భవిష్య మహా పురాణము - బ్రహ్మ పురాణము

42. షష్ఠీ కల్పవలన బ్రాహ్మణ్య సంస్కార వివేక వర్ణనము

తా బ్రహ్మదేవుడిట్లనెను. “సదాచారముతో కూడియండువారు, బుద్దిశాలురు, శక్తిసంపన్నులు ఏమిచెప్పిరో దానిని సుభాషితముగా వినుము. అనేకములగు చెట్టుచేమలు, శంఖములు మొదలగునవి జడవస్తువులు, చీమలు, తుమ్మెదలు ఏనుగులు మొదలగు జంతుజాలముల జన్మములను ప్రకటన చేయుచు, ప్రాణి, కర్మగతులయందు నటుని వలె నిటునటు నాడుచు నలబ్ధసుదర్శనుడై (పరమాత్మప్రాప్తి కలుగక-సరియగు చూపులేని యజ్ఞానియై) తిరుగుచున్నాడు. రూపములు, ఐశ్వర్యములు, జ్ఞానములు, కులములు, వైభవములనెడు కవచములచే చుట్టబడిన వాడవై ధర్మమార్గమనినచో విడిచిపుచ్చుచున్నావు. ఈ లోకమునుండి యాలోకమునకు, అటునుండి యిటకు పోవుచువచ్చుచున్నావు నీవు నీ అహంకారము భస్మీభూతమగునంత వఱకు జ్ఞానమును పొందజాలవు. నేనేమియు చెప్పజాలను. జాతి, కులము, రూపము, వయస్సు, వర్ణము అనియిట్లనేకములుగ వినబడుచున్న యహంకారములచే గ్రుడ్డివాగు, పేడివారు, ఈ లోకమున గానీ; పరలోకమునందుగాని తమకు శ్రేయమును కలిగింపగల ప్రయోజనమును చూడజాలరు. ఈ విభాగములను తెలిసికొనిన పిదప ఏ బుద్దిమంతుడు జాతి గర్వమును కలగి యుండగలడు?. స్వజనులననేకులను, ఇంద్రియ వృత్తుల నుండి విడివడినవారినందజీని పరిశీలించినఁదెలియును) జాతీయనునది కర్మననుసరించిపోవును. శాశ్వతమైన ఒకే జాతి యెవనికి గలదు?. విద్వాంసుల సభయందెవఁడేనీ, 'సంస్కారము వలన బ్రాహ్మణడయ్యేనని చెప్పిన యెడల అతనిమాట న్యాయానుసారముగ మాట్లాడు న్యాయజ్ఞుల చేత నిరాకరింపదగినదేయగును. గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము. చూడాకర్మ, ఉపనయనము, స్నాతకము, సమావర్తనము, పాణిగ్రహణము. ఈ మొదలగు సంస్కార విధానములచేత సంస్కృతులగుదురు. వారే బ్రాహ్మణులు. వారిలోనే నిరంతరముగ కోరికలు విజృంభించుచుండును!.

తా సంస్కారములు చేయబడిన యున్న బ్రాహ్మణులచేతనే కలిగిన బ్రాహ్మణులలోను అపేక్షితములైన ఆయువు, శక్తి, తేజస్సు మొదలగు విశేషములు స్పష్టముగ లేకపోవుటయు కలదు. బ్రాహ్మణ శరీరముల నుండి పుట్టిన సంస్కారవంతుడు, సంస్కారహీనుడు అను నిరువురును, ఇష్టానిష్టముల విషయమునగాని, ప్రాప్త్యప్రాప్తుల విషయమునగాని ఒకరితోనొకరు భేదింపరు. జ్ఞానము, వేదాధ్యయనము, కర్మ, వేదాంతవిచారము, నియమము, ఇంద్రియనిగ్రహము అనువీనితో గాక కేవల సంస్కార యోగముతో మానవునకు శూద్రునకన్న భిన్నత్వమేమియు లభింపదు. శూద్రుని విషయమునందు సంస్కారము చేయబడుట జరుగక పోవచ్చును. కానీ సంస్కృతాంగుడయినంత మాత్రమున పాపముల నుండి ముక్తుడు కాడు. సర్పముల వంటి విలాసినీ జనముతోగూడి, మదోన్మత్తులై మోహమునందుచున్నవారు సదాచారమునుండి, బ్రాహ్మణత్వమునుండియు పతితులగుచున్నారు. దురాచారవంతుడు సంస్కారములు పొందియుండియు పతితులగుచున్నారు . దురాచారవంతుడు సంస్కారములు పొందియుండినను నరకమును పొందును. సంస్కారములు లేనివాడయినను సదాచారవంతుడు బ్రహ్మోణోత్తముడగును. మంత్ర పూతమగు సంస్కారములు పొందియుండినవాడైనను తరింపజాలడు. ఏలయన సంస్కారవశమున నేర్పడిన బ్రాహ్మణ్యము నుండి తప్పుకొనలేకయు, దురాచారము వలన తప్పించుకొనజాలకయు దుష్టచరిత్రుడుగా నుండి పోవును. అది యోగ్యత నుండి పతనము చెందుట కావున నతడు బ్రాహ్మణత్వము నుండి కూడా విడివడును. తప్పదు. “దురాచారవంతులైన పురుషులలోనట్టిదానిని సదాచారులెప్పుడైనను చూచిరాయేమి? అని స్పర్ధాళుఁడవై వానితో సమానముగ దోషము చేయుటకు నీవు కూడ నుత్సహించినచో నప్పుడు నీకు పట్టబోయెడు నదృష్టమును గూర్చి చెప్పుము. గర్భాధానాది సంస్కారకలాపమేమియు లేకుండగనే వ్యాసాదిముని సత్తములు ఆచారమును పాటించుచు మాత్రమే యుండిరనుట స్పష్టము.

            తా సర్వలోక పూజ్యులై శ్రేయమును పొందిన బ్రాహ్మణోత్తములు చాలమంది కలరు. వారిలో నేను చెప్పబోవు కొందఱిని గుణించి తెలిసికొనుము. వ్యాసుడు జాలరి స్త్రీకిని, పరాశరుడు మాలేతకును బుట్టిరి. శుకుడు ఆడుచిలుకకు జన్మించెను. కణాదుడు గుడ్లగూబకు కొడుకుగా బుట్టెను. ఋష్యశృంగుడు మృగికి బుట్టెను. వసిష్ఠుడు దేవ వేశ్యయగు నూర్వశి కుమారుడు. మందపాలుడను మునిశ్రేష్టుడు ఓడనడుపు స్త్రీ కుమారుడని చెప్పబడును. మాండవ్యముని మండూకి గర్భము నుండి పుట్టెను. ఇంకను ఇట్టి వారనేకులు మొదట అబ్రాహ్మణులయియును తరువాత బ్రాహ్మణత్వమును బడసిరి. ఇట్టి మనోజ్ఞ చరిత్రులైన మహా పురుషులచేత ఏ పూజ్యమైన వాక్కు చెప్పబడినదో ఆ పూజ్య వాక్కుననుసరించి నడుచుకొనిన ఉన్నతుల చేత, ఆచారముతో వృద్ధినందిన తేజము పొందబడినది. ఆడుజింక గర్భము నుండి జన్మించిన ఋష్యశృంగుడు మహామునియయ్యెను. తపస్సుచేత బ్రాహ్మణుడగును. దానితో కూడియే సంస్కారము కూడా కారణమగుచున్నది. వ్యాసుని తండ్రియగు పరాశరుడు మాలేత గర్భమున జన్మించిన వాడయియును మహర్షయయ్యెను. కావున తపస్సుచేతనే బ్రాహ్మణుడగును. దానితో కూడి సంస్కారము కారణమగును. కణాదుడు గ్రుడ్లగూబకు బుట్టినవాడయ్యు మహాముని కాగలిగెను. కాబట్టి తపస్సే బ్రహ్మత్వమునకు కారణమగును. దానితో సంస్కారము కూడ కారణమగుచున్నది. వేశ్యా గర్భసంభూతుడైనను వసిష్ఠడు మహామునియయ్యెను. బ్రాహ్మణత్వమునకు తపస్సు కారణము. సంస్కారము దానిననుసరించిన కారణము. మందపాలుడు పడవనడుపుదాని కొడుకైనను మహామునియయ్యెను. తపస్సుచేత బ్రాహ్మణుడగును. దానితోగూడి సంస్కారము కారణమగుచున్నది. వేదములందు, ఆగమములందు చెప్పబడిన సంస్కారకలాపములయందు నిపుణులైనవారు కూడా జ్ఞాన తపోధనముల బలము చేతనే ఉత్కృష్టఫలమును పొందుచున్నారు. మహాపాపులైనను, సంస్కారము పొందిన దేహము గలవారైనను బ్రహ్మజ్ఞానమే నివృత్తి కారకమైనందువలన నదియే బ్రహ్మత్వమునకు సంకేతమని బుద్ధిమంతులు గ్రహింతురు.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్ఠికల్పము నందలి బ్రాహ్మణ సంస్కార వివేక వర్ణనమను నలువది రెండవ అధ్యాయము సమాప్తము.