14 - మనువుల పాలనను వర్ణించుట

రాజోవాచ

మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్త్విమే

యస్మిన్ కర్మణి యే యేన నియుక్తాస్తద్వదస్వ మే  

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- పూజనీయుడవగు ఓ మహర్షీ! మన్వంతరములయందు మనువు, మనుపుత్రులు మొదలగు ఏయే వ్యక్తులను ఎవరు ఏ విధముగా ఏయే కర్మలయందు నియోగించేదరు? ఆ విషయమును నాకు చెప్పడు.

ఋషిరువాచ

 మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే

 ఇంద్రాస్సురగణా శ్చైవ సర్వే పురుషశాసనాః

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! మనువు, మను పుత్రులు, సప్తర్షులు, దేవగణములు, ఇంద్రులు అందరు కూడ పురుషోత్త ముని అదుపాజ్ఞలలో మాత్రమే ఉండెదరు.

యజ్ఞాదయో యాః కథితాః పౌరుష్యస్తనవో నృప

 మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభిః ప్రచోదితాః  

ఓ మహారాజా! యజ్ఞుడు మొదలగు పురుషోత్తముని అవతారము లను నేను వర్ణించి చెప్పితిని. మనువు, మనుపుత్రులు మొదలగువారు ఈ అవతారములచే ప్రేరితులై జగత్తుయొక్క వ్యవస్థను నడిపించెదరు.

చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శ్రుతీగణాన్ యథా

 తపసా ఋషయోఽపశ్యన్ యతో ధర్మస్సనాతనః  

మహాయుగము అంతమైనప్పుడు కాలముచే కబళించబడిన వేద ముల సమూహములను యథాతథముగా మహర్షులు తపశ్శక్తిచే దర్శించి 8. సనాతమైన (కాలమునకు అతీతమైన) ధర్మమును నిలబెట్టేది ఆ వేదములే.

తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః

 యుక్తాస్సంచారయంత్యద్ధా స్వే స్వే కాలే మహీం నృప

ఓ మహారాజా! మహర్షులు వేదములను దర్శించిన తరువాత, శ్రీహరి ఆదేశముచే మనువులు తమ తమ మన్వంతరములయందు సావ ధానచిత్తులై సాక్షాత్తుగా నాలుగు పాదములు గల ధర్మము భూమియందు సంచరించునట్లు (జనులు పాలించునట్లు) చేసెదరు.

పాలయంతి ప్రజాపాలా యావదంతం విభాగశః

 యజ్ఞభాగభుజో దేవా యే చ తత్రాన్వితాశ్చ తైః

మనుపుత్రులు దేశమును యథాగ్యముగా విభజించి మన్వం తరకాలమంతా ప్రజలను ధర్మబద్ధముగా పాలించెదరు. యజ్ఞకర్మల యందు సంబంధమును కలిగియుండే ఋషులు, పితరులతో బాటుగా దేవతలు ఆయా మన్వంతరములలో యజ్ఞభాగములను అనుభవించెదరు.

ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యశ్రియమూర్జితామ్

భుంజానః పాతి లోకాంస్త్రీన్ కామం లోకే ప్రవర్షతి

ఇంద్రుడు శ్రీహరి భగవానునిచే అనుగ్రహించబడిన గొప్పదైన ముల్లోకముల సంపదను అనుభవిస్తూ, మూడు లోకములను రక్షించును. ఇంద్రుడు లోకములో యథేచ్ఛగా బాగా వర్షించును.

జ్ఞానం చానుయుగం బ్రూతే హరిస్సిద్ధస్వరూపధృక్

 ఋషిరూపధరః కర్మ యోగం యోగేశరూపధృక్

శ్రీహరి ప్రతి యుగమునందు కపిలుడు మొదలగు సిద్దుల రూప మును దాల్చి జ్ఞానమును, యాజ్ఞవల్క్యుడు మొదలగు మహర్షుల రూప ముతో కర్మను, దత్తాత్రేయుడు మొదలగు యోగేశ్వరుల రూపముతో యోగమును ఉపదేశించును.

సర్గం ప్రజేశరూ పేణ దస్యూన్ హన్యాత్ స్వరాడ్వపుః

కాలరూపేణ సర్వేషామభావాయ పృథగ్గుణః

శ్రీహరి సత్త్వరజస్తమోగుణములను వేర్వేరుగా స్వీకరించి మరీచి మొదలగు ప్రజాపతుల రూపములో సృష్టిని కొనసాగిస్తూ, చక్రవర్తుల రూపములో చోరులను సంహరిస్తూ, కాలము రూపములో సకలప్రాణులను సంహారము వైపునకు కొనిపోవును.

స్తూయమానో జనైరేభిర్మాయయా నామరూపయా

 విమోహితాత్మభిర్నానాదర్శనైర్న చ దృశ్యతే

జనులు నామరూపాత్మకమగు మాయచే వ్యామోహితులై యుందురు. వీరు అనేకములగు శాస్త్రముల ద్వారా భగవానుని మాత్రమే స్తుతించెదరు. కాని, వీరు భగవానుని తత్త్వమును దర్శించుట లేదు.

ఏతత్కల్పవికల్పస్య ప్రమాణం పరికీర్తితమ్

 యత్ర మన్వంతరాణ్యాహుశ్చతుర్దశ పురావిదః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే

మను పరిపాలన వర్ణనం నామ చతుర్దశోఽధ్యాయః

ఒక కల్పమునందు పదునాలుగు మన్వంతరములుండునని వ్యాసాది పురాణవేత్తలు చేప్పెదరు. ఈ విధముగా నేను కల్పములోని అవాంతరవిభాగములైన మన్వంతరములను విస్తారముగా చెప్పితిని..

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మనువుల పాలనను వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది .