శ్రీ మద్భాగవతము - పంచమ (5వ) స్కందము

Table of Contents

26 - నరకయాతనలను వర్ణించుట

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను  ఓ శుక మహర్షీ! జీవలోక ములో ఇంతటి వివిధత్వమునకు కారణమేమి?

 శుక మహర్షి ఇట్లు పలికెను -- కర్త సాత్త్వికుడు, రాజసుడు, తామ సుడు అని మూడు విధములుగా నున్నాడు. శ్రద్ద కూడ అటులనే గుణము లను బట్టి మూడు విధములుగా నున్నది. కావుననే, జీవలోకమునకంతకూ వేర్వేరు కర్మగతులు అన్నీ గొప్ప తక్కువ భేదములతో కలుగుచున్నవి.

తరువాత, అదే విధముగా కర్త నిషేధరూపమైన అధర్మమును చేసే శ్రద్దలోని అసమానతలను బట్టి, అట్టి కర్మల ఫలములు కూడ అసమా నముగా నుండును. అనాదినుండి వచ్చుచున్న అజ్ఞానముచే కోరికలు పుట్టి, వ్యక్తులు వాటి కారణముగా అధర్మమును చేయుదురు. ఆ అధ ర్మము పండి సంప్రాప్తమయ్యే నరకములు వేలాదిగా నున్నవి. ఇప్పుడు వాటి వివరములను గురూపదేశానుసారముగా వర్ణించెదను.

                         పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను  పూజనీయుడవగు ఓ మహర్షీ! నరకములనగా ఈ లోకములో ఉండే ప్రత్యేక స్థానములా? లేక, అవి ముల్లోకములకు బయటనుండునా? లేక, మధ్యలో నుండునా?

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నరకములు ముల్లోకముల మధ్యలోనే దక్షిణదిక్కునందు భూమికి క్రింద బ్రహ్మాండజలములకు పైన ఉండును. అగ్నిష్వాత్తులు మొదలగు పితృదేవతల గణములు కూడ ఆ దక్షి ణదిక్కునందే నివసించెదరు. వారు తీవ్రముగా ఈశ్వరుని ధ్యానిస్తూ, తమ గోత్రము వారల కామనలు పరిపూర్ణములగునట్లు చేయుదురు.

            అక్కడ పితృదేవతలకు ప్రభువు, పూజనీయుడు అగు యముడు తన అనుచరులతో గూడి భగవానుని శాసనమును ఖచ్చితముగా పాలించు చుండును. మరణించిన ప్రాణులను ఆయన కింకరులు ఆయన సామ్రాజ్య ములోనికి ప్రవేశ పెట్టేదరు. అపుడు ఆయన వారికి వారు చేసిన కర్మల వలన కలిగిన పాపమునకు అనురూపముగా, వారికి దుఃఖరూపమగు ఫల మును శిక్ష వేయుచుండును.

ఆ యమలోకములో ఇరవై ఒక్క నరకములను కొందరు లెక్కించు చున్నారు. ఓ పరీక్షిన్మహారాజా! వాటి పేర్లను, రూపములను, లక్షణము లను నేను వరుసగా వివరించెదను. తామిస్రము, అంధతామిస్రము, గౌరవ ము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, కృమిభోజనము, సందంశము, తప్తసూ ర్మీ, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదము, ప్రాణరోధము, విశసన ము, లాలాభక్షము, సారమేయదనము, అవీచి, అయ:పానము అనునవి ఇరవై ఒకటి. ఇంతేగాక క్షారకర్దమము, రక్షోగణభోజనము, శూలప్రోతము, దందశూకము, అవటనిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అనే ఏడింటితో కలిపి, ఇరవై ఎనిమిది నరకములు. ఈ స్థానములయందు అనేక ములగు యాతనలు ఉండును.

ఇతరుల సొమ్మును, సంతానమును, భార్యను అపహరించిన వ్యక్తిని మిక్కిలి భయమును గొల్పే యమకింకరులు కాలపాశముతో కట్టి వేసి ఆ తొమిస్రము అనే నరకములో బలముగా పారవైచెదరు. చీకటితో నిండియుండే ఆ నరకమునందు జీవునకు తిండి, నీరు దొరకదు. కింకరులు వానిని కర్రలతో కొట్టి భయ పెట్టి ఈ విధముగా హింసలను పెట్టెదరు. అపు డాతడు మహాదుఃఖమును, వెంటవెంటనే మూర్ఛను పొందుచుండును. -

ఇదే విధముగా, ఇతరుని మోసగించి వాని భార్యను ఇతరసంపద లను అనుభవించిన వ్యక్తి అంధతామిస్రములో పారవేయబడును. దేహధా రియగు జీవుడు అచట మొదలు నరుకబడుచున్న చెట్లు వలె యాతనలన నుభవిస్తూ, ఆ పీడచే బుద్దిశక్తిని మాత్రమే గాక, చూపును కూడ కోల్పోవు ను. కావుననే, ఆ నరకమునకు అంధతామిస్రము అనే పేరు వచ్చినది.

ఈ లోకములో ఈ దేహమే .నేను అనే అభిమానముతో, మరియు దేహమునకు సంబంధించినవాటియందు ఇది నాది అనే అభిమానముతో, కేవలము తన కుటుంబమును మాత్రమే చక్కగా పోషించుకొనుట కొరకై ఇతరప్రాణులకు ద్రోహమును చేసే వ్యక్తి ఆ దేహమును కుటుంబమును ఇచటనే విడిచి పెట్టి, ఆ పాపము వలన గౌరవనరకమునందు తనంత తానుగా పడిపోవును.

            ఈ వ్యక్తి ఏ ప్రాణులను ఏ విధముగనైతే అధికముగా హింసించి నాడో, అవే ప్రాణులు పరలోకమునందు వీడు యముని యాతనలను పొందే సందర్భములో రురు అనే జంతువులుగా పుట్టి, వీనిని అదే విధ ముగా అధికముగా హింసించును. కావుననే, ఆ నరకమునకు గౌరవము అని పేరు వచ్చినది. రురు అనగా పాముకంటె మిక్కిలి క్రూరమైన జంతు వునకు పేరు.

మహారౌరవము కూడ ఇదే విధముగా నుండును. ఎవడైతే కేవలము తన పొట్టను తాను పోసుకొనునో, అట్టి వ్యక్తి దానియందు పడును. అచట పచ్చి మాంసమును తినే రురువులు అని ప్రసిద్ధి గాంచిన జంతువులు మాంసము కొరకై వానిని చంపును.

 ఈ లోకములో కొందరు క్రూరస్వభావులుగ నుందురు. వారిలో దయ లేశమైననూ ఉండదు. వారు పశువులను, పక్షులను బ్రతికియుండగనే కాల్చేదరు. అట్టివారిని రాక్షసులు కూడ అధికముగా నిందించెదరు. అట్టివారిని పరలోకములో యమకింకరులు కుంభీపాకములో మరిగే  నూనెలో  వేయించెదరు.

ఎవడైతే ఈ లోకములో తల్లిదండ్రులకు, వేదవేత్తలకు, వేదమునకు ద్రోహమును చేయునో, అట్టివాడు కాలసూత్రము అనే పేరు గల నరకమునందు పడును. అచట రాగితో చేసిన ఒక మైదానము గలదు. దాని చుట్టు కొలత పదివేల యోజనములు. దానిని పైనుండి సూర్యుడు, క్రిందనుండి అగ్ని అధికముగా తపింప జేయుచుండును. కాగిపోయే ఆ మైదానములో ఈతనిని ప్రవేశపెట్టెదరు. ఆ వేడికి ఆకలి దప్పికలు తోడై ఈతని శరీరము లోపల బయట కూడ దహించబడుచుండును. ఆ విధముగా నరపశువు అనదగిన ఆతని శరీరముపై ఎన్ని రోమములు గలవో, అన్ని వేల సంవత్సరములు ఆతడు ఆ మైదానములో ఉండును. ఆతడు అక్కడే పరుండి, అక్కడనే ఇటునటు తిరుగుతూ, ఒకప్పుడు నిలబడి, మరల చుట్టూ పరుగు లెత్తుతూ ఉండును.

ఎవడైతే ఈ లోకములో స్వధర్మమైన వేదమార్గమును ఆపద లేని స్థితిలో కూడ విడిచి పెట్టి, వేదవిరుద్ధమగు మతమును స్వీకరించునో, అట్టి వానిని అసిపత్రవనములో ప్రవేశపెట్టి కొరడాతో కొట్టెదరు. అచట ఈతడు ఇటునటు పరుగులెత్తునపుడు, తాడిచెట్ల అడవిలో రెండు వైపులా పదును ఉండే కత్తులవంటి తాటి ఆకులు అతని శరీరములోని అవయవములనన్నింటినీ కోసివేయుచుండును. అయ్యో! చచ్చిపోవుచున్నాను అంటూ ఆతడు అత్యధికమగు పీడచే మూర్ఛను పొందును. ఆతడు ప్రతి అడుగునందు క్రింద పడిపోతూ, తన ధర్మమును విడిచిపెట్టి వేదవిరుద్ధమగు మతమును స్వీకరించినందు వలన వచ్చిన ఫలమును అనుభవించును.

రాజు గాని, రాజుయొక్క అధికారి గాని ఎవడైతే ఈ లోకములో నిర్దోషికి శిక్షను వేయునో, లేదా వేదవేత్తకు శరీరపీడను కలిగించే శిక్షను వేయునో, అట్టి మహాపాపి మరణించి సూకరముఖము అనే నరకములో నిశ్చయముగా పడును. అచట మహాబలశాలురగు యమకింకరులు వాని అవయవములను, ఈ లోకములో చేరకు గడను చేసిన విధముగా, పిప్పి చేసెదరు. అపుడాతడు అయ్యో! అయ్యో! అని ఏడుస్తూ, ఒకప్పుడు మూర్ఛను పొందును. ఈ లోకములో నిర్దోషులను ఆతడు పీడించిన విధ ముగనే, ఆతనికి అచట యమకింకరులు మహాదుఃఖమును కలిగించేదరు.

ఈ లోకములో మానవునకు ఇతర మానవులు బ్రదుకు దెరువును చూపెదరు. మానవునకు. ఇతరప్రాణుల వ్యథ తెలియుచుండును. కాని, జంతువులకు బ్రదుకు దెరువును చూపేది దేముడే. పైగా, వాటికి ఇతరప్రాణుల వ్యథ తెలియదు. ఇట్టి స్థితిలో ఎవడైతే మానవుడై ఉండి, జంతువులకు పీడను కలిగించునో, వాడు మరణించిన పిదప వాటికి చేసిన ద్రోహము కారణముగా నిశ్చయముగా అంధకూపములో పడిపోవును. గ్రామ్యపశువులు, అడవిలో మృగములు, పక్షులు, ప్రాకే జంతువులు, దోమలు, పేలు, నల్లులు, ఈగలు మొదలగు ఏయే జంతువులకు ఆతడు పీడను కలిగించినాడో, ఆయా జంపవులు అచట వానికి అన్ని విధములుగా పీడను కలిగించును. ఆ చీకట్లో వానికి నిద్రాసుఖమైననూ లేకుండా అవి వానిని పీడించును. ఆరోగ్యము చెడిపోయిన దేహమునందు జీవుడు ఏ విధముగా తీసుకొనుచుండునో, ఆ తీరున ఆతడా నరకములో నిలకడ లేక తిరుగాడుచుండును.

ఈ లోకములో కొందరు తమకు లభించిన కొద్దో గొప్పో ఆహారమును ఇతరులకు పెట్టకుండా తినెదరు. వారు ఏ నాడైననూ దానముగాని, హోమము గాని చేయరు. అయిదు మహాయజ్ఞములు (దేవతలకు హోమములో సమర్పించుట, మనుష్యులకు అన్నమునిచ్చుట, పశుపక్ష్యాదులకు ఆహారమునిచ్చుట, బ్రహ్మయజ్ఞము అనగా వేదమునధ్యయనము చేసి ఇతరులకు బోధించుట, పితృయజ్ఞము అనగా బ్రతికియున్న తల్లిదండ్రులకు సేవను చేయుట మరియు వారు మరణించిన తరువాత శ్రాద్ధాదులను చేయుట) వారికి దూరమే. ఈ దోషముల పరిహారము కొరకు వారు ప్రాయశ్చిత్తమునైననూ చేయలేదు. ఇట్టి వ్యక్తులు మరణించిన తరువాత నరకములలో మిక్కిలి చెడ్డదియగు కృమిభోజనమునందు పడిపోవుదురు. అది ఒక క్రిముల గుండము. దాని చుట్టు కొలత లక్షయోజనములు. దానిలో ఈతడు క్రిమియై ఇతరక్రిములచే భక్షింపబడుతూ, తాను కూడ ఇతరక్రిములను భక్షిస్తూ, ఈ విధముగా తన దుఃఖమును తానే కొని తెచ్చుకొని, లక్ష సంవత్సరములు యాతనల ననుభవించును.

ఓ పరీక్షిన్మహారాజా! ఏ వ్యక్తియైతే ప్రాణాంతకస్థితి కాకున్ననూ, వేదవేత్తకు గాని, లేదా మరియొకనికి గాని చెందిన బంగారము రత్నములు  మొదలగువాటిని అపహరించునో, లేదా బలాత్కారముగా లాగుకొనునో, వానిని మరణించిన తరువాత యమకింకరులు కాలే ఇనుప గుళ్లతో కొట్టి, పట్టుకార్లతో చర్మమును నిశ్చయముగా పీకి వేయుదురు.

 ఈ లోకములో పురుషుడు గాని, స్త్రీ గాని వ్యభిచరించినచో, వారు మరణించిన పిదప తప్తసూర్మి అనే నరకములో పడెదరు. అచట యమకింకరులు వారిని కొరడాలతో కొడుతూ, పురుషుడు స్త్రీరూపములో నుండే కాలే లోహప్రతిమను, స్త్రీ పురుషప్రతిమను గట్టిగా కౌగిలించుకొనునట్లు చేసెదరు.

ఎవడైతే ఈ లోకములో సేవించకూడని సర్వమును సేవించునో, వాడు మరణించిన తరువాత నిశ్చయముగా నరకమును పొందును. అచట యమకింకరులు వానిని వజ్రపు ముళ్లు ఉండే బూరుగు చెట్టునెక్కించి, క్రిందకు లాగుచుందురు.

వేదవిరుద్ధమగు మతములకు చెందని రాజులు గాని, రాజాధికారులు గాని, ధర్మమర్యాదనుల్లంఘించి, సమాజమును కలిపి ఉంచే ధర్మములకు ముప్పు తెచ్చినచో, వారు మరణించి నిశ్చయముగా వైతరణీ నదీయందు పడెదరు. మలమూత్రములు, చీము, రక్తము, జుట్టు, గోళ్లు, ఎముకలు, క్రొవ్వు, మాంసము, మజ్జ ప్రవహించే ఆ నది నరకలోకమునకు అగడ్తయై ఉన్నది. వారిని జలజంతువులు అన్ని వైపులనుండియు తినివే యుచున్ననూ, వారు చేసిన పాపము కారణముగా వారికి యాతనా దేహముతో వియోగము కలుగదు. వారిని ప్రాణములు సజీవముగనేయుంచును. అపుడు తాము చేసిన కర్మల పరిపాకమునే ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ వారు తాపమును పొందెదరు.

ఈ లోకములో చేడు స్త్రీలకు పాలకులై బాహ్య-ఆంతరశౌచములను, సచ్ఛీలమును, నియమములను గాలికి వదిలిపెట్టి, సిగ్గును విడిచి పశువుల వలె మెలగే వ్యక్తులు మరణించిన పిదప పూయోదమనే నరకములో చీము, మలమూత్రములు, శ్లేష్మము మరియు ఇతరమాలిన్యములతో నిండియున్న సముద్రములో నిశ్చయముగా పడి, మిక్కిలి వెగటును కలిగించే ఆ పదార్థములనే భక్షించెదరు.

ఈ లోకములో బ్రాహ్మణులు మొదలగు వారు ఎవరైతే కుక్కలను గాడిదలను పెంచి, వాటితో (పై) వేటకు విహారముగా వెళ్లి, మృగములను చంపుటకు అనుజ్ఞ లేని సందర్భములలో కూడ మృగములను చంపెదరో, వారు మరణించిన తరువాత ప్రాణరోధము అనే నరకములో పడెదరు. అచట యమకింకరులు వీరిని లక్ష్యములుగా చేసి, బాణములతో గట్టిగా కొట్టెదరు.

ఈ లోకములో ఏ డాంబీకులు డంబము కొరకై చేసే యజ్ఞములలో పశువులను సంహరించెదరో, వారు మరణించిన పిదప పరలోకములో విశసనమనే నరకములో పడెదరు. అచటి ప్రభువులు వీరిని నిశ్చయముగా యాతనలను పెట్టి సంహరించెదరు.

ఈ లోకములో ఏ ద్విజడు కామముచే కన్నుమిన్ను గానక, సహధర్మచారిణియగు భార్యను పాశవిక సంభోగమునకు గురి చేయునో, అట్టి పాపి నిశ్చయముగా లాలాభక్షమనే నరకములో పడును. అచట యమకింకరులు వానిచే బీభత్సతమగు పదార్థములను భక్షింప జేసెదరు.

 ఈ లోకములో గ్రామములను గాని, వ్యాపారులను గాని దోచుకునే బందిపోట్లు గాని రాజులు గాని రాజభటులు గాని, లేక నిప్పు పెట్టువారు గాని, మరియు విషమునిచ్చువారు గాని మరణించి, నిశ్చయముగా సారమేయదనము అనే నరకములో పడెదరు. అచట ఏడు వందల ఇరవై మంది యమదూతలు వజ్రముల వంటి కోరలు గల కుక్కలుగా మారి, వారిని వేగముగా కోపముతో కరిచి తినెదరు.

ఈ లోకములో ఎవడైతే సాక్ష్యమునందు గాని, ధనమును ఇచ్చి పుచ్చుకొనుటలో గాని, దానము విషయములో గాని, ఏదో విధముగా అసత్యమును పలుకునో, అట్టివాడు మరణించి పట్టుకొనుటకు ఆధారము లేని అవీచి అనే నరకములో పడును. అచట ఆతడు తల క్రిందకు వ్రేలాడుచుండగా, వంద యోజనముల ఎత్తు గల పర్వత శిఖరమునుండి క్రిందకు పడవేయబడును. క్రింద రాతి నేలయే అయినా, నీరు ఉన్నట్లుగా కనబడుచుండు ను. కావుననే, దానికి అవీచి (తరంగములు, అనగా నీరు లేనిది) అని పేరు వచ్చినది. ఆ విధముగా పడినప్పుడు ఆతని శరీరము నుగ్గు నుగ్గుగా శిథిల మగునే గాని, ఆతడు చావడు. అపుడాతనిని యమకింకరులు మరల పర్వత శిఖరముపైకి ఎక్కించి, మరల పడద్రోయుచుందురు.

వేదవేత్త, క్షత్రియుడు, వైశ్యుడు, సోమయాగము చేసినవాడు, వ్రతమునందున్నవాడు, వారి భార్యలు మద్యమును త్రాగరాదు. ఈ నిషేధమును పట్టించుకోకుండా ఎవరైతే ఈ లోకములో మద్యమును త్రాగెదరో, వారిని యమదూతలు నరకమునకు గొనిపోవుదురు. అచట వారు వీరి గుండెలపై కాలితో గట్టిగా తొక్కి పెట్టి, నిప్పులలో కరగబెట్టిన లోహమును నోటిలో చల్లెదరు.

 మరియు ఈ లోకములో వ్యక్తి తాను అధముడే అయి ఉండి కూడా, తపస్సు విద్య సచ్ఛీలము వర్ణము ఆశ్రమము మొదలగువాటిలో తనకంటె గొప్పవారిని ఆదరించనిచో, ఆతడు జీవన్మృతుడే. అయిననూ, ఆతడు మరణించిన తరువాత క్షారకర్దమము (క్షారపు అనగా ఉప్పు కారముల బురద గలది) అనే నరకములో తల్లక్రిందులుగా పారవేయబడి,

అంతము లేని యాతనలననుభవించును.

 ఈ లోకములో కొందరు వ్యక్తులు ఇతరులను హింసించి పూజలను చేయుదురు. కొందరు స్త్రీలు కూడ అట్టి పూజలలో మాంసమును భక్షించెదరు. వారందరు మరణించి రక్షోగణభోజనము అనే నరకములో పడెదరు. ఈ లోకములో వీరిచే హింసించబడిన ప్రాణులే అచట రాక్షసుల గణములుగా అయి, వీరిని యాతనలు పెట్టెదరు. వారు కసాయీల వలె గండ్ర గొడ్డలితో వీరిని నరికి, వీరి రక్తమును త్రాగుతూ, నరమాంస భక్షకులీ లోకములో చేసినట్లే నాట్యమును చేస్తూ, పాటలను పాడుతూ ఆనందించెదరు.

ఈ లోకములో కొందరు అడవిలో గాని, గ్రామములో గాని హింస నెరుగని ప్రాణులకు వివిధోపాయములతో నమ్మకమును కలిగించి, అవి నమ్మకముతో దగ్గరకు రాగానే వాటిని శూలముతో గ్రుచ్చి, లేక త్రాటితో బంధించి, అవి ఆటవస్తువులా యన్నట్లు చేసి వాటిని యాతనలు పెట్టెదరు. బ్రతుకు తీపి వాటికి కూడ ఉండును గదా! అట్టివారు మరణించి శూలప్రోతము అనే నరకములో పడెదరు. అచట వారి దేహములను శూలముపై గ్రుచ్చి యుంచెదరు. ఆకలి దప్పికలతో పీడించబడే వారిని రాబందులు, గవ్వ పక్షులు మొదలగు పక్షులు తమ వాడి ముక్కులతో అన్ని వైపులనుండియు పొడుచుచుండును. అపుడు వారికి తాము చేసిన పాపము గుర్తుకు వచ్చుచుండును.

 ఓ పరీక్షిన్మహారాజా! క్రూరస్వభావము గల జనులు ఈ లోకములో ప్రాణులను త్రాచుల వలె పీడించుచుందురు. అట్టివారు మరణించి, నిశ్చయముగా దందశూకము అనే నరకములో పడిపోయెదరు. అచట అయిదు, ఏడు తలలు గల త్రాచులు వారిని సమీపించి, ఎలుకలను వలె, మ్రింగివేయును.

ఎవరైతే ఈ లోకములో చీకటితో నిండి గాలి సోకని బోక్కలయందు, ధాన్యపు గరి సెలు పర్వతగుహలు మొదలగువాటియందు ప్రాణులను అడ్డగించి పీడించేదరో, అట్టివారు మరణించి అవటనిరోధనమనే నరకములో పడెదరు. అచట వారిని అదే విధముగా అట్టి బొక్కలు మొదలగువాటియందే కూర్చుండబెట్టి విషముతో గూడిన మంటను, పొగను పెట్టి, కదలకుండా అడ్డగించెదరు.

 ఈ లోకములో ఏ గృహయజమాని ఇంటికి అతిథి (పూర్వ పరిచయము లేని వ్యక్తి) గాని, అభ్యాగతుడు (పూర్వపరిచయము ఉన్నవాడు) గాని వచ్చినప్పుడు, కోపమును పొంది, తగులబెట్ట గోరుచున్నాడాయన్నట్లు పలుమార్లు కుటిలదృష్టితో వారిని చూచునో, అట్టివాడు పర్యావర్త నమనే నరకములో పడును. పాపదృష్టి గల అట్టివాని కళ్లను వజ్రపు   ముక్కులు గల గద్దలు, రాబందులు, కాకులు, గవ్వలు మొదలగు అధికమగు బలము గల పక్షులు బలాత్కారముగా పెరికి వేయును.

ఈ లోకములో కొందరు ధనముచే గర్వించి, తామే గొప్పవారమనే అభిమానము గలవారై, వక్రదృష్టితో అందరినీ చూస్తూ తమ ధనము  నపహరించెదరేమో యని శంకించెదరు. వారి హృదయము మరియు ముఖము తమ ధనము ఖర్చు అగునేమో యనియు, నశించిపోవునేమో యనియు చింతచే ఎండిపోయి ఉండును. సుఖమునెరుగని వీరు ధనమునకు బ్రహ్మరాక్షసులు వలె కాపలా కాస్తూ, ఆ ధనమును ప్రోగుచేయుటకు, ప్రోగు చేసినదానిని పెంచుటకు, దానిని సంరక్షించుటకు పాపము లను ప్రోగు చేసుకొనెదరు. ఇట్టివారు మరణించి, నిశ్చయముగా సూచీముఖమనే నరకములో పడెదరు. అచట యమధర్మరాజుయొక్క కింకరులు వీరిని దర్జీలు వలే అన్ని అవయవములయందు సూదులతో దారములను చుట్టూ కుట్టివేయుచుందురు.

ఓ పరీక్షిన్మహారాజా! ఇటువంటి నరకములు యమపురిలో వందలు వేల సంఖ్యలో గలవు. వాటన్నింటిలో అధర్మమును చేసినవారు మాత్రమే కర్మల క్రమమును బట్టి ప్రవేశించెదరు. ఈ అధర్మమును చేసిన వారిలో కొందరిని నేను చెప్పితిని. నేను చెప్పని వారు కూడ గలరు. అదే విధముగా, ధర్మమునాచరించినవారు స్వర్గముమ పొందెదరు. వీరందరు  క్రమముగా తమ పుణ్యపాపములను స్వర్గనరకములలో అనుభవించి, మిగిలిన పుణ్యపాపములతో ఈ భూలోకమునందు మరల జన్మించుటకై ప్రవేశించెదరు.

నివృత్తి అనే మార్గము ముందుగనే (రెండవ స్కంధములో) వర్ణించబడినది. ఈశ్వరుడు పదునాల్గు భువనములుగా బ్రహ్మాండమును రచించెనని పురాణములు వర్ణించుచున్నవి. అట్టి ఈ కోశమువంటి బ్రహ్మాండము  ఇంత మాత్రమే. ఈ బ్రహ్మాండము సాక్షాత్తుగా పురుషోత్తముడగు నారాయణ భగవానుని స్థూలరూపము. ఇది భగవానుని మాయాశక్తియొక్క మూడు గుణముల వికారము. ఈ స్థూలరూపమును వర్ణించడమైనది. భగవానుడు సకలప్రాణులలో అంతరతమమగు ఆత్మరూపుడై ఉన్నాడు. అట్టి భగవానుని ఇంద్రియగోచరము కాని స్వరూపమును ఉపనిషత్తులు వర్ణించుచున్నవి. ఈ స్థూలరూపముయొక్క వర్ణనను ఆదరముతో పఠించి, లేదా విని, ఇతరులకు వినిపించు సాధకునకు శ్రద్ధాభక్తులు అబ్బి, అంతఃకరణము శుద్ధమై, ఆత్మరూపుడగు భగవానుడు సాక్షాత్కరించును.

యతనశీలుడగు సాధకుడు భగవానుని స్థూలరూపమును గురించి, సూక్ష్మమగు స్వరూపమును గురించి శ్రవణము చేసి, స్థూలరూపమునందు మనస్సును ఏకాగ్రము చేసి, మెల్లగా బుద్ధితో మనస్సును సూక్ష్మమగు స్వరూపము (ఆత్మ) లో విలీనము చేయవలెను, అని శుక మహర్షి చెప్పెను.

 ఓ పరీక్షిన్మహారాజా! భూమి, దానిలోని ద్వీపములు, ఖండములు, నదులు, పర్వతములు, ఆకాశము, సముద్రములు, పాతాళము, దిక్కులు, నరకములు, జ్యోతిర్మండలముల సమూహముల స్థితిని నేను నీకు వివరించి చెప్పితిని. సకలప్రాణులకు ఆశ్రయమైన ఈ జగత్తు ఈశ్వరుని అద్భు తమగు స్థూలరూపమే.