, కపి లుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రదృక్కు, శుంభుడు, నిశుంభుడు, జంభుడు, ఉత్కలుడు, అరిష్ణుడు, అరిష్టనేమి, మయుడు, త్రిపురాధిపుడు అనే రాక్షస సేనానాయకులు, పౌలోములు కాలేయులు అనే ఇతర రాక్షస గణములు, నివాతకవచులు మొదలగు ,రాక్షసులు ఆ బలి చక్రవర్తికి అన్ని వైపులా తమ తమ వాహనములపై నిలిచి యుండిరి.

అలబ్ధభాగాస్సోమస్య కేవలం క్లేశభాగినః

సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః

వారందరు అమృతము కొరకై ప్రయాసలో పాలు పంచుకున్నవారే గాని, అమృతములో వాటాను పొందినవారు. గారు. వారు ఇదివరలో పలు మార్లు దేవతలను యుద్ధమునకు ఆరంభమునందే జయించినవారే.

సింహనాదాన్ విముంచంతశ్శంఖాన్ దధ్కుర్మహారవాన్

 దృష్ట్వా సపత్నానుత్సిక్తాన్ బలభిత్కుపితో భృశమ్

ఆ రాక్షసులు సింహనాదములను చేయుచూ, పెద్ద ధ్వనిని చేసే శంఖములను పూరించిరి. గర్వించియున్న శత్రువులను చూచి ఇంద్రుడు చాల కోపమును పొందెను. -

ఐరావతం దిక్కరిణమారూఢశ్శుశుభే స్వరాట్

యథా స్రవత్ప్రస్రవణముదయాద్రిమహర్పతిః

స్వర్గాధిపతియగు ఇంద్రుడు ఐరావతమనే దిగ్గజమును అధిష్ఠించే ను. ఆయన ప్రవహించే కొండకాలువలతో కూడియున్న ఉదయ పర్వత మునధిష్టించిన సూర్యుడు వలె ప్రకాశించెను (దిగ్గజము కపోలమునుండి స్రవించే మదధారలకు కొండ కాలువల పోలిక).

తస్యాసన్ సర్వతో దేవా నానావాహధ్వజాయుధాః

లోకపాలాస్సహ గణైర్వాయ్వగ్నివరుణాదయః

            ఆ ఇంద్రునకు అన్ని వైపులా దేవతలు పలురకముల వాహనము లతో ధ్వజములతో ఆయుధములతో నిలిచియుండిరి. వాయువు, అగ్ని, వరుణుడు, కుబేరుడు మొదలైన లోకపాలకులు తమ తమ గణములతో బాటుగా ఆయన చుట్టూ నిలిచిరి.

తేऽన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః

 ఆహ్వయంతో విశంతోఽగ్రే యుయుధుర్ద్వంద్వయోధినః

ద్వంద్వయుద్దమునందు వీరులగు ఆ దేవతలు, రాక్షసులు ఒకరికి దురుగా మరియొకరు తారసపడి పరస్పరము నిందావాక్యములను పలు కుచుండిరి. వారు పేరు పేరునా ప్రత్యర్థులను యుద్ధమునకు కాసుకొమ్మని పిలుస్తూ ముందుకు దూసుకుపోవుచుండిరి. ఈ విధముగా వారు యుద్ధ మును చేసిరి.

యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోఽస్యత

 వరుణో హేతీనాయుధ్యన్మితో రాజన్ ప్రహేతినా

ఓ మహారాజా! బలి చక్రవర్తి ఇంద్రునితో, వరుణుడు హేతితో, మిత్రుడు ప్రహేతితో యుద్దమును చేసిరి. కుమారస్వామి తారకునిపై ఆయుధములను ప్రయోగించెను.

యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై

 శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రా తు విరోచనః

యముడు కాలనాభునితో, విశ్వకర్మ మయునితో, శంబరుడు త్వష్టతో, విరోచనుడు సవితతో యుద్ధమును చేసెను.

అపరాజితేన నముచిరశ్వినౌ వృషపర్వణా

 సూర్యో బలిసుతైర్దేవో బాణజ్యేష్ఠైశ్శతేన చ

నముచి అపరాజితునితో, అశ్వినీ దేవతలు వృషపర్వునితో, సూర్యదేవుడు బలిచక్రవర్తియొక్క పుత్రులు బాణుడు మొదలగువారు వందమందితో యుద్ధమును చేసిరి.

రాహుణా చ తథా సోమః పులోమ్నా యుయుధేఽనిలః

నిశుంభశుంభయోర్దేవీ భద్రకాళీ తరస్వినీ

చంద్రుడు రాహువుతో, వాయుదేవుడు పులోమతో, వేగము గల భద్రకాళీ నిశుంభ-శుంభులతో యుద్ధమును చేసిరి.

వృషాకపిస్తు జంభేన మహి షేణ విభావసుః

 ఇల్వలస్సహవాతాపిర్బ్రహ్మపుత్రైరరిందమ

శత్రువులను నియంత్రించిన ఓ మహారాజా! శివుడు జంభునితో, అగ్ని మహిషునితో, వాతాపి మరియు ఇల్వలుడు బ్రహ్మగారి పుత్రులగు మరీచి మొదలగువారితో యుద్ధమును చేసిరి.

 కామదేవేన దుర్మర్ష ఉత్కలో మాతృభిస్సహ

 బృహస్పతిశ్చోశనసా నరకేణ శనైశ్చరః

దుర్మర్షుడు మన్మథునితో, ఉత్కలుడు బ్రాహ్మి మొదలగు మాతృ గణములతో, బృహస్పతి శుక్రాచార్యునితో, శనిదేవుడు వరుణునితో యుద్ధ మును చేసిరి.

మరుతో నివాతకవచైః కాలేయైర్వసవోఽమరాః

 విశ్వేదేవాస్తు పౌలోమై రుద్రాః క్రోధవ శైస్సహ

మరుత్తులు నివాతకవచులతో, వసువులనే దేవతలు కాలేయుల తో, విశ్వేదేవతలు పౌలోములతో, రుద్రులు క్రోధవశులనే సర్పములతో యుద్ధమును చేసిరి.

త ఏవమాజావసురాస్సురేంద్ర

 ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానాః

 అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా

 జిగీషవస్తీక్ ష్ణశరాసితోమరైః

రాక్షసులు, దేవనాయకులు యుద్దములో జయమును గోరి ఈ విధముగా ఇద్దరిద్దరు చొప్పున కలిసి పరస్పరము ఎదురేగి వాడి బాణము లు, కత్తులు, చిల్లకోలలతో బలముగా కొట్టుకొనిరి.

భుశుండిభిశ్చక్రగదర్ష్టిపట్టిశైః

శక్త్యుల్ము కైః ప్రాసపరశ్వధైరపి

 నిస్త్రింశభల్లైః పరి ఘైస్సముద్గరైః

సభిందిపాలైశ్చ శిరాంసి చిచ్ఛిదుః

భుశుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తు లు, శక్తులు, కొరవిలు, ఈటెలు, గండ్ర గొడ్డళ్లు, బల్లెములు, ఇనుప రోకళ్లు, ముళ్ల గదలు మరియు ఇనుప గుదియలతో వారు శత్రువుల తలలను నరుకుచుండిరి.

గజాస్తురంగాస్సరథాః పదాతయః

సారోహవాహా వివిధా విఖండితాః

 నికృత్తబాహూరుశిరోధరాంఘ్రయః

ఛిన్నధ్వజేష్వాసతనుత్రభూషణాః

ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు, వాహనములపై యుద్ధ మును చేసే యోద్దలయొక్క చేతులు, తొడలు, మెడలు, కాళ్లు నరకబడిన వి. రథములు, పలువిధముల వాహనములు విరుగ గొట్టబడినవి. రథముల జెండాలు, యోద్ధల ధనుస్సులు, కవచములు, ఆభరణములు చెల్లాచెద రుగా పడియుండెను.

తేషాం పదాఘాతరథాంగచూర్ణితా

దాయోధనాదుల్బణ ఉత్థితస్తదా

రేణుర్దిశః ఖం ద్యుమణిం చ ఛాదయన్

న్యవర్తతాసృక్స్రుతిభిః పరిప్లుతాత్

వారు కాళ్లతో తొక్కుటచే మరియు రథచక్రముల తిరుగుటచే యుద్దభూమి పొడి పొడి ఆయెను. ఆ యుద్దభూమినుండి అప్పుడు అతిశ యించిన ధూళి పైకి లేచి దిక్కులను, ఆకాశమును, సూర్యుని కూడ కప్పి వేసెను. కొంత సేపు తరువాత ఆ యుద్ధభూమి అంతటా రక్తపు ధారలతో తడియగా ఆ ధూళి అణిగిపోయెను.

శిరోభిరుద్ధూతకిరీటకుండలైః

 సంరంభదృగ్భిః పరిదష్టదచ్ఛ దైః

 మహాభుజైస్సాభరణైస్సహాయుధైః

సా ప్రాస్తృతా భూః కరభోరుభిర్బభౌ

ఆ యుద్దభూమి తెగి పడిన తలలు, గొప్ప భుజములు, ఏనుగు తొండములవంటి తొడలు, ఆభరణములు, మరియు ఆయుధములతో అంతటా పరచబడి ప్రకాశించెను. కొన్ని తలలకు కిరీటములు, మరికొన్నిటికి కుండలములు ఎగిరిపోయెను. కొన్ని తలలకు కోపముతో నిండిన కన్నులు గలవు. మరికొన్ని తలల పెదవులు పళ్లతో కరచియుండెను.

కబంధాస్తత్ర చోత్పేతుః పతితిస్వశిరోఽక్షిభిః

 ఉద్యతాయుధదోర్దం డైరాధావంతో భటాన్ మృధే

ఆ సమయములో యుద్ధభూమియందు మొండెములు కూడ దండములవంటి చేతులలో ఆయుధములను పట్టుకొని పైకి లేచి భటుల పైకి అంతటా పరుగులు తీయుచుండెను. అవీ తెగిపడిన తమ తలలయం దలి కన్నులతో చూచుచుండెను.

బలిర్మ హేంద్రం దశభిస్త్రిభిరైరావతం శరైః

 చతుర్భిశ్చతురో వాహానేకేనారోహమార్ఛయత్

బలి చక్రవర్తి మహేంద్రునిపై పది బాణములను, ఐరావతముపై మూడింటిని, నల్గురు పాదరక్షకులపై నాలుగింటిని, మావటివానిపై ఒక బాణమును వేసి కొట్టెను.

స తానాపతతశ్శక్రస్తావద్భిశ్శీఘ్రవిక్రమః

 చిచ్ఛేద నిశితైర్భల్లైరసంప్రాప్తాన్ హసన్నివ

శీఘ్రమగు పరాక్రమము గల ఆ ఇంద్రుడు చిరునవ్వుతో అంతే సంఖ్యలో బాణములను ప్రయోగించి మీదకు వచ్చుచున్న ఆ బాణములను దగ్గరకు రాకముందే తెగగొట్టెను.

తస్య కర్మోత్తమం వీక్ష్య దుర్మర్షశ్శక్తిమాదదే

 తాం జ్వలంతీం మహోల్కాభాం హస్తస్థామచ్ఛినద్ధరిః

             ఆ ఇంద్రుని ఆ ఉత్తమమగు కర్మను చూచి బలి చక్రవర్తి సహించ లేక పోయేను. ఆయన మండుతూ పెద్ద తోకచుక్కవలె ప్రకాశించే ఒక శక్తి ఆయుధమును చేతిలోనికి తీసుకొనెను. ఇంద్రుడు దానిని ఆయన చేతిలో ఉండగానే ఛేదించెను.

 తతశ్శూలం తతః ప్రాసం తతస్తోమరమృష్టయః

 యద్యచ్ఛస్త్రం సమాదద్యాత్సర్వం తదచ్ఛినద్విభుః

తరువాత శూలమును, తరువాత ఈటెను, తరువాత చిల్లకోలను, తరువాత కత్తులను, ఈ విధముగా బలి ఏయే ఆయుధములను చేతిలోనికి తీసుకొనెనో వాటిని అన్నింటినీ సమర్థుడగు ఇంద్రుడు ఛేదించెను.

ససర్జాథాసురీం మాయామంతర్ధానగతోఽసురః

 తతః ప్రాదురభూచ్ఛైలస్సురానీకోపరి ప్రభో

ఓ మహారాజా! తరువాత రాక్షసుడగు ఆ బలి అంతర్ధానమై రాక్షస మాయను సృష్టించెను. అప్పుడు దేవ సైన్యము పైన ఒక పర్వతము ఆవి ర్భవించెను.

తతో ని పేతుస్తరవో దహ్యమానా దవాగ్నినా

 శిలాస్సటంకశిఖరాశ్చూర్ణయంత్యో ద్విషద్బలమ్

ఆ పర్వతమునుండి కార్చిచ్చుచే తగులబెట్ట బడుచున్న చెట్లు, ఉలివలె వాడియైన కొనలు గల రాళ్లు పడి శత్రు (దేవతల) సైన్యమును పిండి చేసినవి.

మహోరగాస్సముత్పేతుర్దందశూకాస్సవృశ్చికాః

 సింహవ్యాఘ్రవరాహాశ్చ మర్దయంతో మహాగజాన్

పెద్ద పాములు, త్రాచులు, తేళ్లు బయల్వెడలినవి. సింహములు, పెద్ద పులులు, అడవి పందులు బయల్వెడలి గొప్ప ఏనుగులను సంహ రించ జొచ్చెను,

యాతుధాన్యశ్చ శతశశ్శూలహస్తా వివాససః

 ఛింధి భింధీతి వాదిన్యస్తథా రక్షోగణాః ప్రభో

ఓ మహారాజా! శూలములను చేతబట్టి దిగంబరలై రాక్షసస్త్రీలు మరియు రాక్షసుల గణములు వందలాదిగా ఆవిర్భవించిరి. వారు నరు కుము, పగుల గొట్టుము అని పలుకుచుండిరి.

తతో మహాఘనా వ్యోమ్ని గంభీరపరుషస్వనాః

అంగారాన్ముముచుర్వాతైరాహతాః స్తనయిత్నవః

తరువాత ఆకాశమునందు పెద్ద మేఘముల గుంపులు వచ్చి గాలుల కారణముగా ఢీకొనుచూ గంభీరముగా కర్ణకఠోరముగా గర్జిస్తూ మండే నిప్పులను విడిచి పెట్టినవి.

సృష్టో దైత్యేన సుమహాన్ వహ్నిశ్శ్వసనసారథిః

 సాంవర్తక ఇవాత్యుగ్రో విబుధధ్వజినీమధాక్

రాక్షసుడగు బలి చాల పెద్ద అగ్నిని సృష్టించెను. అది ప్రళయకా లాగ్ని వలె చాల భయమును గొల్పెను. గాలి దానిని వ్యాపింప జేయగా, అది దేవ సైన్యమును తగులబెట్ట జొచ్చెను

తతస్సముద్ర ఉద్వేలస్సర్వతః ప్రత్యదృశ్యత

 ప్రచండవాతైరుద్ధూతతరంగావర్తభీషణః

తరువాత చెలియలి కట్టను దాటిన సముద్రము (సునామీ) అంతటా కానవచ్చెను. ప్రచండమైన గాలులు దానియందు తరంగముల ను, సుడిగుండములను లేవగొట్టుచుండగా, అది చాల భయమును గొల్పు చుండెను.

ఏవం దైత్యైర్మహామాయైరలక్ష్యగతిభీషణైః

 సృజ్యమానాసు మాయాసు విషేదుస్సురసైనికాః

ఈ విధముగా మహామాయావులగు రాక్షసులు కంటికి కానరాని గమనము గలవారై మాయలను సృష్టించి భయమును గొల్పుచుండగా, దేవ సైనికులు విషాదమును పొందిరి.

న తత్ప్రతివిధిం యత్ర విదురింద్రాదయో నృప

 ధ్యాతః ప్రాదురభూత్తత్ర భగవాన్ విశ్వభావనః

ఓ మహారాజా! ఇంద్రుడు మొదలగువారికి ఆ మాయలను నివా రించే ఉపాయము తెలియలేదు. అప్పుడు వారు లోకములను పాలించే శ్రీహరి భగవానుని ధ్యానించగా, ఆయన అచట సాక్షాత్కరించెను.

తతస్సుపర్ణాంసకృతాంఘ్రీపల్లవః పిశంగవాసా నవకంజలోచనః, అదృశ్యతాష్టాయుధబాహురుల్లసచ్ఛ్రీకౌస్తుభానర్ఘ్యకిరీటకుండలః

అప్పుడు గరుత్మంతుని భుజములపై చిగుళ్లవంటి కొళ్లను ఉంచిన పీతాంబరుడగు శ్రీహరిని వారు చూచిరి. కొత్తగా వికసించిన పద్మ మువంటి కన్నులు గల ఆయన ఎనిమిది చేతులలో ఆయుధములను ధరించి యుండెను. ఆయన వక్షఃస్థలముపై శ్రీదేవిని, మెడలో కౌస్తుభ మాణిక్యమును, మిక్కిలి విలువైన కిరీటమును, కుండలములను ధరించి

యుండెను.

తస్మిన్ ప్రవిష్టేఽ సురకూటకర్మజా

మాయా వినేశుర్మహినా మహీయసః

 స్వప్నో యథా హి ప్రతిబోధ ఆగతే

హరిస్మృతస్సర్వవిపద్విమోక్షణమ్

సర్వాధికుడగు ఆ శ్రీహరి ప్రవేశించగానే ఆయన మహిమచేతనే, రాక్షసులు మాయలను సృష్టించే కర్మలను చేసి సృష్టించిన మాయలు, తెలివి రాగానే కల దూరమైనట్లుగా, నశించేను. ఎందుకంటే, శ్రీహరియొక్క స్మరణము అన్ని ఆపదలనుండి విముక్తిని కలిగించును.

దృష్ట్వా మృధే గరుడవాహామీభారివాహ

ఆవిధ్య శూలమహినోదథ కాలనేమిః

తల్లీలయా గరుడమూర్ధ్ని పతద్గృహీత్వా

తేనాహనన్నృప సవాహమరిం త్ర్యధీశః

ఓ మహారాజా! యుద్దమునందు గరుడుని అధిష్టించి వచ్చిన శ్రీహరిని చూచి వెంటనే కాలనేమి శూలమును పైకెత్తి కొట్టెను. ఆతడు ఏనుగులకు శత్రువగు సింహమును అధిష్టించి యుండెను. ఆ శూలము గరుడుని తలపై పడబోవుచుండగా, ముల్లోకములకు అధీశ్వరుడగు శ్రీహరి దానిని అవలీలగా పట్టుకొని, దానితోనే కాలనేమిని, వాని వాహన మును కూడ సంహరించేను.

మాలీ సుమాల్యతిబలౌ యుధి పేతతుర్య-

చ్చక్రేణ కృత్తశిరసావథ మాల్యవాంస్తమ్

 ఆహత్య తిగ్మగదయాఽహనదండజేంద్రం

తావచ్ఛిరోఽచ్ఛినద రేర్నదతోఽరిణాఽఽద్యః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే

సముద్రమథనవృత్తాంతే దేవాసురసంగ్రామవర్ణనం

నామ దశమోఽధ్యాయః

 మహాబలశాలురగు మాలి, సుమాలి యుద్దమునందు శ్రీహరి యొక్క చక్రముచే నరుకబడిన తలలు గలవారై నేల గూలిరి. అపుడు మాల్యవంతుడు సింహనాదమును చేసి వాడియైన గదతో శ్రీహరిని, పక్షి రాజగు గరుత్మంతుని కొట్టెను. అంతలోనే, సర్వకారణుడగు శ్రీహరి శత్రు వైన ఆ మాల్యవంతుని తలను చక్రముతో నరికెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో దేవాసుర సంగ్రామమును - వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది.