భాగవత మహా పురాణము
12 - ద్వాదశోఽధ్యాయః
శౌనక ఉవాచ ।
అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మశీర్ ష్ణోరుతేజసా ।
ఉత్తరాయా హతో గర్బ ఈ శేనాజీవితః పునః ॥
శౌనకమహర్షి ఇట్లు పలికెను: అశ్వత్థామ గొప్ప తేజస్సు గల బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఉత్తర గర్భమునందలి శిశువును సంహరించ గా, శ్రీకృష్ణభగవానుడు మరల ఆ శిశువునకు ప్రాణము పోసినాడు.
తస్య జన్మ మహాబుద్దేః కర్మాణి చ మహాత్మనః ।
నిధనం చ యథైవాసీత్స ప్రేత్య గతవాన్ యథా ॥
గొప్ప బుద్ధిశాలి, మహాత్ముడు అగు పరీక్షిత్తు జన్మించి, గొప్ప కార్యములను చేసి, మరణించిన వృత్తాంతమెట్టిది ? మరణించిన తరువాత ఆయన ఎట్టి గతిని పొందినాడు?
తదిదం శ్రోతుమిచ్చామి గదితుం యది మన్యసే ।
బ్రూహి న శ్రద్దధానానాo యస్య జ్ఞానమదాచ్ఛుకః ॥
నీవు చెప్ప దలచుకున్నచో, నేనీ విషయమును వినగోరుచున్నా ను. శుకమహర్షిచే జ్ఞానోపదేశము చేయబడిన ఆ పరీక్షిత్తుయొక్క వృత్తాంత మును శ్రద్ధాళువులమగు మేము వినగోరుచున్నాము.
సూత ఉవాచ ।
అపీపలద్ధర్మరాజః పితృవద్రంజయన్ ప్రజాః ।
నిస్స్పృహస్సర్వకామేభ్యః కృష్ణపాదాను సేవయా ॥
శ్రీకృష్ణుని పాదములను సేవించుటచే కోరికలన్నింటినుండియు విరక్తిని పొందిన ధర్మరాజు తన తండ్రి వలెనే ప్రజారంజకముగా రాజ్యము నేలెను.
సంపదః క్రతవో లోకామహిషీ భ్రాతరో మహీ ।
జంబూద్వీపాధిపత్యం చ యశశ్చ త్రిదివం గతమ్ ॥
ఆయనకు సంపదలు గలవు. పోటీలో ఆయన క్రతువులను చేసి, పుణ్యలోకములను జయించినాడు. ఆయనకు భార్య, సోదరులు గలరు. రాజ్యము గలదు. జంబూద్వీపముపై పెత్తనము గలదు. ఆయన కీర్తి స్వర్గము వరకు ప్రాకెను.
కిం తే కామాస్సురస్పార్హా ముకుందమనసో ద్విజాః ।
అధిజహ్రుర్ముదం రాజ్ఞః క్షుధితస్య యథేతరే ॥
ఓ మహర్షులారా! దేవతలు కూడ కోరుకునే ఈ భోగములు శ్రీకృ ష్ణునియందు లగ్న మైన మనస్సు గల ధర్మరాజునకు ఆనందమును కలి గించినవా? లేదు. ఆకలి గొన్నవానికి ఆహారము తక్క ఇతరవిషయములు ప్రీతిని కలిగించునా?
మాతుర్గర్భగతో వీరస్స తదా భృగునందన ।
దదర్శ పురుషం కంచిద్దహ్యమానోఽస్త్రతేజసా ॥
ఓ కౌశికమహర్షీ! తల్లి గర్భములోనున్న వీరుడగు ఆ పరీక్షిత్తు తనను బ్రహ్మాస్త్రముయొక్క తేజస్సు దహించి వేయుచుండగా, ఒకానొక పురుషుని కనుగొనెను.
అంగుష్ఠమాత్రమమలం స్పురత్పురటమౌలినమ్ ।
అపీచ్యదర్శనం శ్యామం తడిద్వాససమచ్యుతమ్ ॥
శ్రీమద్దీర్ఘచతుర్బాహుం తప్తకాంచనకుండలమ్ ।
క్షతజాక్షం గదాపాణిమాత్మనస్సర్వతోదిశమ్ ।
పరిభ్రమంతముల్కాభాం భ్రామయంతం గదాం ముహుః ॥
అస్త్రతేజస్స్వగదయా నీహారమివ గోపతిః ।
విధమంతం సంనికర్షే పర్యైక్షత క ఇత్యసౌ ॥
బొటనవ్రేలు. పరిమాణము గలవాడు, స్వచ్చమైనవాడు, ప్రకాశించే బంగరు కిరీటమును ధరించినవాడు, మిక్కిలి సుందరమగు రూపము గలవాడు, నల్లని వాడు, మెరుపు వలె పచ్చని వస్త్రములను దాల్చినవాడు, నిర్వికారుడు, అందమైన పొడవాటి నాలుగు చేతులు గలవాడు, మేలిమి బంగారముతో చేసిన కుండలములను ధరించినవాడు, ఎర్రని కన్నులవాడు అగు ఆ పురుషుడు చేతిలోని గదను నిరంతరముగా తనకు దగ్గరగా నలు వైపులా గిరగిర త్రిప్పుతూ, సూర్యుడు మంచును పారద్రోలినట్లు బ్రహ్మాస్త్ర ముయొక్క తేజస్సును శాంతిపజేయుచుండగా, గర్భమునందలి ఆ శిశువు చూచి, ఈతడు ఎవడు? అని ఆలోచించెను.
విధూయ తదమేయాత్మా భగవాన్ ధర్మగుబ్విభుః ।
మిషతో దశమస్యాస్య తత్రైవాంతర్దధే హరిః ॥
ఇంద్రియములకు మనస్సునకు అందని స్వరూపము గలవాడు, ధర్మమును రక్షించువాడు, సర్వవ్యాపకుడు అగు శ్రీహరిభగవానుడు ఆ అస్త్రమును శాంతింపజేసి, ఆ పదిమాసముల శిశువు చూచుచుండగా, అచటనే అంతర్ధానమాయెను.
తతస్సర్వగుణోదర్కే సానుకూలగ్రహోదయే ।
జజ్ఞే వంశధరః పాండోర్భూయః పాండురివౌజసా ॥
తరువాత సకల లక్షణములు క్రమముగా ఒకదానిని మించి మరి యొకటి ఉన్న, అనుకూలములగు ఇతరగ్రహములతో కూడిన శుభగ్రహ ములు ఉదయించియున్న సమయములో పాండువంశమును నిలబెట్టే శిశువు పుట్టెను. ఆ తేజశ్శాలియగు బాలుడు మరల జన్మించిన పాండుమ హారాజువలె నుండెను.
తస్య ప్రీతమనా రాజా విప్రైర్ధౌమ్యకృపాదిభిః ।
జాతకం కారయామాస వాచయిత్వా చ మంగలమ్ ॥
ధర్మరాజు సంతోషముతో నిండిన అంతరంగము గలవాడై, ధౌమ్యుడు కృపాచార్యుడు మొదలగు బ్రాహ్మణులచే పుణ్యాహవాచన మును జాతకర్మను చేయించెను.
హిరణ్యం గాం మహీం గ్రామాన్ హస్త్యశ్వాన్నృపతిర్వరాన్ ।
ప్రాదాత్స్వన్నం చ విప్రేభ్యః ప్రజాతీర్థే స తీర్థవిత్ ॥
సంతానము కలిగిన పుణ్యసమయములో దానమును చేయవలె ననే దానధర్మము తెలిసిన ఆ ధర్మరాజు బ్రాహ్మణులకు బంగారము, గోవులు, భూమి, గ్రామములు, మంచి ఏనుగులు, జాతి గుర్రములు, మరియు మంచి ఆహారము అనువాటిని దానము చేసెను.
తమూచుర్బ్రాహ్మణాస్తుష్టా రాజానం ప్రశ్రయాన్వితమ్ ।
ఏష హ్యస్మిన్ ప్రజాతంతౌ కురూణాం పౌరవర్షభ ॥
దైవేనాప్రతిఘాతేన శుక్లే సంస్థాము పేయుషి ।
రాతో వోఽనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా ॥
సంతోషించిన బ్రాహ్మణులు వినయశీలియగు ఆ ధర్మరాజుతోనిట్ల నిరిః ఓ పురువంశ శిరోమణీ! కురువుల శుద్ధమగు ఈ వంశపరంపర అనివా ర్యమగు దైవముచే నాశము చేయబడగా, సర్వసమర్థుడగు విష్ణువు మిమ్ములననుగ్రహించి ఈ బాలకుని ఇచ్చినాడు.
తస్మాన్నామ్నా విష్ణురాత ఇతి లోకే బృహచ్ఛ్రవాః ।
భవిష్యతి న సందేహో మహాభాగవతో మహాన్ ॥
కావున, ఈతడు లోకములో విష్ణురాతుడు (విష్ణువుచే ఈయబడిన వాడు) అను పేరుతో గొప్ప కీర్తిని పొంది, గొప్ప భగవద్భక్తుడు మరియు మహాత్ముడు కాగలడు. సందేహము లేదు.
యుధిష్ఠిర ఉవాచ ।
అప్యేష వంశ్యాన్ రాజర్షీన్ పుణ్యశ్లోకాన్మహాత్మనః ।
అనువర్తితా స్విద్యశసా సాధువాదేన సత్తమాః ॥
ధర్మరాజు ఇట్లు పలికెను: ఓ మహాత్ములారా! ఈ బాలకుడు సాధుపురుషులచే కొనియాడబడే కీర్తిని సంపాదించి, మా వంశమునకు చెందిన పవిత్రమగు కీర్తిగల మహాత్ములగు రాజర్షులను అనుసరించునా?
బ్రాహ్మణా ఊచుః ।
పార్థ ప్రజావితా సాక్షాదిక్ష్వాకురివ మానవః ।
బ్రహ్మణ్యస్సత్యసంధశ్చ రామో దాశరథీర్యథా ॥
ఓ ధర్మరాజా! బ్రహ్మవేత్తలయందు ప్రీతిగలవాడు, దశరథరా ముని వలె సత్యసంధుడు అగు ఈతడు సాక్షాత్తు మునుపుత్రుడగు ఇక్ష్వా కువు వలే ప్రజలను రక్షించును;
ఏష దాతా శరణ్యశ్చ యథా హ్యౌశీనరశ్శిభిః ।
యశో వితనితా స్వానాం దౌష్యంతిరివ యజ్వనామ్ ॥
ఈతడు ఉశీనరదేశాధిపతియగు శిబిచక్రవర్తి వలే దాతయై శరణు పొందిన వారిని రక్షించును. ఈతడు దుష్యంతపుత్రుడగు భరతుని వలే తన వారి కీర్తిని మాత్రమే గాక యాజ్ఞికుల కీర్తిని కూడ విస్తరింప జేయగలడు. .
ధన్వినామగ్రణీరేష తుల్యశ్చార్జునయోర్ద్వయోః ।
హుతాశ ఇవ దుర్ధర్షస్సముద్ర ఇవ దుస్తరః ॥
ఈతడు అర్జునుడు మరియు కార్తవీర్యార్జునుడు అనే ఇద్దరితో సమానమైన అగ్రేసరుడగు ధనుర్ధారి కాగలడు. ఇతడు అగ్నిహోత్రము వలే జయించ శక్యము కానివాడు, సముద్రము వలె తెలియజాలని గాంభీర్యము గలవాడు కాగలడు.
మృగేంద్ర ఇవ విక్రాంతో నిషేవ్యో హిమవానివ ।
తితిక్షుర్వసుధేవాసౌ సహిష్ణుః పీతరావివ ॥
ఈతడు సింహమువంటి పరాక్రమము గలపోడై, హీమంతుని వలె సత్పురుషులచే సేవించబడ గలడు. ఈతడు భూమీ వలె క్షమ గలవా డు, తల్లిదండ్రుల వలె సహనశీలము గలవాడు కాగలడు.
పితామహసమస్సామ్యే ప్రసాదే గిరిశోపమః ।
ఆశ్రయస్సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః ॥
ఈతడు సమభావమునందు బ్రహ్మతో, అనుగ్రహించుటలో శివుని తో, ప్రాణులనన్నింటినీ కాపాడుటలో లక్ష్మీపతియగు విష్ణుభగవానునితో పోల్చ దగినవాడు కాగలడు.
సర్వసద్గుణమాహాత్మ్య ఏష కృష్ణమనువ్రతః ।
రంతిదేవ ఇవోదారో యయాతిరివ ధార్మికః ॥
ఈతడు శ్రీకృష్ణభక్తుడై సకలసద్గుణముల మహిమను కలిగి, రంతి దేవుని వలె దయాశీలి, యయాతి వలె ధర్మాత్ముడు కాగలడు.
ధృత్యా బలిసమః కృష్ణే ప్రహ్రాద ఇవ సద్గ్రహః ।
ఆహర్తైషోఽశ్వమేధానాం వృద్ధానాం పర్యుపాసకః ॥
ఈతడు ధైర్యముతో బలిచక్రవర్తితో సమానమగువాడు కాగలడు. ఈతడు ప్రహ్రాదుని వలె శ్రీకృష్ణునియందు దృఢమగు భక్తిని కలిగియుండును. పెద్దలను సేవించే ఈతడు అనేకములగు అశ్వమేధయాగములను చేయగలడు.
రాజర్షీణాం జనయితా శాస్తా చోత్పథగామినామ్ ।
నిగ్రహీతో కలేరేష భువో ధర్మస్య కారణాత్ ॥
ఈతడు రాజర్షులగు పుత్రులకు తండ్రియై, దుష్టులను దండించి, భూమాత కోరకు ధర్మము కోరకు కలిని నిగ్రహించ గలడు.
తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ।
ప్రపత్స్యత ఉపశ్రుత్య ముక్తసంగః పదం హరేః ॥
ఈతడు బ్రాహ్మణబాలకునిచే ప్రేరితుడైన తక్షకుని వలన తనకు మరణము కలుగునని విని సంసారమునందు ఆసక్తిని వీడి, శ్రీహరియొక్క ధామమును పొందగలడు.
జిజ్ఞాసితాత్మయాథాత్మ్యో మునేర్వ్యాససుతాదసౌ ।
హిత్వేదం నృప గంగాయాం యాస్యత్యద్ధాఽకుతోభయమ్ ॥
ఓ ధర్మరాజా! ఈతడు వ్యాసపుత్రుడగు శుకమహర్షి వలన ఆత్మ జ్ఞానమును శ్రవణము చేసి, ఈ శరీరమును గంగాతీరములో విడిచి పెట్టి, నిరంకుశమగు అభయస్థానము (మోక్షము) ను నిశ్చయముగా పొందును.
ఇతి రాజ్ఞ ఉపాదిశ్య విప్రా జాతకకోవిదాః ।
లభ్ధోపచితయస్సర్వే ప్రతిజగ్ముస్స్వకాన్ గృహాన్ ॥
జాతకపండితులు అందరు ఈ విధముగా రాజునకు జాతకఫల మును చెప్పి, ఆయనచే సత్కరించ బడినవారై, తమ గృహములకు వెళ్లిరి.
స ఏష లోకవిఖ్యాతః పరీక్షిదితి యత్ప్రభుః ।
గర్భదృష్టమనుధ్యాయన్ పరీ క్షేత నరేష్విహ ॥
ఈ విష్ణురాతుడు తాను గర్భములో చూచిన పురుషుని గుర్తుకు తెచ్చుకొని, ఆయన వీరిలో నున్నాడా యేమి అని తన ఎదురుగా నున్న మనుష్యులను పరీక్షగా చూసేడివాడు. కావుననే, ఆయనకు లోకములో పరీక్షిత్తు అను పేరు ప్రసిద్ధిని గాంచినది.
స రాజపుత్రో వవృధ ఆశు శుక్ల ఇవోడుపః ।
ఆపూర్యమాణః పితృభిః కాష్ఠాభిరివ సోఽన్వహమ్ ॥
శుక్లపక్షములో కొత్త కొత్త కళలు వచ్చి చేరుచుండగా ప్రతిదినము పెరిగే చంద్రుని వలె, ఆ రాజకుమారుడు ధర్మరాజాదులచే పెంచబడుతూ దినదిన ప్రవర్ధమానుడు కాజొచ్చెను.
యక్ష్యమాణోఽశ్వమేధేన జ్ఞాతిద్రోహజీహాసయా ।
రాజాఽలబ్ధధనో దధ్యావన్యత్ర కరదండయోః ॥
జ్ఞాతిద్రోహము వలన కలిగిన దోషమును పరిహరించుటకై ధర్మ రాజు అశ్వమేధయాగమును తల పెట్టెను. కాని, దానికి కావలసినంత ధనము ఆయన వద్ద లేకుండెను. పన్ను వేసి మరియు దుష్టులను శిక్షించి తద్ద్వారా ధనమును రాబట్టుట ఆయనకు సమ్మతము కాదు. కావున, ఆయన మరియొక ఉపాయమును ఆలోచించు చుండెను.
తదభిప్రేతమాలక్ష్య భ్రాతరోఽచ్యుతచోదితాః ।
ధనం ప్రహిణమాజహ్రురుదీచ్యాం దిశి భూరిశః ॥
ధర్మరాజుగారి అభీష్టమును గమనించిన సోదరులు శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ఉత్తరదిక్కునందు పూర్వము మరుత్తమహారాజు యజ్ఞ మును చేసి వదిలి పెట్టి వెళ్లిపోయిన బంగరు పాత్రలు మొదలగు సంప దను, అట్టి ద్రవ్యముపై రాజునకు గల అధికారమును బట్టి, తీసుకువచ్చిరి.
తేన సంభృతంసంభారో ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
వాజిమేధైస్త్రిభిర్భీతో యజ్ఞైస్సమయజద్ధరిమ్ ॥
ధర్మపుత్రుడగు ధర్మరాజు జ్ఞాతిద్రోహము వలన కలిగిన దోషము నకు భయపడి ఆ ధనముతో యజ్ఞసామగ్రిని సంపాదించుకొని, మూడు అశ్వమేధయాగముల ను చెసెను.
ఆహూతో భగవాన్ రాజ్ఞా యాజయిత్వా ద్విజై ర్నృపమ్ ।
ఉవాస కతిచిన్మాసాన్ సుహృదాం ప్రియకామ్యయా ॥
శ్రీకృష్ణభగవానుడు ధర్మరాజుయొక్క ఆహ్వానమునందుకొని వచ్చి, బ్రాహ్మణుల సాహాయ్యముతో ధర్మరాజుచే యజ్ఞమును చేయించి, ప్రియమిత్రులగు పాండవుల ప్రీతి కొరకై కొన్ని మాసములు అచటనే మకాము చేసెను.
తతో రాజ్ఞాభ్యనుజ్ఞాతః కృష్ణయా సహ బంధుభిః ।
యమౌ ద్వారవతీం బ్రహ్మన్ సార్జునో యదుభిర్వృతః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధేద్వాదశోఽధ్యాయః ॥
ఓ శౌనకమహర్షీ! తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుగారి అనుమతిని తీసుకొని, ద్రౌపది, అర్జునుడు, బంధువులు మరియు యాదవులు. వెంట రాగా ద్వారకకు వెళ్లాను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పన్నెండవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
King Yudhishtira performs three horse sacrifices to celebrate the divine order and honors the birth of his grand-nephew, the son of Abhimanyu and Uttarā, who was protected by Lord Kṛshṇa in the womb. The newborn child, having seen the Lord while still in the womb, constantly examined every person he met to find that same divine form, earning him the name Parīkshit, and the learned brāhmaṇas present at his birth prophesied his future greatness, unmatched chivalry, devotion, and his eventual ultimate departure.