తా॥ వాసుదేవుడిట్లనెను. “సప్తమి, గ్రహణము, సంక్రమణలు మున్నగు పర్వములయందు సూర్యనిమిత్తముగ నేర్పడు తదుపాసనా పూజాదికములను గూర్చి సమగ్రముగ చెప్పెదను దానిని తెలిసికొని మానవులైహికాముష్మిక ఫలములనొందుదురు. శుక్లపక్ష సప్తమికి పూర్వదినమున పగటియందొక్కపూటమాత్రమే హవిరోజనము చేసి, సంధ్యాకాలమున చక్కగా నాచమనము చేసి సూర్యునకు నమస్కరించి. ఇంద్రియములను నిగ్రహించి, సూర్యుని ధ్యానించి రాత్రి, నేల పై పరుండవలెను లేక దర్భశయ్యపై పరుండి ప్రాతఃకాలమున లేచి నియమానుసారముగ స్నానము చేయవలెను. పిమ్మట సంధ్యావందన మాచరించి పూర్వోత్తమైన సప్తాక్షరీమంత్రమును (ఓం ఖమౌలాయ స్వాహా) జపించవలెను. తరువాత సూర్యాగ్నిని కల్పించి అందుహవనము చేయవలెను. సూర్యాగ్నికరణము గుణించి, తర్పణము గుణించియు సవిస్తరముగా చెప్పెదను. పూజాగృహమును శుభ్రపఱచి, రంగవల్లి కలనంకరించి, యాజక గణముతో నందు ప్రవేశించి-5. దర్భలను వేసి వానిని చక్కగా పఱచి క్రమముగా పాత్రాసాదనము చేసి, కొసలతో కూడిన రెండు దర్భలతో ప్రాదేశమాత్రముగ పవిత్రచేసి. దానితో పాత్రలను సంప్రోక్షించుట ద్వారా చక్కగా శోధించి, ఉత్తరపుకొనయందున్న పాత్రయందు అలాతముతో నగ్నిని ప్రజ్వలింపజేసి. పర్యగ్నికరణము చేసి, మూడు పర్యాయములు నేయి చిలకరించి, స్టువాదులను శుభ్రముగా తుడిచి వాని పై దర్భలతో సంప్రోక్షణ చేయవలెను. ప్రోక్షించి పూర్వము చెప్పినట్లగ్నియందర్క భావన చేసి వేల్చవలేను. క్రింద పెట్టబడని పాత్రతో, దర్భపిడికిలిగల చేతితో హవిర్షాన మంత్రముతో అగ్నియందే వ్రేల్చవలేను. అంతరిక్ష స్థలముననెప్పుడును వేల్చకూడదు. కుడిచేత స్రువము తీసికొని, విజుడైనవాడగ్నికే యాహుతులీయవలెను. ఈ క్రియలన్నియు పూర్వము చెప్పినట్లు మనః పూర్వకముగ చేయవలెను.
తా॥ సూర్యునితో ప్రారంభించి చేసిన యాహుతులయనంతరము సంజ్ఞకొఱకు కూడ మౌనముగ ఆహుతినీయవలయును. మాఘమాస సప్తమియందు వరుణనామక సూర్యుని కొఱకు పది పదులాహుతులనిచ్చి యజింపవలయును. బ్రాహ్మణులకు యథాశక్తిగ తలపాగాలను భక్తిపురస్సరముగ దక్షిణలను సమర్పించినచో కోరికలు ఫలించును. ఇదే విధముగ ఫాలున మాసమున సూర్యుని, చైత్రమున వైశాఖుని, వైశాఖమున ధాతను, జ్యేష్ఠముననీంద్రుని. ఆషాఢమున రవిని, శ్రావణమున నభుని, భాద్రపదమున యముని, ఆశ్వయుజమున పర్జన్యుని, కార్తికమున త్వష్టను. మార్గశీర్షమున మిత్రుని, పుష్యమాసమున విష్ణువును పూజింపవలెను. సూర్యదేవుని ఆయామాసములలో ఆయా నామరూపములతో పూజించుచు నొక సంవత్సరము పూర్తి చేసిన యెడల ప్రతిదినమున నిష్టసిద్ధి కలుగుచుండును. ప్రతి దినమి ద్వాదశ సూర్యులను పూజించుచుండిన సంవత్సరమునకు చెప్పబడిన ఫలము నంతయును భక్తి శ్రద్ధలుగల పూజకుడు సత్వరముగా దినదినము పొందుచుండును. ఇట్లు సంవత్సర వ్రతము పూర్తిచేసి, ఏడు గుఱ్ఱములతో నమర్పబడినది, వివిధ రత్నములతో నలంకరింపబడినది, అయిన బంగారపు రథమును చేయించి. అందు స్వర్ణకమలము పైన రత్నాలంకృత దివ్యాంగుడైన సూర్యభగవానుని శుద్ధ సువర్ణ మూర్తిని మధ్యలోనునిచి. ఆరధశ్రేష్టము ముందు భాగమున రథమును నడుపుతున్నట్లున్న సారధి ప్రతిమము కూడ సిద్ధము చేసి, క్రమముగా నొక్కొక్క మాసమునకొక్కొక్క బ్రాహ్మణుని చొప్పున పన్నెండు మంది తత్తనాసాధిప స్వరూపులగు బ్రాహ్మణులనెన్నుకొని. తన యాచార్యుని వీరి మధ్య నాసీనుజేసి, వీరినందటిని యథా విధిగ పూజింపవలెను. ఆచార్యుని సూర్యతేజస్విగ భావన చేసి వస్త్రములు, రత్నములు మున్నగు వానిచే నాతనిని పూజింపవలెను. ఇట్లే మాసాధిప ప్రతినిధులైన బ్రాహ్మణులను కూడ యథోచితముగ పూజింపవలెను. పిమ్మట కాంచన రథమును, ఛత్రమును, అగ్రహారమును, గోవులను, సారవంతమగు భూమిని ఆచార్యునకు సమర్పింవ వలయును.
తా॥ మాసాధిపతులైన పన్నెండుగురు బ్రాహ్మణులకు గుఱ్ఱములను సమర్పింపవలెను. భక్తితో యథాశక్తిగ బంగారము, రత్నములు, ఆభరణములు కూడ నీయవలెను. ఇచ్చి నమస్కరించి, “బ్రాహ్మణదేవతలారా! ఈ వ్రతోద్యాపన యనంతరము మఱల నేదేని కారణముచే నీ సూర్యవ్రతమాచరింపజాలని పక్షమున నేదోషము రాకుండుగాక!” యని వారిని ప్రార్థింపవలెను. ఆచార్యునితో సహా విప్రవర్యులందుటును, “అటులేయగుగాక" యనివారు 'తధాస్తు' పలుకుచుననేక విధములుగ నాశీర్వదించి, “సూర్యభగవానుడు నీవు చేసిన వ్రతముచే ప్రీతుడగుగాక! ఏ కోరికలతో నీ వ్రత మాచరించితివో వాని నాతడు సఫలము చేయుగాక! నీ యీ వ్రతము సంపన్నమగుగాక! అని దీవింపవలెను. ఆచార్యునిలోను బ్రాహ్మణులలోను స్వయముగ నా భాస్కరుడే ప్రవేశించియుండును, అతడు ఉత్తమ ఫలములనీయగల కార్యములను చేయు సంకల్పశక్తులనిచ్చును. గుణవంతులు, ఏమియులేనివారు, దీనులు, అంధులు, హీనస్థితిలోనున్నవారైన బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణ భోజన సంతర్పణలతో వ్రతసమాప్తి చేయవలెను. ఇట్లు సంవత్సర సప్తమి వ్రత మాచరించినవాడు ధర్మప్రభువగును. స్త్రీ యైనచో రాజుకు ప్రేమపాత్రురాలైన రాణి యగును. నూఱు యోజనముల విస్తీర్ణముగల రాజ్యము నెట్టి యాటంకములేకుండునట్లు, శత్రువుల బాధ లేకుండునట్లు సంపూర్ణముగ నూడు సంవత్సరముల వఱకు సుఖియై అనుభవించును. ధనము లేనివాడు భక్తితో రాగి రథమును చేయించి, పూర్వోక్తమైన రీతిలో నాచార్యునకీయవచ్చును. అట్టివాడు రాజై ఎనుబది యోజనముల విస్తీర్ణముగల రాజ్యభాగముననుభవించును. దానికిని సమర్థతచాలని వాడు పిండితో రథమును చేసి ఈయవచ్చును. అట్టివాడు అరువది యోజనముల విస్తీర్ణముగల రాజ్యమును దీర్ఘాయుష్మంతుడు, సుఖియునై యనుభవించును. కల్పాంతము వఱకు సూర్యలోకమున నుండి మఱల నిట్టి రాజ్యముననుభవించును.
తా॥ సర్వావస్థలయందును భక్తిగలవాడై కేవలము మనస్సుతోనైనను శ్రద్ధాళువై సూర్యారాధనము చేయువాడు సర్వరోగ వినిర్ముక్తుడై యారోగ్యవంతుడగును. మంచు, సూర్యుని తాకజాలనట్లు ఇతనిని ఆపదలు స్పృశింపనేరవు. ఇక మంత్ర రక్షితుడు, భక్తుడునైన వ్రత సంపన్నుని గుజించి చెప్పవలసినదేమి?. అందువలన కల్పమందు చెప్పబడిన విధానమును యథాతథముగ తెలసికొని ఫలసిద్దికొఱకు సుఖముగను సాకల్యముగను ప్రతాచరణము చేయవలయును. సాంబా! పూర్వము ప్రథమ కల్పమునందు - శుభప్రదమైన ఈ వ్రతమును గూర్చి సూర్యదేవుడే స్వయముగ నాకు చెప్పెను. దీనిని నేనెల్లప్పుడును రహస్యముగనేయుంచీతినీ. వత్సా! ఉత్తమమైన ఫలమును కోరినచో, శుద్ధమైన మనస్సుతో సత్వరమే యీ విధానముగ సూర్యునారాధింపవలెను. అతని ప్రసాదము చేతనే నేను వేలమంది పుత్రులను బడసితిని. రాక్షసులను జయించితిని. దేవతలందని వశము చేసికొంటిని. ఈ సూర్యకల్పమును నీవుకూడ గోప్యముగ నుంచుటయే మంచిది. దీని యనుగ్రహమున సూర్యభగవానుడు సన్నిహితుడైయుండును. ఈనా చక్రాయుధమునందతడు నిత్యనివాసముండును. దానిచే నేను దేవతలను, రాక్షసులను, మానవులను, నాగములను జియింపగలిగితిని. ఒక వేళ సూర్యుడు స్వయముగ తన సహస్రకిరణములతో నీ చక్రము నధిష్ఠించి యుండని యెడల నిది యింత ప్రభాయుక్తమై ఎంతోమంది కొట్టబడినవారు గలదిగ నేట్లుండగలదు. నేను, కూడా నీ సూర్యదేవుని నిత్యము శక్తి కొలది జపించుచు, పూజించుచు, ధ్యానించుచు, అన్ని కోరికలను తీర్చుకొనుచు, పూజ్యుడనై శ్రేష్ఠుడనై తేజస్సుతో ప్రకాశించుచున్నాను. నీవు కూడ మనస్సు చేత, వాక్కుచేత కర్మచేత నిదే విధిచేత నీతని భక్తితో పూజింపుము. ఫలము సిద్ధించును. శ్రద్ధా భక్తులతో నిది వినువాడును, విధి విధానముగ నీ సప్తమి వ్రతము నాచరించువాడును. సర్వకామములను పొంది, ఆరోగ్యవంతుడై, అన్నింట విజయమునందుచు, శ్రేష్ఠమగు సంపదలననుభవించి, సూర్యలోకమునకుఁబోవును.
శతార్థ సాహాస్ర్య సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సప్తమి మాహాత్య వర్ణనమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 50 of the Bhavishya Purāṇa is as follows:
The saptamī tithi is declared, among all the tithis of the lunar month, to be singularly associated with Sūrya Bhagavān. The various names by which the saptamī is known — Vijayā, Jayantī, Nandā, Bhadrā, and others — are enumerated, and each name is shown to correspond to a specific configuration of planetary and lunar energies that amplifies the power of Sūrya worship performed on that day. The chapter catalogues the specific fruits that flow from fasting, bathing, donating, and worshipping Sūrya on the saptamī, including the removal of diseases, the granting of progeny, the destruction of sins accumulated over previous births, and eventually the attainment of the Sūrya-loka from which there is no return to the cycle of rebirth.