తా॥ శతానీకుడిట్లనెను “దేవా! సూర్యదేవునకు సంబంధించిన యీ కథనింకను వినిపింపుడు. ఈకథ నెంత వినుచున్నను నాకు తనివి తీరుటలేదు”. సుమంతుముని యిట్లు చెప్పఁదొడగెను. “పూర్వము లోకకర్తయైన బ్రహ్మదేవుడు ఋషులకుఁజెప్పిన సర్వపాప ప్రణాశకము, పుణ్యప్రదమునైన యీ భాస్కరుని కథను నీకు వివరింతును. సూర్యుని కిరణములచే తాపమునొంది, ఆతని తేజస్సుచే మిక్కిలి మోహితులైన ఋషులు బ్రహ్మలోకమున విరాజమానుడైన బ్రహ్మదేవునిట్లు ప్రశ్నించిరి. ప్రభూ! “అగ్నిదేవుని వలె మిక్కిలి ప్రకాశమానముగ వెలుంగుచున్ననీతఁడెవరు? ఇతని కింత ప్రభావమెచటి నుండి వచ్చినదో తెలిసికొనఁ గోరుచున్నాము”. వారి ప్రశ్నకు బ్రహ్మదేవుడిట్లు సమాధానమును చెప్పెను. స్థావర జంగమములన్నియు నశించి లోకములన్నియు చీకటీచే నిండియుండగా ప్రకృతిలోని గుణము కారణముగ ప్రవర్తింపగా పూర్వము బుద్దియనునది జనించెను. దాని నుండి. మహాభూతములను ప్రవర్తింపఁజేసెడి యహంకారముదయించెను. అట నుండి వాయువు, అగ్ని, జలము, ఆకాశము, భూమి యనునవి కలిగెను. వాని కారణమున నొక యండముద్భవించెను. ఆ అండము నుండి యీ యేడు లోకములు ప్రతిష్ఠింపబడెను. ఈ భూమి యేడు ద్వీపములతోను, ఏడు సముద్రములతోను కూడియుండెను. నేను, విష్ణువు, మహేశ్వరుడును పరివ్యాప్తమైయున్న తమస్సుచే మూఢులమై పరమేశ్వరుని ధ్యానించుచు నచటనే యుంటిమి. అప్పుడా తమోరాశిని ఛేదించుకొని ప్రాదుర్భవించిన మహాతేజమునుగాంచి ధ్యాన యోగముచే నాతేజః పుంజమును సూర్యభగవానుడని తెలిసికొంటిమి. మేమెవరికి వారుగా నా సూర్యభగవానుని పరమాత్మగ నెఱింగి యందమా దేవుని దివ్యమైన స్తోత్రములచే కీర్తించుటకుపక్రమించితీమీ.
తా॥ “దేవా! దేవతలందలో నీవాదిదేవుడవు. ప్రభువులందఱకు ప్రభుడవు నీవే. భూతములకాదికర్తవు. దేవదేవా! సనాతనా!. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, మునులు, కిన్నరులు, సిద్ధులు, పన్నగులు, పక్షులు మొదలగు ప్రాణులన్నింటికి జీవనమునీవే. నీవే బ్రహ్మవు నీవే మహాదేవుడవు. నీవే విష్ణుడవు. ప్రజాపతివినీవే. వాయువు, ఇంద్రుడు, సోముడు, వివస్వంతుడు, వరుణుడు నీవే. నీవే కొలస్వరూపుడవు. సృష్టి స్థితిలయకర్తవు. ఈశ్వరుడవు, నదులు, సాగరములు, శైలములు, విద్యుత్తు, ఇంద్రధనుస్సులు, ప్రళయముప్రభవమువీవే. వ్యక్తుడవు, అవ్యక్తుడవు, సనాతనుడవు నీవే . ఈశ్వరునకన్న పరతరుడవు. విద్యలలోకెల్ల నుత్తమ విద్యవు. శివుడవు. శివునకన్న పరతరుడవు. ఓపరమేశ్వరా! నీవు దేవదేవుడవు. అన్నివైపుల కాలు సేతులు గలవాడవు. అన్నిదిక్కుల కన్నులు, శిరస్సు, ముఖములు గలవాడవు. దేవా! నీవు సహస్రాంశుడవు. సహస్ర కిరణుడవు. భూర్భువస్సువర్లోకములు, మహర్లోక జనోలోక తపోలోకములు నీవే. ఎల్లవేళలయందు ప్రకృష్టముగా దీపించుచు సర్వలోకములను నీ కాంతులచే ప్రకాశింప జేయుచు దేవతాశ్రేష్ఠులకైనను దుర్నిరీక్ష్యుడవై వెలుగుచుండు నీ రూపమునకు నమస్కారము. సురసిద్దాదిగణములచేతను, భృగువు, అత్రి, పులహుడు మొదలగు ఋషుల చేతను సేవింపబడునదియు, శ్రేష్టమైనదియు, అవ్యగ్రమునునైన నీ రూపమునకు నమస్కారము. పంచేంద్రియములకుగాని, దశేంద్రియములకుగానీ, మనస్సుతోగూడిన ఏకాదశేంద్రియములకుగాని; దశేంద్రియములు, అంతఃకరణచతుష్టయము, జీవతత్త్వము అనునీపదునైదింటి నమాహారమునకుగానీ గమ్యమానముగాని స్థితిలో స్తూర్యమండలమునందున్న నీ రూపమునకు దేవతలమందఱము నమస్కరించుచున్నాము. విశ్వస్రష్టవు, విశ్వమయుడవు, విశ్వస్టితుడవు, విశ్వానరుడు మొదలగు ఋషులచేత, దేవతలచేతను పూజింపబడువాడవు, అచింత్యుడవునైన నీ రూపమునకు నమస్కారము.
తా॥ శ్రేష్టమైన యజ్ఞముల కన్నను, దేవతలకన్నను, లోకములకన్నను, ఆకాశము కన్నను నీవుపరుడవు. ఎవడతిక్రమింపరానివాడని ప్రసిద్ధుడో అట్టి పరునికన్న నీవు పరుడవు. పరమాత్మయని విఖ్యాతుడవైన నీ రూపమునకు నమస్కారము. తెలియరానివాడవు, ఆలోచనకందనివాడవు, ప్రత్యగాత్మ స్వరూపుడవు, అప్యయుడవు, అనాది నిధనుడవునైన నీ రూపమునకు నమస్కారము. కారణములకు కారణమైన వానికి, పాప వినాశకునకు, పంద్యులైన వారి వందనములు స్వీకరించువానికి, అన్ని ఫలములిచ్చువానికీ, జ్ఞాననిధికి, పంచదశాత్మకునకు సదా మా నమస్కారములు”. తేజస్సుల రూపమున నున్న సూర్యభగవానుడిట్లు దేవతలచే స్తుతింపబడి “మీ కెట్టి వరము నీయవలెను”? అని శుభావహమైన వాక్యమును బలికెను. దేవతలిట్లనిరి. “భగవన్! మిక్కిలి తేజోవంతమగు నీ రూపము నెవ్వరును సహింపజాలకున్నారు. కావున నో ప్రభూ! జగత్కల్యాణము కొఱకై దుర్నిరీక్ష్యమగు మీ రూపము కొంత సహనీయ స్థితినొందుగాక!". అని దేవతలు ప్రార్థింస, సర్వమునకు కర్తయగు సూర్యభగవానుడు “తథాస్త'ని లోకముల కార్యసిద్ధి కొఱకు కాలత్రయమును అనగా వేసవిని, వర్షమును, చలిని ఇచ్చువాడయ్యెను. అందుచే సాంఖ్యులు, యోగులు, ఇతర మోక్షార్థులు తమ హృదయములందున్న సూర్యభగవానుని ధ్యానింతురు. ఏ సల్లక్షణములు లేని వాడైనను, సర్వపాపములతోగూడిన వాడైనను, సూర్యదేవ సంబంధమగు కర్మలనాశ్రయించెనేని సర్వపాములనుండి తరించిపోవును. అగ్నిహోత్రముగాని, వేదములుగాని, భూరి దక్షిణలీయబడు యజ్ఞములుగాని భక్తితో చేసిన సూర్య నమస్కారమునందలి పదహారవ వంతు విలువనైన చేయవు.
సుమంతురువాచ :
తా॥ తీర్థములలో శ్రేష్ఠమగు తీర్థము. మంగళములకెల్ల మంగళము, పవిత్రములలో పవిత్రమునైన యా సూర్యభగవానుని శరణువేడుచున్నాను. బ్రహ్మాది దేవతలచేత స్తుతింపబడిన భాస్కరుని శరణువేడువారు సర్వపాపములనుండీ ముక్తులై సూర్యలోక ప్రాప్తినందెదరు. దివస్పతి, సేవాదులచే ప్రసన్నుడగునని వేదమున చెప్పబడినట్లు లోకములన్నింటికిని అతడు సేవ్యుడని తెలియవలేను. శతానీకుడిట్లనెను. “దేవతలచేత లేక ఋషులచేత సూర్యుని శరీరము లేఖనము చేయుటకేల ప్రతిపాదింపబడెనో నాకు దెలుపుడు”. సుమంతుముని యిట్లు సమాధానము చెప్పెను. “బ్రహ్మలోకమునందు సుఖాసీనుడై యున్న బ్రహ్మాదేవుని సమీపించి దేవతలు, రాక్షసులు, ఋషులు. సమాహిత చిత్తులై యతనితో నిట్లనిరి. “భగవన్! దేవతలందఱు పుత్రులుగాగల యీ సూర్యుడొకాశమున ప్రకాశించుచున్నాడు. ఇతనిచే నంధకారమంతయు పటాపంచలైపోవుచున్నది. కాని యితడతిశయముగ ప్రజ్వలించుచున్నాడు. దానిని గూర్చియే మేమించుకమాతో పరామర్శింపఁదలచితిమి-. స్థావర జంగమాత్మకమైన యీ జగత్తంతయు నీతని తేజముచే జల ప్రవాహముచే నదీతటము భ్రష్టమగుచుండేడు రీతి- నాశమును పొందుచున్నది. అతని తేజః ప్రసారాతిశయముచే మేమందఱము పీడితులమగుచున్నాము. మూర్చిల్లుచున్నాము. చూడుడు ప్రభూ! మీకు జన్మనిచ్చిన యీ పద్మమెట్లు వాడిపోయినదో!. ఆకాశమున, భూమి పైన, స్వర్గమున- ఎక్కడేనియు నీంచుకంత హాయిని పొందలేకున్నాము. దేవా! ఈతని తేజస్సును శమింపజేయుటకేదైన నుపాయము నాలోచింపుడు”. విష్ణువు మున్నుగా గల దేవతలు అసురులు, ఋషులు నివేదించిన విషయమును విని పద్మసంభవుడగు బ్రహ్మదేవుడు వారితో నిట్లనెను.
తా॥ మహాదేవుడు, మహాత్ముడైన ఇంద్రుడు మొదలగు వారితో సహా మనమందఱము కూడి సూర్యభగవానునికడకేగి యతనినే శరణువేడుదము”. అని బ్రహ్మదేవుడనగానే అప్పుడు బ్రహ్మవిష్ణ్వాది దేవతలందు కూడి లోకములను ప్రకాశింపజేయు సూర్యభగవానునొద్దకుఁబోయి యాతని శరణు జొచ్చిరి. వరుణాది దేవతలందఱును భక్తిభావ పమన్వితులై, వినమ్రులై యాతనిని స్తుతింపనారంభించిరి. బ్రహ్మవిషీశులు సూర్య భగవానునిట్లు స్తుతించిరి. “సురవరా! వేడివెలుగుల జేఁడవు, దేవతా శ్రేష్ఠులచే స్తుతింపఁబడు దేవదేవుడవైన నీకు నమస్కారములు, జడులను, అంధులను, మూగవారిని, చెవిటి వారిని, కుష్ఠురోగులను, సేన కష్ణుముగలవారిని, నానా విధములగు ప్రణములచే బాధపడువారిని వారి వారి రోగములను మాన్పి సంపూర్ణారోగ్యవంతులనుగా జేయుదువు. అట్టి దయా మయుడవైన నీకు నమస్కారము. జఠరమునందుండేడునగ్ని, విద్యుత్తు, మహత్తేజము, కన్నులకు సహ్యమగు సాధారణమగు వెలుఁగు, యజ్ఞములందుంచబడునగ్ని, తొలగింపబడునగ్ని ఉంచబడిన అగ్ని అని యిట్లు నీ రూపమనేక విధములుగనున్నది. దేవతలకు శత్రువులును, సముద్ర జలములందుండువారును, భయంకరములగు పాశములు, ఖడ్గములు, గండ్ర గొడ్డళ్లు మొదలగు నాయుధములు ధరించినవారును. మిక్కిలి పొడవైన భీకరాకారములు గలవారును, భూమిపై పాపబుద్దిగలవారునైన రాక్షసులు నీ దర్శనము వలన నశించిపోయెదరు. సమస్త తీర్థ ఫలము నీవే అయినందున, యజ్ఞములందు భగవానుడవగు నీవే యున్నందున మనుష్యులకందఱకు సమముగా శాంతి నిచ్చువాడవు నీవే యనుట నిర్విచార్యము. నీకు నమస్కారము. బుధులు తపమని దేనినందురో అది నీ మహాతేజమే యని పండితులు దానిని కాంక్షించుచుందురు”. రాజా! సూర్య భగవానుడిట్లు బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడి, చెవులతో వారి నూటలను వినుటయందు శ్రద్ధ చూపెను. “అన్ని వైపుల నున్న దేవతలందఱు భక్తి నమ్రులై, నన్ను ముందున్న వానిగఁజేసికొని, శివుడు, విష్ణువు నా వెనకనుండ, వారి వెనకనుండిన దేవతలందఱు సూర్య భగవానుని మఱల నిట్లు స్తుతింపసాగిరి. త్రిభువనముల కైశ్వర్యమిచ్చువాడు, యజ్ఞాది కర్మలకు సత్ఫలమునిచ్చువాడు, ప్రతి దినము జరుగు కర్మలన్నింటికి సాక్షి భూతుడు, వేయి వెలుగుల వేల్పును అయిన సూర్య దేవునకు పదేపదే నమస్కరించుచున్నాము. ఏడు గుఱ్ఱముల (రథము)తోఁగూడినవాడు, అక్షయుడు, గుఱ్ఱములకు నిలుకడగల పగ్గములను గూర్చుకొని యుండువాడు, వాలఖిల్యులు, అప్సరలు, కిన్నరులు, పన్నగులు, సిద్ధులు, గంధర్వులు, పిశాచులు, మనుష్యులు, యక్షులు, రాక్షస గణములు, గుహ్యకులు మున్నగువారిచే నిరంతరముగ స్తుతింపబడుచుండెడు నో దేవదేవా! నీకు మాటిమాటికినీ నమస్కరించుచున్నాము. నీ కిరణములచేత, హిమము చేత, జలము, స్వేదములను స్రవించుటలచేత శరీరధారుల రసములను సంగ్రహపఱచుచుందువు. జగత్తును శోషింపఁజేయుచుందువుకూడ. కాబట్టి లోకమున నీవు జగల్లక్షణ నిరూపకుడవు”
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “వారందటి యభిప్రాయమును గమనించి సూర్యదేవుడు శాతనమునకు తన యామోదమును ప్రకటించెను. ఇట్లు సూర్య దేవుననుజ్ఞ లభింప దేవతలందఱును సంతుష్టాంతరంగులైరి. మనో వాక్కాయ కర్మలచే విశ్వకర్మను పూజించిరి. “భగవన్! మీ యాదేశానుసారముగ మీ రూపము నీ విశ్వకర్మ సౌమ్య మొనర్చుగాక" యని మఱియొక మారనుజ్ఞ వడసిరి. సర్వ కర్మ విధానములందు నిపుణుడైన విశ్వకర్మ సూర్య భగవానుని పై శాతన యంత్రము నారోపించెను. అమృతాభిషిక్తుడైన సూర్యప్రభుని తేజస్సుల లేఖన క్రియను విశ్వకర్మ మెల్లమెల్లగా సాగింపుచుండెను. మోఁకాళ్ల వఱకు లేఖనము పూర్తియైన పిమ్మటనిక సర్వసురాసుర పూజితుడగు సూర్య దేవుడా యుల్లేఖన క్రియనటు పై సాగించుట కష్టపడకుండెను. అప్పటి నుండీ యతని కాళ్లు రెండును ఒకదానినొకటీ చుట్టుకొనియే యుండెను. తపింపఁజేయుటచేతను, అలసట నొందింపఁ జేయుటచేతను సూర్యదేవుడు తగు మాత్రము తేజస్సు గలవాడయ్యెను. సూర్య దేహమును చెక్కడము చేయుటచే నేర్పడిన తేజముతో నొక చక్రము నిర్మింపబడెను. దానితోడనే విష్ణు దేవుడు భయంకరులగు రాక్షసులను సంహరించెను. అంతేకాక ధీశాలియగు విశ్వ కర్మ, ఇంకను మిగిలిన తేజముతో శూలములు, శక్త్యాయుధములు, గదలు, వజ్రాయుధములు, ధనుస్సులు, గండ్రగొడ్డళ్లు చేసి దేవతలకిచ్చెను.
తా॥ త్రిమూర్తీ కృతమగు స్తోత్రమును ఉభయ సంధ్యలయందు జపించు పురుషుడు కులమును పవిత్రము చేయును. అతనిని వ్యాధులేవియు పీడింపవు. సంతాన వంతుడై సఫల కర్ముడై నూఱు సంవత్సరములు సంపూర్ణ జీవితమును గడుపును. పుత్రవంతుడై ధనవంతుడై, అంతటనజేయుడై జీవించి పాంచ భౌతిక శరీరమును విడిచి సూర్యలోకమునకుఁబోవును. మూడు లోకముల నుండి యేతెంచిన దేవతలు, దేవరులు సూర్య భగవానుని తమ వాక్కులచే మఱల నిట్లు సంస్తుతించిరి “స్తుత్య రూపుడవు, సోమరూపుడవు, యజుఃస్వరూపుడవు, అధర్వ రూపుడవు, ఆంగిరసుడవునైన నీకు నమస్కారము. జ్ఞానమునకు నివాస స్థానమైన వాడవు, చీఁకటిని విడిచిన వాడవు, శుద్ధ జ్యోతిః స్వరూపుడవు, నిస్తత్యుడవు, శుద్ధాత్మ స్వరూపుడవైన నీకు నమస్కారములు. ఆత్మ మూర్తీగ నఖిల జగత్తునందు వ్యాపించి యున్నవాడవు, సర్వమునకు కారణమైన వాడవు జ్ఞాన చేతస్కులకు ధ్యేయ స్వరూపుడవైన నీకు నమస్కారములు. జేయ రూపుడవు, ప్రకాశ స్వరూపుడవు, వివిధ రూపములనొందిన వాడవైన నీకు నమస్కారమగు గాక! భాస్కరుడవగు నీకు నమస్కారము. వేద కర్తవగు నీకు నమస్కారము. నీవే ఈ సంసారమున కంతటికి కారణభూతుడవు. సంధ్యా రూపుడవు. వెన్నెల వెలుగువు. భగవన్! ఈ సర్వము నీవే. నీ మూలముననే జగత్తంతయు చరించుచున్నది. అట్టి నీకు నమస్కారము. సచరాచరమైన బ్రహ్మాండమంతయు నిటులే చైతన్యవంతమై భ్రమించుచుండుగాక! నీ కిరణములచేతనే యీ సర్వస్వము సృష్టింపబడినది. కానీ చేతనే యీ సృష్టియంతయును పవిత్రమగుచుండును. నీ కిరణ స్పర్శ జలాదులను పవిత్రమొనరించును. జగత్తుతో పవిత్రుడవగునీవు, సంయోగింపనంత వఱకు హోమదానాది ధర్మము ఉపకరింపజాలదు. నీవు ఉదయించిననేకదా ప్రాతః కాల హోమము ప్రశస్తమగునది! ఋక్కులు, యజుస్సులు, సామములు అన్నియు నీవే! ఓ జగత్పతీ! జగత్తిట్లు తపించుచున్నది. హే జగన్నాథా! నీవు ఋగ్వేదమయుడవు. నీవే యజుర్వేదమయుడవు. సామములును నీవే. అందుచే వేదత్రయమయుడవు నీవే. పరబ్రహ్మ, అపరబ్రహ్మ స్వరూపుడవునీవే. మూర్తిమూర్తరూపుడవు, సూక్ష్మ రూపుడవునీవే. స్థూల రూపముగ నుండువాడవునీవే. నిమేషము, కాష్ఠ (పదునెనిమిది తెప్పపాట్లకాలము) మున్నగు విభాగములతో వ్యవహరింపబడు కాలమునీవే. ప్రళయమునీవే. తేజోమయమగు నీ రూపమును స్వచ్ఛందముగ నియంత్రించి ప్రసన్నుడవు కమ్ము".
తా॥ తేజోరాశి, అవ్యయుడునైన సూర్య భగవానుడిట్లు దేవతలచేత, ఋషులచేతను స్తుతింపబడి తన తేజస్సును కొంత వదిలి వేసెను. అతని ఋజ్మయమైన (ప్రకాశవంతమైన) తేజస్సుచే భూమి, యజుర్మయమగు (యజ్ఞాగ్ని) తేజముతోఁగూడిన దయియును, సూర్య దేవుడు తాను మాత్రము సామమయుడై (శాంతుడై) ఆకాశమునధివసించేను. మహాత్ముడైన విశ్వ కర్మ తాను శాతనము చేసిన సూర్య తేజస్సు యొక్క పదునైదు వంతుల భాగముతో శంకరునకు దారుణమైన శూలమును. అటులే విష్ణు దేవునకు చక్రమును, వసువుల కాయుధములను, కార్తికేయునకు శక్త్యాయుధమును, కుబేరునకు పల్లకిని. యక్షులు, విద్యాధరులు మున్నగు నితరదేవతలకు వివిధములైన భయంకర శస్త్రములను నిర్మించి యిచ్చెను. ఇట్లాయుధములు మొదలగు వాని నిర్మాణమునకై యుపయోగింపగా నింకను భగవానుడైన రవి పదునాఱు భాగముల తేజస్సును తన శరీరమున భరించుచుండెను. ఆ తేజస్సు నుండియు పదునైదు వంతులు విశ్మ కర్మచే తేజితము చేయబడేను, అప్పుడు సూర్య భగవానుడందమైన రూపము గలవాడై యుత్తర కురుదేశములకుఁబోయి అచట గుఱ్ఱము రూపముననున్న తన భార్యయగు సంజ్ఞాదేవిని చూచేను. ముని సత్తములారా! సూర్య దేవునికి సంబంధించిన కథనంతయును మికుఁదేలిపితిని. భక్తి శ్రద్దలతో నిది విను వాడశ్వమేధ యాగమును చేసిన ఫలమును బొందును.
శ్రీ భవిష్య మహాపురాణ బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు బ్రహ్మర్షి సంవాదమున పరీలేఖన వర్ణనమను నూట యిరవది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 123 of the Bhavishya Purāṇa is as follows:
The procedure for drawing the sacred geometric diagram — the maṇḍala — that serves as the ritual ground for Sūrya worship is described. The maṇḍala is drawn on a freshly purified floor using rice flour, turmeric, and red and white powders. Its structure represents the solar cosmos: Sūrya at the centre, the twelve Ādityas in the twelve outer positions, the seven horses in seven peripheral positions. The procedure for drawing each element — the lines, the lotus petals, the outer boundary — is given with its accompanying mantras. The completed maṇḍala is then used as the base for the pūjā: the image of Sūrya is placed at the centre, and all offerings are made within the sacred geometric space that the maṇḍala has established.