తా॥ సుమంతుముని యిట్లనెను. “సప్తమినాడు ఉపవసించినవాడు, లేక రాత్రి భోజనము మాత్రము చేయువాడు-సప్తమి తిధియందు సూర్యభగవానుడు పొందిన తేజో రూపమును పొందగలదడు. సూర్యదేవుడు అండముతోడనే పుట్టి అండముతోడనే పెరిగెను. అండమునందుండీయే దక్షుని పుత్రికను వివాహమాడెను. 'రూప' అను పేరు గల ఆదక్షకన్య రూపము చేత, పేరు చేత కూడ విలక్షణమైయుండెను. దీర్ఘకాలము అండమునందుండుటచే సూర్యుడు మార్తాండుడని పేరువడసెను. దక్షుని యాజ్ఞచేత విశ్వకర్మయితని శరీరమును ప్రకాశవంతమొనర్చెను. ఆ ప్రకాశము వలన నతనికి భాస్కరాది నామములేర్పడెను. అండమునందే స్థితుడైయున్న యీతనికి యమున, యముడు అను నిద్రకు జన్మించిరి. అతని భార్యయగు రూపాదేవి దుః ఖము చేతను, వైరాగ్యముచేతను నిర్వేదమును పొందియిట్లు చింతించెను. ఆహో! నా భర్తయగు సూర్యభగవానుని రూపమెంత తేజోమయమైనది! ఎంత కాంతివంతమైనది!! విరజిమ్ము వెలుగుల మధ్య అతని శరీరమెంత మాత్రమును నేను చూడజాలకున్నాను. బంగారు వన్నెతో సుందముగ ప్రకాశించెడునా రూపమితని మిక్కుటమగు తేజస్సుచేత దగ్ధమైపోయి యిప్పుడు నలుపువారినది. కావున నుత్తర కురుదేశములకుఁబోయి తపమాచరింతును." ఇట్లాలోచించి శాపభయమున తనకు మారుగ తన ఛాయనచటనే యుండనియమించి, ఆమెతో నీ రహస్యమును తనభర్తకు తెలుపకుండునట్లు కట్టడిచేసి తాను ఉత్తర కురుదేశములకు వెడలిపోయెను. తన 'నిజ'రూపమునటనుంచి ఆడుగుఱ్ఱము రూపమును ధరించి, అనేక సంవత్సరములుగానచ్చట నితర మృగములతో బాటు సంచరింపసాగెను.
తా॥ సూర్యదేవుడు కూడ ఛాయాదేవిని భార్యగానే భావించెను. ఆమెయందతడు శని, తపతి అను నిరువుర సంతానమును బడ సేను. ఇంక ఛాయ తన సంతానమైన శనినీ తపతిని ప్రేమతో చూచుచు తన సవతి సంతానమైన యమ యములనంత ప్రేమతో చూడకుండేను. సూర్యపుత్రికలైన తపతీ యమునల మధ్య వివాదమేర్పడెను. ఆ వివాదమున నొకరినొకరు శపించుకొని నదులైపోయిది. ఒకనాడు యమున సోదరుడగు యమునిని ఛాయాదేవి కొట్టెను. దానితో యముడు కుపితుడై ఛాయను తన్నుటకై పాదమేత్తేను. దాని పై ఛాయ రోషముతో నాతనినిట్లు శపించెను. “మూర్ఖుడా! నన్నుకొట్టుటకు కాలెత్తితివి గావున జీవుల ప్రాణములను హింస పెట్టెడు భీభత్సమైన వృత్తి. నీ కాచంద్రార్కము కలుగును కాక! నా శపమువలన కలుషీకృతమైన నీ పాదమును భూమి పై మోపితివేని దానిని కీటకములు తినివేయును”. ఇట్లు వీరు కలహించుచున్న సమయమున నచటికి సూర్యుడు వచ్చెను. లోకపావనుడైన సూర్యునితో యముడిట్లనెను. “తండ్రీ! ఈమె మమ్మెప్పుడును క్రూరభావముతో చూచును. ఈమెకు మా యందు తన బిడ్డలతో సమానముగ చూచు దృష్టి లేనట్లు కన్పించుచున్నది.” ఆమాటవిని సూర్యుడు మిక్కిలి కోపించి ఛాయాదేవితో నిట్లనెను. “ఇద్దఱును సమానులేకదా! మూఢాత్మురాలా! వీరినందఱను సమానమున నెందుకు చూడవు”?.
తా॥ యముడు తన తండ్రియగు సూర్యునితో నీట్లు చెప్పెను. “తండ్రీ! ఈమే మా తల్లికాదు. పాపాత్మురాలగునీమె మా తల్లియొక్క ఛాయ మాత్రమే. ఈమె నన్ను శపించినది.” ఈ విషయముతోబాటు యమునా తపతుల వృత్తాంతము-తక్కిన వివరములన్నింటిని తండ్రికి నివేదించెను. అదివిని సూర్యుడిట్లనెను. నీ కాలు క్రింద, నేల మీద మోపకుము. “కృమి సమూహము మాంసము రక్తమును గొని భూలోకమును చేరును. యమునా నదీ జలము గంగా జలముతో సమానము కాగలదు. నర్మదా తపతీ నదుల జలములు సమాన పుణ్యప్రదములగును. వింధ్య పర్వతమునకు దక్షిణముగ తపతి ప్రవహింపగలదు. దాని కలయికతో గంగ శుభమును సంతరించుకొనును. గంగను చేరి యమున కూడ గంగయే యగును. సూర్యసంబంధ జలములు గలవియగుటచే యమునా తపతీ నదులు రెండును సర్వపాపములను హరించునవియు, పుణ్యప్రదములును అగును. గంగా యమునలు రెండును మహాపాపములను, భయమును తొలగింపగలుగును. నీవు బ్రహ్మాజ్ఞచే లోకపాల పదవిని పొందెదవు. నేటినుండి ఈ ఛాయ తన దేహముననే యుండగలదు తన భార్యను, సంతానమును అట్లు నియమించి సూర్యుడు ప్రకాశ రూపుడై దక్షుని వద్దకేతెంచి దీనికంతటికీని కారణమేద్దీయో వివరించేను. దక్షుడా విషయములన్నియు తెలిసికొని సూర్య దేవునితో నిట్లనెను. “నీ రూపమును చూడజాలక నీ భార్యయగు రూప ఉత్తరదేశములకుఁ బోయెను. నీవు కొంత భాద నోర్చుకొనగలిగినచో నీ రూపమును ప్రకటమగునట్లు చేసెదను.” ఆ మాటవిని సూర్యుడు “బాధనోర్చుకొందును. నా శరీరము గోచరమగునట్లు చేయుడు” అని అర్ధించెను. అప్పుడు దక్షుడు విశ్వకర్మను స్మరించెను. స్మరించినంతనే విశ్వకర్మ యేతెంచెను. “విశ్మకర్మా! ఈ తేజోరూపుడగు సూర్యుని ప్రకటమగునట్లు చేయుమ”ని యాదేశించెను.
తా॥ దేవశిల్పి బాధను సహింతువా! యని మార్తాండునడిగెను. దక్షుని ప్రేరణ వలన ‘సహింతు' నని యాతడు విశ్వకర్మతో చేప్పెను. ఇకన శిల్పి సూర్యుని రూపమును ప్రకటము చేయుటకై తన పనిముట్లతో ముఖము మొదలుకొని పాదముల వఱకు చెక్కుచుండెను. సూర్యుని శరీరమునందు పౌనఃపున్యముగా ఉలి మున్నగునుపకరణములు చెక్కుచు నొప్పి కలిగించు చుండుట చేత నా బాధను తట్టుకొన జాలక నాతడు మాటి మాటికి మూర్ఛిల్లుచుండెను. సూర్యుని శాప భయము వలన శిల్పి, చీలమండలనుండి పాదముల వ్రేళ్ళ వఱకును చెక్కడము చేయక నిరాకారముగ వానిని మిగిల్చెను. “ఈ తక్షకర్మ (చెక్కివేయుపని) పర్యాప్తముగ నన్ను భాదించుచున్నది” అని సూర్యుడనగానే “ఓ సూర్యదేవా! ఇక బాధను వదలుము. గన్నేరుపూలు, ఎఱ్ఱచందనము నీ చేతులు మొదలుకొని అన్ని అంగములకు పూయుదును.” అతడట్లు చికిత్స చేయగానే సూర్యునికి నొప్పి తొలగిపోయెను. అందువలన సూర్యునకిట్టి యుపచారము లిష్టమైనవి . గన్నేరు పూవులు, రక్తచందనము తనకిష్టమైనవిగా సూర్యభగవానుడు పూర్వము చెప్పియుండెను. ఈ కరవీరములు, రక్తచందనము మరియు ఇతిహాసపురాణముల నుండి తెలిసికొనబడిన తామర, గుగ్గులు. నాకు భక్తితో సమర్పించువాడు నాకు ప్రాణదానము చేసిన వాడగును. కాబట్టి నాకితరము లేవియునీయనక్కరలేదు. విజ్ఞుడు నాకు ప్రియమైన వానినే సభక్తికముగ సమర్పింపవలెను.” మార్తాండుని యండమునుండి యేర్పడిన తేజస్సును గ్రహించి దానితో విశ్వకర్మ శత్రునిర్భేదన సమర్ధమగునది, అజరమైనదియునైన వజ్రాయుధమును చేసెనట.
తా॥ సూర్యభగవానుడిట్లు ‘స్వరూపమును పొంది వెతలుదీరి సంతుష్టుడయ్యెను. అతడు తన భార్యను చూచుటకుత్సహించి సత్వరమే కురు దేశములకుఁబోయెను. అచట నాడు గుఱ్ఱము రూపము ధరించి మృగముల మధ్య తిరుగుచున్న తన భార్యను చూచి తానుకూడ అశ్వరూపమును ధరించి యామెతో సంభోగీంచెను. గుఱ్ఱము రూపమున నుండియే మిక్కిలి వేగముతో తన ‘తేజమును” ఆమెలో వదలెను. పరపురుషుడేమోయను శంకతో ఆమె యాతని కెదురుగ నిలిచి తన నాసాపుటములనుండి ఆ వీర్యమును బయటకు వెడలగ్రక్కెను. ఆసూర్య వీర్యము నుండియే దేవవైద్యులైన అశ్వినీ కుమారులు నా సత్యులను పేర జన్మించిరి. రేతస్సు చివరి భాగము నుండీ మహితుడగు రేవంతుడు పుట్టెను. తపతి, శని, సావర్ణి, ఛాయా దేవి సంతానము యమున, యముడు (పూర్వము చెప్పబడినవారు సంజ్ఞా సంతానము. భార్యను, పుత్రులను బడసి, దివ్యమైన శరీరమును పొంది సూర్యభగవానుడు సంతుష్టుడైన దినము సప్తమి. ఆకారణమున ఆ తిధీ సూర్యదేవునకు ప్రియమైనది. అట్టి సప్తమినాడు దీనమంతయునుపవసించి, రాత్రి భోజనము చేసి-అంతకుముందు దినమగు షష్టినాడును ఉపవాసము చేసి, దానికి ముందటి దినమగు పంచమినాడు “ఏకభుక్తము చేసియుండి. సూర్యునకు ప్రియమైన సప్తమినాడు వాజ్నియమము గలవాడై సుసంస్కృతము లైన శాక పాకములతో, భక్ష్యభోజ్యములతోను సూర్యునకు నైవేద్యమును సమర్పించి, బ్రాహ్మణులకును భోజనము పెట్టి, రాత్రి సమయమున తాను భుజింపవలేను. అత్తెఱంగున జీవించినంత కాలమీవ్రతము నాచరించు వాడు ధనమును, విజయమును, త్రివర్గమును సమృద్దిగబడయును. మరణించిన పిదప దివ్యవిమానారూఢుడై స్వర్గమునకు బోవును. కొన్ని మన్వంతరముల పర్యంతము సూర్యలోకమున సుఖించును. కాలాంతరమున తిరిగి యీ లోకమునకు వచ్చి శాంతి యుక్తుడగు రాజగును.
తా.అట్టిరాజు కొడుకులతో, మనుమలతో పరివృతుడై, దానశీలుడై, యుద్ధములందు శత్రువుచే నోడింపబడక, చిరకాలము రాజ్యభోగములనుభవించును. సప్తమినాడు శాకాహారముచే నుపవసించువారు పైతృకముగ సంక్రమించు రాజపదవినలంకరింతురు. నీకు పూర్వుడగు కురురాజు సప్తమితిథులలో శాకాహారియై యుపవసించుటచేనతని 'కురుక్షేత్రము' సూర్యునిచే ధర్మక్షేత్రముగ చేయబడినది. మానవ స్త్రీలకు సప్తమి, నవమి, షష్టి, తృతీయ, పంచమి అనునవి ఇహముననే కోరికలను దీర్చు తిథులు. మాఘమాసమున సప్తమి, అశ్వయజమున నవమి, భాద్రపదమాసమున షష్టి, వైశాఖమునందు తృతీయ పుణ్యప్రదములు. భాద్రపదమున వచ్చు పంచమి నాగపంచమి కూడ పుణ్యప్రదమైనది. ఇట్లు ఆయామాసములయందలి ఆయాతిథులు విశేషమైనవిగా చెప్పబడినవి. వ్రతాచరణము చేయువాడు శాకాదులను చక్కగా శోధించి భక్తియుక్తుడై బ్రాహ్మణునకు యధాశక్తిగ సమర్పించి, తరువాత రాత్రి సమయమున తాను భుజింపవలెను, కార్తీక శుక్లపక్ష సప్తమినుండి యీ వ్రతమును స్వీకరింపవలెను. ఇట్లు నాలుగు మాసములు వ్రతమాచరించి ఉపవాసానంతర భోజనము చేయవలెను. ఈ సప్తమి వ్రత సందర్భమున అగిసెపూలతో సూర్యునికి పూజచేయవలెను. కుంకుమ విలేపనము, అపరాజిత ధూపములతోను పూజింపవలెను. పంచగవ్యముతో స్నానముచేసి, దానినే ప్రాశనము చేయవలెను. సూర్యభగవానున కిష్టమైన దగుటచే పాయసమునాదేవదేవునకు నైవేద్యము పెట్టవలెను.
తా॥ సూర్యభగవానునకు నివేదించిన పాయసమును, శాక భక్ష్యాదులను భక్తితో బ్రాహ్మణుల కీయవలెను. శాకములు, భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు, పానీయములు ఈయవలేను. రెండవ పారణమునందు సూర్యదేవునకు పరిమళ భరితములైన పుష్పములు, తెల్లచందనము సమర్పింపవలెను. అగరు ధూపము వేసి బెల్లపు భక్ష్యములు నైవేద్యము పెట్టవలెను. ఆ సందర్భమున కుశోదక స్నానము, గోమయ ప్రాశనము చేయవలెను. మూడవ పారణమున గన్నేరుపూలు ఎఱచందనము, గుగ్గులు ధూపము సూర్యదేవునకు ప్రియమైనవి. పెరుగు కలిపిన శాల్యన్నము నైవేద్యము పెట్టి దానితోబాటు కరివేపతో పాకము చేసిన భక్ష్యలేహ్యాదులతో కూడిన భోజనమును బ్రాహ్మణులకు నివేదింపవలెను. తెల్లని ఆవాల మడ్డితో స్నానము చేసి దానినే ప్రాశనము చేయుట పాపవినాశకరము. పుణ్యప్రదము. మూడవ పారణము తరువాత బ్రాహ్మణ సంతర్పణ చేయవలెను. ఆసందర్భమున పురాణ ప్రవచనము, శ్రవణము ప్రశస్తమైనది. సూర్య భగవానుని సన్నిధానమున, బ్రాహ్మణ మహాజన సమక్షమున, బ్రాహ్మణుడే పురాణ ప్రవచనము చేయగా వినవలెను. ఇతర వర్ణమువాని ముఖతః వినకూడదు. అటుమీదట నచటి బ్రాహ్మణుల నందఱిని భక్తితో, శక్తిననుసరించి పూజింపవలెను. పౌరాణికుని పవిత్రశరీరమునకు వస్త్రయుగ్మముతో సమ్మానము చేయవలెను. పురాణవాచకుని పూజించుట వలన సూర్యభగవానుడు సంతోషించును. గన్నేరు పూలు, ఎఱ్ఱచందనము, గుగ్గులు, పాయసము. లడ్డువములు, తామ్రపాత్ర, నేయి ఆదేవదేవునకు ప్రీతి పాత్రములయినట్లుగా, పురాణము, వక్త, కూడ ఆయనకు ఇష్టమైన విషయములు. ఇట్లు సూర్యదేవునకు సంబంధించిన శాకసప్తమి అని పేరుగల సప్తమి తిథి పుణ్యప్రదమైనది. ఆదినమున భక్తితోనుపవసించువాడు భాగ్యవంతుడగును.
శతార్ధ సాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమి కల్పమునందు శాక సప్తమివ్రత వర్ణనమను పేరుగల నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 47 of the Bhavishya Purāṇa is as follows:
The Saptamī Kalpa — the most extensive and theologically central section of the Brahma Parva — opens with the Śāka-saptamī, a vrata on the seventh tithi in which the devotee fasts from all grains and takes only śāka — leafy vegetables and greens — as food. The chapter establishes the frame for the entire Saptamī Kalpa: the saptamī tithi is Sūrya Bhagavān's own day, and every observance associated with it is a form of Sūrya worship, whether or not the connection is made explicit in the vrata's name. Sūrya's unique position among the visible deities — his daily presence governs the life of every creature — is stated as the reason why saptamī is the most powerful of all tithis and why the Saptamī Kalpa is the most extensive of the Brahma Parva's kalpa sections.