3 - గజేంద్రోపాఖ్యానము - గజేంద్రునకు విముక్తి లభించుట

శ్రీశుక ఉవాచ

ఏవం వ్యవసీతో బుద్ధ్యా సమాధాయ మనో హృది

జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితమ్

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా (భగవానుని శరణు వేడవలెనని నిశ్చయించుకున్న ఆ గజేంద్రుడు బుద్ది (నిశ్చయశక్తి) తో మనస్సును హృదయమునందు ఏకాగ్రము చేసి, సర్వోత్తమమైన స్తోత్ర మును జపించెను. అది ఆతడు పూర్వజన్మలో అభ్యసించిన స్తోత్రము.

గజేంద్ర ఉవాచ

ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్

పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి

గజేంద్రుడు ఇట్లు పలికెను --- ఓమ్. పూర్ణుడు, సర్వజగత్కార ణుడు, సర్వేశ్వరుడు అగు ఆ భగవానుని కొరకు నమస్కారము. చైతన్య పూర్ణమగు ఈ జగత్తు ఆయననుండియే ఆవిర్భవించినది. మేము ఆయ నను ధ్యానించెదము

యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్

యోస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువమ్

ఈ జగత్తు ఈశ్వరునినుండి ప్రకటమై, ఈశ్వరునియందే మనుగ డను సాగిస్తూ, ఈశ్వరునియందే విలీనమగును. ఈశ్వరుడే స్వయముగా ఈ జగత్తు రూపముగా నున్నాడు. కాని, ఈశ్వరుడు ఈ జగత్తునకు, దానికి ఉపాదానమగు మాయాశక్తికి అతీతుడు. అట్టి స్వయంసిద్దసద్రూపుడగు భగ వానుని శరణు వేడుచున్నాము.

యస్వాత్మనీదం నిజమాయయార్పితం

క్వచిద్విభాతం క్వ చ తత్తరోహితమ్

అవిద్ధదృక్సాక్ష్యుభయం తదీక్షతే

స ఆత్మమూలోకవతు మాం పరాత్పరః

            ఈ జగత్తు ఈశ్వరునిచే తనయందే తన మాయాశక్తిచే ఒకప్పుడు ప్రకటితమగును. మరియొకప్పుడు ఇది విలీనమై మాయాశక్తి రూపముగా నుండును. లుప్తము గాని దర్శనము గల (శుద్ధచైతన్యస్వరూపుడైన) ఈశ్వ రుడు ఈ కార్యకారణములు రెండింటికీ సాక్షియై యుండును. స్వయంసి దుడు, సర్వజగత్తునకు ఉపాదానమగు మాయాశక్తికి అతీతుడు అగు ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించు గాక!

కాలేన పంచత్వమితేషు కృత్స్నశో

లోకేషు పాలేషు చ సర్వ హేతుషు

తమస్తదాసీద్దహనం గభీరం

యస్తస్య పారేభివిరాజతే విభుః

             ప్రళయకాలము రాగానే లోకములు, లోకేశులు, సర్వమునకు కారణమగు మహదాది తత్త్వములు మాయాశక్తియందు పూర్తిగా విలీనమ గును. అప్పుడు ఆ మాయాశక్తి మిక్కిలి దట్టమైన అంతు పట్టని చీకటి (అ వ్యక్తము) రూపముగా నుండును. కాని, సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుడు దానికి అతీతుడై అధికముగా (స్వరూపముచేతనే) ప్రకాశించును.

న యస్య దేవా ఋషయః పదం విదుః

జంతుః పునః కోర్హతి గంతుమీరితుమ్

యథా నటస్యాకృతిభిర్విచేష్టతో

దురత్యయానుక్రమణస్స మావతు

పరమేశ్వరుని స్వరూపమును దేవతలు, మహర్షులు తెలియకు న్నారు. అట్టిచో, ప్రాకృత (అజ్ఞానియగు) జనుడు ఎవడు ఈశ్వరస్వరూప మును తెలియుటకు గాని, వర్ణించుటకు గాని సమర్థుడగును? (కాడు). వివి ధరూపములలో నటించే నటుని యథార్థతత్త్వమును జనులు తెలియలేరు గదా!తెలియ శక్యము కాని చరితము గల ఆ ఈశ్వరుడు నన్ను రక్షించు గాక!

దిదృక్షవో యస్య పదం సుమంగలం

విముక్తసంగా మునయస్సుసాధవః

చరంత్యలోకవ్రతమవ్రణం వనే

భూతాత్మభూతాస్సుహృదస్స మే గతిః

             పరమేశ్వరుని స్వరూపము పరమ మంగళము. దానిని సాక్షాత్క రించుకొనగోరే మహర్షులు సంసారాసక్తిని విడిచిపెట్టి, గొప్ప సదాచార మును పాలించువారై, సర్వప్రాణులను ఆత్మరూపముగా దర్శిస్తూ, దయా భువులై అడవిలో నిరంతరముగా అలౌకికమగు బ్రహ్మచర్యాది వ్రతము లను అనుష్ఠించెదరు. ఆ పరమేశ్వరుడే నాకు గతి.

న విద్యతే యస్య చ జన్మ కర్మ వా

న నామరూపే గుణదోష ఏవ వా

తథాపి లోకాప్యయసంభవాయ యః

స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి

            ఈశ్వరునకు జన్మ, కర్మ, నామము, రూపము, గుణము, దోషము. అనేవి ఉండవు. అయిననూ, ఆయన లోకముల ఉత్పత్తి ప్రళయముల కొరకై తన మాయాశక్తిచే వాటిని ఆయా కాలములలో స్వీకరించును.

తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే

అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే

             దేశకాలములకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవముగా రూప ములు-లేనివాడే అయిననూ, బహురూపములు (జగత్తు) గా ప్రకటమైనా డు. అనంతశక్తిమంతుడగు ఆయన చేసే లీలలు అద్భుతములు. ఆయనకు అనేక నమస్కారములు

నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే

నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి

             స్వయంప్రకాశస్వరూపుడైన ఈశ్వరుడు సకలప్రాణులలో అంతర తమమగు ఆత్మరూపుడై సర్వమునకు సాక్షియై ఉన్నాడు. అట్టి ఈశ్వరుని స్వరూపము వాక్కులకు గాని, మనస్సునకు గాని గోచరము కాదు. ఈశ్వ రుని మనోవృత్తులలో విషయము చేయుట సంభవము కాదు. అట్టి పరమే శ్వరునకు అనేక నమస్కారములు.

సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మేణ విపశ్చితా

నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే

వివేకియగు సాధకుడు సత్త్వగుణప్రధానుడై నివృత్తి ధర్మమును పాటించి, అకర్త-ఆత్మస్వరూపమును తెలుసుకొని పరమేశ్వరుని ఆత్మరూపముగా పొందును. మోక్షప్రదాతయగు భగవానుడే మోక్షానందము యొక్క అనుభవము రూపములో నున్నాడు. ఆయనకు నమస్కారము.

నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే

నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ

పరమేశ్వరుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు తన మాయా శక్తియందు ప్రకటమై సత్త్వగుణాధిక్యముచే శాంతుడుగను, రజోగుణాధిక్య ముచే ఘోరుడుగను, తమోగుణాధిక్యముచే మూడుడుగను భాసించిన నూ, ఆయనయొక్క ఏకరసమగు జ్ఞానస్వరూపమునందు భేదములు లేవు. సర్వమునందు సమానముగా సత్తాస్పూర్తుల రూపముగా ప్రకటమయ్యే ఆ పరమేశ్వరునకు అనేక నమస్కారములు.

క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే

పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః

సర్వాధీశ్వరుడగు పరమేశ్వరుడే దేహేంద్రియమనస్సంఘాతము లన్నింటియందు చైతన్యరూపుడై సాక్షిగా వెలుగుచున్నాడు. పూర్ణుడగు ఆ పరమేశ్వరుడు ప్రకృతి (మాయాశక్తి) కి అధిష్ఠానమై యున్నాడు. సర్వకారణుడగు ఈశ్వరునకు మరియొక కారణము లేదు. ఆయనకు అనేక నమ స్కారములు.

సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే

అసతా చ్చాయయోక్తాయ సదాభాసాయ తే నమః

             సకలప్రాణిదేహములలో ఆత్మచైతన్యరూపముగా ప్రతిఫలించే నీవు సకలేంద్రియములకు, వాటి విషయములైన శబ్ద-స్పర్శ-రూప-రస గంధములకు సాక్షివి అగుచున్నావు. మనస్సులో ఉదయించే సంకల్పములన్నింటికీ మూలములో ఆత్మరూపుడవగు నీవే ఉన్నావు. మిథ్యయైన ఈ జగత్తు, ఆత్మప్రతిబింబములైన ఈ దేహాదులు శుద్ధచైతన్యఘనుడవగు నిన్నే సూచించుచున్నవి. నీకు నమస్కారము.

నమో నమస్తేఃఖిలకారణాయ నిష్కారణయాద్భుతకారణాయ, సర్వాగమామ్నాయమహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ.

సర్వమునకు కారణమైన నీకు మరియొక కారణము లేదు. సర్వము నీనుండియే ఉద్భవించినా, సర్వము నీయందు వాస్తవముగా లేదు. నీవు అట్టి ఆశ్చర్యమును గొలిపే జగత్కారణుడవు. నదులు సముద్ర మునందువలె సకలములైన శాస్త్రములు, వేదములు నీయందే పర్యవసాన మును చెందుచున్నవి. మోక్షస్వరూపుడవగు నీవే సాధకులు పొందే సర్వో త్తమమైన గతివి. నీకు అనేక నమస్కారములు.

గుణారణిచ్చన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్పూర్జితమానసాయ

నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయంప్రకాశాయ నమస్కరోమి

నిప్పును అరణి (మథించే కొయ్య) దాచి పెట్టినట్లుగా సత్త్వరజస్త మోగుణముల కార్యమగు దేహాదీకము జ్ఞానఘనమగు ఆత్మను కప్పివే యును. సృష్ట్యాదిలో ఆ గుణములయందు క్షోభను కలిగించి తద్ద్వారా జగ ద్రూపముగా ప్రకటము కావాలనే సంకల్పము భగవానునియందు కలిగెను. సకలకర్మల సంశ్లేషము లేని ఆత్మతత్త్వమునందు పరినిష్టితులై విధిని షేధ ముల పరిధిని దాటివేసిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మరూపు డుగా సాక్షాత్కరించును. ఆయనకు నేను నమస్కరించుచున్నాను,

మాదృక్ప్రపన్నపశుపాశవిమోక్షణాయ

ముక్తాయ భూరికరుణాయ నమోలయాయ

స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత -

ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే

ఓ దేవా! నీవు నిత్యముక్తుడవు. అతిశయించిన దయ గల నీవు నావంటి శరణు వేడిన అజ్ఞానుల సంసారబంధమును విడిపించెదవు. వినాశ రహితుడవు, అంతర్యామివి అగు నీవు దేహధారులందరి అంతఃకరణముల యందు అనుభవమునకు వచ్చే అంతరతమమగు చైతన్యము రూపముగా ప్రకటమగుచున్నావు. పూర్ణమగు ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు అనే ఆరు ఐశ్వర్యములు గల నీవు దేశకాలవస్తుప రిచ్ఛేదములకు అతీతుడవు. నీకు అనేక నమస్కారములు.

ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తైః

దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ

ముక్తాత్మభిస్స్వహృదయే పరిభావితాయ

జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ

             దేహము, సంతానము, ఇంటిలోని పెద్దలు, ఇల్లు, సంపదలు, బంధుజనులు అనువాటియందు తగుల్కొన్నవారలు ఈశ్వరుని పొందలే రు. ఆయనకు మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణములతో సంగము (నేను-నాది అనే తాదాత్మ్యము) లేదు. జీవన్ముక్తులు షడైశ్వర్యసంపన్ను డగు ఆ ఈశ్వరుని నిరంతరముగా తమ హృదయములో భావన చేసెదరు. ఏకరసమగు జ్ఞానమే స్వరూపముగా గల ఆ ఈశ్వరుని కొరకు నమస్కార ము.

యం ధర్మకామార్థవిముక్తికామా

భజంత ఇష్టాం గతిమాప్నువంతి

కిం త్వాశిషో రాత్యపీ దేహమవ్యయం

కరోతుమ్వేదభ్రదయో ఏమోక్షణమ్

ధర్మార్థకామములను కోరి ఈశ్వరుని భజించువారలకు ఆయన వారు కోరిన ఫలమును మాత్రమే గాక, వారి ఇతరములగు కామనలను మరియు కల్పాంతము వరకు నశించని దేవతాదేహమును కూడ ఇచ్చును. దయానిధియగు ఆ ఈశ్వరుడు నాకు విముక్తిని కలిగించు గాక!

ఏకాంతినో యస్య న కంచనార్థం

వాంఛంతి యే వై భగవతపన్నాః

అత్యద్బుతం తచ్చరితం సుమంగలం

గాయంత ఆనందసముద్రమగ్నాః

భగవానుని శరణు జొచ్చిన ఏకాంతభక్తులు ఏ ఫలమునైననూ కోరరు. వారు మంగళములకు నిధానమై అచ్చెరువును గోల్పే భగవానుని లీలలను గానము చేస్తూ ఆనందసముద్రములో ఓలలాడెదరు.

తమక్షరం బ్రహ్మ పరం పరేశమవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యమ్,

అతీంద్రియం సూక్ష్మమివాతిదూరమనంతమాద్యం పరిపూర్ణమీడే

అవినాశియగు పరబ్రహ్మ మాయాశక్తిని తన వశములోనుంచుకొని యుండును. ఇంద్రియములకు, వాక్కునకు, మనస్సునకు కూడ గోచరము కాని ఆ పరబ్రహ్మ అంతర్ముఖులైన సాధకులచే ఆత్మరూపముగా పొందబ డును. కాలమునకు అతీతమగు పరబ్రహ్మ ఆకాశము కంటే సూక్ష్మమగుటచే ఆత్మరూపమై యున్ననూ చాల దూరమునందున్నదా యన్నట్లున్నది. సర్వమునకు కారణము, పరిపూర్ణము అగు ఆ పరబ్రహ్మను నేను స్తుతించు చున్నాను.

యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః

నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతాః

బ్రహ్మగారు మొదలైన దేవతలు, వేదములు, లోకములు, స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతా కేవలము నామరూపముల భేదము మాత్రమే. ఇది అంతా భగవానుని ఒక అల్పమైన అంశచే మాత్రమే నిర్మితమైనది (అంశయే ఈ సర్వము రూపముగా ప్రకటమైనది).

యథార్చిపోగ్నేస్స్సవితుర్గభస్తయో

నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిషః

తథా యతోయం గుణసంప్రవాహో

బుద్ధిర్మనః ఖాని శరీరసర్గాః

మిణుగురులు అగ్నినుండీ, కిరణములు సూర్యునినుండి మరల మరల పుట్టి విలీనమగుచుండును. అదే విధముగా, సత్త్వరజస్తమోగుణ ముల చక్కని ప్రవాహమగు ఈ సృష్టి స్వయంప్రకాశ స్వరూపుడగు ఆ ఈశ్వరునినుండియే మరల మరల పుట్టి, ఆయనయందే విలీనమగుచున్న ది. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహముల వివిధ సంఘాతములు ఆ మూడు గుణముల పరిణామములే.

స వై న దేవాసురమర్త్యతిర్యజ్

న స్త్రీ న షండో న పుమాన్న జంతుః

నాయం గుణః కర్మ న సన్న చాసత్

నిషేధశేషో జయతాద శేషః

 ఈశ్వరుడనగా దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, పశువు గానీ, పక్షి గాని, ఆడుది గాని, మగవాడు గాని, నపుంసకుడు గాని, సత్త్వరజస్తమోగుణములలో ఒక గుణము గాని, క్రియ గాని, కార్యము గాని, కోరణము గాని కాడు. ఈశ్వరుడు ఒకానొక ప్రాణిమాత్రము కాడు. సర్వ మును నిషేధించగా మిగిలేది, సర్వమును తనయందు కలిగియున్నది అగు (చైతన్య) తత్త్వమే ఈశ్వరుడు. అట్టి ఈశ్వరుడు ప్రకటమగు గాక!

 జిజీవిషే నాహమిహాముయా కిమంతర్బహిశ్చావృతయేభయోన్యా

ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షమ్

నేను జీవించాలని కోరుట లేదు. లోపల, బయట వివేకము లేని ఈ ఏనుగు జన్మతో ఈ లోకములో ప్రయోజనమేమి గలదు? ఆత్మప్రకాశ మును కప్పివేసే అజ్ఞానముయొక్క నివృత్తి (మోక్షము) ని నేను కోరుచు న్నాను. ఆ అజ్ఞానము కాలక్రమంలో తనంత తానుగా తొలగిపోయేది. కాదు. మోక్షము కూడ కాలక్రమములో నష్టమయ్యేది కాదు.

సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసమ్

విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదమ్

అట్టి నేను జీవునకు సర్వోత్తమ లక్ష్య మైన ఈశ్వరుని నమస్కరిం చుచున్నాను. జగద్రూపముగా ప్రకటమై ఆ విధముగా జగత్తును సృష్టించిన ఈశ్వరుడు జగత్తుకంటే విలక్షణుడుగనే యున్నాడు. పుట్టుక లేని ఈశ్వరు నకు జగత్తే సంపద, లీలాక్షేత్రము. జగత్తుయొక్క ఆత్మ (సత్తాస్ఫూర్తులు) ఈశ్వరుడే.

యోగరంధితకర్మాణో హృది యోగవిభావితే

యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహమ్

             ఆత్మజ్ఞానము అనే యోగము (ఈశ్వరునితో జీవుని కలిపేది) చే భస్మము చేయబడిన కర్మలు గల జీవన్ముక్తులు యోగముచే పరిశుద్దమైన తమ అంతఃకరణమునందు ఆ యోగేశ్వరుని ఆత్మరూపముగా సాక్షాత్క రించు కొనెదరు. నేను అట్టి ఈశ్వరుని నమస్కరించుచున్నాను.

నమో నమస్తుభ్యమసహ్యవేగశక్తిత్రయాయాఖిలధీగుణాయ,

ప్రపన్నపాలాయ దురంతశక్తయే కదింద్రియాణానవాప్యవర్త్మనే

ఓ దేవా! సత్త్వరజస్తమోగుణములనే నీ శక్తుల వేగమును సహీం చుట కష్టము. సకలమనోవృత్తులకు మూలమగు ఆత్మవు నీవే. సర్వేంద్రి యములకు విషయములగు శబ్దాదుల రూపములోనుండే జగత్తు కూడ నీవే. శరణు జొచ్చినవారిని రక్షించే నీ దారిలోనికి కుత్సితమగు (భోగపరా యణములగు) ఇంద్రియములు గలవారు చేరుకొనలేరు. నీకు అనేక నమ స్కారములు.

నాయం వేద స్వమాత్మానం యచ్చక్త్యాహంధియా హతమ్

తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహమ్

భగవంతుని మాయాశక్తియే అవిద్యయై వివేకమును కప్పివేయు టచే వ్యక్తి దేహాదులయందు నేను-అనే బుద్ధిని కలిగి తన చైతన్యస్వరూప మును తెలియకున్నాడు. భగవానుని మహిమను అంచనా వేయుట సంభ వము కాదు. అట్టి భగవానుని నేను శరణు వేడుచున్నాను.

శ్రీశుక ఉవాచ

ఏవం గజేంద్రముపవర్జితనిర్విశేషం

బ్రహ్మాదయో వివిధలింగభద్వాభిమానాః

నైతే యదోపసృపుర్నిఖిలాత్మకత్వాత్

తత్రాభిలామరమయో హరిరావిరాసీత్

ఈ విధముగా గజేంద్రుడు భేదరహితమగు పరబ్రహ్మను వర్ణించేను. బ్రహ్మగారు మొదలగు దేవతలకు తమ తమ చిహ్నములు మరియు మూర్తుల భేదమునందు, ఇది నేను అనే అభిమానము గలదు. కావుననే, పొరు గజేంద్రుని వద్దకు వెళ్లలేదు. కొని, సర్వమునకు ఆత్మరూపుడు మరియు సకలదేవతాస్వరూపుడు అగు శ్రీహరి (నిర్విశేష స్వరూపుడగుటచే) అప్పుడు అచట ఆవిర్భవించెను.

తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః

స్తోత్రం నిశమ్య దివిజైస్సహ సంస్తువద్భిః

ఛందోమయేన గరుడేన సముహ్యమానః

చక్రాయుధోభ్యగమదాశు యతో గజేంద్రః

             జగత్తునకు అధిష్టానమైన శ్రీహరికి గజేంద్రుడు ఆ విధముగా పీడించబడుట తెలిసెను. గజేంద్రుని స్తోత్రమును కూడ ఆయన వినెను. ఆయన వెంటనే చక్రమనే ఆయుధమును ధరించి, వేదరూపుడగు గరుడుడే వాహనము కాగా, గజేంద్రుడు ఉన్న చోటకు చేరుకొనెను. దేవతలు చక్కగా స్తోత్రములను చేయుచూ ఆయన వెంట వచ్చిరి.

 సోంతస్సరస్యురుబలేన గృహీత ఆర్తో

దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్

ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛ్రా-

న్నారాయణాఖిలగురో భగవన్నమస్తే

సరస్సు లోపల గొప్ప బలము గల మొసలిచే పట్టుకొనబడి పీడను పొందియున్న ఆ గజేంద్రుడు ఆకాశములో గరుత్మంతునిపై చక్రమును పట్టుకొనియున్న శ్రీహరిని చూచెను. ఆతడు తన తొండముతో పద్మమును పైకెత్తి అతికష్టము మీద ఈ మాటను పలికెను -- ఓ నారాయణా! నీవు జగత్తునకంతకు తండ్రివి. భగవానుడా! నీకు నమస్కారము.

తం వీక్ష్య పీడితమజస్సహసాన్వతీర్య

సగ్రాహమాశు సరసః కృపయోజ్జహార

గ్రాహాద్విపాటితముఖాదరిణా గజేంద్రం

సంపశ్యతాం హరిరమూముచదుప్రియాణామ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే

గజేంద్రోపాఖ్యానే గజేంద్రమోక్ష నామ తృతీయోధ్యాయః

పుట్టుక లేని శ్రీహరి పీడను పొందియున్న ఆ గజేంద్రుని చూచి దయతో వేగముగా క్రిందకు దిగి వెంటనే మొసలితో సహా గజేంద్రుని నీటి నుండి పైకి లాగి, చక్రముతో మొసలి నోటిని చీల్చివేసి, గజేంద్రుని దాని పట్టునుండి విడిపించెను. ఈ దృశ్యమును దేవతలు చక్కగా తిలకించిరి.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో గజేంద్రోపాఖ్యానములో గజేంద్రునకు విముక్తి లభించుటను వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3) .