తా॥ కశ్యపుడిట్లనెను. “పాము కోఱల మధ్యగల 'యమదూతి' మను పేరుగల విషపు కోఱకాటుపడినచో నట్టివానికిక తెలిసిన వారు చికిత్సచేయనక్కఱలేదు. అతడు మరణించుననియే చెప్పవలెను. పగలు, రాత్రి, రెండవ, పదునాఱవ ప్రహరార్థము (అరజాము) పైన-ఒక జాముతో సమానమన్నను సరియే. సర్పములకు సంబంధించి అది నాగోదయవేళ అనబడును. అట్టి సమయమున సర్పముచే కొట్టబడినను, కాటువేయబడినను, చీల్చబడినను అట్టివానిని కశ్యపవాక్యముననుసరించి కాలదష్టుడనీ తెలియవలేను. నీటినుండీ బయటకు లేవనెత్తబడిన తోకకొననుండి ఎన్ని బిందువులు వెలువడునో అంతప్రమాణమున పాముకోటనుండి దారుణమైన విషము స్రవించును. మొత్తము శరీరమునందలి నూజు నాడులలోనికి ఆవిషము సంక్రమించును. చేతిని చాచినంత, లేక ముడిచినంత కాలముననే విషము ప్రసరించును. ఆక్షణమాత్రమునకే ఆ విషము నెత్తికెక్కును. అప్పుడా విషవేగప్రభావమున దష్టుడు నూఱు విధములుగ, వేయి విధములుగ వణికి పోవుచుండును. వాయువు వలన అగ్ని రగుల్కొని మంటలులేచునట్లు విషము, రక్తమున గలసి వృద్ధిపొందుచుండును. తైలబిందువు నీటఁగలిసి వ్యాపించునట్లు విస్తరించుచుండును. శరవేగమునకు వాయువేగముతోడైనట్లు శరీరమున పెక్కుచోట్లకు ప్రాకుచు చర్మములోనికి దూసుకొని వచ్చును. ఆ విషము చర్మమున రెండింతలు, రక్తమున నాలుగింతలు, పిత్తమున మూడింతలు, శ్లేష్మమున పదునాంతలు. వాతమునముప్పదింతలు, మజ్జలో అణువదింతలునై, ప్రాణమునందు ఒక కడలియంతై అవయవములన్నింట వ్యాపించును.
తా॥ శ్రవణ శక్తి నిరోధింపబడుటతో దష్టుడు చికిత్సకు లొంగని ప్రమాదమున పడిపోవును. అప్పుడు ఉచ్చ్వాస నిశ్వాసలు ఆగిపోయి అతడు మరణించును. ప్రాణములు పోయిన తరువాత భూతములు పంచత్వమునొందును. అవి తమతమ స్థానములు చేరుకొనును. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము-వీని కలయికయే శరీరమనబడును గదా!. భూమి భూమిని, చేరును, నీరు నీటఁగలయును, అగ్నిసూర్యునిలో లీనమగును. గాలి గాలిని చేరును. ఆకాశమాకాశమున వానితోడనే లీనమగును. అవియన్నియు పరస్పర నియోగమున తమతమ తావులనొందును. అంత్యకాలము దాపురించినవాడు బ్రతుకజాలడు. పాము విషముచే బాధనొందువానిని ఉపేక్షింపక వెంటనే చికిత్సచేయింపవలెను. లోకమున విషమంతయునొకటియే. మఱియొకటి ఆ ఒకదాని నుండియే కలుగును. సర్పాదీ ప్రాణుల విషము ప్రాణాంతకమైనట్లుగ నితర విషములు కూడా అదేధర్మము కలిగియుండును. మొదటి విషవేగమున రోమాంచము కల్గును. రెండవ వేగమున అవయవములు చెమట పట్టును. మూడవ వేగమున అంగములలో కంపము పుట్టును. విషము యొక్క నాల్గవ వేగమున చెవులు వినబడకపోవును. ఐదవ వేగమున ఎక్కిళ్ళు; అవయములుండియుండి చలించుట కలుగును. ఆఱవవేగమున ప్రాణములు వేరగుచుండును. ఏడవవేగమున మరిణించును. శరీరమునందలి సప్తధాతువులలో విషము వ్యాపించుటను గూర్చి గరుడుడు చెప్పెను.
తా॥ చర్మమునందు విషము వ్యాపించిన వాని లక్షణములను చేప్పెదను. వినుము. అవయములు పట్టుదప్పును. చీకట్లు గ్రమ్మును. మాటిమాటికీ శరీరమున మండినట్లుండును. ఇవి విషము చర్మమున వ్యాపించిన వాని లక్షణములు. ఈ బాధ తొలగి సుఖము కలుగుట కొఱకు ఔషధమును చెప్పెదను వినుము. జిల్లేడు వేరు, ఉత్తరేను, పిప్పనందివర్ధనము ఇవియన్నియు నొక్కచోబాగుగా నూరి దష్టున కీయవలెను. బాధ ఉపశమించును. బాధానివారణ కాని యెడల విషము చర్మస్థానమును భేదించుకొని రక్తములోనికి పరుగెత్తినదని యెంచవలేను. విషము రక్తగతమైనప్పటి లక్షణములు వినుము దాహమెక్కువగును. మూర్చవచ్చినట్లుండును. శీతల పదార్థము లిష్టమగుచుండును. ఈ లక్షణములగుపడినచో విషము రక్తమున చేరినదిగా భావింపవలెను. అట్టి స్థితిలో నీయవలసిన ఔషధమును చెప్పెదను, ఆ ఔషధముతో రోగికి ఉపశమనము కలుగును. వట్టివేరు, చందనము, చెంగల్వకోష్టు, నందివర్ధనము, మహాకాల మూలములు, వావిలివేళ్ళు, ఇంగిలీకము, మిరియములు ఇవి నూరి త్వరితముగా నీయవలెను. ఆ పిదప రెండవ తడవ వాఁకుడు, తేలుకోండి, జటామాంసి, పెద్దపాపర, వేరు, సప్తగంధ ఘృతము ఈయవలెను. మూడవ పర్యాయము వావిలి, ఇంగువ ప్రయోగింపవలెను. దానినే త్రాగించి, కాటుకగా కన్నులకు రాచి, గాయముపై ఒంటికి రాయవలేను. ఈ ఉపచారముచే పాము కఱచిన వానికి ఉపశమనము కలుగును. విషము రక్తస్థానమునుండి పిత్తస్థానమునకు పరుగెత్తును.
తా॥ పిత్త స్థానమును చేరిన విషలక్షణములను గూర్చి చెప్పెదను వినుము. పాముకాటుకు గుజియైనవాడు పడుచు లేచుచునుండును. ఒడలంతయు మంటగానుండును. మూర్చపడిపోవును. శరీరము పసుపు వన్నెకు మారును. దిక్కులన్నియు పచ్చగా కనబడుచుండును. మూర్ఛబలీయమై తనను తాను మఱచిపోవును. ఇట్టి విషచర్యకు ప్రతిక్రియ చేసినచో రోగికి కొంత బాధ తీరి సుఖము కలుగును. పిత్తస్థానము నుండి విషము శ్లేష్మస్థానమునకు చేరును. పిప్పళ్లు, అతిమధురము, పులకండము, నేయి, తేనే, సొరకాయ, జాజి, నూఁగుదోస, పెద్దపాపర-వీనిని గోమూత్రములో నూరిపిండీగా చేయవలెను. దానిని నస్యముగా పీల్పించవలెను. దానినే నీటఁగలిపి త్రాగింపవలెను. ముద్దగఁజేసి కన్నులకుఁబూయవలెను. ఒంటికి రాయవలెను. ఈ ఉపచారముచేత రోగికి సుఖము కలుగును. ఇక విషము శ్లేష్మస్థానము చేరిన వాని లక్షణములను వినుము. అంగములు మొద్దుబారి పోవును. ఊపిరి విడుచుట అసాధ్యమగును. చొంగకారును. గొంతులో గురగుర శబ్దము వినిపించును. ఈ లక్షణములు గలవానికి, విషము శ్లేష్మమున చేరినదని గ్రహింపవలెను. దానినుండి ఉపశమనమును కలుగుటకు ఔషధమును చేప్పెదను, సొంటి, పిప్పలి, మిరియాలు, విరిగిచెట్టు, లోద్దుగుచేట్లు, తేనే-వీనిని సమభాగములుగా తీసికొని ఆవు మూత్రములో మెత్తగా నూరవలేను. దానిని రోగి చేత త్రాగింపవలెను. దానినే కాటుకగా (కండ్లకు) లేపనముగా (శరీరమునకు) వాడవలెను. ఈ ఉపచారముచే దష్టుడు తేలికపడును. శ్లేష్మస్థానమును దాటి విషము వాతస్థానమును చేరును. ఆ లక్షణములను చేప్పెదను. వినుము.
తా॥ కడుపు ఉబ్బిపోవును. దృష్టిమందగించుటచే బంధువులను చూడజాలకుండును. దృష్టి భంగమగును. ఈ లక్షణములు కనబడినచో విషము వాత గతమైనదిగా నెంచవలెను. ఇట్టి బాధనుండి తప్పించి రోగిని సుఖిని చేయుటకు ఔషధమును చెప్పెదను. దుండిగపువేరు, మోరటి, కుంకుమపువ్వు, గజపిప్పలి, చొరంగి, వస, పిప్పలి, దేవదారు, ఇప్ప. ఇప్పమూలగ, వావిలి, ఇంగువ. వీనిని ఒక్కచోట నూరి మాత్ర(లు) చేయవలెను. అది దష్టునిచే మ్రింగింపవలేను. అంజనముగ, లేపనముగ కూడా దానిని ఉపయోగింపవలెను. ఈ ఔషధము సర్పముల విషమును హరించును. విషయుక్తునకు అంజనము, నస్యము త్వరితముగ నీయవలెను. వాయుస్టానమునుండి విషము మజ్జాస్టానము చేరును. విషము మజ్జ (ఎముకలలోని నేయి)లో చేరిన వాని లక్షణములను చేప్పెదను వినుము. అతని చూపు నశించును. అవయములు మిక్కిలిగా పట్టుదప్పును. ఈ లక్షణములు గలవానికి విషము మజ్జిగతమైనదిగా భావింపవలెను. ఇట్టివానికి సుఖము కలిగించునౌషధమును తెలుపుచున్నాను. నేయి, తేనే, శర్కరతో కూడిన వట్టివేరు, చందనము-వీనిని బాగుగా నూరి పొడిచేసి నీటఁగలిపి త్రాగింపవలెను. పొడిని ముక్కుద్వారా పీల్పించవలెను. దష్టుని బాధ తగ్గి హాయిగా నుండును. ఈ ఔషధప్రయోగమున అతని విషము నివర్తించును.
తా॥ మజ్జాస్థానము నుండి విషము మర్మస్థానమునకుఁబోవును. అది మర్మస్థానమును చేరిన వెంటనే సర్పదష్టుడెట్లగునో వినుము. చేష్టలు దక్కే క్రింద పడును చెవులు వినబడక చెవిటి వాడగును. పైన నీళ్లు చల్లినను చలింపడు. కఱ్ఱతో కొట్టినను ఒంటిపై దండముద్రపడదు. శస్త్రముతో శరీరము పై గాటు వేసినను రక్తము స్రవింపదు. వెంట్రుకలు లాగినను నొప్పి కలుగదు. చెవులు, ప్రక్కలు, కాళ్ళు, చేతులు, సంధులు శిథిలమై వ్రాలిపోవును. అతడు మరణించెనని వినబడుచుండును. గౌతమా! ఇట్టి విపరీత లక్షణములేర్పడినను-కశ్యపవాక్యముననుసరించి-అతడు మరణించలేదని యెఱుంగవలెను. వైద్య శాస్త్రమున సరియైన శిక్షణలేని వైద్యులు ఈ విషయమును గమనింపజాలరు. మంత్రోషధ ప్రయోగ నైపుణ్యము గల చికిత్సకులు మాత్రమే ఇది గమనింతురు. సర్పదష్టుడట్లు మృతప్రాయుడైయున్న సమయముననుపయోగింపవలసిన ఔషధమును గూర్చి స్వయముగ రుద్రుడు చెప్పిన దానిని నేను చెప్పుచున్నాను. మయూర పిత్తము (నెమలిధాతువు), మార్జాలపిత్తము (పిల్లిధాతువు), గంధనాడి వేరు, కుంకుమ పువ్వు, నందివర్ధనము, చెంగల్వ కోష్టు, కసింద (కాసమర్ధము) పై బెరడు, కలువ, తామర, తెల్లగలువ కేసరములు (ఆకరువు) . వీనిని సమభాగములుగా తీసికొని గోమూత్రమున మెత్తగా మర్దించి దానిని సర్పదష్టునికీయవలెను. ఈ ఔషధము చేతనుండగా సర్పదష్టుడు మరణింపడు. కాల సర్పముచే కాటు వేయబడినను ఈ మందు అతనిని వెంటనే విషరహితునిగఁజేయగలదు. ఈ మృత సంజీవిని సత్వరమే రోగికి ఈయవలెను. బుద్ధిమంతుడైన వాడు అదే ఔషధమును అంజనముగను, నస్యముగను ఆలస్యముగాకుండనీయవలెను.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున - పంచమీ కల్పమునందు ధాతుగత విషక్రియావర్ణనమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 35 of the Bhavishya Purāṇa is as follows:
The systematic progression of snake venom through the seven dhātus — the seven bodily tissues of Āyurveda: rasa (plasma), rakta (blood), māṃsa (muscle), medas (fat), asthi (bone), majjā (marrow), and śukra (reproductive tissue) — is described. As the venom advances through each successive dhātu, a characteristic set of symptoms manifests, allowing the physician to gauge the depth of the poisoning. The treatments appropriate at each stage — which include both physical remedies (herbs, counter-irritants, excision) and mantric remedies (specific nāga-nāmas to be recited) — are given. The chapter integrates the Āyurvedic theory of dhātu-vikāra with the Purāṇic theology of nāga-śakti, presenting healing as simultaneously a physical and a spiritual process.