భాగవత మహా పురాణము
16 - షోడశోఽధ్యాయః
సూత ఉవాచ ।
తతః పరీక్షిద్విజవర్యశిక్షయా
మహీం మహాభాగవతశ్శశాస హ ।
యథా హి సూత్యామభిజాతకోవిదాః
సమాదిశన్విప్ర మహద్గుణస్తథా ॥
సూతుడిట్లు పలికెను: ఓ శౌనకమహర్షీ! పాండవుల మహాప్రస్థా నము తరువాత భాగవతోత్తముడగు పరీక్షిన్మహారాజు, ఆయన పుట్టిన ప్పుడు జాతకవిద్వాంసులు చెప్పిన విధముగా గొప్ప గుణములు గలవా డై, బ్రాహ్మణోత్తముల సదుపదేశానుసారముగా రాజ్యమునేలెను.
స ఉత్తరస్య తనయాముపయేమ ఇరావతీమ్ । జనమేజయాదీంశ్చతురస్తస్యాముత్పాదయత్సుతాన్ ॥
అ పరీక్షిత్తు ఉత్తరుని కుమార్తెయగు ఇరావతిని వివాహమాడి, ఆమెయందు జనమేజయుడు మొదలగు నలుగురు కుమారులను కనెను.
అ పరీక్షిత్తు ఉత్తరుని కుమార్తెయగు ఇరావతిని వివాహమాడి, ఆమెయందు జనమేజయుడు మొదలగు నలుగురు కుమారులను కనెను.
ఆజహారాశ్వమేధాంస్త్రీన్ గంగాయాం భూరిదక్షిణాన్।
శారద్వతం గురుం కృత్వా దేవా యత్రాక్షగోచరాః॥
ఆయన కృపాచార్యుని గురువుగా చేసుకొని గంగాతీరమునందు గొప్ప దక్షిణలతో గూడిన మూడు అశ్వమేధములను చేసెను. వాటిలో హవిస్సులను స్వీకరించుటకు విచ్చేసిన దేవతలు కంటికి కానవచ్చెడివారు.
నిజగ్రాహౌజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్।
నృపలింగధరం శూద్రం ఘ్నంతం గోమిథునం పదా॥
వీరుడగు పరీక్షిత్తు ఒకానొక సమయములో దిగ్విజయయాత్రను చేయుచూ రాజచిహ్నములను ధరించిన శూద్రుని రూపములో ఎద్దును ఆవును కాలితో తన్నుచున్న కలిని పట్టుకొనెను.
శౌనక ఉవాచ ।
కస్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్విజయే నృపః ।
నృదేవచిహ్నధృక్ శూద్రః కోసో గాం యః పదా హనత్॥
శౌనకుడిట్లు పలికేను: పరీక్షిన్మహారాజు దిగ్విజయయాత్రలో కలిని పట్టుకొనుటకు కారణమేమి? చక్రవర్తిచిహ్నములను ధరించి గోవును కాలితో తన్నిన ఈ శూద్రుడు ఎవడు?
తత్కథ్యతాం మహాభాగ యది కృష్ణకథాశ్రయమ్ ।
అథవాస్య పదాంభోజమకరందలిహాం సతామ్॥
కిమన్యైరసదాలాపైరాయుషో యదసద్వ్యయః।
క్షుద్రాయుషాం నృణామంగ మర్త్యానామృతమిచ్ఛతామ్॥
మహాత్మా! ఓయీ సూతా! ఆ విషయము శ్రీకృష్ణగాథతో సంబం ధము గలది గాని, లేదా శ్రీకృష్ణుని పాదపద్మముల మకరందమును ఆస్వా దించే సత్పరుషులకు సంబంధించినది గాని అయినచో, చెప్పము. అట్లు గానిచో, అల్పమగు ఆయుర్దాయము కలిగి శీఘ్రముగా మరణించబోతూ సత్యమును దర్శించవలెనని కోరే మావంటి వారికి ఇతరములైన అయోగ్య ములగు కబుర్లతో పని యేమి? అట్టి కబుర్ల వలన మానవుల ఆయుర్దాయము వ్యర్థముగా క్షయమగును.
ఇహోపహూతో భగవాన్మృత్యుశ్శామిత్రకర్మణి।
న కశ్చిన్మ్రియతే తావద్యావదాస్త ఇహాంతకః॥
పశువిశసనము అనే కర్మ కొరకై మృత్యుదేవత ఆహ్వానించబడి ఇప్పుడు ఈ యజ్ఞశాలలో నున్నాడు. మృత్యుదేవత ఇక్కడ ఉన్నంతవరకు ఏ మానవుడైననూ మరణించడు.
ఏతదర్థం హి భగవానాహూతః పరమర్షిభిః।
అహో నృలోకే పీయేత హరిలీలామృతం వచః॥
యమధర్మరాజును ఇచటకు ఆహ్వానించినచో, మానవులకు శ్రీహ రియొక్క లీలలను వర్ణించే అమృతవాక్కులను వినే అవకాశము లభించున నియే మహర్షులు ఆయనను ఇచటకు ఆహ్వానించినారు.
మందస్య మందప్రజ్ఞస్య వయో మందాయుషశ్చ వై।
నిద్రయా హ్రియతే నక్తం దీవా చ వ్యర్థకర్మభిః॥
సోమరీ, మందబుద్ధి మరియు అల్పాయుష్కుడు అగు మానవుని ఆయుర్ధాయమును రాత్రియందు నిద్ర, పగలు వ్యర్థమగు పనులు అపహ రించి వేయుచున్నవి.
సూత ఉవాచ ।
యదా పరీక్షిత్కురుజోంగలే వసన్
కలిం ప్రవిష్టం నిజచక్రవర్తితే।
నిశమ్య వార్తామనతిప్రియాం తతః
శరాసనం సంయుగశౌండిరాదదే ॥
సూతుడిట్లు పలికెను: కురుజాంగలదేశమునందు నివసించే యుద్ధవీరుడగు పరీక్షిన్మహారాజు తన సేనలచే పాలించబడే దేశములో కలి ప్రవేశించినాడనే చీకాకును కలిగించే వార్తను విని, ధనస్సును చేతబట్టెను.
స్వలంకృతం శ్యామతురంగయోజితం
రథం మృగేంద్రధ్వజమాశ్రితః పురాత్।
వృతో రథాశ్వద్విపపత్తియుక్తయా
స్వసేనయా దిగ్విజయాయ నిర్గతః॥
పరీక్షిన్మహారాజు చక్కగా అలంకరించి నల్లని గుర్రములను పూన్చిన సింహధ్వజము గల రథమునెక్కి, రథములు గుర్రములు ఏనుగులు మరియు పదాతులతో కూడిన సైన్యము తోడురాగా, నగరమునుండి దిగ్విజయము కొరకై బయలు దేరెను.
భద్రాశ్వం కేతుమాలం చ భారతం చోత్తరాన్ కురూన్।
కింపురుషాదీని వర్షాణి విజిత్య జగృహే బలిమ్॥
ఆయన భద్రాశ్వ-కేతుమాల-భారత-ఉత్తరకురు-కింపురుషాది దే శములను జయించి వారివద్దనుండి బహుమానములను స్వీకరించెను.
తత్ర తత్రోపశృణ్వానస్స్వపూర్వేషాం మహాత్మనామ్।
ప్రగీయమానం చ యశః కృష్ణమాహాత్మ్యసూచకమ్॥
ఆత్మానం చ పరిత్రాతమశ్వత్థామ్నో స్త్రతేజసః।
స్నేహం చ వృష్టిపొర్దానాం తేషాం భక్తిం చ కేశవే॥
తేభ్యః పరమసంతుష్టః ప్రీత్యుజ్జృంభితలోచనః।
ముహాధనాని వాసాంసి దదౌ హారాన్మహామనాః॥
రశీలుడగు పరీక్షిన్మహారాజు అక్కడక్కడ జనులు మహాత్ములగు తన పూర్వీకుల కీర్తిని, శ్రీకృష్ణుని మహిమను చాటే గాథలను, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రముయొక్క తేజస్సునుండి శ్రీకృష్ణుడు తనను రక్షించిన సంగతిని, యాదవులకు పాండవులకు గల మైత్రిని, పాండవులకు శ్రీకృష్ణునియందు గల భక్తిని వర్ణించుచుండగా, వారి దగ్గర కూర్చుని వినెడివాడు. ఆ వృత్తాంతముల వలన ఆయన పరమానందమును పొంది, ప్రేమతో ఉప్పొంగే కన్నులు గలవాడై, వారికి బహుమూల్యములగు వస్త్రములను మరియు హారములను పంచి పెట్టేడివాడు.
నారద్య పారషద సేవనసఖ్యదౌత్య
వీరసనానుగమనస్తవనప్రణామమ్।
స్నిగ్దేషు పాండుషు జగతణతిం చ విష్ణోః
భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే॥
శ్రీకృష్ణభగవానుడు సర్వలోకపూజ్యుడే అయిననూ, పాండవుల ప్రేమకు వశుడై వారికి సారథి పనిని చేసెను. సభాపతి కార్యమును చేసి పెట్టెను. వారితో స్నేహమును చేసి వారి మనస్సునకు అనుకూలముగా వర్తించుట మాత్రమే గాక, వారికి రాయబారకార్యమును నెరపెను. ఆయన రాత్రి కత్తిని చేతబట్టి వారికి పహరా కాసిన సందర్భములు కూడ లేకపోలే దు. ఆయన వారి వెంట వెంటనే నడిచి, వారిని స్తుతించి నమస్కారమును కూడ చేసెడివాడు. ఈ విషయములను విన్న పరీక్షిన్మహారాజునకు ఆయన పాదపద్మములయందు భక్తి కలిగెడిది.
తస్యైవం వర్తమానస్య పూర్వేషాం వృత్తిమన్వహమ్।
నాతిదూరే కిలాశ్చర్యం యదాసీత్తన్నిబోధ మే॥
ఈ విధముగా పరీక్షిన్మహారాజు తన పూర్వీకులగు పాండవుల సద్గుణములననుసరించి రాజ్యమునేలుచుండగా, తక్కువ కాలములోననే ఒక అద్భుతమగు ఘటన జరిగినది. దానిని నేను చెప్పెదను. తెలుసుకొనుము.
ధర్మః పదై కేన చరన్విచ్చాయముపలభ్య గామ్।
పృచ్ఛతి స్మాశ్రువదనాం వివతామివ మాతరమ్॥
ధర్మము ఎద్దు రూపమును దాల్చి ఒక కాలితో కుంటుతూ నుండగా, బిడ్డను పోగొట్టుకున్న తల్లివలె ముఖములో కళ లేనిదై ఏడుస్తూ ఉన్న గోరూపములో నున్న పృథివిని చూచెను.
ధర్మ ఉవాచ ।
కచ్చిద్బధ్ర నామయమాత్మనస్తే
విచ్చాయో సీ మౌయతేషన్ముఖేన।
ఆలక్షయే భవతీమంతరాధిం
దూరే బంధుం శోచసి కంచనాంబ॥
ధర్మము ఇట్లు పలికేను: ఓ తల్లీ! మంగళస్వరూపురాలా! నీ శరీర మునకు క్షేమమేనా? నీ ముఖము కొంచెము వాడి శోభను కోల్పోయినది. నీ మనస్సులో బెంగ ఉన్నదని సోకు తోచుచున్నది, ఎవరేని దూరపు బంధువును గురించి శోకించుచున్నావో యేమి?
పాదైర్న్యూనం శోదసీ మైకసాద-
మాత్మానం పో వృషభైర్భోక్ష్యమాణమ్ ।
ఆహో సుదీస్ హృతయజ్ఞభోగాన్
ప్రజా ఉతస్వీన్మఘవత్యవర్షతి ॥
మూడు పాదములను కోల్పోయి ఒకే పాదముతోనున్న నన్ను గురించి దుఃఖించుచున్నావా? లేక, నిన్ను భవిష్యత్తులో అధర్మజీవనులగు రాజులు పాలించబోతున్నందులకు దుఃఖించుచున్నావా? లేక, మానవులు యజ్ఞములను మానివేయుటచే హవిర్భాగములను కోల్పోయిన దేవతల గురించి దుఃఖించుచున్నావా? లేక, ఇంద్రుడు వర్షించుటను ఆపి వేసినం దులకు దుఃఖించుచున్నావా?
అరక్ష్యమాణాః స్త్రీయ ఉర్వి బోలాన్
శోచస్యథో పురుషాదైరివార్తాన్।
వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మ-
ణ్యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్యాన్॥
ఓ పృథివీ! స్త్రీలను రక్షించని భర్తలను చూచి దుఃఖించుచు స్నావా? లేక, రాక్షసుల వలె పిల్లలను కష్టములకు గురిచేయు మానవు లను చూచి దుఃఖించుచున్నావా? లేక,- దురాచారపరులగు బ్రాహ్మణుల వద్దనున్న విద్యను గాంచి దుఃఖించుచున్నావా? లేక, బ్రాహ్మణిద్వేషులగు రాజులను సేవించే ఉత్తమబ్రాహ్మణులను చూచి శోకించుచున్నావా?
కిం క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాణి వా తెరవరోపితాని।
ఇతస్తతో వాశనపానవాసస్నానవ్యవాయోన్ముఖజీవలోకమ్॥
అధర్మముతో నిండియున్న దుష్టక్షత్రియులను చూచి శోకించుచు న్నావా? లేక, వారు నాశనము చేసి విడిచి పెట్టిన రాజ్యములను చూచి దుఃఖించుచున్నావా? లేక, భోజనము, పానము, వస్త్రము, స్నానము, స్త్రీసహవాసములలో విధిని షేధములను ప్రక్కనబెట్టి ప్రవర్తిల్లే మానవులను చూచి దుఃఖించుచున్నావా?
యద్వాంబ తే భూరిభరావతారకృతావతారస్య హరేర్ధరిత్రి।
అంతర్హితస్య స్మరతీ విసృష్టా కర్మాణి నిర్వాణవిలంబితాని॥
ఓ పృథివీమాతా! అట్లుగాక, నీ పెనుభారమును పోగొట్టుటకు అవ తరించి ఇప్పుడు నిన్ను విడిచి అంతర్ధానమును చెందిన శ్రీహరియొక్క లీలలను స్మరించి దుఃఖించుచున్నావా? ఆ లీలలు స్మరించువారికి మోక్ష మునిచ్చును గదా!
ఇదం మమాచక్ష్వ తవాధిమూలం
వసుంధరే యేన వికర్శితాసి।
కాలేన వా తే బలినాం బలీయసా
సురార్చితం కిం హృతమంబ సౌభగమ్ ॥
ఓ పృథివీమాతా! నీవు మనోవ్యాధిచే చాల చిక్కియున్నావు. నీ మనోవ్యాధికి గల కారణమును నాకు చెప్పుము. బలవంతులకంటె బలవత్త రమగు కాలము దేవతలచే పూజించబడే నీ సౌభాగ్యమును ఒకచో అప రించినదా యేమి?
ధరణ్యువాచ ।
భవాన్ హి వేద తత్సర్వం యనాం ధర్మానుపృచ్చసి ।
చతుర్భిర్వర్తసే యేన పాదైర్లోకసుఖావహైః ॥
పృథివి ఇట్లు పలికెను: ఓ ధర్మమా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములన్నియు నీకు తెలిసినవే సుమా! నీవు శ్రీహరియొక్క అనుగ్రహ ముచే నాలుగు పాదములతో నున్నవాడవై మానవులకు సుఖముల నొసగె దవు.
సత్యం శౌచం దయా క్షాంతీస్త్యాగస్సంతోష ఆర్జవమ్ ।
శమో దమస్తపస్సామ్యం తితిక్షాపరతిః శ్రుతమ్ ॥
జ్ఞానం విరక్తి రైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః ।
స్వాతంత్యం కౌశలం కాంతిర్దైర్యం మార్దవమేవ చ ॥
ప్రాగల్భ్యం ప్రశ్రయశ్శీలం సహ ఓజో బలం భగః ।
గాంభీర్యం స్థైరమాస్తిక్యం కీర్తిర్మానో నహంకృతిః ॥
ఏతే చాన్యే చ భగవన్నిత్యా యత్ర మహాగుణాః ।
ప్రార్థ్యా మహత్త్వమిచ్ఛద్భిర్న వియంతీ స్మ కర్హిచిత్ ॥
తేనాహం గుణపాత్రేణ శ్రీనివా సేన సాంప్రతమ్ ।
శోచామ్ రహీతం లోకం పాపనా కలిగేక్షితమ్ ॥
ఓ పూజ్యా! సత్యము, శౌచము, దయ, సహనము, త్యాగము, సంతృప్తి, ఋజుస్వభావము, మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, సమత్వము, కష్టసహిష్ణుత, క్రియలనుండి ఉపసంహారము, శాస్త్రవి జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, వైరాగ్యము, ఈశ్వరభావము, పరాక్రమము, తేజ స్సు, సామర్థ్యము, స్మరణము, స్వతంత్రత, నైపుణ్యము, కాంతి, ధైర్యము, మృదుస్వభావము, అతిశయించిన ప్రతిభ, వినయము, సాధుస్వభావము, సాహసము, ఉత్సాహము, బలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థిరత్వ ము, శ్రద్ద, కీర్తి, పూజ్యత్వము, అహంకారము లేకుండుట మొదలైన అనేక సహజగుణములకు శ్రీహరి నిధానము. మహత్త్వాకాంక్ష గలవారు ఈ గుణ ములను కోరుచుందురు. ఇవి ఆయనయందు ఏ కాలమునందైననూ క్షీణించవు. అట్టి శ్రీహరి ఇప్పుడు ఈ లోకమునందు లేడు. ఈ లోకము పై పాప హేతువగు కలియొక్క చూపు పడినది. నేనీ లోకమును గురించి దుఃఖించు చున్నాను.
ఆత్మానం చానుశోచామి భవంతం చామోత్తమమ్ ।
దేవాన్ పితృనృషీనాధూన్సర్వాన్ వర్ణాంస్తథాశ్రమాన్॥
నేను నా గురించి మాత్రమే గాక, దేవతోత్తముడవగు నిన్ను, దేవత లను, పితరులను, మహర్షులను, సాధుపురుషులను, అన్ని వర్ణముల వారిని మరియు ఆశ్రమముల వారిని ఉద్దేశించి దుఃఖించుచున్నాను.
బ్రహ్మాదయో బహుతిథం యదపొంగమోక్ష-
కామాస్తపస్సమచరన్ భగవతపన్నా ।
సా శ్రీస్వవాసమరవిందవనం విహాయ
యత్పాదసౌభగమలం భజతే నురక్తా ॥
బ్రహ్మ మొదలగు పూజ్యులు లక్ష్మీదేవియొక్క కరుణాకటాక్షసాత మును కోరువారై ఆమెను శరణు పొంది చిరకాలము తపస్సును చేయు చుందురు. అట్టి లక్ష్మి తన నివాసస్థానమగు పద్మవనమును వి పెట్టి, ఆ పరమేశ్వరుని పాదపద్మముల సౌభాగ్యమును అతిశయించిన అనురాగ ముతో సేవించుచున్నది.
తస్యాహమజ్జకులిశాంకుశ కేతుకేతైః
శ్రీమత్పదైర్భగవతస్సమలంకృతాంగీ ।
త్రీనత్యరోచ ఉపలభ్యతతో విభూతిం
లోకాన్ స మాం వ్యసృజదుత్స్మయతీం తదంతే॥
నేను అట్టి శ్రీకృష్ణభగవానునియొక్క శోభాయుకములగు పాదములయందలి పద్మము, వజ్రము, అంకుశము, ధ్వజము అనునాటి ముద్ర లచే అలంకరించబడిన దేహము గలదాననై, ఆ భగవానుని నుండి సంపదను పొంది ముల్లోకములను తలదన్ని ప్రకాశించెడి దానను కానీ, ఆ సంపద అంతరించినది. గర్వించియున్న నన్ను ఆ భగవానుడు విడిచి పెట్టినాడు.
యో వై మూతిభరమాసురవంశరాజ్ఞా
మక్షౌహిణీశతమపొనుదదోత్శతంత్రః ।
సంపాదయన్ యదుషు రమ్యమబిభ్రదంగమ్ ॥
స్వతంత్రుడగు ఆ పరమేశ్వరుడు పెనుభారముగా తయారైన రాక్ష సవంశములకు చెందిన రాజుల వంద అక్షౌహిణీలను నశింప జేసెను. నీ పాదములు లోపించియుండగా, ఆయన యాదవవంశములో సుందరరూ పుడై అవతరించి పురుషకారముచే నిన్ను (ధర్మమును) తనయందు పూర్ణ రూపముతో నిలబెట్టెను.
కా వా స హేత విరహం పురుషోత్తమస్య
ప్రేమావలోకరుచిరస్మితవల్గుజల్పైః ।
స్థై ర్యం సమానమహరన్మధుమానినీనాం
రోమోత్సవో మమ యదంఘివిటంకితాయాః ॥
పురుషోత్తముడగు శ్రీకృష్ణుని విరహమును ఎవతే సహించగ ల్లును? ఆయన తన ప్రేమతో నిండిన చూపులతో, ప్రీతికరమగు చిరున వ్వుతో మరియు మధురమగు కబుర్లతో మధువనమునందలి సత్యభామ మొదలగు మానవతుల గర్వమును మరియు అభిమానమును తొలగించే ను. ఆయన పాదముల చిహ్నములు పడగానే నాకు పులకాంకురములు (ప చ్చని గడ్డి, పంటలు మొదలగునవి) ఉదయించును.
తయోరేవం కథయతోః పృథివీధర్మయోస్తదా ।
పరీక్షిన్నామ రాజర్షిః ప్రాప్తః ప్రాచీం సరస్వతీమ్॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే షోడశోఽధ్యాయః॥
ఆ పృథివీధర్ములు ఈ విధముగా సంభాషించుచుండగా, పరీక్షిత్తు అని ప్రసిద్ధిని గాంచిన రాజర్షి తూర్పువైపు ప్రవహించే సరస్వతీనదియొక్క తీరమునందున్న కురుక్షేత్రమును చేరెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పదునారవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
Mahārāja Parīkshit rules the earth with supreme righteousness and chivalry, establishing virtue and protection for all living beings throughout his empire. While traveling across his realm, the king encounters a harrowing sight: a cruel shūdra dressed as a king abusing a bull standing on a single leg and a cow weeping in distress, who are revealed to be the personifications of Dharma, the deity of religion, and Bhūmi, the mother earth.