స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

10 అధ్యాయము

తా సూతులిట్లన్నారు - శివనిర్మాణము విచిత్రము శివుని చేష్టవిచిత్రము. శివ మాహాత్మ్యము విచిత్రము శివుని భాషణ విచిత్రము (1) శివభక్తుల చరిత్ర విచిత్రము, పాప నాశకము. స్వర్గ అవస్వర్గములను సాధించి ఇచ్చేది. నిజము దాని గూర్చి చెబుతాను. (2) అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు మందరుడని పేరు. విషయములందు విశ్రమించేవాడు, స్త్రీ లోలుడు, ధన సంగ్రహేచ్చ కలవాడు (3) సంధ్యా స్నానములు లేని వాడు గంధమాల్య అంబరము లందు ప్రేమకలవాడు. కుత్సిత స్త్రీ లందు ఆసక్తికలవాడు. చెడుమార్గ మందున్ననాడు. పూర్వం అజామిళుడు ఎట్లుండేవాడో అలాంటివాడు (4) ఆతడు పింగళ అను వేశ్యను రాత్రింబగళ్ళు రమించేవాడు. జితేంద్రియుడు కానందు వల్ల ఎప్పుడూ ఆమె ఇంట్లోనే ఉండేవాడు (5) ఒకసారి బ్రాహ్మణుడు ఆమె ఇంట్లో ఉండగా ఋషభుడను పేరుగల ధర్మాత్ముడు శివయోగి వచ్చివాడు (6) ఆ వచ్చినవాణ్ణి చూసి తాను సంపాదించిన పుణ్యంగా భావించి ఆ వేశ్య ఆ విప్రుడు వారిద్దరూ అతణ్ణి పూజించారు. (7) కంబళము, వస్త్రములు గల మహా పీఠమందు ఆతనిని కూర్చోబెట్టి ఆతని పాదాలు కడిగి ఆ జలాన్ని తమ శిరము పై భక్తితో ధరించారు. (8) స్వాగత అర్ఘ్య నమస్కారములతో గంధపుష్ప అక్షతాదులతో ఉపచారములతో బాగా పూజించి ఆనందంతో ఆతనిని భుజింప చేశారు. (9) భుజించి చేతులు కడుగుతున్నసుఖంగా ఉన్న వానిని చిగురుల పడక పై కూర్చోబెట్టి ఆనందంతో తాంబూలమిచ్చారు, (10)భక్తితో పాద సంవాహనంచేసి  దైవ ప్రేరణ వల్ల శుశ్రూష చేసి చాలా సేపు సంతోష పరిచారు (11) వారిట్లా పూజించగా మహాద్యుతి గల శివ యోగి ఒక రాత్రి గడిపి, వారితో ఆదరింపబడి తెల్లవారి వెళ్ళిపోయాడు (12) ఇట్లా కాలం గడిచి వయసుడిగి ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆ వేశ్య కూడా కాలవశాత్తు మరణించింది. కర్మార్జితమైన గతిని పొందింది (13) ఆబ్రాహ్మణుడు కర్మవశం వదుడై దశార్ణవరాజు వజ్రబాహువు భార్య సుమతి యొక్క గర్భంలో ప్రవేశించాడు. (14) గర్భ సంపదను పొందిన రాజుగారి పెద్దభార్యను చూచి ఆమె సవతులు ఆమెకు, మోసంతో విషమిచ్చారు. (15) ఆమె ఘోరమైన విషాన్ని తిని అదృష్టవశాత్తు చావలేదు. చాలా కష్టపడింది. మరణం కన్న ఎక్కువైన కష్టమది (16) కొంత కాలానికి ఆమె ఒక పుత్రుని కన్నది. ఆ సాధ్వి, వరవర్ణిని, అనేకంగా కష్టపడింది (17)  అదృష్ట హీనుడై ఆ రాజపుత్రుడు ఇతః పూర్వం విష స్పర్శ పొందాడు. అందువల్ల చాలా బాధనను భవించాడు. రాత్రిం బగళ్ళు ఏడ్చేవాడు (18) ఆపిల్లవాని తల్లి అవయవాలన్నింటా వ్రణములతో బాధపడసాగింది. విషప్రభావంవల్ల వారిద్దరూ చాలా కష్టాలపాలయ్యారు (19) 

తా ॥ రాజు వారిద్దరికి వైద్యులచే మందిప్పించాడు. అనేక ప్రయత్నాలు చేసినా వారు స్వషులు కాలేదు (20) రాణి చాలా బాధతో రాత్రుళ్ళు నిద్రించటం లేదు. తన కొడుకుకు కలిగిన బాధతో ఆమె బాధ పడుతూ చాలా కృశించింది (21), ఈ రకంగా కొన్నాళ్ళు గడిపినాక ఆ రాజు ఆ తల్లి పుత్రులను చూచి వీరు బ్రతికినా చచ్చిన వారిలా ఉన్నారని ఆలోచించాడు (22) వీరు నా భార్యపుత్రుడు, నరకంనుండి ఇక్కడికి వచ్చారు. ఎడతెగని రోగం కలిగి ఉన్నారు. ఏడుస్తున్నారు. నా నిద్రకు భంగం కల్గిస్తున్నారు (23) ఇక్కడ ఏదైనా ఉపాయ మాలోచించాలి. పాపులైన వీరిద్దరి గూర్చి ఆలోచించాలి చావటానికైనా జీవించటానికైనా వీరు శక్తి లేకుండా ఉన్నారు పాపభాగులు (24) అని ఆలోచించి ఆ రాజు తన ఇతర భార్యల యందు వారి కుమారులందు ఆసక్తుడై, సూతుని వలిచి తన భార్యను పుత్రుని రథంపై దూరంగా పంపాడు (25) ఆ సూతుడు వారిని జనం లేని అడవిలో విడిచి పెట్టాడు. ఆకలి దప్పికలతో చాలా చలించి వారు ఎంతో బాధ పొందారు (26) ఆమె తన కుమారుని మోస్తూ అడుగుడుగున పడిపోతూ తన కర్మకు నిట్టూరుస్తూ, నిందించుకుంటూ మాటిమాటికి చకితురాలై (27) ముళ్ళతో చీలిన అవయవాలు కలదై, వెంట్రుకలు ముడివీడి, భయంతో ఆతురురాలై, ఒక్కోచోట పులుల గర్జనలతో భయపడుతూ ఒక్కోచోట సర్పాలు తరమగా (28) భయపడుతూ పిశాచ, భేతాళ, బ్రహ్మరాక్షసులతో భయ పెట్టబడుతూ పొదలలో పరుగెత్తుతూ కత్తుల లాంటి రాళ్ళతో పాదాలు చీలిపోగా (29) ఆమె ఈ విధంగా ఘోరమైన అరణ్యమందు తిరుగుతూ ఆ రాజు భార్య అదృష్టవశాత్తు గోవులు, గుఱ్ఱములు నరులు నడిచే వణిక్ మార్గమును చేరింది (30) ఆ త్రోవ వెంట చాలా దూరము అతి ప్రయత్నంమీద వెళుతూ అనేక మంది స్త్రీలు పురుషులు గల వైశ్య నగరమును చూచింది (31) దాని రక్షకుడు మహావైశ్యుడు. నగరంలో పెద్దవాడు వాని పేరు పద్మాకరుడు. మరో రాజు వంటివాడు (32) ఆ వైశ్యపతి యొక్క గృహదాసి ఒక రాజ స్త్రీ ని వస్తున్న దాన్ని దూరం నుండే చూచి, ఆమె దగ్గరకు వచ్చింది. (33) ఆ దాసి రాజు భార్యను, ఆమె కొడుకును చాలా బాధపడుతున్న దానిని చూచి, స్వయంగా ఆమె వృత్తాంతాన్ని తెలుసుకొని, తన యజమానికి చూపింది (34) ఆ వైశ్య శ్రేష్ఠుడు రోగంతో బాధపడుతున్న ఆమెను కష్టపడుతున్న ఆమె కొడుకును చూచి, రహస్యంగా తీసుకువెళ్ళి వివరంగా ఆమె వృత్తాంతాన్ని అడిగాడు (35) ఆమె తన వృత్తాంతం అంతా చెప్పగా ఆవణికృతి తెలుసుకొని అయ్యో ఎంతకష్టమైంది అని మాటిమాటికి నిట్టూర్చాడు (36) ఆమెను తన ఇంటికి దగ్గర రహస్య గృహంలో ఉంచి, వస్త్రము, అన్నము, పానీయము, శయనము, వీటిని అమర్బి తల్లి లాగా పూజించాడు (37) ఆ గృహంలో ఆ రాజు భార్య క్షేమంగా నివసిస్తూ, వ్రణముల యక్ష్మాదిరోగములనుండి శాంతిని పొందలేదు. (38)   

తా ॥ కొద్ది రోజులకు ఆ బాలుడు వ్రణములచే పీడితుడై వైద్యుల శక్తులను అతిక్రమించి విధివశాత్తు మరణించాడు (39) తన కొడుకు చనిపోయాక ఆ రాణి చాలా దుఃఖాన్ని పొంది మూర్ఛతో భూమి పై పడింది, ఏనుగు తెంపగా తీగ కింద పడ్డట్టు పడింది. (40) అదృష్టవశాత్తు తిరిగి మేలుకొని కన్నీళ్ళతో రొమ్ములు తడుస్తుండగా, వణిక్ స్త్రీ లు ఓదారుస్తున్నా, దుఃఖంతో చాలా ఏడ్చింది (41) అయ్యో! నా తండ్రి, తండ్రి! నాకొడుక, నా ప్రాణ రక్షకుడ, రాజవంశము నకు చందమామ, నా ఆనందాన్ని పెంచేవాడ (42) అనాధను, కృపణురాలిని, నీ యందే ప్రాణము గల దాన్ని బంధువులందరిచే విడువబడ్డదాన్ని నన్ను నీ తల్లిని విడచి ఎక్కడికెళ్ళావు ఓ రాకుమార (43) ఇట్లా చెప్పి మాటలతో శోకమును చింతను పెంచే మాటలతో ఏడుస్తున్న, కొడుకు చచ్బి ఉన్న ఆమెను ఎవడు ఓదార్చ సమర్ధుడు (44) ఈసమయంలో ఆమె దుఃఖ శోకములకు వైద్యుడులా ముందు చెప్పిన ఋషభుడు శివయోగివచ్చాడు (45) ఆ యోగిని వైశ్యనాధుడు ఆర్ఘ్య హస్తంతో పూజించాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏడుస్తున్న ఆమెతో ఇట్లన్నాడు (46) ఋషభుని వచనం - ఓ చిన్నదాన ! అకస్మాత్తుగా ఎందుకేడుస్తున్నావు, బుద్ధిహీనురాలవై, పుట్టినవాడెవడూ, ఈ ప్రపంచంలో వాడెన్నవవాడు, చచ్చిన వాడెవడూ ఇప్పుడు నాకు చెప్పు (47) ఈ దేహ ది భావములు నీటి నురగల వంటివి. ఒకచోట భ్రాంతి, ఒకచోట శాంతి, నిలకడ ఉందామళ్ళా (48) అందువల్ల నురుగులాంటి శరీరం నశిస్తే ఏడ్వ వలసిన అవసరం లేదు కనుక బుద్ధిమంతులు ఏడ్వరు (49) గుణములతో ప్రాణులు సృజింపబడతాయి. తమ తమ కర్మలతో తిరుగుతుంటాయి. కాలంతో ఆకర్షింపబడతాయి. వాసనతో సంచరిస్తుంటాయి (పూర్వ కర్మ జన్మ వాసనలు) (50) సత్వాది గుణములు మూడు మాయతో ఉత్పత్తి నందుతాయి. వాని తోనే శరీరము లేర్పడుతాయి. పుట్టినా ఆలక్షణముల నాశ్రయించి ఉంటాయి (51) సత్వగుణం తో దేవత్వాన్ని రజోగుణం తో మనుష్యత్వాన్ని తమోగుణం తో తిర్యక్ లక్షణాన్ని పొందుతాయి. ప్రాణి వాసనననుసరించి దాని అధీనమై ఉంటుంది (52) ఈ నడుస్తున్న సంసారంలో జంతువు కర్మాధీనమైనందువల్ల సుఖదుఃఖమయమైన ఊహింప వీలుకాని గతిని మాటిమాటికి పొందుతుంది. (53) కల్పాయుస్సు గల ఆ దేవతలకు గూడా ఈ వివర్యయం తప్పదు. నరదేహులకు అనేక ఆమయములతో బదులైన వారికి చెప్పేదే ముంది (54) దేహమునకు కాలమే కారణమని అంటారు. కర్మ కారణమని కొందరు గుణములు కారణమని కొందరు అంటారు. ఈ దేహము సాధారణమైంది (55) కాలము కర్మగుణములు వీటికి స్థానము ఈ శరీరము పంచాత్మకమైంది. పుట్టినవాణ్ణి చూచి ఆనందించరు, చనిపోయినవాణ్ణి గూర్చి ఏడవరు బుధులు (56) అవ్యక్తం నుంచి ప్రాణిపుడ్తుంది. అవ్యక్త మందే లీన మౌతుంది. వ్యక్త మైనట్లుగా మధ్యలో మెరుస్తుంది. నీటి బుడగతో సమానమైంది. (57) గర్భగత మైన ప్రాణి అప్పుడే నశించవచ్చు. దైవవశాత్తు బ్రతికితే వెంటనే చావవచ్చు (58). 

తా ॥ కొందరు గర్భంలోనే. మరణిస్తారు. కొందరు పుట్టగానే మరణిస్తారు. కొందరు యువకులై నశిస్తారు. కొందరు వార్థకంలో నశిస్తారు. (59) పూర్వకర్మ ఎలాంటిదో అలాంటి శరీరాన్ని పొందుతాడు. ఈతడు అందు కనుగుణమైన సుఖ దుఃఖములు అనుభవిస్తాడు. (60) మాయ అనుభావంతో ప్రేరేపింపబడ్డ తలిదండ్రులకు నురత సంభ్రమం వల్ల పురుషుడు గానో స్త్రీ గానో క్లీబలక్షణములు గల వాడుగానో ఏదో ఒక శరీరం ఏర్పడుతుంది. (61) ఆయుస్సు, సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము, చదువు, ధనము వీటిని బ్రహ్మ నొసటి యందు ఎంత వ్రాస్తే అంత తీసుకొని ప్రాణి పుడ్తాడు. (62) కర్మను అతి క్రమించలేము, కాలాన్ని దాటలేము. భావములు అనిత్యమైనందువల్ల దు:ఖించి పనిలేదు. (63) స్వప్నమందు నియతమైన స్థైర్యముంటుంది. ఇంద్రజాలంలో నత్యము ఎప్పుడూ ఉంటుంది. శరన్మేఘం నిత్యం (శాశ్వతత్వం)గా ఉంటుందా కలేబరము ఎప్పుడూ ఉంటుందా (64) నీవి పదిలక్షల కోట్ల జన్మలు గడిచిపోయాయి. ఈ గొప్పతత్వం తెలియనందువల్ల ఈ గొప్ప భ్రమ ఏర్పడింది (65) ఎవరెవరి కూతరు వైనావో, ఎవరెవరి తల్లి వైనావో, ఎవరెవరి భార్యవైనావో కోట్లజన్మలలో (66) ఈ శరీరం పంచభూతాత్మక మైంది. చర్మము, రక్తము మాంసములు కలది మేధ, మణి, బొక్కలు కలిగింది. మల మూత్ర శ్లేష్మలకు స్థానమైంది (67) మరో శరీరం కూడా ఈ మనదేహం నుండి ఉద్భవించిందే, మలినమైంది. అని తలచి ఓ మూఢురాల నీ కొడుకును గూర్చి దుఃఖించొద్దు (68) ఒకవేళ ఎవరైనా ప్రయత్న పూర్వకముగా మృత్యువును తరిస్తే, పూర్వమందలి విద్వాంసులంతా ఎందుకు కష్టపడి ఉండేవాళ్ళు (బాధ) (69) తపస్సుతో విద్యతో, బుద్ధితో మంత్ర ఓషధి రసాయనములతో ఏ పండితుడూ మృత్యువును దాటడంలేదు (70) ఈవేళ ఒక ప్రాణి నశిస్తుంది. ఓ వరాననే ! రేపు మరో ప్రాణి నశిస్తుంది. ఈ అవయవము అనిత్యమైంది. అందువల్ల నీవు దు:ఖించొద్దు (71) మృత్యువు ఎప్పుడూ దగ్గరలోనే ఉంది. ప్రాణులకు సుఖమెక్కడోచెప్పు. పులి ఎదురుగాఉంటే పశువులకు గడ్డి రుచిస్తుందా (72) ఓ వరానన ! జన్మ జరను జయించదలిస్తే, నర్వేశుని మృత్యుంజయిని ఉమావతిని శరణువేడు (73) ఈ మృత్యుభయము, ఈ వహారమైన జన్మ జరా భయము ఎంత వరకంటే దేహ శివపదాంబుజములను శరణు పొందనంత వరకే. (74) మిక్కిలి దారుణమైన సంసారమందు ఇక్కడ దు:ఖాలను అనుభవించి మనస్సు ఎప్పుడు వియుక్తమైందో అప్పుడు మహేశ్వరుని ధ్యానించు (75) శివధ్యాన రసామృతమును మనస్సుతో తాగే నరునకు సంసార విషయానవ యందు తిరిగి దప్పిక గలగదు. (76) సర్వ సంగములతో విముక్తమై మనసు వైరాగ్యంతో నియమింపబడి ఎప్పడైతే శివపాదములందు లగ్నమైందో అప్పుడు మరో జన్మలేదు, ఉండదు (77) అందువల్ల ఓ భద్ర ! ఈ మనస్సు శివధ్యానమునకు ఒకే ఒక్క సాధనము ఈ మనస్సును శోకమోహనమ విషంగా చేయడు. శివుని భజించు (78) సూతులిట్లన్నారు. ఈ విధముగా శివయోగి అనునయ పూర్వకముగా రాజ్ఞిని ప్రభోదించాడు. గురువుయొక్క చరణాంబుజములకు నమస్కరించి ఇట్లా వలికింది. (79) 

తా రాజ్ఞీవచనము - ఓ భగవాన్ ! పుత్రుడు మరణించిన, ప్రియ బంధువులు విడిచి పెట్టిన, మహారోగాతురనైన నాకు మరణం తప్ప మరో గతి ఏది (80) అందువల్ల ఈ పిల్ల వాడితో కూడి నేను చావదలిచాను. మరణోన్ముఖమైన నేను ఈ వేళ నిన్ను చూచాను. నేను ఈ వేళ చరితార్ధురాలినయ్యామ (81) సూతునివచనము - అని ఆమె మాటలను విని దయానిధి యైన శివయోగి పూర్వపు ఉపకారాన్నిస్మరించి చనిపోయిన వాని దగ్గర కొచ్చాడు. (82) ఆతడప్పుడు భస్మాన్ని తీసుకొని దాన్ని శివ మంత్రంతో అభిమంత్రించి తెరిచిన ఆతని నోటియందు వేసి చనిపోయిన ఆపిల్లవాని నిద్రాణములతో నిలిపాడు (83) ఆ బాలుడు ప్రాణములను పొందినవారై మెల్లగా కళ్ళుతెరచి, పూర్వపు ఇంద్రియముల ఐలాన్ని పొంది స్తన్యము కొరకు ఏడ్చినాడు (84) చనిపోయిన పిల్లవాడు లేవటం చూచి ఆశ్చర్య పడి నగరములందు పెద్దలంతా ఆనందించారు (85) ఆనందంతో నిండిన రాణి విహ్వలురాలై, ఉన్మత్ర లోచనమై, బాష్ప వ్యాకులలోచన కొడుకును కౌగిలించుకొని తనను గాని ఇతరునిగాని గుర్తించలేదు. పరిశ్రమనుండి విముక్తయైను షుప్తినందినదీ వలే ఐంది (87) తిరిగి ఋషభయగి అమాత కుమారుల యొక్క విషఁవణ్ణములతో కూడిన దేహమును భవంతోనే పరామర్శించాడు. (88) ఆభస్మంత గలగానే వారు దివ్యశరీరం కలవారై దేవతల వంటి రూపాన్ని ధరించారు. శాంతివంతమైంది ఆ శరీరం (89) పుణ్యకర్మలకు త్రిదివైశ్వర్యములభిస్తే ఏ సుఖమో అంతకన్నవేయి రెట్లధికమైన ఉత్తమ సుఖాన్ని ఆ రాణి పొందింది (90)కాళ్ళ మీదపడిన ఆమెను ప్రేమ  విహ్వలుడైన ఋషభుడు లేపి, ఓదార్చి దు:ఖముల నుండి ముక్తి నంది వావని అన్నాడు (91) ఓవచ్చే ! మహార అనేకవంవత్సరాలు జీవించు ఈ లోకంలో ఎంతకాలం ఉంటావో అంతకాలం ముసలి శవాన్ని పొందవు (82) ఓ సాధ్వి ఈ కొడుకు భద్రాయువను పేరుతో ఈలోకాలలో కీర్తి నొందుతాడు. తన రాజ్యాన్ని పొందుతాడు (93) ఈ వైశ్యుని ఇంటిలో, నీ కొడుకు విద్య నభ్యసించేంత వరకు ఉండుట శుచిస్మితే ! (94) సూతునివచనము - అని ఋషభయోగి ఆమెను ఆరాకుమారుని భవభక్తిలో బ్రతికించి యధేచ్చగా దేశాలకు వెళ్ళాడు (95) అని శ్రీ స్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహోత్తర ఖండనుందు భద్రాయువు కధలో భద్రాయు జీవనమును ఋషభయోగి చేసిన విధము అనునది పదవ అధ్యాయము.