స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

6 అధ్యాయము

తా ఋషులిట్లన్నారు - ఓసూత - మీరు గొప్పదైన అద్బుతమైన ఏ ఆఖ్యానాన్ని చెప్పారో అది శంభువు యొక్క మహాత్మ్యాన్ని తెల్పేది. పాపముల నంతా హరించేది పరమ మైనది (1) తిరిగి మేము జాగ్రత్తగా అట్టి దానినే వినదలిచాము. మహాత్ములు శివుని ప్రదోష కాలమందు పూజిస్తే ఆ భగవానుడు (2) ఏ సిద్ధిని ఇస్తాడో దానిని మాకు చెప్పండి, ఓ సువ్రత. ఒకసారి విన్నా ఓ సూత! మాకు మళ్ళా కుతూహలం పెరుగుతోంది (3) అని అనగా సూతుల వచనము - మహా ప్రాజ్ఞలార! లోక విశ్రుతులైన మీరు బాగా అడిగారు. అందువల్ల నేను గొప్పదైన శివపూజా ఫలమును గూర్చి చెపుతున్నాను. (4) త్రయోదశి తిథి సాయంకాలము ప్రదోషమన బడుతుంది. ఫలం కోరేవాడు అప్పుడు మహాదేవుని పూజించాలి. మరో దేవుణ్నికాదు (5) ప్రదోష పూజా మహాత్మ్యాన్ని వర్ణించటానికి ఎవడు సమర్థుడు. అప్పుడు పండితులంతా శివుని దగ్గర కూర్చుంటారు (6) ప్రదోష సమయమందు దేవుడు కైలాసంలో రజత ఆలయమందు, గుణముల ఉదయాన్ని పొగుడుతుండగా విబుధులతో పాటు నృత్యం చేస్తాడు (7) అందువల్ల పూజ, జపము, హోమము, ఆయన కథలు, అతని గుణవతి వీటిని చతుర్వర్గ ఫలాన్ని కోరే నరులు తప్పకుండా ఆచరించాలి(8) దారిద్ర్యమనే చీకటితో గుడ్డివారైన, పుట్టుక వల్ల భయము నొందే నరులకు భవసాగరమగ్నులకు ఒడ్డను చేర్చి తెప్పఇది (9) దుఃఖ శోక భయములలో ఆర్తులైన వారికి, క్లేశముల నుండి ముక్తిని కోరే వారికి ప్రదోష కాలమందు పార్వతిని పూజ మంగళములను కురుస్తుంది (10) దుర్బుద్ధి గలవాడు, నీచుడు, మందభాగ్యుడు, శఠుడు వీరంతా ప్రదోషకాల మందు దేవేశుని పూజిస్తే వారు ఆ పధలనుండి ముక్తులౌతారు (11) శత్రువులతో చంపబడేవాడు. పాములతో కరువబడేవాడు. పర్వతములతో అక్రమింపబడేవాడు, సముద్రమందు పడినవాడు (12) కాలదండంతో కొట్టబడినవాడు, అనేక రోగములతో బాధపెట్ట బడినవాడు వీరంతా ప్రదోష కాలమందు గిరిఈశుని అర్చించిన నశించరు (13) దారిద్ర్యము, మరణము, దుఃఖము, ఋణభారము ఇవన్ని పర్వతముల వంటివి. శివపూజ వలన వెంటనే వీటిని తొలగించుకొని సంపదలలో పూజింపబడుతాడు (14) ఇప్పడు మహాపుణ్యమైన ప్రాచీనమైన ఒక ఇతిహాసాన్ని చెబుతాను. దీనిని విన్న మనుషులంతా కృతకృత్యయ నోందుతారు (15) విదర్భదేశ మందు ప్రత్యరథుడను పేరుగల వాడు ఉండేవాడు. సర్వ ధర్మము లందు విరటుడు ధీరుడు నలుడు సత్య సంగరుడు (16) అతడు ధర్మం ప్రకారం భూమిని పాలిస్తుండగా చాలాకాలము మహామతి సుఖంగానే గడిచిపోయింది. ఓ ఇ ముని పుంగవులారా (17) ఆ రాజుకు శల్వరాజలు, అధిక బలం గలవారు దుర్మర్షణుడు మొదలగు వారు శత్రువు లేర్పడ్డారు (18) ఒకసారి ఆ శాల్యుడు అనేక సైన్యం కలవారై విదర్బ నగరానికి వచ్చి, దాన్ని జయించాలనే కోరికతో దాన్ని అడ్డగించారు (19) విదర్బాధి పతి తన నగరాన్ని శత్రువులు అడ్డగిస్తుండటం చూచి, చాలా సైన్యంతో కూడి త్వరగా యుద్ధం చేయటానికి వచ్చాడు (20).     

తా ॥ బలోద్ధతులైన శాల్వులతో అతనికి యుద్ధం జరిగింది. పాతాళంలో పన్నగేంద్రునకు దుర్మదులైన గంధర్వులకు జరిగినట్లుగా (21) విదర్ప నృవతి చాలా భయంకరముగా యుద్ధము చేసి ఆధిక సైన్యంగల శాల్వుల చేతిలో యుద్ధ మందు నష్టాన్ని పొంది, చచ్చిపోయాడు. (22) మహారధుడైన వీరుడు మంత్రులతో గూడా చంప బడగా యుద్ద మందు చావగా మిగిలిన సైనికులు భగ్ను లైనవారు పరుగెత్తారు (23) యుద్ధం సమాప్తి చెందాక శత్రు రాజుల మంత్రులు ఆనందిస్తుంటే నగరమందు యుద్ధం జరుగుతుండగా కోలాహలంగా ధ్వనిగా (24) ఆవిర్భాధిపతి, సత్యరథుని ఒక భార్య చాలా దుఃఖం పొందినదై ప్రయత్నించి అంతః పురిలోని ఒక చోటి నుండి బయట పడింది (25) అమె, రాత్రిపూట గర్భిణియైన ఆ రాజు భార్య ప్రయత్నంగా బయటపడి దుఃఖిస్తూ పడమటి దిక్కుగా బయలుదేరింది (26) తెల్లవారాక మెల్లగా దారి వెంట పోతూ ఆమె చాలా మార్గాన్ని దాటి ఒక నిర్మలమైన సరస్సును చూచింది (27) ఆవరారోహ అక్కడికి వచ్చి, అధికమైన తాపంతో తపించినదై నస్తీరమందున్న నీడ గల చెట్టును ఆశ్రయించింది (28) అక్కడ ఎవరూ లేని చెట్ల ప్రదేశమందు దైవవశాత్తు రాణి మంచి గుణములు గల ముహూర్త మందు ఆ సాధ్వి ఒక కొడుకును ప్రసవించింది (29) ఆ రాజు భార్య చాలా దప్పిక గలదై సరస్సులోకి దిగి ఆ సుందరాంగి పెద్ద మొసలితో మింగబడింది. (30) పుట్టుకతోనే తల్లిదండ్రులను పొగొట్టుకున్న ఆ కుమారుడు ఆకలి దప్పులతో బాధపడుతూ బలహీనుడై నరస్తీర మందు గట్టిగా ఏడ్చాడు (31) పుట్టగానే కుమారుడు ఇట్లా ఏడుస్తుంటే తొందరగా అదృష్టవ శాత్తు ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చింది (32) అమె కూడా ఒక్క సంవత్సరం పిల్లవాణ్ణి తన కొడుకును ఎత్తుకొని ఉంది. ధనం లేనిది భర్త లేనిది. ఇంటింటికి యాచించేది (33) ఒక కొడుకు గలది, బంధువులు లేనిది. యాచిస్తూ మార్గంలో వస్తూ ఉమ అను పేరు గల ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ రాకుమారుణ్ణి చూచింది (34) సూర్యంబింలా పడి ఉన్న ఆ రాకుమారుని చూచి, అనాథుడై ఏడుస్తున్న వీణ్ణి గూర్చి చాలాసేపు ఆలోచించింది (35) చాలా ఆశ్చర్యకరమైన దాన్ని చూశాను. నేనిప్పుడు నాభి సూత్రం తెగి పోలేదింకా వీని తల్లి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది (36) తండ్రి లేడు మరొకడు లేడు అంధుజనులు లేరు. అనాథ కవణుడు, బాలుడు, కేవలం భూమిపై పడుకొని ఉన్నాడు (37) వీడు చండాలజుడో, చూద్రజుడో, వైశ్యకు కల్గినవాడో, బ్రాహ్మణుని కొడుతో రాజు కొడుకో, ఈ పిల్లవాణ్ణి గురించి ఎట్లా తెలుసుకోను? (38) ఈ పిల్లవాణ్ణి ఎత్తుకొని ఓరవ పుత్రునివలె పోషిస్తాను, తప్పకుండా. కాని కులం తెలియకుండా ముట్టుకోవటానికి ఉత్సహించలేక పోతున్నాను. ఉత్తమం కాదు (39) అని చింతిస్తుండగా ఆ విప్రస్త్రీ దగ్గరకు (40).   

తా ॥ ఒక భిక్షువు సాక్షాత్తు దేవుడు స్వయంగా శివుడే వచ్చాడు. ఆ బిక్షువర్యుడు ఆమెతో ఇట్లన్నాడు. ఓ విప్ర భామిని ఏడవొద్దు (41) ఓ సుభ్రు! మనసు లోని అనుమానాన్ని వదలి ఈ బాలుణ్ణి రక్షించు. ఈ పిల్లవానితో, త్వరలో, ఇక్కడ గోప్ప శ్రేయస్సును పొందుతావు (42) ఇంత మాత్రం పలికి కారు హీకుడైన భిక్షువు త్వరగా వెళ్ళి పోయాడు. ఆ భిక్షువు వెళ్ళిపోయాక నమ్మకం కలిగిన ఆ విప్ర స్త్రీ (43) ఆ పిల్లవాణ్ణి తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. భిక్షువు వాక్యం పై నమ్మకం కలిగిన ఆమె రాకుమారుని (44) దయతో తన కుమారునితో సమానంగా పోషించింది. ఏకచక్రం అను పేరుగల అందమైన గ్రామంలో ఇల్లు ఏర్పరచుకొని (45) తన పుత్రున్ని, రాజపుత్రున్ని భిక్షాన్నముతో పెంచింది. బ్రాహ్మణి కొడుకు, ఆ రాకుమారుడు (46) బ్రాహ్మణులతో సంస్కారాన్ని పొంది బాగా గౌరవింపబడి పెరుగసాగారు. సకాలంలో ఉపనయనములు చేయబడి ఆ బాలకులు నియమ మందున్నారు (47) తల్లితో పాటు ప్రతిరోజు భిక్షకోసం తిరుగసాగారు. ఆ పిల్లలతో ఒకసారి ఆ విప్ర వనిత (48) భిక్షం చేస్తూ అదృష్టవ శాత్తు ఆమె దేవాలయంలోకి ప్రవేశించింది. వృద్ధులైన మునులతో కూడిన ఆ దేవాలయమందు (49) ఆ పిల్లలను చూచిన శాండిల్యుడు బుద్ధిశాలి ముని ఇట్లన్నాడు. దైవ బలము చిత్రమైంది. కర్మ తప్పించ రానిది (50) ఈ పిల్లవాడు మరో తల్లిని ఆశ్రయించి భిక్షమెత్తి జీవిస్తున్నాడు. ఈ ద్విజ స్త్రీని ఉత్తమమైన దానివి తల్లిగా పొంది జీవిస్తున్నాడు. (51) ద్విజపుత్రుని కూడి ద్విజ భావాన్ని పొందాడు. అనే శాండిల్య ముని మాటలను విని ఆ బ్రాహ్మణ (52) సభా మధ్యంలో నమస్కరించి ఆశ్చర్యంతో అడిగింది. ఓ బ్రహ్మన్! ఈ పిల్లవానిని భిక్షువు మాటల ప్రకారము నేను ఇంటికి తెచ్చాను (53) ఇప్పటికీ ఈతని బలమేమిటో నాకు తెలియదు. కొడుకులా పోషిస్తున్నాను. ఏ కులంలో పుట్టాడు వీని తల్లెవరు, తండ్రెవరు (54) జ్ఞానచక్షువు గల మీ ద్వారా తెలుసుకోవాలని కోరుతున్నాను (55) అని అడుగగా ఆ ముని జ్ఞానదృష్టి గలవాడు బ్రాహ్మణ స్త్రీతో ఆ బాలుని పూర్వపు కర్మ జన్మల గూర్చి చెప్పాడు (56) ఈతడు విదర్భరాజ పుత్రుడు. అతని తండ్రి యుద్ధంలో మరణించాడు. వాని తల్లిని మొసళ్ళు మింగాయి. అని అంతా చెప్పాడు (57) పిదప ఆ స్త్రీ ఆశ్చర్యపడి ఆ మునిని మరలా ఇట్లా అడిగింది. ఆ రాజు సకల భోగములను వదలి యుద్ధంలో ఎట్ల మరణించాడు. (58) ఓ మహాముని! ఈ బాలునికి దరిద్రము ఎట్లా వచ్చింది. దారిద్ర్యాన్ని పోగొట్టుకొని తిరిగి రాజ్యాన్ని ఎట్లా పొందుతాడు. (59) వీనికి నా కొడుక్కూ భిక్షాన్నం తోనే జీవనము. దారిద్ర్యం తగ్గిపోయే ఉపాయమును ఉపదేశించటానికి మీరు తగుదురు అనగా (60).   

తా శాండిల్యుని వచనము - ఈ పిల్లవాని తండ్రి ఆ విదర్భరాజు. ఆ రాజు పూర్వ జన్మలో పాండ్య రాజుగా ఉండేవాడు (61) ఆ రాజు సర్వ ధర్మజ్ఞుడు. భూమినంతా పాలిస్తూ, ప్రదోష సమయమందు ఒకసారి శివుని పూజించాడు (62) భక్తితో శివుని పూజిస్తున్న ఆ రాజు నగరంలో అంతటి గొప్ప కలకలా రావము ఏర్పడింది. (63) ఆ ఎక్కువైన ధ్వనిని విని ఆ రాజు శివార్చనను వదలి, నగరమునకు క్షోభ కలుతుందనే అనుమానంతో రాజభవనం నుండి బయటి కొచ్చాడు (64) ఇంతలో అతని మంత్రి మహాబలుడు శత్రువును పట్టుకొని ఆ సామంతునితో రాజు దగ్గరకు వచ్చాడు. (65) మంత్రి తెచ్చిన సామంతుడైన ఉద్దతుడైన శత్రువును చూచి రాజు కోపంతో శిరచ్ఛేదం చేయించాడు (66) రాజు అట్లాగే శివపూజను వదలి, తన నియమమును నమాప్తి చేయకుండానే ఆ రాత్రి భుజించాడు (67) ఆతని కొడుకు గూడా ప్రదోష సమయ మందు శివుని అట్లాగే చేశాడు. శివుని పూజించకుండా ఆ మూఢాత్ముడు దుర్మదుడు తిని నిద్రపోయాడు (68) మరో జన్మలో ఆ రాజు విదర్భరాజైనాడు. శివార్చన అంతరాయం వల్ల ఇతరులతో సుఖముల మధ్యలోనే చంపబడ్డాడు (69) పూర్వజన్మ యందు ఆతని కొడుకు ఎవడో వాడే ఈ జన్మలో అతని సుతుడై శివ పూజను అతిక్రమించి నందువల్ల దరిద్ర్యాన్ని పొందాడు. (70) ఈతని తల్లి పూర్వజన్మలో సవతిని మోసంగా చంపింది. ఆ పాపం కారణంగా ఈ జన్మలో ముసళ్ళతో చంపబడింది (71) వీళ్ళ నడవడికను నీకు చెప్పాను. శివుని పూజించని నరులు దరిద్ర్యాన్ని పొందుతారు. (72) సత్యం చెప్తున్నాను. పరలోకంలో మేలును చెబుతున్నాను. సారం చెబుతున్నాను. ఉపనిషత్తుల హృదయాన్ని చెబుతున్నాను. అధికమైన సంసారము అపారమైంది. దీనిని పొందిన ప్రాణి సారమైన ఈశ్వర పాదాంబుజ సేవను చేయాలి (73) ప్రదోష సమయమందు శివుని ఆరాధించనివారు, అర్చించిన శివుని నమస్కరించని ఇతురులు, ఈ కథను చెవులతో వినని మూఢులు వారంతా ఆనర్హులంతా జన్మజన్మలలో దరిద్రులౌతారు (74) ప్రదోష సమయ మందు పరమేశ్వరుని పాద నరోజ పూజను ఏకాగ్ర చిత్తంతో ఎవరు చేస్తారో, వారు రోజు పెరిగిన ధనము, ధాన్యము, కలత్రము, పుత్రులు, సౌభాగ్యము, సంపదలు ఈ లోకంలోనే అధికంగా కలవారౌతారు (75) కైలాస పర్వత భవనంలో త్రిజగత్తులను సృష్టించే గౌరినీ కనకంతో చేసిన రత్న పీఠమందుంచి శూలపాణి నృత్యం చేయటానికి ఇష్టపడుతాడు. ఆ ప్రదోష సమయమందు దేవతలంతా అతనిని సేవిస్తారు (76) వాగ్దేవి వీణను, శతమఖుడు వేణువును, పద్మజుడు (బ్రహ్మ తాళములు ధరించగా లక్ష్మీదేవి గేయప్రయోగం చేయగా, విష్ణువు మృదంగమును వాయించగా, దేవతలు ఎదురుగా నిలబడగా, ప్రదోష సమయంలో వీరంతా దేవుడైన మృడానీపతిని సేవిస్తున్నారు (77) గంధర్వులు, యక్షులు, వతగ, ఉరగ, నదులు సాధ్యులు, విద్యాధరులు, అమరవరులు, అప్సరసగణములు, ఇతరులు త్రిలోకములందున్న భూత వర్గమంతా ప్రదోష సమయం వస్తే వీరంతా హరుని పార్శ్వ మందుంటారు (78) అందువల్ల ప్రదోష మందు శివుణ్ణి ఒక్కడే పూజించాలి. ఇతరులైన హరిబ్రహ్మ మొదలగు వారిని పూజించరాదు. ఆ మహేశుడు విధి ప్రకారం పూజింప బడుతుంటే దేవతలంతా అనుగ్రహిస్తారు (79) ఈ నీకుమారుడు పూర్వజన్మలో బ్రాహ్మణోత్తముడు. వయస్సునంతా దానములు స్వీకరించటంతో గడిపాడు. యజ్ఞాది సుకర్మలు చేయలేదు (80) అందువల్ల దరిద్ర్యాన్ని పొందినాడు నీ కుమారుడు ఓ బ్రాహ్మణ వనిత. ఆ దోష పరిహారం కొరకు శంకరుని శరణు వేడని (81) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు మూడవ దైన బ్రహోత్తర ఖండమందు ప్రదోష మాహాత్మ్య వర్ణన మనునది ఆరవ అధ్యాయము.