భాగవత మహా పురాణము
1 - ప్రథమోఽధ్యాయః
ఓం జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్స్వరాట్
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యంతి యత్సూరయః ।
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ॥
ఈ జగత్తులోని పదార్థములన్నింటియందు ఉనికి అనువృత్తమగు చున్నది. కాని, ఒక పదార్థమునందు మరియొకటి ఉండుట లేదు. కావున, ఈ జగత్తు సద్రూపమగు పరంబ్రహ్మనుండి పుట్టి, దానియందే స్థితిని పొంది, దానియందే విలీనమగునని స్పష్టమగుచున్నది. సర్వజ్ఞుడు మరియు స్వయంప్రకాశస్వరూపుడు అగు ఆ పరమేశ్వరుడు తన సంకల్పముచేతనే బ్రహ్మగారికి వేదమును ప్రకాశింప జేసినాడు. ఆ పరమేశ్వరుని విషయములో విద్వాంసులైననూ మోహమును పొందుచున్నారు. సత్వ రూపమగు పరంబ్రహ్మయందు అగ్ని, నీరు మరియు పృథివి ప్రకటమైనట్లు గనే, వాటి కార్యమగు (లేదా త్రిగుణాత్మకమగు) ఈ జగత్తు వాస్తవముగా లేకున్ననూ ప్రతీయమానమగుచున్నది. చైతన్యస్వరూపుడగు ఆ పరమేశ్వరునకు మాయాదోషములు అంటవు. అట్టి సదనమగు పరంబ్రహ్మను ధ్యానించుచున్నాము (అనగా ఆత్మరూపముగా దర్శించుచున్నాము).
ధర్మః ప్రోజ్ఘిత క్షేతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం
వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమ్ ।
శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః
సద్యో హృద్యవరుధ్యత్వేత్ర కృతిభిశ్శుశ్రూషుభిస్తత్క్షణాత్ ॥
వేదవ్యాసమహర్షిచే రచించబడిన ఈ శ్రీమద్భాగవతమునందు ఫలమునందలి తృష్ణ అనే దోషమును పూర్తిగా త్రోసిపుచ్చే సర్వోత్కృష్ణమగు ధర్మము బోధించబడినది. మాత్సర్యదోషములేని సత్పురుషులచే తెలియదగినది, పరమార్థసత్యము, శ్రేయస్కరమైనది, ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధిభౌతికములనే మూడు విధముల దుఃఖములను పోగొట్టునది అగు బ్రహ్మవస్తువును ఈ గ్రంథము ప్రతిపాదించు చున్నది. ఇతరములగు శాస్త్రములు మానవుల హృదయములో ఈశ్వరుని వెనువెంటనే స్థిరము చేయు టలో విఫలమగుచుండగా, ఈ గ్రంథమును శ్రవణము చేయు పుణ్యాత్ములకు ఈశ్వరుడు తత్క్షణమే హృదయములో స్థిరముగా నెలకొనును.
నిగమకల్పతరోర్గళితం ఫలం
శుకముఖాదమృతద్రవసమ్మితమ్ ।
పిబత భాగవతం రసమాలయం
ముహురహో రసికా భువీ భావుకాః॥
పరమానందమనే రసముతో నిండియున్న భాగవతము అనే పంట వేదము అనే కల్పవృక్షమునుండి శుకమహర్షియొక్క నోటిగుండా (చిలుక కొరికిన పండు చాల రుచిగా నుండునని ప్రసిద్ధి) భూలోకములో అవతరించినది (నేలపై పడినది). ఆశ్చర్యము! భక్తిభావముతో నిండిన హృదయము గల ఓ రసజ్ఞులారా! రసరూపమగు ఈ పండును మోక్షము లభించు వరకు మరల మరల ఆస్వాదించుడు.
నైమిశే నిమిషక్షేత్రే మునయశ్శౌనకాదయః ।
సత్రం స్వర్గాయలోకాయ సహస్రసమమాసత ॥
లుప్తము కాని చైతన్యము స్వరూపముగా గల శ్రీమహావిష్ణువు యొక్క క్షేత్రమగు నైమిశారణ్యమునందు, స్వర్గలోకములో గానము చేయ బడువాడు మరియు భక్తులచే సదా ధ్యానించబడువాడు అగు శ్రీమహావి ష్ణువును పొందగోరి, శౌనకుడు మొదలుగా గల మహర్షులు వేయి సంవత్స రములు (దినములు) కొనసాగే సత్రయాగముననుష్ఠించిరి.
త ఏకదా తు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః ।
సత్కృతం సూతమాసీనం పప్రచ్చురిదమాదరాత్ ॥
ఒకనాడు ఆ మునులు ఉదయమే హోమద్రవ్యములతో అగ్ని యందు హోమమును నిర్వర్తించి, తరువాత సూతమహర్షిని సత్కరించి ఆసనముపై కూర్చుండబెట్టి ఆయనను సాదరముగా ఇట్లు ప్రశ్నించిరి.
ఋషయ ఊచుః ।
త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ ।
ఆఖ్యాతిన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత ॥
ఋషులు ఇట్లు పలికిరి: ఓయీ పుణ్యాత్మా! నీవు ఇతిహాసములను, పురాణములను, సకలధర్మశాస్త్రములను అధ్యయనము చేయుట మాత్రమే గాక, వ్యాఖ్యానమును కూడ చేసియుంటివి.
యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణః ।
అన్యే చ మునయస్సూత పరాపరవిదో విదుః ॥
వేత్థ త్వం సౌమ్య తత్సర్వం తత్త్వతస్తదనుగ్రహాత్ ।
బ్రూయుస్స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత॥
ఓ సూతా! ఓయీ సాధుపురుషా! వేదవేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసు నకు మరియు సగుణనిర్గుణబ్రహ్మతత్త్వములనెరింగిన ఋషులకు తెలిసిన విషయములన్నియు వేదవ్యాసమహర్షియొక్క అనుగ్రహము వలన నీకు యథాతథముగా తెలియును. గురువులు ప్రేమ కలిగిన శిష్యునకు రహస్య మగు విషయమును కూడ నిశ్చయముగా చెప్పెదరు కదా!
తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితమ్ ।
పుంసామేకాంతతశ్శ్రేయస్తన్నశ్శంసితుమర్హసి ॥
ఓ ఆయుష్మంతుడా! ఆయా ధర్మశాస్త్రములు మొదలగు వాటి యందు ఏది మానవులకు యథార్థముగా ఖచ్చితమైన శ్రేయస్సును కలిగించే ఉపాయమని నీవు నిశ్చయించినావో, దానిని మాకు దయచేసి బోధించుము.
ప్రొయేణాల్పాయుషస్సర్వే కలావస్మిన్ యుగే జనాః ।
మందాస్సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః ॥
ఏలయనగా, ఈ కలియుగములో ఇంచుమించుగా మానవులందరు సోమరులై అల్పమగు ఆయుర్దాయము, మిక్కిలి మందమగు బుద్ధి మరియు అల్పమగు భాగ్యము గలవారై రోగములు మొదలగు వాటిచే పీడింపబడు చుందురు.
భూరీణి భూరికర్మాణి శ్రోతవ్యాని విభాగశః ।
అతస్సాధోత్ర యత్సారం సముద్గృహ్య మనీషయా ।
బ్రూహి భద్రాయ భూతానాం యేనాత్మా సుప్రసీదతి ॥
ఓయీ సాధుపురుషా ! శాస్త్రములు విస్తృతమగు కర్మలను బోధిం చుచున్నవి. శాస్త్రములు ఒక భాగమును వినుటకైననూ పెద్దవియే. కావు న, వాటి సారమును నీవు నీ బుద్దిని ఉపయోగించి పైకి తీసి మాకు చెప్పుము. దాని వలన మా అంతఃకరణము మిక్కిలి ప్రసన్నమగును.
సూత జానాసి భద్రం తే భగవాన్ సాత్వతాం పతిః ।
దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా ॥
ఓ సూతా! నీకు మంగళమగు గాక! భక్తరక్షకుడగు పరమేశ్వరుడు ఏ కార్యమును చేయగోరి దేవకీ వసుదేవుల పుత్రుడై జన్మించినాడో నీకు తెలియును.
తన్నశ్శుశ్రూషమాణానామర్హస్యంగానువర్జితుమ్ ।
యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ ॥
ఓ సూతమహర్షీ! ఆ విషయమును మేము వినగోరుచున్నాము. దయచేసి మాకు వర్ణించి చెప్పుము. పరమేశ్వరుని అవతారము ప్రాణుల క్షేమసమృద్ధుల కొరకై ప్రవర్తిల్లును గదా!
ఆపన్నస్సంసృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్ ।
తతస్సద్యో విముచ్యత యద్బిబేతి స్వయం భయమ్ ॥
భయంకరమగు సంసారములో నిస్సహాయుడై యున్న జీవుడు ఆ పరమేశ్వరుని నామమును ఉచ్చరించినచో, వెనువెంటనే దానినుండి విముక్తుడగును. భయము కూడ పరమేశ్వరునకు భయపడును.
యత్పాదసంశ్రయాస్సూత మునయః ప్రశమాయనాః ।
సద్యః పునంత్యుపస్పృష్టాస్స్వర్ధున్యాపోను సేవయా ॥
ఓ సూతమహర్షీ! పరమేశ్వరుని పాదములను ఆశ్రయించి ప్రకృష్ణ మగు శమము (మనోనిగ్రహము) ను సాధన చేసే మహర్షుల సన్నిధిలో వారి స్పర్శ మాత్రముచే మానవుడు వెనువెంటనే పవిత్రుడగును. కాని, గంగాజలము కొంతకాలము సేవించిన తరువాత మాత్రమే పవిత్రము చేయును.
కో వా భగవతస్తస్య పుణ్యశ్లో కేడ్యకర్మణః ।
శుద్దికామో న శృణుయాద్యశః కలిమలాపహమ్ ॥
అంతఃకరణశుద్దిని కోరు ఏ మానవుడు పవిత్రమగు కీర్తి గల జను లచే కొనియాడబడే లీలలు గల ఆ భగవానునియొక్క కలిదోషమును పోగొట్టే కీర్తిని వినకుండును?
తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభిః ।
బ్రూహి నః శ్రద్దధానానాం లీలయా దధతః కలాః ॥
ఆ పరమేశ్వరుడు లీలగా అవతారములను ధరించి గొప్ప కార్యములను నిర్వర్తించుచుండును. ఆ కార్యములను విద్వాంసులు సర్వకాలములలో కీర్తించుచుందురు. శ్రద్ధాళువులమగు మాకు వాటిని గురించి చెప్పుము.
అథాఖ్యాహి హరేథీమన్నవతారకథాశ్శుభాః ।
లీలా విదధతస్వైరమీశ్వరస్యాత్మమాయయా ॥
ఓ బుద్ధిశాలీ! సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువు తన మాయాశక్తిచే యథేచ్ఛగా లీలలను ప్రకటించుచుండును. ఇపుడు శుభకరములగు ఆయన అవతారముల గాథలను చెప్పుము.
వయం తు న వితృష్యామ ఉత్తమశ్లోకవిక్రమే ।
యచ్ఛృణ్వతాం రసజ్ఞానాం స్వాదుస్వాదు పదే పదే ॥
పుణ్యకీర్తియగు పరమేశ్వరుని విక్రమము విషయములో మాకు తృప్తి లేదు. ఏలయనగా, దానిని గురించి వినే రసజ్ఞులకు ప్రతి పదములో మధురపదార్థములకంటే కూడ అధికమగు మాధుర్యము లభించును.
కృతవాన్ కీల వీర్యాణి సహ రామేణ కేశవః ।
అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః ॥
శ్రీవిష్ణుభగవానుడు మాయామానుషరూపమును దాల్చి రహస్యముగా నున్నవాడై బలరామునితో గూడి మానవులకు సాధ్యము కాని పరా క్రమములను ప్రకటించినాడు గదా!
కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయమ్ ।
ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః ॥
కలి వచ్చి పడినదని తెలుసుకొని మేము ఈ వైష్ణవపుణ్య క్షేత్ర ములో దీర్ఘకాలము స్తాగే సత్రయాగమును సంకల్పించి కూర్చుండినాము. మాకు శ్రీమహావిష్ణువుయొక్క కథలను వినే అవకాశము లభించినది.
త్వం నస్సందర్శితో ధాత్రా దుస్తరం నిస్తితీర్షతామ్ ।
కలిం సత్త్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవమ్ ॥
మానవుల అంతఃకరణముయొక్క పవిత్రతను మరియు శక్తిని హరించి వేసే కలిని తరించుట కష్టసాధ్యము. దానిని నిశ్చయముగా తరిం చగోరే మాకు పరమేశ్వరుడు సముద్రమును తరించగోరువారికి నావికుని వలె నిన్ను చూపించినాడు.
బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి ।
స్వాం కాష్ఠమధునో పేతే ధర్మః కం శరణం గతః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే ప్రథమోఽధ్యాయః ॥
యోగములన్నింటికి ప్రభువు, బ్రహ్మవేత్తలయందు ప్రీతి గలవాడు, ధర్మమును కవచమువలె రక్షించువాడు అగు శ్రీకృష్ణుడు స్వస్వరూపమును పొందినాడు. అనగా, అవతారము ఉపసంహరించ బడినది. ఇప్పుడు ధర్మము ఎవనిని శరణు పొంది యున్నది? ఈ విషయమును చెప్పుము.
శ్రీమద్బాగవత పుహాపురాణమునందు ప్రథమస్కంధములో మొదటిఅధ్యాయము ముగిసినది.
Summary of chapter 1 of the Bhāgavata Mahā Purana is as follows:
In the sacred forest of Naimishāraṇya, the revered sages assembled under the leadership of Śaunaka to perform a thousand-year sacrifice for the spiritual upliftment of humanity in the impending age of Kali. Recognizing the decline of virtue in this dark era, the holy seekers approached Sūta Gosvāmī with profound humility and posed six essential questions regarding the ultimate good for all living beings, the essence of all scriptures, the purpose of the incarnation of the Supreme Lord Kṛshṇa, and the refuge of religion after the Lord's departure from the mortal world.