భాగవత మహా పురాణము
16 - వామనావతారము - కశ్యపుడు అదితికి పయోవ్రతమును ఉపదేశించుట
శ్రీశుక ఉవాచ ।
ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాఽదితిస్తదా ।
హృతే త్రివిష్ట పే దైత్యైః పర్యతప్యదనాథవత్ ॥
ఈ విధముగా రాక్షసులు స్వర్గమునాక్రమించగా తన పుత్రులైన దేవతలు కనబడకుండా పోయినప్పుడు, దేవతల తల్లియగు అదితి నాథుడు లేనిదివలె నిరంతరమగు దుఃఖమును పొందెను.
ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్ ।
నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్ ॥
ఆమే ఆశ్రమములో ఉత్సవము గానీ, ఆనందము గాని లేకుండె ను. చిరకాలము తరువాత సమాధినుండి బయటకు వచ్చిన పూజనీయు డగు కశ్యప ప్రజాపతి ఆమె ఆశ్రమమునకు వెళ్లాను.
స పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః ।
సభాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ ॥
కురువంశ శ్రేష్ఠుడవగు ఓ మహారాజా! అదితి ఆయనను యథా యోగ్యముగా సత్కరించెను. ఆయన ఆసనముపై కూర్చుండెను. దీనమైన ముఖముగల తన భార్యను ఉద్దేశించి ఆయన ఇట్లు పలికెను.
అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేఽధునాఽఽగతమ్ ।
న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛందానువర్తినః ॥
ఓ కల్యాణీ! లోకమునందిప్పుడు వేదవేత్తలకు గాని, ధర్మమునకు గాని, మృత్యువుయొక్క ఇచ్ఛకు వశుడై యుండే మానవునకు గాని ఆపద రాలేదు గదా?
అపి వాఽకుశలం కించిద్గృ హేషు గృహమేధిని ।
ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్ ॥
ఓ అదితీ! ఈ ఇంటికి స్వామినివి నీవే. ఇంటియందు ధర్మార్థకామ ములనే పురుషార్థములకు ఏదేని ఆపద కలిగినది యేమి? సాధన లేనివా నికి కూడ సాధనయొక్క ఫలమును అందజేసే పవిత్రస్థానము గృహము.
అపి వాఽతిథయోఽభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా ।
గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్ ॥
ఏ నాడైననూ నీవు ఇంటి పనులలో నిమగ్నమై యుండగా అతి థులు వచ్చి, నీవు ఎదురేగి సత్కరించకుండగనే ఇంటినుండి వెళ్లిపోయి నారా యేమి?
గృహేషు యేష్వతిథయో నార్చితాస్సలిలైరపి ।
యది నిర్యాంతి తే నూనం ఫేరురాజగృహోపమాః ॥
ఏ ఇంటికి అతిథులు వచ్చి సత్కరించబడకుండా నీరైనా త్రాగ కుండా వెళ్లిపోతారో, ఆ ఇల్లు నిశ్చయముగా నక్కల రాజు ఇంటిని పోలి నది మాత్రమే.
అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి ।
త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్ ॥
ఓ కల్యాణీ! నీవు పతివ్రతవు. నేను ఎక్కడికో వెళ్లినప్పుడు నీవు మనస్సులో ఆదుర్దా ఉన్న కారణముగా సరియగు సమయములో అగ్నులయందు ఆహుతులను సమర్పించుట విస్మరించినావా యేమి?
యత్పూజయా కామదుఘాన్యాతి లోకాన్ గృహాన్వితః ।
బ్రాహ్మణోఽగ్నిశ్చ వై విష్ణోస్సర్వదేవాత్మనో ముఖమ్ ॥
గృహస్థుడు అగ్నిని, బ్రాహ్మణుని పూజించి కోరికలనీడేర్చే పుణ్య లోకములను పొందును. ఎందుకంటే, అగ్ని మరియు బ్రాహ్మణుడు నిశ్చయముగా సకలదేవతాస్వరూపుడగు శ్రీహరియొక్క ముఖమే.(అగ్ని యందు చేసిన హోమము, బ్రాహ్మణునకు పెట్టిన భోజనము సాక్షాత్తుగా విష్ణువునకు సమర్పించినట్లే యగును).
అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని ।
లక్షయేఽస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహమ్ ॥
ఓ అదితీ! నీకు అభిమానము మెండు. నీ పుత్రులందరు క్షేమ మేనా? నీ ముఖకవళికలను బట్టి నీ మనస్సులో స్వస్థత లేదని నాకు తెలి యుచునే యున్నది.
అదితిరువాచ ।
భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ ।
త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే ॥
అదితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! వేదవేత్తలకు, గోవులకు, ధర్మమునకు, ఈ జనులకు కూడ మంగళమే. నీవు గొప్ప గృహస్థుడవు. నీ ఈ గృహము ధర్మార్థకామములకు నివాస స్థానము.
అన్నయోఽతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః ।
సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి ॥
ఓ మహర్షీ! అగ్నులను, అతిథులను, భృత్యులను, ఆకాంక్ష గల ఇతరులను నేను సత్కరించితిని. నేను నిరంతరముగా పూజనీయుడవగు మిమ్ములనే ధ్యానించుటచే, నాకు సర్వము లోటు లేకుండ నున్నది.
కో ను మే భగవన్ కామో న సంపద్యేత మానసః ।
యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే ॥
ఓ పూజనీయా! ప్రజాపతివగు నీవు నాకు ఈ విధముగా ధర్మము లను బోధించుచుండగా, నా మనస్సులోనుండే ఏ కోరిక సంపన్నము కాకుండును?
తవైవ మారీచ మనశ్శరీరజాః
ప్రజా ఇమాస్సత్త్వరజస్తమోజుషః ।
సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో
తథాపి భక్తం భజతే మహేశ్వరః ॥
ఓ మరీచిపుత్రా! సత్త్వరజస్తమోగుణములతో తాదాత్మ్యమును చెంది జీవించే ఈ ప్రాణులు నీ మనస్సునుండి, శరీరమునుండి పుట్టినవారు మాత్రమే. ఓ ప్రభూ! రాక్షసులు మొదలైన ఈ ప్రాణులయందు నీవు సమ మగు చిత్తము గలవాడవు. కాని, మహేశ్వరుడు కూడ భక్తుని సేవించును. (నీవు కూడ అట్లే చేయవలెను).
తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత ।
హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహీ నః ప్రభో ॥
ఓ ఈశ్వరా! నీవు గొప్ప ప్రతనిష్ఠ గలవాడవు. ఓ ప్రభూ! నిన్ను సేవించే నాయొక్క హితమును గురించి నీవు ఆలోచించుము. శత్రువులు మా సంపదను, స్థానమును అపహరించినారు. అట్టి మమ్ములను రక్షించుము.
పరైర్వివాసితా సాఽహం మగ్నా వ్యసనసాగరే ।
ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ ॥
బలశాలురగు శత్రువులు నా ఈశ్వరభావము (అధికారము) ను, సంపదను, కీర్తిని అపహరించినారు. వారు మా నివాసస్థానమును ఆక్రమించుకొని మమ్ములను బయటకు త్రోసివేసినారు. అట్టి నేను దుఃఖసముద్ర ములో మునిగియున్నాను. .
యథా తాని పునస్సాధో ప్రపద్యేరన్ మమాత్మజాః ।
తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ ॥
ఓ మహాత్మా! కల్యాణమును చేయువారిలో నీవు అగ్రేసరుడవు. నా పుత్రులు తిరిగి వాటిని మరల పొందే విధముగా నీవు సంకల్పించి, వారికి మంగళమును సంపాదించుము.
శ్రీశుక ఉవాచ ।
ఏవమభ్యర్థితోఽదిత్యా కస్తామహ స్మయన్నివ ।
అహో మాయాబలం విష్ణోస్స్నేహబద్ధమిదం జగత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అదితి ఈ విధముగా ప్రార్థించ గా, కశ్యప ప్రజాపతి చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను -- విష్ణు మాయయొక్క బలము ఆశ్చర్యమును కలిగించును. ఈ జగత్తు ఆసక్తిచే , బంధించబడి యున్నది.
క్వ దేహో భౌతికోఽనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః ।
కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్॥
పంచభూతములతో - నిర్మించబడిన అనాత్మయగు దేహము ఎక్కడ? ప్రకృతికంటె అతీతమైన ఆత్మ ఎక్కడ? భర్త, పుత్రుడు మొదలగు వారు ఎవరు? ఎవరి వారు? వ్యామోహమే ఈ సంసారమునకు కారణము.
ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనమ్ ।
సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్ ॥
పూర్ణుడు, దుష్టజనశిక్షకుడు అగు వాసుదేవుడు సకలప్రాణుల హృదయములో ఆత్మరూపముగా నివసించి యున్నాడు. జగత్తునకు తండ్రి యగు ఆ భగవానుని ఆరాధించుము.
స విధాస్యతి తే కామాన్ హరిర్ధీనానుకంపనః ।
అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ ॥
దీనులపై దయ గల ఆ శ్రీహరి నీ కోరికలను తీర్చగలడు. భగవ ద్భక్తి వ్యర్థము కాదు. మరో ఉపాయము లేదని నా అభిప్రాయము.
అదితిరువాచ ।
కేనాహం విధినా బ్రహ్మన్నుపస్థాస్యే జగత్పతిమ్ ।
యథా మే సత్యసంకల్పో విదధ్యాత్స మనోరథమ్ ॥
అదితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! జగన్నాథుడు, సత్యసంక ల్పుడు అగు శ్రీహరిని నేను ఏ విధానముతో ఆరాధించినచో, ఆయన నా మనోరథమునీడేర్చును?
ఆదిశ త్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనమ్ ।
ఆశు తుష్యతి మే దేవస్సీదంత్యాస్సహ పుత్రకైః ॥
ఓ మహర్షీ! నీవు వేదవేత్తలలో అగ్రగణ్యుడవు. నేను నా పుత్రులతో గూడి చాల దుఃఖమును పొందియున్నాను. నాకు శ్రీహరి దేవుడు తొంద రగా ప్రసన్నమయ్యే ఆరాధనను, ఆ విధానమును నీవు ఉపదేశించుము.
కశ్యప ఉవాచ ।
ఏతన్మే భగవాన్ పృష్టః ప్రజాకామస్య పద్మజః ।
కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను --- నేను సంతానమును కోరి పూజనీయుడు, పద్మసంభవుడు అగు బ్రహ్మగారిని ప్రశ్నించగా, ఆయన నాకు ఈ వ్రతమును చెప్పినాడు. దీని వలన కేశవుడు ప్రసన్నుడగును. దీనిని నీకు నేను ఉపదేశించ గలను.
ఫాల్గునస్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రతః ।
అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్వితః ॥
ఫాల్గునమాసములో శుక్లపక్షమునందు పన్నెండు రోజులు కేవలము పాలను మాత్రమే త్రాగుతూ గొప్ప భక్తితో కూడినవాడై పద్మముల వంటి కన్నులు గల శ్రీహరిని ఆరాధించవలెను.
సినీవాల్యాం మృదాఽఽలిప్య స్నాయాత్క్రోడవిదీర్ణయా ।
యది లభ్యేత వై స్రోత స్యేతం మంత్రముదీరయేత్ ॥
అమావాస్యనాడు లభించే పక్షములో వరాహము కలిచివేసిన మట్టితో లేపము చేసుకొని నదిలో స్నానమును చేయవలెను. ఈ మంత్ర మునుచ్చరించవలెను.
త్వం దేవ్యాదివరా హేణ రసాయాః స్థానమిచ్చతా ।
ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ ॥
ఓ భూదేవీ! జగత్కారణుడగు వరాహ భగవానుడు ప్రాణులకు స్థానమును కల్పించ గోరి, నిన్ను రసాతలమునుండి పైకి తీసుకు వచ్చినాడు. నీకు నమస్కారము. నా పాపమును పూర్తిగా నశింప జేయుము.
నిర్వర్తితాత్మనియమో దేవమర్చేత్సమాహితః ।
అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి ॥
సాధకుడు తన నిత్య నైమిత్తికములను నిర్వహించుకొని ఏకాగ్రచిత్త ముతో శ్రీహరి దేవుని విగ్రహము, దర్భలచే సంస్కరించబడిన వేది, సూర్యుడు, నీరు, అగ్ని మరియు గురువులయందు పూజించవలెను.
నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే ।
సర్వభూతనివాసాయ వాసుదేవాయ సాక్షిణే ॥
ఓ వాసుదేవ భగవానుడా! సకలప్రాణులకు ఆశ్రయమైన నీవు సక లప్రాణులలో సాక్షి చైతన్యరూపముగా వున్నావు. ఓ పురుషోత్తమా! నీకు నమస్కారము (అని స్తుతించవలెను).
నమోఽవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధానపురుషాయ చ ।
చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే ॥
శ్రీహరి అత్యంతసూక్ష్మమగు చైతన్యమే స్వరూపముగా గలవాడు గాన, ఇంద్రియములకు గాని మనస్సునకు గాని గోచరము కాడు. ప్రకృతి, ప్రాణులు అనే రెండింటి రూపముగా ఆయనయే ప్రకటమైనాడు. శ్రీహ రియే సాంఖ్యశాస్త్రాచార్యుడుగా అవతరించి, ఇరవై నాలుగు తత్త్వములను దర్శించి పరిగణించినాడు. అట్టి శ్రీహరికి నమస్కారము.
మూలప్రకృతి, మహత్తత్త్వము (సమష్టి బుద్ధిశక్తి), సమష్టి అహం కారము, అయిదు సూక్ష్మభూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, మనస్సు, అయిదు స్థూలభూతములు అను నవి ఇరవై నాలుగు తత్త్వములు.
నమో ద్విశీర్ ష్ణే త్రిపదే చతుశ్శృంగాయ తంతవే ।
సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీవిద్యాత్మనే నమః ॥
స్వర్గాది ఫలములను విస్తరింప జేసే యజ్ఞమే స్వరూపముగా గల శ్రీహరికి ప్రాయణీయము, ఉదయనీయము అనే రెండు కర్మలు రెండు తలలవంటివి; ప్రాతః, మధ్యాహ్న, సాయంసవనములు మూడు పాద ములు వంటివి; ఋగ్-యజుః-సామ-అథర్వణవేదములే నాలుగు కొమ్ములు వంటివి; గాయత్రి, ఉషైక్, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్, బృహతి మొదలైన ఏడు ఛందస్సులు ఏడు చేతులు వంటివి; యజ్ఞమునకు మూలము ఋగ్-యజుః-సామవేదములు. అట్టి శ్రీహరికి నమస్కారము.
నమశ్శివాయ రుద్రాయ నమశ్శక్తిధరాయ చ ।
సర్వవిద్యాధిపతయే భూతానాం పతయే నమః ॥
మంగళస్వరూపుడగు శ్రీహరియే ప్రళయములో సర్వమును నశింప జేయును. సకలశక్తులను ధరించే ఆయనయే సకలవిద్యలకు మూలస్థానము. ప్రాణులకు రక్షకుడగు అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు.
నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే ।
యోగైశ్వర్యశరీరాయ నమస్తే యోగ హేతవే ॥
జగత్తు రూపముగా వెలిసిన ఓ శ్రీహరీ! తేజోమయుడవగు నీవే సమష్టి బుద్దిశక్తి-క్రియాశక్తుల రూపముగా నున్నావు. నీవు యోగప్రవర్తకు డవు మాత్రమే గాక, యోగము మరియు దాని సిద్ధులు నీ శరీరమే. నీకు అనేక నమస్కారములు.
నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః ।
నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః ॥
ఓ శ్రీహరీ! ప్రకాశ స్వరూపుడవగు నీవే జగత్కారణము, సకలప్రా ణులలో సాక్షిరూపుడవై ఉండే నీవే నర-నారాయణ మహర్షుల రూపములో అవతరించితివి. పాపములను పోగొట్టే నీకు అనేక నమస్కారములు.
నమో మరకతశ్యామవపు షేఽధిగతిశ్రియే ।
కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే ।
ఓ కేశవా! మరకత మాణిక్యము వలె శ్యామలమైన దేహము గల నిన్ను లక్ష్మీదేవి చేరి సేవించుచున్నది. పీతాంబరుడవగు నీకు అనేక నమ స్కారములు.
త్వం సర్వవరదః పుంసాం వరేణ్య వరదర్షభ ।
అతస్తే శ్రేయసే ధీరాః పాదరేణుముపాసతే ॥
ఓ పురుషోత్తమా! నీవు వరములనిచ్చువారిలో అగ్రేసరుడవు. సక లవరములనిచ్చువాడవు నీవే. కావుననే, వివేకులు మోక్షము కొరకై నీ పాద ధూళిని ఉపాసించెదరు.
అన్వవర్తంత యం దేవాశ్శ్రీశ్చ తత్పాదపద్మయోః ।
స్పృహయంత ఇవామోదం భగవాన్మే ప్రసీదతామ్ ॥
శ్రీహరియొక్క పాదపద్మముల పరిమళమునందు లోభము గల వారా యన్నట్లు దేవతలు, లక్ష్మీదేవి కూడ ఆయనను సేవించిరి. అట్టి శ్రీహరి భగవానుడు నా కొరకు ప్రసన్నుడగు గాక!
ఏతైర్మం త్రార్హృషీ కేశమావాహనపురస్కృతమ్ ।
అర్చయేచ్ఛ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః ॥
సాధకుడు శ్రద్దతో కూడినవాడై ముందుగా ఇంద్రియాధిపతియగు శ్రీహరిని ఆహ్వానించి ఈ మంత్రములతో పాద్యము, ఆచమనము మొద లగు ఉపచారములను సమర్పించి పూజించవలెను.
అర్చిత్వా గంధమాల్యాద్యైః పయసా స్నపయేద్విభుమ్ । వస్త్రోపవీతాభరణపాద్యోపస్పర్శనైస్తతః ।
గంధధూపాదిభిశ్చార్చేద్ద్వాదశాక్షరవిద్యయా॥
శ్రీహరి ప్రభుని సాధకుడు పాద్యము, ఆచమనము, పాలతో అభి షేకము, శుద్దోదక స్నానము, వస్త్రములు, యజ్ఞోపవీతములు, ఆభరణము లు, గంధము, పుష్పమాలలు, ధూపము, దీపము మొదలగు ఉపచారము లతో పన్నెండు అక్షరముల మంత్రమును (ఓం నమో భగవతే వాసుదేవాయ) ఉచ్చరిస్తూ పూజించవలెను.
శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి ।
ససర్పిస్సగుడం దత్త్వా జుహుయాన్మూలవిద్యయా ॥
సంపద ఉన్నచో నెయ్యి, బెల్లము వేసి వరి బియ్యముతో పాయ సము వండి నైవేద్యము పెట్టి, పన్నెండు అక్షరముల మూలమంత్రముతో హోమము కూడ చేయవలెను.
నివేదితం తద్భక్తాయ దద్యాద్బుంజీత వా స్వయమ్ ।
దత్త్వాఽఽచమనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్ ॥
ఆ నైవేద్యమును భక్తునకు ఈయవలెను. లేదా, తానే తినవలెను. నైవేద్యము తరువాత శ్రీహరికి ఆచమనమునిచ్చి పూజించి, తాంబూల మును కూడ నివేదించవలేను.
జ పేదష్టోత్తరశతం స్తునీత స్తుతిభిః ప్రభుమ్ ।
కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దండవన్ముదా ॥
నూట యెనిమిది సార్లు మూలమంత్రమును జపించి, ప్రభుని స్తోత్రములతో స్తుతించవలెను. తరువాత ఆనందముతో ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారమును చేయవలెను.
కృత్వా శిరసి తచ్చేషాం దేవముద్వాసయేత్తతః ।
ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయ సేన యథోచితమ్ ॥
ఆ శ్రీహరి నిర్మాల్యమును తలపై ఉంచుకోని, శ్రీహరి దేవునకు ఉద్వాసన చెప్పవలెను. కనీసము ఇద్దరు వేదవేత్తలకు తగిన విధముగా పాయసముతో భోజనము పెట్టవలెను.
భుంజీత త్రైరనుజ్ఞాత శ్శేషం సేష్టస్సభాజితైః ।
బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వోభూతే ప్రథమేఽహని ॥
స్నాతశ్శుచిరథోక్తేన విధినా సుసమాహితః ।
పయసా స్నాపయిత్వార్చేద్యావద్వ్రతసమాపనమ్ ॥
ఆ వేదవేత్తలను సత్కరించి వారి అనుమతితో మిగిలిన ఆహార మును బంధువులతో కలిసి భుజించవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించవలెను. తెల్లవారిన తరువాత మరునాడు (అనగా పాడ్యమినాడు) స్నానము చేసి శుచియై శాస్తోక్తవిధానముతో మిక్కిలి సావధానుడై శ్రీహ రికి పాలతో అభిషేకము చేసి పూజించవలెను. ఈ విధముగా వ్రతము పూర్తి అయ్యేవరకు పూజను చేయవలెను.
పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ణ్వర్చనాదృతః ।
పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్॥
సాధకుడు పాలను ఆహారముగా తీసుకుంటూ విష్ణువును పూజిం చుటయందు ఆదరము గలవాడై ఈ వ్రతమునాచరించవలెను. ఇదివరలో చెప్పినట్లుగానే, అగ్నిలో హోమమును చేసి, బ్రాహ్మణులకు భోజనమును కూడ పెట్టవలెను.
ఏవం త్వహరహః కుర్యాద్ద్వాదశాహం పయోవ్రతః ।
హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణమ్ ॥
ఈ విధముగా పన్నెండు దినములు ప్రతి దినము పాలను మాత్రమే ఆహారముగా తీసుకుంటూ, శ్రీహరి ఆరాధన, హోమము, పూజ, బ్రాహ్మణ భోజనములను చేయవలెను.
ప్రతిపద్దినమారభ్య యావచ్చుక్షత్రయోదశీ ।
బ్రహ్మచర్యమధస్స్వప్నం స్నానం త్రిషవణం చరేత్ ॥
సాధకుడు ఫాల్గున శుక్ల పాడ్యమినాడు మొదలిడి శుక్ల త్రయోదశి వరకు బ్రహ్మచర్యము, క్రింద పరుండుట, మూడు పూటలా స్నానము అనే నియమములను పాటించవలెను.
వర్జయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా ।
అహింస్రస్సర్వభూతానాం వాసుదేవపరాయణః ॥
అసద్-భాషణము (అసత్యమును పలుకుట, దుష్టులతోడి సంభా షణము, దుష్టములైన విషయములకు చెందిన సంభాషణము) ను, మరియు చిన్న పెద్ద భోగములను విడిచి పెట్టవలెను. ఏ ప్రాణికైననూ హింసను చేయరాదు. వాసుదేవుని మాత్రమే నిరంతరముగా స్మరించవలెను.
త్రయోదశ్యామథో విష్ణోస్స్నపనం పంచకైర్విభోః ।
కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః ॥
తరువాత త్రయోదశి నాడు విష్ణు ప్రభునకు పంచామృత (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పానకము) ములతో శాస్తోక్తమైన విధానముతో శాస్త్రమునందు నిష్ణాతులైనవారిచే చేయించవలెను.
పూజాం చ మహతీం కుర్యాద్విత్తశాఠ్యవివర్జితః ।
చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే ॥
శృతేన తేన పురుషం యజేత సుసమాహితః ।
నైవేద్యం చాతిగుణవద్దద్యాత్పురుషతుష్టిదమ్ ॥
సాధకుడు డబ్బు ఖర్చు తగ్గించాలనే దుర్బుద్ధిని విడనాడి పూజను పెద్ద యెత్తున చేయవలెను. అంతర్యామియగు విష్ణువు కొరకు పాయసమును వండి తయారు చేసి, మిక్కిలి ఏకాగ్రమగు చిత్లముతో దానితో పురుషోత్తముని పూజించ వలెను. అధికమగు గుణము గల నైవేద్య మును ఇచ్చి పురుషోత్తమునకు ప్రీతిని కలిగించవలెను.
ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః ।
తోషమేదృత్విజశ్చైవ తద్విద్ధ్యారాధనం హరేః ॥
ఆచార్యుడు జ్ఞానముతో సంపన్నుడై యుండవలెను. ఆచార్యున కు, ఋత్విక్కులకు వస్త్రములను, ఆభరణములను, గోవులను ఇచ్చి సంతోష పెట్టవలెను. అదియే శ్రీహరియొక్క ఆరాధనమని తెలుసుకొనుము.
భోజయేత్తాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే ।
అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్త్యా యే చ తత్ర సమాగతాః ॥
ఓ అదితీ! నీ చిరునగవు చాల స్వచ్చముగా నున్నది సుమా! ఆచా ర్యునకు, ఋత్విక్కులకు, ఇతర బ్రాహ్మణులకు, అక్కడకు అప్పుడు వచ్చిన ఇతరులకు యథాశక్తిగా రుచ్యమైన శుద్ధమగు ఆహారమును సమ ర్పించవలెను.
దక్షిణాం గురవే దద్యాదృత్విగ్భ్యశ్చ యథార్హతః ।
అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్సముపాగతాన్॥
ఆచార్యునకు, ఋత్విక్కులకు వారి వారి అర్హతలకు తగ్గట్లుగా దక్షి ణలనీయవలేను. వచ్చినవారు ఎంతటి దురాచారులైననూ (కసాయిలే అయిననూ), వారికి రుచ్యమైన ఆహారమునిచ్చి సంతోష పెట్టవలెను.
భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ ।
విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః ॥
దీనులు, గ్రుడ్డివారు, అసమర్థులు (కుంటివారు మొదలైనవారు) అందరు భుజించిన తరువాత సాధకుడు బంధువులతో గూడి భుజించవలె ను. ఈ విధముగా అతిథులను సత్కరించుటచే విష్ణువునకు ప్రీతి కలుగు నని ఆ సాధకుడు గుర్తించవలెను.
నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిస్స్వస్తివాచకైః ।
కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోఽన్వహమ్ ॥
ప్రతిదినము నాట్యములు, వాద్యములు, గానములు, స్తోత్రములు, స్వస్తివాచనములు, శ్రీహరియొక్క గాథలు అనువాటితో శ్రీహరియొక్క ఆరాధనను చేయించవలేను.
ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరమ్ ।
పితామ హేనాభిహితం మయా తే సముదాహృతమ్ ॥
పయోవ్రతమని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరా ధించే సర్వోత్తమమైన పద్దతి. దీనిని బ్రహ్మగారు ఉపదేశించిరి. దీనిని నీకు నేను విస్తారముగా చెప్పితిని.
త్వం చానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవమ్ ।
ఆత్మనా శుద్దభావేన నియతాత్మా భజావ్యయమ్ ॥
ఓ మహానుభావురాలా! నీవు కూడ ఈ వ్రతమును శుద్దమగు భక్తి గల చిత్తముతో చక్కగా అనుష్టించుము. మనస్సును వశము చేసుకొని వినాశ రహితుడగు శ్రీహరిని ఆరాధించుము.
అయం వై సర్వయజ్ఞాఖ్యస్సర్వవ్రతమితి స్మృతమ్ ।
తపస్సారమిదం భద్రే దానం చేశ్వరతర్పణమ్ ॥
ఓ కల్యాణీ! సర్వయజ్ఞము, సర్వవ్రతము అని ప్రసిద్ధి బడసిన ఈ వ్రతము నిశ్చయముగా ఈశ్వరునకు ప్రీతికరము. ఇది తపస్సుల సారము. ఇదియే గొప్ప దానము.
త ఏవ నియమాస్సాక్షాత్త ఏవ చ యమోత్తమాః ।
తపో దానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యధోక్షజః ॥
వేటిచే సాక్షాత్తుగా అధోక్షజుడు (ప్రమాణములకు గోచరము కాని శ్రీహరి) ప్రసన్నుడగునో, అవియే నియమములు, అవియే ఉత్తమమగు యమములు, అదియే తపస్సు, అదియే దానము, అదియే వ్రతము, అదియే యజ్ఞము.
తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయా చర ।
భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే
కశ్య పేన పయోవ్రతోపదేశవర్ణనం నామ షోడశోऽధ్యాయః ॥
ఓ కల్యాణీ! కావున నీవు నియమముతో శ్రద్దగా ఈ వ్రతమును అనుష్ఠించుము. భగవానుడు నీపై ప్రసన్నుడై శీఘ్రముగా నీ మనోరథము లను సంపన్నము చేయగలడు.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో కశ్యపుడు అదితికి పయోవ్రతమును ఉపదేశించుటను వర్ణించేపదునారవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
Mother Aditi, grieving the exile of her devatā sons, sought guidance from her husband, Sage Kaśyapa. Kaśyapa instructed her to observe the sacred Payo-vrata vow—a twelve-day ritual of consuming only milk, maintaining complete purity, and worshiping Bhagavān Vāsudeva with unalloyed devotion during the bright fortnight of the month of Phālguna. Aditi executed this rigorous vow with total surrender, prompting Bhagavān Vishṇu to manifest before her in His four-armed form.