స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము

9 అధ్యాయము

తా ఋషులిట్లన్నారు - ఓ మహాభాగ! సాధువు (మంచిది) సాధువు. నీవు ఉత్తమ మైన దాన్ని చెప్పావు. మరింకో విచిత్ర మైన కథను మీరు చెప్పండి (1) సూతులిట్లన్నారు - విదర్భ ప్రాంతంలో పూర్వం ఒక బ్రాహ్మణుడుండేవాడు. వేద మిత్రుడని పేరు. వేదము శాస్త్రార్థముల తెలిసినవాడు. సుధీ (2) అతనికి మరో బ్రాహ్మణుడు సారస్వతుడను పేరు గలవాడు స్నేహితుడుగా ఉండేవాడు. వాళ్ళిద్దరు మిక్కిలి స్నేహితులు, ఒకేచోట ఉండేవారు (3) వేద మిత్రునకు సుమేధ అని పేరు గల సుప్రతుడు పుత్రుడున్నాడు. సారస్వతుని కొడుకు సోమవంతుడు అని ప్రసిద్ధి (4) వారిద్దరు సమ వయస్కులు బాలురు సమానమైన వేషం, సమానమైన స్థానం గలవారు సమంగా సంస్కారం పొందారు. సమాన విద్య గలవారు (5) వారు వేదములను అంగములతో కూడా చదివి, తర్క వ్యాకరణములు చదివి, ఇతిహాస పురాణములు చదివి, ధర్మశాస్త్రాలన్నీ చదివి (6) అన్ని విద్యలలో కుశలురై బాల్య మందే బుద్ధి మంతులైనారు. సకల గుణములతో తలిదండ్రులకు చాలా ఆనందాన్నీ కల్గించారు. (7) ఆ ఇద్దరు బ్రాహ్మణోత్తములు ఇద్దరు ఒకసారి తన కుమారులను పిలిచి పదహారు సంవత్సరాలు, అందమైన ఆకారం గల వారితో ప్రేమగా ఇట్లన్నారు (8) ఓ పుత్రులార! మీరు బాల్యంలోనే విద్యలు నేర్చారు. మంచి వర్చస్సు గలవారైనారు. మీ ఇద్దరికి సమంగా ఇది వివాహ సమయము (9) ఈ విదర్భేశుడైన రాజును చేరి మీ విద్యతో అతని నుండి బాగా ధనం పొంది వివాహం చేసుకోండి. (10) వారిట్లా చెప్పగా ఆ బ్రాహ్మణ కుమారులిద్దరు విదర్భ రాజును చేరి తమ గుణములతో రాజును సంతోష పరిచారు (11) వారి విద్యను చూచి రాజు ఆనందించాక, అతనితో ఆ బ్రాహ్మణ కుమారులు, వివాహం కొరకు ప్రయత్నించువారు తమ ధనహీనతను తెల్పారు (12) వారి అభిప్రాయాన్ని ఎరిగి ఆ విదర్భరాజు నవ్వి లోకతత్వాన్ని తెలుసుకోదలచీ ఇట్లా కొంచెం పలికాడు (13) నిషధ రాజునకు రాణి సీమంతిని అను పేరుగల సతి ఉంది. సోమవార మందు అంబికతో కూడిన మహాదేవుని పూజించేది (14) ఆ రోజు ఆమె భార్యలతో కూడిన బ్రాహ్మణులను వేదవిత్తములను మిక్కిలి భక్తితో పూజించి బాగా ధనమిస్తుంది (15).    

తా ॥ అందువల్ల మీలో ఒకరు భ్రమింపచేసే స్త్రీ వేషం ధరించి మరి ఒకరు ఆమెకు భర్త యై విప్రదంపతులు కండి (16) మీరు వధూవరులై సీమంతినీ గృహానికి వెళ్ళి భుజించి బాగా ధనాన్ని పొంది తిరిగి నా దగ్గరకు రండి (17) అని ఆదేశించగా ఆ ద్విజ కుమారులు భయపడి ఇట్లా అన్నారు. ఈ పని చేయటానికి మాకు భయం కలుతోంది. (18) దేవతలందు గురువు యందు, తండ్రి యందు రాజ కుల మందు మోహం వల్ల కౌటిల్య మాచరిస్తే వెంటనే వంశంతో పాటు నశిస్తాడు. (19) రాజుల అంతఃపురాన్ని మగవాడు మోసంతో ఎట్లా ప్రవేశిస్తాడు. మోసం వల్ల దాచిపెట్టినా ఏదో ఒకసారి బయట పడుతుంది. (20) శీల ఆచార శ్రుతాదులతో ఇంతకు ముందు ఏ గుణాలను సాధించామో అని కౌటిల్య పథంలో సంచరించేవానిని వెంటనే నశిస్తాయి (21) పాపము, నింద, భయము, వైరము ఈ నాల్గు ప్రాణులకు చద్మ మార్గాన్ని ఆశ్రయించే వారికి ఎల్లప్పుడూ ఉండే ఉంటాయి. (22) అందువల్ల శుభాచారులమైన మేము ఉత్తమ కులంలో జన్మించాము. ఎప్పుడూ ధూర్తులు మెచ్చుకొనే వృత్తిని ఆశ్రయించము (23) రాజిట్లన్నాడు - దైవతముల గురువుల తండ్రి రాజు గారి శాసనం దాట రానిది కనుక ఎక్కడా దానికి ఎదరులేదు (24) వీరు దేన్ని దేన్ని చెప్తారో మంచి గాని చెడు గాని, తప్పకుండా ఆచరించాలి, భీతు లైనా అప్రమత్తు లైనా బుభూషు లైనా (సొమ్ములు కావలసినవారైనా) (25) మేము రాజులము, మీరు సంమతమైన ప్రజలు. రాజాజ్ఞ ప్రకారము ప్రవర్తించిన వారికి శ్రేయస్సు లేకున్న భయము కల్గుతుంది. (26) అందువల్ల నా ఆజ్ఞను ఆచరించాలి. మీరు ఆలసించకుండా అని రాజు అనగా వారు భయంతో అట్లాగే అని అన్నారు (27) రాజు సారస్వతుని కొడుకైన సామవంతుని ఆడరూపం కలవానిగా చేశాడు. వస్త్రములు కాటుక మొదలగు అలంకారములతో (28) వాడు కృత్రిమంగా ఐన భార్యగా మారి కర్ణాభరణ అంగరాగములు కలిగి, నిగనిగలాడు కాటుకను కళ్ళకు కలిగి, కోర తగిన రూవం కలవాడై వెంటనే స్త్రీ వలె ఉత్తమమైన కాంతి గలవాడైనాడు (29) వారిద్దరు దంపతులై ఆ బ్రాహ్మణ పుత్రులు రాజాజ్ఞతో ఏమైనా కానిమ్మని భావించి నిషధ దేశానికి వెళ్ళారు (30) రాజ సదనం చేరి సోమవారం నాడు భార్యలతో కూడిన ద్విజోత్తములతో కూడ ఆతిథ్యం చేయబడి కాళ్ళు కడుగుతున్నారు (31).  

తా ॥ ఆ రాణి శ్రేష్టమైన ఆసన మందు కూర్చున్న వారి నందరిని బ్రాహ్మణులను ప్రత్యేకంగా పూజించింది. భార్యలతో కూడిన బ్రాహ్మణులను (32) ఆ విప్రసుతులను చూచి కృత్రిమంగా దంపతులైన వారినిగా గ్రహించి కొద్దిగా నవ్వి వారిని గౌరీ మహేశ్వరులనుగా భావించింది. (33) ఆ ద్విజ ముఖ్యులందు దేవదేవుని సదా శివుని ఆవాహన చేసి, వారి పత్నుల యందు దేవియైన జగదంబికను ఆవాహన చేయసాగిందీ (34) గంధము, మాలలు, వాసన గల ధూపములు, నీరాజనములు వీనితో పూజించి ద్విజ శ్రేష్ఠులను చక్కగా నమస్కరించింది. (35) బంగారు పాత్రలలో నేయితో కూడిన పాయనము శర్కరమధువుతో కూడినది, మనోరమమైన శ్లోకములు (36) గంధము గల శాల్యనము మనోహరమైన లడ్డులు అపూవ రాశులు, జిలేబీలు, జంతికలు, మినుములతో చేసినవి, పులగము (37) అట్లాగే లెక్కలేని ఇతర భక్ష్యములు మనోరమమైన భోజ్యములు వాసన గల రుచికరమైన సూపములు శీతల పానీయములు (38) ఇన్నిటితో కూడిన అన్నాన్ని బ్రాహ్మణులకు ఆమె భక్తితో వడ్డించింది. సాటిలేని పెరుగన్నమును వడ్డించి వారిని సంతోష పరిచింది (39) బ్రాహ్మణులు భుజించాక, బాగా చేతులు కడుగుకున్నాక, ఆ రాజశ్రీ నమస్కరించి, తాంబూలమిచ్చి తగినట్టుగా దక్షిణయిచ్చి (40) ధేనువులు బంగారము, వస్త్రములు, రత్నములు, మాలలు, భూషణములు ఇచ్చి తిరిగి నమస్కరించి బ్రాహ్మణ శ్రేష్ఠులను విడిచి పెట్టింది (41) వారిద్దరు బ్రాహ్మణ కుమారులలో ఒకనిని ఆమె పార్వతిగా పూజించింది. ఒకనిని శివునిగా పూజించింది, నమస్కరించి ఆమె ఆజ్ఞతో వారు వెడలి పోయారు (42) ఆమె తన పురుష లక్షణాన్ని మరచిపోయి ఆ బ్రాహ్మణుని అనురాగం కలిగి మదోత్సిక్తురాలై మన్మథుని ఆధీనురాలై ఇట్లా అంది. (43) ఓ నాథ! విశాలాక్ష! అన్ని అవయవముల తోను నందరుడ! ఉండు ఉండు ఎక్కడికెళ్తున్నావు. నీ భార్యను నన్ను చూడటం లేదు (44) ఇక్కడ ఎదురుగా అందమైన వనముంది. చెట్లన్నీ బాగా పుష్పించాయి. ఇందులో విహరించ దలిచాను సుఖం కలిగేట్టు నీతో సహ తిరుగ దలిచాను (45) అని ఆమె అనగా విని ముందు వెళ్తున్న బ్రాహ్మణ కుమారుడు ఆలోచించి పరిహాసోక్తిగా భావించి ఇది వరకటిలా వెళ్ళసాగాడు. (46) తిరిగి ఆ బాల ఇట్లా అంది. ఉండు ఉండు ఎక్కడికి వెళ్తావు. భరింప రాని న్మరావేశముగల నన్ను అనుభవించటానికి వచ్చి (47). 

తా ॥ భార్యను సుందరిని నన్ను కౌగిలించుకో. నీ అధరాన్ని తాగనివ్వు. నేను వెళ్ళ లేకుండా ఉన్నాను. మన్మథ బాణంతో పీడింప బడ్డాను (48) అని ఇంతకు ముందు వినని ఆమె మాటను విని శంకించి, వెనుక వస్తున్న దానిని చూచి వెంటనే ఆశ్చర్య పడ్డాడు. (49) పద్మము ఆకుల వలె విశాలమైన కన్నులు గలది, బలిసిన ఎత్తైన రొమ్ములు గలది ఈమె ఎవరు. కృశించిన నడుము గలది, పెద్దదైన పిరుదులు గలది, కొత్త వైన చిగుళ్ళ వలే కోమలమైనది (50) ఆ నా మిత్రుడే పరమైన అంగనగా మారాడా. అందువల్ల ఇతనిని అంతా అడుగుతాను. అని ఆలోచించి ఆతడిట్లన్నాడు (51) ఓ మిత్రమ! రూప గుణములతో కొత్తగా అన్పిస్తున్నావు. అపూర్వంగా మాట్లాడు తున్నావు, ఆకులయైన స్త్రీ లాగ (52) వేద పురాణజ్ఞుడు బ్రహ్మచారి జితేంద్రియుడు, సారస్వతుని కొడుకు, శాంతుడు ఐన వాడి వేనా నువ్వు. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు. (53) అని పలుకగా ఆమె తిరిగి ఇట్లా అంది ఓ ప్రభు! నేను పురుషుడను కాను నా పేరు సామవతి బాలను నీకు రతిని కూర్చు దానిని (54) నీకనుమానమైతే ఓ ప్రియుడ! నా అవయవాలను చూడు అని పలుకగా త్వరగా మార్గంలో ఉమెను రహస్యంగా చూచాడు (55) సహజమైన కేశపాశం జఘన స్తానములతో శోభిస్తోంది. మంచి రూపం గలది ఐన ఆమెను చూచి కామంతో కొద్దిగా వ్యాకులు డైనాడు (56) తిరిగి ప్రయత్న పూర్వకముగా తన్ను తాను నిగ్రహించుకొని బుధుడు మనోవికారాన్ని దాచి క్షణకాలం విన్మయా విష్టుడై ఏమి మాట్లాడలేదు (57) సామవతి ఇట్లా అంది - నీ అనుమానం పోయిందో ఐతే రా నన్ను పొందు. ఓ కాంత! ఈ అడవిని చూడు పర స్త్రీ సురతమునకు తగినది (58) సుమేధుడు అన్నాడు - ఇట్లా అనకు. మదంతో మత్తెక్కిన వానిలా మర్యాదను దాటొద్ధు. మనిద్దరం శాస్త్రార్థ మెరిగిన వాళ్ళము. నీ విట్ల ఎట్లా మాట్లాడుతున్నావు. (59) చదివిన శాస్త్రానికి వివేకము నకు, కులము నకు ఈ ధర్మం తగునా, జార ధర్మాన్ని అనుసరించవచ్చా (60) నీవు ఆడదానివి కాదు పురుషుడిని విద్వాంసుడివి. నిన్ను నీవు తెలుసుకో. ఇది స్వయంగా చేసుకున్న అనర్థము, మనమేం చేశామో అది అనర్థము (61) తలిదండ్రులను వంచించి , ధూర్తుడైన రాజు ఆజ్ఞ ప్రకారం అనుచితమైన పనిచేసి నందుకు ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాము (62) అంతా అనుచితమైన కర్మనే రాజు శ్రేయస్సును నశింపచే సేది. నీవు విప్రాత్మజుడవు విద్వాంసుడవు. నీచమైన స్త్రీత్వాన్ని పొందావు (63). 

తా ॥ తోవను విడిచి అడవికి పోతే నరుడు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతాడు. బలవంతంగా క్రూర మృగములతో హింసింప బడుతాడు, ఒకవేళ తన గుంపును వదలి పెడితే (64) ఈ విధంగా వివేకాన్ని ఆశ్రయించి మాట్లాడకుండా నీ ఇంటికి వెళ్ళు. దేవతల ద్విజుల అనుగ్రహం వల్ల నీ స్త్రీ రూపము నశిస్తుంది. (65) లేదా దైవ యోగంవల్ల నీకు స్త్రీ త్వమే కలుగనీ. నీ తండ్రి వల్ల ఇవ్వ బడి నాతో సుఖిస్తావు. ఓ వరవర్ణిని (66) ఎంత చిత్రము, ఎంత దుఃఖ కరము. పాప బలము ఎంత గొప్పది. శివారాధన పరుడైన రాజు ప్రభావ మెంతటిది (67) అని చెప్పినా మాటిమాటికి అతడు, ఆమె అచంచలమై బలవంతంగా అతనిని కౌగిలించుకొని, ఆతని చిగురు వంటి పెదవిని ముద్దాడింది. (68) ఆమెతో బెదిరింప బడ్డా ధీరుడు సుమేధ, ఆ కొత్త స్త్రీ ని, ప్రయత్న పూర్వకముగా ఇంటికి తీసుకువచ్చి అంతా అక్కడ చెప్పాడు. (69) ఆ బ్రాహ్మణులిద్దరు ఆ విషయాన్ని విని కోపగించారు. శోక విహ్వలులైనారు. ఆ కుమారులతో కలిసి వైదర్భుని దరికి (రాజు) వెళ్ళారు (70) ధూర్త చేష్టగల రాజుతో సారస్వతు డిట్లన్నాడు. నీ శాసనానికి కట్టుబడ్డ నా కుమారుని చూడు, ఓరాజ! (71) వీరు ఇద్దరు, నీ ఆజ్ఞకు బద్ధులు. నీచమైన పనిచేశారు. నా కొడుకు ఆ పలితాన్ని అనుభవిస్తున్నాడు. అదే నీచమైన స్త్రీ త్వాన్ని పొందాడు (72) ఈ నాటికి నా సంతతి నశించింది. నా పితరులు నిరాశులైనారు. పుత్రహీనునకు మంచి లోకములు లేవు. పిండాది సంస్కృతి లేదు. (73) శిఖ, ఉపవీతము, జింకచర్మము, మౌంజి, దండము, కమండలువు ఈ చిహ్నాలు బ్రహ్మ చర్యానికి తగినట్టివి, వీనిని వదలి ఈ దశకు చేరాడు (74) బ్రహ్మ సూత్రము, సావిత్రి, స్నానము, సంధ్య, జప, అర్చనము ఇవన్నీ పోయి స్త్రీ రూపాన్ని పొందిన వీనికి మరో గతి ఏది చెప్పు, ఓ మహారాజ (75) నీ మూలంగా నా సంతతి నశించింది. నా వేద మార్గము నశించింది. నాకొక్కడే కొడుకు. నాకిక శాశ్వతమైన గతి ఏది చెప్పు ఓరాజ! (76) ఆవి సారస్వతుడనగా రాజు ఆ మాటవిని సీమంతిని ప్రభావంవల్ల ఇట్లైందిగదా అని చాలా ఆశ్చర్యపడ్డాడు (77) పిదప అందరిని పిలిచి, తేజశ్వంతులైన ఋషులను పిలచి, శాంతపరచి, వానికి మగ రూపం ఇమ్మని వారిని ప్రార్థించాడు. రాజు (78) వారిట్లన్నారు. పార్వతి శివుల ఆలోచనను చెప్పారు. (వారి ఇష్టమిది అని) ఆతని భక్తుల మాహాత్మ్యాన్ని ఎవడు మార్చగలడు. ఈశుడు కూడా ఏమి చేయలేడు (79) పిదప రాజు భరద్వాజుని ముని పుంగవుని తీసుకొని, ఆ బ్రాహ్మణులతో, వారి కుమారులతో కూడి (80) అంబిక భవనమునకు వచ్చి భరద్వాజుని ఉపదేశాను సారము ఆ దేవిని, ఆ అర్థరాత్రి తీవ్ర నియమములతో ఉపాసించసాగాడు (81) ఈ విధంగా మూడు రాత్రులు, ఆహారం వదలి ఆ రాజు పార్వతి ధ్యానరతుడైనాడు. నమస్కారములతో రకరకాల స్తోత్రాలతో, ప్రసన్నుల ఆర్తిని తీర్చే గౌరిని సంతోష పరచాడు (82) పిదప ఆ దేవి ప్రసన్నురాలై భక్తుడైన ఆ రాజునకు కోటి చంద్రులతో సమానమైన తన రూపాన్ని చూపించింది (83) ఆప్పుడు గౌరి రాజుతో ఇట్లా అంది. నీకు కావాల్సింది ఏమీటో చెప్పు అనగా ఆప్పుడాతడు, ఈతనికి మగతనాన్ని దయచేసి ఇవ్వు అని అన్నాడు. (84) తిరిగి మహాదేవి ఇట్లా అంది నా భక్తులు ఏ పని చేస్తారో దానిని మరో రకంగా నేను మారలేను, పదివేల ఏండ్లైనా సరే (85).   రాజోవాచ -

తా రాజిట్లన్నాడు - ఈ బ్రాహ్మణునకు వీడొక్కడే కొడుకు, దీనివల్ల ఈతని సంతతి నశించింది. అలాంటి వాడు పుత్రుడు లేకుండా ఎట్లా సుఖ పడుతాడు. (86) అనగా దేవి ఇట్లా అంది - నా అనుగ్రహం వల్ల ఆతనికి మరో పుత్రుడు కలుతాడు. విద్యా వినయములు కలవాడు, దీర్ఘాయువు, స్వచ్ఛమైన ఆశయం కలవాడు (87) ఆ బ్రాహ్మణునకు ఈ సామవతి కూతురు ఐ మేధసుని భార్య ఐ కామభోగం అనుభవించని (88) అని పలికి అంతర్షితురాలు కాగా దేవి, ఆ రాజు మొదలగు వారు అందరు తమ తమ ఇళ్ళకు వెళ్ళారు. ఆ రాజాజ్ఞను పాలించారు. (89) ఆ సారస్వతుడు బ్రాహ్మణుడు. పూర్వసుతుని కన్న ఉత్తముడైన పుత్రుని దేవి అనుగ్రహం వల్ల కొద్ది కాలంలోనే పొందాడు. (90) ఆ సామవతి అను కన్యను ఆనుమేథసుని కిచ్చాడు. ఆ దంపతులు చాలా కాలము చాలా సుఖాన్ని అనుభవించారు (91) సూతులిట్లన్నారు - అని ఇది శివభక్తురాలైన సీమంతిని అను పేరుగల రాచ స్త్రీ ప్రభావాన్ని మీకు చెప్పాను శివుని మాహాత్మ్యాన్ని కూడా వర్ణించాను. (92) తిరిగి ఆశ్చర్యకరమైన శివభక్తుల ప్రభావాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తాను. అది శ్రోతలకు మేలు చేకూర్చేది (93) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహోత్తర ఖండమందు సీమంతినీ ప్రభావవర్ణన మనునది తొమ్మిదవ అధ్యాయము.