తా॥ సుమంతుముని యిట్లనెను. “మహా తేజస్వియగు దిండి, సురజ్యేష్ఠుడు, లోకేశుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవునకు శిరస్సువంచి నమస్కరించి యిట్లనెను-1. “మహాత్ములు, దేవదేవులగు మీ దర్శనమున ధన్యుడనైతిని. మీ చెంత క్రియాయోగమును తెలిసికొనుటకు సూర్య భగవానునిచే నాదేశింపబడితిని. అమృత తుల్యమగు నా యోగమును గూర్చి సాకల్యముగ మీరు చెప్పుదురట!-2. అందుచే దానిని వివరింపుమని వేడుచున్నాను. దేవ దేవుడగు సూర్య భగవానుని నిరంతరము సంతోషపుపగలిగిన రీతిగా దానిని నాకుపదేశింపుడు”-3. బ్రహ్మదేవుడిట్లనెను. “రమ్మురమ్ము! గణాధిపా! ఇటుల నా సమీపమునకు రమ్ము! నీ బ్రహ్మహత్యాదోషమాతని దర్శనముచేతనే పటాపంచలైపోయినది-4. అమిత తేజస్వియైన సూర్యదేవునిచే ననుగ్రహింపదగిన వాడవైతివి. ఆతని నారాధించుటకు నీ మనస్సు విధేయమై యున్నచో -5. అతనిని పూజించుట కిచ్చకలిగినచో, ఆద్యంత రహితుడు, భగవానుడునైన భానుదేవుని సేవింపదలచినచో మొదట నియమ శీలుడవు కావలయును-6. అట్లు దీక్షాన్వితుడు కాని వాడా దేవుని తత్త్వతః స్తుతించుటకు, తెలిసికొనుటకు, దర్శించుటకును శక్యముకాదు. ఇక మూడులాతని గుజించిన యూహనైనను ప్రవేశింపజాలరు-7. అతనినే మనస్సునందు నిలుపగలిగియున్న సౌర దీక్షా గుణాన్వితులనేక జన్మలయందును పవిత్రులుగనుందురు-8. అనేక జన్మల సంసారమున ప్రోగైన పాప సమూహము క్షీణింపనిదే పురుషులకు సూర్యాభిముఖమైన బుద్ధి కలుగనేరదు -9. సూర్యునియందు ద్వేషము కలుగువాడు బ్రాహ్మణులను, వేదములను నిందించువాడు పాప బీజమునుండి పుట్టినవాడని యెఱుంగవలెను.
తా॥ సంప్రదాయ విముఖల పైన (నాస్తికుల పైన) ప్రేమ కలుగుట, హేతువాదమునందానుకూల్యభావము కలుగుట, అనునవి విష్ణు మాయలో పడిపోయిన దురాత్ములకు సంభవించును-11. మానవులకు పాపము నశించిపోయినప్పుడు వేదములు, బ్రాహ్మణులు, దేవదేవేశుడైన సూర్య దేవుడు - వీరలయందు నిశ్చలమైన శ్రద్ద ఉదయించును -12. పాప సంచయమంతయు క్షీణించి స్వల్ప మాత్రముగ శేషించి యున్నవారు కర్మదీక్షా స్వభావమును స్వీకరించుచుందురు. సంశయములేదు-13. పాపములతో దుర్గమమైన సంసారమున బడి తిరుగుచున్న మానవులకు, భక్తితో ప్రీతుడగు సూర్య దేవుడొక్కడే చేయూత నిచ్చి కాపాడగలడు-14. సర్వ పాపములను నశింపజేయగల సూర్యదేవుని భావమున నంతటను నింపుకొని భక్తితో పూజింపుము. ఆతడు ప్రీతుడగును”-15. దిండియిట్లనెను. “ఓ బ్రహ్మదేవా! ఏ లక్షణములుగల మానవులు దీక్ష కరులగుదురు? దీక్ష నందినవారు చేయదగిన దేదియో నాకుఁజేప్పుడు -16. దిండి ప్రశ్నకు బ్రహ్మయిట్లనెను. కర్మచేత, మనస్సు చేత, వాక్కు చేతను ఏ ప్రాణినైనను హింసింపకుండువాడు, సూర్య భగవానునియందు మనఃపూర్వకమగు భక్తిగలవాడు గుణాన్వితమైన దీక్షకరుడు-17. బ్రాహ్మణులకు, దేవతలకు నిత్యము నమస్కరించువాడు, ఆస్తిక భావమునందెట్టి కల్మషములేనివాడు సూర్యదేవుని పూజింపగలడు-18. దేవతలందఱిని సూర్యునిగాఁ దెలియువాడు, సర్వ లోకములును భాస్కరుడేయని భావించువాడు, తననుతాను వారిక భిన్నుడనని యెఱుంగువాడు, సూర్యత్వమును పొందగలడు-19. దేవుని, మనుష్యుని, ఇతర పశువులు, పక్షులు, చీమలు మున్నగుపోనిని, చెట్లను, రాళ్లను, కఱ్ఱలను, దిక్కులను, భూమిని, జలమును, ఆకాశమును-20. తనను కూడ దేవేశుడైన సూర్యుని కభిన్నములని భావించువాడు దీక్షా గుణములను పొందును-21.
తా॥ మనస్సుచేత, వాక్కుచేత, కర్మచేత ఏ ప్రాణియందును పాపకార్యముచేయని వాడు సౌర దీక్ష కరుడగును-22. సూర్య భగవానునాశ్రయించి నియమశీలుడై తపము చేయువాడు, యజ్ఞములు చేయువాడు, భూరీ దక్షిణలిచ్చువాడు పొందేడి యుత్తమగతిని యితరులెవరును పొందరు-23. సర్వాత్మనా సూర్యదేవుని యందు భక్తి కలిగి, అతని యందే భావము నిలిపి కృత కృత్యుడగువాడు శ్రేష్ఠుడైన సౌరదీక్షాపరుడు-24. భక్తి భావముతో సూర్య దేవునుపాసించువారి కులమున దక్క కులపావనుడైన ధన్యుడు పుట్టడు-25. సూర్య దేవుని యందు భక్తికలిగి యాతని పూజ చేయించువాడు పాపములనుండి ముక్తుడై సూర్యలోకమును చేరును-26. భక్తి భావముతో సూర్య దేవాలయమును నిర్మింపజేయువాడు ఏడు తరముల పురుషులను సూర్య లోకమునకు చేర్చువాడగును-27. సూర్య దేవాలయమున ఎన్ని సంవత్సరములు పూజ జరుగుచుండునో అన్నీ వేల సంవత్సరముల వఱకతడు సూర్య లోకమున వెలుగొందుచుండును-28. ఎవని యింట సలక్షణముగ సూర్యార్చన సంతత విధిగా జరుగుచుండునో, ఎవని మనస్సునిష్కామముగ నుండునో అట్టివాడు ముక్తినందును.
తాII మనోజ్ఞములు, పరిమళ భరితములునైన పుష్పములచే యతమానసుడై సూర్యదేవుని పూజించువాడు,-30. ప్రతి దినము వివిధములగు ధూపములచేత, సువాసనగల మైపూతలచేత సూర్యుని యజ్ఞము, పూజ, చేయువాడు,-31. ఉత్తమ గతినందుదురు. యజ్ఞేశ్వరుడైన సూర్యదేవుడు యజ్ఞములచేత పూజింపబడును. అనేకములగు సాధనోపకరణములు, సంబారములు యజ్ఞమునకు కావలసియుండును-32. దీండీ! విశేష ధనవంతులు కానివారు యజ్ఞ ద్రవ్యములు సమకూర్చుకొనజాలరు. అందుచే భక్తి గలవారు గజీకలతో కూడ పూజింపవచ్చును. అట్లు పూజించినవారికి కూడ భానుదేవుడు సర్వయజ్ఞములచే దుర్లభమగు ఫలమునిచ్చును-33. హృద్యములైన పుష్పములు, ధూపములు, గంధానులేపనములు, అమూల్యమైన యాభరణములు, ప్రియమైన వస్త్రములు-34. భక్ష్యములు, ఫలములు మొదలగు నాహార పదార్దములు, తద్దత మనస్కుడవై సూర్య భగవానునికి సమర్పింపుము-35. ఆద్యుడు, సకల భువనముల కాధార భూతుడునైన ఆతనిని యథాశక్తిగ ప్రసన్నుని చేసికొనుము. అతని నారాధించు మానవుడతనిలోననే లయమగును-36. పుష్పములచేత, తీర్థోకములచేత, తేనె, నేయి, పాలు మున్నగువానిచే గ్రహేశ్వరుడు, ఆకాశగతుడునైన సూర్యదేవున కభి షేకము చేయవలెను-37. అటుల చేసిన పుణ్య ప్రదములైన దధిక్షీర ప్రదములు, మధువులు నిండిన లోకములు, విశేషలక్షణముగల సుఖ జీవితమునొసంగును-38. స్తోత్రములు, గీతములు, వాద్యములు, బ్రాహ్మణ సంతర్పణలు మున్నగువానితో మనఃపూర్వకముగ దివాకరునారాధింపుము-39. ఆ జగన్నాథుడైన సూర్య భగవానునారాధించియే నేను లోకములను సృష్టించితిని. అతని నారాధించియే విష్ణువు లోకములను పరిపాలింపఁగడంగెను-40. అతని ప్రసాదము వలననే రుద్రుడు భవానిని పొందెను. ఋషులందఱ దివాకరునర్పించి ప్రకాశించుచున్నారు-41. నీవు కూడ ఆ దేవ దేవునినొక సంవత్సరము వఱకునుపవాసాదులతో పూజించి ప్రసన్నుని చేసికొనుము. ఆతడు తుష్టుడై ఇహ పరశాంతులనొసంగును.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమున, బ్రహ్మదిండి సంవాదమున ఆదిత్యక్రియాయోగ వర్ణనమను అటువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 63 of the Bhavishya Purāṇa is as follows:
The dialogue now shifts to Brahma, who instructs the sage Diṇḍi (a variant spelling used in this chapter) on the yoga of ritual action dedicated to Sūrya — the Āditya-kriyāyoga. This is the path by which a householder who cannot practise intense dhyāna or jñāna-yoga can still achieve the highest fruits through the scrupulous and loving performance of all prescribed Sūrya worship rites. Each act of pūjā — the offering of a flower, the lighting of a lamp, the recitation of a hymn — when performed with full attention and devotion, is itself an act of yoga: a moment of complete presence that, accumulated over a lifetime, constitutes a complete spiritual path. The chapter establishes the equivalence between karma-yoga as taught in the Gītā and the specific form of karma-yoga embodied in Sūrya worship.