6 - సముద్ర మథనము - మందర పర్వతమును తీసుకువచ్చుట

శ్రీశుక ఉవాచ

ఏవం స్తుతస్సురగణైర్బగవాన్ హరిరీశ్వరః

తేషామవిరభూద్రాజన్ సహస్రారోదయద్యుతిః

             శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! దేవగణములీ విధముగా జగన్నాథుడగు శ్రీహరి భగవానుని స్తుతించగా, ఆయన వేయి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినంతటి కాంతితో వారి యెదుట ఆవిర్భ వించెను.

తేనైవ మహసా సర్వే దేవాః ప్రతిహతేక్షణాః

నాపశ్యన్ ఖం దిశః క్షోణిమాత్మానం చ కుతో విభుమ్

             ఆ కాంతికి కన్నులు మిరిమిట్లు గొల్పుటచే దేవతలు కూడ ఆకాశ మును, దిక్కులను, నేలను, తమను కూడ చూడలేకపోయిరి. అట్టి స్థితిలో వారు శ్రీహరి విభుని ఎట్లు చూడగల్గుదురు?

విరించో భగవాన్ దృష్ట్వా సహ శర్వేణ తాం తనుమ్

స్వచ్ఛాం మరకతశ్యామాం కంజగర్భారుణేక్షణామ్

 తప్త హేమావదాతేన లసత్కాశేయవాససా

ప్రసన్నవారుసర్వాంగీం సుముఖీం సుందరభ్రువమ్

 మహామణికిరీటేన కేయూరాభ్యాం చ భూషితామ్

 కర్ణాభరణనిర్భాతకపోలశ్రీముఖాంబుజామ్

 కాంచీకలాపవలయహారనూపురశోభితామ్

కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలినీమ్

 సుదర్శనాదిభిస్వాస్త్రైర్మూర్తిమద్భిరుపాసితామ్

తుష్టాన దేవప్రవరస్సశర్వః పురుషం పరమ్

సర్వామరగణైస్సాకం సర్వాం గైరవనిం గతైః

             పూజనీయుడు, దేవశ్రేష్ఠుడు అగు బ్రహ్మగారు రుద్రునితో గూడి శ్రీహరియొక్క ఆ స్వచ్చమగు మూర్తిని దర్శించెను. ఇంద్రనీలమాణి క్యము వలె శ్యామలవర్ణము గల శ్రీహరి పద్మముయొక్క మధ్యభాగము వలె ఎర్రనైన కన్నులను కలిగియుండెను. పుటము పెట్టిన బంగారము వలె పచ్చగా ప్రకాశించే పట్టు వస్త్రమును దాల్చియున్న ఆయనయొక్క అవ యవములు అన్నీ ప్రసన్నముగను, సుందరముగను ఉండెను. అందమైన కనుబొమలు గల ఆయన గొప్ప మణికిరీటమును దాల్చియుండెను. ఆయన భుజములకు అంగదములను అలంకరించుకొనియుండెను. కుండ లముల కాంతి పడి చక్కగా ప్రకాశించే చెక్కిళ్లతో పద్మమువంటి ఆయన ముఖము వెలిగిపోవుచుండెను. నడుమునకు మొలనూలుతో కాలికి అందెలతో ప్రకాశించే ఆయన కౌస్తుభ మాణిక్యము అనే ఆభరణమును, వనమా లను ధరించియుండెను. సుదర్శన చక్రము, కౌమోదకీ గద మొదలైన ఆయన ఆయుధములు రూపులను దాల్చి ఆయనను సేవించుచుండెను. ఆ రూపమును చూచిన బ్రహ్మగారు రుద్రునితో గూడి ఆ పురుషోత్తముని స్తుతించెను. బ్రహ్మగారి వెంటనున్న సకలదేవగణములు నేలపై సాష్టాంగ పడిరి.

బ్రహ్మోవాచ

అజాతజన్మస్థితిసంయమాయాగుణాయ నిర్వాణసుఖార్ణవాయ

అణోరణిమ్నే పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే

ఓ దేవా! నిర్గుణుడవగు నీకు జగత్తుయొక్క సృష్టిస్థితిలయము లతో సంగము లేదు. పరమానంద మహోదధివియగు నీవు సూక్ష్మతమ మగు ఆకాశముకంటె సూక్ష్మమగు స్వరూపము గలవాడవు. నీ స్వరూప మునందు దేశకాలముల కొలతలు (సీమలు) లేవు. సర్వోత్తమమగు ప్రభావము గల నీకు అనేక నమస్కారములు.

రూపం తవైతత్పురుషర్షభేజ్యం

శ్రేయోకర్దిభిర్వైదికతాంత్రికేణ

యోగేన ధాతస్సహ నస్త్రీలోకాన్

పశ్యామ్యముష్మిన్ను హ విశ్వమూర్తౌ

ఓ పురుషోత్తమా! సృష్టిని చేయువాడవు నీవే. నీ ఈ రూపమును శ్రేయస్సును కోరు జనులు వేదములో మరియు తంత్రములలో చెప్పిన ఉపాయములతో ఆరాధించెదరు. ఆహా! ఈ నీ విశ్వరూపమునందు నేను మమ్ములను మరియు ముల్లోకములను ఏకకాలములో చూచుచున్నాను.

త్వయ్యగ్ర ఆసీత్త్వయి మధ్య ఆసీత్

త్వయ్యంత ఆసీదిరమాత్మతంత్రే

త్వమాదిరంతో జగతోకస్య మధ్యం

ఘటస్య మృత్స్నేవ పరః పరస్మాత్

            ఈ జగత్తు సృష్టికి పూర్వము, స్థితికాలమునందు, ప్రళయము తరువాత కూడ స్వతంత్రుడవగు నీయందే గలదు. కుండకు మట్లివలె, ఈ జగత్తుయొక్క ఆది-మధ్యము-అంతములయందు నీవే గలవు. జగత్తునకు ఉపాదానమగు ప్రకృతికంటె నీవు అతీతుడవు.

త్వం మాయయాత్మాశ్రయయా స్వయేదం

నిర్మాయ విశ్వం తదనుప్రవిష్టః

పశ్యంతి యుక్తా మనసా మనీషిణే

గుణవ్యవాయేకప్యగుణం విపశ్చితః

            నీవు నిన్ను ఆశ్రయించి ఉండే నీ మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి, తరువాత దానియందు ప్రవేశించినావు. మనోనిగ్రహము గల వివే కులు సావధానచిత్తులై మననము చేసి, సత్త్వరజస్తమోగుణముల కార్యమే అయిననూ ఈ జగత్తునందు నిర్గుణుడవగు నిన్ను (అధిష్టానముగా) దర్శిం చెదరు.

యథాగ్నిమేధస్యమృతం చ గోషు

భువన్నమంబూద్యమనే చ వృత్తిమ్

యోగైర్మనుష్యా అధియంతి హి త్వాం

గుణేషు బుద్ధ్యా కవయో వదంతి

            కట్టెను మథించి నిప్పును, ఆవులను పితికి అమృతమువంటి పొలను, నేలను దున్ని ధాన్యము మొదలగు ఆహారమును, నేలను త్రవ్వి నీటిని మానవులు పొందెదరు. మరియు, మానవులు తమ పురుషకారము నందు జీవికను సంపాదించెదరు. అదే విధముగా, వివేకులు సత్త్వరజస్తమో గుణకార్యములగు శబ్దాదులయందు నిన్ను సత్తాస్పూర్డుల రూపముగా పరి శుద్ధమగు బుద్ధితో గుర్తించెదరు; మరియు తమ అనుభవమును వర్ణించి చెప్పెదరు.

తం త్వాం వయం నాథ సముజ్జహానం

సరోజనాభాతిరేప్సితార్థమ్

దృష్ట్వా గతా నిర్వృతిమద్య సర్వే

గజా దవార్తా ఇవ గాంగమంభః

ఓ పద్మనాభా! నీవే మాకు నాథుడవు. మేము చాలకాలమునుండి కోరే పురుషార్థము (మోక్షము) నీ స్వరూపమే. నీవు మా ముందు ఆవిర్భ వించినావు. అట్టి నిన్ను చూచి ఈ నాడు మేము అందరము, కార్చిచ్చుచే పీడించబడి గంగాజలములను చేరుకున్న ఏనుగులు వలె, సుఖమును పొందినాము.

స త్వం విధత్స్వాఖిలలోకపాలా

వయం యదర్థాస్తవ పాదమూలమ్

సమాగతాస్తే బహిరంతరాత్మన్

కిం వాన్యవిజ్ఞాప్యమ శేషసాక్షిణః

             మేము సకలలోకపాలకులము ఏ ప్రయోజనమును గోరి నీ పాద ముల మ్రోల చేరితిమో, అట్టి నీవు దానిని సంపాదించి పెట్టుము. నీవు సర్వమునకు లోపల, బయట కూడ వ్యాపించియున్నావు. నీవు సర్వమునకు సాక్షివి. అట్టి నీకు ఇతరులు విన్నవించ దగినది ఏమి ఉండును?

అహం గిరిత్రశ్చ సురాదయో యే

దక్షాదయోకగ్నేరివ కేతవస్తే

కిం వా విదామేశ పృథగ్విభాతా

విధత్స్వ శం నో ద్విజదేవమంత్రమ్

             ఓ ఈశ్వరా! నేను, రుద్రుడు, దేవతలు, దక్షుడు మొదలగువారు, అగ్నినుండి వెలువడిన మిణుగురులు వలె, నీ అంశలే అయిననూ, తాము నీకంటే వేరుగా ఉన్నామని భావించుచున్నారు. అట్టి మేము మాకు సుఖము కలిగే ఉపాయమును ఏమి తెలియగల్గుదుము? (తెలియలేము). కావున, వేదవేత్తలకు మరియు దేవతలకు సుఖము కలిగే ఉపాయమును మాకు ఉపదేశించి, నీవు కూడ దానిని చేయుము.

శ్రీశుక ఉవాచ

ఏవం విరించాదిభిరీడితస్తద్విజ్ఞాయ తేషాం హృదయం యథైవ,

జగాద జీమూతగభీరయా గిరా బద్దాంజలీనంవృతసర్వకారకాన్

బ్రహ్మ మొదలగువారు శ్రీహరిని ఈ విధముగా స్తుతించిరి. ఆయన వారి హృదయములలోని అభిప్రాయమును యథాతథముగా తెలు సుకొనెను. వారు చేతులను జోడించి సర్వేంద్రియములను నియంత్రించి నిలిచియుండిరి. అపుడు శ్రీహరి మేఘగర్జనవలె గంభీరమైన వాక్కుతో వారితోనిట్లనెను.

ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వరః

విహర్తుకామస్తానాహ సముద్రోన్మథనాదిభిః

దేవదేవుడగు శ్రీహరి ఒక్కడే స్వయముగా ఆ దేవకార్యమును సాధించుటకు సమర్థుడే. అయిననూ, ఆయన సముద్రమథనము మీద లగు లీలలతో విహరించగోరి, వారితో నిట్లనెను.

శ్రీభగవానువాచ

హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితమ్

 శృణుతావహితాస్సర్వే శ్రేయో వస్యాద్యథా సురాః

మంచిది. ఓ బ్రహ్మా! ఓ శంభూ! దేవయోనులగు గంధర్వులారా! ఓ దేవతలారా! మీరు అందరు సావధానముగా నా మాటను వినుడు. మీకు కల్యాణము కలిగే ఉపాయమును చేప్పెదను.

యాత దానవదైతేయైన్తవత్సంధిర్విధీయతామ్

 కాలేనానుగృహీతై సైర్యావద్వో భవ ఆత్మనః

            వెళ్లుడు. మీకు మీ వృద్ధి సిద్దించునంతవరకు మీరు దితి దను వంశీయులగు ఆ రాక్షసులతో సంధి చేసుకొనుడు. ప్రస్తుతము వారిని కాలము అనుగ్రహించినది.

అరయోపి హి సంధేయాస్సతి కార్యార్థగౌరవే

 అహిమూషకవద్దేవా హ్యర్థస్య పదవీం గతైః

ఎందుకంటే, సాధించదగిన పని చాల ప్రయోజనకరమైనప్పుడు మనము శత్రువులతో కూడ సంధిని చేసుకొనవలెను. ఓ దేవతలారా! ప్రయోజనము సిద్ధించిన తరువాత నిశ్చయముగా పాము-ఎలుకలవలె చేయవచ్చును (ఒక పాము బుట్టలో బందీయై ఉండగా, లోపలికి ఎలుక వచ్చెను. పాము దానితో స్నేహము చేసి, దానిచే బుట్టకు చిల్లు చేయించి, ఆ తరువాత ఆ ఎలుకను భక్షించి, ఆ బుట్టలోనుండి పారిపోయెను).

అమృతోత్పాదనే యత్నః క్రీయతామవిలంబితమ్

 యస్య పాతస్య వై జంతుర్మృత్యుగ్రస్తోకమరో భవేత్

మీరు విలంబము లేకుండా అమృతమును ఉత్పన్నము చేయు. టకు యత్నించుడు. మృత్యువు కోరలలో ఉన్న ప్రాణి అమృతమును త్రాగినచో మృత్యువును జయించును. ఇది నిశ్చయము.

క్షిప్త్వా క్షీరోదదౌ సర్వా వీరుతృణలతౌషధీః

 మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్

సహాయేన మయా దేవా నిర్మంథధ్వమతంద్రితాః

 క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః

ఓ దేవతలారా! సకలములైన పొదలను, గడ్డిమొక్కలను, తీగల ను, మందుచెట్లను పాల సముద్రములో వేయుడు. మందర పర్వతమును కవ్వముగా చేసుకొని, వాసుకుని త్రాడుగా చేసుకొని, సోమరిదనము లేకుండా గట్టిగా మథించుడు. నేను మీకు సాహాయ్యము నందించగలను. పైగా, రాక్షసులు మీ కష్టములో పాలు పంచుకోనగలరు. కాని, ఫలమును మాత్రమే మీరే తీసుకొనగలరు.

యూయం తదనుమోదధ్వం యదిచ్చంత్యసురాస్సురాః

 న సంరంభేణ సిధ్యంతి సర్వేర్థాసాంత్వయా యథా

            ఓ దేవతలారా! రాక్షసులు ఏది కావాలంటే దానికి మీరు అంగీకరిం చుడు. సకలకార్యములు మంచిదనముతో సిద్ధించే విధముగా, కోపము వలన సిద్ధించవు.

న భేతవ్యం కాలకూటాద్విషాజ్ఞలధిసంభవాత్

 లోభః కార్యో న వో జాతు రోషః కామస్తు వస్తుషు

సముద్రమునుండి కాలకూట విషము పుట్టును. మీరు దాని వలన భయపడకుడు. సముద్రమునుండి పుట్టే పదార్థముల యెడల తృష్ణను గాని, కామనను గాని, ఆ కామన సిద్దించనప్పుడు కోపమును గాని, మీరు ఏ కాలమునందైననూ చేయరాదు,

శ్రీశుక ఉవాచ

 ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమః

 తేషామంతర్ధధే రాజన్ స్వచ్ఛందగతిరీశ్వరః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ రాజా! స్వేచ్చచే ప్రవర్తిల్లే జగన్నాథుడైన పురుషోత్తమ భగవానుడు దేవతలనీ విధముగా ఆదేశించి, వారి మధ్యలో అంతర్ధానమాయెను.

అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహః

 భవశ్చ జగ్మతుస్స్వం స్వం ధామోపేయుర్బలిం సురాః

తరువాత బ్రహ్మగారు, రుద్రుడు శ్రీహరి భగవానుని కొరకు నమ స్కరించి తమ లోకములకు వెళ్లిరి. దేవతలు బలి చక్రవర్తి వద్దకు వెళ్లిరి.

దృష్ట్వారీనప్యసంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్

 న్య షేధద్దైత్యరాట్ శ్లోక్యస్సంధివిగ్రహకాలవిత్

దేవతలు తమకు శత్రువులే. కాని వారు యుద్ధము చేయుటకు సంసిద్దులై రాలేదు. రాక్షస సేనానాయకులు ఆ సంగతిని గమనించి చాల కంగారు పడిరి. సంధికి, యుద్ధమునకు తగిన కాలముయొక్క పరిజ్ఞానము గల బలి చక్రవర్తి తన వారిని వారించెను. ఆయన ప్రశంసించ దగిన వ్యక్తి.

తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయూథపైః

 శ్రియా పరమయా జుష్టం జితాశేషముపాగమన్

విరోచనుని పుత్రుడగు బలి సకలలోకములను జయించి సర్వో త్కృష్టమగు సంపదచే సేవించబడుచుండెను. రాక్షస సేనానాయకులు రక్షించుచుండగా, ఆయన సింహాసనముపై కూర్చుండి యుండెను. దేవ తలు ఆయనను సమీపించిరి.

మహేంద్రః శ్లక్ష్ణయా వాచా సాంత్వయిత్వా మహామతిః

 అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్

మహేంద్రుడు గొప్ప బుద్ధిశాలి. ఆయన మధురమగు వాక్కుతో బలికి నచ్చజెప్పుతూ, తాను పురుషోత్తముని వద్ద నేర్చిన విషయములన న్నింటినీ ఆయనకు చెప్పెను.

తదరోచత దైత్యస్య తత్రాన్యే యేసురాధిపాః

 శంబరోరిష్టనేమిశ్చ యే చ త్రిపురవాసినః

ఆ ప్రతిపాదనము రాక్షసరాజగు బలికి నచ్చేను. అంతేగాక, అక్కడ ఉన్న శంబరుడు, అరిష్టనేమి మొదలగు రాక్షస నాయకులకు, త్రిపు రములలో నివసించే రాక్షసులకు కూడా అది నచ్చెను.

తతో దేవాసురాః కృత్వా సంవిదం కృతసౌహృదాః

 ఉద్యమం పరమం చక్రురమృతార్థ పరంతప

శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! తరువాత దేవతలు, రాక్ష సులు మైత్రిని చేసుకొని ఒప్పందమును కుదుర్చుకొనిరి. అపుడు వారు అమృతము అనే ఫలమును గోరి, గొప్ప ఉద్యమమును చేసిరి.

తతస్తే మందరగిరిజసోత్పాట్య దుర్మదాః

 నదంత ఉదధిం నిన్యుశ్శక్తాః పరిఘబాహవః

వారందరు చాల గర్వించి యుండిరి. వారు సమర్థులు, గుదియల వంటి బాహువులు గలవారు. అపుడు వారు సింహనాదములను చేస్తూ బలముతో మందర పర్వతమును ఊడపీకి సముద్రము వైపునకు తీసుకు వెళ్లిరి.

దూరభారోద్వహశ్రాంతాశ్శక్రవైరోచనాదయః

 అపారయంతస్తం వోడుం వివశా విజహుః పథి

ఆ పర్వతమును చాల దూరము పైకెత్తి మోయుట వలన ఇంద్ర డు, బలి మొదలగువారు అలసిపోయిరి. దానిని ముందుకు మోసుకి పోయే శక్తి వారికి లేకుండెను. అపుడు వారు స్వాధీనత తప్పి ఆ పర్వ మును మార్గములో విడిచి పెట్టిరి.

నిపతన్ స గిరిస్తత్ర బహూనమరదానవాన్

 చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః

            ఆ పర్వతము బంగరు పర్వతమగుటచే దాని బరువు చాల ఎకి వ. కావుననే, దానిని కదల్చుట కఠినము. అది ఆ సమయములో మహా రముతో క్రింద పడినప్పుడు, దాని క్రింద పడి చాలమంది దేవతలు, రా సులు నలిగి మరణించిరి.

తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకంధరాన్

 విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః

ఆ విధముగా వారి బాహువులు, తొడలు, మెడలు విరిగి వారి ఉత్సాహము వినష్టమగుట తెలిసిన శ్రీహరి భగవానుడు అచట ప్రత్యక్షమయ్యెను. ఆయన ధ్వజముపై గరుత్మంతుని చిహ్నము ఉండును.

గిరిపాతవినిష్పిష్టాన్ విలోక్యామరదానవాన్

 ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వణాన్ యథా

             శ్రీహరి పర్వతము మీద బడి పిండి పిండి అయిన దేవతలను, రాక్షసులను చూచెను. ఆయన తన చూపుతో దేవతలను బ్రతికించెను. వారికి అప్పుడు గాయమే తగలలేదా యన్నట్లు ఉండెను.

గిరిం చారోప్య గరుడే హస్తేనైకేన లీలయా

ఆరుహ్య ప్రయయావబ్దిం సురాసురగణైర్వృతః

శ్రీహరి ఆ పర్వతమును ఒక్క చేతితో అవలీలగా గరుడునిపైకి ఎక్కించి తాను కూడ గరుడుని అధిష్టించెను. అప్పుడాయన దేవతలు, రాక్షసుల గణములు చుట్టువారియుండ సముద్రమునకు పయనమయ్యేను.

అవరోప్య గిరిం స్కంధాతుపర్ణః పతతాం వరః

 యయౌ జలాంత ఉత్సృజ్య హరిణా స విసర్జితః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే  సముద్రమథనాయ మందరాచలానయనం నామ షష్ఠోధ్యాయః

పక్షులలో శ్రేష్ఠుడగు ఆ గరుత్మంతుడు తన భుజమునుండి ఆ పర్వతమును క్రిందకు దించి నీటి మధ్యలో విడిచి పెట్టెను. శ్రీహరి అనుమ తిని పొంది ఆతడు వెళ్లెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో  సముద్ర మథన వృత్తాంతములో మందర పర్వతమును తీసుకువచ్చుటను వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).