స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని బ్రహ్మోత్తర ఖండము
4 అధ్యాయము
తా ॥ సూతులిట్లనిరి - ఇంకా, పరమాద్భుతమైన శివ మహాత్మ్యాన్ని చెబుతాను. వినే వారి అన్ని పాపములను నశింపచేసేది. సంసార పాశమును తొలగించేది (1) దాటరాని పాప సముద్ర మందు మునుగుతున్న, విషయములే ఆత్మగా గల వారికి శివపూజ తప్ప మరొక నావ చెప్ప బడలేదు. (2) బుద్ధిమంతుడైన మనిషి ఇక్కడ శివపూజను ఎవ్వరూ చేయాలి. చేతగాని పక్షంలో, చేసిన పూజను భక్తితో వినమ్రమైన బుద్ధితో చూడాలి (3) అశ్రద్ధతో నైనా ముక్తినిచ్చే శివ పూజను ఎవరా చరిస్తారో, చూస్తారో వారు కాల క్రమంలో పరమ పదానికి చేరుతారు. (4) కిరాత దేశము లందు విమర్ధనుడను పేరుగల రాజు ఉండేవాడు. శూరుడు, అణచ శక్యం కానివాడు శత్రువులను జయించినవాడు, ప్రతాపవంతుడు (5) ఎప్పుడు వేటయందు ఆసక్తి కలవాడు కృపణుడు, దయలేనివాడు ఐలవంతుడు అన్ని మాంసములను తినేవాడు క్రూరుడు. అన్ని వర్ణముల స్త్రీలతో కూడినవాడు (6) ఐనా శివపూజను ప్రతిరోజూ జాగ్రత్తగా చేసేవాడు. చతుర్ధశి యందు విశ్లేషించి శుక్లకృష్ణ పక్షము లందు (7) మహా విభవముతో కూడిన పూజ నాచరించి ఆతడు ఆనంద పడేవాడు. మిక్కిలి ఆనందం కలవాడై నాట్యం చేసేవాడు స్తుతించేవాడు, పాడేవాడు (8) ఇట్లా ఉంటున్న అన్నీ భక్షించే, దురాచారుడైన ఆ రాజు భార్య ఈతని చేష్టలతో బాగా తపించేది (9) ఆమె పేరు కుముద్వతి, రాణి శీల గుణములు కలది. ఒకసారి భర్తను సమీపించి రహస్యంగా దాన్ని అడిగింది (10) ఓరాజ! ఈ నీచరిత్ర చాలా ఆశ్చర్యకరమైంది. నీ ఈ దురాచారమిక్కడ. పరమేశ్వరుని యందు ఈ భక్తి! ఏమిటి (11) ఎప్పుడూ అన్నీ తినేవాడివి. అందరు స్త్రీల యందు లాలస గలవాడివి. సర్వ హింసా పరుడవు. క్రూరుడవు. అట్ల నేడు పరమేశ్వరుని యందు ఈ భక్తి ఏమిటి (12) అని అడుగగా ఆరాజు పిదప చాలా ఆలోచించి, త్రికాలజ్ఞుడై నవ్వి చాలా కుతూహలంలో ఆమెతో ఇట్లన్నారు (13) రాజువచనము - ఓ వరానన! నేను పూర్వ జన్మలో ఒక కుక్కను చంపా నగర మాశ్రయించి చుట్టు తిరుగుతున్నాను (14) ఇట్లా కాలం గడుస్తుండగా ఆ నగరమందే ఒకరోజు నేను మనోజ్ఞమైన శివమందిరానికి వచ్చాను. (15) చతుర్దశి మహాతిథి యందు పూజ జరుగు తుండగా, బహిర్ ద్వారాన్ని ఆశ్రయించి, దూరం నుండే ఉత్సవాన్ని చూశాను (16) అప్పుడు నేను పరమ క్రుద్ధులై చేత దండము ధరించిన వారితో తరుమ బడ్డాను. ప్రాణరక్షా పరాయణుణ్ణై ఆ ప్రదేశం నుండి తొలగిపోయాను (17).
తా ॥ పిదప మనో జ్ఞమైన శివ మందిరమునకు ప్రదక్షిణం చేసి ద్వారదేశం దగ్గరకు తిరిగివచ్చి తిరిగి వెళ్ళ గొట్టబడ్డాను (18) తిరిగి అదే శివ మందిరానికి ప్రదక్షిణం చేసి, బలి పిండాదుల మీది ఆశతో తిరిగి ద్వారం దగ్గర కొచ్చాను (19) ఇట్లా మాటిమాటికి అక్కడ ప్రదక్షిణలు చేసి చేసి ద్వారదేశ మందు కూర్చున్న నన్ను తీక్ష్ణమైన బాణములతో చంపారు (20) అట్లా కొట్టబడిన శరీరం గలిగి త్వరగా శివ ద్వారమందు ప్రాణాలు కోల్పోయి, శివసన్నిధి ప్రభావంవల్ల నేను రాజకులంలో పుట్టాను (21) చతుర్ధశీ పూజను చూచి, దీపమాలలను చూచాను. ఆ పుణ్యం మాహాత్మ్యంవల్ల ఓ భామిని నేను త్రికాలజ్ఞుణ్ణి ఐనాను (22) పూర్వజన్మ వాసనలతో దయలేకుండా అన్నింటినీ తింటున్నాను. వాసనమయమైన ప్రకృతి విద్వాంసులకు గూడా తప్పించుకోరానిది. (23) అందువల్ల చతుర్ధశియందు జగద్గురువైన ఈశుణ్ణి నేను పూజిస్తున్నాను. ఓభద్ర! నీవు కూడా శ్రద్ధతో దేవుడైన పినాకినిని సేవించు. (24) అనగా రాణి ఇట్లా అంది - ఓ రాజేంద్ర! గిరిజాపతి ప్రసాదంవల్ల త్రికాలజ్ఞుడవైనావు. యథార్థంగా నా పూర్వజన్మ చరిత్రము చెప్పండి (25) అనగా రాజిట్లన్నాడు - ఓ రాణి! నీవు పూర్వజన్మలో ఆకాశంలో తిరిగే ఒక పావురానివి. అనుకోకుండా నీకు ఎక్కడో కొద్ది మాంస పిండము లభించింది (26) నీవు తీసుకున్న మాంసాన్ని చూచి బలవంతురాలైన ఒక గద్ద, మాంసం లేనిదై, భయంకరంగా, వేగంగా స్వయంగా పరుగెత్తు కొచ్చింది. (27) పిదప వరానన! దానిని చూచి, భయపడి నీవు పరుగెత్తావు. మాంస పిండం తీసుకోవాలనే కోరికతో ఘోరంగా అది నిన్ను అనుసరించగా (28) అదృష్టవ శాత్తు నీవు శ్రీ గిరికి వచ్చి అక్కడ శివాలయంలో విశ్రమించావు. ప్రదక్షిణ మాచరించి ధ్వజాగ్ర మందు ఉన్నావు. (29) అప్పుడు నిన్ననుసరిస్తున్న ఉగ్రమైన ముక్కు గల అ పక్షి వేగంగా నిన్ను కింద పడవేసి చంపి, మాంసం తీసుకొని వెళ్ళిపోయింది. (30) దేవదేవుడైన శూలికి ప్రదక్షిణ మాచరించి నందువల్ల ఆతని ఎదుట మరణించినందువల్ల ఇక్కడ నృవ అంగనగా జన్మించావు (31) అని అనగా ఆమె ఇట్లా అంది నా పూర్వజన్మ చరిత్రము నేను అంతా పూర్తిగా విన్నాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నా మనస్సులో భక్తి కలిగింది. ఓ త్రికాలజ్ఞ! మహామతి! నేను మరొక్కటి మీ వల్ల వినదలిచాను. ఈ శరీరాన్ని వదలి, తిరిగి ఏ గతిని పొందుతాము అని. (32) రాజిట్లన్నాడు - మరో రెండో జన్మలో నేను సైంథన దేశపు రాజుగా జన్మిస్తాను (33) నీవు సృంజయ దేశపు రాజు కూతురుగా జన్మించి, నన్నే పొందుతావు. మూడవ జన్మలో సౌరాష్ట్రంలో రాజుగా జన్మిస్తాను (34).
తా ॥ నీవు కళింగ రాజు తనయవై నాకు భార్య వౌతావు. చతుర్ధ జన్మలో నేను గాంధార దేశపు రాజు నౌతాను (35) అక్కడ నీవు మగథ దేశపు రాజ తనయవై నాభార్యవౌతావు. ఐదవ జన్మలో నేను అవంతి నాథుడ నౌతాను (36) నీవు దాశార్ద రాజు కూతురువై నా భార్య వౌతావు. ఆరవ జన్మలో నేను అనర్త దేశపు రాజు నౌతాను (37) యయాతి వంశపురాజు కన్యవై నన్నే పొందుతావు. ఏడవ జన్మలో నేను పాండ్యరాజు కుమారుణ్ణౌతాను (38) అప్పుడు రూప ఔదార్య గుణములలో నాతో సమానమైన వాడు మరొకడుండడు. సర్వశాస్త్రార్థముల గర్వ మెరిగినవాడను, బలవంతుడను దృఢ విక్రముడ నౌతాను (39) అన్ని లక్షణములు గలవాడ నౌతాను.సర్వలోకములకు మనోహరుడ వౌతాను. పద్మవర్ణుడని నా పేరు. సూర్యుని వంటి కాంతి గలవాడను (40) నీవు వైదర్బిగా జన్మిస్తావు. భూమిలో నీ అంత అందగత్తె ఉండదు. వసుమతి నీ పేరు. రూప అవయవములలో శోధిస్తుంటావు (41) రాకుమారులందరి మనస్సులకు, కళ్ళకు ఆనందం కూర్చే దానివౌతావు. నీవు స్వయంవరంలో రాకుమారులందరిని వదలి (42) దమయంతి వైషధుని వలె నన్నే వరునిగా పొందుతావు. నేను రాజులందరిని జయించి, వరవర్ణినియైన నిన్ను పొంది (43) నా రాష్ట్ర మందుండి అనేక సంవత్సరాలు అనేక భోగములను అనుభవిస్తాను. రకరకాల యజ్ఞములు శుభమైన అశ్వమేధములు చేసి (44) పితరులను దేవర్షులను సంతర్పణల ద్వారా (వీళ్ళు వేద బ్రాహ్మణులను దానములచే తృప్తి పరచి, దేవదేవేశుడైన లోక శంకరుడైన శంకరుని పూజించి (45) పుత్రుని పై రాజ్యభారముంచి తపో వనమునకు వెళ్తాను. అక్కడ అగస్త్యముని ద్వారా అవాసాన్ని పొంది (46) నీతో కలిసి శివుని పరమ స్థానమునకు వెళ్తాను. ఈ విధముగా ప్రతి చతుర్ధశి యందు శంకరుని పూజించి (47) నందువల్ల ఏడు జన్మలలో రాజత్వము లభిస్తుంది, ఓ వరానన! పూజను దర్శించినంత మాత్రంచేత ఈ సుకృతం లభించింది. దుష్టాత్మ గల సారమేయ మెక్కడ. ఇటువంటి నద్గతి ఎక్కడ (48) సూతులిట్లన్నారు. అని అతని భర్త చెప్పగా శుభ లక్షణములు గల ఆ రాణి (49) చాలా ఆశ్చర్యాన్ని పొంది అతనిని ఆనందంతో పూజించసాగింది. ఆ రాజు కూడా ఆమెతో కలిపి తన కిష్టమైన కోరికలను అనుభవించి (50) ఏడుజన్మల చివర శివుని యొక్క ఆ పరమ స్థానమునకు వెళ్ళాడు. పరమాద్భుతమైన ఈ శివపూజా మహాత్మ్యాన్ని ఎవరు వింటారో, కీర్తిస్తారో వారు పరమ, పదమునకు వెళ్తారు (51) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సమ్హితయందు తృతీయ బ్రహోత్తర ఖండమందు చతుర్దశి మాహాత్య వర్ణన మనునది నాల్గవ అధ్యాయము.
