స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
2 అధ్యాయము
తా ॥ సూతులిట్లన్నారు - త్రిపుర ద్వేషి యొక్క మరొక మాహాత్మ్యాన్ని కూడా చెబుతాను. విన్నంతలోనే త్వరలో అన్నీ అనుమానములు తొలగిపోతాయి (1) పాపమును శోధించేది దీని కన్న మించింది మరొకటి లేదు. అన్ని విధముల ఆనందాన్నిచ్చేది. శ్రీమంతమైనది సర్వ కామ అర్థముల సాధించేది (2) దీర్ఘాయుస్సు, విజయ ఆరోగ్య భుక్తిముక్తిఫలమునిచ్చేది. అనన్యచిత్తంతో మహేశుని ఆరాధించటం, వరమైనది (3) ఆర్ధ్రమైన, ఎండిన, అల్పమైన లేదా గొప్పవైన పాపములన్నిటికి ఇదే ఉత్తమమైన ప్రాయశ్చిత్తముగా నిర్దేశించబడింది (4)అన్నికాలములందును ఛేదించ రాని కారణములన్నింటికి క్షయకారణము. మహామునులు నిర్దేశించిన ఉత్తమమైన ప్రాయశ్చిత్తములకన్న (5) ఇదే మిక్కిలి ఉత్తమమైనది శ్రేయస్కరమైనది. అన్ని శాస్త్రములందు నిశ్చయించబడింది. భక్తితో పరమేశ్వరుని పూజించుటే పరమ ఉదయము (6) తెలిసి కాని తెలియక కాని ఏదో ఒక కారణంగా ఏ కొంచంగాని, దేవుని కొరకు చేసే కర్మ ముక్తినిచ్చేది (7) మాఘకృష్ణ చతుర్ధశి యందు ఉవవాసము అతి దుర్లభము. అక్కడ కూడా నరులు రాత్రి పూట జాగరణదుర్లభము (8) శివలింగదర్శనము ఇంకా దుర్లభమని భావిస్తాను. పరమేశుని పూజను దుర్లభమని భావిస్తాను (9) నూరు కోట్ల జన్మలలో కల్గిన పుణ్య రాశుల వరిపాకం వల్ల ఆ రోజు ప్రభువు యొక్క బిల్పవత్రార్చన లభిస్తుంది. (10) పదివేల నంవత్సరాలు గంగానది జలంలోస్నానంచేసిన వానికి వచ్చిన ఫలము ఒక్కసారి బిల్వార్చన చేస్తే చాలు ఆ ఫలితమును నరుడు పొందుతాడు (11) యుగయుగమందు ఏఏ వుణ్యములు ఇక్కడ లీనమై నా అ వన్నీ మాఘకృష్ణచతుర్ధశియందు ఉంటాయి. (12) దీనినే లోకంలో బ్రహ్మాదిదేవతలు ప్రశంసిస్తారు. వసిష్ఠాదిమునులు మాఘమాసంలో కృష్ణచతుర్ధశిని ప్రశంసిస్తారు. (13) ఇక్కడ ఉపవాసాం చేసిన వారెవరైనా నూరుయజ్ఞములకన్న ఎక్కువ చేసినట్లే. రాత్రి జాగరణ చేయటం పుణ్యప్రదము. కోటికల్పముల తపస్సు కన్న అధికము (14).
తా ॥ ఒక బిల్వ పత్రంతో శివలింగార్చన చేస్తే ముల్లోకములలో ఆతని పుణ్యంతో సమానమైన వారు ఉండరు (15) ఇక్కడ వుణ్యమైన పరమ శోభనమైన కథ చెప్పబడుతోంది. రహస్యంగా ఉంచతగినదైనా దయతో గౌతములు తెలియజేశారు (16) ఇక్ష్వాకు వంశమందు పుట్టినవారు, శ్రీమాన్ పరమధార్మికుడు రాజు, ధనుర్థారులందరిలో శ్రేష్ఠుడు మిత్రనహుడు అని పేరుగల రాజు ఉండేవాడు (17) ఆరాజు సకల అస్త్రముల నెరిగినవాడు, శాస్త్రజ్ఞుడు, శ్రుతిపారగుడు. వీరుడు మిక్కిలి బల ఉత్సాహములు కలవాడు, ఎప్పుడూ ఏదో ప్రయత్నం చేసేవాడు, దయానిధి (18) పుణ్యముల యొక్క సమూహమాతడు తేజన్సుకంతా పంజరము. ఆశ్చర్యములకు స్థానము ఆతని రూపము అట్లా ఉంది (19) ఆతని హృదయంను దయ ఆక్రమించింది. అతని శరీరాన్ని శ్రీ ఆక్రమించింది. అతని పాదములు సామంత రాజుల కిరీటమణుల కాంతితో ఆక్రమింపబడ్డాయి (20) ఒకసారి వేటాడాలనే కోరికతో ఆరాజు గొప్ప సైన్యంతో కూడి ఘోరమైన అడవిని ప్రవేశించాడు (21) అక్కడ బాణములతో పులులను గవయములను మృగములను వేటాడాడు. పందులను, దున్నపోతులను, నల్లచారల దుప్పులను మృగేంద్రములను కూడా చాలా వేటాడాడు (22) ఆ రథశ్రేష్ఠుడు వేటయందాసక్తితో అడవిలో కవచము ధరించి తిరుగుతూ ఏదో ఒక అగ్నిలా రూపం కలిగిన ఒక రాక్షసుని చంపాడు. (23) ఆతని తమ్ముడు దు:ఖితుడై దూరం నుంచే చూచి అదృశ్యు డైనాడు. తన భ్రాత చనిపోయినాడని చూచి మనసులో ఇట్లా ఆలోచించసాగాడు (24) ఈ రాజును జయించటం కష్టం. దేవతలు, రాక్షసులు జయించలేరు. మోసంతోనే ఈతనిని జయించాలి. మరోరకంగా కాదు (25) అని నిశ్చయించుకొని పాప రాక్షసుడు మనుష్య రూపంధరించి, మూర్తీభవించిన అపశకునములా రాజును చేరాడు. (26) భృత్యత్వమును చేయడానికి వచ్చిన ఆ వినమ్ర ఆకృతిని చూచి ఆరాజు అజ్ఞానంవల్ల వాడిని మనసాధ్యక్షుని చేశాడు (వంటవాడు) (27) పిదప ఆ రాజు ఆ వనంలో కొంతకాలం విహరించి వేటను వదలి మరలి తిరిగి తన నగరానికి వచ్చాడు (28).
తా ॥ ఆ రాజేంద్రముఖ్యునకు, నలునకు దమయంతివలె మదయంతి అను పేరు గల భార్య సతి(పతివ్రత) ప్రసిద్ధమైనది ఉంది. (29) ఈ సందర్భంలో రాజు ముని పుంగవుని, నిమంత్రణము చేసి, తండ్రి శ్రాద్ధము వచ్చినపుడు వశిష్ఠుణ్ణి తన ఇంటికి తెచ్చాడు (30) రాక్షసుడు వంటవాడి రూపంలో ఉండినవాడు నరమాంసంతో కూడిన దానిని మాంసపు కూరను ముందుంచగా చూచి గురువు ఇట్లన్నాడు (31) థిక్ థీక్ నరమాంసము, కపటమాచరించే నీవు ఉంచావు ఓరాజ! నాడు క్రూరంగా ఈవేళ దీనిని తెచ్చావు కనుక నీవు రాక్షసుడవౌతావు అని అన్నాడు (32) రాక్షసుడు చేసిన దీనిని గుర్తెరుగక గురువు ఈ విధంగా శపించాడు. తిరిగి ఆలోచించి ఆ శాపాన్ని పన్నెండు సంవత్సరాల వరకన్నాడు (33) రాజుగూడా కోపంతో ఇట్లన్నాడు - ఇది నాపని కాదు. తెలుసుకోకుండా అనవసరంగా శపించాడు కనుక గురువునే శపిస్తాను (34) అని నీటిని చేతులోకి తీసుకొని గురువును శపించటానికి సిద్ధమయ్యాడు. అతని పాదాలపై పడి మదయంతి ఆప్రయత్నాన్ని విరమింపచేసింది (35) ఆమె మాటల మీది గౌరవం కొలది శావం పెట్టకుండా విరమించాడు. నీటిని పాదములపై వదిలాడు. కాళ్ళు కల్మషమైనాయి (36) నాటినుండి రాజు కల్మషాంఘ్రి (కల్మాషపాదుడు) అని ప్రసిద్ద డైనాడు. గురుశాపంతో రాక్షసుడై అడవుల పాలైనాడు (37) వాడు ప్రళయకాలమందలి యమునిలా ఘోరమైన రూపాన్ని ఆ రాక్షసుడు ధరించి తిరుగసాగాడు. ఆవనేచరుడు వివిధ జంతువులను, మనుషులు మొదలగు వారిని తినసాగాడు. (38) వాడు ఒకసారి వనంలో ఒకచోట రమిస్తున్న పిల్లలుగా ఉన్న, కొత్తగా పెళ్ళైన మునిదంపతులను చూచాడు. యముడిలాగా ఐ పోయాడు (39) రాక్షసుడు మానుషాహారం గలవాడు, పిల్లవాడైన మునికుమారుని తినటానికి వట్టుకున్నాడు. శాపకారణంగా పెద్దపులి లేడిపిల్లను పట్టుకున్నట్టుగా (40) భర్తను రాక్షసుడు పట్టుకోగా భయపడిన ఆతని భార్య వణికిపోతూ ఏడుస్తూ ఆ బాలదయ కలిగేట్టుగా ఇట్లా అంది (41) సూర్యవంశపు కీర్తిని ధరించేవాడా పావం చేయొద్దు. నీవు మదయంతికి భర్తవు. ఓ రాజ! నీవు రాక్షసుడవు కావు (42).
తా ॥ ఓ ప్రభు ! ఈతడు నాకు ప్రాణములకన్నను ప్రియమైనవాడు. ఇట్టి నా భర్తను తినవద్దు. ఆర్తులకు శరణార్థులకు నీవేగతి (43)పాపముల సంఘాతము వంటి దుష్టమైన అసువులతో నాకేం ప్రయోజనముంది. మహాత్ముడైన భర్తలేకుండా అతి భారమైన ఈ దేహంతో పనేమిటి (44) మలినమైన, పాపకరమైన పాంచభౌతిక దేహంతో నాకేంపని. ఈతడు బాలుడు, వేదముల నెరిగినవాడు, శాంతుడు తపస్వి, బహుశాస్త్రముల నెరిగినవాడు (45) అందువల్ల ఈతనికి ప్రాణదానంచేస్తే నీవు జగత్తునే రక్షించినట్టు. ఓ మహారాజ! దయచూపు బాలవైన ఈ బ్రాహ్మణ స్త్రీ యందు (నాయందు) (46) సాధువులు, అనాథుల యందు, కృపణులయందు ఆర్తులయందు దయకలవారు గదా అని ప్రార్థించగా ఆతడు ప్రార్థించినా ఆ మానుషా హరి దయలేనివాడై (47) దురాశయుడై ఆ విప్రపుత్రుని తలను చీల్చితిన్నాడు. పిదప ఆ సాధ్వి కృశించి దీనురాలై ఏడ్చి చాలా దుఃఖించింది (48) భర్త యొక్క అస్థికలను తీసుకొని చితినేర్పరచుకొనినది తగినట్లుగా భర్తను అనుసరిస్తూ అగ్నిని ప్రవేశించింది (49) రాక్షసాకారుడైన ఆ రాజును శాపాస్త్రంతో చంపింది. ఓరోరి! రాజా! పాపాత్ముడా నీవు నా భర్తను భక్షించావు (50) అందువల్ల పతివ్రతవైన నా గొప్ప శాపాన్ని అనుభవించు. నేటినుండి నీవు స్త్రీలను కలుసుకుంటే, వెంటనే నీకు మృతివస్తుంది. అని పలికి ఆ సతి అగ్నిలో ప్రవేశించింది. (51) ఆ రాజు గురువు శాపంను శాపాంతమువరకు అనుభవించి, తిరిగి తన రూపాన్ని పొంది ఆనందంతో తన ఇంటికి వెళ్ళాడు (52) విప్రసతి శాపమును తెలుసుకొని ఆతని భార్య, రతిలాలసుడైన తన భర్తను నివారించసాగింది. వైధవ్యం వస్తుందనే భయంతో (53) సంతానంలేని ఆరాజు రాజ్యభోగములందు విరాగి ఐనాడు. సమస్త లక్ష్మిని వదలి తిరిగి ఆ రాజు అడవికి వెళ్ళాడు. (54) సూర్యవంశం నిలిచే కొరకు మునివైన వసిష్ఠుడు ఆ మదయంతి యందు ఉత్తమపుత్రుణ్ణి పుట్టించాడు (55) రాజ్యమును వదలిన ఆ రాజు కూడా భూమినంతా తిరిగి వెనుక వస్తున్న నరరూపంకల పిశాచిని చూశాడు (56).
తా ॥ తప్పింప వీలుకాని, మూర్తి భవించిన ఘోరమైన బ్రహ్మహత్య ఆమె. ఈతడు శాపవిభ్రష్టుడైనపుడు ముని పుత్రుని భక్షించాడు (57) అందువల్ల తాను చేసిన పనితో వెనుక వస్తున్న బ్రహ్మహత్యనుగా ఆమెను గూర్చి మహర్షుల మాటల వలన ఆ రాజు తెలుసుకున్నాడు (58) ఆమెనిర్వేషమును తెలుసుకోదలచి రాజు వైరాగ్యంతో కూడిన మనస్సు కలవాడై అనేక సంవత్సరములు, అనేక క్షేత్రములకు తీర్థములకు తిరిగినాడు (59) అన్ని క్షేత్రములందు మాటి మాటికి స్నానం చేసి కూడా ఆ బ్రహ్మహత్య తిరిగి పోలేదు. అప్పుడు మిథిలకు వచ్చాడు. ఆరాజు. బాహ్య ఉద్యానమందుండి మిక్కిలి బాధపడుతూ చింతించసాగాడు రాజు (60) విమలమైన ఆశయములు కలగౌతముని తనవైపు వస్తుండగా చూచాడు. అగ్నినివలె తపస్విజనులందరు ఆతనిని సేవిస్తున్నారు (61) సూర్యునివలె మిక్కిలిగా అధికమైన దోషములనే చీకటిని తొలగించేవాడు. చంద్రునివలె ఏ మాత్రం అనుమానంలేకుండా స్వచ్ఛమైన గుణములు కలవాడు (62) శివునిపలె శ్రీమత్ ద్విజుడనే రాజకళను (చంద్రుని) ధరించినవాడు, శాంతం, శిష్యుల గణంతో కూడినవాడు తపస్సుకంతా ఒకేస్థానమాతడు (63) ఆతనిని సమీపించి ఆరాజు మాటిమాటికి నమస్కరించాడు. సూర్యువంశజుడైన ఆరాజును మునిశ్రేష్టుడైన ఆ గౌతముడు కూడా (64) అభినందించి నవ్వుతూ ఆముని ప్రేమతో ఇట్లన్నాడు (65) గౌతముడిట్లన్నాడు - ఓరాజ! నీవు కుశలమేనా.నీ స్థానము స్థిరంగా ఉందా (66) నీ ప్రజలు క్షేమంగా ఉన్నారా. అంతఃపురస్త్రీలు కూడా క్షేమంగా ఉన్నారా. సమస్త సంపదలను వదలి ఇక్కడికి ఎందుకొచ్చావు (67) ఓరాజ! దీర్ఘంగా వేడినిట్టూర్పులు విడుస్తూ ఏమి ఆలోచిస్తున్నావు. (68) అనగా రాజిట్లన్నాడు. - ఓ బ్రహ్మద్ నీ దయవల్ల మేమంతా క్షేమము. ఉత్తమ వంశస్తులైన రాజులందరికి సంపదలు బ్రహ్మయత్తములు. కాని నన్ను ఈ ఘోరరూపిణియైన పిశాచి బాధిస్తోంది (69) లక్ష్యం లేకుండా గర్వంతో మాటిమాటికి భయ పెడుతూంది. శాపదగ్ధుడనైననేను దాటరాని పాపంచేశాను. దానికి వేయి ప్రాయశ్చిత్తములతో కూడా శాంతి కలగటంలేదు (70).
తా ॥ అనేక యజ్ఞములు చేశాను. నా ధనాగారము నంతా దక్షిణగా చేశాను. భూమి యందు పవిత్రమైన నదులు, సరస్సులలో స్నానం చేశాను. తిరుగుతూ నేను అన్ని క్షేత్రములను దర్శించాను. (71) అఖిలమంత్రములను జపించాను. దేవతలందరిని ధ్యానించాను. మహావ్రతము లాచరించాను. ఎండుటాకులు, గడ్డలు పండ్లు తింటూ ఉన్నాను (72) అవన్ని కూడా నన్ను ఎప్పుడూ స్వస్థంగా ఉంచలేదు. ఈవాటితో నా జన్మ సాఫల్యత నందినట్లు అనిపిస్తోంది (73) ఎందువల్లనంటే మీ దర్శనంతో నా మనను ఆత్మానందాన్ని పొందింది. కొన్ని సంవత్సరాలకు వెదుకగా, ఎప్పుడో మనోరథాన్ని పొందుతాడు (74) అనే ప్రజల మాట నా విషయంలో సత్యమైంది. అనేక జన్మలనుండి సంపాదించిన పుణ్యము ఫలించినందువల్ల (75) భవభీతులను రక్షించేమీరు నా దృష్టి గోచరమైనారు. ఏ దేశం నుండి ఇక్కడికి వచ్చారు. మీరు సంసార భయనాశకులు (76) మీరాకను గమనిస్తే మీరు చాలా దూరం ప్రయాణించి అలసిపోయానట్లున్నారు. మీముఖంలోని ఆనందంచూస్తుంటే ఆశ్చర్యకరమైనదాన్ని చూసి ఆనందించినట్లుగా కన్పిస్తున్నారు. (77) ప్రేమతో సంభాషించినందువల్ల కలిగే ఆనందంవలె నా మనస్సును ఆనందపరుస్తున్నారు. పాపమాచరించిన నాకు మీ పాదములను శరణు వేడిన వారు. ఈ వేళ ఓమహాభాగ! శాంతిని ప్రసాదించు. దానివల్ల వారు సుఖం కలుగనీ (78) అని ఆతడనగా దయగల గౌతముడు ఘోరమైన పాపములకు చక్కని పరిష్కారమును చెప్పాడు (79) గౌతముని వచనము - మంచిది. ఓ రాజేంద్ర ధన్యుడవైనావు. మహాపాపమునుండి భయపడొద్దు (80) రక్షకుడుగా శివుడుండగా శరణుకోరే భర్తలకు భయమెక్కడిది. ఓ రాజ! మహాభాగ! మరొక క్షేత్రం ప్రతిష్ఠితమైంది విను (81) మహాపాతకములను సంహరించేది మనోరమమైనది, గోకర్ణమను పేరుకలది అక్కడ ఉంటే గొప్పవాటికంటే గొప్పవైన పాపములకు కూడా నాశననమే (82) స్మరిస్తే చాలు పాపములనన్నిటిని నశింపచేసేది. అక్కడ శివుడు సన్నిహితుడై ఉన్నాడు. కైలాస శిఖరమందెట్లా ఉన్నాడో, మందారమూఢమందెట్లా ఉన్నాడో అట్లా (83) గోకర్ణమండలంలో శివుని నివాసము నిశ్చితమైంది. అగ్నికాని, చంద్రుడుకాని, నక్షత్ర గ్రహనాయకులుగాని (84).
తా ॥ సూర్యునిలా చీకట్లను తొలగించలేనట్లుగా అట్లాగే ఇతర తీర్థములుగాని, మనోరమమైన ఇతరక్షేత్రములు కాని (85) పాపముల నుండి శుద్ధిని వెంటనే గోకర్ణ క్షేత్రమువలే కల్గించలేవు. నూరు పాపములు చేసినా బ్రహ్మహత్యాదులు చేసినా మానవుడు (86) గోకర్ణంలో ఒకసారి ప్రవేశిస్తే చాలు పాపములనుండి ఎక్కడా భయపడడు. అక్కడ అందరు మహాత్ములు తపస్సు వల్ల శాంతిని పొందారు (87) సిద్ధిని కోరే ఇంద్ర ఉపేంద్ర విరించి మొదలగువారు దానిని సేవిస్తున్నారు. అక్కడ ఒక్కరోజైన సరే ఉత్తమ వ్రతమేదైనా చేస్తే (88) అది వేరే చోట్ల లక్ష సంవత్సరాలు చేసిన దానితో సమానమౌతుంది. బ్రహ్మవిష్ణ్వాది దేవతల హితము కొరకు (89) దేవుడు మహాబలుడు అను పేరుతో స్వయంగా సన్నిహితంగా ఉన్నాడు. రావణుడను రాక్షసుడు ఘోరతపస్సుతో పొందాడు. (90) ఆ లింగాన్ని గణనాయకుడు గోకర్ణంలో స్థాపించాడు. ఇంద్రుడు బ్రహ్మముకుందుడు విశ్వదేవులు మరుద్గణములు (91) ఆదిత్యులు, వస్తువులు, అశ్వినులు (దస్రులు) శశాంకుడు, సూర్యుడు వీరంతా విమానాల్లో వెళుతూ, తమ పరివారంతో పాటు ఈ దేవతలు (92) దేవదేవుడైన శూలి యొక్క పూర్వద్వారాన్ని సేవిస్తారు. మృత్యువు, చిత్రగుప్తుడు, పాపకుడు (93) పితృదేవతలతో రుద్రులతో కూడి దక్షిణ ద్వారాన్ని ఆశ్రయిస్తాడు. సరిత్తులకు నాథుడైన వరుణుడు గంగాది నదులతో కూడి (94) మహాదేవుణ్ణి పశ్చిమ ద్వార మాశ్రయించి సేవిస్తాడు. వాయువు కుబేరుడు దేవేశి భద్రకర్ణిక! (95) మాతలతో చండిక మొదలగు వారితో కూడి ఉత్తర ద్వారాన్ని ఆశ్రయిస్తారు. విశ్వావసువు చిత్రరధుడు, చిత్రసేనుడను మహాబలుడు (96) వీరు గంధర్వులతో కూడి మహాబలుని పూజిస్తారు. రంభ ఘృతాచి, మేనక, పూర్వచిత్తి తిలోత్తమ (97) ఊర్వశి మొదలగు దేవతాస్త్రీలు శంభుని ఎదుట నృత్యం చేస్తారు. పశిష్ఠ కశ్యప కణ్వ విశ్వామిత్రులు మహాతపస్సంపన్నులు (98).
తా ॥ జైమిని, భారద్వాజుడు జాబాలిక్రతువు అంగిరుడు, వీరు మేము ఓ రాజేంద్ర ! అందరు స్వచ్ఛమైన బ్రహ్మర్షులము. (99) మహాబలుడైన దేవుని భక్తితో అంతటా ఉపాసిస్తున్నాము. మరీచితో కూడా అత్రి దక్షాదిమునీశ్వరులు (100) సనకాది మహాత్ములు కూర్చొని ఉపాసిస్తారు. అట్లాగే మునులు జింకచర్మము ధరించిన వారు సాధ్యులు (101) దండినులు, ప్రతులు, ముండులు, స్నాతకులు, బ్రహ్మచారులు, చర్మము బొక్కలు మాత్రమే మిగిలిన అవయవములవారు తపస్సుతో పాపములు కాలిపోయినవారు (102) వీరంతా దేవదేవుడైన పినాకిని మిక్కిలి భక్తితో సేవిస్తున్నారు. అట్లాగే దేవతలు, గంధర్వులు,పితరులు, సిద్దచారణులు (103) విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు, గుహ్యకులు ఖగులు (పక్షులజాతి), నాగులు, పిశాచులు, వేతాళులు, మహాబలులైనదైతేయులు (104) వీరంతా అనేక వైభవములతో కూడి, అనేక భూషణములు, వాహనములు కలవారై, సూర్యునిలా వెలిగే విమానములు, అగ్నివర్ణముగలవి, చంద్రుని లా కాంతిగలవి (105) మెరుపు తీగల వంటివి ఇతరములై నటువంటి వాటితో చుట్టూ చుట్టుముట్టి శివుని పొగుడుతున్నారు. శివునిగూర్చి పాడుతున్నారు. వర్ణిస్తున్నారు. శివుని నమస్కరిస్తున్నారు (106) నాట్యం చేస్తున్నారు. ఆనందిస్తున్నారు. ఓ మహారాజ! గోకర్ణమందు ఇట్లా చేస్తున్నారు. అభీప్సితమైన కోరికలను పొందుతున్నారు. సుఖంగా ఆనందిస్తున్నారు (107) బ్రహ్మండగోళమందు గోకర్ణ క్షేత్రంతో సమానమైన క్షేత్రములేదు. అగస్త్యమహాముని అక్కడ ఘోరమైన తపమాచరించాడు (108) అట్లాగే సనత్కుమారుడు, ప్రియవ్రతసుతులు తపమాచరించారు ఓరాజ! దేవవర్యుడైన అగ్ని కందర్పుడు తపమాచరించారు (109) దేవియైన భద్రకాళి, ధీమంతుడైన శింశుమారుడు, దుర్ముఖుడు, మణివాహ్వయుడను ఫణీంద్రుడు తపమాచరించారు(110) ఇలా వర్తుడు మొదలగు నాగులు, బలవంతుడైన గరుడుడు రాక్షసుడైన రావణుడు, కుంభకర్ణుడు కూడా తపమాచరించారు (111) మహాత్ముడైన పుణ్యుడైన విభీషణుడు కూడా తపమాచరించాడు. వీరు, ఇతర దేవతలు సిద్ధదానవ మానవులు తపమాచరించారు (112).
తా ॥ గోకర్ణ మందు దేవదేవేశుడైన శివుని భక్తితో ఆరాధించి తన పేరుగల లింగములను వేల కొలది స్థాపించి (113) పరమమైన సిద్ధిని పొందారు. అట్లాగే తీర్థములను చేశారు. ఇక్కడ అందరు దేవతలకు స్థానములున్నాయి, ఓ రాజ! (114) విష్ణువునకు దేవదేవునకు బ్రహ్మకు పరమేష్ఠికి, వీరుడైన కార్తికేయునకు, గజవక్త్రునకు (115) క్షేత్ర పాలుడైన ధర్మునకు, దుర్గకు గోకర్ణమందు కోట్ల కోట్ల కొలది శివలింగములున్నాయి (116) అడుగడుగున లెక్కింపరాని తీర్థములున్నాయి. ఓ రాజ! గోకర్ణంలో ఉన్నవాటిని గూర్చి ఎక్కువగా చెప్పి ఏం ప్రయోజనము (117) అన్ని రాళ్ళు లింగములే అన్ని నీళ్ళు తీర్థములే. గోకర్ణంలో శివలింగముల మహిమ (118) ను ఎక్కువగా పురాణములలో మహర్షులు పాడుతున్నారు. గోకర్ణంలో కోటి తీర్థము తీర్థములన్నిటిలో ముఖ్యమైనదిగా చెప్పబడింది (119) అన్ని శివలింగములకు సార్వభౌమము మహాబలము. కృతయుగంలో మహాబలము శ్వేత వర్గము, త్రేతాయుగమందు ఎరువు వర్ణము (120) ద్వాపరమందు పీతవర్ణము, కలియుగ మందు నలుపు వర్ణంగా ఔతుంది సప్తపాతాళముల వరకు ఆక్రమించి ఉంది మహాబలము. (121) కలియుగంలో మృదుత్వాన్ని పొందుతుంది. పశ్చి సముద్ర తీరంలోని గోకర్ణము ఉత్తమమైనది (122) బ్రహ్మహత్యాది పాపములను కాల్చివేస్తుంది అనటంలో ఆశ్చర్యమేముంది. ఇక్కడ బ్రహ్మహంతలు ఎవరున్నారో భూత ద్రోహంచేసే శఠులున్నారో (123) అన్ని విధముల గుణహీనులేవరున్నారో, వరదారరతులున్నారో, చెడునడవడికలవారు, దురాచారులు, దుశ్శీలులు, కృపణులు (124) లుబ్ధులు క్రూరులు, ఖలులు, మూఢులు, దొంగలు, అతికాములు, వాళ్ళంతా గోకర్ణానికి వచ్చి తీర్థజలములందు స్నానం చేస్తే (125) మహా బలదేవుని చూచిన, శంకరుని స్థానమును చేరుకుంటారు. అక్కడ వుణ్య తిథులందు పుణ్యన క్షత్రమందు, పుణ్యవానరమందు (126).
తా ॥ మహేశుని అర్చించిన వారు రుద్రులౌతారు. అనుమానంలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒక మనిషి గోకర్ణమును (127) ప్రవేశించి, శివుని పూజిస్తే వాడు బ్రహ్మపదమును చేరుకుంటాడు. ఆది సోమ, బుధవారములందు అమావాస్య ఏర్పడితే (128) అప్పుడు సముద్రమందు స్నానాము దానము, పితృతర్పణము, శివపూజ, జపము, హోమము, వ్రతచర్య బ్రాహ్మణపూజ (129) ఏ కొంచమైనా చేసినకర్మ అనంతఫలాన్ని ఇస్తుంది. వ్యతీపాత యోగములందు, రవి సంక్రమణములందు (130) మహాప్రదోష సమయములందు శివపూజచేస్తే అది ముక్తినిస్తుంది. ఓ పార్థివ! ఇంకా ముక్తి నిచ్చే ఒక తిథిని గూర్చి నీకు చెబుతాను. (131) ఆతిథి యందు మహావ్యాథుడు. శంభువుయొక్క ఉత్తమ స్థానాన్ని పొందాడు. మాఘమాసమందు మహాపుణ్యప్రదమైన కృష్ణచతుర్ధశి యందు (132) శివలింగము బిల్వపత్రము ఈ నాల్గు దుర్లభములు. మాయవహా,బలవత్తరమైంది. శైవ తిథియందు (133) ఎవరు ఉపవసించరో వారు మూఢులు. మూగవారు వేదం వర్ణించలేనట్లు, ఉపవాసము, జాగరణము పరమేశ్వరుని సన్నిధి (134) గోకర్ణము, ఇవి నరులకు శివలోకమునకు మెట్లు. ఓ రాజ! విను నేను ఇప్పడు గోకర్ణం నుండే వచ్చాను (135) అతనిని ఉపాసించి, శివతిథి ఆచరించి, మహోత్సవమును చూచి వచ్చాను. ఈ శివలిథి యందు అంతా మహోత్సవాన్ని చూడాలనుకునేవారే (136) వారంతా చాతుర్వర్ణ్యముల జనులు అన్ని దేశముల నుండి వచ్చారు. స్త్రీలు, వృద్ధులు, బాలురు, చతురాశ్రమ (నాలు) వాసులు (137) వచ్చి దేవేశుని చూచి తమను తాము కృతకృత్యులైనట్లుగా భావించుకున్నారు. నేను కూడా, ఈ శిష్యులూ, అట్లాగే ఇతర ఋషులు (138) రాజర్షులు, సనకాది సురర్షులు, వారంతా అన్ని తీర్థములలో స్నానం చేసి మహాబలుని వద్ద ఉపవసించి (139) జన్మసాఫల్యాన్ని పొంది అన్ని దిక్కులకు వెళ్ళి పోయారు. ఈ వేళ యజ్ఞం చేయదలచిన ఈ జనకరాజుతో (140) నియంత్రించబడి, నేను శివమందిరమైన గోకర్ణము నుండి వచ్చాను. వస్తూదారిలో ఏదో ఒకటి చూచి చాలా ఆశ్చర్యపడ్డాను. ఓరాజ! మహానందమైన మనస్సుతో కృతార్థుడినైనాను. (141) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మోత్తర ఖండమందు గోకర్ణ మహిమ వర్ణనమనునది ద్వితీయోఽధ్యాయము ॥
