17 -  సప్తదశోఽధ్యాయః

సూత ఉవాచ

తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్

 దండహస్తం చ వృషలం దదృశే నృపలాంఛనమ్

సూతుడిట్లు పలికెను : అచట పరీక్షిన్మహారాజు మహారాజవేషము లోనున్న ఒక అధర్మాత్ముడు కర్రను చేతబట్టి ఎద్దును ఆవును కొట్టుచుం డగా చూచెను. వాటికి రక్షకుడు లేకుండెను.

 వృషం మృణాలధవళం మేహంతమివ బిభ్యతమ్

 క వేపమానం పదైకేన సీదంతం శూద్రతాడితమ్

తామరతూడు వలె తెల్లనైన బక్కచిక్కియున్న ఆ ఎద్దును శూద్రుడు కొట్టుచుండగా, అది భయముతో వణకుచున్నదా యన్నట్లు ఒంటికాలిపై నిలబడి, మూత్రమును విసర్జించుచుండెను. రాజు ఆ దృశ్య మును చూచెను.

గాం చ ధర్మదుఘాం దీనాం భృశం శూద్రపదహతామ్

వివత్సాం సాశ్రువదనాం క్షామం యవసమిచ్ఛతీమ్

వేదవిహితకర్మలకు అవసరమయ్యే పాలు మొదలగు హవిస్సును ఇచ్చే ఆ ఆవు దూడలేక బక్కచిక్కి యుండెను. ఆ శూద్రుడు పాదముతో తన్నుచుండగా, ఆమె మిక్కిలి దీనురాలై యుండెను. కన్నుల వెంబడి నీటిని రాల్చుచున్న ఆ ఆవును రాజు చూచెను.

పప్రచ్చ రథమారూఢః కార్తస్వరపరిచ్ఛదమ్

 మేఘగంభీరయా వాచా సమారోహితకార్ముకః

బంగరు పరికరములతో కూడిన రథమునందు కూర్చునియున్న మహారాజు ధనస్సును ఎక్కు పెట్టి, మేఘగర్జనవలె గంభీరమగు వాక్కుతో ఇట్లు ప్రశ్నించేను.

కస్త్వం మచ్చరణే లోకే బలాద్దంస్యబలాన్ బలీ

 నరదేవోకసి వేషేణ నటవత్కర్మణా ద్విజః

నీవెవరు? నేను పాలించే రాజ్యములో బలవంతుడగు నీవు బల హీనులను కొట్టుచుంటివి. నటుని వలె నున్నావు. వేషమును బట్టి మహారా జువలే కానవచ్చుచున్నావు. కాని చేసే పని మాత్రము నీవు దుష్టుడవని తెలియజేయుచున్నది.

కస్త్వం కృష్ణే గతే దూరం సహ గాండీవధన్వనా

 శోచ్యో స్యశోచ్యాన్ రహసి ప్రహరన్ వధమర్హసి

నీవెవరివి? అర్జునునితో బాటు శ్రీకృష్ణుడు దూరము కాగానే, నిర్జ నస్థానమునందు నీవు నిరపరాధులను కోట్టుచున్నావు. నీ అపరాధమునకు మరణమే శిక్ష.

త్వం వా మృణాలధవలః పొదైర్న్యూనః పదా చరన్

 వృషరూపేణ కిం కశ్చిద్దేవో నః పరిభేదయస్

ఓ వృషభమా! నీవు తొమరతూడువలే తెల్లగా వున్నావు. మూడు కాళ్లు లేకున్ననూ ఒంటి కొటతో నడచే నీవు ఎవరివి? నీన్ను చూచిన  నాకు చాల భేదము కలుగుచున్నది. బహుశః ఎవరో ఒక దేవత ఎద్దు రూపములో సంచరించుచున్నది కాబోలు!

న జాతు పౌరవేంద్రాణాం దోర్దండపరిరంభితే

 భూతలే కనుపతంత్యస్మిన్ వినా తే ప్రాణినాం శుచః

పురువంశపు రాజులు తమ దృఢమగు బాహువులతో ఈ రాజ్య మును కౌగిలించుకొని యున్నారా అన్నవిధముగా ఈ రాజ్యమును పాలిం చుచున్నారు. ఈ రాజ్యములో నీవు తక్క ఇతరులెవ్వరూ ఏ కాలమునందై ననూ కన్నీటిని విడుచుట లేదు.

మా సౌరభేయానుశుచో వ్యేతు తే వృషలాదయమ్

 మా రోదీరంబ భద్రం తే ఖలానాం మయి శాస్తరి

ఓ వృషభమా! దుఃఖించకుము. ఈ దుష్టుని వలన నీవు భయపడ కుము. దుష్టులను దండించే నేను ఉండగా, నీవు ఏడ్వవద్దు. ఓ గోమాతా! నీకు మంగళమగు గాక!

యస్య రాష్ట్రే ప్రజాస్సర్వాస్త్రస్యంతే సాధ్యసాధుభిః

తస్య మత్తస్య నశ్యంతి కీర్తిరాయుర్బగో గతిః

ఓ గోమాతా! ఏ మదాంధుడగు రాజుయొక్క పాలనలో ఏ ప్రాణి ననూ దుష్ఠులచే పీడించబడునో, అట్టి రాజుయొక్క కీర్తి, ఆయుర్దాయము, సౌభాగ్యము మరియు పుణ్యలోకము కూడ నశించును.

ఏష రాజ్ఞాం పరో ధర్మో హ్యాహ్రనామార్తినిగ్రహః

 అత ఏనం వధిష్యామి భూతద్రుహమసత్తమమ్

పీడితుల పీడను తొలగించుట రాజుల పరమధర్మము. కావున, ప్రాణులను హింసించే ఈ పరమదుర్మార్గుని నేను వధించెదను.

కో కవృశ్చత్తవ పాదాంస్త్రీన్ సౌరభేయ చతుష్పద

 మా భూవంస్త్వాదృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తనామ్

ఓ సురభిపుత్రా! నీ నాలుగు పాదములలో మూడింటిని ఎవడు నరికినాడు? శ్రీకృష్ణుని అనుయాయులగు రాజుల రాజ్యములో నీవంటి పీడి తులు లేకుందురు గాక!

ఆఖ్యాహి వృష భద్రం వస్సాధూనామకృతాగసామ్

 ఆత్మవైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణమ్

ఓ వృషభమా! మీకు మంగళమగు గాక! మీ వంటి నిరపరాధు లగు సాధుజంతువులను, అంగవికలులుగా చేసి, పాండవుల కీర్తికి మచ్చను దెచ్చిన వ్యక్తిని గురించి చెప్పుము.

జనే నాగస్యఘం యుంజన్ సర్వతో స్య చ మద్బయమ్

 సాధూనాం భద్రమేవ స్యాదసాధుదమనే కృతే

నిరపరాధియగు ప్రాణిని హింసించే వ్యక్తి ఎక్కడ ఉన్ననూ, వానికి నా వలన భయము తప్పదు. దుష్టులను దండించుట ద్వారా సత్పురుషు లకు నిశ్చయముగా మంగళము కలుగును.

అనాగస్విహ భూతేషు య ఆగస్కృన్నిరంకుశః

 ఆహార్త కస్మీ భుం సాక్షాదమర్త స్యోపీ సాంగదమ్

ఎవడైతే అడ్డు ఆపు లేకుండగా నిరపరాధులయందు పాపమునాచ రించునో, అట్టి వ్యక్తి సాక్షాత్తుగా దేవతయే అయిననూ, వాని భుజమును భుజకీర్తితో సహా నరికి వేయగలను.

రాజ్ఞో హి పరమో ధర్మస్వధర్మస్థానుపాలనమ్

 శాసతో కన్యాన్యథాశాస్త్రమనాపద్యుత్పథానిహ

మానవుడు ఘోరమగు విపత్తులో మర్యాదను అతిక్రమించినచో, అది అంగీకారమే యగును. కాని, సామాన్యముగా మర్యాదను ఉల్లంఘించి అధర్మమార్గములో జీవించు వారిని శాస్త్రనియమముల ననుసరించి రాజు దండించవలెను. తద్ద్వారా స్వధర్మమునాచరించు జనులను రక్షించుట రాజునకు పరమకర్తవ్యమై యున్నది.

ధర్మ ఉవాచ

 ఏతద్వః పాండవేయానాం యుక్తమార్తాభయం వచః

 యేషాం గుణగణైః కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః

ధర్ముడు ఇట్లు పలికెను: పాండవులు తమ సద్గుణసంపదచే శ్రీకృ ష్ణభగవానుని అనుగ్రహమును పొంది, ఆయనను రాయబారము మీద లగు కార్యములయందు నియోగించ గలిరి. అట్టి పొండువంశస్థులగు మీకు ఈ విధముగా ఆపదలో నున్నవారికి అభయమునిచ్చుట ఎంతయూ తగి యున్నది.

న వయం క్లేశబీజానీ యతస్యుః పురుషర్షభ

పురుషం తం వీజానీమో వాక్యభేదవిమోహితాః

ఓ పురుషశ్రేష్ఠా! విభిన్నవాదుల వాదములచే సమ్మోహితులమై యున్న మేము ఆపదల బీజములు ఏ పురుషుని వలన ఉదయించునో, ఆ పురుషుని యెరుంగము.

కేచిద్వికల్పవసనా ఆహురాత్మానమాత్మనః

దైవమన్యే పరే కర్మ స్వభావమపరే ప్రభుమ్

నానాత్వమునంగీకరించని యోగులు మన సుఖదుఃఖములకు కారణము మనమేనని చెప్పెదరు. మరికొందరు (దైవజ్ఞులు) దైవము వలన, ఇంకొందరు (మీమాంసకులు) పూర్వకర్మ వలన సుఖదుఃఖములు కలుగుచున్నవని చెప్పుచుండగా, లోకాయతీకులు స్వభావము చేతనే అవి సంక్రమించుచుండునని వాదించు చున్నారు.

అప్రతర్యాదనిర్దేశ్యాదితి కేష్వపి నిశ్చయః

 ఆత్రానురూపం రాజర్షే విమృశ స్వమనీషయా

మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వాక్కులచే నిర్దేశింప శక్యము కానివాడు అగు పరమేశ్వరుని వలన ప్రాణులకు సుఖదుఃఖములు కలుగుచున్నవని కొద్దిమందియొక్క సిద్ధాంతము. ఓ రాజర్షీ! నీవు ఈ పక్షములను నీ బుద్ధితో విమర్శించి, యోగ్యమగు నిర్ణయమునకు రమ్ము.

ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాడ్ ద్విజసత్తమ

 సమాహితేన మనసా విభేదః పర్యచష్టతమ్       

ఓ శౌనకమహర్షీ! ధర్ముని ఈ వచనములను వినగానే పరీక్షిన్మహా రాజునకు గల ఖేదము తొలగిపోయెను. ఆయన ఏకాగ్రమగు మనస్సుతో ధర్మునీ చూచి ఇట్లు పలికెను.

రాజోవాచ

ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మో సి వృషరూపధృక్

యదధర్మకృతః స్థానం సూచకస్యాపి తద్భవేత్

మహారాజు ఇట్లు పలికెను: ఓ ధర్మజ్ఞా! అధర్మమును చేయువా నికి ఏ నరకము లభించునో, వానిపై చాడీలు చెప్పువానికి కూడ అదే నర కము లభించుననే ధర్మమును నీవు చెప్పకనే చెప్పుచున్నావు. నీవు వృష భరూపములోనున్న ధర్ముడవు.

అథవా దేవమాయాయా నూనం గతిరగోచరా

 చేతసో వచసశ్చాపి భూతానామితి నిశ్చయః

లేదా, ఒకచో నీకు సుఖదుఃఖములకు హేతువు తెలియకున్ననూ, ఆశ్చర్యము కాదు. ఏలయనగా, పరమేశ్వరుని మాయాశక్తియొక్క ప్రవృత్తి, అనగా ఎప్పుడు ఎవరిని అనుగ్రహించి ఎవరిని హింసించును అనే విషయ ము, ప్రాణుల బుద్ధికి గాని, వాక్కులకు గాని గోచరించేది కాదు అనేది సిద్ధాంతము.

తపశ్శాచం దయా సత్యమితి పాదాః ప్రకీర్తితాః

 అధర్మాం శైస్తయో భగ్నాస్సయసంగమదైస్తవ

ధర్మమునకు తపస్సు, శౌచము, దయ, సత్యము అను నాలుగు పాదములు గలవని మహర్షులు కీర్తించిరి. అధర్మముయొక్క అంశములగు సమ్మోహము తపస్సును, దుష్టసంగము శౌచమును, గర్వము దయ అను నీ పాదమును విరుగ గొట్టినవి.

ఇదానీం ధర్మ పాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః

 తం జిఘృక్షత్యధర్మో యమనృతేనైధితః కలిః

ఓ ధర్మమా! ఇప్పుడు నీ నాల్గవ పాదమగు సత్యము మాత్రమే మిగిలి యున్నది. నీవు దానితో మాత్రమే కష్టముగా నిలబడియున్నావు. మానవుడు దానితో మాత్రమే నిన్ను పొందుచున్నాడు. కానీ, అసత్యముచే వర్ధిల్లజేయబడిన ఈ అధర్మరూపమగు కలి ఆ సత్యమును మ్రింగివేయ గోరుచున్నది.

ఇయం చ భూర్బగవతా న్యాసితోరుభరా సతీ

 శ్రీమద్భిస్తత్పదన్యా సైస్సర్వతః కృతకౌతుకా

శ్రీకృష్ణభగవానుడు గోరూపములోనున్న ఈ భూమియొక్క పెను భారమును పోగొట్టినాడు. ఇపుడు ఈమె శోభాయుక్తములగు భగవానుని పాదముల చిహ్నములచే అంతటా మంగళమయమై యున్నది.

శోచత్యశ్రుకలా సాధ్వీ దుర్భగేవోజ్ఘితా ధునా

అబ్రహ్మణ్యా నృపవ్యాజాశ్శూద్రా భోక్ష్యంతి మామితి

ఇపుడీ భూమాత భగవానునిచే విడువబడినదై, బ్రాహ్మణద్రోహు లగు రాజులు స్వధర్మమును మరచిన నామమాత్రపు రాజులై నన్ను భోగిం చెదరని, కన్నుల వెంబడి నీటిని స్రవిస్తూ, అభాగ్యురాలు వలె శోకించు చున్నది.

ఇతి ధర్మం మహీం చైవ సాంత్వయిత్వా మహారథః

నిశాతమాదదే ఖడ్గం కలయే కధర్మ హేతవే

మహారథుడగు పరీక్షిన్మహారాజు ఈ విధముగా భూదేవిని, ధర్ముని ఓదార్చి, అధర్మమునకు కారణమగు కలిని హతమార్చుటకై వాడి కత్తిని చేతిలోనికి తీసుకొనెను.

తం జిఘాంసుమభిప్రేత్య విహాయ నృపలాంఛనమ్

తత్పాదమూలం శిరసా సమగోద్భయవిహ్వలః

పరీక్షిత్తు తనను సంహరించ బోవుచున్నాడని గమనించిన కలి భయముతో కంగారుపడి, తన రాజచిహ్నములను పారవేసి, ఆయన పాద మూలమునకు శిరస్సుతో మ్రొక్కెను.

పతితం పాదయోర్వీక్ష్య కృపయా దీనవత్సలః

శరణ్యే నావధీచ్లోక్య ఆహ చేదం హసన్నివ

దీనులయందు ప్రేమ గలవాడు, శరణు జొచ్చినవారిని రక్షించువాడు, సత్కీర్తికి తగినవాడు అగు పరీక్షిన్మహారాజు దయచే ఆతనిని చంపకుండగా విడిచి పెట్టి, చిరునవ్వుతో నిట్లనెను.

రాజోవాచ

న తే గుడాకేశయశోధరాణాం

 బ్రద్దాంజలేర్వై భయమస్తి కించిత్

న వర్తితవ్యం భవతా కథంచన

క్షేత్రే మదీయే త్వమధర్మబంధుః

అర్జునుని కీర్తిని ధరించే మా వద్ద చేతులను జోడించిన నీకు నిశ్చ. యముగా భయము ఏమియు లేదు. కాని, అధర్మమునకు బంధువు అగు నీవు మా సామ్రాజ్యములో ఎట్టి పరిస్థితులలోనైననూ ఉండరాదు.

త్వాం వర్తమానం నరదేవదే హే-

ష్వనుప్రవృత్తో యమధర్మపూగః

లోభో నృతం చౌర్యమనార్యమంహో

జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దంభః

నీవు రాజుల దేహములయందు ఉండగా, నిన్ను అనుసరించి పిసి నారితనము, అసత్యము, పరధనమును అపహరించుట, రౌడీతనము,స్వధర్మమును విడిచి పెట్టుట, దారిద్యము, మోసము, కలహములు, దంభము (పలుకుబడి కోరకై ధర్మమునాచరించుట) అనే అధర్మసముదా యము కూడ వారియందు పనిచేయును.

న వర్తితవ్యం తదధర్మబంధో

 ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే

 బ్రహ్మావర్తే యత్ర యజంతి యజ్ఞైః

యజ్ఞేశ్వరం యజ్ఞవితానవిజ్ఞాః

అధర్మమునకు చెలికాడైన ఓ కలీ! కావున, ధర్మము సత్యము ఉండదగిన బ్రహ్మావర్త దేశములో నీవు ఉండరాదు. ఇచట యజ్ఞమును గురించి విస్తృతమగు విజ్ఞానము గల పండితులు ఆ యజ్ఞప్రభువగు శ్రీహ రిని యజ్ఞములతో ఆరాధించుచుందురు.

యస్మిన్ హరిర్భగవ్యాజ్యమాన

ఇజ్యామూర్తిర్యజతాం శం తనోతి

 కామానమోఘాన్ స్థిరజంగమానామ్

అంతర్బహిర్వాయురివైష ఆత్మా

బ్రహ్మావర్తమునందు యజ్ఞమూర్తియగు శ్రీహరిని జనులు యజ్ఞ ములతో ఆరాధించేదరు. ఆయన వారి కోర్కెలను సఫలము చేసి, మంగళ ములనిచ్చును. ఆయన లోపల బయట ఉండే వాయువు వలె చరాచర ప్రాణి కోటియొక్క ఆత్మస్వరూపుడై ఉన్నాడు.

సూత ఉవాచ

పరీక్షితైవమాదిష్టస్స కలిర్జాతవేపథుః

 తముద్యతాసిమా హేదం దండపాణిమివోద్యతమ్

సూతుడు ఇట్లు పలికెను: కత్తిని పైకి యెత్తి పట్టుకొనియున్న పరీ క్షిత్తు యమధర్మరాజును బోలియుండెను. ఆయనను ఆ విధముగా చూచిన కలికి వణుకు పుట్టెను. ఆతనిని ఆయన ఈ విధముగా ఆదేశించగా, ఆతడు ఆయనతో నిట్లనెను.

కలిరువాచ

 యత్ర క్వచన వత్స్యామి సార్వభౌమ తవాజ్ఞయా

 లక్షయే తత్ర తత్రాపి త్వామాత్రేషుశరాసనమ్

కలి ఇట్లు పలికెను: ఓ చక్రవర్తీ! నీ అనుజ్ఞచే నేను ఎక్కడెక్కడ నివ సించిననూ, అక్కడక్కడ ధనుర్బాణములను సిద్ధముగా పట్టుకొనియున్న నీవు నాకు కనబడుచునే యుందువు.

 తన్మే ధర్మభృతాం శ్రేష్ఠ స్థానం నిర్దేష్ణుమర్హసి

యత్రైవ నియతో వత్స్య ఆతిష్ఠంస్తే నుశాసనమ్

ఓ ధార్మికశిరోమణీ! కావున, నీవు దయచేసి నాకు స్థానమును నిర్దేశించుము. నేను నీ ఆజ్ఞానుసారముగా అక్కడ మాత్రమే స్థిరముగా నివసించగలను.

సూత ఉవాచ

అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ

 ద్యూతం పానం స్త్రీయస్సూనా యత్రధర్మశ్చతుర్విధః

సూతుడు ఇట్లు పలికెను: కలి ఈ విధముగా అభ్యర్థించగా, పరీక్షి న్మహారాజు ఆతనికి జూదము, మద్యపానము, దుష్టస్త్రీసంగము మరియు ప్రాణిహింస అనే నాలుగు స్థానములమ నిర్దేశించెను. వీటియందు క్రమ ముగా అసత్యము, మదము, విషయాసక్తి, క్రౌర్యము అనే నాలుగు రక ముల అధర్మము నివసించి యుండును.

పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ప్రభుః

తతో నృతం మదం కామం రజో వైరం చ పంచమమ్

కలి మరల యాచించగా, సర్వసమర్థుడగు పరీక్షిత్తు ఆతనికి బంగా.. రముతో బాటు, అసత్యము, గర్వము, కామము, రజోగుణమూలకమగు హింస అనే అయిదు స్థానములనిచ్చెను.

అమూని పంచ స్థానాని హ్యధర్మప్రభవః కలిః

ఔత్తరేయేణ దత్తాని న్యవసత్తన్నిదేశకృత్

అధర్మమునకు మూలకారణమగు కలి పరీక్షిన్మహారాజుయొక్క ఆదేశమును పాటిస్తూ, ఆయన ఇచ్చిన ఈ స్థానములయందు మాత్రమే నివసించ దొడగెను.

అధైతాని న సేవేత బుభూషుః పురుషః క్వచిత్

 విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురుః

అందువలన, బ్రతికి బట్టగట్టగోరు మానవుడు, విశేషించి ధర్మస్వ భావమును కలిగి జనులను పాలించే రాజు, ధర్మమును ఉపదేశించే గురువు ఏ కాలమునందైననూ వీటి జోలికి పోరాదు.

వృషస్య నష్టాంస్త్రీన్ పొదాంస్తపశాచం దయామితి

 ప్రతిసందధ ఆశ్వాస్య మహీం చ సమవర్ధయత్

తపస్సు, శౌచము, దయ అనే ధర్మముయొక్క నశించిన మూడు పాదములను పరీక్షిన్మహారాజు తిరిగి నిలబెట్టెను. అనగా, వాటిని వర్ధిల్లజేసె ను. ఇంతేగాక, ఆయన భూదేవిని ఓదార్చి, చక్కగా వర్ధిల్లునట్లు చేసెను.

స ఏష ఏతర్ఘ్యధ్యాస్త ఆసనం పార్థివోచితమ్

పితామహేనోపన్యస్తం రాజ్ఞారణ్యం వివిక్షతా

అడవికి వెళ్లగోరిన ధర్మరాజు సింహాసనమును తన మనుమనికి అప్పజెప్పెను. చక్రవర్తికి దగియున్న ఆ సింహాసనమును నిన్న మొన్నటి వరకు అట్టి పరీక్షిన్మహారాజు అధిష్ఠించెను.

ఆస్తే ధునా స రాజర్షిః కౌరవేంద్రియోల్లసన్

గజాహ్వయే మహాభాగశ్చక్రవర్తీ బృహచ్ఛ్రవాః

రాజర్షి, మహాత్ముడు, గొప్ప కీర్తి గలవాడునగు ఆ పరీక్షిన్మహా రాజు నిన్న మొన్నటి వరకు హస్తినాపురమునందు కురుసార్వభౌముని శోభతో ప్రకాశించినాడు.

ఇత్థం భూతానుభావో యమభిమన్యుసుతో నృపః

యస్య పాలయతః క్షోణీం యూయం సత్రాయ దీక్షితాః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే సప్తదశోఽధ్యాయః

అభిమన్యుని పుత్రుడగు పరీక్షిన్మహారాజుయొక్క ప్రభావము ఇంత గొప్పది. ఆయన రాజ్యమునేలుచుండగనే, మీరు సత్రయాగదీక్షను స్వీకరించినారు.

శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పదునేడవ అధ్యాయము ముగిసినది.