స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
19 అధ్యాయము
తా ॥ సూతులిట్లన్నారు - ఈ విధముగా గురువుల సన్నిధిలో ఆమె మహావ్రత మాచరిస్తుండగా నియమము యందు ఆవక్త మైన మనసు కల ఆమెకు సంవత్సర కాలం గడిచిపోయింది (1) సంవత్సరం చివర ఆ బాల ఆక్కడే పితృ మందిరమందు విప్ర భోజన పూర్వకముగా చక్కగా వ్రతో ద్యాపన చేసింది (2) ఆ బ్రాహ్మణులకు తగినట్లుగా దక్షిణలిచ్చి వారికి నమస్కరించి విడిచి పెట్టి పితరులు అభినందించగా (3) ఆరోజు స్వయంగా ఉపవసించి నియమముల నాశ్రయించి మహాత్ముడు ఉపదేశించిన ఉత్తమ మంత్రాన్ని జపం చేసింది. (4) ప్రదోష సమయం కాగా శంకరుని పూజించి, ఆ గృహాంతిక మతమందు ఆ గురువు సన్నిధిలో (5) జప అర్చన పరురాలై ఆ సాధ్వి పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ జాగారమందు రాత్రిపూట శివుని సన్నిధిలో కూర్చున్నది. (6) ఆ రాత్రి ఆమెతో పాటు ముని జగదంబికను జపధ్యాన తపస్సులలో సంతోషపెట్టాడు పార్వతిని. (7) వ్రత భావంతో నిండిన ఆమె భక్తి వల్ల ముని యొక్క తపో యోగ సమాధి వల్ల పార్వతి సంతోషించి ఆ జగదేక మాత, తన రూపంలో ప్రత్యక్షమైంది (8) జగన్మయి ఐన పార్వతి వారి ఎదుట ప్రత్యక్షం కాగానే, అంధుడైన ఆ ముని కూడా ఆ క్షణంలోనే కళ్ళను పొందాడు (9) ప్రత్యక్షమై ఎదురుగా ఉన్న జగద్ధాత్రిని చూచి ఆమె పాదములపై ఆ ముని ఆ కన్యక పడినారు. (10) భక్తి భావంతో నిండిన స్వచ్ఛమైన ఆశయం కల, ఆనందబాష్పాలతో తడిసిన సర్వ శరీరంగల ఆ ఇద్దరివి లేపి అ దేవి దయతో నిండినధై ప్రేమతో మృదువుగా చక్కని మాట కలదై ఇట్లా అంది (11) దేవి వచనము - ఓ మునిశ్రేష్ఠ నీపై సంతసించాను. ఓ బాల! పుణ్యాత్మురాల నీపై ఆనందించాను. దేవతలకు దుర్లభమైన అభిమతం నీకే మివ్వాలి (12) అనగా ముని వచనము - ఈమె శారద అను కన్య భర్త చనిపోయాడు. కళ్ళు లేని నేను ఆనందించి ఈమెకు మాట ఇచ్చాను (13) భర్తతోనీకు నమస్కారము అని అనగా (14) దేవి వచనము - ఈ బాల పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణునకు రెండవ భార్యగా ఉండేది. భామిని అని ఆమె పేరు. (15) ఆమె ఎప్పుడూ భర్తకు ఇష్టమైంది. రూప మాధుర్యములతో మృదువైనది. రూప వశ్యాదులతో మోనంగా భర్తను స్వాధీన పరచుతుంది (16) ఈమె యందు ఆసక్తి గల హృదయం కలవాడై మోహబద్దుడై ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ పతివ్రత యైన పెద్ద భార్య దగ్గరకు వెళ్ళేవాడు కాదు (17) భర్త రానందువల్ల ఆమెకు పిల్లలు కలుగ లేదు. ఎప్పుడూ దుఃఖము కొంత కాలానికి మరణించింది. (18) ఈమె ఇంటి సమీప మందుండే ఒక బ్రాహ్మణ యువకుడు ఈమెను అందమైన శరీరం కలదాన్ని చూచి కుమారుడై ఈమె చేయి పట్టుకున్నాడు (19) ఈమె కోపంతో చూచి అతనిని నివారించింది. ఈమెనే రాత్రింబగళ్ళు స్మరిస్తూ వాడు మరణించాడు (20).
తా ॥ ఆమె భర్తను సంమోహింప చేసి, జ్యేష్ఠపత్ని నుండి భర్తను పరాజీ ముఖుని చేసినందుకు ఆ పాపంతో ఈ జన్మలో విధవ ఐంది (21) ఏ స్త్రీ లు లోకంలో భార్యా భర్తలకు అపకారం చేస్తారో వారికి ఇరువది ఒక్క జన్మలలో కౌమార వైధవ్యము లభిస్తుంది (22) పూర్వజన్మలో ఈమె నాకై గొప్ప పూజ చేసింది. అ పుణ్యంవల్ల ఆ పాపమంతా అప్పుడే నష్టమైంది. (23) కామ మోహితుడై ఏ పిప్రుడు విరహారుడై మరణించాడో అతడు ఈ జన్మలో ఈమెను వివాహమాడి మరణించాడు (24) అమె పూర్వ జన్మ వతి పాండ్య రాష్ట్రంలో ఇవ్వడు విప్ర వరుడై పుట్టాడు. శ్రీమాన్,భార్య పరిజనము కలవాడుగా ఉన్నాడు. (25) ఆ భర్తతో ప్రతి రాత్రి ఈమె ప్రేమగలదై స్వప్న మందు రతి సుఖాన్ని పొందని జాగరణ మందు కన్న అది శ్రేష్ఠము (26) ఇక్కడి నుండి మూడు వందల అరవై యోజనముల దూర మందలి దేశ మందున్న ద్విజ వరుడు కర్మ గతితో ప్రతిరాత్రి మనస్సు నకు నచ్చిన ఈ వధువును స్వప్నంలో చూస్తాడు. చాలా సేపు రతిని కూరుస్తాడు (27) ఈమె స్వప్న కలయికతో భర్తకు ప్రతిరాత్రి కల్పించి కొంతకాలానికి వేద వేదాంగ పారగుడైన పుత్రుణ్ణి కంటుంది. (28) తను చాలా కాలం స్వప్న సంగమంవల్ల ఈమె యందు పుత్రుణ్ణి పొందుతాడు. ఆ విప్రుడు కూడా ఎల్ల కాలము ప్రేమ భావితుడైన ఆతనిని కలలో చూస్తాడు (29) పూర్వభవ మందు నేను ఈమెతో పూజనొందాను ఓ మహాముని! ఇప్పుడు ఈమెకు వరం ఇచ్చే కొరకే వచ్చాను అని అంది. (30) మూడవి వచనము- మహాదేవి ఆ బాలతో సాదరంగా ఇట్లా అంది ఓ బాల! ఓ మహాభాగే! నా మంచి మాటలను విను (31) ఎప్పుడైనా నీ భర్తను ఏ ప్రదేశంలో నైనా చూస్తే ఇది వరకు కలలో చూసిన వానిని నీవు విచక్షణ కలిగి గుర్తిస్తావు (32) ఆతడు నిన్ను చూస్తాడు స్వప్న లక్షణములు గల సునయము గల నిన్ను చూశాక అప్పుడు మీకు పరస్పర సంభాషణ జరుగుతుంది (33) అప్పుడు బాగా పాండిత్యము గల అతని కొడుకును అతనికివ్వు ఓ భద్ర! ఈ వ్రతము యొక్క ఫలాన్ని శ్రేష్ఠమైన దానిని అతని హస్త మందుంచు (34) నాటి నుండి ఆతని అధీనమందే ఉండు ఓ ప్రమధ్యమ! స్వప్న రతి తప్ప మితు దైహిక సమాగమము కలుగొద్దు (35) కాలం గడిచాక ఆ బ్రాహ్మణ సత్తముడు మరణించాక అగ్నిలో ప్రవేశించి అతనితో పాటు నా స్థానానికి వస్తావు (36) నీకు కలిగే పుత్రుడు సర్వలోక మనోహరుడౌతాడు సంపదలు లభిస్తాయి. పరమ పదాన్ని పొందుతాడు (37) సూతుని వచనము - అని త్రిజగన్మాత పలికి ఆమె కోరికనిచ్చి వారు చూస్తుండగానే క్షణంలో కన్పించకుండా పోయింది (38) కరుణా నిధియైన పార్వతి వల్ల ఆ బాల వరాన్ని పొంది పరమానందాన్ని పొందింది. ఆ గురువును పూజించింది (38) ఆ రాత్రి గడిచాక ఆ ముని కళ్ళను పొంది ఆమె తలిదండ్రులకు అదంతా రహస్యంగా చెప్పాడు అధర్మనేది (40) ఇక అందరితో చెప్పి యశస్వినియైన శారదను వారిని అనుగ్రహించి ముని స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు . (41).
తా ॥ ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఆ బాల ప్రతి క్షణము స్వప్న ముందు, సుఖాన్ని పెంపొందించే భర్త సమాగమాన్ని పొందింది (42) విశద వ్రత ఆ శారద గౌరి వర ప్రదానంతో కలలో కూడా, భర్త సమాగమా న్ననుభవించి నందువల్ల గర్భం ధరించింది (43) భర్త లేకుండా గర్భితమైన శారద అను సతిని గూర్చి విని అందరు చీ అని అన్నారు. జనులు ఆమె జారిణి అని అన్నారు (44) చనిపోయిన ఆమె భర్త యొక్క జాతికుల బాంధవులు ఎవరున్నారో వారు దుఃసహమైన వార్తను విని ఆమె తండ్రి ఇంటికి వచ్చారు. (45) ఇక గ్రామ వృద్దులు పండితులు అందరు వచ్చారు. కుల వృద్ధులతో కూడిన సమాజాన్ని అక్కడ ఏర్పరచారు (46) తల వంచుకొన్న గర్భిణి యైన ఆ శారదను పిలిచి, చాలా కోపగించి భయ పెట్టారు. కొందరామెను చూడటానికి ఇష్టపడలేదు. (47) ఒ జారిణీ, దుర్బుద్ధి నీవు చేసిన ఈ పనేమిటి. మా కులానికి చాలా చెడ్డ పేరు తెచ్చి పెట్టాను ఓ బాలి (48) అని వారు భయ పెడ్తున్నరు, బుద్ధి మంతులైన గ్రామ వృద్ధులు అందరు ఏం చేద్దాం అని మాట్లాడుకుంటూ ఆలోచించ సాగారు (49) అక్కడ కొందరు వృద్ధులు ఆమె పై ఏ మాత్రం దయలేకుండా ఇట్లన్నారు. ఇది పాపపు బుద్ధిది. బాల రెండు కులాలను నశింప చేసేది.(50) ఈమె వెంట్రుకలు తొలగించి,ముక్కు చెవులు కోసి తన గోత్రం నుండి తీసేసి ఊరి బయటకు పంపండి (51) అని అంతా ఆలోచించి ఆమెను అట్లాగే చేద్దామనుకున్నారు. ఇంతలో ఆకాశంలో పుట్టిన, కనిపించని ఒక వాక్కు ఇట్లా వినిపించింది (52) ఈమె పాపం చేయలేదు. కులదూషణ చేయలేదీమె. ఈమె ప్రత భంగమూ రాలేదు. ఈమె మంచి చరిత్ర గలది (53) ఇక ముందు ఈమెను ఎవరైనా జారిణి అంటే దోషంతో మూడులైన వాళ్ళ నాలుక వెంటనే చీలిపోతుంది (54) అని ఆకాశంలో పుట్టిన అశీరరవాణిని విని వారంతా ఆనందించారు. ఆమె తలిదండ్రులు కూడా (55) పిదప తొందరగా అందరు గ్రామవృద్ధులు సభా జనులు క్షణకాలం మౌనం వహించి భయపడి అధో ముఖులై నిల్చున్నారు. (56) కొందరా మాట పై విశ్వాసం లేక ఇది అబద్ధవు మాట అని అన్నారు. వారి నాలుక రెండు ముక్కలైంది. క్షణంలో వారు పురుగులను కక్కారు (57) ఇక జాతి బాంధవులు ఆ బాలను పూజించసాగారు. బాంధవులు స్త్రీలు వృద్ధులు బాగు బాగని పొగిడారు (58) కొందరు కులోత్తములు ఆనంద బాష్ప భిందువులను వదిలారు. కుల స్త్రీ లు ఆనందించి ఆమెను గూర్చి ఓదార్పు పొందారు (59) అక్కడ ఇతరులు కొందరిట్లన్నారు. దేవుడు అబద్ధమాడడు. శీలము నుండి ఈమె తప్పలేదు. నిజమే మరి ఈమె గర్భమెట్ల ధరించింది (60).
తా ॥ అని అందరు సభ్య జనులు వంశయా విష్ట మనస్కులు కాగా వారిని చూచి ఒక వృద్ధుడు సర్వజుడు లోకతత్వ మెరిగినవాడు (61) ఇట్లన్నాడు. ఈ లోకము మాయతో నిండినది, కనిపించేది వినిపించే దంతా ఏది జరుగుతుందో ఏది జరగదో క్షణాత్మకమైన ఈ సంసారంలో తెలియదు. (62) జరుగని దాని గురించి చెప్పలేము (జరుగదు అని) మాయవల్ల తప్పక జరుగుతుంది మాయ ఈశ్వరాధీనము. ఆతని చేష్టలు ఎవరికి తెలుసు (63) యూపకేతు వను రాజర్షి శుక్రము నీటిలో పడింది. శుక్రంతో కూడిన ఆ జలాన్ని తాగి వేశ్య గర్భం ధరించింది కదా. (64) విభాండక ముని శుక్రాన్ని నీటితో పాటు తాగి జింక గర్భం ధరించి ఋష్యశృంగు కన్నది. (65) సురాష్ట్రుడను రాజు చేతిని తాకి ఆడ లేడి ఆ క్షణంలోనే గర్భం ధరించి మునిని, తాపసుని కన్నది (66) సత్యవతి అనే స్త్రీ చేపగర్భం నుండి జనించింది. మహిషాసురుడు బఱ్ఱే (మహిషీ)గర్భం నుండి జన్మించాడు (67) అట్లాగే ఇది వరలో స్త్రీలు కరుణవల్ల గర్భం ధరించిన వారున్నారు అట్లాగే వనదేవుని వల్ల రోహిణికి పుత్రుడు కల్గాడు (68) దేవతల, మహర్షుల శాపం వల్ల వరం వల్ల తగని పని కూడా జరుగుతుంది. అనుమానంలేదు (69) మునిశాపం వల్ల సాంబుని కడుపు నుండి రోకలి పుట్టింది. మునుల మంత్రాధిక్యం వల్ల యువనాశ్వునకు గర్భమైంది. (70) అట్లాగే ఈ కల్యాణి మహర్షి పాద సేవ వళ్ళ, మహా వ్రత ప్రభావంవల్ల, నిందింపబడకుండ గర్భాన్ని ధరించి ఉండవచ్చు. (71) ఈ విషయంలో రహస్యంగా ఈమెను స్త్రీలు నిజమేమిటో అడగండి. పిదప మహాజనుల సందేహం తీరిపోతుంది. (72) అనగా పిదప ఆ మాట ప్రకారం ఆడవాళ్ళంతా కలిసి ఆమె నడిగారు. ఆమె వారికి తన వృత్తాంతాన్నంతా మహాద్భుతమైన దానిని చెప్పింది. (73) పిదప వారంతా తెలుసుకొని ఆమెను గౌరవించి ఆనందిస్తూ ప్రశంసిస్తూ తమ తమ ఇళ్ళకు వెళ్ళారు (74) శుభమైన కాలం రాగా విమలమైన ఆశయం గల శారద ఆ బాల బాల ఆర్కుని వంటి తేజస్సు గల పుత్రుని కన్నది (75) ఆతడు మహా ఉదార లక్షణముల వాడు కమలముల వంటి చూపుల వాడు. గొప్పబుద్ధి కలవాడై బాల్యమందే గొప్ప విద్యను పొందాడు (76) సకాలంలో ఆలోకమనోరముడు గురువు ద్వారా ఉపనయనాన్ని పొంది ఆతడు రదేయుడు అవి లోకంలో ప్రసిద్ధిని పొందాడు (77) ఎనిమిదవ ఏట ఋగ్వేదాన్ని నవమ మందు యుజుర్వేదాన్నీ దశమ మందు సామవేదాన్ని అవలీలగా అభ్యసించాడు, ఆ బుద్ధిమంతుడు (78) త్రిలోక ప్రసిద్ధమైన శివ పర్వం రాగా జనులంతా ఉన్న వాళ్ళందరూ గోకర్ణానికి వెళ్ళారు (79) శారద కూడా తన పుత్రునితోపాటు గోకర్ణానికి వెళ్ళింది (80)
తా॥ అక్కడకు తనకు ఎప్పుడూ కలలో కన్పించిన వానిని ఎదురుగా చూచింది. పూర్వ జన్మలో ఆతడు భర్త. ద్విజులు బంధువులు చుట్టూ ఉన్నారు (81) ఆతనిని చూచి ప్రేమ వివశమై, శరీరం నిండా పులకలు రాగా, కన్నీళ్ళను ఆపుకొని, ఆతనినే చూస్తూ నిలబడింది (82) ఆతడు కూడా ఆమెను చూచి, రూప లక్షణములు కలదానిని స్వప్నంలో తనచే ఎప్పుడూ అనుభవింప బడుతూ తనకు రతిని ఇచ్చే ఆమెను చూచాడు (83) ఆ కుమారుని కూడా తన నుండి పుట్టిన వానిని కలలో చూచి, ఇక్కడ చూచి విస్మయంతో నిండినవాడై అతని దగ్గరకు వచ్చాడు (84) ఓ భద్ర! నా మనసులో ఉన్న దానిని ఏదో ఒక దానిని నిన్ను అడుగదలచాను. అని మొదలు పలికి ఆమెను చాటుకు తీసుకెళ్ళాడు. (85) నీవెవరో చెప్పు. ఓ వామోరు! సువ్రత! నీవెవరి భార్యవు. నీ దేశమేది. ఎవరి పుత్రికవు. నీ పేరేమిటి అని ఆమె నడిగాడు. (86) అని అడుగగా ఆమె కన్నీళ్ళు నింపుకుంటూ తన వృత్తాంతాన్ని బాల్యంలో కల్గిన వైధవ్య కారణమును తెల్పింది (87) తిరిగి ఆమెను అడిగాడు. ఈ ఉత్తముడైన బాలుడు ఎవరి వాడు అని వీణ్ణి గర్భంలో ఎట్లా ధరించావు. వీడు చంద్రునిలా ఉన్నాడు (88) అనగా శారద వచనము - ఓస్వామి! వీడు నా కుమారుడు. సర్వ విద్యలలో విశారదుడు శారదేయుడు అని అంటారు. నా పేరులోనే ఏర్పరచారు (89) అనే ఆమె మాటను విని నవ్వి ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్లన్నాడు. నీ చరిత్ర మిక్కిలి కష్టమైనది, ఓ భామిని ! (90) నిన్ను వివాహం మాత్రం చేసుకొని నీ భర్త చనిపోయాడు. గదా, ఈ పిల్లవాడు ఎట్లా పుట్టాడు. దానికి కారణాన్ని చెప్పండి (91) అనగా ఆతడన్న మాటను విని చాలా సిగ్గుపడి చాలా సిగ్గుపడి కొంచం సేపు కన్నీళ్ళు పెట్టుకొని ధైర్యంగా ఇట్లా పలికింది (92) శారద వచనము- ఈ పరిహాసం చాలు. ఓ మహామతి! నీవు నన్నెరుగుదువు. నేను నిన్నెరుగుదును. ఈవిషయంలో మన మనస్సులే సాక్షి (93) అని పలికి దేవి ఇచ్చిన వరాదులు అంతా చెప్పి వ్రతమునకు భాగమైన ఆ కుమారుని ద్రుతప్రతుని (ప్రతథారి) ఆమె ఆతనికిచ్చింది (94) ఆ బ్రాహ్మణుడు ఆనందపడి ఆ కుమారుని తీసుకొన్నాడు. తండ్రి ఆజ్ఞలో ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళాడు (95) ఆమె కూడా అనేక మాసాలు ఆ విప్రుని ఇంటిలో ఉండి ఆతడు చనిపోయాక అగ్ని ప్రవేశం చేసి ఆతనిని అనుసరించింది (96) పిదప వారు దంపతులై దివ్య విమానాన్ని ఎక్కారు. దివ్య భోగములు కల వారై శివమందిరానికి వెళ్ళారు (97) అని ఈ పుణ్యమైన కథను నేను చెప్పాను, చదివే వారికి వినే వారికి చక్కగా భుక్తి ముక్తి ఫలములనిచ్చేది. (98) ఆయుస్సు, ఆరోగ్యము, సంవత్తి ధనము ధాన్యము వీటిని పెంచేది. స్త్రీలు మంగళ సౌభాగ్య సంతాన సుఖములనిచ్చేది (99) ఈ మహా ఆ ఖ్యానము పాప రాశిని నశింప చేసేది. గౌరీ మహెశుల వ్రత వుణ్యమునుకీర్తనము భక్తితో ఒక్కసారి ఎవరు చేసినా విన్నా కీర్తించినా ఆతడు భోగముల అనుభవించి శాశ్వత పదమును పొందుతాడు (100) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు. శారద ఆఖ్యాన వర్ణన మనునది పందొమ్మిదవ అధ్యాయము.
