భాగవత మహా పురాణము
15 - పంచదశోఽధ్యాయః
సూత ఉవాచ ।
ఏవం కృష్ణసఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః ।
నానాశంకాస్పదం రూపం కృష్ణవిశ్లేషకర్శితః ॥
సూతుడు ఇట్లు పలికెను: శ్రీకృష్ణుని వియోగముచే దుఃఖించు చున్న, శ్రీకృష్ణుని ప్రియమిత్రుడగు అర్జునుని రూపము చూడగనే అనేక ములగు ఆశంకలకు తావునిచ్చుచుండెను. కావుననే, అన్నగారగు ధర్మరాజు ఆ రూపమును చూచి పలువిధముల ప్రశ్నలను వేసెను.
శోకేన శుష్యద్వదనహృత్సరోజో హతప్రభః ।
విభుం తమేవానుధ్యాయన్నాశక్నోత్ప్రతిభాషితుమ్ ॥
దుఃఖముచే అర్జునుని హృదయము నిండి, పద్మమువంటి ముఖము వాడిపోయెను. ఆతని ముఖములో కాంతి లేదు. ఆతడు శ్రీకృష్ణ . ప్రభుని గురించి మాత్రమే ఆలోచిస్తూ, బదులు చెప్పలేక పోయేను.
కృచ్ఛ్రేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయోః ।
పరోక్షేణ సమున్నద్దప్రణమౌతంత్యకాతరః ॥
సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్ ।
నృపమగ్రజమిత్యాహ బాష్పగద్దదయా గిరా ॥
అర్జునునకు దుఃఖముచే కన్నీరు ఉబుకుచుండెను. ఆతడు దానిని చేతితో తుడుచుకొని, అతికష్టముతో కన్నీరు ప్రవహించకుండగా ఆపుకొనే ను. కంటికి కానరాని శ్రీకృష్ణునియందలి అతిశయించిన ప్రేమ వలన పుట్టిన ఉత్కంఠచే కల్లోలితహృదయుడై ఉన్న అర్జునుడు రథమును తోలుట మొదలగు సందర్భములలో శ్రీకృష్ణునితో తనకు గల చనువును, ఆయన చూపిన స్నేహభావమును, హితైషిత్వమును గుర్తు చేసుకొను చూ, కన్నీటితో బొంగురు పోయిన కంఠముతో అన్నగారగు ధర్మరాజును ఉద్దేశించి ఇట్లు పలికెను.
అర్జున ఉవాచ ।
వంచితో హం మహారాజ హరిణా బంధురూపిణా ।
యేన మే పహృతం తేజో దేవవిస్మాపనం మహత్ ॥
అర్జునుడిట్లు పలికెను: ఓ మహారాజా! బంధువు రూపములో నున్న శ్రీహరి నన్ను మోసగించినాడు. దేవతలకు కూడ ఆశ్చర్యమును గొలిపే నా గొప్ప తేజస్సును ఆయన అపహరించినాడు.
యస్య క్షణవియోగేన లోకో హ్యప్రియదర్శనః ।
ఉక్థేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథా ॥
ప్రాణము పోగానే ఈ దేహము శవము అని వ్యవహరింప బడును. అదే విధముగా, శ్రీకృష్ణుని క్షణమాత్రవియోగముచే ఈ లోకములో చూచి ఆనందించ దగినది ఏమీ కానరాదు.
యత్సంశ్రయార్దూపదగేహముపొగతానాం ।
రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానామ్ ।
తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః
సజ్జీకృతేన ధనుషా వధిగతా చ కృష్ణా ॥
ద్రుపదమహారాజు ఏర్పాటు చేసిన ద్రౌపదీస్వయంవరమునకు విచ్చేసిన రాజులందరు స్వయంవరమునకు ఆరంభములో ద్రౌపదియం దలి కామనచే మిక్కిలి మదించియుండిరి. కాని, నేను శ్రీకృష్ణుని ఆశ్ర యము వలన లభించిన బలముతో వారి తేజస్సును అపహరించుట మాత్రమే గాక, ధనస్సును ఎక్కు పెట్టి మత్స్యయంత్రమును గురి తప్పకుండగా కొట్టి, ద్రౌపదిని పొందితిని.
యత్సన్నిధావహము ఖాండవమగ్నయే వదామ్
ఇంద్రం చ సామరగణం తరసా విజిత్య ।
లబ్ధా సభా మయకృతాద్భుతశిల్పమాయా
దిగ్భ్యో కహరన్నృపతయో బలిమధ్వరే చ ॥
అహో! ఆ శ్రీకృష్ణుని సన్నిధిలో నేను దేవతాగణములతో కూడియున్న ఇంద్రుని నా బలముతో శీఘ్రముగా జయించి, ఖాండవవనమును అగ్నికి సమర్పించితిని. ఆ సందర్భములోననే మయుడు అద్భుతమగు పముతో మరియు ఇంద్రజాలములతో కూడియున్న సభను నిర్మించిఇచ్చెను. అదే సమయములో నీవు చేసిన రాజసూయయాగమునకు సర్వ దిక్కులనుండి రోజులు బహుమానములను తీసుకొని వచ్చి సమర్పించిరి. ఇది అంతయు ఆ శ్రీకృష్ణుని అనుగ్రహముచే సంప్రాప్తమయ్యేను.
యత్తేజసా నృపశిరో కంఫ్రీమహన్మఖార్థే
ఆర్యో నుజస్తవ గజాయుతసత్త్వవీర్యః ।
తేనాహృతాః ప్రమథనాథమఖాయ భూపా
యన్మోచితాస్తదనయన్ బలిముధ్వరే తే ॥
పూజ్యుడు, పదివేల యేనుగుల ఉత్సాహము మరియు బలము గలవాడు, నీ సోదరుడు అగు భీమసేనుడు శ్రీకృష్ణుని తేజస్సుచే, రాజు లందరిని తన కాలిక్రింద తొక్కి పెట్టిన జరాసంధుని సంహరించి, వానిచే భైరవయాగములో బలినిచ్చుటకై తీసుకు రాబడిన రాజులను విడిపించేను. ఆ రాజులు కృతజ్ఞతాపూర్వకముగా నీ రాజసూయయాగమునకు ఉపహార ములను తీసుకొని వచ్చిరి.
పత్న్యా స్తవాధిమఖక్లుప్తమహాభిషేక-
శ్లాఘిష్ఠ చారుకబరం కితవైస్సభాయామ్ ।
స్పృష్టం వికీర్య పదయోః పతితాశ్రుముఖ్యా
మైస్తత్స్త్రియో కృత హతేశవిముక్త కేశాః ॥
రాజసూయయాగములో గొప్ప అభిషేకము చేయబడిన నీ భార్య యొక్క కేశపాశమును జూదగాళ్లు నిండు సభలో పట్టుకొని లాగి అవమా అంచగా, ఆమె కన్నీళ్లతో నిండిన ముఖముతో శ్రీకృష్ణుని పాదములపై పడే ను. ఆయన ఆ జూదగాళ్ల భార్యలు తమ భర్తలు మరణించగా జుట్టు విర భోసుకొని దుఃఖించునట్లు చేసెను.
యో నో జుగోప వనమేత్య దురంతకృచ్ఛాత్
దుర్వాససో రివిహితాదయుతాగ్రభుగ్యః ।
శాకాన్నశిష్టముపయుజ్య యతస్త్రీలోకీం
తృప్తామమంస్త సలిలే వినిమగ్నసంఘః ॥
దుర్వాసుడు పదివేల మంది శిష్యులతో కలిసి పంక్తికి అగ్రభాణి ములో భుజించును. మన శత్రువగు దుర్యోధనుడు ఆయనను అరణ్యవా పక్షు చేతుచున్న మన వద్దకు షంషీ మనకు అంతు లేని ఆపదను కల్పింసు.వ శ్రీకృష్ణుడు అడవికి వచ్చి, కూర వండిన పాత్రలో మిగిలి యున్న శాకకణమును భక్షించగా, నదిలో స్నానమును చేయుచున్న దుర్వాసునీ శిష్యవర్గము కేవలము తాము మాత్రమే గాక, ముల్లోకములు కూడ తృప్తిని చెందినట్లు భావించిరి. ఈ విధముగా ఆయన మనలను భయంకరమగు శాపము అనే గండమునుండి కాపాడెను.
యత్తేజసా కథ భగవాన్ యుధి శూలపాణిః
విస్మాపితస్సగిరిజో స్త్రమదాన్నిజం మే ।
అన్యే పి చాహమమునైవ కలేవరేణ
ప్రాప్తో మహేంద్రభవనే మహదాసనార్ఘమ్ ॥
ఇంతేగాక, నేను శ్రీకృష్ణుని తేజస్సు చేత మాత్రమే పార్వతీదేవితో కూడియున్న శూలపాణియగు శివభగవానునకు యుద్దములో ఆశ్చర్య, మును కలిగించగా, ఆయన పాశుపతాస్త్రమును నాకు ఇచ్చెను. లోకపాల కులు కూడ తమ తమ అస్త్రములను ఇచ్చిరి, నేను ఇ? కట్టెతో స్వర్గము నకు వెళ్లి ను హేంద్రుని భవనములో ఆయనయొక్క గొప్ప సింహాసనము నందు అర్ధభాగమును పొందితిని.
తత్రైవ మే విహరతో భుజదండయుగ్మం
గాండీవలక్షణమురాతివధాయ దేనా ।
సేంద్రోః శ్రీతా యదనూబాషితామాఉమీఢ
తేనాపమద్య ముషితః పురుషేణ భూమ్నా॥
నేను ఆ సందర్భములో అచటనే స్వర్గములో విహరించుచుండ గా, ఇంద్రాది దేవతలు నీపోతకవచులనే రాక్షసుల సంహారము కొరకై నన్ను ఆశ్రయించిరి. గాండీవమనే ధనస్సును పట్టే నా దృఢమగు రెండు భుజములకు ఆ మహిమ శ్రీకృష్ణుని అనుగ్రహముచే మాత్రమే కలిగినది. ఓ ధర్మరాజా! అట్టి పరబ్రహ్మస్వరూపుడగు శ్రీకృష్ణుడు ఈనాడు నన్ను వంచించినాడు.
యద్బాంధవః కురుబలాబ్దిమనంతపారం
ఏకో రథేన తతరే హమతీర్యసత్త్వమ్ ।
ప్రత్యాహృతం బహుధనం చ మయా పరేషాం
తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః ॥
భీష్ముడు మొదలగు భయంకరములగు తిమింగలములు గలది, అతి గంభీరమైనది, ఆవలి ఒడ్డు లేనిది అగు కౌరవ సైన్యమనే సముద్ర మును శ్రీకృష్ణుడే రక్షకుడుగా గల నేను ఒంటరిగా రథముపై దాటి వేసితి ని. ఇంతేగాక, కౌరవులు అపహరించిన గోధనమును తీసుకొని వచ్చి వీరా టునకు అప్పజెప్పితిని. యుద్దములో మూర్చిల్లిన ఆ కౌరవవీరుల శిరస్సు లనుండి వారి ప్రభావమునకు చిహ్నములగు కిరీటముల రత్నములను కూడ నేను లాగుకొంటిని.
యో భీష్మకర్ణగురుశల్యచమూష్వదభ్ర-
రాజన్యవర్యరథమండలమండితాసు ।
అగ్రేచరో మమ విభో రథయూథపానా-
మాయుర్మనాంసి చ దృశా సహ ఓజ ఆర్ఛత్ ॥
ఓ మహారాజా! భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శల్యుడు అనే సేనానులచే నడిపించ బడిన కౌరవసైన్యమునకు మహారథికులు తమ రథ ముల పరిభ్రమణములతో శోభను చేగూర్చెడివారు. ఆ సైన్యముపై నా కంటే ముందు శ్రీకృష్ణుని చూపు పడెడిది. ఆయన తన చూపుతోనే ఆమహారథికుల ఆయుర్దాయమును, ఉత్సాహశక్తిని మరియు బలమును అప హరించెడివాడు.
యద్దోఃషు మా ప్రణిహితం గురుభీష్మకర్ణ-
ద్రౌణిత్రిగర్తశల సైంధవబాహ్లికాద్యైః ।
అస్త్రాణ్యమోఘమహిమాని నిరూపితాని
నో పస్పృశుర్నృహరిదాసమివాసురాణి ॥
ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ సుశర్మ శల్యుడు సైంధవుడు బాహ్లికుడు మొదలగు వీరులు ప్రయోగించిన మొక్కవోని ప్రభావము గల అస్త్రములైననూ, నృసింహస్వామియొక్క భక్తుడగు ప్రహ్లాదునిపై హిరణ్యకశిపుడు ప్రయోగించిన ఆయుధములు వలె, శ్రీకృష్ణుని చేతులలో పెట్టబడిన నన్ను స్పృశించలేక పోయినవి.
సౌత్యే వృతః కుమతినాత్మద ఈశ్వరో మే
యత్పాదపద్మమభవాయ భజంతి భవ్యాః ।
మాం శ్రాంతవాహమరయో రథినో భువిష్టం
న ప్రాహరన్యదనుభావనిరస్తచిత్తాః ॥
ఆ ఈశ్వరుడు భక్తులకు తనను తాను సమర్పించి వేయును. ఆయన పాదపద్మములను శ్రేష్ఠపురుషులు మోక్షము కొరకై ఆరాధించు చుందురు. నేను యుద్ధములో గుర్రములు అలిసినప్పుడు రథము దిగి నేలపై నిలబడి యుండగా, ఆయన మహిమచే కింకర్తవ్యతావిమూఢులైన శత్రువులు నన్ను తమ బాణములతో కొట్టకుండిరి. అట్టి శ్రీకృష్ణుని దుర్బుద్ధి నగు నేను నా రథమునకు సారథి కమ్మని కోరితిని.
నర్మాణ్యుదారరుచిరస్మితశోభితాని
హే పార్థ హే కార్జున సఖీ కురునందనేతి ।
సంజల్పితాని నరదేవ హృదిస్పృశాని
స్మర్తుర్లుఠంతి హృదయం మమ మాధవస్య॥
ఓ మహారాజా! శ్రీకృష్ణుడు గంభీరము మరియు ప్రీతికరము అగు చిరునవ్వు నవ్వుతూ నన్ను పరిహాసము చేసెడివాడు. ఓ అర్జునా! పృథాకు మారా! కురువంశమునకు ఆనందమును కలిగించువాడా! మిత్రమా!అంటూ నాతో హృదయంగమముగా కబుర్లాడెడివాడు. ఆ విషయములు గుర్తుకు వచ్చి నా హృదయము క్షోభను పొందుచున్నది.
శయ్యాసనాటనవికత్తనభోజనాది-
ష్వైక్యాద్వయస్య ఋతవానితి విప్రలబ్ధః ।
సఖ్యుస్సఖేవ పితృవత్తనయస్య సర్వం
సేహే మహాన్మహితయా కుమతేరఘం మే ॥
పరుండుట, కూర్చుండుట, భుజించుట మొదలగు కార్యములలో నేను ఆయనతో సమముగా పోటీకి దిగుతూ, నా గొప్పలను చెప్పుతూ, ఓయీ మిత్రమా! నీవు సత్యసంధుడవు సుమా! అని వెక్కిరించి నిరాకరిం చెడీ పొడను. అయిననూ, ఆ మహామహుడగు శ్రీకృష్ణుడు మహోదారుడ గుటచే, మిత్రుని అపరాధమును మిత్రుడు వలె, పుత్రుని అపరాధమును తండ్రి వలె, దుర్బుద్ధినగు నా అపరాధమును సర్వమును సహించెడివాడు.
సోహం నృపేంద్ర రహితః పురుషోత్తమేన
సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః ।
అధ్వన్యురుక్రమపరిగ్రహమంగ రక్షన్
గోపైరసద్భిరబలేవ వినిర్జితో స్మి ॥
ఓ మహారాజా! అట్టి నేను ప్రియమిత్రుడగు శ్రీకృష్ణభగవానునకు దూరమైనాను. నా హృదయము శూన్యమైనది. ఆయన భార్యలను రక్షిస్తున్న నన్ను దారిలో దుష్టులగు గోపాలకులు స్త్రీని వలె సునాయాసముగా , జయించిరి.
తద్వై ధనుస్త ఇషవస్స రథో హయాస్తే
సోహం రథ నృపతయో యత ఆమనంతి ।
సర్వం క్షణేన తదభూదసదీశరిక్తం
భస్మన్ హుతం కుహకరాద్ధమీవోప్తమూష్యామ్ ॥
అదియే ధనస్సు. అవియే బాణములు. అదియే రథము. అవియే గుర్రములు. ఏ నన్ను చూచీ రాజులు వినయముగా నమస్కరించెడి వారో, ఆ నేనే తథికుడను. కానీ, శ్రీకృష్ణుడు లేని ఈ సర్వము బూడిదలో పోసిన ఆహుతి వలె, ఐంద్రజాలికుని వద్దనుండి లభించిన మిథ్యావస్తువు వలె, చవిటి నేలలో వేసిన విత్తనము వలె, కొరగానిది ఆయేను.
రాజంస్త్వయాభిపృష్టానాం సుహృదాం నస్సుహృత్పురే ।
విప్రశాపవిమూఢానాం నిఘ్నతాం ముష్టిభిర్మిథః ॥
వారుణీం మదిరాం పీత్వా మదోన్మథితచేతసామ్ ।
అజానతామివాన్యోన్యం చతుష్పంచావశేషితాః ॥
ఓ మహారాజా! నీవు ద్వారకలో నివసించే మన మిత్రుల గురించి ప్రశ్నించితివి. వారందరు బ్రాహ్మణశాపముచే వివేకమును పూర్తిగా కోల్పోయి, పీకెల దాకా మద్యమును త్రాగి, ఆ మైకములో ఒళ్లు మరిచి, ఒకరికి మరియొకరు తెలియని వాళ్లువలె ఒకరినొకరు పిడికిళ్లతో కొట్టుకొని మర ణించిరి. కేవలము నలుగురు, అయిదుగురు మాత్రమే మిగిలిరి.
ప్రాయేణైతద్భగవత ఈశ్వరస్య విచేష్టితమ్ ।
మిథో నిఘ్నంతి భూతాని భావయంతి చ యన్మిథః ॥
ఇది వాస్తవములో సర్వేశ్వరుడగు శ్రీకృష్ణభగవానుని లీలయే. ఏలయనగా, ప్రాణులు ఒకప్పుడు పరస్పరము పాలించుకొనును. మరి యొకప్పుడు పరస్పరము చంపుకొనును.
జలౌకసాం జలే యద్వన్మహాంతో దంత్యణీయసః ।
దుర్బలాన్ బలినో రాజన్మహాంతో బలినో మిథః ॥
ఓ మహారాజా! నీటిలో నివసించే ప్రాణులలో పెద్దవి చిన్నవాటిని, బలము గలవి బలము లేనివాటిని తిని బ్రతికే విధముగనే, పెద్దవి మరియు బలము గలవి కూడ వాటిలో అవి పరస్పరము చంపుకొని తినుచుండును.
ఏవం బలిషైర్యదుభిర్మహద్భిరితరాన్ విభుః ।
యదూన్యదుభిరన్యోన్యం భూభారాన్సంజహార హ ॥
అదే విధముగా, శ్రీకృష్ణభగవానుడు బలవంతులగు యాదవులచే ఇతరులను, యాదవులలో ఒకరిచే మరియొకరిని సంహరించునట్లు చేసి భూభారమును తగ్గించేను.
దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమాని చ ।
హరంతి స్మరతశ్చిత్తం గోవిందాభిహితాని మే ॥
శ్రీకృష్ణభగవానుని వచనములు దేశకాలములకు తగిన విషయ ములతో నిండియున్నవై హృదయములోని తాపమును చల్లార్చెడివి. అవి నాకు గుర్తుకు వచ్చి మనస్సును ఆకర్షించు చున్నవి.
ఏవం చింతయతో జిష్ణోః కృష్ణపాదసరోరుహమ్ ।
సౌహార్దేనాతిగాఢన శాంతాసీద్విమలా మతిః ॥
ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని పాదపద్మములను మిక్కిలి గాఢమగు ప్రేమతో ధ్యానించుచుండగా, స్వచ్చమగు ఆతని మనస్సులోనిదుఃఖము ఉపశమించెను.
వాసుదేవాంఘ్యనుధ్యానపరిబృంహితరంహసా ।
భక్త్యా నిర్మథితా శేషకషాయధిషణోర్జునః ॥
గీతం భగవతా జ్ఞానం యత్తత్సంగ్రామమూర్ధని ।
కాలకర్మతమోరుద్ధం పునరధ్యగమద్విభుః ॥
సమర్థుడగు అర్జునుని బుద్ధిలో గల కామాదిదోషములు శ్రీకృష్ణభ గవానుని ధ్యానించుటచే పెరిగిన వేగము గల భక్తిచే నిశ్శేషముగా నిర్మూ లించ బడినవి. యుద్దమునకు ఆరంభములో భగవానుడు బోధించిన గీతా జ్ఞానము కాలక్రమములో కర్మలు మరియు భోగములయందలి ఆసక్తిచే కప్పివేయబడి యుండెను. దానిని ఆతడు ఇప్పుడు మరల స్మృతికి దెచ్చు కొనెను.
విశోకో బ్రహ్మసంపత్త్యా సంఛన్న ద్వైతసంశయః ।
లీనప్రకృతినైర్గుణ్యాదలింగత్వాదసంభవః ॥
అర్జునుడు బ్రహ్మజ్ఞానమును పొందెను. అవిద్య నశించుటచే సూక్ష్మశరీరాభిమానము (కర్తృత్వభోక్తృత్వాభిమానము) తొలగి, ఆతడు గుణాతీతుడు (త్రిగుణాత్మకమగు సంసారమునకు అతీతుడగు జీవన్ము కుడు) ఆయెను. నేను, జగత్తు వేర్వేరుగా నున్నాము అనే భేదము ఆలంబ నముగా గల సంశయములన్నియు పటాపంచలై, శోకము దూరమయ్యెను. ఆతనికి పునర్జన్మ లేదు.
నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ ।
స్వఃపథాయ మతిం చక్రే నిభృతాత్మా యుధిష్ఠిరః ॥
శ్రీకృష్ణభగవానుడు అవతారమునుపసంహరించుట, యదువంశము వినాశమగుట అనే వృత్తాంతమును విని ధర్మరాజు నిశ్చలమగు చిత్తము గలవాడై, తాను కూడ స్వర్గమును పొందవలెనని నిశ్చయించెను.
పృథాప్యనుశ్రుత్య ధనంజయోదితం
నాశం యదూనాం భగవద్గతిం చ తమ్ ।
ఏకాంతభక్త్యా భగవత్యధోక్షజే
నివేశితాత్మోపరరామ సంసృతేః ॥
కుంతి కూడా శ్రీకృష్ణభగవానుని అవతారోపసంహారము, యాదవ కులనాశము అను విషయములను అర్జునుడు చెప్పగా విని, ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని భగవత్స్వరూపమునందు అన్యమునేరుం గని భక్తిచే మనస్సును విలీనము చేసి, జీవన్ముక్తురాలు ఆయెను (దేహ మును విడిచి పెట్టెను).
యయాహరద్బుతో భారం తాం తనుం వీజహావజః ।
కంటకం కంటకేనేవ ద్వయం చాపీశితుస్సమమ్ ॥
పుట్టుక లేని పరమేశ్వరుడు ఏ దేహముతో ముల్లును ముల్లుతో వలె భూభ్రమును పోగొట్టెనో, ఆ దేహమును విడిచి పెట్టెను. ఆయనకు భూమికి భారమును కలిగించిన దేహము, దానిని పోగొట్టిన దేహము అనే రెండు సమానమే.
యథా మత్స్యాదిరూపాణీ ధత్తే జహ్యాద్యథా నటః ।
భూభారః క్షపితో యేన జహో తచ్చ కలేవరమ్ ॥
భగవానుడు నటుని వలె మత్స్యాద్యవతారములను స్వీకరించి ఉపసంహరించెను. అదే విధముగా, శ్రీకృష్ణరూపమును దాల్చి, భూభార మును హరించిన తరువాత దానిని కూడ విడిచి పెట్టెను.
యదా ముకుందో భగవానిమాం మహీం
జహో స్వతన్వా శ్రవణీయసత్కథః ।
తదాహరేవాప్రతిబుద్దచేతసా-
మధర్మ హేతుః కలిరన్వవర్తత ॥
వినదగిన పుణ్యగాథలు గల శ్రీకృష్ణభగవానుడు తన దేహముతో ఏ నాడు ఈ భూమిని విడిచిపెట్టెనో, అదే రోజున కలి ఆరంభమై వివేకహీ నులలో అధర్మవర్తనమును కలిగించ నారంభించెను.
యుధిష్ఠిరస్తత్పరిసర్పణం బుధః
పురే చ రాష్ట్రే చ గృహే తదాత్మని ।
విభావ్య లోభానృతజిహ్మహింసనా-
ద్యధర్మచక్రం గమనాయ పర్యధాత్ ॥
లోభము, అసత్యము, మోసము, హింస మొదలగు అధర్మరూప ములలో కలి దేశములో, నగరములో, తన యింటిలో, ప్రాణిమాత్రము నందు (లేదా, తనయందు కూడా) ప్రసరించుట మొదలయ్యేనని విద్వాం సుడగు ధర్మరాజు గమనించి, దేహమును విడిచి పెట్టవలెనని నిశ్చయించె ను.
స్వరాట్ పౌత్రం వినయినమాత్మనస్సుసమం గుణైః ।
తోయనీవ్యాః పతిం భూమేరభ్యషించద్గజాహ్వయే॥
ధర్మరాజు తనతో సమానమైన గుణవంతుడు, వినయశీలియగు తన మనుమడు పరీక్షిత్తును సముద్రముచే చుట్టువారబడియున్న భూమికి చక్రవర్తిగా హస్తినాపురములో అభిషేకించెను.
మథురాయాం తథా వజ్రం శూర సేనపతిం తతః ।
ప్రాజాపత్యాం నిరూప్యేష్టిమర్నీనపీబదీశ్వరః ॥
సమర్థుడగు ధర్మరాజు అదే విధముగా మథురలో అనిరుద్ధుని పుత్రుడగు వజ్రుని శూరసేనదేశాధిపతిగా అభిషేకించి, తరుపోత ప్రాజాప త్యేష్టిని చేసి, అగ్నులను తన లోనికి ఆరోపించు కొనేను (అనగా, గృహస్థా శ్రమమును విడిచి, సన్న్యసించెను).
విసృజ్య తత్ర తత్సర్వం దుకూలవలయాదికమ్ ।
నిర్మమో నిరహంకారస్సంఛిన్నా శేషబంధనః ॥
వాచం జుహావ మనసి తతాణ ఇతరే చ తమ్ ।
మృత్యావహనం సోత్సర్గం తం పంచత్వే హ్యజోహవీత్ ॥
అహంకారమమకారములు లేనివాడు, పటాపంచలైన సకలసంసా రాసక్తులు గలవాడు అగు ధర్మరాజు వస్త్రములు ఆభరణములు మొదలగు సర్వమును అచటనే విడిచి పెట్టి, వాక్కును, అనగా అన్ని ఇంద్రియములను తమ తమ వ్యాపారములతో సహా మనస్సునందు, మనస్సును ప్రాణము నందు, ప్రాణమును అపానమునందు, అపానమును దాని అధిష్టానదేవత యగు మృత్యువునంగు, మృత్యువును పాంచభౌతిక దేహమునందు (భావ నారూపముగా) హోమము చేసెను.
త్రిత్వే హుత్వాథ పంచత్వం తచ్చైకత్వే జుహోన్మునిః । సర్వమాత్మన్యజుహవీద్బ్రహ్మణ్యాత్మానమవ్యయే ॥
తరువాత మననశీలుడగు ధర్మరాజు పౌంచభౌతిక దేహమును త్రిగుణాత్మికయగు ప్రకృతియందు, ఆ ప్రకృతిని సర్వవిధముల ఆరోపము లకు మూలమగు అవిద్యయందు, దానిని జీవునియందు, జీవుని అవినాశి యగు బ్రహ్మయందు హోమము (విలీనము) చేసెను.
చీరవాసా నిరాహారో బద్దవాజ్ముక్తమూర్ధజః ।
దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్తపిశాచవత్ ॥
అనవేక్షమాణో నిరగాదశృణ్వన్ బధిరో యథా ।
ఉదీచీం ప్రవివేశాశాం గతపూర్వాం మహాత్మభిః ।
హృది బ్రహ్మ పరం ధ్యాయన్నావర్తేత యతో గతః ॥
ధర్మరాజు నారబట్టలను ధరించి, ఉపవసించి, మౌనమును పాటి స్తూ, జుట్టుముడిని విడదీసి, జడుడా లేక పిచ్చివాడా .లేక పిశాచమా యన్నట్లు తన రూపమును చూపిస్తూ, వెనుకకు తిరిగి చూడకుండగా, చెవిటి వాని వలె శబ్దములను వినకుండగా ఇంటినుండి బయలు దేరెను. ఆయన మనస్సులో పరబ్రహ్మను ధ్యానిస్తూ పూర్వమునందు అనేకమహా త్ములచే నడువబడిన ఉత్తరదిక్కును ప్రవేశించెను. ఈ విధముగా దేహ మును త్యాగము చేయువారికి పునర్జన్మ ఉండదు.
సర్వే తమను నిర్జగ్ముర్భ్రాతరః కృతనిశ్చయాః ।
కలినా ధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజా భువి ॥
భూలోకములో జనులయందు అధర్మమునకు మిత్రుడగు కలి ప్రవేశించుటను గాంచి మిగిలిన పాండవులు కూడ నిశ్చయము చేసుకొని అన్నగారి వెనుక బయలు దేరిరి.
తే సాధుకృతసర్వార్థా జ్ఞాత్వాత్యంతికమాత్మనః ।
మనసా ధారయామాసుర్వైకుంఠచరణాంబుజమ్ ॥
పాండవులు జీవితములో పురుషార్థములను చక్కగా అనుష్టించి యుండిరి. పరమపురుషార్థము శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములేనని పోరు తెలుసుకొంటిరి. పోరా సమయములో ఆ భగవానుని పాదములను మనస్సులో ధ్యానము చేయుచుండిరి,
తద్ధ్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధధిషణాః పరే ।
తస్మిన్నారాయణపదే ఏకాంతమతయో గతిమ్ ॥
అవాపుర్దురవాపొం తే అసద్బిర్విషయాత్మభిః ।
విధూతకల్మషాస్ధానం విరజేనాత్మ నైవ హి ॥
ఆ శ్రీహరిని ధ్యానించుటచే పాండవుల హృదయములలో భక్తిభా వము పొంగి పొరలెను. వారి అంతఃకరణములు పరిశుద్దమయ్యేను. వారు ఆ నారాయణుని పాదపద్మములయందు (స్వరూపమునందు) అనన్య ముగా నిమగ్నమైన మనస్సులు గలవారై, విషయభోగాసక్తులగు దుష్టు లచే పొంశక్యము కానిది, నశించిన దోషములు గలవారు నివసించునది అగు గతిని (మోక్షమును) నిర్దోషమగు ఆత్మతో (ఆత్మరూపముగా) పొంది
విదురో పి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మవాన్ ।
కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిస్స్వక్షయం యమౌ ।
ఇంద్రియవిజేతయగు విదురుడు కూడ శ్రీకృష్ణునియందలి భక్తి యొక్క ఆవేశముచే మనస్సును ఆయనయందు లగ్నము చేసి, ప్రభాసక్షే త్రమునందు దేహమును విడిచి పెట్టి, పితృదేవతలతో కలిసి తన నగరము నకు వెళ్లాను.
ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామన పేక్షతామ్ ।
వాసుదేవే భగవతి హ్యేకాంతమతిరాప తమ్ ॥
ద్రౌపది కూడ తన భర్తలు విరాగులై నిషమించినారని తెలుసు కొని, శ్రీకృష్ణభగవానునియందు సంలగ్నమైన మనస్సు గలదై, ఆయనను పొందెను.
యః శ్రద్దయెతద్భగవత్ప్రియాణాం
పాండోస్సుతానామితి సంప్రయాణమ్ ।
శృణోత్యలం స్వస్త్యయనం పవిత్రం
లబ్ధ్వా హి భక్తము పైతి సిద్ధిమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే పంచదశోఽధ్యాయః ॥
ఎవడైతే భగవంతుని అనుగ్రహమునకు పాత్రులగు పాండవుల ఈ విధమైన మహాప్రయాణమును గురించి శ్రద్ధతో వినునో, అట్టివాడు సకల మంగళములకు ఆస్పదము మరియు పావనము అగు శ్రీహరియందలి భక్తిని పొంది, మోక్షమును పొందును.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పదునైదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
Arjuna reveals to King Yudhishtira that Lord Kṛshṇa has ended His earthly pastimes and returned to His eternal abode, taking with Him the power and strength that had previously animated Arjuna and the Pāṇḍavas. Upon hearing of Kṛshṇa's departure and the destruction of the Yadu dynasty, Yudhishtira decides to retire from worldly governance, coronates young Parīkshit as king of Hastināpura, and together with his brothers and Draupadī, sets out on the grand final journey towards the mountains, focusing his mind entirely on the Supreme.