22 - వామనావతారము - బలిపై శ్రీహరి ప్రసన్నుడగుట

శ్రీశుక ఉవాచ

ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాఽసురః

భిద్యమానోఽప్యభిన్నాత్మా ప్రత్యాహావిక్లవం వచః  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! బలి అనే ఆ రాక్షసుని భగవానుడీ విధముగా తిరస్కారము చేసెను. బలి మనస్సును సత్యమునుండి శుక్రాచార్యుడు చలింప జేసిననూ, ఆయన చలించలేదు. అట్టి బలి ఇట్లు బదులు చెప్పెను.

బలిరువాచ

యద్యుత్తమశ్లోక భవాన్ మమేరితం

వచో వ్యలీకం సురవర్య మన్యతే

కరోమ్యృతం తన్న భవేత్ప్రలంభనం

పదం తృతీయం కురు శీర్షై మే నిజమ్  

పవిత్రమగు కీర్తి గల ఓ దేవశ్రేష్ఠా! నేను పలికిన మాటను నీవు అసత్యమని తలచుచున్నావా అట్లైనచో, నేనా మాటను సత్యము చేసెదను. అది మోసపు పలుకు కారాదు. నీ మూడవ అడుగును నా తలపై నుంచుము.

బిభేమి నాహం నిరయాత్పదచ్యుతో

న పాశబంధద్వ్యసనాద్దురత్యయాత్

నైవార్థకృచ్చ్రాద్భవతో వినిగ్రహా-

దసాధువాదాద్భృశముద్విజే యథా

నేను అపకీర్తి వలన ఎంత అధికముగా భయపడెదనో, ఆ విధముగా నరకము వలన గాని, రాజ్యాధికారమునుండి జారిపోవుట వలన గాని, పాశముల బంధము వలన గాని, అతిక్రమించ శక్యము కాని ఆపద వలన గానీ, దారిద్యము వలన గాని, నీవు వేసే శిక్ష వలన గాని సుత రాము భయపడను.

పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితమ్

యం న మాతా పితా భ్రాతా సుహృదశాదిశంతి హి  

మిక్కిలి యోగ్యుడవగు నీవు వేసే శిక్ష మానవులకు మిక్కిలి కొని యాడదగినదని నా అభిప్రాయము. ఎందుకంటే, అటువంటి శిక్షను తల్లి, తండ్రి, సోదరుడు, మిత్రులు కూడ వేయలేరు.

త్వం నూనమసురాణాం నః పౌరోక్ష్యః పరమో గురుః

 యోనోఽనేకమదాంధానాం విభ్రంశం చక్షురాదీశత్

రాక్షసులమగు మాకు నీవు తెలియబడకుండా హితమును చేసే గొప్ప గురుడవు. పలువిధములైన, గర్వములతో గ్రుడ్డివారమై యున్న మమ్ములను నీవు రాజ్యభ్రష్టులను చేసి కనువిప్పును కలిగించితివి.

యస్మిన్ వైరానుబంధేన రూడేన విబుధేతరాః

 బహవో లేభిరే సిద్దిం యాము హైకాంతయోగినః .

ఆశ్చర్యము! చాలమంది రాక్షసులు నీయందు దృఢమైన వైరమును బూని ఆ కారణముగా నిన్నే నితరముగా స్మరించి, అనన్యమగు భక్తియోగనిష్ఠ గలవారు పొందే సిద్ధి (మోక్షము) ని పొందిరి.

తేనాహం నిగృహీతోఽస్మి భవతా భూరికర్మణా

 బద్ధశ్చ వారుణైః పాశైర్నాతివ్రీడే న చ వ్యథే  

             నీ లీలలు అనేకములు. అట్టి నీవు నన్ను వరుణపాశములతో బంధించితివి. అయిననూ, నేను అధికముగా సిగ్గు పడుట లేదు; పీడను కూడ పొందుట లేదు.

 పితామహో మే భవదీయసంమతః ప్రహ్లాద ఆవిష్కృతసాధువాదః

 భవద్విపక్షేణ విచిత్రవైశసం సంప్రాప్తస్త్వత్పరమస్స్వపిత్రా  

మా తాత ప్రహ్లాదుడు లోకప్రసిద్దమైన సత్కీర్తి గలవాడు. నీవే పరమలక్ష్యముగా గల ఆయన నీ భక్తులలో ఉత్తముడు. నీ శత్రువు, తనకు తండ్రియగు హిరణ్యకశిపుడు ఆయనను చిత్రహింసలు పెట్టెను.

కిమాత్మనాऽనేన జహాతి యోఽoతతః

కిం రిక్థహా రైస్స్వజనాఖ్యదస్యుభిః

కిం జాయయా సంసృతి హేతుభూతయా

మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః  

మరణించే స్వభావము గల మానవునకు ఈ లోకములో దేహముతో పని యేమి: అది అంతములో ఎలాగైనా విడిచిపెట్టేదే. నావారు అనబడే వారు ఆస్తిని అనుభవించేదోపిడీగాండ్రు. వారితో మాత్రము ప్రయోజనమేమున్నది: సంసారము కొనసాగుటకు కారణమయ్యే భార్యతో ప్రయోజనమేమి గలదు: ఇంటితో ప్రయోజనమేమి: ఇవి కేవలము ఆయుర్దాయము ఖర్చు అగుటకు మాత్రమే పనికి వచ్చును.

ఇత్థం స నిశ్చిత్య పితామహో మహా-

నగాధబోధో భవతః పాదపద్మమ్

 ధ్రువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్

భీతస్స్వపక్షక్షపణస్య సత్తమః

మా తాత ప్రహ్లాదుడు లోతైన జ్ఞానము గల మహాత్ముడు. దుష్టజనుల సంగము వలన భయపడే ఆ గొప్ప సత్పురుషుడు ఈ విధముగా నిశ్చయించుకొని, నీవు తన పక్షమువారైన రాక్షసులను మట్టుబెట్టిననూ, నీ పద్మమువంటి పాదమునే శరణు వేడెను. ఎందుకంటే, నీ పాదము నిత్య ము, సకలభయములనుండి రక్షణ నిచ్చును.

అథాహమప్యాత్మరిపోస్తవాంతికం

దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీః

 ఇదం కృతాంతాంతికవర్తి జీవితం

యయాऽధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే

దైవము నన్ను కూడ నాకు శత్రువైన నీ దగ్గరకు లాగుకువచ్చినది. నీవు బలాత్కారముగా నా సంపదను ఊడలాగినావు. అది మంచిదే. ఎందు కంటే, సంపద వ్యక్తియొక్క బుద్ధిని జడముగా చేయును. అట్టి జడబుద్ధి మృత్యువునకు వశమై యుండే ఈ జీవితము అనిత్యమనే సత్యమును గుర్తించడు.

శ్రీశుక ఉవాచ

 తస్యేత్థం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియః

ఆజగామ కురుశ్రేష్ఠ రాకాపతిరివోత్థితః

            శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ మహారాజా!, ఆ బలి ఇట్లు మాటలాడుచుండగనే, చంద్రుడు ఉదయించినట్లుగా, ప్రహ్లాదుడు విచ్చేసెను. ఆయన ఉదయించిన పూర్ణచంద్రుడు వలె నుండెను.

తమింద్ర సేనస్స్వపితామహం శ్రియా

విరాజమానం నలినాయతేక్షణమ్

ప్రాంశుం పిశంగాంబరమంజనత్విషం

ప్రలంబబాహుం సుభగం సమైక్షత

ఇంద్రునియొక్క సేనవంటి సేన గల బలి తన తాతగారైన ఆ ప్రహ్లాదుని చూచెను. ఆయన పద్మమువంటి నిడివి కన్నులతో శోభిల్లి ప్రకాశించెను. పొడవైన ఆ ప్రహ్లాదుడు పచ్చని వస్త్రములను ధరించెను. కాటుక వలె ప్రకాశించే ఆయన బాగా పొడవైన చేతులతో సుందరముగా నుండెను.

 తస్మై బలిర్వారుణపాశయంత్రితస్సమర్హణం నోపజహార పూర్వవత్

 ననామ మూర్ధ్నాఽశ్రువిలోలలోచనస్సవ్రీడనీచీనముఖో బభూవ హ.

నాగపాశములచే కట్టివేయబడి యుండుటచే బలి పూర్వమునందు వలె ప్రహ్లాదునకు అర్ఘ్యము మొదలగు పూజను చేయలేదు; కేవలము తల వంచి నమస్కరించేను. ఆయన కళ్లు నీటితో నిండి చంచలముగా నుండెను. ఆయన సిగ్గుతో తల దించుకొని యుండెను.

 స తత్ర హాసీనముదీక్ష్య సత్పతిం

సునందనందాద్యనుగైరుపాసితమ్

 ఉపేత్య భూమౌ శిరసా మహామనా

ననామ మూర్ధ్నా పులకాశ్రువిక్లబః

 గొప్ప జ్ఞానియగు ఆ ప్రహ్లాదుడు అక్కడ కూర్చునియున్న వామన భగవానుని చూచెను. సత్పురుషులకు రక్షకుడగు ఆయనను సునందుడు, నందుడు, గరుత్మంతుడు మొదలగు అనుచరులు సేవించుచుండిరి. ఆపుడా ప్రహ్లాదుడు గగుర్పాటుతో, కన్నీటితో కలవరపడుతూ తలవంచి దగ్గరకు వెళ్లి నేలపై సాష్టాంగ నమస్కారమును చేసెను.

ప్రహ్లాద ఉవాచ

 త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం

 హృతం తదేవాద్య తథైవ శోభనమ్

మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో

విభ్రంశితో యచ్చ్రియ ఆత్మమోహనాత్

             ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- సమృద్ధమైన ఇంద్రపదవిని బలికి నీవే ఇచ్చి నీవే లాగుకొంటివి. ఇది కూడ చాల బాగున్నది. ఎందుకంటే, బుద్ధికి మోహమును కలిగించే సంపదను ఊడకొట్టి నీవు వీనిపై గొప్ప అనుగ్రహమునే చూపితివి.

యయా హి విద్వానపి ముహ్యతే యతః

తత్కో విచష్టే గతిమాత్మనో యథా

 తస్మై నమస్తే జగదీశ్వరాయ వై

నారాయణాయాఖిలలోకసాక్షిణే  

ఓ నారాయణా! వివేకజ్ఞానము, ఇంద్రియనిగ్రహము కలవానికి కూడ సంపద మోహమును కలిగించును. అట్టిచో, సంపద గలవాడు ఎవ్వాడు ఆత్మతత్త్వమును యథాతథముగా దర్శించగల్గును: (దర్శించలేడు). జగన్నాథుడవగు నీవే సకలప్రాణులలో సాక్షిరూపముగా నున్నావు. నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను.

శ్రీశుక ఉవాచ

తస్యానుశృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః

హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనమ్   

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఆ ప్రహ్లాదుడు అంజలి ఘటించి వినుచుండగా, బ్రహ్మగారు (జగత్తునంతనూ శక్తి రూపముగా వ్యాపించియున్నవాడు) మధుసూదన (మధు అనే రాక్షసుని సంహరించిన) భగవానుని ఉద్దేశించి ఏదో చెప్ప గోరెను.

బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ తత్పత్నీ భయవిహ్వలా

ప్రాంజలిః ప్రణతో పేంద్రం బభాషేఽవాజ్ముఖీ నృప  

ఓ మహారాజా! తన భర్తయగు బలి బంధించబడి యుండుటను గాంచిన ఆయన భార్య భయముతో కంగారు పడెను. ఆ పతివ్రత ఇంద్రుని సోదరుడగు వామనునకు చేతులను జోడించి తలవంచి నమస్కరించి, ఇట్లు పలికెను.

వింధ్యావలిరువాచ

 క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతం తే

స్వామ్యం తు తత్ర కుధియోఽపర ఈశ కుర్యుః

కరుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి

త్యక్షప్రియస్త్వదవరోపితకర్తృవాదాః

ఓ ఈశ్వరా! నీవే నీ లీల కొరకై ఈ ముల్లోకములను సృష్టించితివి. కాని, కొందరు దుర్బుద్దులు ఈ జగత్తునకు తామే ప్రభువులమని తలపోయుచుందురు. వారు సిగ్గు విడిచి తామే కర్తలమని ఆరోపించుకొని పలుకు చుందురు. వారియందు ఆ ఆజ్ఞానమును కలిగించినది కూడ నీ మాయాశక్రియే. ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించేది నీవై యుండగా, ఆ దుర్బుద్దులు నీకు సమర్పించేది ఏది గలదు: (ఏమీ లేదు).

బ్రహ్మోవాచ

భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ

ముంచైనం హృతసర్వస్వం నియమర్హతి నిగ్రహమ్  

            బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ దేవదేవా! నీవే ప్రాణులను సృష్టించి పాలించెదవు. ఈ జగద్రూపముగా నీవే ప్రకటమైనావు. ఈ బలి యొక్క సంపదలన్నీ లాగుకొనబడినవి గనుక, వీనిని బంధమునుండి విడి పించుము. ఈతడు బంధించదగినవాడు కాదు..

కృత్స్నా తేనేన ధత్తా భూర్లోకాః కర్మార్జితాశ్చ యే

 నివేదితం చ సర్వస్వమాత్మావీక్లబయా ధియా  

ఈ బలి సమస్తమగు భూలోకమును, తాను పుణ్యకర్మలచే సంపాదించిన పుణ్యలోకములను, సర్వస్వమును కూడ నీకు సమర్పించినాడు. అయిననూ, ఈతని బుద్ధియందు దైన్యము లేదు.

యత్పాదయోరశఠథీస్సలిలం ప్రదాయ

దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యామ్

 అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం

దాశ్వానవిప్లవమనాః కథమార్తిమృచ్ఛేత్  

ఎవ్వడైననూ నిష్కపటముగా నీ రెండు పాదములకు అర్ఘ్యము నిచ్చి పచ్చగడ్డి పరకలతో చక్కని పూజను చేసినచో, అట్టివాడు ఉత్తమ మగు లోకములను పొందును. ఈ బలి దైన్యము లేని మనస్సుతో ముల్లోక ములను కూడ నీకు సమర్పించినాడు. అట్టి ఈతడు ఆపదను పొందుటకు ఎట్లు తగును?

శ్రీభగవానువాచ

బ్రహ్మన్ యమనుగృహ్ణామి తద్విశో విధునోమ్యహమ్

యన్మదః పురుషః స్తబ్ధో లోకం మాం చావమన్యతే

ఓ బ్రహ్మా! నేను ఎవనినైతే అమగ్రహిస్తానో, వాని సంపదలను లాగుకొనెదను. ఎందుకంటే, సంపదలచే గర్వించి వినయమును కోల్పో యిన వ్యక్తి లోకమును, నన్ను కూడ అవమానించును.

యదా కదాచిజ్జీవాత్మ సంసరన్నిజకర్మభిః

నానాయోనిష్వనీశోయం పౌరుషీం గతిమావ్రజేత్

అస్వతంత్రుడగు ఈ జీవుడు తన కర్మల ఫలమునకు తగ్గట్లుగా అనేకయోనులలో జన్మించి పరిభ్రమిస్తూ, ఏదో ఒకప్పుడు మనుష్యజ న్మను పొందును.

జన్మకర్మవయోరూపవిద్యైశ్వర్యధనాదిభిః

యద్యస్య న భవేత్ స్తంభస్తత్రాయం మదనుగ్రహః

ఆ మనుష్యజన్మలో ఈ జీవునకు వంశము, చేసిన గొప్ప పనులు, వయస్సు, రూపము, చదువు, అధికారము, సంపద, అనుచరులు మొదల గువాటి కారణముగా గర్వము లేకున్నచో, ఆ స్వభావము నా అనుగ్రహము మాత్రమే.

మానస్తంభనిమిత్తానాం జన్మాదీనాం సమంతతః

సర్వశ్రేయఃప్రతీపానాం హంత ముహ్యేన్న మత్పరః

వంశము, ధనము మొదలగువాటి కారణముగా గర్వించి అవినయ ముగా ఉండే వ్యక్తికి సకలకల్యాణములు సర్వవిధములుగా దూరమగును. నా భక్తుడు నిశ్చయముగా అట్టి వ్యామోహమును పొందడు.

ఏష దానవదైత్యానామగ్రణీః కీర్తివర్ధనః

అజైషీదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి

ఈ బలి దను దితివంశీయులగు రాక్షసులలో అగ్రేసరుడై కీర్తిని వర్దిల్ల జేసినాడు. ఈతడు జయించ శక్యము కాని మాయను జయించినాడు. కావుననే, ఆపదను పొందిననూ వ్యామోహితుడు కాలేదు.

క్షీణరిక్థశ్చ్యుతః స్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః

జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాతనామనుయాపితః

బలి సంపదను, అధికారమును కూడ పోగొట్టుకొని మనచే తిరస్క రించబడినాడు. శత్రువులగు మన చేతిలో బందీయై ఉన్న ఈతనిని జ్ఞాతులు విడిచి పెట్టిరి. ఈ విధముగా ఈతడు తీవ్రమగు పీడకు గురి చేయ బడినాడు.

గురుణా భర్త్సితశ్శస్తో జహౌ సత్యం న సువ్రతః

ఛలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్

ఈతని గురువగు శుక్రాచార్యుడు ఈతనిని బెదిరించి శపించిననూ, గొప్ప ప్రతనిష్ఠ గల ఈతడు సత్యమును విడిచి పెట్ట లేదు. నేను కూడ కప టవచనములతో అధర్మమును ధర్మముగా చెప్పితిని. అయిననూ, సత్యని ష్ఠుడగు ఈతడు తన ధర్మమును విడిచి పెట్టలేదు.

ఏష మే ప్రాపితః స్థానం దుష్ప్రాపమమరైరపి

సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః

నేనీతనికి దేవతలకు కూడ పోంద శక్యము కాని స్థానమునిచ్చుచు న్నాను. నేనే శరణుగా గల ఈతడు సావర్ణి మన్వంతరములో ఇంద్రుడు కాగలడు.

తావత్సుతలమధ్యాస్తాం విశ్వకర్మవినిర్మితమ్

యన్నాధయో వ్యాధయశ్చ క్లమస్తంద్రా పరాభవః

నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా

అంతవరకు ఈతడు విశ్వకర్మచే నిర్మించబడిన సుతలలోకము నకు అధిపతియై ఉండుగాక! అచట నివసించు వారలకు నా దయాదృష్టి కారణముగా శారీరక వ్యాధులు, మనోవ్యాధులు, అలసట, సోమరిదనము, పరాభవము, ఉపద్రవములు కలుగవు.

ఇంద్రసేన మహారాజ యాహి భో భద్రమస్తు తే

సుతలం స్వర్గీభిః ప్రార్ద్యం జ్ఞాతిభిః పరివారితః

బలి చక్రవర్తీ! సుతలము స్వర్గవాసులకు కూడ కోరదగినది. నీవు నీ జ్ఞాతులు చుట్టువారి రాగా, అచటకు వెళ్లుము. నీకు మంగళమగు గాక!

న త్వామభిభవిష్యంతి లోకేశాః కిముతాపరే

త్వచ్ఛాసనాతిగాన్ దైత్యాంశ్చక్రం మే సూదయిష్యతి

లోకపాలకులు కూడ నిన్ను అచట పరాభవించ లేరు. ఇతరులు పరాభవించలేరని వేరుగా చెప్పవలయునా? నీ శాసనమును ఉల్లంఘించే రాక్షసులను నా చక్రము సంహరించ గలదు.

రక్షి ష్యే సర్వతోऽహం త్వాం సానుగం సపరిచ్చదమ్

సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్

ఓ వీరుడా! నిన్ను, నీ అనుచరులను, నీ పరికరములను నేను అన్ని విధములుగా రక్షించెదను. అన్ని కాలములలో నీకు సుతలములో ఉపస్థితుడనైయున్న నేను కనబడెదను.

తత్ర దానవదైత్యానాం సంగాత్తే భావ ఆసురః

దృష్ట్వా మదనుభావం వై సద్యః కుంఠో వినంక్ష్యతి

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే

బలివామనసంవాదో నామ ద్వావింశోऽధ్యాయః

దను దితివంశీయులగు రాక్షసులతోడి సంగము వలన నీయందు కలిగిన అసుర (భోగ) ప్రవృత్తి అచట నా మహిమను చూచిన పిదప మంద గించి నశించగలదు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో బలిపై శ్రీహరి ప్రసన్నుడగుటను వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).