24 - మత్స్యావతార వృత్తాంతము

రాజోవాచ

భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణః

అవతారకథామాద్యం మాయామత్స్యవిడంబనమ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ పూజనీయా! శ్రీహరి అద్బుతమగు లీలలు గలవాడు. ఆయన యోగమాయచే దాల్చిన మొట్ట మొదటి అవతారము మత్య్సరూపమును అనుకరించినది. ఆ గాథను నేను వినగోరుచున్నాను.

యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్సితమ్

తమఃప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వరః

తమోగుణప్రధానమగు స్వభావము గల చేపయొక్క రూపమును జనులు ఏవగించు కొనెదరు. సహించ శక్యము కాని అట్టి రూపమును స్వతంత్రుడగు శ్రీహరి కర్మపరతంత్రుడగు జీవుడు వలె ఎందుకొరకు దాల్చెను?

ఏతన్నో భగవన్ సర్వం యథావద్వక్తుమర్హసి

ఉత్తమశ్లోకచరితం సర్వలోకసుఖావహమ్

ఓ పూజనీయా! పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క చరితము సకల మానవులకు సుఖమును కలిగించును. ఈ వృత్తాంతమునంతనూ నీవు మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్ప దగుదువు.

సూత ఉవాచ

ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణిః

ఉవాచ చరితం విష్ణోర్మత్స్యరూపేణ యత్కృతమ్

సూతుడిట్లు పలికెను --- పరీక్షిన్మహారాజు ఇట్లు పలుకగా వ్యాస పుత్రుడగు శుకమహర్షి, విష్ణువు మత్స్యావతారమునెత్తి చేసిన లీలల వృత్తాంతమును చెప్పెను.

శ్రీశుక ఉవాచ

గోవిప్రసురసాధూనాం ఛందసామపి చేశ్వరః

రక్షామిచ్ఛంస్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవ హి

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి స్వతంత్రుడే. కాని గోవులు, వేదవేత్తలు, దేవతలు, సత్పురుషులు, వేదములు, ధర్మము మరియు సత్పురుషుల సంపదలను కూడ రక్షించగోరి ఆయన దేహము లను దాల్చును.

ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వరః

నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్దియో గుణైః

గొప్ప, చిన్న ప్రాణులలో సంచరించే వాయువు వాటి గొప్పదన మును గావి, అల్పత్వమును గాని తాను పొందదు. అదే విధముగా, పరమే శ్వరుడు నిర్గుణుడు. కావున, సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్ననూ, ఈశ్వరునకు అంతఃకరణముయొక్క గుణములను బట్టి గొప్పదనము గాని, అల్పత్వము గాని సంక్రమించదు.

ఆసీదతీతకల్పాంతే బ్రహ్మో నైమిత్తికో లయః

సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప

ఓ మహారాజా! గడచిన కల్పముయొక్క ఆఖరునందు బ్రహ్మ గారు నిద్రించుట అనే నిమిత్తమును బట్టి బ్రాహ్మము అనే ప్రళయము ఏర్పడెను. అప్పుడు భూలోకము మొదలైన లోకములు సముద్రములో మునిగి పోయినవి.

కాలేనాగతనిద్రస్య ధాతుశ్శిశయిషోర్బలీ

ముఖతో నిస్సృతాన్ వేదాన్ హయగ్రీవోऽoతికేऽహరత్

కాలము సంప్రాప్తమైనప్పుడు బ్రహ్మగారికి నిద్ర వచ్చి, ఆయన నిద్రించ గోరెను. అపుడు ఆయన నోటినుండి బయల్వెడలిన వేదములను ఆయనకు సమీపములోనున్న బలశాలియగు హయగ్రీవాసురుడు అపహ రించేను.

జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితమ్

దధార శఫరీరూపం భగవాన్ హరిరీశ్వరః

రాక్షసశ్రేష్ఠుడగు హయగ్రీవుడు చేసిన ఆ పనిని తెలుసుకొని, సర్వేశ్వరుడగు శ్రీహరి భగవానుడు చేప రూపమును దాల్చెను.

తత్ర రాజఋషిః కశ్చిన్నామ్నా సత్యవ్రతో మహాన్

నారాయణపరోऽతప్యత్తపస్స సలిలాశనః

ఆ కల్పములో సత్యవ్రతుడనే పేరు గల గొప్ప రాజర్షి ఉండెను. నారాయణ భక్తుడగు ఆయన నీటిని మాత్రమే ఆహారముగా తీసుకోని తప స్సును చేసెను.

యోऽసావస్మిన్ మహాకల్పే తనయస్స వివస్వతః

శ్రాద్ధదేవ ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః

ఆ సత్యవ్రతుడే ఈ గొప్ప కల్పమునందు శ్రాద్ధదేవుడని ప్రసిద్ధి గాంచిన ఈ సూర్యపుత్రుడు. ఈయననే శ్రీహరి మనువు అనే స్థానము నందు స్థాపించినాడు.

ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్

తస్యాంజల్యుదకే కాచిచ్ఛఫర్యేకాభ్యపద్యత

ఒకనాడు ఆయన కృతమాలానదిలో నీటితో తర్పణములను చేయుచుండగా, ఆయన దోసిలిలోని నీటిలో ఏదో ఒక చేప వచ్చి చేరెను.

సత్యవ్రతోంజలిగతాం సహ తోయేన భారత

ఉత్ససర్జ నదీతోయే శఫరీం ద్రవిడేశ్వరః

భరతవంశీయుడవగు ఓ రాజా! ద్రవిడదేశ ప్రభువగు సత్యవ్రతుడు దోసిలియందున్న చేపను నీటితో బాటుగా నదియొక్క నీటిలో విడిచి పెట్టె ను.

తమాహ సాతికరుణం మహాకారుణీకం నృపమ్

యాదేభ్యో జ్ఞాతిఘాతేభ్యో దీనాం మాం దీనవత్సల

కథం విసృజసే రాజన్ భీతామస్మిన్ సరిజ్జలే

గొప్ప కరుణామయుడగు ఆ రాజును ఉద్దేశించి ఆ చేప మిక్కిలి కరుణముగా ఇట్లు పలికెను -- ఓ రాజా! నీవు దీనులయందు ప్రేమ గలవా డవు. దీనురాలనగు నేను తమ జాతికే చెందిన ప్రాణులను చంపే జలజం తువుల వలన భయపడియున్నాను, నన్ను ఈ నదీజలములయందు ఎట్లు విడిచి పెట్టెదవు?

తమాత్మనోऽనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరమ్

అజానన్ రక్షణార్థాయ శఫర్యాస్స మనో దధే

తనను అనుగ్రహించుటకై విష్ణువు చేప రూపమును ధరించి వచ్చి నాడని ఆ మహారాజునకు తెలియదు. ఆయన ప్రేమతో ఆ చేపను రక్షించుటకే మనస్సులో నిశ్చయించెను.

తస్యా దీనతరం వాక్యమాశ్రుత స మహీపతిః

కలశాప్సు నిధాయైనాం దయాలుర్నిన్య ఆశ్రమమ్

ఆ చేపయొక్క అతిదీనమగు మాటలు విని దయామయుడగు ఆ రాజు దానిని కలశములోని నీటిలో వేసి ఆశ్రమమునకు తీసుకు వెళ్లెను.

సా తు తత్త్రెకరాత్రేణ వర్దమానా కమండలౌ

అలబ్ద్వాऽऽత్మావకాశం వా ఇదమాహ మహీపతిమ్

ఆ చేప ఒకే ఒక రాత్రిలో ఆ కమండలమునందు తనకు దానిలో చోటు చాలని విధముగా పెరిగెను. అపుడది ఆ రాజుతో నిట్లనెను.

నాహం కమండలావస్మిన్ కృచ్ఛ్రం వస్తుమిహోత్స హే

కల్పయౌకస్సువిపులం యత్రాహం నివసే సుఖమ్

ఇచట ఈ కమండలములో ఇరుకులో కష్టపడుతూ నివసించుట నావలన కాదు. కావున, నాకు మిక్కిలి విశాలమగు నివాసమును ఏర్పాటు చేయుము. అచట నేను సుఖముగా నివసించెదను.

స ఏనాం తత ఆదాయ న్యధాదౌదంచనోదకే

తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయమవర్ధత

ఆ రాజు ఆ చేపను అచటనుండి తీసుకువెళ్లి నూతి నీటిలో వేసె ను. నూతిలో వేయబడిన ఆ చేప గంటలో మూడు మూరలు పెరిగెను.

న మ ఏతదలం రాజన్ సుఖం వస్తుముదంచనమ్

పృథు దేహి పదం మహ్యం యత్త్వాహం శరణం గతా

ఓ మహారాజా! నాకీ నుయ్యి సుఖముగా నివసించుటకు చాలుట లేదు. నేను నిన్ను శరణు వేడినాను. కావున, నాకు విశాలమగు స్థానమును ఏర్పాటు చేయుము.

తత ఆదాయ సా రాజ్ఞా క్షీప్తా రాజన్ సరోవరే

తదావృత్యాత్మనా సోऽయం మహామీనోऽన్వవర్ధత

ఓ మహారాజా! ఆ రాజు ఆ చేపను ఆ నూతినుండి తీసి సరస్సు నందు వేసెను. ఆ ఈ గొప్ప చేప నిరంతరముగా పెరిగి ఆ సరస్సును ఆవరించెను.

నైతన్మే స్వస్తయే రాజన్నుదకం సలిలౌకసః

నిధేహి రక్షాయోగేన ప్రదే మామవిదాసిని

ఓ రాజా! నాకు నీరే నివాసము. ఈ సరస్సులోని నీరు నా సుఖవిహారమునకు సరిపడుట లేదు. నన్ను రక్షించే ఉపాయమును చేయుము. నీరు ఎన్నటికీ క్షీణించని అగాధమగు సరస్సులో నన్ను ఉంచుము.

ఇత్యుక్తస్సోऽనయన్మత్స్యం తత్ర తత్రవిదాసీని

జలాశయే సంమితం తం సముద్ర ప్రాక్టీపజ్ఘషమ్

ఆ చేప ఇట్లు పలుకగా, ఆ రాజు ఆ చేపను క్షీణించని నీరు గల సరస్సులలో, ఒకదాని కంటే మరియొకటి పెద్దదిగా ఉండే సరస్సులలో వేసెను. ఆ చేప ఆ సరస్సుతో సమానముగా పెరుగుచుండెను. అపుడాయన ఆ చేపను సముద్రములో వేసెను.

క్షిప్యమాణస్తమాహేదమిహ మాం మకరాదయః

అదంత్యతిబలా వీర మాం నేహోత్స్రష్టుమర్హసి

ఆయన ఆ చేపను సముద్రములో వేయుచుండగా అది ఇట్లనెను -- ఓ వీరా! దీనిలో చాల బలము గల మొసళ్లు, తిమింగలములు మొదల గునవి గలవు. అవి నన్ను తినివేయును. కావున, నన్ను దీనియందు విడిచి పెట్టుట నీవంటి వీరునకు తగదు.

ఏవం విమోహితస్తేన వదతో వల్గుభారతీమ్

తమాహ కో భవానస్మాన్ మత్స్యరూపేణ మోహయన్

ఈ విధముగా మధురమైన మాటలను పలికి మోహ పెట్టుచున్న ఆ చేపతో రాజు ఇట్లనెను -- చేప రూపముతో మమ్ములను మోహ పెట్టు చున్న వీవు ఎవరివి? .

నైవంవీర్యో జలచరో దృష్టోऽస్మాభిశ్శ్రుతోऽపి చ

యో భవాన్ యోజనశతమహ్నాభివ్యానశే సరః

నీ వంటి పరాక్రమము గల నీటి జంతువును మేము ఇదివరలో చూడనూలేదు, విననూలేదు. నీవు ఒకే రోజులో పెరిగి వంద యోజన ముల విస్తారము గల సరస్సును నిండా వ్యాపించితివి.

నూనం త్వం భగవాన్ సాక్షాద్దరిర్నారాయణోऽవ్యయః

అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్

నీవు సాక్షాత్తుగా అవినాశియగు నారాయణ భగవానుడవు. ఇది నిశ్చయము. నీవు ప్రాణులననుగ్రహించుట కొరకై చేపల రూపమును దాల్చినావు.

నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్త్యుత్పత్త్యప్యయేశ్వర

భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో

ఓ పురుషోత్తమా! జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు ప్రభుడవు నీవే. నీకు నమస్కారము. ఓ ప్రభూ! నీ భక్తులమగు మేము నిన్ను శరణు వేడుచున్నాము. మాకు. సత్యమైన ఆత్మ, ముఖ్యమైన ఆశ్రయము నీవే.

సర్వే లీలావతారాస్తే భూతానాం భూతి హేతవః

జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్

నీవు అవతారములనెత్తి చేసే లీలలన్నీ ప్రాణుల అభ్యుదయము. కొరకు హేతువులగుచున్నవి. నీవీ రూపమును దేనికొరకై ధరించితివో, నేను తెలియ గోరుచున్నాను.

న తేऽరవిందాక్ష పదోపసర్పణం

మృషా భవేత్సర్వసుహృత్ప్రియాత్మనః

యథేతరేషాం పృథగాత్మనాం సతా-

మదీదృశో యద్వపురద్భుతం హి నః

పద్మమువంటి కన్నులు గల ఓ శ్రీహరీ! దేహము మొదలగు అనా త్మపదార్థములయందు ఆత్మభావము గల రాజాదులను నీకంటే భిన్నమైన వారిని ఆశ్రయించుట వ్యర్థము. నీ పాదపద్మములను శరణు వేడుట ఆ విధ ముగా వ్యర్థము కాదు. ఎందుకంటే, నీవు సకలప్రాణులకు హితకారివి; సక లప్రాణులకు ప్రియమైన ఆత్మవు నీవే. కావుననే, నీవు ఆశ్చర్యమును గొలిపే ఈ రూపమును మాకు చూపితివి.

శ్రీశుక ఉవాచ

ఇతి బ్రువాణం నృపతిం జగత్పతిః

సత్యవ్రతం మత్స్యవపుర్యుగక్షయే

విహర్తుకామః ప్రలయార్ణవేऽబ్రవీత్

చికీర్షురేకాంతజనప్రియః ప్రియమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగన్నాథుడగు శ్రీహరి పరమ (నిష్కామ) భక్తులకు ప్రియమైనవాడు, వారియందు ప్రీతి గలవాడు. ఆయన యుగాంతములో ప్రళయ సముద్రమునందు విహరించగోరి చేప రూపును దాల్చెను. ఈ విధముగా పలుకుచున్న సత్యవ్రత మహారాజునుద్దే శించి, ఆయనకు ప్రియమును చేయగోరి ఆ భగవానుడిట్లు పలికెను.

శ్రీభగవానువాచ

సప్తమేऽద్యతనాదూర్ధ్వమహన్యేతదరిందమ

నిమంక్ష్యత్యప్యయాంభోధౌ త్రైలోక్యం భూర్భువాదీకమ్

శ్రీమత్స్య భగవానుడిట్లు పలికెను --- (అంతః) శత్రువులను అణ గదొక్కిన ఓ మహారాజా! ఈనాటినుండి రాబోయే ఏడవ రోజున భూః-భు వః-సువః అనే మూడు లోకములు ప్రళయ సముద్రమునందు మునిగిపో గలవు.

త్రిలోక్యాం లీయమానాయాం సంవర్తాంభసి వై తదా

ఉపస్థాస్యతి నౌః కాచిద్విశాలా త్వాం మయేరితా

అప్పుడు ముల్లోకములు నిశ్చయముగా ఆ ప్రళయ జలముల యందు మునిగిపోగా, నాచే పంపబడిన ఒకానొక విశాలమైన నౌక నీ వద్దకు రాగలదు.

త్వం తావదోషధీస్సర్వా బీజాన్యుచ్చావచాని చ

సప్తర్షిభిః పరివృతస్సర్వసత్త్వోపబృంహితః

ఆరుహ్య బృహతీం నావం విచరిష్యస్యవిక్లవః

ఏకార్ణవే నిరాలోకే ఋషీణామేవ వర్చసా

అపుడు నీవైతే సకలములైన మొక్కలను మరియు చిన్న పెద్ద విత్త నములను సంగ్రహించుము. సప్తర్షులు నీకు తోడు కాగలరు. సకలప్రాణులు నీ గొప్పదనమును వర్దిల్ల జేయగలవు. నీవా పెద్ద నౌకను ఎక్కుము. అంతా వ్యాపించియున్న ఆ ప్రళయ సముద్రములో కాంతి ఉండదు. అయిననూ, నీవు మహర్షుల తేజస్సు చేతనే దైన్యము లేకుండా సంచరించ గలవు.

దోధూయమానాం తాం నావం సమీరేణ బలీయసా

ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీహి మహాహినా

మిక్కిలి బలమైన గాలీలో ఆ నావ అల్లల్లాడిపోవును. నేను అప్పుడు అచటకు వచ్చెదను. నీవా నావను మహాసర్పమగు వాసుకితో నా కొమ్మునకు గట్టిగా కట్టివేయుము.

అహం త్వామృషిభిస్సాకం సహనావముదన్వతి

వికర్షన్ విచరిష్యామి యావద్బ్రాహ్మీ నిశా ప్రభో

ఓ మహారాజా! నీవు, మహర్షులు ఆ నౌకలో కలిసియుండగా, బ్రహ్మగారి రాత్రి (ప్రళయము) సాగినంత కాలము నేనా నావను సముద్ర ములో లాగుతూ విహరించెదను.

మదీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితమ్

వేత్స్యస్యనుగృహీతం మే సంప్రశ్నైర్వివృతం హృది

నీవు చక్కని ప్రశ్నలను వేయుచుండగా, పరబ్రహ్మ అని మహర్షు. లచే ప్రతిపాదించబడే నా స్వరూపమును నేను వివరించి చెప్పగలను. నా అనుగ్రహముచే నీవా పరబ్రహ్మను హృదయమునందు సాక్షాత్కరించు కొనగలవు.

ఇత్థమాదిశ్య రోజానం హరిరంతరధీయత

సోऽన్వవైక్షత తం కాలం యం హృషీకేశ ఆదిశత్

శ్రీహరి సత్యవ్రత మహారాజును ఈ విధముగా ఆదేశించి అంతర్దా నము చెందేను.. ఇంద్రియాధిపతియగు శ్రీహరి ఆదేశించిన ఆ సమయము : కొరకై ఆ రాజు నిరంతరముగా ప్రతీక్షించుచుండెను.

ఆస్తీర్య దర్భాన్ ప్రాక్కూలాన్ రాజర్షిః ప్రాగుదజ్ముఖః

నిషసాద హరేః పాదౌ చింతయన్ మత్స్యరూపిణః

రాజర్షియగు ఆ సత్యవ్రతుడు తూర్పు వైపు కొనలు ఉండునట్లుగా దర్భలను పరచి, ఈశాన్యమునకభిముఖముగా కూర్చుండి, మత్స్యరూపు డగు శ్రీహరియొక్క పాదములను ధ్యానించెను.

తతస్సముద్ర ఉద్వేలపర్వతః ప్లావయన్ మహీమ్

వర్ధమానో మహామేఘైర్వర్షద్భిస్సమదృశ్యత

తరువాత పెద్ద మేఘములు వర్షించుచుండగా వర్ధిల్లి చెలియలి కట్టను దాటి సముద్రము భూమినంతనూ ముంచెత్తుచుండుటను ఆ మహా రాజు చూచెను.

ధ్యాయన్ భగవదాదేశం దదృశే నావమాగతమ్

తామారురోహ విప్రేంద్రైరాదాయోషధివీరుధః

ఆ రాజు భగవానునీ ఆదేశమును గురించి తలపోస్తూండగానే అచ టకు వచ్చిన నౌక కనబడెను. ఆతడు ఓషధుల (పంటధాన్యముల) మరియు వృక్షముల బీజములను తీసుకొని, మహర్షులతో గూడి ఆ నౌకపై ఎక్కేను.

తమూచుర్మునయః ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవమ్

స వై నస్సంకటాదస్మాదవితా శం విధాస్యతి

సంతోషించిన ఆ మహర్షులు ఇట్లు పలికిరి -- ఓ రాజా! నీవు శ్రీహరిని ధ్యానించుము. ఆయన నిశ్చయముగా మనలనీ కష్టమునుండి రక్షించి, సుఖమును కలిగించగలడు.

సోऽనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్ణవే

ఏకశృంగధరో మత్స్యో హైమో నియుతయోజనః

తరువాత ఆ మహారాజు ధ్యానించగా, శ్రీహరి లక్షయోజనముల నిడివి గల బంగరు చేపట్టే ఆ మహాసముద్రములో ఆవిర్భవించెను. ఆ చేపకు ఒక కొమ్ము ఉండెను.

నిబధ్య నావం తచ్ఛృంగే యథోక్తో హరిణా పురా

వరత్రేణాహినా తుష్టస్తుష్టావ మధుసూదనమ్

పూర్వము శ్రీహరి చెప్పిన విధముగా ఆ రాజు వాసుకినాగును మోకుగా చేసి ఆ నావను చేప కొమ్మనకు గట్టిగా కట్టెను. అపుడాయన సంతోషించి, మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరిని ఇట్లు స్తుతించెను.

రాజోవాచ

అనాద్యవిద్యోపహతాత్మసంవిదః

తన్మూలసంసారపరిశ్రమాతురాః

యదృచ్చయేహోపసృతా యమాప్నుయుః

విముక్తిదో నః పరమో గురుర్భవాన్

సత్యవ్రత మహారాజు ఇట్లు పలికెను --- జనులు ఈ లోకములో అనాదియగు అజ్ఞానముచే కప్పివేయబడిన ఆత్మతత్త్వవివేకము గలవారై, ఆ అజ్ఞానముచే కలిగించబడిన సంసారములో నిరంతరముగా పరిశ్రమిస్తూ వ్యాకులురై యుండెదరు. వారు అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) నిన్ను శరణు వేడి నిన్నే (ఆత్మరూపముగా) పొందెదరు. నీవు గురువులకు గురుడవు. నీవు మాకు మోక్షమునిమ్ము.

జనోऽబుధోऽయం నిజకర్మబంధన

సుఖేచ్చయా కర్మ సమీహతేऽసుఖమ్

యత్సేవయా తాం విధునోత్యసన్మతిం

గ్రంథిం స భింద్యాద్ధృదయం స నో గురుః

అవివేకియగు ఈ మానవుడు తాను చేసిన కర్మలచే తానే బద్దుడ గును. మానవుడు సుఖమును కోరి కర్మలను చేసి దుఃఖమును మూటగట్టును. వాని ఈ అజ్ఞానము శ్రీహరిని సేవించుటచే తొలగిపోవును. అట్టి శ్రీహరి మాకు గురువు. ఆయన మా హృదయమునందలి అజ్ఞానగ్రంథిని పోనాడు గాక!

యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం

పుమాన్ విజహ్యాన్మలమాత్మనస్తమః

భజేత వర్ణం నిజమేష సోऽవ్యయో

భూయాత్స ఈశః పరమో గురోర్గురుః

రుద్రుని రోదనమునుండి పుట్టిన వెండి అగ్నియొక్క సంపర్కము వలన తనలోని మాలిన్యమును పోగొట్టుకొని తనదైన రంగును పొందును. అదే విధముగా మానవుడు శ్రీహరిని సేవించి తనలోని అజ్ఞానమనే మాలి వ్యమును పోగొట్టుకోని జ్ఞానముచే తన స్వరూపమును పొందును. అవినా శియగు అట్టి ఈశ్వరుడు గురువులకు కూడ పూజనీయుడు. అట్టి శ్రీహరి మాకు గురువు అగుగాక!

న యత్ప్రసాదాయుతభాగలేశ-

మన్యే చ దేవా గురవో జనాస్స్వయమ్

కర్తుం సమేతాః ప్రభవంతి పుంసః

తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే

దేవతలు, గురువులు, ఇతర జనులు కూడ కలిసియేననూ తమంత తాముగా నీ అనుగ్రహములో పదివేలవ వంతులోని లేశము నైననూ మానవునకు చేయజాలరు. అట్టి సర్వేశ్వరుడవగు నిన్ను నేను శరణు పొందుచున్నాను.

అచక్షురంధస్య యథాగ్రణీః కృతః

తథా జనస్యావిదుషోऽబుధో గురుః

త్వమర్కదృక్సర్వదృశాం సమీక్షణో

వృతో గురుర్నస్స్వగతిం బుభుత్సతామ్

అవివేకి అజ్ఞానియగు వ్యక్తిని గురువుగా చేసుకున్నచో, గ్రుడ్డివాడు మరియొక గ్రుడ్డివానిని మార్గదర్శకునిగా చేసుకున్నట్లుండును. నీకు సూర్యుడు కన్ను. సకలములైన ఇంద్రియములను ప్రకాశింపజేసే చైత న్యము నీవే. కావుననే, ఆత్మతత్త్వమును తెలియగోరే మేము. సర్వజ్ఞుడ వగు అట్టి నిన్ను గురువుగా ఎన్నుకున్నాము.

జనో జనస్యాదిశతేసతీం మతిం

యయా ప్రపద్యేత దురత్యయం తమః

త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజసా

ప్రపద్యతే యేన జనో నిజం పదమ్

అజ్ఞానియగు జనుడు అజ్ఞానియగు జనునకు అర్థకామములకు చెందిన అయోగ్యమగు బుద్దిని ఉపదేశించగా, వాడు దాని కారణముగా చీకటివంటి దాట. శక్యము కాని సంసారము (నరకము) ను పొందుచున్నాడు, కాని, నీవు వినాశము లేని మరియు వ్యర్థము: కాని ఆత్మజ్ఞానమునుప దేశించెదవు. దాని వలన మానవుడు తేలికగా తన స్వరూపమును తెలుసు కొని తద్వారా మోక్షమును పొందును.

త్వం సర్వలోకస్య సుహృత్ప్రియేశ్వరో

హ్యాత్మా గురుర్ జ్ఞానమభీష్టసిద్ధిః

తథాపి లోకో న భవంతమంధధీః

జానాతి సంతం హృది బద్ధకామః

సర్వమానవులకు నీవు హితకారివి, ప్రియమగు ఆత్మరూపుడవు, ఈశ్వరుడవు మరియు గురుడవు. మానవుడు పొందే జ్ఞానము, మరియు అభీష్టసిద్ది కూడ నీ రూపములే. అయినప్పటికీ, మానవుడు కామనల యందు గట్టిగా తగుల్కొన్నవాడై బుద్ధియందు వివేకమును కోల్పోయి, తన హృదయమునందే ఉన్న నిన్ను తెలియలేకున్నాడు.

తం త్వామహం దేవవరం వరేణ్యం

ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ

ఛింధ్యర్థదీపైర్భగవన్ వచోభిః

గ్రంథీన్ హృదయ్యాన్ వివృణు స్వమోకః

ఓ భగవానుడా! దేవనాయకుడవగు నీవు మాత్రమే ప్రార్థించదగిన ఈశ్వరుడవు. అట్టి నిన్ను నేను తత్త్వమునుపదేశించుమని శరణు వేడుచు న్నాను. నీవు తత్త్వమును ప్రకాశింప జేసే వచనములను ఉపదేశించి, నా హృదయమునందున్న కామనలు అనే ముడులను ఛేదించుము. ఆపైన వీ స్వరూపమును ప్రకాశింప జేయుము.

శ్రీశుక ఉవాచ

ఇత్యుక్తవంతం నృపతిం భగవానాదిపూరుషః

మత్స్యరూపీ మహాంభోదౌ విహరంస్తత్త్వమబ్రవీత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్యవ్రత మహారాజు ఇట్లు పలుకగా, శ్రీహరి భగవానుడు మహాసముద్రమునందు విహరిస్తూ ఆయ నకు ఆత్మస్వరూపమును ఉపదేశించెను. జగత్కారణుడు, పూర్ణుడు అగు ఆ భగవానుడు చేప రూపమును దాల్చి యుండెను గదా!

పురాణసంహితాం దివ్యాం సాంఖ్యయోగక్రియావతీమ్

సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమ శేషతః

ఆయన తనచే ప్రణీతమైన మత్స్యపురాణమనే సంహిత (అనేక విషయముల సంకలనము) ను, తన స్వరూపముయొక్క రహస్యమును కూడ సత్యవ్రత మహారాజునకు నిశ్శేషముగా బోధించెను. ఆ పురాణసం హితయందు ఆత్మజ్ఞానము, భక్తియోగము, కర్మలు కూడ ప్రతిపాదించబడి యున్నవి.

అశ్రౌషీదృషిభిస్సాకమాత్మతత్త్వమసంశయమ్

నావ్యాసినో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనమ్

మహర్షులతో గూడి నౌకయందు కూర్చున్న ఆ రాజు మత్స్య భగ వానునిచే ప్రవచించబడిన కాలాతీతమగు పరబ్రహ్మను గురించి, ఆత్మ స్వరూపమును గురించి శ్రవణము చేసి, సందేహములను తీర్చుకొనెను.

అతీతప్రలయాపాయ ఉత్థితాయ స వేధసే

హత్వాऽసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్దరిః

మత్స్యరూపుడగు ఆ శ్రీహరి హయగ్రీవాసురుని సంహరించి వేద ములను తీసుకువచ్చేను. పూర్వమునందలి ప్రళయము పూర్తి కాగానే నిద్ర లేచిన బ్రహ్మగారికి ఆయన ఆ వేదములను సమర్పించేను.

స తు సత్యవ్రతో రాజా జ్ఞానవిజ్ఞానసంయుతః

విష్ణోః ప్రసాదాత్కల్పేऽస్మిన్నాహీద్వైవస్వతో మనుః

ఆ సత్యవ్రత మహారాజు ఆత్మస్వరూపమును పరోక్షముగా తెలి యుటయే గాక, స్వానుభవముగా సాక్షాత్కరించుకొనెను. ఆయన విష్ణువు యొక్క అనుగ్రహము వలన ఈ కల్పమునందు సూర్యుని పుత్రుడగు (వైవ స్వత) మనువు ఆయెను.

సత్యవ్రతస్య రాజర్షేర్మాయామత్స్యస్య శార్ జ్గిణః

సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యత కిల్బిషాత్

మాయాశక్తిచే చేప రూపును దాల్చిన శార్జధారియగు శ్రీహరి రాజర్షియగు సత్యవ్రతునకు చేసిన ఉపదేశము (వారిద్దరి సంభాషణము) యొక్క ఈ గొప్ప వృత్తాంతమును విన్న వ్యక్తి పాపమునుండి విముక్తుడగు ను.

అవతారో హరేర్యోऽయం కీర్తయేదన్వహం నరః

సంకల్పాస్తస్య సిధ్యంతి స యాతి పరమాం గతిమ్

శ్రీహరియొక్క ఈ మత్స్యావతారమును మానవుడు ప్రతి దినము కీర్తించినచో, అట్టివాని సంకల్పములు సిద్ధించుటయే గాక, ఆతడు సర్వోత్త మమగు ఫలమైన మోక్షమును కూడ పొందును.

ప్రలయపయసి ధాతుస్సుప్తశత్తేర్ముఖేభ్యః

శ్రుతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా

దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం

తమహమఖిలహేతుం జిహ్మమీనం నతోऽస్మి

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే మత్స్యావతార

వర్ణనం నామ చతుర్వింశోऽధ్యాయః

ఇతి అష్టమః స్కంధః సమాప్తః

బ్రహ్మగారు తన సృష్టిశక్తిని ఉపసంహరించి ప్రళయకాలమునం దలి నీటిలో నిద్రించుచుండగా, ఆయన ముఖమునుండి బయల్వెడలిన వేదములను రాక్షసుడు (హయగ్రీవుడు) అపహరించెను. అపుడు శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి వేదములను తీసుకువచ్చి బ్రహ్మగారికి అప్పజే ప్పెను. సకలజగత్కారణుడగు ఆ శ్రీహరి మాయచే లీల కొరకై చేప రూపు దాల్చి, సత్యవ్రతునకు మహర్షులకు పరబ్రహ్మస్వరూపమును బోధించెను. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మత్స్యావతారమును వర్ణించే ఇరువది నాల్గవ  అధ్యాయము ముగిసినది (24).

అష్టమ స్కంధము ముగిసినది.

హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు