8 -  అష్టమోఽధ్యాయః

సూత ఉవాచ

అథ తే సంపరేతానాం స్వానాముదకమిచ్చతామ్

దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుః స్త్రీయః

సూతుడు ఇట్లు పలికెను: తరువాత పాండవులు శ్రీకృష్ణుడు తోడు రాగా, మరణించి నీటిని కోరే తమ పుత్రులకు గంగలో జలతర్పణములని చ్చుట కొరకై స్త్రీలను ముందడుకొని వెళ్లిరి.

తే నినీయోదకం సర్వే విలప్య చ భృశం పునః

ఆపుతా హరిపాదాబ్జరజఃపూతసరిజ్ఞలే

వారందరు జలతర్పణములనిచ్చి అధికముగా విలపించి, శ్రీహరి యొక్క పాదపద్మములయందలి ధూళిచే పవిత్రమైన గంగానదీజలము లలో మరల స్నానమును చేసిరి.

తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజమ్

గాంధారీం పుత్రశోకార్తాం పృథా కృష్ణాం చ మాధవః

సాంత్వయామాస మునిభిరతబంధన్ శుచార్సితాన్

భూతేషు కాలస్య గతిం దర్శయన్నప్రతిక్రియామ్

ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, ఆయన సోదరులు, పుత్రశోకముతో బాధపడుతున్న గాంధారీకుంతీద్రౌపదులు, యుద్ధములో బంధువులను పోగొట్టుకొని శోకమునకు వశులైయున్న ఇతరులు అక్కడ కూర్చుండి దుఃఖించుచుండగా, శ్రీకృష్ణభగవానుడు మహర్షులతో కూడి వారికి ప్రాణు లు మృత్యువు వాతబడుట అనివార్యమని బోధించి ఓదార్చెను.

సాధయిత్వాఽజాతశత్రోస్స్వరాజ్యం కితవైర్హృతమ్

ఘాతయిత్వాఽసతో రాజ్ఞః కచస్పర్శక్షతాయుషః

యాజయిత్వాశ్వమేదైస్తం త్రిభిరుత్తమకల్పకైః

తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాతనోత్

శ్రీకృష్ణభగవానుడు అజాతశత్రువగు ధర్మరాజునకు జూదగాళ్లగు దుర్యోధనాదులచే అపహరింపబడిన తనదైన రాజ్యమును సంపాదించి పెట్టి, ద్రౌపదియొక్క జుట్టుముడిని పట్టుకొనుటచే క్షీణించిన ఆయుర్గా యము గల దుష్టులగు రాజులను సంహరింపజేసి, ధర్మరాజుచేత ఉత్తమ మగు సామగ్రి మరియు ఋత్విక్కులు గల మూడు అశ్వమేధయాగము లను చేయించి, ఆయనయొక్క పవిత్రమగు కీర్తిని ఇంద్రుని కీర్తిని వలె నాల్గు దిక్కులయందు విస్తరింప జేసెను.

ఆమంత్యృ పాండుపుత్రాంశ్చ శైనేయోద్ధవసంయుతః

ద్వైపాయనాదిభిర్వి ప్రైః పూజితైః ప్రతిపూజితః

గంతుం కృతమతిర్భృహ్మన్ ద్వారకాం రథమాస్థితః

ఉపలేభేఽభిధావంతీముత్తరాం భయవిహ్వలామ్

శ్రీకృష్ణభగవానుడు ద్వారకకు వెళ్లవలెనని నిశ్చయించుకునే వాడై, పాండవుల వద్ద సెలవు తీసుకొని, వ్యాసుడు మొదలగు మహర్షులనువెంట రాగా, రథమును అధిష్ఠించుచుండగా, భయముతో కంగారు పడుతూ తన వైపునకు పరుగెత్తుకొని వచ్చుచున్న అభిమన్యుపతియగు ఉత్తరాదేవిని చూచెను.

పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే

నాన్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరమ్

ఓ మహాయోగీ! దేవదేవా! జగన్నాయకా! ఒకరిని మరియొకరు చంపుకునే ఈ లోకములో నాకు నీవు తక్క మరియొక శరణు కానరాదు. .

అభిద్రవతి మామీశ శరస్తప్తాయసో విభో

కామం దహతు మాం నాథ మా మే గర్భో నిపాత్యతామ్

ఓ ఈశ్వరా! ప్రభూ! రక్షకుడా! మండుచున్న ఇనుప బాణము నా వైపునకు వచ్చుచున్నది. అది నన్ను యథేచ్ఛగా సంహరించు గాక! కాని, నా గర్భమునకు హాని కలుగరాదు.

సూత ఉవాచ

ఉపధార్య వచస్తస్యా భగవాన్ భక్తవత్సలః

అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత

సూతుడు ఇట్లు పలికెను: భక్తవత్సలుడగు శ్రీకృష్ణభగవానుడు ఆమె మాటను వింటూనే, అది ఈ జగత్తులో పాండవుల వంశము లేకుండా చేయుటకొరకై అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమని గ్రహించెను.

తర్హ్యేవాథ మునిశ్రేష్ట పాండవాః పంచ సాయకాన్

ఆత్మనోఽభిముఖాన్ దీప్తానాలక్ష్యాస్త్రాణ్యుపాదదుః

ఓ మహర్షీ! అదే సమయములో పాండవులు కూడ తమ వైపుకు వచ్చుచున్న మండే అయిదు బాణములను చూచి, తమ అస్త్రములను పైకి తీసిరి."

వ్యసనం వీక్ష్య తత్తేషామనన్యవిషయాత్మనామ్

సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాద్విభుః

ఇతరవిషయములయందు లగ్నము కాని మనస్సులు గల (తన యందు అనన్యమగు భక్తి గల) ఆ పాండవులకు వచ్చిన ఆ ఆపదను చూచి, శ్రీకృష్ణభగవానుడు తన అస్త్రమగు సుదర్శనచక్రముతో తన భక్తులను రక్షించెను.

అంతఃస్థస్సర్వభూతానామాత్మా యోగేశ్వరో హరిః

స్వమాయయావృణోధ్గర్భం వైరాట్యాః కురుతంతవే

సర్వప్రాణుల ఆత్మరూపుడు, సర్వయోగులకు ప్రభువు అగు శ్రీకృ ష్ణభగవానుడు కురువంశముయొక్క ఒకే ఒక సంతానమును నిలబెట్టుట కొరకై విరాటపుత్రికయగు ఉత్తరయొక్క గర్భములోనికి ప్రవేశించి, దానిని తన మాయాశక్తితో కప్పివేసెను.

యద్యవ్యస్త్రం బ్రహ్మశిరస్త్వమోఘం చాప్రతిక్రియమ్

వైష్ణవం తేజ ఆసాద్య సమశామ్యద్భృగూద్వహ

ఓ శౌనకమహర్షీ! బ్రహ్మాస్త్రము మొక్కవోనిది, ప్రతిక్రియ లేనిది అయిననూ, వైష్ణవతేజస్సు ఎదురు కాగానే శాంతించెను.

మా మంస్థా హ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయేఽచ్యుతే

య ఇదం మాయయా దేవ్యా సృజత్యవతి హంత్యజః

అద్భుతములన్నింటికీ పుట్టినిల్లగు శ్రీకృష్ణభగవానుని విషయ ములో ఈ బ్రహ్మాస్త్రమును ఉపశమింప జేయుట ఆశ్చర్యమని నీవు తలు పకుము. పుట్టుక లేని ఆయన తన మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి, పాలించి, సంహరించుచున్నాడు. .

బ్రహ్మతేజోవినిర్ము క్తైరాత్మ జైస్సహ కృష్ణయా

ప్రయాణాభిముఖం కృష్ణమిదమాహ పృథా సతీ

పతివ్రతయగు కుంతి బ్రహ్మాస్త్రముయొక్క తేజస్సునుండి విము కులైన పాండవులతో మరియు ద్రౌపదితో గూడినదై, ప్రయాణమునకు సిద్ద ముగా నున్న శ్రీకృష్ణభగవానునితో నిట్లనెను.

కుంత్యువాచ

నమస్యే పురుషం త్వాద్యమీశ్వరం ప్రకృతేః పరమ్

అలక్ష్యం సర్వభూతానామంతర్బహిరవస్థితమ్

కుంతి ఇట్లు పలికెను: నీవు ఆదినారాయణుడవు, సర్వజగన్నియం తవు. మాయాశక్తికి అతీతమైన నీవు ఇంద్రియములకు గోచరించవు. సర్వ ప్రాణుల అంతఃకరణమునందు మాత్రమే గాక బాహ్యమునందు కూడ నెల కొనియున్న నీకు నమస్కరించు చున్నాను.

మాయాజవనికాచ్ఛన్నమజ్ఞాఽధోక్షజమవ్యయమ్

న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా

మాయ అనే తెరచే కప్పివేయబడియుండే నీవు ప్రత్యక్షాదిప్రమాణములకు గోచరుడవు కావు. అట్టి అవినాశియగు నిన్ను నేను ఎట్లు తెలియగలను? మూర్ఖుడు వేషమును దాల్చియున్న నటుని పోల్చుకొన లేడు. అటులనే, దేహాభిమానముచే సమ్మోహితమైన బుద్ధిగల మానవుడు నిన్ను గుర్తుపట్ట లేడు.

తథా పరమహంసానాం మునీనామమలాత్మనామ్

 భక్తియోగవిధానార్థం కథం పశ్యేమ హి స్త్రియః

సమ్యగ్జర్శననిష్ఠులు, స్వచ్ఛమగు అంతఃకరణము గలవారునగు మహర్షులు సైతము భక్తియోగమును చేయుట కొరకై నీవు భూమియందు అవతరించితివి. అట్టి నీ యథార్థస్వరూపమును స్త్రీలమగు మేము ఎట్లు చూడగల్గుదుము?

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ

నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ:

దేవకీవసుదేవుల ముద్దుబిడ్డడై జన్మించి నందగోపుని ఇంటిలో ఆవులను కాయుచూ పెరిగిన శ్రీకృష్ణునకు అనేక నమస్కారములు.

నమః పంకజనాభాయ నమః పంకజమాలినే

నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంక్షయే

నాభియందు పద్మము గలవాడు, పద్మముల మాలను దాల్చినవా డు, పద్మమును బోలిన కన్నుల వాడు, అరికాళ్లయందు పద్మముల చిహ్న ములు గలవాడునగు నీకు అనేక నమస్కారములు.

యథా హృషీ కేశ ఖలేన దేవకీ

కం సేన రుద్దాకతిచిరం శుచార్పితా

విమోచితాహం చ సహాత్మజా విభో

త్వయైవ నాణేన ముహుర్విపద్గణాత్

ఇంద్రియాధిపతివగు ఓ పరమేశ్వరా! ప్రభూ! దుష్టుడగు కంసు నిచే బంధింపబడి చిరకాలము దుఃఖముతో నిండిన జీవితమును గడిపిన దేవకీదేవిని నీవు ఏ విధముగా బంధవిముక్తురాలిని చేసితివో, అదే విధ ముగా నా పుత్రులతో సహా నన్ను కూడా పలు పర్యాయములు రక్షకు డవగు నీవు మాత్రమే ఆపదల సమూహమునుండి గెట్టెక్కించితివి.

విషాన్మహాగ్నేః పురుషాదదర్శనాత్

అసత్సభాయా వనవాసకృచ్చృతః

మృధే మృధీఽనేకమహారథాస్త్రతో

ద్రౌణ్యస్త్రతశ్చ్వాఽస్మ హర్వేఽభిరక్షితాః

ఓ శ్రీహరీ! నీవు మమ్ములను విషము (దుర్యోధనుడు భీమునకు విషమునిచ్చిన సందర్భము) నుండి, లక్క ఇంటిలో పెద్ద అగ్ని ప్రమాదము నుండి, హిడింబుడు మొదలైన రాక్షసులు తారసపడ్డ పరిస్థితులనుండి, దుర్యోధనుడు మొదలగు దుష్టసభికుల సభనుండి, అరణ్యవాసములోని కష్టములనుండి, అనేకయుద్ధములలో కర్ణుడు మొదలైన అనేకులగు మహా రథుల అస్త్రముల బారినుండి, ఈ నాడు అశ్వత్థామయొక్క బ్రహ్మాస్త్రము నుండి కాపాడగా, మేమీ విధముగా జీవించి యున్నాము.

విపదస్సంతు నశ్శశ్వతత్ర తత్ర జగద్గురో

భవతో దర్శనం యత్స్యా దపునర్భవదర్శనమ్

గీతను బోధించిన ఓ జగద్గురూ! మాకు సర్వదా ఆయా సందర్బ ములలో ఆపదలు వచ్చుచుండును గాక! ఏలయనగా, మాకు ఆపదల యందు నీ దర్శనమగుచుండును, నీ దర్శనము చేసిన వారికి, మరల సంసారమును దర్శింపబని లేదు గదా!

జన్మైశ్వర్యశ్రుతశ్రీభిరోధమానమదః పుమాన్

నైవార్హత్యభిధాతుం వై త్వామహించనగోచరమ్

దరిద్రునకైననూ నీవు దర్శనమునిచ్చెదవు. గొప్ప వంశములో పుట్టుట, అధికారము, చదువు, సంపద అను వాటి కొరణముగా పెరిగిన గర్వము గల పురుషుడు నిన్ను పిలుచుటకైననూ అర్హుడు కాడు.

నమోఽకించనవిత్తాయ నివృత్తగుణవృత్తయే

ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః

దరిద్రులకు నీవే సంపద. ప్రకృతిగుణముల కార్యమగు ప్రపంచము నీకు లేపమును కలిగించదు. రాగము మొదలగు దోషములు లేని నీవు స్వస్వరూపమునందు మాత్రమే రమించెదవు. మోక్షమునిచ్చే ప్రభుడవగు నీకు అనేకనమస్కారములు.

మన్యే త్వాం కాలమీశానమనాదినిధనం విభుమ్

సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిథః కలిః

కాలస్వరూపుడు, ఆద్యంతములు లేనివాడు, సర్వవ్యాపకుడు అగు పరమేశ్వరుడు నీవేనని నేను తలంచుచున్నాను. ప్రాణులు పరస్స రము కలహించుకొనుచున్ననూ, నీవు సర్వకాలములలో సర్వప్రాణులలో సమానముగా సంచరించు చున్నావు.

న వేద కశ్చిద్భగవంశ్చికీర్షితం

తవేహమానస్య నృణాం విడంబనమ్

న యస్య కశ్చిద్దయితోఽస్తి కరిచిత్

ద్వేష్యశ్చ యస్మిన్విషమా మతిర్నృణామ్

ఓ భగవాన్! నీవు మానవులను అనుకరిస్తూ లీలలను చేసెదవు. నీవు ఏమి చేయ గోరుచున్నావో ఎవ్వరికీ తెలియదు. నీకు ఏ కాలమునండై ననూ ఎవ్వరైననూ ప్రియమైనవాడు గాని, ద్వేషింప దగినవాడు గాని లేడు. కాని, మానవులు నీ విషయములో పరస్పరవిరుద్ధములగు ధారణ లను కలిగి యున్నారు.

జన్మ కర్మ చ విశ్వాత్మన్నజస్యాకర్తురాత్మనః

తిర్యజ్ఞృషిషు యాదస్సు తదత్యంతవిడంబనమ్

విశ్వమునకు ఆత్మ అయినవాడా! నీకు. పుట్టుక గాని, కర్తృత్వము గాని లేవు. కాని, నీవు పశు (వరాహ), మనుష్య(శ్రీరామ), ఋషి(వామన),జలచర (మత్స్య) యోనులయందు జన్మించి ఆయా కర్మలను చేయుట కేవలము లీల మాత్రమే.

గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావత్

యా తే దశాశ్రుకలిలాంజనసంభ్రమాక్షమ్

వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య

సా మాం విమోహయతి భీరపి యద్బిబేతి

నీవు పాలకుండను పగులకొట్టుట అనే అల్లరి పనిని చేసినప్పుడు యశోద కోపించి నిన్ను కట్టివేయుటకై త్రాటిని తీసుకువచ్చునంతలో, నీవు కాటుకతో కలిసిపోయిన కన్నీరు చెక్కిళ్లపై ప్రవహించుచుండగా, ఆదుర్దాగా ఇటునటు చూస్తూ ముఖమును క్రిందకు దించుకుని భయపడిపోతూ నిలబ డియున్న ఏ అవస్థ గలదో, అది నన్ను విశేషముగా మురిపించుచున్నది. వాస్తవములో నీ వలన భయము కూడ భయపడును గదా!

కేచిదాహురజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే

యదోః ప్రియస్యాన్వవాయే మలయ స్యేవ చందనమ్

నీకు పుట్టుక లేదు. అయిననూ, పవిత్రమగు కీర్తి గలవాడు మరియు నీకు ఇష్టుడు అగు యదుమహారాజుయొక్క కీర్తిని విస్తరింప జేయుట కొరకై, చందనవృక్షము మలయపర్వతముపై ప్రకటమైన రీతిగా, ఆయన వంశములో జన్మించినావని కొందరు చెప్పుచున్నారు.

అపరే వసుదేవస్య దేవక్యాం యాచిత్వోఽభ్యగాత్

అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషామ్

దేవకీవసుదేవులు పూర్వజన్మలో నిన్ను తమ పుత్రుడు కమ్మని కోరగా, నీవు జన్మలేని వాడవైననూ జగత్తుయొక్క క్షేమమును గోరి రాక్ష సులను సంహరించుటకై వారికి పుత్రుడవై జన్మించితివని మరికొందరు చెప్పుచున్నారు.

భారావతరణాయాన్యే భువో నావ ఇవోదధౌ

సీదంత్యా భూరిభారేణ జాతో హ్యాత్మభువార్థితః

సముద్రములో నావ వలె అధికమగు భారముచే పీడింపబడు చున్న భూమియొక్క భారమును తగ్గించుట కొరకు బ్రహ్మచే ప్రార్థింపబడి నీవు జన్మించినావని ఇతరులు చెప్పుచున్నారు.

భవ్వేఽస్మిన్ క్లిశ్యమానానామవిద్యాకామకర్మభిః

శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన

ఈ సంసారములో ఆత్మస్వరూపముయొక్క అజ్ఞానము, దాని వలన కామనలు, వాటి వలన కర్మలు అనే చక్రములో తగులుకొని క్లేశపడు చున్న జనులకు వినుటకు మరియు స్మరించుటకు అర్హములగు లీలలను చేయగోరి నీవు జన్మించినావని కొందరు చెప్పుచున్నారు.

శృణ్వంతి గాయంతి గృణంత్యభీక్ష్ణశః

స్మరంతి నందంతి తవేహితం జనాః

త ఏవ పశ్యంత్యచిరేణ తావకం

భవప్రవాహోపరమం పదాంబుజమ్

జనులు నీ చరితమును నిత్యము విని, కీర్తించి, పఠించి, స్మరించి ఆనందించుచున్నారు. అట్టివారు మాత్రమే శీఘ్రమే జన్మపరంపరకు స్వస్తి చెప్పే నీ పాదపద్మములను చూచెదరు.

అప్యద్య నస్త్వం స్వకృతేహిత ప్రభో

జిహాససి స్విత్సుహృదోఽనుజీవినః

యేషాం న చాన్యద్భవతః పదాంబుజాత్

పరాయణం రాజసు యోజితాంహసామ్

భక్తుల కోర్కెలను ఈడేర్చే ఓ ప్రభూ! నీవీనాడు నిన్ను ఆశ్ర యించి జీవించే మిత్రులమగు మమ్ములను విడువ గోరుచున్నావా యేమి? మేము రాజులకు దుఃఖమును కలిగించి యుంటిమి. మాకు నీ పాదపద్మ ములు తక్క మరియొక శరణు లేదు.

కే వయం నామరూపాభ్యాం యదుభిస్సహ పాండవాః

భవత్వోఽదర్శనం యర్షి హృషీకాణామివేశితుః

జీవుని సన్నిధానము లేనిచో, ఇంద్రియముల గతి యేమగును? ఈ నాడు యదువులు మరియు పాండవులమగు మేము పేరుప్రఖ్యాతుల ను, సంపదలను కలిగి యున్నాము. నీ దర్శనము లేనిచో, అట్టి మాకు అస్తి త్వము ఏమి ఉండును?

నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర

త్వత్పదైరంకితా భాతి స్వలక్షణవిలక్షి తైః

ఓ గదాధరా! ఈ కురుదేశములోని భూమి ఈనాడు అసాధారణ మగు పద్మము మొదలగు చిహ్నములు గల నీ పాదముల ముద్రలతో ప్రకా శించుచున్నది. కాని, నీవు వెళ్లిన తరువాత దానికి ఆ శోభ కరువగును.

ఇమే జనపదాస్స్వృద్దాసుపక్వౌషధివీరుధః

వనాద్రినద్యుదన్వంతో హ్యేదంతే తవ వీక్షితైః

అడవులు, పర్వతములు, నదులు, సముద్రములతో కూడిన ఈ రాజ్యములు నీ చూపుల చలవ వలన కోతకు వచ్చిన పంటలతో, ఫలము లతో నిండిన లతలతో మరియు వృక్షములతో సుసమృద్ధములై వర్ధిల్లుచున్నవి. 

అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తీ స్వకేషు మే

స్నేహపాశమిమం ఛింధి దృఢం పాండుసు వృష్ణిషు

ఓ జగన్నాయకా! నామరూపాత్మకమగు జగత్తునకు అధిష్టానమైన వాడా! జగద్రూపములో ప్రకటముగువాడా! నీవు వెళ్లే పక్షములో, నాకు ఈ పాండవులయందు యాదవులయందు గల దృఢమైన మమకారము అనే బంధమును ఛేదించుము.

త్వయి మేఽనన్యవిషయా మతిర్మధుపతేఽసకృత్

రతిముద్వహతాదద్ధా గంగేవోఘముదన్వతి

ఓ యదుపతీ! నా బుద్ది ఇతరవిషయములయందు లగ్నము కాకుండగా నిరంతరముగా గంగాప్రవాహము (విఘ్నములను లెక్కచేయ కుండగా) సముద్రములో కలియువిధముగా నీయందు అవిచ్ఛిన్నమగు ప్రీతిని కలిగియుండు గాక!

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృకృషభావనిధ్రుగ్-

రాజన్యవంశదహనానపవర్గవీర్య

గోవింద గోద్విజసురార్తిహరావతార

యోగేశ్వరాఖీలగురో భగవన్నమస్తే

ఓ శ్రీకృష్ణా! నీవు అర్జునునకు మిత్రుడవు. యదువంశ శ్రేష్ఠుడవు. భూలోకమునకు చేటును తల పెట్టే రాజుల వంశములను నశింపజేసే నీ ప్రభావము అనంతమైనది. ఓ గోవిందా! నీవు గోవుల, బ్రాహ్మణుల మరియు దేవతల కష్టములను బాపుటకు అవతరించినావు. యోగులకు ప్రభువగు ఓ జగద్గురూ! నీకు నమస్కారమగు గాక! .

సూత ఉవాచ

పృథయేత్థం కలపదైః పరిణూతాఖిలోదయః

మందం జహాస వైకుంఠ మోహయన్నివ మాయయా

సూతుడు ఇట్లు పలికెను: ఈ విధముగా కుంతి మధురమగు వాక్య ములతో శ్రీహరియొక్క సర్వతోముఖమగు. మహిమను కొనియాడగా, ఆయన తన మాయచే మోహింప జేయుచున్నాడా యన్నట్లు మెల్లగా నవ్వెను.

తాం బాడమిత్యుపారంత్యృ ప్రవిశ్య గజసాహ్వయమ్

స్త్రీయశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్ణా రాజ్ఞా నివారితః

ఆయన ఆమెతో సరే అని పలికి ఆమె వద్ద, మరియు హస్తినాపుర మును ప్రవేశించి సుభద్ర మొదలగు వారి వద్ద సెలవు తీసుకొని తన నగర మునకు బయలుదేర బోతూ ఉండగా ధర్మరాజు ప్రేమతో ఆయనను నివా రించెను.

వ్యాసాద్యైరీశ్వరేహాజ్ఞైః కృషైనాద్భుతకర్మణా

ప్రబోధితోఽపీతిహాసైర్నాబుధ్యత శుచార్పితః

బంధుమరణముచే అతిశయించిన దుఃఖమును పొందియున్న ధర్మరాజును అద్భుతమగు లీలలు గల శ్రీకృష్ణుడు మాత్రమే గాక, ఈశ్వ రుని అభిప్రాయమునెరింగిన వ్యాసుడు మొదలగు మహర్షులు కూడ వివిధ ములగు ఇతిహాసములను చెప్పి ఓదార్చిరి. అయిననూ, ఆయనకు దుఃఖము శాంతించలేదు.

ఆహ రాజా ధర్మసుతశ్చింతయన్ సుహృదాం వధమ్

ప్రాకృతేనాత్మనా విప్రా స్నేహమోహవశం గతః

ఓ మహర్షులారా! మనస్సులో అవివేకము నిండియుండుటచే ధర్మరాజు ప్రేమకు మోహమునకు వశుడై స్నేహితుల వధను గురించి చింతిస్తూ ఇట్లు పలికెను.

అహో మే పశ్యతాజ్ఞానం హృది రూఢం దురాత్మనః

పారక స్యైవ దేహస్య బ్రహ్వ్యో మేఽక్షౌహిణీర్హతాః

అయ్యో! దుష్టబుద్దినగు నో హృదయమునందు గట్టిగా నెలకొని యున్న అజ్ఞానమును గనుడు. కుక్కలకు నక్కలకు ఆహారము కోదగిన ఈ నా దేహము కొరకై అనేకములగు అక్షౌహిణీల (21 870 రథములు, 21 870 ఏనుగులు, 109 350 సిపాయీలు, 65 600 అశ్వ సైనికులు కలిసి ఒక అక్షౌహిణి) సైన్యము సంహరించ బడినది.

బాలద్విజసుహృన్మిత్రపితృభ్రాతృగురుద్రుహః

న మే స్యాన్నిరయాన్మోక్షో హ్యపీ వర్షాయుతాయుతైః

పిల్లలకు బ్రాహ్మణులకు బంధువులకు స్నేహితులకు తండ్రులకు అన్నదమ్ములకు మరియు గురువులకు ద్రోహమును చేసిన నాకు పది కోట్ల సంవత్సరముల తరువాత నైననూ నరకమునుండి విడుదల లభించదు.

నైనో రాజ్ఞః ప్రజాభక్తుర్ధర్మయుద్దే వధో ద్విషామ్

ఇతి మే న తు బోధాయ కల్పతే శాసనం వచః

ప్రజలను రక్షించే రాజు ధర్మయుద్దములో శత్రువులను సంహరిం చుటలో పాపము లేదనే శాస్త్రవచనమైతే నా అవగాహనకు వచ్చుట లేదు.

స్త్రీణాం మద్దతబంధూనాం ద్రోహో యోఽసావిహోత్థితః

కర్మభిర్గృహమేధీయైర్నాహం కల్పో వ్యపోహితుమ్

బంధువులను సంహరించుటచే స్త్రీలకు జరిగిన ద్రోహమును నేను గృహస్థులు చేసే యజ్ఞయాగాది కర్మల ద్వారా పోగొట్టుకొన లేను.

యథా పంకేన పంకాంభస్సురయా వా సురాకృతమ్

భూతహత్యాం తథైవైకాం న యజ్ఞైర్మారష్టుమర్హతి

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే అష్టమోఽధ్యాయః.

బురద నీటిని మరింత బురదతో శుద్దము చేయలేము. మద్యము వలన వచ్చిన దోషమును మరింత మద్యముతో తుడిచి వేయలేము. అదే విధముగా, ఒక ప్రాణియొక్క హింసాదోషమునైననూ అనేకయజ్ఞముల ద్వారా తుడిచి వేయుట సంభవము కాదు.

శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.