భాగవత మహా పురాణము
6 - షష్ఠోఽధ్యాయః
సూత ఉవాచ ।
ఏవం నిశమ్య భగవాన్ దేవర్షేర్జన్మ కర్మ చ ।
భూయః పప్రచ్ఛ తం బ్రహ్మన్వ్యాసస్సత్యవతీసుతః ॥
సూతుడు ఇట్లు పలికెను: ఓ శౌనకమహర్షీ! సత్యవతియొక్క పుత్రుడు, పూజనీయుడు అగు వ్యాసమహర్షి దేవర్షియగు నారదుని జన్మ వృత్తాంతమును, ఆయన చేసిన కర్మలను ఈ విధముగా విని, మరల ఇట్లు ప్రశ్నించెను.
వ్యాస ఉవాచ ।
భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిస్తవ ।
వర్తమానో వయస్యొద్యే తతః కీమకరోద్భవాన్ ॥
వ్యాసుడు ఇట్లు పలికేను: నీకు జ్ఞానమును ఉపదేశించిన ఆ యతులు దూరదేశమునకు వెళ్లిపోగా, పిన్న వయస్సులోనున్న నీవు ఆ తరువాత ఏమి చేసితివి?
స్వాయంభువ కయా వృత్త్యా వర్తితం తే పరం వయః ।
కథం చేదముదస్రాక్షీః కాలే ప్రాప్తే కలేవరమ్ ॥
ఓ బ్రహ్మపుత్రా! నీయొక్క తరువాతి వయస్సు ఏ విధముగా గడి చినది? మరణకాలము సంప్రాప్తమైనప్పుడు నీవు ఏ విధముగా దేహ మును విడిచి పెట్టితివి?
ప్రాకల్పవిషయామేతాం స్మృతిం తే సురసత్తమ ।
న హ్యేష వ్యవధాత్కాల ఏష సర్వనిరాకృతిః ॥
ఓ దేవోత్తమా! సర్వమును కబళించి వేసే ఈ కాలము గడచిపో యిన కల్పమునకు సంబంధించిన నీ స్మృతిని చెరిపి వేయలేదు సుమా!
నారద ఉవాచ ।
భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిర్మమ ।
వర్తమానో వయస్యాద్యే తత ఏతదకారషమ్ ॥
నారదుడు ఇట్లు పలికెను: నాకు జ్ఞానమునుపదేశించిన యతులు దూరదేశము వెళ్లిన తరువాత పిన్న వయస్సులోనున్న నేను దీనిని (చేప్ప బోవు దానిని) చేసితిని.
ఏకాత్మజా మే జననీ యోషిన్మూఢా చ కింకరీ ।
మయ్యాత్మజ్వేనన్యగతో చక్రే స్నేహానుబంధనమ్ ॥
నా తల్లికి నేను ఒక్కడినే పుత్రుడను. అబల, చదువు రానిది మరియు దాసి అగు నా తల్లి మరియొక ఆశ్రయము లేని నన్ను తన ప్రేమతో కట్టి వేసినది.
స్యాస్వతంత్రా న కల్పాసీద్యోగక్షేమం మమేచ్చతీ ।
ఈశస్య హి వశే లోకో యోషా దారుమయీ యథా ॥
ఆమె నా యోగక్షేమములను కోరునదే అయిననూ, అస్వతంత్రురాలు అగుటచే ఆమెకు సామర్థ్యము లేకుండెను. ఏలయనగా, మానవుడు ఈశ్వరునిచే ఆడించబడే ఆటబొమ్మ వంటివాడు.
అహం చ తద్బ్రహ్మకుల ఊషివాంస్తదవేక్షయా ।
దిగ్దేశకాలావ్యుత్పన్నో బాలకః పంచహాయనః ॥
దిక్కులు, దేశము మరియు కాలము అనే పరిజ్ఞానము అయిదు సంవత్సరముల వయస్సు గల బాలకుడనగు నేను కూడా యొక్క ప్రేమానుబంధమునకు కట్టుబడి ఆ బ్రాహ్మణుల బస్తీలో నివసించితిని.
ఏకగా నిర్గతాం గేహాద్దుహంతీం నిశి గాం పథి ।
సర్వోదశత్పదా స్పృష్టః కృపణాం కాలచోదితః ॥
ఒకనాడు ఆ దీనురాలు ఆవు పాలు పితుకుటకై ఇంటినుంచి బయలుదేరి వెళ్లుచుండగా, దారిలో పొమునకు ఆమె కాలు తాకగా అది మృత్యువుచే ప్రేరేపించబడి ఆమెను కాటు వేసెను.
తదా తడహమీశస్య భక్తానాం శమభీప్సతః ।
అనుగ్రహం మన్యమానః ప్రాతిం దిశముత్తరామ్ ॥
అప్పుడు అది భక్తుల కల్యాణమును కోరే ఈశ్వరుని అనుగ్రహమేనని భావించి, నేను ఉత్తరదిక్కు వైపునకు పయనించితిని.
స్పీతాన్ జనపదాంస్తత్ర పురగ్రామప్రజాకరాన్ ।
ఖేటఖర్వటవాటీశ్చ వనాన్యుపవనాని చ ॥
చిత్రధాతువిచిత్రాదీనిభభగ్నభుజద్రుమాన్ ।
జలాశయాన్ శివజలాన్నలినీస్సుర సేవితాః ॥
చిత్రస్వ నైః పత్రరథైర్విభ్రమద్బ్రమరిశ్రియః ।
నలవేణుశరస్తంబకుశకీచకగహ్వరమ్ ॥
ఏక ఏవాతియాతోహమద్రాక్షం విపినం మహత్ ।
ఘోరం ప్రతిభయాకారం వ్యాలోలూకశివాజిరమ్ ॥
సిరిసంపదలతో నలరారు రాజ్యములను, రాజధానీ నగరములను, గ్రామములను, గొల్లపల్లెలను, గనులను, వ్యవసాయగ్రామములను, గిరిజ నుల నివాసములను, ఉద్యానవనములను, సహజములగు అడవులను, సామాజిక అడవులను, రంగు రంగుల ధాతువులతో విచిత్రముగా నున్న పర్వతములను, ఏనుగులచే విరువబడిన కొమ్మలు గల చెట్లను, పవిత్రజల ములు గల సరస్సులను, చిత్రమగు ధ్వనులను చేసే పక్షులతో మరియు వేగముగా తిరుగాడే తుమ్మెదలతో శోభిల్లుతూ దేవతలచే సేవించబడే పెద్ద చెరువులను ఒంటరిగా అధిగమించి, నేను నల అనే అడవి గడ్డితో, గట్టి వెదురు పొదలతో, రెల్లు గుబుళ్లతో, దర్భ గడ్డితో మరియు బొంగు వేదుళ్లతో చొరబడ వీలులేనిది, సహింప శక్యము కాని భయంకరమగు రూపము గలది, పాములకు గుడ్లగూబలకు నక్కలకు క్రీడాస్థానమైనది అగు పెద్ద అడవిని చూచితిని.
పరిశ్రాంతేంద్రియాత్మాహం తృటరీతో బుభుక్షితః ।
స్నాత్వా పీత్వా ప్రదే నద్యా ఉపస్పృష్టో గతశ్రమః ॥
అలసి సొలసిన ఇంద్రియములు మరియు దేహము గల నేను అధికమగు దాహముతో మరియు ఆకలితో బాధపడుతూ, నదీగర్భములోని కుండములో స్నానము చేసి, నీటిని త్రాగి, ఆచమనమును చేసి అలసటను పోగొట్టుకుంటిని.
తస్మిన్నిర్మనుజేఽరణ్యే పిప్పలోపస్థ ఆశ్రితః ।
ఆత్మనాత్మానమాత్మస్థం యథాశ్రుతమచింతయమ్ ॥
మనుజులు లేని ఆ అడవిలో రావిచెట్టు మొదట్లో కూర్చుని మనస్సుతో హృదయమునందు ఆత్మరూపముగా విరాజిల్లే ఈశ్వరుని ధ్యానించితిని.
ధ్యాయతశ్చరణాంభోజం భావనిర్జితచేతసా ।
ఔత్కంఠ్యాశ్రుకలాక్షస్య హృద్యాసీన్మే శనైర్హరిః ॥
నేను భక్తితో వశీకృతమైన మనస్సుతో భగవంతుని పొందవలెననే ఉత్కటమగు లాలసచే నీటిని జరజర రాల్చే కన్నులు గలవాడనై, ధ్యానము చేయుచుండగా, నా హృదయములో శ్రీహరి మెల్లగా ఆవిర్భవిం చెను.
ప్రేమాతిభరనిర్భిన్నపులకాంగోఽతినిర్వృతః ।
ఆనందసంప్లవే లీనో నాపశ్యముభయం మునే ॥
ఓ మహర్షీ! ప్రేమాతిశయముచే నా శరీరముపైని రోమములు గగుర్పాటును చెందినవి. నేను అతిశయించిన శాంతిని పొందితిని. ఆనందముయొక్క మహాప్రవాహములో మునిగియున్న నేను ధ్యాతృ-ధ్యేయభేదమునకు అతీతుడనైతిని.
రూపం భగవతో యత్తన్మనఃకాంతం శుచాపహమ్ ।
అపశ్యన్ సహసోత్తస్థే వైక్లబ్యాద్దుర్మనా ఇవ ॥
మనస్సునకు అభీష్టమైనది, దుఃఖమును పోగొట్టునది అగు భగవానుని ఆ రూపము నాకు మరల కనబడలేదు. నేను వెంటనే తొట్రుపాటు పడి వికలమైపోయిన మనస్సుతో లేచి నిలబడితిని.
దిదృక్షుస్తదహం భూయః ప్రణిధాయ మనో హృది ।
వీక్షమాణోఽపి నాపశ్యమవీతృప్త ఇవాతురః ॥
నేను ఆ రూపమును మరల చూడగోరి మనస్సును హృదయము నందు ఏకాగ్రము చేసి చూచితిని. కాని, ప్రయోజనము లేకుండెను. ఆ రూపము విషయములో విశేషమగు తృప్తి నాకు కలుగలేదు. నేను రోగిని వలె అయితిని.
ఏవం యతంతం విజనే మామహాగోచరో గిరామ్ ।
గంభీరశ్లక్ ష్ణయా వాచా శుచః ప్రశమయన్నివ ॥
ఈ విధముగా నిర్జనమగు అడవిలో ప్రయత్నమును చేయుచున్న నన్ను ఉద్దేశించి, వాక్కులకు గోచరుడు కాని భగవానుడు గంభీరము మరియు మధురము అగు వాక్కుతో నా దుఃఖమును శాంతింపజేయుచు న్నోడా యన్నట్లు ఇట్లు పలికెను.
హంతాస్మిన్ జన్మని భవాన్మా మా ద్రష్టుమీహార్షతి ।
అవిపక్వకషాయాణాం దుర్ధర్శోఽహం కుయోగినామ్ ॥
ఓయీ వెర్రివాడా! నీవు ఈ జన్మలో నన్ను చూచుటకు అర్హుడవు కావు. కొద్దిపాటి యోగము (తాత్కాలికమగు భక్తి) వలన కామాదిదోషముల న్నియు నశించవు. అట్టి స్థితిలో నా దర్శనము దుర్లభము.
సకృద్యద్దర్శితం రూపమేతత్కామాయ తేఽనఘ ।
మత్కామశ్శన కైసాధుస్సర్వాన్ముంచతి హృచ్ఛయాన్ ॥
ఓ పాపవిహీనుడా! నీయందు నాపై అనురాగము ఉదయించుటకై నా రూపమును ఒకే ఒకసారి చూపించితిని, నాయందు అనురాగము గల సాధుపురుషుడు మెల్లమెల్లగా సకలకామనలను విడిచి పెట్టును.
సత్సేవయాఽదీర్ఘయా తే జాతా మయి దృడా మతిః ।
హీత్వాఽవద్యమిమం లోకం గంతా మజ్జనతామసి ॥
నీవు కొద్ది కాలము సాధుపురుష సేవను చేయుటచే, నీ మనస్సు నాయందు స్థిరముగా నిలుచుచున్నది. నీవీ నిందార్తమగు దేహమును విడిచి నా పార్షదస్థానమును పొందగలవు.
మతిర్మయి నిబద్దేయం న విపద్యేత కర్హిచిత్ ।
ప్రజాసర్గనిరోధేఽపి స్మృతిశ్చ మదనుగ్రహాత్ ॥
నాయందు స్థిరముగా నిలిచే ఈ నీ మనస్సు ఒకనాడైననూ ఆ స్థితినుండి చలించదు. ఈ సృష్టి విలీనమై పోయిన ప్రళయకాలమునందు కూడా నా అనుగ్రహము వలన నీకు సర్వము స్మృతిగోచరమగుచునే యుండును.
ఏతావదుక్త్వోపరరామ తన్మహద్-
భూతం నభోలింగమలింగమీశ్వరమ్ ।
అహం చ తస్మై మహతాం మహీయసే
శీర్ష్ణాఽవనామం విదధేఽనుకంపితః ॥
ఇంద్రియములకు మనస్సునకు గోచరము కాని, సర్వనియంత యగు ఆ పరమాత్మ ఆకాశమునందు శబ్దరూపముగా వ్యక్తమై ఇంతమా త్రము పలికి విరమించెను. ఈ విధముగా అనుగ్రహించబడిన నేను గొప్ప వారికంటే గొప్పవాడగు (నిరతిశయబృహత్ అగు పరంబ్రహ్మ) భగవానుని కొరకు తలను వంచి నమస్కరించితిని.
నామాన్యనంతస్య హతత్రపః పఠన్
గుహ్యాని భద్రాణి కృతాని చ స్మరన్ ।
గాం పర్యటంస్తుష్టమనా గతస్పృహః
కాలం ప్రతీక్షన్విమరో విమత్సరః ॥
నేను అనంతుని రహస్యములు మరియు కల్యాణకరములు అగు నామములను సంకోచమును విడిచి కీర్తిస్తూ, లీలలను స్మరిస్తూ, కోరికలు తొలగి పోవుటచే సంతోషముతో నిండిన మనస్సు గలవాడనై, మదమాత్సర్యములు లేనివాడనై, కాలమును ప్రతీక్షిస్తూ భూమిని పర్యటించు చుంటిని.
ఏవం కృష్ణమతేర్భృహ్మన్నసక్తస్యామలాత్మనః ।
కాలః ప్రాదురభూత్కాలే తడిత్సౌదామనీ యథా ॥
ఓ వ్యాసమహర్షీ! ఈ విధముగా స్వచ్చమగు అంతఃకరణము గల నేను సంసారమునందు ఆసక్తి లేనివాడనై శ్రీకృష్ణునియందు మనస్సును నిలిపి జీవించుచుండగా, సమయము రాగానే మృత్యుదేవత మాలయొక్క ఆకారములోనుండే మెరుపు వలె ఆవిర్భ వించెను.
ప్రయుజ్యమానే మయి తాం శుద్దాం భాగవతీం తనుమ్ ।
ఆరబ్ధకర్మనిర్వాణో న్యపతత్పాంచభౌతికః ॥
భగవంతుడు తాను చెప్పిన విధముగా నన్ను శుద్దమగు ఆ భగవత్పార్ష దస్థానమునకు గొనిపోయే సమయము రాగానే, ఈ పాంచభౌతికదేహమును ఆరంభించిన కర్మ పరిసమాప్తమగుటచే, అది నేల రాలేను.
కల్పాంత ఇదమాదాయ శయాన్వేంఽభస్యుదన్వతః ।
శిశయిషోరనుప్రాణం వివిశ్వేంతరహం విభోః ॥
కల్పము పూర్తి కాగానే నారాయణుడు ఈ జగత్తును తనలోనికి ఉపసంహరించి, ప్రళయసముద్రముయొక్క నీటియందు నిద్రించగా, ఆయనలో తన క్రియాశక్తితో సహా నిద్రించగోరే హిరణ్యగర్భుని (బ్రహ్మగారి) లోపల నేను ప్రవేశించితిని.
సహస్రయుగపర్యంత ఉత్థాయేదం సిసృక్షతః ।
మరీచిమిశ్రా ఋషయః ప్రాణేభ్యోఽహం చ జజ్ఞిరే ॥
వేయి మహాయుగములు (నాలుగు యుగములు కలిసి ఒక మహా యుగము) గడచిన పిదప నిద్ర లేచి, ఈ జగత్తును సృష్టించుటకు సంకల్పించిన బ్రహ్మగారి ఇంద్రియములనుండి నేను మరియు మరీచి మొదలగు మహర్షులు జన్మించిరి.
అంతర్బహిశ్చ లోకాంస్త్రీన్పర్యేమ్యస్కందితవ్రతః।
అనుగ్రహాన్మహావిష్ణోరవిఘాతగతిః క్వచిత్ ॥
శ్రీమహావిష్ణువుయొక్క అనుగ్రహముచే నేను భగవద్భజనము అనే వ్రతమును విడువకుండగా, మూడు లోకములయందు లోపల మరియు బయట ఎక్కడనైననూ ఆటంకము లేని ప్రవేశము గలవాడనై పర్యటించు చుందును.
దేవదత్తామిమాం వీణాం స్వరబ్రహ్మవిభూషితామ్ ।
మూర్చయిత్వా హరికథాం గాయమానశ్చరామ్యహమ్ ॥
స్వరబ్రహ్మాయే అలంకారముగా గల ఈ వీణను నొకు ఈశ్వరుడు ఇచ్చినాడు. దీనియందు నేను ఆరోహళి - అవరోహణస్వరములను పనిచేసి, శ్రీహరీయొక్క గాథను పాడుకుంటూ సంచరించెదను.
ప్రగాయతస్స్వవీర్యాణి తీర్థపాదః ప్రియశ్రవాః।
ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి ॥
పరమేశ్వరుని పాదములనుండియే సమస్తతీర్థములు ఉద్గమించినవి. ఆయన కీర్తి గానము చేయుటకు చాల ప్రీతికరముగ నుండును. ఆయన వీరగాథలను గానము చేసే నా మనస్సులో ఆయన వెంట వెంటనే ఆహా తుని వలే సాక్షాత్కరించు చుండును.
ఏతద్ద్యాతురచిత్తానాం మాత్రాస్పర్శేచ్చయా ముహుః ।
భవసింధుప్లవో దృష్టో హరిచర్యానువర్ణనమ్ ॥
మానవుల హృదయములు విషయభోగములయందలి తృష్ణచే పీడించ బడుచుండును. అట్టి పొగలకు మరల మరల చేయబాడే ఆ శ్రీహరి లీలలు వర్ణనము సంసారసముద్రమును దాటించే నావయని నా అనుభావము.
యవ్యదిభిర్యోగపథైః కామలో భహతో ముహుః ।
ముకుంద సేవ యద్వత్తథాత్మాఽద్ధా న శామ్యతి ॥
మానవుని మనస్సు కామలోభములచే పలుపర్యాయములు గాయపడి యున్నది. అట్టి మనస్సునకు శ్రీహరియొక్క సేవచే లభించేప్రత్యక్షమగు శాంతి వంటి శాంతి యమనియమములు మొదలగు యోగ మార్గములచే లభించదు.
సర్వం తద్దమాఖ్యాతం యత్పృష్టోఽహం త్వయానఘ ।
జన్మకర్మరహస్యం మే భవతశ్చాత్మతోషణమ్ ॥
పాపవిహీనుడవగు ఓ వ్యాసా! నా జన్మ మరియు సాధనల రహ స్యమును గురించి నీవు నన్ను ప్రశ్నించితివి. నీ మనస్సునకు సంతోష మును కలిగించే ఆ వివరములనన్నింటినీ నేను నీకు చెప్పితిని.
సూత ఉవాచ ।
ఏవం సంభాష్య భగవాన్నారదో వాసవీసుతమ్ ।
ఆమంత్యృ వీణాం రణయన్ యయౌ యాదృచ్ఛికో మునిః ॥
సూతుడు ఇట్లు పలికెను: తనకంటూ ఒక విశిష్ట ప్రయోజనము లేని, పూజ్యుడగు నారదమహర్షి సత్యవతీసూనుడగు వ్యాసునితో ఈ విధముగా సంభాషించి, ఆయన అనుమతిని తీసుకొని, వీణను వాయించుకుంటూ వెళ్లాను.
అహో దేవర్షిర్ధన్యోఽస్యం యత్కీర్తిం శార్ జ్గధన్వనః ।
గాయన్మాద్యన్నిదం తంత్యృ రమయత్యాతురం జగత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే షష్టోఽధ్యాయః. ॥
ఆశ్చర్యము! శార్జ్ఞమనే ధనస్సు గల శ్రీహరియొక్క కీర్తిని వీణతో గానము చేస్తూ తాను ఆనందిస్తూ, తాపత్రయతప్తమగు ఈ జగత్తును ఆనం దింపజేసే ఈ దేవర్షి ధన్యుడు.
శ్రీమద్బాగవత మహాపురాణములో ఆరవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 6 of the Bhāgavata Mahā Purana is as follows:
Continuing his uplifting narration, Nārada relates how after the passing of his mother he departed into the solitude of the forest, where through intense meditation he received a momentary direct vision of Lord Vāsudeva that filled his soul with ecstatic love. Although the Lord withdrew His form to intensify Nārada's longing, He promised that Nārada would remember Him perpetually and obtain a divine spiritual body at the end of the cosmic cycle, thereby inspiring Vyāsadeva to write Śrīmad-Bhāgavatam to bestow the ultimate spiritual solace upon all beings.