12 - సముద్ర మథనము - శివుడు మోహినిని చూచి మోహపడుట

శ్రీబాదరాయణిరువాచ

 వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్

 మోహయిత్వా సురగణాన్ హరిస్సోమమపాయయత్

 వృషమారుహ్య గిరిశస్సర్వభూతగణైర్వృతః

 సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రా స్తే మధుసూదనః

బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుకమహర్షి ఇట్లు పలికెను --- మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరి యువతి రూపముతో రాక్షసులను మోహింపజేసి దేవగణములకు అమృతమును త్రాగించెననే విషయమును కైలాసవాసియగు శివుడు వినెను. అపుడా వృషభధ్వజుడు పార్వతీదేవితో వృషభమునధిష్టించి శ్రీహరి ఉన్న చోటికి వెళ్లాను. సకలభూతగణ ములు ఆ శివుని చుట్టువారి ముందుకు నడిచిరి.

సభాజితో భగవతా సాదరం సోమయా భవః

 సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిమ్

శ్రీహరి భగవానుడు పార్వతితో గూడియున్న ఆ శివుని సాదర ముగా సత్కరించేను. ఆయన కూడ శ్రీహరిని తిరిగి పూజించి సుఖముగా కూర్చుండి చిరునవ్వుతో ఇట్లు పలికెను.

శ్రీమహాదేవ ఉవాచ

 దేవదేవ జగద్వ్యా పిన్ జగదీశ జగన్మయ

సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః

శ్రీమహాదేవుడు ఇట్లు పలికెను --- ఓ దేవదేవా! నీవే జగద్రూప ముగా ప్రకటమై జగత్తునంతనూ వ్యాపించి జగత్తును పాలించుచున్నావు. సకలపదార్థముల స్వరూపము, కారణము నీవే. సర్వమును శాసించువా డవు నీవే.

ఆద్యంతావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః

యతోఽవ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్

            ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు ఆ పరబ్రహ్మనుండియే కలు గుచున్ననూ, అవి అవినాశియగు ఆ పరబ్రహ్మయందు లేవు. ఆ పరబ్ర హ్మయే దృక్-దృశ్యములుగా, భోక్తృ-భోగ్యములుగా ప్రకటమగుచున్నది. శ్రుతిప్రసిద్ధమైన అఖండమగు సత్, ఏకరసమగు చిత్ అయిన ఆ పర బ్రహ్మ నీవే.

తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః

 విసృజ్యోభయతస్సంగం మునయస్సముపాసతే  

కోరికలను విడచి మోక్షమును మాత్రమే కోరే మహర్షులు ఇహపర ములయందలి ఆసక్తిని విడిచి పెట్టి, నీ పాదపద్మమును మాత్రమే ఉపాసిం చెదరు.

త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోక

మానందమాత్రమవికారమనన్యదన్యత్

విశ్వస్య హేతురుదయస్థితిసంయమానా

మాత్మేశ్వరశ్చ తద పేక్షతయాఽన పేక్షః

  పూర్ణము, అవినాశి, నిర్గుణము, ఆనందఘనము, అవికారి అగు పరబ్రహ్మ నీవే. నీయందు శోకము లేశమైననూ లేదు. నీకంటే భిన్నముగా రెండవది లేదు. కాని నీవు సర్వము కంటే విలక్షణుడవు. జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. సర్వమునకు ఆత్మ నీవే. జగత్తునకు కర్మఫలదాతయగు నాథుని అపేక్ష గలదు. అట్టి జగన్నాథుడవు నీవే. కాని, నీకు జగత్తుయొక్క అపేక్ష లేదు.

ఏకస్త్వమేవ సదసద్ద్వయమద్వయం చ

స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః

 అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో

యస్మాద్గుణైర్వ్యతికరో నిరుపాధికస్య

 స్థూలసూక్ష్మములు, కార్యకారణములు కూడ నీవు ఒక్కడివే. బంగారమును ఆభరణముగా చేసినా, చేయకున్నా అది కేవలము బంగా రము మాత్రమే. అదే విధముగా, ఈ జగత్తులో కనబడే భేదము యథార్థత త్వమగు నీయందు లేదు. జనులు అజ్ఞానముచే నీయందు భేదమును ఆరోపించుచున్నారు. ఎందుకంటే, నీకు వాస్తవముగా ఉపాధి (తన ధర్మ ములను తనకు సమీపమునందున్నదానియందు ప్రసరింపజేసినదా యన్నట్లు ఉండేది) తోడి సంబంధము లేదు. అయిననూ, సత్త్వరజస్తమోగు ణములయందు నీవు ప్రతిఫలించి వికల్పములు భాసించుచున్నవి.

త్వాం బ్రహ్మ కేచిదవయంత్యుత ధర్మమేకే

ఏకే పరం సదసతోః పురుషం పరేశమ్

 అన్యేఽవయంతి నవశక్తియుతం పరం త్వాం

కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రమ్

కొందరు (వేదాంతులు) నీవే పరబ్రహ్మవనియు, కొందరు (మీమాంసకులు) నీవు ధర్మస్వరూపుడవనియు, కొందరు (సేశ్వర సాంఖ్యులు) నీవు ప్రకృతిపురుషులకు అతీతుడవైన పరమేశ్వరుడవనియు, కొందరు (పాంచరాత్రులు) నీవు తొమ్మిది (విమల - అసంగత, ఉత్కర్షిణి - ఉత్కర్ష గలది, జ్ఞాన, క్రియ, యోగ - గుణముల కలయిక, ప్రహ్వి -

యము, సత్య, ఈశాన, అనుగ్రహ) శక్తులతో కూడియున్న పరమేశ్వరుడవ నియు, మరికొందరు (పాతంజలులు) నీవు వినాశము లేని స్వతంత్రుడవైన మహాపురుషుడవనియు తెలియుచున్నారు.

నాహం పరాయురృషయో న మరీచిముఖ్యా

జానుతి యద్విరచితం ఖలు సత్త్వసర్గాః

 యన్మాయయా ముషితచేతస ఈశ దైత్య

మర్త్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః

ఓ ఈశ్వరా! నేను గాని, రెండు పరార్దముల ఆయుర్దాయము గల బ్రహ్మగారు గాని, సత్త్వగుణప్రధానమగు సృష్టిలో భాగమైన మరీచి మొద లగు మహర్షులు గాని నీ సృష్టియొక్క రహస్యమును తెలియకున్నారు. అట్టిచో, నీ మాయచే అపహరించబడిన వివేకజ్ఞానము గలవారై, సర్వకాల ములలో అమంగళమైన రాజస తామస ప్రవృత్తులు గల రాక్షసులు, మాన వులు మొదలగువారు తెలియజాలరని వేరుగా చెప్పవలయునా?

స త్వం సమీహితమదః స్థితిజన్మనాశం

 భూతేహితం చ జగతో భవబంధమోక్షౌ

 వాయుర్యథా విశతి ఖం చ చరాచరాఖ్యం

సర్వం తదాత్మకతయావగమోఽవరుంత్సే

జ్ఞానస్వరూపుడవైన అట్టి నీవు నీచే రచించబడిన ఈ జగత్తును, దాని సృష్టిస్థితిలయములను, ప్రాణుల కర్మలను, వాటికీ జననమరణరూప మగు బంధమును, దానినుండి విముక్తిని కూడ తెలియుదువు. వాయువు ఆకాశమును వ్యాపించినట్లుగా, నీవు చరాచరమగు జగత్తునంతనూ ఆత్మ రూపముగా వ్యాపించి యున్నావు.

అవతారా మయా దృష్టా రమమాణస్య తే గుణైః

 సోऽహం తర్ద్రష్టుమిచ్ఛామి యత్తే యోషిద్వపుర్ధృతమ్  

నీవు సత్త్వరజస్తమోగుణములను ఉపాధిగా చేసుకొని అవతరించి రమించెదవు. అట్టి నీ అవతారములను నేను చూచితిని. నీవు దాల్చిన స్త్రీరూపమును కూడ నేను చూడగోరుచున్నాను.

యేన సమ్మోహితా దైత్యాః పాయితాశ్చామృతం సురాః

 తద్దిదృక్షవ ఆయాతాః పరం కౌతూహలం హి నః

నీవు స్త్రీరూపమును దాల్చి రాక్షసులను మోహింప జేసి, దేవత లకు అమృతమును త్రాగించితివి. ఆ రూపమును చూడగోరి మేము వచ్చి నాము. ఆ రూపమును చూడాలని మాకు చాల కుతూహలము గలదు.

శ్రీశుక ఉవాచ

 ఏవమభ్యర్థితో విష్ణుర్భగవాన్ శూలపాణినా

 ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శూలధారియగు శివుడు ప్రార్థించగా, విష్ణు భగవానుడు గంభీరమగు (ఇతరులు తెలియజా లని) భావముతో నవ్వి, ఆ కైలాసవాసికి ఇట్లు బదులిచ్చెను.

శ్రీభగవానువాచ

 కౌతూహలాయ దైత్యానాం యోషీద్వేషో మయా కృతః

 పశ్యతా సురకార్యాణి గతే పీయూషభాజనే

శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- దేవకార్యములను చక్కబెట్టే నేను అమృతకలశము చేయి జారిపోయినప్పుడు రాక్షసులకు మోహ మును కలిగించుటకై స్త్రీరూపమును దాల్చితిని.

తత్తేऽహం దర్శయిష్యామి దిదృక్షోస్సురసత్తమ

 కామినాం బహు మంతవ్యం సంకల్పప్రభవోదయమ్  

ఓ దేవశ్రేష్ఠా! సంకల్పమునుండి కామము ఉదయించును. కామ మును ఉద్దీపింప జేసే అట్టి ఆ రూపమును కాముకులు చాల సమ్మానించే దరు. దానిని చూడగోరే నీకు ఆ రూపమును నేను చూపించెదను.

శ్రీశుక ఉవాచ

ఇతి బ్రువాణీ భగవాంస్తత్రైవాంతరధీయత

 సర్వతశ్చారయంశ్చక్షుర్భవ ఆస్తే సహోమయా

              శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా పలుకుతూనే శ్రీహరి భగవానుడు అచ్చటనే అంతర్ధానమాయెను. శివుడు పార్వతితో గూడి అన్ని వైపులా చూచుచుండెను.

 తతో దదర్శోపవనే వరస్త్రీయం విచిత్రపుష్పారుణపల్లవద్రుమే

 విక్రీడతీం కందుకలీలయా లసద్దుకూలపర్యస్తనితంబమేఖలామ్

తరువాత శివుడు అచటి ఉద్యానవనమునందు ఒక గొప్ప యువ తిని చూచెను. ఆ ఉద్యానములో చెట్లయందు రంగు రంగుల పువ్వులు, ఎర్రని చిగుళ్లు ఉండెను. ఆ యువతి విలాసగా బంతితో ఆడుచుండెను. ఆమె కటిభాగము పై ప్రకాశించే చీరను దాల్చి వడ్డాణమును పెట్టుకొనెను.

 ఆవర్తనోద్వర్తనకంపితస్తనప్రకృష్టహారోరుభరైః పదే పదే,

ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్పదప్రవాలం నయతీం తతస్తతః

ఆమె బంతిని వంగి తీసుకొని ఎగిరి పట్టుకొనేటప్పుడు కంపించే స్తనముల మరియు గొప్ప హారముల పెను భారముచే ఆమె నడుము ప్రతి అడుగునందు విరిగిపోవుచున్నదా యన్నట్లు ఉండెను. ఆమె చిగుళ్లవలె కోమలములైన పాదములతో ఇటునటు నడచుచుండెను.

దీక్షు భ్రమత్కందుకచాపలైర్బృశం

ప్రోద్విగ్నతారాయతలోలలోచనామ్

 స్వకర్ణవిభ్రాజితకుండలోల్లసత్

కపోలనీలాలకమండితాననామ్

దిక్కులయందు బంతి ఎగురుచుండగా దానికేసే చూచుచుండు టచే ఆమె కనుగ్రుడ్లు మిక్కిలి ఉద్వేగమును పొందుచుండెను. చంచల మైన ఆమె కన్నులు విశాలముగ నుండెను. ఆమె చెవులయందలి కుండల ముల కాంతులు బడి చెక్కిళ్లు మెరయుచుండెను. ఆమె ముఖమునకు నల్లని ముంగురులే అలంకారమాయెను.

శ్లథద్దుకూలం కబరీం చ విచ్యుతాం 

సన్నహ్యతీం వామకరేణ వల్గునా

వినిఘ్నతీమన్యకరేణ కందుకం

విమోహయంతీం జగదాత్మమాయయా

ఆమె తన అందమైన ఎడమ చేతితో జారిపోవుచున్న కోకముడిని, విడిపోవుచున్న జుట్టు ముడిని మరల ముడి వేయుచుండెను. మరియొక చేతితో ఆమె బంతిని కొట్టుతూ, తన చమత్కారముచే జగత్తునకు అధిక మగు వ్యామోహమును కలిగించుచుండెను.

తాం వీక్ష్య దేవ ఇతి కందుకలీలయేషద్

వ్రీడాఽస్ఫుటస్మితవిసృష్టకటాక్షముష్టః

స్త్రీ ప్రేక్షణప్రతిసమీక్షణవిహ్వలాత్మా

నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద

ఆమెను చూచి శివుడు తనకు సమీపమునందు పార్వతి, తన గణ ములు ఉన్నారనే సంగతినే విస్మరించెను. ఈ విధముగా ఆ యువతి బంతి ఆట ఆడుతూ కొద్దిగా సిగ్గుపడి అస్పష్టమైన చిరునవ్వుతో శివునిపై ఒక కడ గంటి చూపును విసరగా, ఆయన ఆ చూపునకు మోసపోయెను. ఆయన ఆమెను చూడగా తిరిగి ఆమె ఆయనకేసి చూచుటచే, ఆయన మనస్సు కలవరపడెను.

తస్యాః కరాగ్రాత్స తు కందుకో యదా

గతో విదూరం తమనువ్రజత్స్త్రీయాః

వాసస్ససూత్రం లఘు మారుతోఽహరద్

 భవస్య దేవస్య కిలానుపశ్యతః

ఆమె చేతినుండి జారిన ఆ బంతి కొంత దూరము పోగా, ఆమె దానిని వెన్నంటి వెళ్లుచుండెను. ఆమెను శివదేవుడు నిరంతరముగా చూచుచుండెను. ఇంతలో గాలికి ఆమె నాజూకైన చీర, మొలనూలుతో సహా ప్రక్కకు తొలగెను.

ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమామ్

 దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విషజ్జంత్యాం భవః కిల

ఈ విధముగా అందమైన కడగంటి చూపులతో మనస్సును రంజిం పజేసే ఆ సుందరిని శివుడు చూచెను. ఆమె కూడ ఆయన వైపు వక్రముగా చూచెను. అపుడు ఆయన ఆమెపై మనసు పడేనట.

తయాऽపృహతవిజ్ఞానస్తత్కృతస్మరవిహ్వలః

భవాన్యా అపి పశ్యంత్యా గతహీస్తత్పదం యయౌ

ఆమె శివుని వివేకమును హరించివేసెను. ఆమెను చూచుటచే శివునియందు కామోద్రేకము కలిగి ఆయన స్వాధీనతను, లజ్జను కూడ కోల్పోయెను. పార్వతీ దేవి చూచుచుండగనే, ఆయన ఆమెను లెక్క చేయకుండా ఆ యువతి ఉన్న చోటకు వెళ్లాను.

సా తమాయాంతమాలోక్య వివస్త్రా వ్రీడితా భృశమ్

  నిలీయమానా వృక్షేషు హసంతీ నాన్వతిష్ఠత  

కొద్దిగా తొలగిన వస్త్రము గల ఆ యువతి తన వద్దకు శివుడు వచ్చుచుండుటను చూచి చాల సిగ్గుపడి నవ్వుతూ చెట్లమధ్యలో దాగు కుంటూ ఒకచోట స్థిరముగా నిలబడలేదు.

తామన్వగచ్చద్భగవాన్ భవః ప్రముషితేంద్రియః

కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః

ఆమె శివ భగవానుని మనస్సును దోచివేయగా, ఆయన మన్మథు నకు వశుడాయెను. గజేంద్రుడు ఆడు ఏనుగును వలె, ఆయన ఆమెను అనుసరించి వెళ్లాను.

సోऽనువ్రజ్యాతివేగేన గృహీత్వానిచ్చతీం స్త్రియమ్

కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే

ఆయన అధికమగు వేగముతో ఆమెను వెంబడించెను. ఆమె ఇష్ట పడకున్ననూ, ఆయన ఆమె జుట్టుముడిని పట్టుకొని దగ్గరగా తీసుకొని రెండు చేతులతో కౌగిలించుకొనెను.

సోపగూఢా భగవతా కరిణా కరిణీ యథా

 ఇతస్తతః ప్రసర్పంతీ విప్రకీర్ణశిరోరుహా

శివ భగవానుడు గజేంద్రుడు ఆడు ఏనుగును వలే ఆమెను కౌగి లించుకొనెను. అపుడామె ఇటునటు గుంజుకొనగా, ఆమె జుట్టు చెల్లాచెద రాయేను.

ఆత్మానం మోచయిత్వాఽoగ సురర్షభభుజాంతరాత్

 ప్రాద్రవత్సా పృథుశ్రోణీ మాయా దేవవినిర్మితా

ఓ మహారాజా! శ్రీహరిచే నిర్మించబడిన మాయయైన ఆ సుందరి దేవశ్రేష్ఠుడగు శివుని భుజముల మధ్యనుండి తనను విడిపించుకొని వేగ ముగా పారిపోయేను.

తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్బుతకర్మణః

 ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః

ఈ రుద్రుడు మోహినీరూపములోనున్న ఆ విష్ణువు వెళ్లిన మార్గ ములో వెనుక పరుగెత్తెను. విష్ణువు యొక్క లీలలు అచ్చెరువును గొల్పు ను. ఆ సమయములో రుద్రుని ఆయన శత్రువగు మన్మథుడు జయించి నాడా యన్నట్లుండెను.

తస్యానుధావతో రేతశ్చస్కందామోఘరేతసః

శుష్మిణో యూథప స్యేవ వాసితామను ధావతః

ఆడు ఏనుగు వెనుక మదించిన గజేంద్రుడు వలె ఆ రుద్రుడు మోహిని వెంట పరుగెత్తుచుండగా, అమోఘమగు ఆయన బీజము స్కన్న మాయెను.

యత్ర యత్రాపతన్మహ్యాం రేతస్తస్య మహాత్మనః

 తాని రూప్యస్య హేమ్నశ్చ క్షేత్రాణ్యాసన్మహీపతే

ఓ మహారాజా! మహాత్ముడగు ఆ రుద్రుని బీజము భూమిపై పడిన చోటల్లా వెండి బంగారముల గనులు తయారైనవి.

సంత్సరస్సు శైలేషు వనేషూపవనేషు చ

యత్ర క్వ చాసన్నృషయస్తత్ర సంనిహితో హరః

నదులు, సరస్సులు, పర్వతములు, అడవులు, ఉద్యానవనములు ఇత్యాదిగా ఎక్కడెక్కడైతే మహర్షులు ఉండిరో, రుద్రుడు ఆ స్థానముల న్నింటియందు తన సన్నిధిని అనుగ్రహించెను.

స్కన్నే రేతసి సోఽపశ్యదాత్మానం దేవమాయయా

జడీకృతం నృపశ్రేష్ఠ సంన్యవర్తిత కశ్మలాత్

ఓ మహారాజా! బీజము సన్నము కాగానే రుద్రుడు తాను విష్ణు మాయచే జడుడనైతినని తెలుసుకొనెను. వెంటనే ఆయన ఆ వ్యామోహ మునుండి నివృత్తుడాయెను.

అథావగతమాహాత్మ్య ఆత్మనో జగదాత్మనః

అపరిజ్ఞేయవీర్యస్య న మేనే తదు హాద్భుతమ్

తరువాత రుద్రుడు జగత్తునకు ఆత్మరూపుడైన శ్రీహరియొక్క మహిమను గుర్తించేను. శ్రీహరి శక్తి తెలియ శక్యము కానిది. అపుడాయన తాను జడుడగుట ఆశ్చర్యము కాదనియే భావించెను.

తమవిక్లబమన్రీడమాలక్ష్య మధుసూదనః

 ఉవాచ పరమప్రీతో బిభ్రత్వాం పౌరుషీం తనుమ్  

మధువు అనే రాక్షసుని (భోగాసక్తిని సంహరించిన శ్రీహరి తన పురుషరూపమును దాల్చెను. ఆయనకు రుద్రుడు విషాదము గాని, బిడి యము గాని లేకుండా కనబడెను. ఆయన చాల ప్రీతిని జెంది ఇట్లు పలికే ను.

శ్రీభగవానువాచ

దిష్ట్యా త్వం విబుధశ్రేష్ఠ స్వాం నిష్ఠామాత్మనా స్థితః

యన్మే స్త్రీరూపయా స్వైరం మోహితోఽప్యంగ మాయయా

శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- ఓ రుద్రా! నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. నేను స్వేచ్చ చే స్త్రీరూపములోనుండగా, నీవు నా మాయచే మోహితుడవైననూ, నీ అంతట నీవు నీ స్వరూపమునందు నిలిచియుం డుట చాల మంగళకరము.

కో ను మేఽతితరేన్మాయాం విషక్తస్త్వదృతే పుమాన్

 తాంస్తాన్విసృజతీం భావాన్ దుస్తరామకృతాత్మభిః

నా మాయ అనేకములగు విలాసలను, హావభావములను విశేష ముగా ప్రకటించును. దానిని చిత్తజయము లేనివారు తరించలేరు. అధిక ముగా భోగములయందు తగుల్కొన్న ఏ వ్యక్తి దానిని అధిగమించ గల్గును? కాని నీవు అధిగమించితివి.

సేయం గుణమయీ మాయా న త్వామభిభవిష్యతి

 మయా సమేతా కాలేన కాలరూపేణ భాగశః

సృష్టిస్థితిలయములకు నిమిత్తమైన కొలమును బట్టి కాలరూపుడ నగు నేను సత్త్వరజస్తమోగుణములనే అంశలుగా మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించేదను. ఆ ఈ మాయ నిన్ను మోహితుని చేయబోదు.

శ్రీశుక ఉవాచ

 ఏవం భగవతా రాజన్ శ్రీవత్సాంకేన సత్కృతః

ఆమంత్ర్య తం పరిక్రమ్య సగణస్స్వాలయం యమౌ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! లక్ష్మీదేవి వక్షః స్థలము పై పుట్టుమచ్చయై ఉండే శ్రీహరి భగవానుడు రుద్రుని సత్కరించే ను. ఆయన తన గణములతో కూడి శ్రీహరికి ప్రదక్షిణము చేసి, ఆయన వద్ద సెలవు తీసుకొని తన ధామమునకు వెళ్లాను.

ఆత్మాంశభూతాం తాం మాయాం భవానీం భగవాన్ భవః

శంసతామృషిముఖ్యానాం ప్రీత్యాఽఽచష్టాథ భారత  

భరతవంశీయుడవగు ఓ మహారాజా! తరువాత మహర్షులు స్తుతిం చుచుండగా, శివ భగవానుడు తన అర్ధాంగియగు పార్వతీదేవితో ఆ మాయను గురించి ప్రీతితో వర్ణించి చెప్పెను.

అపి వ్యవశ్యస్త్వమజస్య మాయాం

పరస్య పుంసః పరదేవతాయాః

 అహం కలానామృషభో విము హ్యే

యయాఽవశోఽన్యే కిముతాస్వతంత్రాః

పుట్టుక లేనివాడు, సర్వాతిశాయి ప్రకాశ స్వరూపుడు అగు పురు: షోత్తమునియొక్క మాయను నీవు చూచితివా? శ్రీహరి అంశలలో నేను. శ్రేష్టుడను. అయిననూ, నేనే ఆ మాయచే మోహమును పొందగా, ఇంద్రి యములకు బానిసలై యుండే ఇతరుల గురించి చెప్పున దేమున్నది?

యం మామపృచ్ఛస్త్వము పేత్య యోగాత్

సమాసహస్రాంత ఉపారతం వై

స ఏష సాక్షాత్పురుషః పురాణో

న యత్ర కాలో విశతే న వేదః

వేయి సంవత్సరముల తరువాత నేను ధ్యానమును విరమిం చినప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి, నీవు ధ్యానించేది ఎవరిని? అని ప్రశ్నిం చితివి. నేను ధ్యానించే కాలాతీతమైన ఆ పూర్ణ పరబ్రహ్మము సాక్షాత్తుగా ఈ శ్రీహరియే. శ్రీహరిని కాలము పరిచ్చేదము చేయలేదు. ఆయనను వేదములు వర్ణించలేవు.

శ్రీశుక ఉవాచ

 ఇతి తేఽభిహితస్తాత విక్రమశ్శార్ ఙ్గధన్వనః

 సింధోర్నిర్మథనే యేన ధృతః పృష్ఠే మహాచలః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ వత్సా! ఈ విధముగా శార్జము అనే ధనస్సు గల శ్రీహరియొక్క పరాక్రమమును నీకు వర్ణించి చెప్పితిని. ఆయన సముద్రమథనమునందు కూర్మరూపముతో పెద్ద పర్వ తమును తన వీపుపై మోసెను.

ఏతన్ముహుః కీర్తయతోఽనుశృణ్వతో 

న రిష్యతే జాతు సముద్యమః క్వచిత్

యదుత్తమశ్లోకగుణానువర్ణనం

సమస్తసంసారపరిశ్రమాపహమ్

 ఈ గాథను పలుమార్లు కీర్తించువాడు, ప్రవచనమును చెప్పగా వినువాడు ఎక్కడైననూ చేపట్టే మంచి ఉద్యమము ఏ కాలమునందైననూ నిష్పలము కాబోదు. ఎందుకంటే, పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గుణము లను శాస్త్రము బోధించిన విధముగా వర్ణించినచో, సంసారములోని సకల ములైన శ్రమలు దూరమగును.

అసదవిషయమంఘ్రిం భావగమ్యం ప్రపన్నాన్

అమృతమమరవర్యానాశయత్సింధుమథ్యమ్

కపటయువతివేషో మోహయన్ యస్సురారీన్

తమహముపసృతానాం కామపూరం నతోఽస్మి

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే సముద్రమథనవృ

 త్తాంతే మోహిన్యవతారవర్థనం నామ ద్వాదశోऽధ్యాయః

శ్రీహరి కపటముగా యువతి వేషమును ధరించి దేవశత్రువులగు రాక్షసులను మోహింప జేసి, శ్రేష్ఠులగు దేవతలకు సముద్రమథనము వలన పుట్టిన అమృతమును భుజింప జేసెను. ఎందుకంటే, దేవతలు ఆయన పాదమును శరణు వేడిరి. దుష్టులకు ఆయన పాదముల మహిమ తెలియదు. కేవలము భక్తిచే మాత్రమే ఆయన శరణు లభించును. ఆయన దగ్గరకు చేరిన భక్తులకు ఆయన కోరికలను ఈడేర్చును. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్రమథన వృత్తాంతములో మోహినీ అవతారమును వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది.