2 -  ద్వితీయోఽధ్యాయః

వ్యాస ఉవాచ

ఇతి సంప్రశ్నసంతుష్టో విప్రాణాం రౌమహర్షణిః

ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే

వ్యాసుడు ఇట్లు పలికెను: ఈ విధముగా ఆ మహర్షులు వేసిన చక్కని ప్రశ్నలను విని రోమహర్షణుని పుత్రుడగు సూతమహర్షి చాల సంతో షించి, వారి వచనమును అభినందించి చెప్పుట మొదలిడెను.

సూత ఉవాచ

యం ప్రవ్రజంతమను పేతమపేతకృత్యం

ద్వైపాయనో విరహకాతర ఆజుహావ

పుత్రేతి తన్మయతయా తరవోభినేదు

తం సర్వభూతహృదయం మునిమానతోస్మి

సూతుడు ఇట్లు పలికెను: జ్ఞానియగుటచే సకలకర్తవ్యములనుండి విముక్తుడై యున్న శుకమహర్షి ఉపనీతుడు కాకుండగా (లేదా ఒంటరిగా) సర్వమును విడిచి పెట్టి వెళ్లిపోవుచుండగా, వ్యాసమహర్షి ఆ వియోగము నకు భయపడి, ఓ పుత్రా అని పిలువగా, శుకుని ఆత్మరూపములే యగు వృక్షములు ప్రత్యుత్తరమునిచ్చినవి (ప్రతిధ్వనించినవి). సర్వప్రాణుల బుద్ధి యందు ఆత్మరూపముగా ప్రకాశించే అట్టి శుకమహర్షికి నేను నమస్క రించుచున్నాను.

యస్స్వానుభావమఖిలశ్రుతిసారమేక-

మధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధమ్

 సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం

తం వ్యాససూనుముపయామి గురుం మునీనామ్

పురాణములలో రహస్యమగు భాగవతము తనదైన అసాధారణ మగు ప్రభావము గలది. సకలవేదముల సారమగు ఈ పురాణసు సంసారమనే గాఢమగు చీకటిని అతిక్రమించగోరు సంసారులకు ఆత్మతత్వ మును ప్రకాశింపజేసే సాటిలేని దీపము వంటిది. దీనిని వ్యాసపుత్రుడగు శుకమహర్షి దయతో బోధించినాడు. మునులకు కూడ గురువగు ఆ శుకుని నేను శరణు పొందుచున్నాను.

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

మానవులలో సర్వశ్రేష్టులగు నరనారాయణమహర్షులను, సరస్వ తీదేవిని మరియు వ్యాసమహర్షిని నమస్కరించి, తరువాత సంసారముపై విజయమును కలిగించే శ్రీమద్భాగవతమును పఠించవలెను.

మునయస్సాధు పృష్ఠోహం భవద్బిర్లోకమంగళమ్

యత్కృతః కృష్ణసంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి

ఓ మునులారా! మీరు నన్ను లోకములకు కల్యాణమును కలిగించే, శ్రీకృష్ణునకు సంబంధించిన చక్కని ప్రశ్నను వేసితిరి. ఈ ప్రశ్నచే ఆగతఃకరణము మంచి ప్రసన్నతను పొందుచున్నది.

స వై పుంసోం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే

 అహైతుక్యప్రతీహాతో యయాత్మా సుప్రసిదతి

మానవులకు శ్రీమహావిష్ణువునందు ఫలతృష్ణ మరియు విఘ్న ముల బెడద లేని భక్తిని కలిగించే ధర్మమే సర్వోత్కృష్టమైనది. అట్టి భక్తి వలన హృదయము మిక్కిలి ప్రసన్నమగును.

వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః

జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్

సర్వజగన్నివాసుడు మరియు స్వయంప్రకాశస్వరూపుడునగు శ్రీకృష్ణపరమాత్మయందు భక్తిపూర్వకమగు నిష్ట గలవానికి శీఘ్రముగా వైరాగ్యము మరియు శుష్కతర్కమునకు గోచరము కాని ఆత్మజ్ఞానము కలుగును.

ధర్మస్స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః

నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్

మానవులు ధర్మమును చక్కగా అనుష్టించినప్పటికీ, అది వారికి శ్రీమహావిష్ణువుయొక్క గాథలయందు ప్రీతిని కలిగించని పక్షములో కేవ లము వ్యర్థప్రయాస మాత్రమే యగును.

ధర్మస్య హ్యపవర్గ్యస్య నార్థోర్థాయోపకల్పతే

నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః

ధర్మముయొక్క ప్రయోజనము మోక్షము. అర్థము అనే పురుషా ర్థము ధర్మపురుషార్థమునకు యోగ్యమగు ఫలము కాదు. అటులనే, అర్థ మునకు ఏకైకప్రయోజనము ధర్మము కావలెనే గాని, కామము కాదని మహర్షులు చెప్పుచున్నారు.

కామస్య నేంద్రియప్రీతిర్లోభో జీవేత యావతా

జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చహ కర్మభిః

విషయభోగమునకు కేవలము జీవితయాత్రను సాగించుటయే ఫలము గాని, ఇంద్రియతర్పణము కాదు. మానవజీవితము బ్రహ్మవిచార ముచే సార్థకమగునే గాని, కర్మలను చేసి ఫలములను పొందుటచే గాదు.

వదంతి తత్తత్త్వవిదస్తత్త్వం యద్ జ్ఞానమద్యయమ్

బ్రహ్మేతి పరమాత్మేతి భగవానీతి కథ్యతే

జ్ఞాతృ-జ్ఞానభేదము లేని జ్ఞానమే తత్త్వమని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఆ తత్త్వమునకే బ్రహ్మ, పరమాత్మ, భగవానుడు అని ప్యరము గలదు.

తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా

 పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా

మననశీలురగు శ్రద్ధాళువులు శ్రవణముచే సంప్రాప్తమైన, జ్ఞానై రాగ్యములతో కూడిన జ్ఞాననిష్ణారూపమగు భక్తిచే ఆ తత్త్వమును బుద్ధియందు ఆత్మరూపముగా దర్శించెదరు.

అతః పుంభిర్ద్విజశ్రేష్టా వర్ణాశ్రమవిభాగశః

 స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణమ్

కావున, ఓ శౌనకాది మహర్షులారా! వర్ణాశ్రమవ్యవస్థానుసార ముగా చక్కగా అనుష్ఠించబడిన ధర్మమునకు హరి ప్రసన్నుడగుటయే పూర్ణమగు సిద్ధి యగును.

తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః

శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యశః

కావున, నిత్యము ఏకాగ్రమగు మనస్సుతో భక్తవత్సలుడగు శ్రీకృ ష్ణభగవానుని గురించి శ్రవణము చేసి, ఆయనను కీర్తించి, ధ్యానించి, పూజించవలెను.

యదనుధ్యాసినో యుక్తాః కర్మ గ్రంథినిబంధనమ్

 ఛందంతి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారతిమ్

వివేకవంతులగు జనులు శ్రీకృష్ణుని ధ్యానము అనే కత్తితో అహం కారమనే చిక్కుముడిని కల్పించి గట్టిగా బంధించే కర్మను ఛేదించుచున్నారు. అట్టి స్థితిలో ఆయన కథయందు ఎవడు ప్రీతిని చేయకుండును?

శుశ్రూషోశ్శ్రద్ధధానస్య వాసుదేవకథారతిః.

స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థని షేవణాత్

ఓ మహర్షులారా! పుణ్యక్షేత్రములను సేవించుట వలన మహా త్ముల సేవ, దాని వలన శ్రద్ధ, దాని వలన. శ్రవణమునందు కోరిక, శ్రవణము వలన వాసుదేవుని కథలయందు ప్రీతి కలుగును.

శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః

హృద్యంతఃస్థో హ్యభద్రాణి వీధునోతి సుహృత్సతామ్

శ్రీకృష్ణుని గాథలు వినువారిని కీర్తించువారిని పవిత్రము చేయును. ఆయన తన గాథలను వినువారి అంతరంగమునందున్నవాడై బుద్దియం దలి అమంగళకరమగు వాసనలను పారద్రోలును. ఏలయనగా, ఆయన సత్పురుషులకు హితకారి.

నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా

 భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ

నిత్యము భగవద్భక్తులను (లేదా భాగవతమును) సేవించుట వలన అశుభవాసనలు ఇంచుమించు పూర్తిగా నశించిపోగా, పవిత్రమగు కీర్తి గల పరమేశ్వరునియందు నిశ్చలమగు భక్తి కుదురును.

తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే

 చేత ఏతైరనావిద్దం స్థితం సత్వే ప్రసీదతి

  అప్పుడు రజస్తమోగుణములనుండి పుట్టే కామము లోభము మొదలైన భావములు మనస్సును నిర్వీర్యము చేయజాలవు. ఆ మనస్సు సత్త్వగుణమునందు స్థిరపడి ప్రసన్నముగా నుండును.

ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తియోగతః

 భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే

ఈ విధముగా భగవంతునితో భక్తిపూర్వకమగు నిరంతరసంబం ధము వలన ప్రసన్నమైన మనస్సు కలిగి సంసారమునందలి ఆసక్తులన న్నింటినీ విడిచి పెట్టిన సాధకునకు భగవంతుని యథార్థస్వరూపముయొక్కసాక్షాత్కారము ఉదయించును.

భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యంతే సర్వసంశయాః

 క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే

ఆత్మరూపుడైన ఈశ్వరుని సాక్షాత్కారము అయినప్పుడు మాత్రమే (అయిన వెంటనే) చైతన్యమునకు మిథ్యాభూతమగు జడముతో ఏర్పడిన ఈ జీవుని అహంకారమనే ముడి విడిపోయి, సందేహముల న్నియు పటాపంచలగును. అట్టి జ్ఞానియొక్క కర్మలన్నియు (ప్రారబ్ధకర్మను మినహాయించి) నశించును.

అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా

 వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మప్రసాదినీమ్

ఇందువలననే, వివేకవంతులు వసుదేవపుత్రుడై అవతరించిన శ్రీకృష్ణభగవానునియందు మనస్సునకు ప్రసన్నతను కలిగించే భక్తిని మహా నందముతో చేయుచున్నారు.

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణా స్తైః

యు పరః పురుష ఏక ఇహాస్య ధత్తే

స్థిత్యాదయే హరివిరించిహరేతి సంజ్ఞాః

శ్రేయాంసి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః

సత్త్వము, రజస్సు మరియు తమస్సు అనునవి ఈశ్వరుని మాయాశక్తియొక్క గుణములు. ప్రకృతికి అతీతుడు, అద్వితీయుడు మరియు పూర్ణుడు అగు పరమేశ్వరుడు ఈ గుణములతో కూడి క్రమముగా ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుట కొరకై బ్రహ్మవిష్ణురు ద్రులనే నామములను స్వీకరించును. వారిలో సత్త్వస్వరూపుడగు విష్ణువు వలన మానవులకు శ్రేయస్సు కలుగును.

పార్థివద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః

తమసస్తు రజస్తమ్మోత్సత్త్వం యదహ్మదర్శనమ్

పృథివీవికారము, అనగా ప్రవృత్తి (రజోగుణలక్షణము) గాని, ప్రకా శము (సత్త్వగుణ లక్షణము) గాని లేని కట్టెనుండి పొగ (ప్రవృత్తి గలది), దానినుండి వేదోక్తకర్మలకు మూలమగు అగ్ని (ప్రకాశము) ఆవిర్భవించు చున్నవి. అదే విధముగా తమోగుణముకంటె రజోగుణము, దానికంటే సత్త్వగుణము శ్రేష్ఠమైనవి. ఏలయనగా, సత్త్వగుణము పరబ్రహ్మను ప్రకా శింప జేయును.

భేజిరే మునయ్వోథాగ్రే భగవంతమధోక్షజమ్

సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే యే ను తానిహ

ఇందువలననే, పూర్వము మహర్షులు విశుద్ధసత్త్వస్వరూపుడగు శ్రీమహావిష్ణువును సేవించిరి. ఎవరైతే వారిని అనుసరించెదరో, వారు కూడ ఈ సంసారములో కల్యాణభోజనులగుదురు.

ముముక్షవో ఘోరరూపాన్ హిత్వా భూతపతీనథ

 నారాయణకలాశ్శాంతా భజంతి హ్యనసూయవః

ఇందువలననే, మోక్షమును కోరు సాధకులు ఇతరదేవతారూపము లయందు దోషములను వెదికేవారు కాకపోయిననూ, భయంకరాకారులగు భైరవాది భూతనాథులను ప్రక్కనబెట్టి, శ్రీమన్నారాయణుని మరియు ప్రస న్నమగు రూపముగల ఆయన అంశలను సేవించుచున్నారు.

రజస్తమఃప్రకృతయస్సమశీలా భజంతి వై

 పితృభూతప్రజేశాదీన్ శ్రియైశ్వర్యప్రజేప్సవః

రజోగుణ తమోగుణప్రధానమగు స్వభావము గల వ్యక్తులు సంప ద, అధికారము, సంతానము అను వాటిని గోరి, తమ స్వభావముతో తుల దూగే పితరులు, భూతములు, ప్రజాపతులు మొదలగు వారిని ఆరాధించేదరు.

వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః

 వాసుదేవపరా యోగా వాసుదేవపరాః క్రియాః

వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః

వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః

వేదములు వాసుదేవుని మాత్రమే పరమతాత్పర్యముగా బోధించు చున్నవి. యజ్ఞములు వాసుదేవుని ఉద్దేశించి మాత్రమే చేయబడుచున్నవి. యోగముల ఉద్దేశ్యము కూడ వాసుదేవుడే. కర్మలన్నియు వాసుదేవుని యందు పరిసమాప్తిని జెందును. జ్ఞానము వలన పొందబడేది వాసుదేవుడే. తపస్సు మరియు ధర్మము వాసుదేవుని కొరకు మాత్రమే అనుష్టించబడు చున్నవి. స్వర్గాదిఫలములన్నియు వాసుదేవునియందు మాత్రమే విలీనమ గుచున్నవి.

స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మమాయయా

సదసద్రూపయా చాసౌ గుణమయ్యగుణో విభుః

సర్వవ్యాపకుడగు ఆ పరమేశ్వరుడే తాను గుణములకు అతీతుడే అయిననూ, సృష్ట్యాదియందు కార్యకారణాత్మకము మరియు త్రిగుణాత్మ కము అగు తన మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించెను.

తయా విలసితే ష్వేషు గుణేషు గుణవానివ

 అంతః ప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభితః

ఆ మాయాశక్తియొక్క విలాసములగు ఈ మూడు గుణముల యందు (కార్యములయందు) లోపల ప్రవేశించి ఆ పరమేశ్వరుడు చైతన్య శక్తిచే సర్వమును ఆవేశించి (సర్వమును ప్రకాశింపజేయుచూ), గుణములు కలవాడా యన్నట్లు అంతటా ప్రకాశించు చున్నాడు.

 యథా హ్యవహీతో వహ్నిర్దారుష్వేకస్స్వయోనిషు

నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్

ఒకే అగ్ని తనను ప్రకటింపజేసే కట్టెలయందు ఉన్నదై అనేకమా యన్నట్లు కన్పట్టును. అదే విధముగా, సర్వప్రాణులలో ఆత్మరూపముగా నుండే పరమేశ్వరుడు అనేకమా యన్నట్లు కానవచ్చుచున్నాడు.

అసౌ గుణమయైర్బావైర్భూతసూక్ష్మేంద్రియాత్మభిః

 స్వనిర్మితేషు నిర్విష్ఠో భుంక్తే భూతేషు తద్గుణాన్

పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే సూక్ష్మపంచ భూతములు, ఇంద్రియములు మరియు మనస్సు అను త్రిగుణాత్మకము లగు తత్త్వములతో ఈ పరమేశ్వరుడు ప్రాణులను సృష్టించి, వారియందు ప్రవేశించి, శబ్దరూపరసస్పర్శగంధములనే విషయములను భోగించు చున్నాడు.

భావయత్యేష సత్త్వేన లోకాన్వై లోకభావనః

లీలావతారానురతో దేవతిర్యజ్నరాదిషు

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే ద్వితీయోఽధ్యాయః

లోకకర్తయగు ఈ పరమేశ్వరుడు దేవపశుపక్షిమనుష్యాదియోను లలో లీలగా అవతరించుటయందు ప్రీతి గలవాడై, సత్త్వగుణము ద్వారా నిశ్చయముగా లోకములను పాలించు చున్నాడు.

శ్రీమద్భాగవతములోని ప్రథమస్కంధమునందు రెండవ అధ్యాయము ముగిసినది.