తా ॥ సుమంతుముని ఇట్లనెను. “పూర్ణిమనాడు ఉపవాసము చేసి పాడ్యమినాడు భక్తితో ఈ విథానమున బ్రహ్మను పూజించు మానవుడు -1. బ్రహ్మపదమును పొందును. వాస్తు దేవతలను ముఖ్యముగా బ్రహ్మమంత్రములతో పూజింపవలేను -2. కార్తిక మాసమునందు బ్రహ్మదేవుని రథయాత్ర చెప్పబడినది. అట్టి రథయాత్రను భక్తితో నిర్వహించిన మానవుడు బ్రహ్మలోకమును పొందును -3. రాజేందొ! కార్తిక పూర్ణిమనాడు బ్రహ్మదేవుని సావిత్రితో కూడ మృగచర్మము నందాసీనుని చేసి -4. వివిధములైన వాద్యములతో నగరమునందూరేగించి తిరిగి యథాస్థానము చేర్పవలెను -5. మొదట శాండిల్యసగోత్రజుడైన బ్రాహ్మణుని భోజనాద్యుపచారములచేత పూజించి, మంగళవాద్యముల ధ్వనులతో దేవుని రథమునందధిరోహింపజేయవలెను -6. శాండిలీపుత్రుని రథము ముందు సవిధానముగా పూజించి, బ్రాహ్మణులచేత స్వస్తి పుణ్యాహవాచనము చేయించి -7. దేవుని రథమునందారోపణ చేసి ఆ రాత్రి జాగరణము చేయవలెను. వివిధములైన నృత్యాది ప్రదర్శనములచేత, విరివియైన వేదఘోషల చేత -8. ఇట్లు జాగరణ చేసి ఉదయముననే యథాశక్తి బ్రాహ్మణునకు అనేక విధములైన భక్ష్య భోజ్యములతో కూడిన భోజనము పెట్టి -9. అతనిని వజ్రపురవతోను, పాలు పాయసముతోడను యథావిధిగ సత్కరించి -10. బ్రాహ్మణులచేత వైదికవిధితో స్వస్తివాచనము, పుణ్యాహవాచనము చేయించి నగరమునందు రథమును త్రిప్పవలెను-11.
తా॥ బ్రహ్మరథమును నాలుగువేదములు తెలిసిన బ్రాహ్మణులచేత లాగింపవలయును. అనగా రథమును లాగువారు ఋగ్యజుస్సామాధర్వణ వేదములను పఠించుచుండవలెను -12. ఆ సురశ్రేష్ఠుడైన దేవదేవునిరథము సమతలముగానున్న మార్గము ద్వారా పురమునంతయును ప్రదక్షిణముగా త్రిప్పవలెను -13. రాజా! శుభమును కోరువాడు శూద్రుని చేత మాత్రము రథమును లాగింపకూడదు. బుద్దిమంతుడు, భోజకుడైన బ్రాహ్మణుని విడిచి రథము నధిరోహింపజేయరాదు -14. బ్రహ్మదేవుని కుడి ప్రక్క సావిత్రిని, ఎడమ భాగమున భోజకుని స్థాపించి ముందుభాగమున బ్రహ్మను స్థాపన చేయవలెను -15. ఈ విధముగా వివిధ వాద్యధ్వనులతోను, శంఖారావములతోను రథమును పురమంతయు త్రిప్పవలెను. ఆ పిదప-రథయాత్రానంతరము నీరాజనమిచ్చి దేవుని స్వస్థానమున నిలుపవలేను -16. ఇట్లు 'రథయాత్ర' చేసిన వాడును, భక్తితో చూచినవాడును, రథము లాగిన వాడును బ్రహ్మలోకమునొందును -17. బ్రహ్మదేవుని మందిరమున కార్తికమాస అమావాస్యనాడు దీపములను వెలిగించినవాడు బ్రహ్మపదమును పొందును -18. పాడ్యమినాడు బ్రాహ్మణులకు గుడమిశ్రితములగు దీపములను, సదశములైన నూతన (అంచులు గల' శ్వేత వస్త్రములను సమర్పించి పూజించువాడు బ్రహ్మపదమును పొందును -19. ఆ పాడ్యమినాడే నూతన వస్త్రములతో, గంథ పుష్పాదులతో తనను తాను అలంకరించుకొనువాడు బ్రహ్మపదమును పొందును-20.
తా ॥ పాడ్యమి తిథి మహా పుణ్యప్రదమైనది. బలిచక్రవర్తి రాజ్యము పొందిన దినము. బ్రహ్మకు ప్రీతిపాత్రమైనది. నిత్యమును బాలగా కీర్తింపబడునది -21. ఈ తిథియందు బ్రాహ్మణులను, విశేషించి తనను తాను పూజించుకొనువాడు అమిత తేజోవంతుడైన విష్ణుదేవుని స్థానమగు వైకుంఠమునకు పోవును -22. చైత్రమాసమునందలి ప్రతిపదనాడు చండాలుని స్పృశించినను, స్నానమాత్రమున -23. ఏ దోషమంటకుండ పవిత్రత చేకూరును. మనోవ్యాథులు కాని శరీర రుగ్మతలు కాని బాధింపవు. అందుచే చైత్ర ప్రతి పద మిక్కిలి శ్రేష్టమైనది. ఆనాడు స్నానము తప్పక చేయవలెను -24. అదియే సర్వరోగ వినాశకరమైన దివ్యనీరాజనము. ఆవులు, గేదేలు మొదలగునవి ఏవైన ఉన్నచో వానిని ఆదినమున చక్కగా అలంకరింపవలెను -25. నూనె, ఆయుధములు, వస్త్రములు మొదలగు వానితో అలంకరించి వానీని తోరణముల క్రిందికి చేర్పవలేను. ఆపై బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను -26. కార్తీక, ఆశ్వయజ, చైత్రమాసములందలి ఈ మూడు తిథులు శ్రేష్ఠములైనవిగా చెప్పబడినవి -27. కార్తిక పాడ్యమినాడు స్నానము దానము నూరురెట్లు ఎక్కువ పుణ్యప్రదము. ఈ తిథి బలిచక్రవర్తి రాజ్యము పొందిన దినము. సుఖమునిచ్చునది. పవిత్రమైనది. అశుభమును నశింపజేయునది -28.
శతార్థసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున ప్రతిపత్కల్ప సమాప్తివర్ణనమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 18 of the Bhavishya Purāṇa is as follows:
The Pratipat Kalpa is brought to completion with the account of the Brahma rathayātrā — the chariot procession of Brahma performed on the Pratipat tithi of Kārttika Pūrṇimā. The proper construction of the chariot, the flowers and banners to be used, the route of procession, and the distribution of prasāda are described. The special glory of the Caitrī Pratipat — the first tithi of the bright fortnight of Caitra, which falls at the beginning of the new year — is declared: it is the day on which Brahma began his act of creation, and its observance is among the most meritorious of all pratipat tithis. The fruits of the complete Pratipat Kalpa — longevity, progeny, prosperity, and eventual Brahma-loka — are summarised.