3 -  తృతీయోఽధ్యాయః

సూత ఉవాచ

 జగృహే పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః

 సంభూతం షోడశకలమాదౌ లోకసిసృక్షయా

భగవంతుడు పూర్వము సృష్టిని చేయగోరి మహత్తత్త్వము, అహంకారము మరియు పంచతన్మాత్రలతో గూడి సునిష్పన్నమైన పురుష రూపమును గ్రహించెను. ఆ రూపమునందు అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అంతఃకరణము, అయిదు భూతములు అనే పదునారు కళలు గలవు.

యస్యాంభసి శయానస్య యోగనిద్రాం వితన్వతః

 నాభిహ్రదాంబుజాదాసీద్బ్రహ్మా విశ్వసృజాం పతిః

కారణజలమునందు నడుము వాల్చి సమాధిరూపమైన నిద్రను కొనసాగించుచున్న పరమేశ్వరుని నాభి అనే సరస్సునుండి ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మగారు ఉదయించెను.

యస్యావయవసంస్థానైః కల్పితో లోకవిస్తరః

తద్వై భగవతో రూపం విశుద్ధం సత్త్వమూర్జితమ్

ఆ పరమేశ్వరుని అంగాంగముల రూపముగా మాత్రమే ఈ జగత్తు విస్తరించి యున్నది. భగవానుని ఆ విరాడ్రూపము రజస్తమోగుణముల సంస్పర్శ లేని నిరతిశయమైన సత్త్వగుణముయొక్క అభివ్యక్తియే.

పశ్యంత్యదో రూపమదభ్రచక్షుషా

సహస్రపాదోరుభుజాననాద్బుతమ్

సహస్రమూర్ధశ్రవణాక్షినాసికం

సహస్రమౌల్యంబరకుండలోల్లసత్

అనంతములైన పాదములు, ఊరువులు, భుజములు, శిరస్సులు, చెవులు, కన్నులు, ముక్కులు, కిరీటములు, వస్త్రములు మరియు కుండల ములతో అద్బుతముగా ప్రకాశించే ఈ రూపమును యోగులు గొప్ప జ్ఞాన నేత్రముతో చూచెదరు.

ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయమ్

యస్యాంశాం శేన సృజ్యంతే దేవతిర్యజ్నరాదయః

వివిధములగు అవతారములు ఈ ఆదినారాయణరూపమునుండియే ఉద్భవించి, అవతారప్రయోజనము పూర్తి అయిన తరువాత మరల దానియందే విలీనమగును. బ్రహ్మగారు ఈ రూపముయొక్క అంశ కాగా, ఆయన అంశలగు మరీచ్యాది మహర్షులచే దేవతలు పశువులు పక్షులు మానవులు మొదలగు ప్రాణులు సృష్టించ బడుచున్నవి.

స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాస్థితః

చచార దుశ్చరం బ్రహ్మా బ్రహ్మచర్యమఖండితమ్

ఆ ఆదినారాయణుడే కౌమారసర్గములో సనక, సనందన, సనాత న, సనత్కుమారులనే మహర్షుల రూపమును స్వీకరించి, విఘ్నములు లేని క్లేశసాధ్యమైన బ్రహ్మచర్యమును నేరపెను.

ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీమ్

ఉద్ధరిషన్నుపోదత్త యజ్ఞేశస్సాకరం వపుః

రెండవ పర్యాయములో యజ్ఞేశ్వరుడగు ఆ నారాయణుడు ఈ జగత్తుయొక్క సమృద్ధి కొరకు పాతాళమునందున్న భూమిని పైకి తీయ గోరి వరాహరూపమును దాల్చెను.

తృతీయమృషిసర్గం చ దేవర్షిత్వము పేత్య సః

తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః

ఆ నారాయణుడు మూడవదియగు ఋషిసృష్టిలో దేవర్షియగు నారదుని రూపమును దాల్చి, భక్తులు చేయదగిన కర్మలను బోధించే పంచరాత్రాగమమును ఉపదేశించెను. సహజముగా బంధహేతువులగు కర్మలు దాని ప్రభావముచే అంతఃకరణశుద్ధి ద్వారా మోక్ష హేతువులగును.

తుర్యే ధర్మకలాసర్గే నరనారాయణావృషీ

భూత్వాత్మోపశమోపేతమకరోద్దుశ్చరం తపః

నాల్గవ అవతారమునందు ఆయన ధర్ముని పత్నియరు. మూర్తీ యందు నరనారాయణమహర్షుల రూపములో జన్మించి, మనస్సును పూర్ణముగా నిగ్రహించి కఠోరమైన తపస్సును చేసెను.

పంచమః కపిలో నామ సిద్దేశః కాలవిప్లుతమ్

 ప్రోవాచాసురయే సాంఖ్యం తత్త్వగ్రామవినిర్ణయమ్

ఐదవ పర్యాయములో ఆయన సిద్దులకు ప్రభువగు కపిలమ హర్షిరూపముగా అవతరించి తత్త్వసముదాయమును విశేషముగా నిర్ధారించి చెప్పే సాంఖ్యశాస్త్రమును ఉపదేశించెను. ఆ శాస్త్రము కాల ప్రభావముచే అంతరించి పోయినది.

షష్ఠ అత్రేరపత్యత్వం వృతః ప్రాప్తోనసూయయా

 ఆన్వీక్షికీమలరాయ ప్రహ్రదాదిభ్య ఊచివాన్

ఆరవ పర్యాయములో ఆయన అనసూయా దేవిచే కోరబడి (ఆ త్రీచే తన సంతానరూపములో కోరబడి ఆ కోరిక విషయములో తప్పును పట్టకుండగా) అత్రిమహర్షికి కొడుకుగా (దత్తాత్రేయ మహర్షి) పుట్టి అలర్కు డు, ప్రహ్లాదుడు, యదువు, హైహయుడు మొదలగు వారికి ఆత్మవిద్యను ఉపదేశించెను.

తతస్సప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోభ్యజాయత

 స యామాద్యైస్సురగణైరపాత్స్వాయంభువాంతరమ్

అ తరువాత ఏడవ పర్యాయములో ఆయన రుచి ప్రజాపతికి ఆకూతియందు యజ్ఞుడై జన్మించి, తన పుత్రులగు యామ మొదలైన దేవ గణములతో కూడి స్వాయంభువ మన్వంతరమును రక్షించెను.

అష్టమే మేరుదేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః

దర్శయన్ వర్త్మ ధీరాణాం సర్వాశ్రమనమస్కృతమ్

విశాలమగు పాదవిక్షేపములు గల శ్రీమహావిష్ణువు నాభిమహారాజునకు మేరుదేవియందు ఋషభుడై జన్మించి, వివేకవంతులకు అన్ని ఆశ్ర మములవారిచే నమస్కరించబడే పరమహంస (జ్ఞాన) మార్గమును చూపించెను.

దుగ్దేమామౌషధీర్వప్రాస్తేనాయం స ఉశత్తమః

తొమ్మిదవ పర్యాయము ఋషులు కోరగా ఆయన పృథుమహా రాజు రూపములో జన్మించి గోరూపములోనున్న ఈ భూమినుండి. సక లములగు ఓషధులను పితికెను. ఓ మహర్షులారా! అందువలననే, ఆ అవ తారము మిక్కిలి కల్యాణకరమైనది.

రూపం స జగృహే మాత్స్యం చాక్షుషోదధిసంప్లవే

నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుమ్

చాక్షుషమన్వంతరము పూర్తి కాగానే సముద్రములన్నియు కలిసి పోయి ఏకార్ణవమైనప్పుడు ఆయన మత్స్యరూపమును దాల్చి, వైవస్వత మనువును నౌకరూపములోనున్న భూమియందు ఎక్కించుకొని కాపాడెను.

సురాసురాణాముదధిం మథృతాం మందరాచలమ్

దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః

పదకొండవ పర్యాయములో సర్వస్యోపకుడగు పరమేశ్వరుడు దేవతలు మరియు రాక్షసులు సముద్రమును మథించుచుండగా కూర్మరూ పమును దాల్చీ మందరపర్వతమును తన వీపుపై మోసెను.

ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ

అపాయయత్సురానన్యాన్మోహిన్యా మోహయన్ స్త్రీయా

పన్నెండవది ధన్వంతరి అవతారము. పదమూడవ అవతారములో ఆయన మోహినీ రూపముతో రాక్షసులకు మోహమును కలిగించి, దేవత లచే అమృతపానము చేయించేను.

చతుర్ధశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్జితమ్

దదార కరజైర్వక్ష స్యేరకాం కటకృద్యథా

పదునాల్గవదియగు నరసింహావతారములో శ్రీమహావిష్ణువు బల శాలియగు రాక్షసరాజైన హిరణ్యకశిపుని వక్షఃస్థలమును చేతిగోళ్లతో, ఊలను చేయుపోడు గడ్డిని వలే చీల్చివేసెను.

 పంచదశం వామనకం కృత్వానాదధ్వరం బలేః

పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రీవిష్టపమ్

పదిహేనవ పర్యాయము ఆయన వామనావతారమును స్వీకరిం చి, స్వర్గమును లాగుకొనుటకై బలిచక్రవర్తియొక్క యజ్ఞమునకు వెళ్లి, మూడడుగుల భూమిని కోరెను.

అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్

త్రిస్సప్తకృత్వ కుపితో నిఃక్షత్రమకరోన్మహీమ్

పదునారవ అవతారములో రాజులు ఈశ్వరద్రోహమును చేయు చుండుటను గాంచి ఆయన కోపించి ఇరవై ఒక్క సార్లు భూమియందు క్షత్రి యులు లేకుండగా చేసెను.

తతస్సప్తదశే జాతస్సత్యవత్యాం పరాశరాత్

 చక్రే వేదతరోశ్శాఖా దృష్ట్వా పుంసోల్పమేధసః

తరువాత ఆయన పది హేడవ అవతారములో పరాశరమహర్షికి సత్యవతియందు వ్యాసుడై జన్మించి, మానవులు అల్పమగు ప్రజ్ఞను కలిగి యుండుటను గాంచి, వేదము అనే మహావృక్షమును శాఖల రూపముగా విభాగము చేసెను.

నరదేవత్వమాపన్నస్సురకార్యచికీర్షయా

 సముద్రనిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరమ్

ఆ తరువాత (పదునెనిమిదవ అవతారములో) ఆయన దేవకార్య మును చేయగోరి, శ్రీరామచక్రవర్తిరూపమును దాల్చి, సముద్రముపై సేతువును కట్టుట మొదలగు శౌర్యపూర్ణములగు కార్యములను చేసెను.

ఏకోనవింశే వింశతిమే వృష్టిషు ప్రాప్య జన్మనీ

రామకృష్ణావితి భువో భగవానహరద్భరమ్

విష్ణుభగవానుడు పందొమ్మిది మరియు ఇరువది అవతారములలో యదువంశమునందు బలరామకృష్ణులుగా జన్మించి భూభారమును పోగొట్టెను.

 తతః కలౌ సంప్రవృత్తే సంమోహాయ సురద్విషామ్

 బుద్ధో నామ్నాజనసుతః కీకటేషు భవిష్యతి

తరువాత కలియుగము ఆరంభమైన పిమ్మట దేవవిద్వేషులను మోహ పెట్టుట కొరకై మగధదేశమునందు బుద్దుడు అనే పేరుతో అజనుని కుమారుడై జన్మించగలడు.

అథాసౌ యుగసంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు

జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః

తరువాత జగత్తులను రక్షించే శ్రీమహావిష్ణువు కలియుగము యొక్క అంతమునందు, రాజులు ఇంచుమించు చోరులుగా తయారైన ప్పుడు, కల్కి అను పేరుతో విష్ణుయశస్సు అనునాతని కుమారుడై జన్మిం చగలడు.

అవతారా హ్యసంఖ్యేయా హరేస్సత్త్వనిధేర్ద్విజాః

 యథావిదాసినః కుల్యాస్సరసస్స్యుస్సహస్రశః

ఓ మహర్షులారా! ఎండిపోవుట యెరుగని అగాధసరస్సునుండి వేలాది పిల్లకాలువలు బయలుదేరు విధముగా, సత్త్వగుణస్వరూపుడగు శ్రీహరినుండి లెక్కలేనన్ని అవతారములు బయలుదేరుచుండును.

ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః

కలాస్సర్వే హరేరేవ సప్రజాపతయస్తథా

ఋషులు, మనువులు, దేవతలు, గొప్ప పరాక్రమశాలురైన మను పుత్రులు, ప్రజాపతులు అందరు శ్రీహరియొక్క అంశలు మాత్రమే.

ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్

 ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే

పరమేశ్వరుని ఈ అంశావతారములు రాక్షసులచే ఇబ్బందులకు గురిచేయబడే లోకమును ప్రతియుగమునందు రక్షించుచుందురు. కాని, శ్రీకృష్ణుడు స్వయముగా శ్రీహరియే.

జన్మ గుహ్యం భగవతో య ఏతత్ప్రయతో నరః

 సాయంప్రాతర్గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే

భగవానుని రహస్యమగు ఈ అవతారముల గాథను ఏ మానవు డైతే పరిశుద్దుడై ఉదయము మరియు సాయంకాలము పఠించునో, ఆతడు దుఃఖమయమగు సంసారమునుండి విముక్తిని పొందును.

ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః

మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని

రూపము లేని చైతన్యఘనుడగు పరమేశ్వరునకు ఈ జగద్రూ పము మాయాశక్తి యొక్క కార్యములగు మహత్తత్త్వము మొదలగు వాటి చేత ఆ పరమేశ్వరుని మాత్రమే అధిష్ఠానముగా చేసుకొని రచించబడినది. లేదా, రూపము లేనివాడు, శుద్ధచేతనుడు అగు జీవునకు ఈ శరీరము భగ వంతుని మాయాశక్తివికారములగు మహత్తత్త్వము మొదలగు వాటిచేత చిదనమగు ఆత్మ (పరం బ్రహ్మ) అనే అధిష్టానమునందు రచించబడినది.

యథా నభసి మేఘాఘో రేణుర్వా పార్థివోకానిలే

 ఏవం ద్రష్టరి దృశ్యత్వమారోపితమబుద్ధిభిః

మేఘముల గుంపు వాయువును ఆశ్రయించి యున్ననూ ఆకాశ మునందు ఆరోపించ బడుచున్నది. పొగకు మూలము పృథివీవికారమగు ధూళియే అయిననూ, అది అగ్నికి అంటగట్ట బడుచున్నది. అటులనే, దృక్స్వరూపమగు ఆత్మయందు దృశ్యమగు శరీరముయొక్క ధర్మములు (జన్మమరణములు ఇత్యాదులు) ఆరోపించ బడుచున్నవి.

అతః పరం యదవ్యక్తమవ్యూడగుణవ్యూహితమ్

అదృష్టాశ్రుతవస్తుత్వాత్స జీవో యత్పునర్భవః

చిద్ఘనుడగు ఆ పరమేశ్వరునకు, చేతులు కాళ్లు మొదలగు స్థూల రూపములలోనికి పరిణామమును చెందని, సత్త్వరజస్తమోగుణములచే రచించబడిన మరియొక ఉపాధి గలదు. అది కంటికి కానరాని, చెవులకు వినరాని సూక్ష్మమగు ఉపాధి. అదియే జీవుని సూక్ష్మ (లింగ) శరీరమని నిర్దేశించ బడుచున్నది. దాని వలననే జీవునకు పునర్జన్మ కలుగుచుండును.

యత్రేమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిదా

అవిద్యయాత్మని కృతే ఇతి తదహ్మ దర్శనమ్

మానవుడు ఏ కాలమునందైతే ఈ రెండు స్థూలసూక్ష్మరూపము లు అజ్ఞానముచే ఆత్మయందు కల్పించబడినవని గుర్తించి, స్వరూపజ్ఞాన ముచే వాటిని త్రోసిపుచ్చునో, అదే క్షణములో జ్ఞానఘనమగు బ్రహ్మయే యగును; లేదా, బ్రహ్మసాక్షాత్కారము కలుగును

యద్యేషోపరతా దేవీ మాయా వైశారదీ మతిః

సంపన్న ఏవేతి విదుర్మహిమ్ని స్వే మహీయతే

బుద్ధిరూపిణియగు ఈ పరమేశ్వరుని మాయాశక్తి విద్యారూప ముగా మారి తొలగిపోయినచో, జీవుడు నిశ్చయముగా తన బ్రహ్మస్వరూ పమును పొందునని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఆపైన ఆ జీవుడు తన పరమానంద స్వరూపమునందు విరాజిల్లును.

ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ

వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతేః

కర్తృత్వము లేనివాడు, పుట్టుక లేనివాడు, అంతర్యామి అగు ఆ పరమేశ్వరునకు మాయాసంబంధముచే వచ్చిన వేదముల రహస్యములైన కర్మలను మరియు జన్మలను విద్వాంసులు ఈ విధముగా వర్ణించినారు.

స వా ఇదం విశ్వమమోఘలీలః

సృజత్యవత్యత్తి న సజ్ఞత్వేస్మిన్

 భూతేషు చాంతర్హిత ఆత్మతంత్రః

షాడ్వర్గీకం జిఘ్రతి షడ్గుణేశః

అమోఘమగు లీలలు గల ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టిం చి, పాలించి, ఉపసంహరించుచున్నాడు. కాని, ఆయన జగత్తునందు ఆస క్తిని కలిగి యుండుటలేదు. ఆ పరమేశ్వరుడు ప్రాణుల హృదయములో అంతర్యామిరూపముగా నున్నవాడై, చెవి కన్ను నాలుక చర్మము ముక్కు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియములను నియంత్రిస్తూ, శబ్దరూపర సస్పర్శగంధములు మరియు సుఖదుఃఖములు అనే వాటి విషయములను ఆఘ్రాణించుచున్నాడు. కాని, స్వతంత్రుడగు ఆ పరమాత్మకు ఈ విషయ ములతో సంగము లేదు.

న చాస్య కశ్చిన్నపుణేన ధాతు-

రవైతి జంతుః కుమనీష ఊతీః

నామాని రూపాణీ మనోవచోభిః

సంతన్వతో నటచర్యామివాజ్ఞః

మూర్ఖునకు నటుని చేష్టల స్వరూపము తెలియదు. అటులనే, సంకల్పముచే రూపములను, వేదరూపములగు వాక్కులతో నామములను చక్కగా విస్తరింపజేయుచూ జగత్తును పాలించుచున్న ఈ పరమేశ్వరుని లీలలను దుర్బుద్ధియగు ఏ మానవుడైననూ తర్కపటిమచే తెలియజాలడు.

స వేద ధాతుః పదవీం పరస్య 

దురంతవీర్యస్య రథాంగపాణేః

యోకమాయయా సంతతయనువృత్త్యా

 భజేత తత్పాదసరోజగంధమ్

ఎవడైతే నిష్కపటస్వభావము గలవాడై నిరంతరముగా ఈశ్వరీయ జీవనమును కొనసాగిస్తూ ఆ పరమేశ్వరుని పాదపద్మముల పరిమళమును సేవించునో, అట్టివాడు జగద్విధాత, అంతుచిక్కని పరాక్రమము గలవాడు, చక్రమును చేతియందు ధరించువాడు అగు ఆ పరమేశ్వరుని స్వరూపము ను, లీలల రహస్యమును తెలియగల్గును.

అథేహ ధన్యా భగవంత ఇత్థం

యద్వాసుదేవేఃఖిలలోకనాథే

కుర్వంతి సర్వాత్మకమాత్మభావం

న యత్ర భూయః పరివర్త ఉగ్రః

కావున, పూజ్యులగు మీరు ధన్యులు. ఏలయనగా, మీరు ఇట్లు ప్రశ్నించి సకలజగన్నాయకుడగు శ్రీమహావిష్ణువునందు ఈ జన్మలో పూర్ణ మైన అనన్యమైన ప్రేమను చేయుచున్నారు. ఇట్టి మనోభావము కలిగిన మానవుడు మరల భయంకరమగు జన్మమరణముల సుడిగుండములో చిక్కుకొనడు.

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్

ఉత్తమశ్లోకచరితం చకార భగవానృషిః

భగవాన్ వేదవ్యాసమహర్షి ఉత్తమమగు కీర్తిగల పరమేశ్వరుని చరి తమును వర్ణించే, వేదములతో సమానమైన, భాగవతమను ఈ ప్రసిద్ధమగు పురాణమును రచించెను.

నిః శ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్

తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరమ్

కొనియాడదగినది, మంగళములకు నిధానము అగు అట్టి ఈ మహాపురాణమును ఆయన మానవాళియొక్క పరమహితము కొరకై తన కుమారుడు, ఆత్మజ్ఞానులలో అగ్రేసరుడునగు శుకమహర్షికి నేర్పించెను.

సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతమ్

 స తు సంశ్రావయామాస మహారాజం పరీక్షితమ్

ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షిభిః

తత్ర కీర్తయతో విప్రా విప్రర్షేర్భూరితేజసః

అహం చాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్

 సోహం వః శ్రావయిష్యామి యథాధీతం యథామతి

ఈ పురాణములో సకలవేదములు మరియు రామాయణభారత ముల సారభూతమైన తత్త్వము సంగ్రహించ బడినది. దీనిని ఆ శుకమహర్షి గంగానదీతీరమునందు ప్రాయోపవేశము చేసి ఋషులచే చుట్లువారబడి యున్న పరీక్షిన్మహారాజునకు వినిపించినాడు. ఓ మహర్షులారా! గొప్ప తేజ శ్శాలియగు శుకమహర్షి అచట భాగవతమును కీర్తించుచుండగా, అక్కడనే కూర్చుండియున్న నేను కూడా ఆయన అనుగ్రహముచే దానిని తెలుసు కొంటిని. అట్టి నేను అధ్యయనము చేసినదానిని అతిక్రమించకుండగా నా బుద్ధిశక్తిననుసరించి మీకు వినిపించెదను.

కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్సహ

 కలౌ నష్టదృశామేష పురాణార్కోధునోదితః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే తృతీయోఽధ్యాయః

శ్రీకృష్ణుడు ధర్మము, జ్ఞానము మొదలగు వాటితో గూడి తన ధామమునకు వెళ్లిపోగానే, జ్ఞాననేత్రము లోపించిన జనులకొరకై ఈ పురా ణమనే సూర్యుడు ఇప్పుడు ఉదయించినాడు.

శ్రీమద్భాగవతమహాపురాణములోని ప్రథమస్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది.